గిరిజనుల హక్కులకు పాతర

అడవి పుత్రుల ఆవాసం..ఏజెన్సీ ప్రాంతానికి ముప్పు పొంచిఉంది.అభివృద్ధి పేరుతో గిరిజనుల హక్కులను పాలకవర్గాలు పాతరేస్తున్నాయి.రాష్ట్రంలో ప్రకృతి వైభవానికి,జీవవైవిధ్యానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న తూర్పు కనుమలపై కొన్ని సంవత్సరాలుగా కార్పొరేట్ శక్తులు కన్నేసి ఉన్నాయి. వాటిని కబ్జా చేయడానికి రకరకాలుగా ప్రయత్నిస్తున్నాయి. కేంద్రంలో నరేంద్రమోడీ ప్రభుత్వం నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం కార్పొరేట్ల డిమాండ్లు నెరవేర్చడానికి పెద్దపీట వేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అధికారంలో ఉన్నంత కాలం బిజెపి అడుగులకు మడుగొలిత్తిన వైసిపి ప్రభుత్వం ఇటువంటి విధానాలనే అమలు చేసింది.తాజాగా అధికారంలో ఉన్న టిడిపి కూటమిలో బిజెపి భాగస్వామి కావడంతో ఏజెన్సీ ప్రాంతానికి ఎసరు పెట్టడానికి సిద్ధమౌతోంది. కొద్ది రోజులక్రితం శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు గిరిజనుల హక్కుల పరిరక్షణే లక్ష్యంగా రూపొందించిన 1/70 చట్టం వల్ల అభివృద్ధి జరగడం లేదని, దానిని సవరించాలంటూ వ్యాఖ్యలు చేశారు.దీనిపైగిరిజనం ఆందోళనలు పరిగణనలోకి తీసుకున్న కూటమి ప్రభుత్వం వారి ఆవేదన చల్లార్చాడానికి గిరిజన చట్టాలు సవరణ లేదంటూ ప్రకటించారు.ఇంతలోనే ఐదోషెడ్యూల్ ప్రాంతానికి చెందిన పార్వతీపురం-మన్యం జిల్లాలోని సీతంపేట మండలం పానుకవలస గ్రామంలో 27.26ఎకరాల ప్రభుత్వ భూమిని ఎంఎంఎంఈ పార్క్ ఏర్పాటు కోసం ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్(ఏపీఐఐసీ)కి ఉచితంగా బదిలీ చేసే ప్రతిపాదనను ఏపీ క్యాబినెట్ మార్చి 8న ఆమోదించింది. అలాగే అల్లూరి సీతారామరాజు చింతపల్లి మండలం ఎర్రవరంలోని జలపాతం వద్ద 1200 మెగావాట్ల ప్రాజెక్టుల షీర్డిసాయి ఎలక్ట్రికల్స్‌కు అప్పగించారు.ఎర్రవరంలో 736 ఎకరాలు,ఈప్రాజెక్టులు కోసం కావాలని లెక్కలు తేల్చారు.
ఈప్రాజెక్టులపై గిరిజనులు,గిరిజన సంఘాలు వ్యతిరేకిస్తున్నా ఎన్డీయే ప్రభుత్వ క్యాబేనేట్లో ఆమోదించడం శోచనీయం.ఒకపక్క గిరిజన చట్టాలను గౌరవిస్తున్నామంటూ ప్రకటిస్తూనేచాపకింద నీరులా వారి హక్కులకు కూటమీ ప్రభుత్వం పాతర వేస్తోంది.స్వర్ణాంధ్ర 2047విజన్ డాక్యుమెంట్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన వివిధ పాలసీల్లోనూ ఏజెన్సీ ప్రాంతాల్లో వివిధ పరిశ్రమలను,టూరిజం ప్రాజెక్టులను ఏర్నాటు చేసే అంశాన్ని ప్రస్తావించిన సంగతి తెలిసిందే! పార్వతీపురం మన్యం జిల్లాలో పాచిపెంట మండలంలోని బొదురుగడ్డ నదిపై కురుకుర్తిలో 1200 మెగావాట్లు,కర్రివలసలో 1000మెగావాట్ల సామధ్యరం గల ప్రాజెక్ట్‌లను ఏర్పాటు చేసేందుకు అదానీ కంపెనీకి అప్పగించింది.
ఏజెన్సీప్రాంతం రాజ్యాంగంలోని 5వషెడ్యూల్ కిందకు వస్తుంది.అటవీ హక్కులచట్టం ప్రకారం అటవీ భూమి లేదా అటవీనివాసుల హక్కులను ప్రభావితంచేసే ప్రాజెక్టులపై సంబంధిత గ్రామసభల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని చట్టాలు చెబుతున్నాయి.అయితే,రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న పిఎస్పి ప్రాజెక్టుల గురించి అక్కడ నివసిస్తున్న గిరిజనులకు ఏమాత్రం సమాచారం ఉండటంలేదు.గత ప్రభుత్వ హయంలో ప్రతిపాదించిన ప్రాజెక్టులతో పాటు,తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్లో ఆమోదించిన నవయుగ ప్రాజెక్టు పరిస్థితి కూడా ఇంతే! తమకు ఏమాత్రం సమాచారం లేకుండా ప్రతిపాదనలు సిద్ధమౌతుండటం పట్ల ఈ ప్రాంతంలో ఆశ్చర్యం,ఆగ్రహం వ్యక్తమవుతోంది.గిరిజన ప్రాంతాల్లో ప్రైవేట్ సంస్థలకు అనుమతి లేదంటూ సమత కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.గిరిజన ప్రాంతాల్లో భూమిని సేకరించే ముందు తప్పనిసరిగా కొన్ని చట్టాలను పరిగణలోకి తీసుకోవాల్సిఉంది.
ఏజెన్సీ ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్‌యాక్ట్ (1/70),పంచాయతీరాజ్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్ (పెసా)యాక్ట్,పర్యావరణ పరిరక్షణ చట్టం(1986),అటవీ (సంరక్షణ) చట్టం (1980),వన్యప్రాణ సంరక్షణ చట్టం (1972),జల (కాలుష్య నియంత్రణ,నిరోధక) చట్టం (1974),పర్యావరణ ప్రభావ అంచనా నోటిఫికేషన్ (2006),అటవీహక్కుల పరిరక్షణ చట్టం (2006),జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ చట్టం (2010),వాయు (కాలుష్య నియంత్రణ,నిరోధక) చట్టం1981వంటి చట్టాలను ప్రభుత్వాలు తుంగలోకి తొక్కి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నాయి. ఇప్పటికైన గిరిజన మేథావులు,గిరిజన నాయకులు అప్రమత్తం కావాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది.! -రెబ్బాప్రగడ రవి ,ఎడిటర్