అడవి బిడ్డల ఆత్మి చిత్రం

ప్రతి రచయిత తన రచనలు వెలు వరించడానికి అనుభూతి లేదా ఆవేదన ఒక్కోసారి రెండు కావచ్చు అలా ఆవిర్భ వించిన రచనలకే పట్టుత్వం వుండి, పదికాలాల పాటు ప్రజల అక్షర హృదయాలలో నిలిచిపోతాయి. అలా కాక ఊహాత్మకత కోసమో. సానుభూతి కోసమో, సందర్భోచితమో అయిఉండి వ్రాసే రచనలకు బోలెడు బలహీనతలు ఉంటా యి.రచయిత డా.దిలావర్‌ ఉద్యోగ రీత్యా ఉపాధ్యాయుడు,ఉపన్యాసుడుగా…సుమారు పాతికేళ్లు అచ్చంగా అడవి బిడ్డల ఆవాసాల నడుమ జీవనం చేసిన అను భవం తాలూకు అనుభూతులతో రాయబడిరది ఈడజను కథల ‘కొండ కోనల్లో….’ కథా సంపుటి,దీనిలో ప్రతికథ ఓగిరిజన ప్రాంతం జీవన్మరణగోస, సమస్య చూస్తూ రాయకుండా ఉండలేనితనం రచ యితది.ఈ కథలు వెలువటానికి అది కూడా ఓకారణం!!.రచయిత డా:దినార్‌ విశ్రాంత తెలుగు ఉపన్యాసకుడైన రచయిత,భిన్నమైన ప్రక్రియలు చేపట్టినా కథా రచయితగా చేయి తిరిగిన వ్యక్తి, 2014 సంవత్సరంలో వెలువరించిన ఈ కొండ కోనల్లో…కథా సంపుటిలోని కథలన్నీ గిరిజనుల జీవితాలకు, సాంఘిక పరిస్థితులకు అద్దంపడ తాయి. కారడివిలో కాంతికిరణం,పాటకు మరణం లేదు, వేట,తునికాకు,చెట్లు కూలుతున్న దృశ్యం,అరణ్య రోదన,కొండ కోనల్లో… మొదలైన కథలన్నీ గిరిజన జాతుల బతుకు చిత్రాలను నింపుకున్నాయి.ఈ కథల్లోనే ప్రాంతాలు పాత్రలపేర్లు అన్ని ఇలా స్వీయ పర్యటనలు అనుకోవాలి అలాగే కథల్లో వాడిన జాతీయాలు,సామెతలు, ఉపమా నాలు, అన్నీ అందమైన అటవీ వాతావరణం అన్వయించి రాయడం ద్వారా రచయితలోని పరిణితి అనుభవం తేటతెల్లం కావడంతో పాటు, సుందర శైలి ఆసక్తికర అధ్యయ నానికి ఆయువుగా నిలుస్తాయి.అసౌకర్యాలకు నిలయమైన అడవుల్లోని అడవి బిడ్డల జీవితాల్లో అన్ని చక్కగానే అనిపిస్తాయి, ఆరోగ్య సమస్యలు రవాణా సదుపాయాలు లేమి తప్ప.!! వీటి వల్లే అన్ని కాలాల్లో కన్నా ‘వానాకాలం’లో అధిక సంఖ్యలో అడవి బిడ్డలు అనారోగ్యాల పాలై సకాలంలో సరైన వైద్యం అందక పిట్టల్లా రాలిపోతున్న ‘అనారోగ్య సమస్యలు’ అడవుల్లో అంతటా అగుపిస్తాయి.ఈ నేప థ్యంలో సాగిన కథ ‘‘కారడివిలో కాంతి కిరణం’’ వెంకటాపురం మండలంలోని ఒక గిరిజన గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి డాక్టర్‌గా వచ్చి న కిరణ్‌ అనే యువ వైద్య విద్యార్థి తన కార్యదీక్షతో అక్కడి గిరిజనుల ఆలోచనలో ఎలాంటి ధైర్యాన్ని, మార్పును, పెంపొందించ గలిగాడో తెలిపిన కథ ‘‘కారడివి లో కాంతి కిరణం’’, పిల్లలైనా, అడవి బిడ్డలైన,ఉపన్యా సాలు విని ప్రేరణ పొంది మారరు, కేవలం ఆచరణా త్మకమైన కార్యాల ద్వారానే మార్పుకు దారులు వేయవచ్చు అని చెబుతారు ఈ కథ ద్వారా రచయిత దిలావర్‌. కొత్తగా డాక్టర్‌ ఉద్యోగంలో చేరిన కిరణ్‌ గిరిజన గుడాలలో గిరిజనులు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు, ఆధునిక వైద్యం వైపు కాక పాత వైద్య విధానాలకు, పసరు వైద్యాలకు, వారు ఎందుకు మొగ్గు చూపుతున్నారు, చేతబడి, దేవర్ల పూనకాలను ఎందుకు నమ్ముతున్నారు? వంటి ప్రశ్నలకు సమాధానాలు ఈ కథలో దొరుకుతాయి. ‘‘గిరిజనుల వద్దకే సర్కారు వైద్యం’’ అన్న నినాదం నీరుగారడానికి గల కారణాల్లో శాఖ పరమైన అవినీతి, ఉద్యోగుల్లో అలసత్వం, ప్రధానంగా చూపిస్తారు. గిరిజన గుడేల్లో ప్రభుత్వాలు ఆనాడు చేపట్టిన మొక్కుబడి వైద్య విధానాల వల్లే గిరిజనులు తమనాటు వైద్యాల నుంచి బయటపడలేక పోతున్నారనే సత్యాన్ని కూడా ధైర్యంగా చెబుతారు ఇందులో. కిరణ్‌ తనదైన అంకిత భావంతో చేసిన పనులు ముఖ్యంగా గిరిజనగుడేనికి చెందిన సారమ్మ అనే గిరిజన గర్బిణి నిండు వానాకాలంలో ప్రాణాపాయ పరిస్థితిల్లో నుండి గూడెం యువకుల సాయంతో ఆమెను వాగు దాటించి సరైన సమయంలో భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి చేర్చడం అక్కడ తను పండంటి మగ బిడ్డకు జన్మనివ్వడం ఈ కథలోని సారం, ఆ గర్భి ణీని తనదైన ఆధునిక వైద్యం ద్వారా కిరణ్‌ ఎలా కాపాడాడో ప్రత్యక్షంగా చూసిన గిరిజనుల ఆలోచనల్లో మార్పు రావడమే ఈ కథకు ప్రాణప్రదమైన ముగింపు.కాయకష్టాలకు చిరునామాదారులైన గిరిజనులు సంఘటిత కార్మికులు కాదు, భరోసా లేని సాధారణ కూలీలే,!! వారి వారి పనుల్లో అటవీ ఉత్పత్తుల సేకరణ సమయాల్లో జరిగే ప్రమాదాలకు ఎందరో అమాయక గిరిజనులు ప్రాణాలు కోల్పోతున్న వైనం దానికి స్వార్థపరులైన కాంట్రాక్టర్లు, ప్రభుత్వ అధికారుల కారణం గురించి రచయిత ‘‘తునికాకు’’ కథలో చక్కగా చెబుతూ అందరిలో ఆలోచన కలిగించారు. గిరిజనులకు కన్నతల్లి తర్వాత తల్లి వంటి అడవిని సంరక్షించుకోవడం వారి ఆచార సంప్రదాయాల్లో అంతర్భాగంగా మొదటి నుంచి వస్తుంది, కానీ ఆధునిక సమాజంలో అడుగడుగునా మోసులెత్తుతున్న అవినీతి, స్వార్థం, సాయంగా అంతరించిపోతున్న అడవులు తద్వారా దెబ్బతింటున్న పర్యావరణ సమతుల్యం, గురించి ఓ గిరిజన యువకుడి ఆవేదన సాయంగా కళ్ళకు కట్టారు ‘‘చెట్లు కూలుతున్న దృశ్యం’’ లో కథా రచయిత. గిరిజన సంస్కృతి సాంప్రదాయాలపై పరిశోధన చేసిన ‘‘తేజ’’ అనే యువకుడు తన భార్య ఉష ఇతర మిత్రుల కుటుం బాలతో భద్రాచలం – పాపికొండల విహారయాత్రకు వెళ్లిన వైనం విహార యాత్ర సంబంధంగా భార్య ఉషకు జాతీయ,అంతర్జాతీయంగా గిరిజనుల చరిత వారి జీవన విధానం గురించి సహేతు కంగా చెబుతూ…కొమరం భీము నుంచి నేటి తరం గిరిజన పోరాట వీరుల దయాగుణం గురించి చెబుతూ.. పాపి కొండలు, పేరంటాలపల్లి, తదితర స్థల ప్రాసస్థ్యాల గురించి రచయిత ఈకథలో చక్కగా వివరించారు. అంతేకాక భద్రా చలం ఆలయానికి రామదాసుకు, తూము నరసింహదాసుకు, ఇచ్చిన ప్రాధాన్యత రామ కథకు కారణభూతురాలు అయిన గిరిజన మహిళ శబరికి ఎందుకు ఈయలేదనే ధర్మసందేహంతో పాటు అనేక పాత్రల స్వభావాలను పరామర్శిస్తూ వ్రాసిన చక్కని చరిత్రాత్మక విషయాల మేళవింపు గల కథ ‘‘కొండకోనల్లో…..’’ ఇంత చక్కని ప్రాముఖ్యత గల ఈ ‘‘మన్య సీమ’’ పోలవరం ముంపుతో అంతర్థానం అయిపోయినట్టు కలగన్న తేజ మానసిక స్థితి గురించి తన భావాలు జోడిరచి ఎంతో హృద్యంగా చెబుతారు రచయిత. ఇంచుమించు అదే భావనతో వ్రాసిన ఆ ‘‘ఏడు మండలాలు’’ కథ, పోలీసుల దాష్టి కాలకు అమాయకపు గిరిజ నులు బలవుతున్న వైనం తెలిపే ‘‘పాటకు మరణం లేదు’’ మృగ్యమవుతున్న అటవీ సంపద గురించిన ‘‘వేట’’ ‘‘బొందల గడ్డ’’ తదితర కథలు వేటికవే భిన్నంగా ఉండి గిరిజన సంస్కృతి,అందాల అడవిని, అంతే అందంగా అక్షరీకరించారు రచయిత డా: దిలావర్‌ . కథల్లో ఉపయోగించిన భాష, వ్యాకరణాం శాలు, సంస్కృతి,తదితర అంశాల ద్వారా రచయిత యొక్క పరిశీలన గుణం,సంస్కృతి శైలి వెల్లడవుతాయి. మనిషి శరీరంలోని నరాల్లా అడవి దేహం నిండా అల్లిబిల్లిగా అల్లుకున్న కాలిబాటలు, వాగు పలుపు విడిచిన లేగ దూడలుగా…. సుడులు,సుడులు,తిరిగి ప్రవహిస్తుంది, వాగులు వంకలు ఎండిపోయి అస్తిపంజ రాల్ల పడిఉన్నాయి, వంటి ఉదాహ రణలు మచ్చుకు కొన్ని మాత్రమే…!! ఇలా ప్రతి అంశాల్లో, విశేషాలు, కల్పనలు, వెరసి ఈ కథా సంపుటం నిండా అచ్చమైన అడవి వాతావరణం ఆవిష్కరించబడిరది. సందర్బో Ûచితమైన సంభాషణ శైలి రచయిత యొక్క విధివిధానాల గుండా ఈ కథలను అధ్యయనం చేయడం ద్వారా చక్కని వైజ్ఞానిక, సామాజిక, సమాచారం అందుకోవచ్చు.
పుస్తకం :- కొండుకోనల్లో..- (ఆదివాసి కథలు)
పేజీలు:152, ధర:-100/-
రచయిత: డా: డిలావర్‌,
సెల్‌:986692329.
సమీక్షకుడు : డా:అమ్మిన శ్రీనివాస రాజు 7729883223.

సమక్క సారలమ్మ పూర్వ చరిత్ర

ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరకు కారకులైన సమ్మక్క సారక్కలు గిరిజన వీర వనితలుగా పూజలు అందుకుంటున్న విషయం మనకు తెలిసిందే! కానీ వారి పుట్టుక జీవనం మనుగడకు సంబంధించిన చారిత్రక ఆధారాలు శూన్యం. కేవలం పుక్కిట పురాణంలా, జానపదుల శైలిలో మౌఖిక సాహిత్యమై గిరిజనుల శాసనాలుగా చెప్పబడే ‘‘పడిగె కథలు’’ ద్వారా మాత్రమే మనకు సమ్మక్క సారక్కల సమాచారం అరకొరగా లభ్యం అవుతుంది. ఇలాంటి సందీప్తి సమయంలో మేడారం గ్రామంకు సమీపానగల కామారం గిరిజన గ్రామానికి చెందిన గిరిజన యువకుడు పరిశోధక విద్యార్థి బీరసం ఉండాల యూత్‌ నిర్వాకుడు తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు నిత్యసంచారి అయినా మైపతి అరుణ్‌ కుమార్‌ రాసిన ‘‘సమ్మక్క సారలమ్మ పూర్వ చరిత్ర’’ పుస్తకం, అరుణ్‌ తనదైన పరిశోధకుశ శైలిలో తన క్షేత్ర పర్యటల ద్వారా స్థానిక పెద్దల ద్వారా తెలుసుకున్న విలువైన చారిత్రక సమాచారాల సమ్మేళనంగా దీన్ని వ్రాశాడు.ఈ క్షేత్ర పర్యటనల సమాహారం గతంలో గల సమ్మక్క చరిత్రకు నూతనత్వం ఆపాదిస్తుంది, ఇక ఈ పూర్వ చరిత్ర విశేషాల్లోకివెళితే……!! ఇప్పటివరకు మనకు తెలిసిన సమ్మక్క సారక్క కథకు పూర్తి భిన్నంగా వాస్తవానికి కాస్త చేరువులో చెప్పబడిరది ఈ పూర్వ చరిత్ర, పరిశోధకరచయిత మైపతి అరుణ్‌ కుమార్‌ ఈ చరిత్ర వివరణ కోసం కేవలం ‘‘పడిగలు’’ మీదే ఆధారపడకుండా దానికి ఆధారంగా స్థానికులచే చెప్పబడే వ్యక్తులు, నివసించే ప్రాంతాలకు, వెళ్లి అక్కడి వారి అనుభవాలు సేకరించి ఈ కథనానికి మరింత ప్రామాణికత చేకూర్చారు. ప్రస్తుతం చత్తీస్‌ ఘడ్‌ రాష్ట్ర పరిధిలో గల బీజాపూర్‌ జిల్లాలోని అత్యంత దట్టమైన అడవిలో గల కాన్కనార్‌ గిరిజన గ్రామం వెళ్లి అక్కడి గ్రామస్తులను, పూజారులను సంప్రదించి సమ్మక్క వంశ పూర్వ చరిత్రను తెలుసుకు న్నారు మైపతి అరుణ్‌ పరిశోధక బృందం. ఈ క్రమంలో గోండ్వాన రాజ్య విస్తరణలో గిరిజనుల పాత్ర చెబుతూ సింధు నాగరి కతకు పూర్వమే గోండ్వానా రాజ్య నాగరికత వెళ్లి విరిసిందని పడగలపై గల అనేక ఆధారాలతో నిరూపించే ప్రయత్నం చేశారు అరుణ్‌. ‘‘సమ్మక్క’’ కోయత్తూర్‌ సమాజంలో ఐదవ గట్టుకు చెందిన ‘‘రాయి బండాని రాజు ‘‘ వంశానికి చెందిన ఆడబిడ్డగా ‘‘బాండానిరాజు’’ పడిగలోని చిత్రలిపి విశ్లేషణ ద్వారా వివరించారు, ‘‘రాయి బండాన్నిరాజు’’కు చందంబోయి రాలు, కనకంబోయి రాలు,అని ఇద్దరు భార్యలు. గోండ్వాన రాజ్యపు రాజైన ‘‘బేరంబోయిన రాజు’’కు ఏడుగురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు, ఆఇద్దరు కూతుళ్లే చందం బోయిరాలు,కనకం బోయిరాలు,వీరు ఇద్దరు ఇష్టపడి రాయి బండాన్ని రాజును పెళ్ళాడ తారు,కానీ పెద్ద భార్యకు సంతానం కలగలేదు శివపార్వతులను పూజించగా వారి వరప్ర సాదంగా అడవిలో మాఘ పౌర్ణమి రోజున బండాని రాజుకు అతని పెద్ద భార్య చందం బోయిరాలకు కంక వనములో ఒక పసిపాప కనిపిస్తుంది అది శివపార్వతుల ప్రసాదంగా భావించి ఇంటికి తీసుకువస్తారు ఆ పాపే సమ్మక్క. అంతకుముందే గర్భవతి అయిన చిన్న భార్య కనకం బోయిన రాలు, రెండు రోజుల తర్వాత ఆడపిల్లను ప్రసవిస్తుంది ఆమెకు నాగులమ్మ అనే పేరు పెట్టుకుంటారు. ఐదవ గట్టుకు చెందిన ‘‘బండాని’’ వంశములో తొలిచూరు ఆడబిడ్డ సమ్మక్క, కోయ సాంప్రదాయం ప్రకారం మొదటి ఆడబిడ్డను వేల్పుగా కొలుస్తారు అందుకే సమ్మక్క ఇలవేల్పుగా దేవర అయింది. సమ్మక్క- నాగులమ్మలు పెరిగి పెద్దయ్యాక అదే గోండ్వాన రాజ్యంలో గల బీజాపూర్‌ దగ్గరి కొత్తపల్లి గ్రామానికి చెందిన నాలుగవ గట్టువాడైన ‘‘పగిడిద్ద రాజు’’కు పెద్ద కూతురైన సమ్మక్క నిచ్చి పెళ్లి నిశ్చయించుకుంటాడు రాయిబండని రాజు, తన ఇద్దరు భార్యలు, చిన్న కూతురు నాగులమ్మతో కలిసి అతడిని చూసి వచ్చి నిర్ణయం చెప్తాడు సమ్మక్కకు. కానీ చెల్లెలు మాయమాటలు నమ్మి పగిడిద్ద రాజు వికార రూపం కలవాడు అనుకోని ఆ పెళ్ళికి ఇష్టపడదు సమ్మక్క. ఆడిన మాట తప్పకుండా అన్న ముహూర్తానికి తన చిన్న కూతురు నాగులమ్మ తో పైడిద్దరాజు పెళ్లి నిశ్చయించి మాఘ పౌర్ణమి ముందే తన కుటుంబం చుట్టాలతో కలిసి వెళ్లి..నాటి మధ్యప్రదేశ్‌ లోని కొత్తపల్లి గ్రామ సమీపాన గల ‘‘పాలెం’’ గ్రామంలో మండపం కట్టించి పెళ్లికి ఏర్పాటు చేసుకుంటాడు బండాని రాజు, అక్కడి చెరువును ‘‘కాముని చెరువు’’ అంటారు ఇవి ఇప్పటికీ ఉన్నాయి.తీరా పెళ్లి సమయంలో సమ్మక్క అందగాడైన పైగిడిద్ద రాజును చూసి తన చెల్లెలు నాగులమ్మ చేసిన మోసానికి ఆగ్రహించి పెళ్లి మండపంలోనే చెల్లిపై దాడి చేసింది, ఆ పెనుగులాటలో సమ్మక్క చేతికడెం పగిడిద్దరాజు కంటికి తగిలి కన్ను కోల్పోయాడు, ఇక చేసేదేమీ లేక తను అక్కా చెల్లెలు ఇద్దరిని అదే మండపంలో పెళ్లాడుతాడు. కానీ చివరికి చెల్లెలు పోరు పడలేక తన పుట్టింటికి వచ్చేసింది చంద్రవంశీయుల సమ్మక్క.తల వారితో ఉండి పోయి ఆ ఇంటి ఇలవేల్పుగా మిగిలిపోయింది, అలా చందా వంశీయులు అనేక తరాలుగా సమ్మక్క ను అనంతరం ఆమె వస్తువులను, పూజించుకుంటూ వారి వారి జీవితాలు సాగించుకుంటున్న క్రమంలో ప్రకృతి వైపరీత్యాలు కరువు కాటకాలతో చందా వంశీలు కుటుంబాలుగా విడిపోయి దూర ప్రాంతాలకు, బ్రతుకు తెరువు కోసం వలస పోయారు. అలా వలస వచ్చిన వారిలో ఒక చందా కుటుంబం వారు పడమరదేశంలోని అడవిలో బాయక్క అనే ఆమె పేరుతో ఒక గూడెం నిర్మించుకొని ‘‘బయ్యక్కపేట’’అని పేరు పెట్టుకున్నారు, ఆ గ్రామం ప్రస్తుతం మేడారం సమీపంలో ఉంది. బయ్యక్కపేట చందా వంశీలే మొదట రెండేళ్ళ కోసారి మాఘ పున్నమికి ‘‘సమ్మక్క జాతర’’ చేసేవారు, కానీ కాలక్రమంలో కరువు కాటకాలలో డబ్బులు లేక పక్క గూడెం అయిన మేడారం గిరిజను లకు జాతర బాధ్యతలు అప్పగించారు, అలా మేడారంకు సమ్మక్క జాతర ప్రవేశించింది. అంటూ చిత్రలిపి ఆధారంగా సమ్మక్క సారలమ్మ పూర్వ చరిత్ర పుస్తక రూపం చేశారు మైపతి అరుణ్‌ కుమార్‌. ఈ చరిత్రకు అంతర్గతంగా గోండ్వానా రాజ్య ఆనవాళ్ళ గురించి ప్రాంతాలవారీగా ఆధారాలు చూపుతూ సింధు నాగరికతకు పూర్వమే ఆదివాసుల ‘‘గోండ్వానా నాగరికత’’ ఉన్నదనే విషయం చరిత్రకారులు విస్మరించారని ఆదివాసులపై ఆర్యులు చేసిన అణిచివేతకు ఇదొక ఉదాహరణ అంటారు అరుణ్‌ కుమార్‌. అంతేకాక ఈ పరిశీలన గ్రంథంలో కాకతీయ రాజ్యం కూడా గోండులదే అన్న తన వాదాన్ని వినిపిస్తారు. ఆనాడు గూండాను చరిత్రను భూస్థాపితం చేసినట్టే ఇప్పుడు మేడారం చరిత్రను సమ్మక్క సారక్కల చరిత్రను తప్పుదారి పట్టించి హిందూ తత్వాన్ని ఆపాదించి అసలైన గిరిజన సంస్కృతిని మటుమాయం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటూ తన ఆవేదన వ్యక్తపరిచాడు అరుణ్‌ ఈ పుస్తకంలో. దీని ద్వారా పరిశోధకులు ముందుకు వచ్చి సందిగ్ధ భరితమైన ఈచరిత్రను సరి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది,గిరిజన పరిశోధకులు, చరిత్ర ప్రేమికుల తో పాటు అందరూ తప్పక చదవాల్సిన పుస్తకం ఇది.
పుస్తకం : సమ్మక్క సారమ్మ పూర్వ చరిత్ర, పేజీలు : 174, వెల : 300/- రూ, రచన : మైపతి అరుణ్‌ కుమార్‌, సెల్‌ : 9441966756. సమీక్ష : డా:అమ్మిన శ్రీనివాసరాజు, సెల్‌ : 7729883223.

గిరిజన ఉద్యమాల దర్పణం

ఆదివాసీలు అంటే అడవుల్లో నివశించే శారీరకశక్తి వనరులు మాత్రమేకాదు. కృషి,త్యాగం,బలిదానం,మొదలైన పరోపకార బుద్ధి నిలయాలు, కూడా అని నేటి ఆధునిక నగరవాసులు గుర్తించాలి, అన్న లక్ష్యంతో పనిచేస్తున్న సంస్థ ‘‘వనవాసి కళ్యాణ పరిషత్‌’’ భారత స్వాతంత్య్ర అమృతోత్సవాల సందర్భంగా ఆదివాసీ స్వాతంత్ర సమర యోధులు,సంస్కర్తలు,గురించి ప్రామాణిక సమాచారం అందించాలనే సత్సంకల్పంతో వెలువరించిన అపూర్వ పుస్తకం ‘తెలంగాణ – గిరిజన స్వాతంత్ర సమరయోధులు సంస్కర్తలు.’ దీని రచయిత డా:ద్యావనపల్లి సత్యనారాయణ, నిత్యం గిరిజన ఆవాసాల పర్యటనలు, అందుబాటులోని అన్ని భాషల గిరిజన సాహిత్యాలను ఆధ్యయనం చేసిన అనుభవం సారంతో,‘కొండ అద్దం ముందు కొంచమైనట్టు’ అన్న చందంగా ఈచిరు పుస్తకాన్ని పాఠక లోకానికి అందించారు రచయిత. ఈ పుస్తకం పరిధి కేవలం తెలంగాణ భౌగోళిక ప్రాంతానికి పరిమితమైన, ఎంతో ప్రేరణాత్మకంగా ఉంది. రచయిత తన ముందుమాటలో పేర్కొన్నట్టు ఈ చిరు సమాచారం ప్రామాణికంగా భావి తరాల విజ్ఞులకు,పరిశోధకులకు,ఎంతో ఉప యోగంగా ఉంటుంది.ఈ పుస్తకాన్ని ‘స్వాతంత్ర సమరయోధులు`సంస్కర్తలు’ అని రెండు భాగా లుగా విభజించి వ్రాశారు,అనుబంధంగా బీర్సా ముండా పోరాటం వివరణ ఇచ్చారు.ఈ విభ జన లోనే రచయిత పరిశో ధనా దృష్టి,పటిమ, కనిపిస్తున్నాయి. స్వాతం త్ర సమరయోధులు విభాగంలో రాంజీ గోండ్‌,కొమరం భీమ్‌,రౌంట కొండల్‌, కొమరం సూరు,వెడ్మ రాములను పేర్కొ న్నారు.సంస్కర్తలుగా సమ్మక్క, సేవాలాల్‌, పులాజిబాబా,హైమండార్ప్‌, ఎస్సార్‌ శంకరన్‌లను చెప్పడంలోనే రచయిత పారదర్శకత సుస్పష్ట మవుతుంది. ఇకవ్యాసాల తీరును పరిశీలిస్తే అనేక ప్రామాణిక విషయాలు అర్థమవుతాయి. తెలంగాణ గిరిజన పోరాట యోధులు అనగానే అందరికీ గుర్తుకొచ్చే పేరు ‘కొమ రంభీమ్‌,’కానీ అతనిలోని శక్తి సామర్థ్యాలు గుర్తించి ప్రోత్స హించి అతడిని అంతటి నాయకుడిని చేసింది అతని అనుచరుడు మొదటి నుంచి చివరి వరకు అతనితో కలిసి నడిచిన వాడు ‘రౌట్‌ కొండ’అని చాలా మందికి తెలియని సత్యం. ఉద్యమానికి నాయకుడు ఎంత అవసరమో! నాయకునికి అనుచరులు అంతే అవసరం !! అన్న నిండు నిజాన్ని రచయిత డా:సత్యనారాయణ ఎంతోచక్కగా విశ్లేషించి వివరిస్తూ నేటి తరానికి తెలియని నాటి గిరిజన సమర యోధుడు ‘‘రౌట కొండను’’ పరిచయం చేశారు. అదేవిధంగా కొమరం భీమ్‌ పోరాటంలో వార్త హరుడుగా సహకరించిన మరో యోధుడు కుమరం సూరు. జీవిత విశేషాలు, గెలిచిన పోరాటంలో అతని పాత్ర గురించిన వివరణ కూడా కూలంకషంగా వివరించారు మరో వ్యాసంలో.‘జోడే ఘాట్‌’పోరాటంలో విరోచిత పోరాటం చేసి అమరుడై అందరికీ తెలిసిన ‘‘భీమ్‌’’ పోరాటంలో సంపూర్ణ సహకారం అందిం చినవారు అనేకమంది ఉన్న అందులో అతనికి కుడి భుజంగా ‘‘కుమ్రం సూరు’’ తుడుం దెబ్బ మోగిస్తే, ఆయనకు ఎడమ భుజంగా ఉన్న ‘‘వెడ్వ రాము’’ తూత కొమ్ము ఊది చుట్టు పక్కల12గ్రామాల గిరిజనులను యుద్ధానికి సిద్ధం చేసేవాడు, అతని పరిచయం కూడా వ్యాస రచయిత ఇందులో పొందు పరిచారు. అలా ఆదిలాబాద్‌ కేంద్రంగా సాగిన ఆదివాసీ పోరాటం ద్వారా గిరిజనుల త్యాగం,వీరోచి తత్వాన్ని, ప్రపంచానికి చాటిన జోడేఘాట్‌ పోరాటయోధుడు,కొమరంభీమ్‌ కు సాయపడిన వ్యక్తుల సంక్షిప్త జీవిత చరిత్రల వ్యాసాలు ఇందులో పొందుపరచడం ద్వారా వ్యాస రచయిత సత్యనారాయణ గారి నిశిత పరిశీలన, పరిశోధనా పఠిమ,ప్రతిపాటకుడికి ఆవగతం అవుతాయి. ఇక ప్రధాన యోధుడు భీమ్‌కు సంబంధించిన ప్రథమ వ్యాసంలో జల్‌,జంగల్‌,జమీన్‌ల సాధనలో గిరిజనుల ఐకమత్య పోరాటం,నాయకుడు చేసిన కృషి, ఐక్యత యొక్క విలువ,చాటమే కాక వందల సంవత్సరాల క్రితం గిరిజనుల స్థితిగతులను కళ్ళకు కడుతుంది. భీమ్‌ వ్యాసంలో రచయిత వ్రాసిన ప్రతి వాక్యంలో ప్రామాణికత కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రధాన ఘట్టాలకు సంబంధించిన విషయాలు అలాంటి సంఘ టనలు ప్రత్యక్షంగా చూసిన వారి అనుభవాలు, ప్రభుత్వం చూపిన అధికారులు లెక్కలు, అప్పటి పత్రికలో వచ్చిన వార్తలు సాయంగా రాయడం వల్ల సంపూర్ణ ప్రామాణికత కనిపిస్తుంది. జోడెన్‌ ఘాట్‌ గిరిజన పోరాటంలో అమరులైన వారి సంఖ్యలోగల సందిగ్ధత కూడా రచయిత సహేతుకంగా వివరించారు, అలాగే కుమ్రం భీమ్‌ మరణించిన రోజులోని వివాదం కూడా వివరించే ప్రయత్నం చేశారు,ఇక భీమ్‌కు ఆదర్శనీయుడు,భారత ప్రధమ గిరిజన స్వాతం త్య్ర సమరయోధుడు రాంజీ గోండు వీరోచిత త్వాన్ని వివరించిన తొలి వ్యాసంతో మొదలై, వెడ్మ రాముతో మొదటివిభాగ మైన సమరయో ధులు ముగుస్తుంది. ఇక రెండవ భాగంను గిరిజన సంస్కర్తలుగా పేర్కొని, ఇందులో మా’’నవ’’దేవతలు సమ్మక్క- సారక్కలు, సేవాలాల్‌,పులాజీ బాబా,హైమన్‌ డార్ప్‌, ఎస్‌.ఆర్‌,శంకరన్‌ల సేవా సంస్కరణలు వివరిం చారు.సమ్మక్క వంశ చరిత్ర, చారిత్రక విషయా లతో,పాటు సమ్మక్క వీరోచిత పోరాటం తది తర విషయాలతో, సమ్మక్కను చారిత్రక సంస్కర్త గా చిత్రిస్తు నాటి గాధలకు సాక్ష్యంగా నిలిచే నేటి గ్రామాలను ఆధారంగా చూపిస్తూ ఈ వ్యా సం కొనసాగించారు. లంబాడి సామాజిక వర్గ గిరిజనులు ఆరాధ్య దైవంగా పూజించే ‘సేవ లాల్‌’ జన్మించింది అనంతపురం వద్ద గల గుత్తి,సమీప గ్రామం గొల్లలదొడ్డి,అయినా అతని సేవా తత్పరత ఎక్కువగా సాగింది తెలంగాణ ప్రాంతంలోనే, కనుక అతడిని తెలంగాణ గిరిజన జాతి సంస్కర్త గానే రచయిత పేర్కొన డం అతని సహృదయతకు చిహ్నం. విగ్రహారా ధన, జంతు బలి, మూఢనమ్మకాలకు, వ్యతిరేకి అయిన సేవాలాల్‌ లంబాడాలకు ఎలా ఆరాధనీ యుడు అయ్యాడో ఈ వ్యాసం వివరణఇచ్చింది. పూర్తి మాంసాహారులైన గిరిజనుల్లో శాఖాహార తత్వాన్ని అలవర్చిన గొప్ప శాఖాహార సంస్కర్త ‘‘పులాజి బాబా’’ అతని తపస్సు, ధ్యానం, వివ రాలు వెల్లడిరచడంతోపాటు అతడు గిరిజ నులను తన బోధనల ద్వారా తీర్చిదిద్దిన తీరు ఇందులో గమనించవచ్చు. ఇక గిరిజనుల జీవితాలకి వెలుగులు అద్ది వారి జీవితాలు విద్యా ఉద్యోగాలకు ఆర్థిక ఎదుగు దలకు సంక్షేమానికి ప్రణాళికలు సిద్ధం చేయడమే కాక ,అమలుకు కృషి చేసిన ఆదివాసులు ఆత్మబం ధువు ‘‘హైమన్‌ డార్ప్‌’’ కృషి గురించిన వ్యాసం. గిరిజన వికాసానికి పాటుపడే వారందరికీ ఉపయుక్తం.అడవి బిడ్డల సంక్షేమానికి పర్యాయ పదంగా నిలిచే మరో ఐ.ఏ.ఎస్‌ అధికారి ఎస్‌.ఆర్‌. శంకర్‌,కృషిని వివరించే వ్యాసం కూడా ఇందులో చదవవచ్చు. అనుబంధంగా ‘‘బిర్సా ముండా’’ పోరాటం గురించిన వ్యాసం లో అతని జీవితం,కృషి,సూక్ష్మంలో మోక్షంగా సరళంగా, సూటిగా,వివరించబడిరది, కేవలం వ్యాసాలే గాక ఆయా యోధుల, సంస్కర్తల, ఫోటోలు కూడా ఈ పుస్తకానికి అదనపు ఆకర్షణగా నిలిచాయి, తెలంగాణ ప్రాంత గిరిజన సమరయోధులు, సంస్కర్తలపై భావి తరంలో జరగాల్సిన సంపూర్ణ పరిశోధనలకు ఈచిరు పుస్తకం చక్కని దారి దీపం కాగలదు. – డా. అమ్మిన శ్రీనివాసరాజు (సెల్‌ : 7729883223)

చేయవలసినదింకెంతో..

ఒక వ్యక్తిని మరో వ్యక్తి కాదు, యావత్‌ సమాజమే అతను ఉన్నప్పుడు లేనప్పుడు ఒకే విధంగా గౌరవించి గుర్తుంచుకొని తన మనసుల్లో నింపు కుంది అంటే అది సామాన్య విషయం కాదు. ఆ వ్యక్తి కూడా అసమాన్యుడే అయి ఉంటాడు. ఆ అసమాన్య వ్యక్తి మరి ఎవరో కాదు మానవ శాస్త్రవేత్తగా ఆంగ్లేయ ప్రభుత్వం ద్వారా పంపబడిన నైజాం సర్కార్‌ ఉద్యోగి ‘హైమన్‌ డార్ప్‌’.కేవలం ఉద్యోగి గా గిరిజన ప్రాంతాలు సందర్శించి మొక్కుబడి కృషిచేసి తాత్కాలిక రిపోర్టులు అందించి ఉంటే అతను అనేకమంది సర్కారు ఉద్యోగుల్లో ఒకడిగా మిగిలిపోయి ఉండేవాడు. కానీ ఈ ‘మానవ శాస్త్ర ప్రొఫెసర్‌’ ఆదిలా బాద్‌ గోండు గిరిజనుల సమీకృత అభ్యున్నతి కోసం బలమైన పునాదులు వేయడమే కాక వారి సమగ్ర అభివృద్ధి కోసం అనేక భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేసిన క్రాంతదర్శి వారికోసం ఆయన జీవితమే త్యాగం చేసి వారితో కలిసి వారిలో ఒకడిగా జీవించి, ఆదిలాబాద్‌ అడవి బిడ్డల ఆత్మ బంధువుగా నిలిచిపోయాడు. ఒకసామాన్య ఉద్యోగి ఆదివాసులకు అంత ఆప్తుడుగా ఎలా మారి పోయాడు? అతడు చేసిన కృషి వెనుక గల అంతరార్థం ఏమిటి? తెలుసుకోవాలి అంటే ఆయన చేసిన క్షేత్రస్థాయి అధ్యయనం, రూపొందించిన పథకాలు, తదితర విషయాల గురించి కూలంకషంగా అర్థం చేసుకోవాలి. ఆదిలాబాద్‌ ఆదివాసుల జీవితాలను గొప్ప మలుపు తిప్పిన మొత్తం కథనాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించే రెండు చారిత్రక నివేదికల చిరు పుస్తకమే ‘చేయ్యవలసిన దింకెంతో…’ వ్యాస సంపుటి, సంపూర్ణ ఆంగ్ల భాషలో వ్రాయబడ్డ, తెలుగు ఆంగ్ల భాషల్లో సమర్ధులైన ‘‘సుమనస్పతి రెడ్డి’’ సంపాదకత్వంలో అనువాదకురాలు ల.లి.త సరళమైన తెలుగులోఅను వదించారు. 1944,1946 సంవత్సరాల్లో ‘హైమన్‌ డార్ప్‌‘ ఆదిలాబాద్‌ గోండుల జీవన సరళి గురించి నాటి నైజాం సర్కారుకు, రాసి ఇచ్చిన రెండు చారిత్రిక నివేదికల సంక్షిప్త రూపం మనం ఇందులో చదవవచ్చు. ‘మర్లవాయి’ గోండు గ్రామం కేంద్రంగా ‘డార్ప్‌’చేసిన ఈ క్షేత్రస్థాయి కృషి గురించి, అతని శాస్త్రీయమైన ప్రణాళికల గురించి నేటితరం అధికారులు తెలుసుకొని ఆచరణాత్మకంగా కృషి చేసిననాడు యావత్‌ వెనుక బాటు సమాజ శాఖలన్ని అభివృద్ధి పథంలో మును ముందుకు దూసుకుపోగలవు అనే లక్ష్యంతో సంపాదకులు,అనువాద రచయిత్రి,ఈఅక్షర యజ్ఞానికి పూనుకున్నారు అనిపిస్తుంది. యావత్‌ సమాజానికి అభివృద్ధి కారకం ‘విద్య’ ఒక్కటే అనే విషయం ప్రతి ఒక్కరు గమనించాలి,విద్య ఎంతగా అభివృద్ధి చెందుతుందో ఆ సమాజం కూడా అంతే ఘనంగా అభివృద్ధి సాధించి తీరుతుంది, అంటే అభివృద్ధి అనే బండికి విద్య అనే చక్రాలు అవసరం ఏమిటో అవి ఎంత పటిష్టంగా ఉండా లో వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ చిరు పుస్తకంలో 1944సం: నివేదికలో హైదరాబాద్‌ సంస్థానంలో ఆదివాసుల విద్య గురించి, 1946 సం: నివేదికలో ఆదిలాబాద్‌ జిల్లా మూలవాసుల పున రావాసం సాధించిన ప్రగతి సమస్యలు, గురించి వివరణ చదవ వచ్చును.1941లో గోండు సామాజిక వర్గంలో 6,78,149 మందిలో కేవలం 4,486మంది మాత్రమే అక్షరాస్యులు,అంటే 1000కి ఆరుగురే అక్షరాస్యులు, లంబా డాల్లో తప్ప కోయ జాతి వారిలో ఈ అక్షరాస్యత మరీ తక్కువ అని ‘‘డార్ప్‌’’ నివేదికలో వెల్లడి చేశారు.అలాంటి అల్పస్థాయి నుంచి వారి సంస్కృతి సాయంగానే గోండుల అక్షరాస్యత పెంచవచ్చని,అలాగే వారి అక్షరాస్యత తొలి అడుగులు గోండి భాషలో పడాలని, అక్షరాలు నేర్పే వారు సైతం గోండులై ఉండాలని ఆయన పేర్కొన్నారు.కానీ ఈ రెండు పరిస్థితులు సాధించటం నాడు కష్టతరంగా ఉంది హైదరాబాద్‌ సంస్థానంలో మాట్లాడే గోండు భాషకు లిపి లేదు రాయడం వీలు కాదు, అలాగే చదువుకున్న కొద్దిమందిలో నేర్పే శక్తి గల వారు ఎవరూ లేరు. కేవలం మౌఖిక సాహిత్య రూపంలో గల అమూల్యమైన గోండు సాహిత్యం అంతా తన క్షేత్ర పర్యటన ద్వారా సేకరించి భద్రపరిచి దానిని ఉపయోగించినట్టు ‘డార్ప్‌’ పేర్కొన్నారు.చివరికి లిపిలేని గోండు భాషకు ఏలిపిని అందించాలి అని తర్జనభర్జనల పిదప గోండుభాష ద్రావిడ భాష కనుక దీనికి చెందిన తెలుగు లిపిని అన్వయం చేయాలని కొందరుఅన్నా, నాటి అధికారభాషలుగా గల ఉర్దూ, మరాఠా భాషలు ప్రజల నోళ్ళల్లో అధికంగా ఉన్నా యి కనుక ప్రజలకు త్వరగా అర్థం అయ్యే ఉర్దూ, మరాఠా, భాష లిపుల్లో వ్రాయాలని తద్వారా విద్య త్వరగా అందుతుందని డార్ప్‌ అభిప్రాయపడ్డారు.ఈ మొదటి నివేదికలో కేవలం గోండుల సామాజిక పరిస్థితులు, అక్షరాస్యత, వెనుకబడటానికి కారణాలు చెప్పి ఊరుకోకుండా అభివృద్ధికి కావలసిన సలహాలు, సూచనలు, కూడా ఇవ్వడం వల్ల ఈ నివేదిక విలువ మరింతగా పెరిగింది.డార్ప్‌ స్థానిక గోల్డ్‌ యువకుల సాయంతో ఎలాంటి శిక్షణలు ఇచ్చారు, ఎటువంటి పుస్తకాలు ప్రచురించారు. ఈ తొలి నివేదికలో కూలంకషంగా వివరించారు.1945సం:లో రెండు నెలల పాటు ఆదిలాబాద్‌ ప్రాంతంలో పర్యటించిన హైమన్‌ డార్ప్‌ ఆదిలాబాద్‌ ఆదివాసులు సాధించిన ప్రగతి, సమస్యలు, గురించి ఏకరువు పెట్టారు.దాని రెండవ నివేదికగా అందించారు. గోండులు చదువుకోవడం వల్ల వారిలో ఆత్మస్థైర్యం పెరగడంతోపాటు, సామాజిక అంశాలు, రాజ్యాంగం, హక్కులు,గురించిన అవగాహన కలుగుతుంది.కేవలం చదువుతూనే గిరిజన జాతి అభివృద్ధి సాధించగలదని డార్ప్‌ తన రెండవ నివేదిక ద్వారా వివరించారు.అటవీ విధానం, అటవీ ఉత్పత్తులు, గ్రామ పున: నిర్మాణం, కవులు దారు చట్టం, గిరిజన ప్రాంతాల పరిపాలన సమస్యలు, గురించి కూడా ఈ నివేదికలో పేర్కొన్నారు.ఇలా ముందుచూపుతో తయారు చేయించిన నివేదికలు ప్రణాళికల ద్వారా అనంతర కాలంలో గిరిజనులు అభివృద్ధి సాధించారు అనడంలో ఆశ్చర్య పడాల్సిన పనిలేదు.ఈ సరళమైన నివేదికలలో కేవలం గణాంకాలు మాత్రమే కాదు, అపురూపమైన అలనాటి పాత చిత్రాలు కూడా ఇందులో పొందు పరచడం అదనపు ఆకర్షణ. గిరిజనుల అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేసే వారు మాత్రమే కాక, మూలవాసుల్లోని అభివృద్ధి కారకం తదితర విషయాల గురించి అవగాహన పెంచుకోవలసిన వారు సైతం విధిగా ఈ ‘‘నివేదికల పుస్తకం’’ చదవాల్సిన అవసరం ఎంతో కనిపిస్తుంది.
పుస్తకం పేరు :- ‘చెయ్య వలసిన దింకెంతో..’ సంపాదకులు :- అర్‌. సుమనస్పతి రెడ్డి. పుటలు:64, వెల:70/-, ప్రతులకు:- 9676180802- డా. అమ్మిన శ్రీనివాసరాజు (సెల్‌ : 7729883223)

జానపద దర్శనంలో గిరిజన సాహిత్య జాడలు

గిరులు అనబడే కొండకోనల్లో ఉండే గిరిజ నులకు,జనపదాలు అనబడే పల్లెల్లో నివ సించే జానపదలకు, అవినా భావ సంబం ధం ఉన్నట్టే , ఇరువురి సాహిత్యం కూడా ఒకప్పుడు మౌఖిక సాహిత్యమే..!!,భాషల్లో వచ్చినఅభివృద్ధి మార్పు లు దృష్ట్యా, ప్రస్తుతం రెండిటికీ లిఖిత సాహిత్యం వచ్చి అనేక పరిశోధనలు,గ్రంథాలు, వెలు వడ్డాయి.. వెలువడుతున్నాయి. తద్వారా అయా సాహిత్యాలలోని అనేక అంశాలు వెలుగు చూస్తున్నాయి అందులో భాగంగానే,రచయిత్రి ‘‘చామర్తి అరుణ’’ వ్రాసిన చక్కని పరిశోధక పూర్వ రచన ‘‘జానపద దర్శనం’’వ్యాస సంపుటి. ఇందులోని మొత్తం 24వ్యాసాల్లో అధిక శాతం, గిరిజన జాతులకు చెందిన సంస్కృతి సాంప్రదాయాలు ఆసక్తికరంగా తెలియజేసే వ్యాసాలే,!!
అడవి బిడ్డల సంస్కృతి అంటేనే విభిన్నమైన,విశిష్టమైన, మేలికలయికల సంగమం,రచయిత్రి అరుణ కూడా చక్కని పరిశీలన,ఎంచక్కని సృజనా త్మకత,జోడిరచి వ్యాసాలకు నిండుదనం చేకూర్చారు. నల్లమల అడవులకే తల మానికంగా ఉంటూ అత్యంత ప్రాచీన ఆధ్యాత్మిక చారిత్రక నేపథ్యాలు గల చెంచు జాతి గిరిజనులకు సంబంధించిన విశేషాలతో పాటు బాల్యవివాహాలు నిషేధించుకున్న గిరిజన తెగ ఒరాన్లు, ఏకపత్నితత్వం గల భిల్లులు, నిజమైన మాతృస్వామ్య వ్యవస్థకు కారకులైన ఖాశీలు,వారు అభివృద్ధికి చేస్తున్న ఆరోగ్య పర్యాటకం,చాలా అరుదైన గిరిజన తెగైన బిరహరు,గురించి కూడా రచయిత్రి ‘‘అరుణ’’ పరిశీలించడం ఆమెలోని అత్యుత్తమ పరిశీలన పరిశోధన కృషికి నిదర్శనం. కేవలం సంస్కృతి సాంప్రదాయాలకు పరిరక్షకులుగానే కాక, జాతిని జాగృతం చేసే పోరాట పటిమకు చిరునామా దారులుగా కూడా గిరిజనులను ఇందులో అభివర్ణించారు. ‘‘సంతాల్‌’’ గిరిజనుల గురించి ఇందులో వివరిస్తూ ఛోటానాగపూర్‌ వారి మాతృ స్థానంగా, స్థిరమైన గ్రామ జీవనం గల జాతిగా చెబుతారు,వారిలోని ఏకపత్ని త్వాన్ని కూడా అభివర్ణించారు,వారు 12 పద్ధతుల్లో తమ తమ జీవిత భాగస్వాములను ఎంచుకుంటారనే సంగతి కూడా చెబుతారు. గ్రామపెద్ద నాయకత్వంలో వారసత్వంగా వీరి రాజకీయ వ్యవస్థ, పాలన సాగుతుంది. ఒకనాటి సంచార జాతి అయిన సంతాల్‌లు నేడు వ్యవసాయం సాయంగా చేస్తున్న స్థిర నివాసపు అభివృద్ధి గురించి ఇందులో పేర్కొన్నారు. గిరిజన తెగల్లో ప్రాచీన కాలం నుంచి ఉన్న ‘‘నిద్రాశాలల’’ వ్యవస్థ గురించి రచయిత్రి తాను చదివిన పరిశోధన గ్రంథాల సాయంగా భిన్న కోణాల్లో వివరించారు. సాధారణంగా నిద్రాశాలలు, కీడుపాకలు, వంటి వ్యవస్థను మూఢనమ్మకంలో భాగమని, అవి స్త్రీ వివక్షతకు చిరునామాలని, నేటి ఆధునిక తరం అభిప్రాయ పడుతూ,వాటి నిర్మూలనకు ఏకీభవిస్తుండగా, రచయిత్రి అరుణ మరో కోణం నుంచి వీటిని ‘‘సామాజిక, ఆర్థిక,విద్యా,రంగాల్లో తమ పాత్రను నిర్వహించే సారథులు’’ అని అభిప్రాయ పడి రుజువు చేశారు. అలాగే మంచుకొండల్లో మన ఆదివాసుల ఉనికి గురించి తెలిపే క్రమంలో రాహుల్‌ సాంకృత్యాయన్‌ చే నామీకరణ చేయబడ్డ ‘‘భో టాంతిక్‌’’గిరిజనుల మనుగడ,వారి నివాస సంప్రదాయాల్లోని విశేషాలు, కులంకషంగా వివరించడంలో రచ యిత్రి స్థూల పరిశీలన శక్తి వెల్లడవుతుంది. గిరిజనులు అనగానే ‘‘శారీరక శ్రమ భాండా గారాలు’’గా గుర్తు పెట్టుకుంటాం, కానీ వారిలో కూడా చక్కటి సృజనాత్మకత శక్తి దాగి ఉండి,తద్వారా చేతివృత్తుల వల్ల అలంకార సామాగ్రి తయారు చేసి,ఉపాధి కూడా పొందుతున్నారు అనే అంశాన్ని విశ్లేషణ చేసిన వ్యాసం ‘‘గిరిజనుల అనుబంధ చేతివృత్తులు పరిశీలన’’ గిరిజనులు ఎంతటి మానసికపరమైన సృజనాత్మక శక్తి దాగివున్న వారు శారీరక శక్తికే అధిక ప్రాధాన్యత ఇస్తారనే విషయాన్ని చెప్పి, తద్వారా గిరిజన కళలు ఎందుకు ప్రాచు ర్యం చెంద లేదో సహేతుకంగా చెప్తారు రచయిత్రి.దీని ద్వారా వివిధ ప్రాంతా లలో నివసించే ఆయా గిరిజన జాతుల వారు ఎలాంటి హస్తకళ వస్తువులు తయారు చేస్తారో సవివరంగా తెలుస్తుంది. సృజనాత్మతోపాటు వైద్య పరమైన విజ్ఞానంలో కూడా అడవిబిడ్డలు ఆరి తేరారు అన్న విషయం మనం మర్చి పోరాదు. సహజ సిద్ధంగా అడవుల్లో పెరిగే వనమూ లికలు,వాటి స్థావరాలు, నివారణ కార కాలు, పరిజ్ఞానంగల గిరిజనుల వివరాలు,పొందుపర్చడంతో పాటు,అభివృద్ధి చెందిన తెగల్లో ఒకటైన ఖాసీ తెగవారు నివసించే ‘‘ఖాసీ కొండలు’’ ప్రపంచ ఆరోగ్య పర్యాటక ప్రాంతంగా ఎలా ప్రాచుర్యం పొందాయో కూడా రచయిత్రి ఇందులో సవివ రంగా పొందుపరిచారు. ప్రతి వ్యాసంలో ప్రధాన వస్తు వివరణ చేస్తూనే అంతర్గతంగా ఆయా గిరిజన సామాజిక వర్గాల వారి సంస్కృతి, సాంప్రదాయాల వివరణ కూడా అందించడంలో వ్యాసాల కర్త ముందుచూపు, బాధ్యతలు, అర్థమవుతాయి. సంస్కృతి సాంప్రదాయాలకు కట్టుబడి ఉంటారని గిరిజనుల ఆచారాలు కొన్ని ఆశ్చర్యకరంగా అనిపిస్తాయి ముఖ్యంగా వారి కుటుంబ వ్యవస్థకు ప్రధాన భూమికైనా వివాహ వ్యవస్థలో గిరిజనులు పాటించే బహు భార్యత్వం, బహు భతృ త్వం, బైగమి (ఒకరే అక్క’చెల్లెలి ని వివాహం చేసుకోవడం) మొదలైన వివాహ పద్ధతులు, బహిర్గతంగా చూసే వారికి గిరిజనులకు, లైంగిక స్వేచ్ఛ ఉందనిపిస్తుంది, దీనిని కొందరు కుహనా మేధావులు‘‘లైంగిక కమ్యునిజం’’గా కూడా అభివర్ణిస్తారు.
కానీ గిరిజనుల ఆలోచనల్లో విశ్రుంఖలత కనిపించదు, కేవలం వారి వారి కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కుల ఆమోదం మేరకే, ఆయా పద్ధతులు పాటిస్తారనే నగ్నసత్యం వ్యాసకర్త చామర్తి అరుణ నిర్మొహమాటంగ, వివరించారు. ఈ ‘‘జానపద దర్శనం’’లో గిరిజన ఆచార వ్యవహారాలకు చెందిన ప్రతి వ్యాసం ఎంతో విలువైన విజ్ఞాన సమాచారం సంతరించుకుని ఉంటుంది, ప్రామాణిక పత్రికల్లో ప్రచురించబడ్డ ఈ వ్యాసాలు ఏర్చి కూర్చోడంలో, వ్యాస శీర్షికల ఎంపికలో రచయిత్రి అపరిపక్వత పాఠకులకు కాస్త నిరుత్సాహం కలిగించిన, దాని మోతాదు అత్యల్పం, మొత్తానికి వ్యాసకర్త అరుణ పరిశోధనాత్మక అక్షర కృషి పుస్తకం నిండా ఆగుపిస్తుంది, గిరిజన సాహితీ పరిశోధక విద్యార్థులకు ఈ ‘‘జానపద దర్శనం’’ మంచి మార్గదర్శి అనడంలో అక్షర సత్యంనిండి ఉంది.- డా. అమ్మిన శ్రీనివాసరాజు (సెల్‌ : 7729883223)

ప్రామాణిక పరిశోధన కొండరెడ్డి జీవనం

ఒకప్పుడు మౌఖిక సాహిత్యంకే పరిమితమైన… మన ఆదివాసీ సాహిత్యం… అక్షరాస్యతలో వచ్చిన అభివృద్ధిలో భాగంగా .. వివిధ ప్రక్రియలలో పుస్తకాల రూపంలో… వస్తూ ప్రామాణికతకు చోటుచేసు కుంటుంది, ఈ గిరిజన సాహిత్యంలోని… పుస్తకాల వివరాలను ‘‘గవాక్షం’’ శీర్షికన… ‘‘థింసా పాఠకుల’’ కోసం ప్రతి నెల ఒక పుస్తకాన్ని పరిచయం చేస్తున్న పరిశోధక రచయిత డా. అమ్మిన శ్రీనివాసరాజు గారు అందించిన ఈనెల పుస్తక పరిచయం ప్రముఖ రచయిత్రి డా:కపిలభారతి కలం నుంచి జాలువారిన ‘‘ప్రామాణిక పరిశోధన కొండరెడ్డి జీవనం’’- డా. అమ్మిన శ్రీనివాసరాజు (సెల్‌ : 7729883223)

‘‘సాధారణంగా పరిశోధన గ్రంథాలు అంటే కొన్ని పుస్త కాలు నుంచి విషయం తర్జుమా చేసుకుని వ్రాసే ఎత్తి పోతల పథకం’’అనే చిన్న చూపు ఉంది, కానీ ‘డా: కపిల భారతి‘తనదైన అధ్యాపక జీవనంసాగిస్తూ ఇష్టంతో కష్టం లేకుండా చేసిన పక్కా పరిశోధన గ్రంథం ‘ కొండరెడ్డి గిరిజనుల జీవనం’ భాషా సాహిత్యాలు’’
దీర్ఘకాల క్షేత్ర పర్యటనలు, బహుకాల అధ్యయ నంతో కలగలిపి చేసిన ప్రామాణిక పరిశో ధన ఈ గ్రంథం.గిరిజనుల జీవన విధానం సాంస్కృ తి సాంప్రదాయాల గురించి ఇప్పటివరకు చాలా పరిశోధనలు జరిగాయి, వీటికి భిన్నంగా మౌఖిక సాహిత్యం మాత్రమే గల గిరిజనుల యొక్క భాషా సాహిత్యాల గురించి పరిశోధన చేయడం నిజంగా ఒక సాహసమే.!!
భారతదేశంలోని భిన్నమైన గిరిజన తెగల్లో ఒకటైన’’కొండరెడ్డి’’గిరిజన తెగను తన పరి శోధన వస్తు వుగా ఎంచుకోవడంలో అంతరార్థం పరిశోధకురాలు జన్మభూమికి చేరువలో సంబంధిత గిరిజనతెగ ఆవాసాలుఉండటం,ప్రధాన కారణం, దరి మిల పరిశోధకురాలు స్వయంగా ఆ ప్రాంతా లు సందర్శించడమే కాక అక్కడి కొండరెడ్డి గిరిజను లతో మమేకమై వారితో తాత్కాలిక జీవనంచేసి వారి స్థితిగతులను ప్రత్యక్షంగా పరిశీలించి వంద లాదిఫోటోలు,అనేకపాటలు,సంభాషణలు, రికార్డుల రూపంలో భద్రపరచడంతో పాటు వారితో అనేక సార్లు చర్చలు జరిపారు. ఆయా సారాంశాలను కూడా జాగ్రత్త చేసుకుని తన పరిశోధనకు అవసర మైన సరంజామా సమ కూర్చుని,ఆత ర్వాత మార్గ నిర్దేశకుల సూచనలు అనుసరి స్తూ ప్రమాణాలు పాటిస్తూ పూర్తిచేసిన సంపూర్ణ ఆదర్శవంతమైన పరిశోధనాగ్రంథం ఇది. దీనిని మొత్తం ఐదుఅధ్యాయాలు విభజిం చారు మొ దటి అధ్యాయంలో సర్వసాధారణమైన గిరిజ నుల పరిచయం,పూర్వపరిశోధనలు, పద్ధతి, లక్ష్యాలు,తెలుపుతూ కొండరెడ్డి గిరిజనులఉనికి, నివాసప్రాంతాలు,జనాభా,తదితర ప్రామాణిక లెక్కలు పొందు పరిచి తద్వారా భావి పరిశోధ కులకు సమాచార కేంద్రంగా చేశారు. ఇక రెండవ అధ్యాయం మొద లుకొని పరిశోధకు రాలు అసలు కృషిప్రారంభమై భాష విశేషాలు గల ఐదవ అధ్యాయం వరకు కొన సాగుతుంది. ఒక రకంగా చెప్పాలఅంటే దీనిని ‘కొండరెడ్ల సంపూర్ణ మార్గదర్శి’అనాలి.కేవలం కొండ ప్రాం తాల్లో మాత్రమే నివసించేవారు కనుక వీరికి ఆపేరు వచ్చిఉంటుంది అనేభావంతో సరి పెట్టు కోకుండావారి జీవనవిధానంలో ప్రధాన భూమి క గల‘నాగలి రహితవ్యవసాయం’ అయిన పోడు వ్యవసాయం గురించి ప్రస్తావన తీసుకు వచ్చా రు.నల్లమలచెంచులకు,తూర్పు కనుమ ల్లోని గోదావరి పరివాహక ప్రాంతాల్లో నివసించే ఈకొండరెడ్లకు సారూప్యత కనిపిస్తున్న ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు. ఆధునిక సమాజం ద్వారా ప్రభావితం అవుతున్న గిరిజన తెగల్లో అతిఎక్కువ ప్రభావిత గిరిజన తెగగా ,‘కొండ రెడ్లను’ పేర్కొన్నారు పరిశోధకురాలు. కొండరెడ్ల సంస్కృ తిలో వారిఇంటి పేరు గోత్రాలకు ప్రధాన పాత్ర ఉంటుంది.సాధారణంగా వాహనాలకు రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ఉన్నట్టుగానే వ్యక్తు లకు, కుటుంబాలకు,సమూహాలకు,ఇంట పేర్లు గోత్రాలు ఉంటాయి, పండుగలు పెళ్లిళ్లు చావులు సందర్భా ల్లో వీటి ప్రాధాన్యత అధికంగా ఉంటుంది,కొండ రెడ్డి కుటుంబవ్యవస్థ,వివాహవ్యవస్థ,గ్రామ పాల న వ్యవస్థలతో ముడిపడిఉన్న వారి ఆచార సాంప్ర దాయాలు కూలంకషంగా వివరించారు. పుట్టుక నుంచి మరణంవరకు కొండ రెడ్ల జీవన వ్యవస్థ తీరుతెన్నులు,సంతృప్తికరంగా వివరించారు. అంతే కాక ప్రాంతాలను బట్టి ఆయా గ్రామాలు పంచాయ తీల వారీగా జనాభా లెక్క లు కూడా పొందుపరచ డం ఇందులోని ప్రత్యేక తల్లో ఒకటి. ఈ కొండ రెడ్ల జీవనంలోగల సంఫీు భావంగురించి చెబుతూ వారు వారి సమీప ఇతర తెగలైన ‘నాయకపోడు’ గిరిజనతెగల వారితో కలిసి చేసే‘కొర్రాజులకోపు’ వంటి ఉత్సవాలు,పండుగలు, గురించిన ప్రస్తావన కూడా చేశారు. పోడు వ్యవ సాయం,వేట,అటవీ ఉత్పత్తుల సేకరణ,ప్రధాన పను లుగా జీవనం సాగిస్తున్న వీరు ‘సంచారజీవన విధా నం నుంచి సాగు విధానం వైపు‘మళ్ళిన వారిలో మొదటి వారుగా పేర్కొనవచ్చు.వీరు అటవీ ఉత్ప త్తుల సేకరణలో అంతర్భాగంగా వైద్యానికి అవసర మైన మూలికలు కూడా సేకరించి వైద్యం చేస్తారు, దరిమిలా వీరిని వైద్యులుగా కూడా పరిగణించ వచ్చు.జీవన విధానం మూడవ అధ్యాయంతో ముగించి,నాలుగవ అధ్యాయంలో ఈ పరిశోధనకే శిఖరాయమానం అయిన ‘కొండరెడ్డి మౌఖిక సాహి త్య ప్రస్థానం’ప్రారంభించారు.దీనిలో కథలు, పాటలు,పొడుపు కథలు,సామెతలు,భాషాంశాలు, ప్రధాన సాహిత్య అంశాలుగా చెప్పారు. ‘సాతరా లు’ అని గిరిజనులు పిలుచుకునే కథల్లో కల్పన, భావ ప్రకటన, మానసిక సంఘర్షణకు,ప్రాధాన్యత ఇవ్వబడతాయి దయ్యాలు, భూతాలు,అడవి జంతు వులు,సర్వసాధారణమే!!ఇందులోని కథలను మొదట కొండ రెడ్లు మాట్లాడే మాండలిక భాషలో రాసి తరువాత అందరికీ అర్థమయ్యే తెలుగులో వివరణ అందించారు. దీనిద్వారాసాధారణ తెలు గు భాషకు, కొండరెడ్డి గిరిజనులు ఉపయో గించే తెలుగు భాషకుగల వ్యత్యాసం సారూప్యత తెలుసు కునే అవకాశం ఉంది, వీటి సేకరణలో పరిశోధ కురాలు చేసిన పరిశ్రమ అడుగడుగునా అగుపి స్తుంది.ఇది ఆదర్శనీయమైన పరిశోధనగా చెప్ప డానికి కారణం అవుతుంది. ప్రతి కథ కొండరెడ్ల తెలుగుభాష మాడలికంలో చెప్పి అనంతరం తేట తెలుగులో వ్రాసి ఊరుకోకుండా ప్రతి కథకు చక్కని విశ్లేషణ అందించడంలో కూడా పరిశోధకురాలు సఫలీ కృతురాలు అయ్యారు. వీరి‘సాతురాలు’అన్ని భూమికి,ప్రకృతికి,సంబంధాలు కలిగి ఉన్నాయి. ఎక్కువ కథల్లో మనం అనేకసార్లు విన్న జానపద కదలే కనిపిస్తాయి. ఇక పాటలు విషయానికొస్తే కొండరెడ్లు శ్రమైక జీవన సారథులు, శ్రమను మరిపించేది పాట అలావారి శ్రమజీవనంలో పండుగలు,జాతర్లువంటి సామూహిక కార్యక్రమాల్లో పాటలు వారికి అంతర్భాగమై ఉంటాయి. ఈ పాట ల్లో కూడా జానపద బాణీలు కనిపిస్తాయి. సామూ హిక జీవనంలోని విలువలు చాటేవిగా ఈ పాట లన్నీ కనిపిస్తాయి. మన జానపద సాహిత్యంలో అనుభ వాలకు అద్దంపడుతూ ఆలోచింపజేసే ఒక రకమైన ‘అక్షరక్రీడ’ కొండరెడ్లు పొడుపు కథను వారిదైన మాండలిక ధోరణిలో ‘జిటేల్‌’అని పిలు స్తారు, వీరి జీవనశైలికి అద్దం పట్టే ఈపొడుపు కథల్లోని సంక్షిప్తీ కరణ చిత్రంగా ఉంటుంది. ‘ఎక్కలేని చెట్టుకు లెక్క లేని కాయలు’ అని అడవి మిరప చెట్టును ఉద్దేశించి చెప్పే పొడుపు కథ. ఇది చాలా చిన్నగా ఉంటుంది ఈ చెట్టు ఎక్కలేము కానీ బోలెడు మిరపకాయలు కాస్తుంది.‘గనుపు లేని గంగ వెదురు’ కనుపులు లేకుండా తలపై పెరిగేతల ‘వెంట్రుక’ను ఉద్దేశించి ఈపొడుపుకథ చెబుతారు.ఇక కొండరెడ్ల సామెతలు కూడా వారి జీవనవిధానం నుంచిఆవిర్భవిస్తాయి. ‘విరిగినకత్తి కమ్మరింటికి-మనువు చెడితే పుట్టింటికి’ ‘అందిన వానికి ఆకు వెయ్యి అందని వాడికి కేక వెయ్యి’ వంటి సామెతలు వాడుతారు,అలాగే వారి జీవనంలో అంతర్భాగమైన నృత్యంకోసం ఉపయో గించేవాయిద్యాల గురించి చెబుతూ‘దామగు త్తులు’ అనే గొట్టికాయలతో గిరిజనులు మాత్రమే తయారు చేయగల వాయిద్య విశేషాన్ని సచిత్రంగా పరిచ యం చేశారు. చివరి అధ్యాయమైన ఐదవ అధ్యా యంలో కొండరెడ్డి గిరిజనులభాషా విశేషాలు వివ రణ చేశారు.సాధారణంగా వీరు మాట్లాడేది తెలు గు భాష అయినా అందులో ప్రాచీన తెలుగు పదా లు,శాసనాల్లో కనపడే భాషా పదాలు, కూడా వీరి భాషా మాలికంలో అడుగడుగునా అగుపిస్తాయి. ఈ భాషలో‘ట’కారం బదులు ‘త ’కారం పలకడం, అచ్చులు హల్లు వాడకంలో మార్పు మొదలైన విష యాలు రేఖామాత్రంగా చర్చించి విస్తృత పరిశోధ జరగాల్సిన అవసరాన్ని ఆవిష్కరింపజేశారు.
ఇలా సాధారణ గిరిజన జనజీవనం లోని ఈపరిశోధనలో అనేక అసాధారణ అపురూప విషయాలు ఆవిష్కరించబడి విలువైన పరిశోధన గ్రంథంగా రూపొందించబడిరది. ప్రస్తుతం పరి శోధన గ్రంథాలన్నీ ఎక్కువగా విశ్వవిద్యాలయ గ్రంథాలయ గదులకే పరిమితమై వాటి విలువలు నిర్వీర్యం అవుతున్న వేళ, వ్యయ ప్రయాసలకోర్చి పుస్తక రూపంలో ప్రచురించి అందరికీ అందు బాటులోకి తీసుకువచ్చిన పరిశోధక రచయిత్రి డా: కపిల భారతి కృషి అభినందనీయం ఆచరణీయం, కొండరెడ్డి గిరిజనుల జీవనం

అపూర్వ సాహితీ సింగిడి ఆదియోధులు

కప్పుడు మౌఖిక సాహిత్యంకే పరిమితమైన… మన ఆదివాసీ సాహిత్యం… అక్షరాస్యతలో వచ్చిన అభివృద్ధిలో భాగంగా .. వివిధ ప్రక్రియలలో పుస్తకాల రూపంలో… వస్తూ ప్రామాణికతకు చోటుచేసు కుంటుంది, ఈ గిరిజన సాహిత్యంలోని… పుస్తకాల వివరాలను ‘‘గవాక్షం’’ శీర్షికన… ‘‘థింసా పాఠకుల’’ కోసం ప్రతి నెల ఒక పుస్తకాన్ని పరిచయం చేస్తున్న పరిశోధక రచయిత డా. అమ్మిన శ్రీనివాసరాజు గారు అందించిన ఈనెల పుస్తక పరిచయం ప్రముఖ రచయిత గుమ్మడి లక్ష్మీనారాయణ కలం నుంచి జాలువారిన ‘‘అపూర్వ సాహితీ సింగిడి ఆదియోధులు’’

Read more

తెలంగాణ గట్టుమీద పోలవరం

ప్రముఖ పరిశోధక రచయిత, విశ్లేషకులు, డాక్టర్‌ అమ్మిన శ్రీనివాసరాజు థింసా పత్రిక కోసం ప్రత్యేకంగా రాస్తున్న ‘గిరిజన కథావిశ్లేషణ’ ధారావాహికంగా అందిస్తున్న ఈ నెల సంచికలో కథా విశ్లేషణ తెలుగు సాహితీలోకానికి సుపరిచితులైన ‘కోమాకుల సీతారాములు’’ కథా రచన ‘ తెలంగాణ గట్టు మీద పోలవరం ’ కథా చదవండి..! – సంపాదకులు
సీతారాములు కథల్లో పోరాట చైతన్యం కనిపిస్తుంది… బహుముఖీనమైన కళాసేవతో సీతారాములు రాసిన అనేక కథల్లో ఇది ఒకటి.‘‘బహుళార్థక పోలవరం ప్రాజెక్టు’’ నిర్మాణంలో మార్పులు తేవాలనే లక్ష్యంతో ‘‘ముంపు మండ లాలపోరాటం’’ మొదలైన తరుణంలో సామాజిక స్పృహ నిలువెల్ల పులుముకున్న ఉద్యమ రచయిత సీతా రాములు. ఆ స్వానుభవానికి అక్షర రూపమే ఈ కథ. ఇది ఏదో పోరాట కథనం అనుకుంటే పొరపాటే.. చక్కటి ఒక భిన్నమైన కథ రచనా కాలం 2015. .
కేవలం ఉద్యోగ వృత్తితో కాలం గడపకుండా, సంపూర్ణ సామాజిక స్పృహతో తన చేరువలోని అడవిబిడ్డల వికాసమే లక్ష్యంగా కృషి చేసిన సామాజిక కార్యకర్త రచయిత ‘కోమాకుల సీతారాములు’ మానుకోట జన్మస్థలం గల వీరు సుమారు పుష్కర కాలం పాటు భద్రాచలం మన్యం ప్రాంతంలో విద్యార్థి ఆవాస కేంద్రాల పర్యవేక్షకుడిగా ఉద్యోగ ధర్మాన్ని పాటిస్తూ,.. ఇక్కడి గిరిజనులతో మమేకమై ఎందరో గిరిజన విద్యార్థులకు దారి దీపం అయ్యారు. గాయకుడిగా,రచయితగా,నటుడిగా,శిక్షణా ధ్యక్షుడుగా,బహుముఖీనమైన కళాసేవ చేసిన సీతారాములు రాసిన అనేక కథల్లో ఒకటి ‘‘తెలంగాణ గట్టుమీద పోలవరం’’.దీని రచనా కాలం 2015 సంవత్సరం.ఊహించిన విధంగా అందివచ్చిన తెలంగాణ రాష్ట్రం యావత్తు, ఆనందంతో సంబరాలు చేసుకుంటున్న వేళ.. భౌగోళికంగా రాష్ట్రంలో అంతర్భాగమైన భద్రాచలం మన్నెసీమకు కుడిచేయి వంటి ‘పోలవరం ముంపు ప్రాంతమండలాలు’ పాలకులముందుచూపు..,వ్యూహాలతో..స్వార్థ ఒప్పందాలతో అక్కడే నివాసం ఉంటున్న గిరిజ నులను బలవంతంగా ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేయడంతో అక్కడి అన్ని వర్గాలప్రజల్లో ఆందో ళనతో కూడిన విషాదఛాయలు అలుము కున్నాయి. ఈ ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపవద్దని అంతేకాక అధిక నష్టదాయకమైన ‘‘బహుళార్థక పోలవరం ప్రాజెక్టు’’ నిర్మాణంలో మార్పులు తేవాలనే లక్ష్యంతో ‘‘ముంపు మండ లాలపోరాటం’’ మొదలైంది. సామాజిక స్పృహ నిలువెల్ల పులుముకున్న ఉద్యమ రచయిత సీతా రాములు ముంపుమండలాపోరులో కీలక పాత్ర పోషించారు.ఆ స్వానుభవానికి అక్షర రూపమే ఈ ‘తెలంగాణ గట్టుమీద పోలవరం’ కథని ఇది ఏదో పోరాట కథనం అనుకుంటే పొరపాటే…!! రచయితకు ఉండే సాధారణ ఆశావాదం.. అందమైన అడవిబిడ్డల జీవనవిధానం,సుందరమైన గోదావరి అడవి అందాలు,అంతర్గతంగా అభివర్ణిస్తూ…. మరో పక్క అడవిబిడ్డల జీవన విధానంతో కూడిన వారి పోరాటగాథను రచయిత హృద్యంగాచెప్పే ప్రయత్నం చేశారు. కారు మబ్బుల సాక్షిగా చిరుజల్లుల్లో తడుస్తూ ‘‘కోడేరు’’ గిరిజన గ్రామ స్తులంతా సంప్రదాయబద్ధంగా ఏటా జరుపుకొనె భూమిపండుగ కోలాహలంతో ఈ కథ మొదలవుతుంది. ‘రాములమ్మ’అనే గిరిజన యువతి ఈకథలో ప్రధాన పాత్రగా అగు పిస్తుంది. అనుచరులుగా రాజన్న,కొమ్మారెడ్డితో పాటు కథా రచయిత కూడా ఈకథలో అతిధి పాత్రగా దర్శనమిస్తాడు. ఇక కథ విషయానికి వస్తే ఎంతో ఆనందంగా కొమ్ము,డోలు,నృత్యా లతో భూమిపండగ చేసుకుంటున్న ఆగూడెం గిరిజనులకు పిడుగులాంటి వార్త చెబుతాడు రాజన్న. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంవల్ల తెలంగాణ ప్రజలంతా ఆనందోత్సవాలతో తేలి ఆడుతుండగా….ఆ రాష్ట్రంలో భాగమైన మన్య సీమ లోని గిరిజన గ్రామాలకు నిరుత్సాహంతో కూడిన,బాధ కలిగించే వార్త చెప్పడం ఈ కథ ప్రారంభంలోని ఎత్తుగడ.
కానీ ఎత్తుగడలో ఎలాంటి ఉత్కంఠత గాని, సందేహాలు గాని, లేకుండా అసలు విషయం వెంటనే వెల్లడిరచి రచయితే స్వయంగా ఒక పాత్ర ధరించి కథలో ప్రవేశించడంతో విష యం శక్తి సన్నగిల్లిన,కథనంతో కాస్త కష్టపడి కథను చివరికంటూ చదివింప చేసే ప్రయత్నం జరిగింది. కథలోని తొలి పాత్ర అయిన రాము లమ్మ, డిగ్రీ వరకూ చదువుకొని ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నా ఆదివాసీ యువతి,తాను చదువుకున్న చదువు ద్వారా లభించిన విజ్ఞానం, విషయ పరిజ్ఞానం ద్వారా తనప్రాంత గిరిజ నుల్లో చైతన్యం తెచ్చే ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాలు అయిన ఏడు మండలాల ప్రాంతాన్ని తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్ర ప్రాంతంలో కలుపుతున్నట్లు వెలువడ్డ టీవీ వార్తలు గురించి రాజన్న ద్వారా విన్న రాములమ్మ, వెంటనే తనకు గతంలో తెలిసిన విజ్ఞానం సాయంతో గూడెం ప్రజలనంతా… ఒకచోటకు చేర్చి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం లోని లొసుగులు గురించి చెబుతుంది.తాను చదువుకునే సమయంలో సీతారాములు సార్‌ (కథా రచయిత) చేసిన ఉపన్యాసాల సారాంశం గుర్తుచేసుకుని,గతంలో గిరిజన సమాజాల్లో సమ్మక్క సారక్క,హైమన్డార్ఫ్‌,సీతారామరాజు, గంటందొర,కొమరంభీమ్‌ వంటి వారు చేసిన పోరాటాలు,త్యాగాలు, చైతన్యపుకృషి, గురించి వివరిస్తుంది రాములమ్మ. అలా ఆమె చెప్పిన మాటల ద్వారా రానున్న కష్టకాలం తలుచు కుంటూ భవిష్యత్‌ కార్యాచరణ గుర్తు చేసు కుంటూ ఎవరి ఇళ్లకు వారు వెళ్ళిపోతారు. పూర్వం దేశమంతా స్వాతంత్య్ర సంబరాలు జరుపుకుంటూ ఉంటే ఒక హైదరాబాద్‌ సంస్థాన ప్రాంత ప్రజలు మాత్రం నిరుత్సా హంగా ఎలా ఉండిపోయారో ,ఇప్పుడు అదే పరిస్థితి ఈపోలవరం ముంపు ప్రాంత గిరిజన గ్రామాలది. తెలంగాణ వచ్చిన సంతోషం కన్నా తెలంగాణ ప్రాంతం నుంచి గెంటివేయ బడ్డామన్న బాధ ఈప్రాంతవాసులకు ఎక్కు వైంది.తిరిగి పోలవరం వ్యతిరేక ఉద్యమం మొదలైంది.సీతారాములు సార్‌ పాత్ర మళ్ళీ ప్రారంభమైంది,ఏడు మండలాలకు చెందిన యువ కార్యకర్తలకు కార్యాచరణ చేయడం కోసం,ఏర్పాటుచేసిన శిక్షణ శిబిరంకు వెళ్ళిన సీతారాములు అనేక లెక్కలు,చారిత్రక విశేషా లతో కూడిన సుదీర్ఘ ప్రసంగం చేయడంతో కథ అంతా వ్యాసపుముసుగు వేసుకుని నడుస్తుంది. కథలో రూపం మారిన పాఠకులకు విసుగు రాకుండా చదివింప చేయడంలో రచయిత పడ్డ శ్రమ చివరికి ఫలించిందనే చెప్పాలి.ఈ పోల వరం ముంపు పోరాట ఉద్యమంకు నూతన పంథాలో, గిరిజనుల సంప్రదాయ సంస్కృతి ఆయుధాల సాక్షిగా ఉద్యమ నిర్మాణం జరిగి పోతుంది.‘పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాం తం’ దిగ్బంధం లక్ష్యంగా కార్యాచరణ సాగు తోంది.‘పోలవరం ఆపండి ఆదివాసులను కాపాడండి’ అనే నినాదాలతో అడవి అంత మారుమోగుతుంది, భారత ప్రభుత్వం న్యాయం చేసే వరకు పోరాటం చేయాలని అక్కడి గిరిజ నులంత తీర్మానం చేసుకున్నారు. అందుకు అన్ని ప్రాంతాల ప్రజలు,ఉద్యోగులు,సంఘాల వారు తమ మద్దతు తెలుపుతారు,‘పోలవరం దిగ్బం ధం’ చేసే రోజు ఖరారు అయ్యింది. పోలవరం ముంపు ప్రాంతపు గిరిజనులు చేసే పోరాటానికి అన్ని ప్రాంతాల నుంచి ట్రాక్టర్లు,లారీలు, లాంచీ లు,పడవలు, ఇలా రకరకాల ప్రయాణ సాధ నాల ద్వారా నిర్బంధ ప్రాంతానికి జనాలను చేరవేయడానికి, నాయకులు ఎవరికి వారు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఇక్కడ వరకు కథ వాస్తవానికి దగ్గరగా భూతకాలంలో నడిచింది. చివరిలో రచయిత తన ఆశావహ దృక్పథాన్ని వ్యక్తపరుస్తూ ఒక గొప్ప ఆశయం చాటుతూ కథను ముగిస్తారు. కథ చివరి ఘట్టం అంతా అడవి బిడ్డలు చేసిన పోరాట రూపం, దానికి సహచరులు అంతా తెలిపిన సంఫీు భావం,అక్కడ వారు రహదారులను దిగ్బంధం చేసినతీరు,వంటావార్పులుతో నిరసన తెలిపిన వైనం తదితరాలు కళ్లకు కట్టినట్లు అభివర్ణిం చడంలో రచయిత స్వయంగా చేసిన ఉద్యమాల అనుభవాలు వ్యక్త పరిచారు.ఈ పోలవరం పోరులో అడవి బిడ్డలు ఉపయోగించిన వస్తు వులు,ఎండుగుబ్బ,పూరిదికట్ట,బొంగుది కర్ర , టేకుది సిర్ర,డోలు మొదలైన వాటి గురించి వివ రించడంలో రచయితకు గల పరిసరాల అవగా హన ఎంత పటిష్టంగా ఉందో అర్థం వుతుంది. ఉద్యమంలో వారు చేసిన నినాదాలు,పాడిన పాటలు,ఆడిన ఆటలు, మొదలైనవి చూస్తే ఈ అడవి బిడ్డలలోని ఆత్మస్థైర్యం,కష్టాలను ఎదు ర్కొనే ధైర్యం,ఎంతో ఆదర్శంగా చిత్రిం చడంలో రచయిత సీతారాములు కృషి నెరవేరింది అని పిస్తుంది.‘పోలవరం కడితే అందులో జల సమాధిఅయ్యి చనిపోయే దానికంటే.. ఇప్పుడే ఇక్కడే పోరాడి చనిపోతాం భావితరాలైనా ఈప్రాంతాన్ని కాపాడుకుంటారు’ అనే భావన గిరిజన యువతి రాములమ్మ నుంచి చెప్పిస్తాడు రచయిత.పోరాటాలు ఏవైనా తక్షణ ఫలితాలు అందించక పోయినా భావితరంలో రావాల్సిన మార్పులకు బీజాలుగా తప్పక మారుతాయి.. అన్న చారిత్రక ఆలోచనలు నిజమే కదా అని పిస్తుంది. ఇక కథ చివర్లో ఉద్యమకారులకు పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణ వాతావ రణం చూపిస్తూ ‘బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదె సుమతీ’ అన్న సుమతీశతక కర్త బద్దెన వాక్కుకు నిజం చేస్తూ.., గిరిజనుల ఐక్యత, తెగింపు, వారికి లభించిన సంఫీుభావంతో పోలీసులు వెనకడుగు వేయ టం,రాష్ట్రపతి ప్రధాని,జోక్యం చేసుకుని సమస్య పరిష్కరించడానికి ముందుకు రావడం జరుగు తుంది. వారు కోరుకున్నట్టుగా 7మండలాలు తెలంగాణ భూభాగంలోని కొనసాగించడానికి ఒప్పుకోవడం తో పాటు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గురించి కూడా పునరాలోచన చేస్తా మని హామీ ఇవ్వడంతో,మనిషిని మాటను, సం పూర్ణంగా నమ్మే గిరిజనులు శాంతించివారు చేస్తున్న పోరాటం ఆపి ఎవరి ఇళ్లకు వారువెళ్లి రాబోయే బంగారు తెలంగాణ సమాజాన్ని తలచుకుంటూ నిద్రలోకి జారుకుంటారు.అంటూ రచయిత తన ఆశాభావాన్ని రంగరించి తనదైన క్రాంతదర్శనంతో కథను సుఖాంతం చేయ డంతో పాఠకులు సంతృప్తి చెందుతారు.ఈకథ లో గిరిజనజీవితాల్లో అంతర్భాగంగా అగుపించే ‘పోరుబాట’ను వివరిస్తూనే వారివారి సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేస్తూ, ఒక వార్తా కథనాన్ని అందమైన కథగా తీర్చిదిద్ది తెలుగు కథా సాహిత్యానికి ఒక ‘గిరిజన కథ’అందించిన సీతారాములు కృషి లెక్కించదగిన అభినందిం చాల్సినది. (వచ్చే మాసం ఎస్‌.బాలసుధాకర్‌ మౌళి కథా విశ్లేషణ ‘‘థింసా దారిలో’’…. మీకోసం)

బంజారా భావిపౌరుల ముచ్చ‌ట్లు

ఏ సమాజమైనా ఉన్నత స్థితికి చేరాలంటే అది ఆసమాజపు విద్యా వ్యవస్థ పైన, దాని ప్రధాన నిర్వాహకులు ఉపాధ్యాయుల పైన వారినిబద్దత పైన ఆధారపడి ఉంటుంది. ఉద్యోగాలు అన్నిటికీ కేంద్రబిందువైన ‘‘ఉపాధ్యాయకత్వం’’ పైకి కనిపించేటంత సామాన్య మైనది కాదు.వివిధ విభాగాలుగా విభజిం చబడి ఉన్న ఉపాధ్యాయ ఉద్యో గాలు ఆయా వ్యక్తులు చేసే నిబద్ధతగల కృషి ద్వారానే సంబంధిత ఉద్యోగాలకు, వ్యక్తు లకు,భవిష్యత్తు గుర్తింపు,సంతృప్తి, సమ పాళ్ళలో అంది వస్తాయి. కొద్ది కాలపు పంటల రక్షణ దిగుబడి కోసం రైతు మిత్రులు ఎంత ప్రయాస పడతారో మనకు తెలిసిందే..!
అలాగే ‘‘భావి సమాజపు నిర్మాణ పం టలైన’’ విద్యార్థులు అనబడే ఈ పసి పం టల గురించి,ఉపాధ్యాయ కృషి వలురు ఎలాంటి కృషి చేస్తున్నారో..! ఎంతగా కృషి చేయాలో చెప్పకనే చెప్పిన పుస్తకం ‘‘మా పిల్లల ముచ్చట్లు’’ టీచర్‌ అనుభవాలు….అనే అనుబంధ శీర్షికతో వెలువడిన ఈ విలువైన పుస్తకం వెలువరించింది ప్రముఖ కథా రచయిత్రి ‘‘సమ్మెట ఉమాదేవి’’.
ఇలాంటి అనుభవాలు అనుభూతులు ప్రతి ఉపాధ్యాయునికి ఉపాధ్యాయినికి ఉంటాయి ఇందులో విశేషం ఏముంది? అనుకోవచ్చు,కానీ ఇక్కడ ఆ అనుభవా లను పంచుకుంది ఓ..ఉపాధ్యాయిని,చక్కని సృజనాత్మక రచయిత్రి,దానితో ‘పసిడికిపన్నీరు పూసిన’చందమై ఈ సాధారణ అనుభవాలు,భావితరానికి బాగా పనికివచ్చే ఆదర్శ అక్షరాలై,అవి పుస్తకంగా అలంకరించ బడటానికి అన్ని అర్హతలు సాధించాయి. ఈ పుస్తక రచయిత్రి వృత్తిరీత్యా ఆంగ్ల అధ్యాప కురాలు. కానీ అమ్మభాష తెలుగు మీద ఇష్టం..పట్టు అధికం…అందున ఆమె అనుభవాలను, అనుభూతులను, మేళ వించి మేలైన కథలు రాయడంలోనేర్పరి, అలా కలగలిసిన అనుభవాల సృజనా త్మకతల కలబోతగా వెలువడిరదే… ఈ ‘మా పిల్లలముచ్చట్లు’.
ఇది సాధారణంగా కనిపించే అసాధారణ పుస్తకం,ముఖ్యంగా రచయిత్రి ఉమాదేవి శిష్య గణానికి భవిష్యత్తులో ఇదో ‘అపూ ర్వ కానుక’కానుంది,ఆయా విద్యా ర్థులం తా మరో పాతికేళ్ళకు మంచి మంచి స్థితుల్లో స్థిరపడి అబ్బురపరిచే తమతమ బాల్యం తాలూకు జ్ఞాపకాలను గుర్తు చేసుకుని పరవశించడానికి ఈ పుస్తకం సచిత్రంగా చక్కగా సహకరిస్తుంది.ఇక ఈ పుస్తకంలోని విషయాలు ఇలా అక్షరీక రించడంలోని అవసరం..నేపథ్యం ఏమిటో తెలిస్తేనే పుస్తకం పట్టుదలగా పట్టుబట్టి చదవగలం. రచయిత్రి ‘సమ్మెట ఉమాదేవి’ సంపూర్ణ సామాజిక స్పృహ గల వ్యక్తే కాదు. పరిపూర్ణ పరోపకార గుణం గల స్త్రీ మూర్తి.
తనకు జీవనభృతి,సామాజిక గౌరవం, బ్రతుకుభద్రత,కలిగించిన తన ఉద్యోగం పట్ల అమితమైన ఇష్టం,గౌరవం కలిగిన వ్యక్తి,కనుక ఈనిస్వార్థ కార్యానికి కంక ణం కట్టుకుంది. తమ ఆరోగ్యం,ఇంటి సమస్యలను బూచిగా చూపి ఉద్యోగ జీవి తాలను మొక్కుబడిగా దొర్లించుకుపోతు న్న నేటితరం ఉద్యోగగణం.రచయిత్రి కృషిని ఆదర్శనీయంగా గమనించి ఆచర ణలో పెట్టాల్సి ఉంది. అందరూ పడే ఇబ్బందులు కన్నా కాస్త అధికం గానే ఆరోగ్య సంసారిక ఇబ్బందులున్నా…తన సమస్యల కన్నా తనవిద్యార్థుల సమస్యలు ముఖ్యం. తనకు ఆగుణం తల్లిదండ్రుల నుంచి అలవడిరది,.ఇక తను‘నిత్య బాట సారి’గా ఉంటూ మారుమూల లంబాడా తండాల్లో మాతృభాష తెలుగుకాని తండా పిల్లల విద్యావికాసం కోసం నిత్యం తపించి పనిచేసిన నిజమైన అధ్యా పకురాలు ఆమె. విద్యార్థులకు కేవలం పుస్తకాల్లో విషయాలు లెక్క ప్రకారం చెప్పేసి,పరీక్షల్లో గట్టెక్కించడమే నేటి ఆధునిక ఉపాధ్యాయవృత్తి దారులకు పని గాఉన్న కాలంలో,విద్యార్థుల సొంత జీవి తాల్లోకి తొంగి చూసి తనకు చేతనై నంత లో సాయపడటం తనకు మించిన భార మైనప్పుడు,అర్హులైన దాతలకు విషయం వివరించి వారి దాతృత్వంను నిజా యితీ గా నిజమైన లబ్ధిదారులకు చేరవేయడం, ఆమె ఉద్యోగంలో ఒకభాగంగా భావిం చారు. రచయిత్రి ఉద్యోగ జీవిత నేపథ్యం అలాంటిది కనుకనే అంతటి అపూర్వ మైన రచన తెలుగు సాహిత్యానికి అంది వచ్చింది.ప్రక్రియ తదితర ప్రామాణిక తలను పక్కనపెడితే ఇదో‘చిత్రాక్షరి’. గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేద జీవిత నేపథ్యంతో బ్రతుకు బండ్లను నెట్టు కొస్తున్న భావిపౌరులు ప్రతిచోటఉన్నారు.. ఉంటారు. కానీ వారిని చూసి సాను భూతిచూపడటం..దురదృష్టాలను తిట్టు కుంటూ..కాలంవెల్ల బుచ్చకుండా,వాటి పరిష్కారం కోసం ఎమి చేయాలో ఈపుస్త కం మార్గదర్శనం చేస్తుంది. ఇక ఈ అను భవాల పూరేకులను ఒక్కొక్కటిగా విప్పా రిస్తే ప్రతి రెమ్మ ఓ ఆదర్శనీయ అపురూ పమైన అనుభూతే..! అమాయకత్వంకు తోడు పేదరికం కలగలిసిన ఈబంజారా భావి పౌరులను ఉమాటీచర్‌ ఎలాతీర్చిది ద్దిందో తెలిస్తే ఆశ్చర్యం కలగక మానదు. ‘జేగంట’ మొదలు‘ఉపసంహారం’వరకు సాగిన ఈచిరు వ్యాసాల సమ్మేళనంలో ప్రతివ్యాసం ఓప్రత్యేకతను కలిగి ఉన్నది. ముఖ్యంగా లంబాడా పిల్లలు బడికి రావడంలో ఎదురయ్యే ఇబ్బందులు వచ్చాక బడిలో పాఠాలు నేర్చుకునే వేళ పడే పాట్లు రచయిత్రి సున్నితంగా ఆలో చింపజేసేట్టు చెబుతారు.‘తండాల చరిత’ అనే ఒకఅనుభవంలో పట్టణాలకు దూ రంగా ఉండే లంబాడా లైన తండా వాసులు రవాణా సౌకర్యం లేక నేటికీ ప్రయాణాలు వేళ ఎదుర్కొంటున్న ఇబ్బందులు చెబుతూనే ‘ముత్యాలం పాడు’లో తను పనిచేసే సమయంలో అక్కడి తన విద్యార్ధినిలను తాను ఉండే కొత్తగూడెం పట్టణంకు ఒకసెలవురోజు తీసుకువచ్చి పట్టణ వాతావరణంలో పిల్లలకు ప్రత్యేకంగా పరిచయం చేసిన సమయంలో ఆరాత్రి కూడా ఆధునిక సౌకర్యాలను గడపాలన్న తాపత్రయంతో పిల్లలు చెప్పిన ‘రాత్రి ప్రయాణఅసౌకర్య’ వివరాలు తెలుసుకుని ఒకపక్క బాధ అని పించిన,పిల్లలు పథకం పారినందుకు పరవశిస్తుంది ఈపంతులమ్మ. ఇలా తాను విద్యాబోధన వేళ ఎదుర్కొన్న ప్రతి అను భూతిలో ఒకసామాజిక సమస్యను, అంశాన్ని అధ్యయనం చేసుకుంటూ సాగటం,రచయిత్రిలోని సృజనాత్మక ప్రతిభకు తార్కాణం. ఇక ఆ గిరిజన తం డాలలోని బతుకమ్మ ఆటో డి తీజ్‌ పండుగ వంటి వారి సాంప్రదాయ పండు గలు విశేషాలు వివరిస్తూ అందులో విద్యా ర్థులకు ఆధునికతను జోడిరచి భాగస్వా ములను చేయడం విద్యార్థులకు మరువ లేని మధురానుభూతులే…!! గిరిజన జనావాసాలు యుక్తవయసు బాలికలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి వాటిని నివారించే పరిష్కార మార్గాల గురించి తనదైన బాణిలో చక్కటి సూచ నలు చేస్తుంది ఉమా మేడం‘ఫంక్షన్‌ సెలవులు’సంఘటన ద్వారా,బడి ప్రాణ లో చేసే సీమంతాలు,యుక్త వయసు లోని బాలబాలికలు తెలుసుకోవలసిన వ్యక్తిగత శుభ్రత,ఆరోగ్య జాగ్రత్తల గురిం చి,కూడా నిర్వహించిన కార్యక్రమాలు తాలూకు అనుభవాలు ఇందులో చెబు తారు.ఆడపిల్లలు మరుగుదొడ్లుతో పడుతున్న పాట్లు, ఇలా ఎన్నో విషయాలు ఆనందపు పోతపోసిన అగచాట్ల తాలూకు హృదయవిదారక, ఇబ్బందులను ఆలోచించే విధంగా ఆవిష్కరించారు రచయిత్రి. ఇంతసమానత సమాజంలో చక్కర్లు కొడుతున్న… ఇంకా తండాల్లో కనిపిస్తున్న కుల వివక్షత గురించి‘ఒక కంచం కథ’ ద్వారా చూపిస్తారు.అలాగే తండాల్లో నేటికీ నెలకొని ఉన్నారు నిండు పేదరికానికి తార్కాణం ’కంచం గ్లాసు’ అనే సంఘటన చెబుతుంది. మనిషి జీవితం అన్న,మనుషులు నివసించే సమాజమైనా,భావి పౌరులను తయారు చేసే బడులైనా,ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని ఎదురయ్యే ఇబ్బందుల్లోనే సౌకర్యాలు సృష్టించుకొని ముందుకు సాగిపోవాలనే అక్షర సత్యాన్ని ఆవిష్క రిస్తుంది ఈటీచరమ్మ అనుభవాల తోట 255 పేజీల ఈబుల్లి గ్రంథం నిండా ప్రతి పేజీ గిరిజన తండా పిల్లల అగచాట్లు అగుపిస్తాయి. అందుకు అధ్యాపకులు అందించిన చేయూత, మరి కొందరు ఉపాధ్యాయులకు ఆదర్శంగా ఆలోచనలు అందిస్తూ ఈఅనుభూతుల పుస్తక రచన సాగింది. నేటి కాలపు ఆధునిక అధ్యాపకులు అంతా తప్పక చదివి ఆచరించాల్సిన విషయాలు ఈపుస్తకంలో చాలా ఉన్నాయి.విద్యార్థుల మనసుల్లో పది కాలాలపాటు గుర్తుండి పోయే కృషి చేసి ‘ఉత్తమ ఉపాధ్యా యులు’గా నిలవాలి అనుకునే ప్రతి ఉపాధ్యాయుడు…ఉపాధ్యాయని ఈపుస్త కాన్ని తప్పక సొంతం చేసుకుని చదవాలి. పుస్తకాన్ని పాఠక ప్రపంచానికి అందించడానికి ముందుకు వచ్చిన ‘శాంతా వసంతట్రస్ట్‌’ వారు, ద్వితీయ ముద్రణ చేసిన ‘కవీర్ణప్రచురణలు’ వారూ.. అభినందనీయులు.
పుస్తకం వివరాలు :- ‘మా పిల్లల ముచ్చట్లు… ఒక టీచర్‌ అనుభవాలు’, (కవీర్ణ ప్రచురణలు)
రచన :- సమ్మెట ఉమాదేవి. పేజీలు :-256
వెల :- రు 250/- పుస్తకాల కోసం సంప్రదించాల్సిన ఫోన్‌ నంబరు :- 9849406722 డా: అమ్మిన శ్రీనివాసరాజు