పాలకుల నిర్లక్ష్యం…ఆదివాసీలకు శాపం

‘‘ ఆక్రమిత అటవీ భూముల నుంచి ఆదివాసీలను, ఇతర సంప్రదాయ అటవీ నివాసితులను(ఓటీఎఫ్‌డీ) తొలిగించే విషయంపై ఆయా రాష్ట్రాలకు సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీచేయడం గిరిజనులలో కలకలం రేపుతున్నది. అటవీ హక్కు చట్టం-2006 కింద భూ యాజమాన్య హక్కు దరఖాస్తులు తిరస్కరణకు గురైన ఆదివాసీలను, ఓటీఎఫ్‌డీలను అటవీ ప్రాంతం నుంచి తొలిగించాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా 21 రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ జరిగే జూలై 17లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టంచేసింది ’’- గునపర్తి సైమన్‌
అటవీ భూములపై హక్కులు లేకుండా అక్రమంగా నివసిస్తున్న వారిని ఖాళీ చేయించాలని ఆదేశిస్తూ ఫిబ్రవరి13వ తేదీన తను ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. అటవీ హక్కుల చట్టం(ఎఫ్‌ఆర్‌ఏ)2006 కింద అటవీ భూముల హక్కుల కోసం చేసుకున్న దరఖాస్తు తిరస్కరణకు గురైన దాదాపు 11.8 లక్షల మందిని ఖాళీ చేయించాలని సుప్రీంకోర్టు నాటి ఆదేశాల్లో పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌పై జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా నేత ృత్వంలోని ధర్మాసనం గురువారం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, దరఖాస్తుల తిరస్కరణ ప్రక్రియలో పాటించిన విధివిధానాలపై ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సహా 16 రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు నాలుగు నెలల్లోగా అఫిడవిట్‌ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. అటవీ హక్కుల కోసం చేసుకున్న దరఖాస్తులు భారీ సంఖ్యలో తిరస్కరణకు గురయ్యాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో వాటన్నింటినీ పరిశీలించి అఫిడవిట్లు సమర్పించాలని కోరింది.
అటవీ హక్కుల చట్టం-2006 ప్రకారం 2005 డిసెంబరుకు ముందు నుంచి అడవుల్లో నివసిస్తున్న గిరిజనులు, మూడు తరాలుగా(75ఏళ్లు) అక్కడే నివసిస్తున్న ఇతర సంప్రదాయ తెగలు వారి వారి భూములపై హక్కులు పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలి. అయితే, ఇలా చేసుకున్న దరఖాస్తుల్లో కేవలం 44.83 శాతం మాత్రమే ఆమోదం పొందాయి. ఆచరణయోగ్యం కాని గడువు, తగిన సమాచారం లేకపోవడం, రాష్ట్రస్థాయి పర్యవేక్షణ కమిటీలు సమావేశాలు నిర్వహించకపోవడం, జిల్లా యంత్రాంగం నుంచి తగిన సహకారం అందకపోవడం వంటి కారణాల వల్ల ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయన్న ఫిర్యాదులు వచ్చాయి. ప్రక్రియ సవ్యంగా సాగక పోవడం వల్లే హక్కుదారులు పత్రాలు పొందలేకపోయారన్న ఆరోపణ లున్నాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి13 నాటి సుప్రీంకోర్టు ఉత్తర్వు లక్షలాది మంది గిరిజనులపై ప్రభావం చూపుతోందని, అటవీ హక్కుల కోసం చేసుకున్న దరఖాస్తులను విధిగా గ్రామసభలు, రాష్ట్ర యంత్రాంగం పరిశీలించాయా? లేదా ? అన్న అంశాలను చూడాల్సిన అవసరం ఉందని కేంద్రం చేసిన అభిప్రాయంతో ధర్మాసనం ఏకీభవించింది. అటవీ హక్కులు లేనివారిని ఖాళీ చేయించే ముందు ప్రక్రియ సవ్యంగా సాగిందా లేదాఅనే అంశంలో రాష్ట్రాలు తగిన అఫిడవిట్‌ సమర్పించాల్సిన అవసరం ఉందని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా నివేదించారు. ‘గిరిజనులను ఖాళీ చేయించే ప్రక్రియ ను నిలిపివేయాలి. నిరుపేదలు, నిరక్షరాస్యులుగా ఉన్న గిరిజనులు తమ అటవీ హక్కులపై తగిన ఆధారాలు పొందలేకపోయి ఉండొచ్చు. ప్రక్రియ అమలుపై తగిన సమాచారం లేకుండా వారిని తొలగించడం వారికి అన్యాయం చేయడమే అవుతుంది’అని నివేదించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ తిరస్కరణకు గురైన దరఖాస్తులను సమీక్షించేందుకు యంత్రాంగం ఎందుకు లేదని ప్రశ్నించింది. ‘తిరస్కరణకు గురైన దరఖాస్తుల వివరాలు సమర్పించాలని 2016లో రాష్ట్ర ప్రభుత్వాలను కోరగా ఇప్పటిదాకా స్పందించలేదు. మేం ఉత్తర్వులిచ్చాక మాత్రమే వాటిని సరిచేయాలంటూ అడుగుతోంది. ఇప్పడు ప్రస్తావించిన అంశాలను గతంలో ఎందుకు లేవనెత్తలేదు. ఇంతకాలం ఎందుకు నిద్రపోయింది’అని ప్రశ్నించింది. సంప్రదాయ హక్కులు కలిగిన గిరిజనుల అటవీ భూములను గొప్పవ్యక్తులు’ఎవరూ ఆక్రమించరాదని కోర్టు పేర్కొంది. పిటిషనర్‌ అయిన వైల్డ్‌ లైఫ్‌ ఫస్ట్‌ స్వచ్ఛంద సంస్థ తరపున సీనియర్‌ న్యాయవాది శ్యాం దివాన్‌ వాదనలు వినిపిస్తూ వాస్తవికమైన లక్షలాది దరఖాస్తులకు న్యాయం జరిగిందని వివరించారు. మొత్తం 42,24,951 దరఖాస్తులు రాగా 18,94,225 పట్టాలు పంపిణీ అయినట్టు వివరించారు. తదుపరి విచారణను ధర్మాసనం జూలై 10వతేదీకి వాయిదావేసింది. అటవీ హక్కుల చట్టం అమలుపై ఇటీవల సుప్రీంకోర్టు జారీచేసిన మధ్యంతంఉత్తర్వులు ఆదివాసీలకు, తరతరాలుగా అడవుల్లో నివసిస్తున్న నిరుపేదలకు పిడుగుపాటు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సహా దేశంలోని 21రాష్ట్రాల్లో అడవులనే నమ్ముకొని జీవనం సాగిస్తున్న 23.30 లక్షల గిరిజన, గిరిజనేతర కుటుంబాలనుకోర్టు ఆర్డర్‌ తీవ్రఆందోళనకు గురి చేసింది. యుపిఎ-1ప్రభుత్వ హయాంలో 2006లో తీసుకొచ్చిన అటవీహక్కుల చట్టం అమల్లో భాగంగా ఆదివాసీలు తమఅధీనంలో ఉన్న భూములను గుర్తించివాటిపై యాజమాన్య హక్కులు కల్పిం చాలని దరఖాస్తులు పెట్టుకున్నారు. ఆవిధంగా పెట్టుకున్న అర్జీలను తిరస్కారానికి గురయ్యాక కూడా ప్రభుత్వాలు ఇంకా వారిని భూముల నుంచి ఖాళీ చేయించలేదన్నది కేసు వేసిన ‘వైల్డ్‌ లైఫ్‌ఫస్ట్‌’ సంస్థ అభియోగం. విచారించిన న్యాయస్థానం అర్జీలు తిరస్కరించినా ఇంకా భూముల్లో ఉన్న వారిని ఖాళీ చేయిం చాలని రాష్ట్రాలను ఆదేశించింది. కేసు వాయిదా తేదీని జులై 24గా పేర్కొని ఆలోపు గిరిజనులను, గిరిజనేతరులను భూము లనుంచి ఖాళీ చేయిం చాలని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శు లను ఆదేశించింది. కోర్టుఆదేశాల అమలు దిశగా రాష్ట్రాలు అడుగులేస్తుండటంతో గిరిజనుల్లో భయోత్పాతాలు బయలు దేరాయి. కోర్టుకేసు వేసిన వారి కోణంలో అటవీ హక్కుల చట్టం అమలును చూసింది తప్ప పూర్వాపరాల జోలికి పోలేదనిపిస్తుంది. అందుక్కారణం కేంద్ర ప్రభుత్వమే. కేసు వేసిన వారు అటవీశాఖలో పని చేసిన మాజీ అధికారులు. చట్టంలో లొసుగులను ఆమూలాగ్రం ఔపోసన పట్టినవారు. వన్యప్రాణుల సంరక్షణ ముసుగులో ఆదివాసీలను, అటవులనే నమ్ముకున్న ఇతర పేదతరగతులను భూముల నుంచి వెళ్లగొట్టి ప్రైవేటు కంపెనీలకు, కార్పొరేట్లకు ధారాదత్తం చేయాలన్న కుట్ర ఈకేసు వెనుక దాగుందనిపిస్తుంది. సహజ వనరుల దోపిడీకి కార్పొరేట్లకు అవకాశం కల్పించేలా చట్టాలను మారు స్తూ విధానాలను రూపొందిస్తున్న మోడీసర్కారు కోర్టులో అంటీముట్టనట్లు వ్యవహరించింది. గిరిజన సంక్షేమ వ్యవహారాలు చూసే మంత్రిత్వశాఖకు కాకుండా అటవీ శాఖకు కేసు బాధ్యత అప్పగించింది. కేసు విచారణ సమ యంలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి గైర్హాజరయ్యారు. దీంతో న్యాయస్థానం కేసు వేసినవారికి అనుకూలంగా ఉత్తర్వులిచ్చింది. వాజ్‌పేయి సర్కారు 2002లో లక్ష లాది మంది ఆదివాసీలను అడవుల నుంచి వెళ్లగొడుతూ ఉత్తర్వులి చ్చింది. ఆపూర్వరంగంలో చూసినప్పుడు ప్రస్తుత మోడీ ప్రభుత్వం కూడా గిరిపుత్రుల హక్కులకు ఉద్దేశపూర్వ కంగానే హాని తలపెట్టిందని అర్థమవుతోంది. యుపిఎ-1ప్రభుత్వ సమయంలో ప్రజాసంఘాల కృషితో గిరిజనుల అధీనంలోని భూములపై వారికే హక్కులు కల్పిం చేందుకు అటవీ హక్కుల చట్టం వచ్చింది. చట్టమైతే వచ్చింది కాని పూర్తి స్థాయిలో ఆచరణాత్మకం కాలేదు. గిరిజనులకు హక్కులు కల్పిం చాల్సిన రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కొర్రీలు వేసి సాంకేతికాంశాలతో లక్షలాది దరఖాస్తులను పరిష్కరించకుండా ఏళ్లుపూళ్లు గడుపు తున్నాయి. అటవీ హక్కుల చట్టం కోసం పోరాడిన గిరిజనులు చట్టం అమలు కోసం పోరాటాలు చేయాల్సి వచ్చింది. రాజ్యాంగం ప్రకారం గ్రామసభలు నిర్వహించి గిరిజనుల అర్జీలను పరిష్కరించాలి. అక్కడ తేలకపోతే రాష్ట్ర స్థాయి వరకు వివిధ స్థాయిల్లో అప్పీలు చేసుకోవచ్చు. ప్రభుత్వాల్లో గిరిజన వ్యతిరేకత గూడుకట్టు కోవడంతో అటవీ భూములపై హక్కుల కోసం గిరిపుత్రులు న్యాయ స్థానాలను సైతం ఆశ్రయించాల్సి వస్తోంది. నిరుడు డిసెంబర్‌ నాటికి భూములపై హక్కు ల కోసం దేశవ్యాప్తం గా42 లక్షల అర్జీలు అందితే 18లక్షలు మాత్రమే (40శాతం) పరిష్క రించారు. పరిష్కరించా రంటున్న వాటిలో తిరస్కరించినవి కూడాఉన్నాయి. ఎ.పిలో1.14లక్షల ఎకరాలకు సంబంధించి 66, 351 అర్జీలను తిరస్కరించారు. సుప్రీం ఆర్డర్‌ అమలు చేస్తే ఆమేరకు గిరిజనులు భూములను కోల్పో యి నిరాశ్రయు లవుతారు. దేశంలో21రాష్ట్రాల్లో ఇదేపరిస్థితి. కోర్టు ఉత్తర్వులకు కేంద్ర ప్రభుత్వ అసమర్ధ వాదనలే కారణం. అందుకు ప్రాయశ్చిత్తంగా ఆర్డినెన్స్‌ తీసుకురావాలి. హడావుడిగా త్రిపుల్‌ తలాక్‌ పైన, మెడికల్‌ కౌన్సిల్‌ పైన ఆర్డినెన్సులు తేగలిగిన మోడీ ప్రభుత్వానికి దేశవ్యాప్తంగా లక్షలాది గిరిజనులు నిరాశ్రయులు కాకుండా నిలవరించడానికి ఒక ఆర్డినెన్సు తేవడం అసాధ్యంకాదు. కాకుంటే ప్రాయ శ్చిత్తం చేసుకునే నిజాయితీ మోడీ ప్రభుత్వానికి ఉన్నదా అన్నదే సందేహం. ఆంధ్ర ప్రదేశ్‌లో కూడా లక్షలాది గిరిజన కుటుంబాలు నిరాశ్రయులు కాను న్నాయి. వీరిలో ఎక్కువశాతం పోలవరం నిర్వాసి తులే. వారికి అటవీ హక్కుల పట్టాలు ఇవ్వకుండా నష్టపరిహారాన్ని, పునరావాసాన్ని నిరాక రించే దుష్ట తలంపుతోనే రాష్ట్రంలో 66వేల మంది క్లెయిములను తిరస్కరించారు. ఇప్పుడీసుప్రీం ఆదేశాలను అడ్డం పెట్టుకుని వారం దరినీ బలవం తంగా ఖాళీ చేయించేందుకు సైతం వెనకాడరు. ఈవిష యమై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వకుండా తాత్సారం చేసి ఎన్నికల పబ్బం గడుపుకునే యోచన కూడా చేయవచ్చు. చైతన్యవం తమైన ప్రజా ఉద్యమ ఆవశ్యకతను ప్రస్తుత పరిస్థితి సూచిస్తోంది.
నేరం ప్రభుత్వాలది-శిక్ష ఆదివాసీలకా
దేశం మొత్తంపై 21 రాష్ట్రాల్లో 42.19 లక్షల మంది పట్టాల కోసం దరఖాస్తు చేసుకుంటే 18.89 లక్షల మందికే పట్టాలు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో 66,350, తెలంగాణలో 80,000, గుజరాత్‌లో 1,82,869, కర్నాటకలో 1,76,540 దరఖాస్తులు తిరస్కరించారు. కేరళలో వామపక్ష ప్రభుత్వం మాత్రమే ఆదివాసీలకు అనుకూలంగా దరఖాస్తులు పరిష్కరించింది. మొత్తం 39,999 దరఖాస్తుల్లో 894 మాత్రమే తిరస్కరించింది. అధికారంలో ఉన్న ప్రభుత్వాలు, అధికార యంత్రాంగం ఆదివాసీలకు వ్యతిరేకమైనప్పుడు చట్టం ఎలా అమలు జరుగుతుంది? కేరళ వామపక్ష ప్రభుత్వం 99 శాతం దరఖాస్తుదార్లకు పట్టాలు ఇవ్వడం ద్వారా ఆదివాసీల వాస్తవ హక్కులను గుర్తించింది కదా! ఆదివాసీలు సాగు చేస్తున్న భూమికి పట్టాలు ఇవ్వాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలే. ప్రభుత్వమే అన్యాయంగా వ్యవహరిస్తుంటే ఆదివాసీలకు హక్కు పత్రాలు ఎలా వస్తాయి? ఎవరి హక్కు పత్రం వారే రాసుకునే అవకాశం లేదు కదా? కేంద్ర ప్రభుత్వం తరపున న్యాయవాది/అధికారి కోర్టుకు హాజరై వాస్తవ పరిస్థితులను వాదనకు పెట్టి ఉంటే కోర్టు తీర్పు మరోలా వచ్చి ఉండేదేమో? కీలక సమయంలో కేంద్ర ప్రభుత్వం కోర్టుకు గైర్హాజరై ఆదివాసీ వ్యతిరేకులైన పదవీ విరమణ చేసిన అటవీ అధికార్ల వాదన నెగ్గేందుకు సహకరించింది. బిజెపి ఆదివాసీ వ్యతిరేకినని రుజువు చేసుకుంది.
అనాదిగా ఆదివాసీలకు అన్యాయం
ఆదివాసీలకు చారిత్రకంగా జరిగిన అన్యాయాన్ని సరిదిద్దు తున్నట్లు 2006 అటవీ హక్కుల చట్టం భాష్యం చెప్పింది. మైదానాల్లో ఎవరు సాగు చేసుకున్న భూమి వారికి దఖలుపర్చిన ప్రభుత్వాలు ఆదివాసీలకు అడవిపై హక్కును ఇవ్వకుండా తరతరాలుగా అన్యాయం చేస్తూ వచ్చాయి. నాటి రాజులు, అనంతరం బ్రిటిష్‌ పాలకులు, స్వాతం త్య్రం అనంతరం ఏర్పడిన ప్రభుత్వాలు అడవి మీద ఆధారపడి జీవిస్తున్న ఆదివాసీలను దురాక్రమణదారులుగానే పరిగణించాయి. నేడు వారిని ఏకంగా అడవి నుండి గెంటివేస్తున్నారు. 5వ షెడ్యూల్డ్‌ ఏరియాలో రాజ్యాంగం, పీసా చట్టం భూమికి సంపూర్ణ రక్షణ కల్పించి నప్పటికీ మోడీ ఉల్లంఘించి కార్పొరేట్లకు ఇచ్చేశారు. పోలవరం ప్రాజెక్టులో వేలాది ఎకరాల అటవీ భూమి మునిగిపోతుంది. రాజధాని నిర్మాణానికి 50వేల ఎకరాల అటవీ భూమి కావాలని చంద్రబాబు అడగడం, కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించడం అందరికీ తెలిసిందే. తక్షణమే ఆదివాసీ హక్కులను రక్షిస్తూ కేంద్రం ఆర్డినెన్సు తేవాలని, రాష్ట్రంలో ఆదివాసీలు చేసుకున్న దరఖాస్తులకు హక్కు పత్రాలు 27.7.2019లోపు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని ఆదివాసీలంతా ఉద్యమించాలి.
అడవి బిడ్డలకు ఊరటనిచ్చిన సుప్రీం స్టే
అటవీ ప్రాంతాల నుండి ఆదివాసీలను తొలగించాలన్న ప్రభుత్వ ఆదేశాలపై సుప్రీం కోర్టు ఫిబ్రవరి 21న (గురువారం) స్టే ఇచ్చింది. సుప్రీం కోర్టు తీర్పు అడవి బిడ్డలకు ఊరటనిచ్చింది. 11.8 లక్షల ఆదివాసీలను తొలగించాలని ఫిబ్రవరి 13వ తేదీన కేంద్ర ప్రభుత్వం 21 రాష్ట్రాలకు ఇచ్చిన ఆదేశాలను సుప్రీం కోర్టు ఈ రోజు నిలిపేసింది. అడవి బిడ్డల వాదనలను తోసిపుచ్చుతూ అవలంబించిన కేంద్ర ప్రభుత్వ విధానాలను వివరంగా అఫిడవిట్‌ లో దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఆదివాసీలను అడవుల నుండి తొలగించాలని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను నిలుపుదల చేయాలని కోరుతూ.. దాఖలైన పిటిషన్‌ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ తీర్పు చెప్పింది. ఇన్నేళ్లుగా నిద్ర పోతున్నందుకు కేంద్ర ప్రభుత్వాన్ని మందలించింది. కేంద్ర ప్రభుత్వం తరఫున జాప్యం జరిగిందని సాలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా అంగీకరించడంతో మీరు ఇప్పుడే నిద్ర లేచారా.. అని కేంద్ర ప్రభుత్వంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీం కోర్టులో రాష్ట్రాలు దాఖలు చేసిన అఫిడవిట్ల ప్రకారం.. షెడ్యూల్డ్‌ తెగలు, అటవీ హక్కుల చట్టం కింద ఇతర సంప్రదాయ అటవీ నివాసులతో సుమారు 11,72,931 (1.17 మిలియన్‌) ఎకరాల భూమి, భూ యాజమాన్యం హక్కుల వాదనలు, వివిధ కారణాలపై తిరస్కరించబడ్డాయి. ఈ భూమి కనీసం మూడు తరాల నుండి వారి స్వాధీనంలో ఉన్నట్టు నిరూపించలేక పోయినవారు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు తమ సొంత చట్టాల ప్రకారం.. ఆ భూములను ఖాళీ చేయించాలని ఫిబ్రవరి 13 న జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, జస్టిస్‌ నవీన్‌ సిన్హా, జస్టిస్‌ ఇందిరా బెనర్జీల బెంచ్‌ ఆదేశించింది.

అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ల అమలు సాధ్యమేనా..!

‘‘ రిజర్వేషన్లు అనేవి ప్రజలలో కొన్ని వర్గాల అభివృద్ధికి పభుత్వం వారు ఇచ్చే మినహాయింపులు, కేటాయింపులు. ఎన్నికలు, విద్య, ఉపాధికి గల అవకాశాలలో కుల,మత,ప్రాంతము,లింగం,శారీరక మానసిక బలహీనత, సైన్యవర్గానికి చెందిన అనే రకరకాల ప్రాతిపదికలపై రిజర్వేషన్లకి సంబంధించి, రాజ్యాంగంలో, చట్టసభలు చేసిన చట్టాలున్నాయి’’ – జి.ఎన్‌.వి.సతీష్‌

అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు వర్తింప చేయా లని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వార్షికఆదాయం రూ.8 లక్షలలోపు ఉన్న అగ్ర వర్ణాలకు విద్య, ఉద్యోగాల్లో పదిశాతం రిజర్వేషన్లను అమలు చేసే ప్రతి పాదనకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 15,16లను అనుసరించి సామాజికంగానూ, విద్యాపరంగానూ వెనకబడిన వర్గాలకు విద్యా, ఉద్యోగాలలో ప్రాధాన్యం కల్పించే ఉద్దేశంతో రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. అయితే, గత కొన్నేళ్లుగా అనేక కులాలు తమకూ రిజర్వేషన్లు అమలు చేయాలంటూ, మరికొన్ని కులాలు తమ రిజర్వేషన్ల కోటా పెంచాలంటూ ఉద్యమాలు చేస్తున్నాయి. అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్‌ చాలా ఏళ్లుగా వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో కాపు, గుజరాత్‌లో పటేళ్లు, మహారాష్ట్రలో మరాఠాలు, రాజస్థాన్‌లో జాట్‌లు ఇలా చాలా రాష్ట్రాల్లోని అగ్రవర్ణాలు రిజర్వేషన్ల కోసం డిమాండ్‌ చేస్తున్నాయి.
అగ్రకులాల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్లు: కేంద్ర కేబినెట్‌ ఆమోదం రిజర్వేషన్లు పదేళ్ళు మాత్రమే ఉండాలని అంబేడ్కర్‌ నిజంగానే అన్నారా? రిజర్వేషన్లు 50 శాతం మించొద్దు. సామాజికంగా, ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు దేశంలో రిజర్వేషన్లను అమలు చేస్తున్నారు.
ప్రస్తుతం షెడ్యూల్డ్‌ కులాలకు 15 శాతం, షెడ్యూల్డ్‌ తెగలకు 7.5శాతం, ఇతర వెనకబడిన వర్గాలకు 27శాతం మొత్తంగా 49.5శాతం రిజర్వేషన్లను విద్యా, ఉద్యోగాలలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. 1991లో పీవీ నర్సింహారావు ప్రభుత్వం అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్లు కల్పించాలని ప్రతిపాదించింది. కానీ, అది కార్యరూపం దాల్చలేదు. రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని గతంలో సుప్రీంకోర్ట్‌ తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో సుప్రీం తీర్పును అధిగమించి కేంద్రం ఏ విధంగా రిజర్వేషన్లను అమలు చేస్తుందనేది కీలకంగా మారింది.
అమలు ఎలా :
ఇప్పటికే వివిధ వర్గాలకు అమలు చేస్తున్న రిజర్వేషన్లలలో కోత విధించి 50 శాతం మించకుండా అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తారా? లేక సుప్రీం తీర్పును అధిగమించి రిజర్వేషన్లను 60 శాతానికి తీసుకెళ్తారా? అనేది ఇంకా స్పష్టం కాలేదు. అయితే, అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు అమలు చేయాలంటే మొదట ఆర్టికల్‌ 15, 16లను సవరించాల్సి ఉంటుందని పొలిటికల్‌ సైన్స్‌ నిపుణులు ప్రొఫెసర్‌ ప్రభాకర్‌ రెడ్డి భావిస్తున్నారు. రాజ్యాంగ సవరణ చేసి ఆ చట్టాన్ని 9వ షెడ్యూల్‌లో పెట్టాలని తెలిపారు. ‘’ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం 50 శాతానికి మించి రిజర్వేషన్లను అమలు చేస్తోంది. అక్కడ 69 శాతం రిజర్వేషన్లు అమలులో ఉన్నాయి. 50 శాతానికి మించి రిజర్వేషన్లు పెంచరాదని ఇచ్చిన సుప్రీం తీర్పును అధిగమించేందుకు తమిళనాడు రిజర్వేషన్ల చట్టాన్ని 76వ రాజ్యాంగ సవరణ ద్వారా 9వ షెడ్యూల్డ్‌లో చేర్చారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే మార్గాన్ని అనుసరించాలి’’ అని ఆయన వివరించారు.
రాజ్యాంగ సరవణ ఎలా ?
రిజర్వేషన్ల అమలు కోసం పార్లమెంటు ప్రత్యేక మెజారిటీ ద్వారా రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. పార్లమెంట్‌ ఉభయ సభల్లో హాజరై ఓటు వేసిన వారిలో 2/3వ వంతు సభ్యులు ఆమోదిస్తేనే కేంద్రం తీసుకొచ్చే బిల్లు చట్టంగా మారుతుంది. ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వానికి లోక్‌సభలో సంఖ్యాబలం ఉండటంతో రాజ్యసభలో కూడా ఈ బిల్లు ఆమోదం పొందింది.
9వ షెడ్యూల్‌ ఏమిటి?
1951లో మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా 9వ షెడ్యూల్‌ తీసుకొచ్చారు. కోర్టుల పరిధిలోకి రాని కేంద్ర, రాష్ట్రాలు జారీ చేసే చట్టాలను ఈ షెడ్యూల్‌లో చేర్చడానికి అవకాశం కల్పించారు. అంటే ఏదైనా అంశాన్ని 9వ షెడ్యూల్లో చేర్చడం ద్వారా దానిని న్యాయ సమీక్ష నుంచి మినహాయించే అవకాశం కల్పించారు. అందుకే తమిళనాడు రిజర్వేషన్ల చట్టాన్ని ఈ షెడ్యూల్‌ కిందకు తీసుకొచ్చి రక్షణ కల్పించారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే తరహాలో అగ్రవర్ణ పేదల రిజర్వేషన్ల చట్టాన్ని అమలు చేసే అవకాశం ఉంది. అయితే, సుప్రీం కోర్టు గతంలో అనేక సార్లు 9వ షెడ్యూల్‌ను కూడా న్యాయసమీక్ష పరిధిలోకి తేవాలని పేర్కొంది. మౌలిక సూత్రాలకు భంగకరమని భావిస్తే 9వ షెడ్యూల్‌లో చేర్చిన అంశాలనూ సమీక్షిస్తామని పలు కేసుల విచారణంలో సుప్రీం పేర్కొంది. ఐఆర్‌ కోయెల్‌హో వర్సెస్‌ తమిళనాడు కేసులో 2007లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ వైకే సభర్వాల్‌ నేత ృత్వంలోని ధర్మాసనం 9వ షెడ్యూలులో చేర్చిన చట్టాలు న్యాయసమీక్షకతీతం కాదని స్పష్టం చేసింది. ఆ చట్టాలు రాజ్యాంగ మౌలిక సూత్రాలకు భంగకరంగా ఉంటే సమీక్షించవచ్చని పేర్కొంది. కేశవానంద భారతి వెర్సెస్‌ స్టేట్‌ అఫ్‌ కేరళ కేసులో ‘’ 1950 నుంచి 1973 వరకు 9 వ షెడ్యూల్లో చేర్చిన చట్టాలకు మాత్రమే న్యాయ సమీక్ష నుంచి మినహాయింపు ఉందని, దీని తర్వాత చేర్చినా ఏ చట్టమైన న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తుంది’’ అని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది.
అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ల అమలపై …. ఎవరేమంటున్నారు?
‘సమానత్వ భావన సాకారం అవుతుంది’
రాజ్యాంగం పేర్కొన్న సమానత్వ భావన సాకారం కావాలంటే కాలానుగుణంగా రిజర్వేషన్లను మార్చాలని ఉస్మానియా యూనివర్సిటీ న్యాయవిభాగం అధిపతి వేంకటేశ్వర్లు చెప్పారు. ‘కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మంచి పరిణామంగానే చెప్పుకోవాలి. మొదట ఎస్సీ,ఎస్టీలకే రిజర్వేషన్లు అమలు చేశారు. ఆ తర్వాత 1990లలో బీసీలకు రిజర్వేష్లను వర్తింప చేశారు. కాలానుగుణంగా రిజర్వేష్లను కూడా మారాలి. అప్పుడే రాజ్యాంగం చెప్పిన సమానత్వం అనే భావన నిజం అవుతుంది’ అని ఆయన అన్నారు.
మాకు దక్కేదేమీ లేదు’
అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం వల్ల కాపులకు దక్కేదేమీ లేదని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. ఆయన విలేకర్లతో మాట్లాడూతూ, ‘కాపులను బీసీల జాబితాలో చేర్చి 5శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని మేం పోరాటం చేస్తున్నాం. కేంద్ర నిర్ణయం వల్ల మాకు ఏ ప్రయోజనం లేదు. అగ్రకుల రిజర్వేషన్ల జాబితాలో కాపులను చేర్చితే వచ్చే ఉపయోగమూ లేదు ‘ అని పేర్కొన్నారు. అగ్రవర్ణపేదలకు రిజర్వేషన్లు అమలు చేయాలన్న కేంద్రం నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య అభిప్రాయపడ్డారు.
‘’సామాజికంగా, ఆర్థికంగా అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు అమలు చేయాలని రాజ్యాంగం చెబుతుంటే కేంద్రం అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు అమలు చేయాలని చూడటం సరికాదు. సుప్రీం కోర్ట్‌ కూడా 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేయొద్దని తీర్పునిచ్చింది. ఈ తీర్పును ఉల్లఘించి కేంద్రం రాజ్యాంగ సవరణ చేస్తే అది రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధం అవుతుంది. అణగారిన వర్గాల రిజర్వేషన్లను సవరించడం ద్వారా రిజర్వేషన్లను బలహీనం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది’ అని ఆయన పేర్కొన్నారు.
ఇది చరిత్రాత్మక నిర్ణయం
అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకం అని ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కరుణాకర్‌ రెడ్డి తెలిపారు.‘ఈ నిర్ణయం వంద శాతం అమలవుతుందని ఆశిస్తున్నాం. దీని వల్ల దేశంలో ఉన్న కోట్లాది మంది అగ్రవర్ణ పేదలకు లబ్ధి చేకూరుతుంది. సామాజిక వివక్షే కాదు, ఆర్థిక వెనకబాటును ప్రాతిపాదికను తీసుకొని రిజర్వేషన్లు ఇవ్వాలని మేం ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్నాం. అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లతో పాటతు జాతీయ కార్పొరేషన్‌ కూడా ఏర్పాటు చేయాలి. అప్పుడే రిజర్వేషన్ల ఉద్యమాలు బలహీన పడతాయి’ అని ఆయన పేర్కొన్నారు.
రిజర్వేషన్లు ఎందుకు.. ఎలా?
దేశంలో రిజర్వేషన్లపై పెద్ద చర్చే జరుగుతోంది. తాజాగా కేంద్రం అగ్రవర్ణ పేదలకు (ఈడబ్ల్యూఎస్‌) 10% రిజర్వేషన్‌ కల్పించాలని నిర్ణయించిన నేపథ్యంలో.. రిజర్వేషన్లు ఎందుకు వచ్చాయి? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతశాతం రిజర్వేషన్లను అమలుచేస్తున్నాయి? అనేవి ఆసక్తికర పరిణామాలు.
రాజ్యాంగం ఏం చెప్పింది?
అంటరానితనం కారణంగా అనాదిగా నిరాదరణకు, వివక్షకు గురవుతున్న ఎస్సీ,ఎస్టీ, వెనుకబడిన తరగతుల అభ్యున్నతి కోసం ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాలని భారత రాజ్యాంగం నిర్దేశించింది.
ఎవరికి రిజర్వేషన్లు ఇచ్చారు?
అణగారిన వర్గాలుగా భారత ప్రభుత్వం గుర్తించి, నిర్దేశించిన షెడ్యూల్డు కులాలు(ఎస్సీ), షెడ్యూల్డు తెగలు(ఎస్టీ), ఇతర వెనుకబడిన తరగతుల(ఓబీసీ)ల వారికి రిజర్వేషన్లు కల్పించారు. కొన్ని రాష్ట్రాల్లో ముస్లింలకూ బీసీ(ఎం/ఈ) కింద రిజర్వేషన్లు ఇచ్చారు. భారత రాజ్యాంగం, చట్టాలు, స్థానిక నియమ నిబంధనలు ప్రాతిపదికగా ఇవి అమల్లోకి వచ్చాయి.
స్వాతంత్య్రానికి పూర్వం ఎలా ఉండేది?
స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటీష్‌ ఇండియాలో కూడా కొన్ని కులాలు, వర్గాలకు కోటా విధానం ఉండేది. కొల్హాపూర్‌ సంస్థానాధీశుడు సాహూ బ్రాహ్మణేతరులు, వెనుకబడిన తరగతుల వారికి రిజర్వేషన్లను ప్రవేశపెట్టారు. 1902లో ఇది అమల్లోకి వచ్చింది. 1932లో జరిగిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో రిజర్వేషన్లకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. బ్రిటీష్‌ ప్రధాని రామ్సే మెక్‌డొనాల్డ్‌ ‘కమ్యూనల్‌ అవార్డ్‌’ను ప్రతిపాదించారు. దీని ప్రకారం ముస్లింలు, సిక్కులు, భారత క్రైస్తవులు, ఆంగ్లో ఇండియన్లు, యురోపియన్లు, అణగారిన వర్గాల వారికి ప్రత్యేక కోటా ప్రాతినిధ్యం కల్పించారు. దీన్ని గాంధీజీ వ్యతిరేకించగా.. అంబేడ్కర్‌ సమర్థించారు.
స్వాతంత్య్రానంతరం ఏం జరిగింది?
ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లకు సంబంధించి దేశ స్వాతంత్య్రానంతరం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. అణగారిన వర్గాల అభ్యున్నతికి భారత ప్రభుత్వం 1950లోనే కార్యాచరణ ప్రారంభించింది. ఎస్సీ, ఎస్టీల జనాభా ప్రాతిపదికన.. విద్యాసంస్థల్లో 20 శాతం సీట్లను ప్రత్యేకించాలని విద్యా మంత్రిత్వశాఖ అప్పట్లోనే ప్రతిపాదించింది. ఆ తర్వాత ప్రభుత్వ రంగం, ప్రభుత్వ నిధులతో నడిచే విద్యాసంస్థలతో పాటు, ఉద్యోగాల్లో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం ఖాళీలను జనాభా ప్రాతిపదికన రిజర్వ్‌చేశారు.
మండల్‌ కమిషన్‌ ఎందుకొచ్చింది?
దేశంలో సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల స్థితిగతుల్ని అధ్యయనం చేసి, సిఫార్సులు చేయడం కోసం 1979 జనవరి 1వ తేదీన అప్పటి మొరార్జీ దేశాయ్‌ నాయకత్వంలోని జనతాపార్టీ ప్రభుత్వం బి.పి.మండల్‌ నేత ృత్వంలో కమిషన్‌ను ఏర్పాటుచేసింది. ఓబీసీల జన సంఖ్య ఎంత అన్న గణాంకాలు అప్పటికి కమిషన్‌ వద్ద లేవు. దాంతో అది 1931 నాటి జనాభా లెక్కల్ని వినియోగించుకుని వారి జనాభా 52 శాతంగా నిర్ధారణకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వంలోని సేవలు, సంస్థల ఉద్యోగాల్లో బీసీలకు 27 శాతం రిజర్వేషన్‌ ఇవ్వాలని కమిషన్‌ సిఫార్సుచేసింది. ఉన్నత విద్యాసంస్థల్లో ఇదే రిజర్వేషన్ల అమలుకూ మార్పులు చేయాలని సూచించింది. దీనివల్ల కేంద్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీల మొత్తం రిజర్వేషన్లు 49.5%కి చేరుకున్నాయి. మండల్‌ సిఫార్సుల్ని అమలుచేస్తామని 1990లో వి.పి.సింగ్‌ ప్రభుత్వం ప్రకటించడంతో దేశవ్యాప్తంగా పెద్దఎత్తున విద్యార్థి ఉద్యమాలు చెలరేగాయి. అప్పటికి సుప్రీంకోర్టు తాత్కాలికంగా స్టే ఇచ్చినా.. ఆ తర్వాత రిజర్వేషన్ల అమలు మొదలైంది.
రిజర్వేషన్ల ఉద్దేశం?
అనాదిగా కుల వివక్ష, అసమానతలు, అవమానాల్ని ఎదుర్కొంటున్న వర్గాల వారికి తగిన న్యాయం చేయడం కోసం, సమానత్వ సాధన కోసం రిజర్వేషన్ల వ్యవస్థ మొగ్గతొడిగింది. అణగారిన వర్గాల విద్య, సామాజిక స్థితిగతుల్ని పెంపొందించి.. వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ఈ చర్య చేపట్టారు.
ఎక్కడెక్కడ?
ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగాలకు, ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాలకు, వివిధ చట్టసభల్లో సీట్లకు రిజర్వేషన్లు కల్పించారు.
సుప్రీంకోర్టు ఏం చెప్పింది?
రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ 50 శాతం మించకూడదని సుప్రీంకోర్టు 1992లో తేల్చిచెప్పింది. అలా దాటితే.. రాజ్యాంగం ప్రస్తావించిన సమానత్వ హక్కు ఉల్లంఘన జరిగినట్లేనని వ్యాఖ్యానించింది.
మారుతున్న ఆలోచనలు
ా వివక్ష నుంచి ఆర్థికానికి: రిజర్వేషన్లను రాజ్యాంగ నిర్మాతలు దేశంలో కొన్ని సామాజిక వర్గాలు ఎదుర్కొంటున్న సామాజిక ‘వివక్ష’, ‘నిరాదరణ’లకు విరుగుడుగా ముందుకు తెచ్చారనీ, కానీ కొంతకాలంగా ఈ రిజర్వేషన్లకు వివక్షను (డిస్క్రిమినేషన్‌) ప్రాతిపదికగా కాకుండా వెనకబాటుతనానికి (డిప్రైవేషన్‌) విరుగుడుగా చూడటం ఆరంభమవుతోందన్న వాదన వినపడుతోంది. పేదరికమన్నది రకరకాల వివక్షలకు దారితీసే మాట వాస్తవమే అయినా.. ఆ పేదరిక నిర్మూలనకు కేవలం వ్యవస్థాత్మకమైన రిజర్వేషన్లనే పరిష్కారంగా చూడలేమనీ, లేదా ఇప్పటికే ఉన్న పేదరిక నిర్మూలన విధానాలకూ ఇది ప్రత్యామ్నాయం కాదని పలువురు వాదిస్తున్నారు. వివక్షనూ, ఆర్థిక వెనకబాటునూ ఒక గాటన కట్టకూడదన్నది వీరి సిఫార్సు.
ా మినహాయింపు నుంచి విస్తరణకు: రిజర్వేషన్లన్నవి వాస్తవానికి ప్రాథమిక హక్కు అయిన ‘సమానత్వ హక్కు’కు ఒక ప్రత్యేకమైన మినహాయింపుగా ఆరంభమయ్యాయి. ఎస్సీ, ఎస్టీలు చిరకాలంగా ఎదుర్కొంటున్న సామాజిక వివక్షలను సరిదిద్దేందుకు, సమానత్వ సాధన కోసం రిజర్వేషన్ల విధానాన్ని ‘సమానత్వ హక్కు’కు ఒక మినహాయింపుగా ప్రతిపాదించారనీ, కానీ క్రమేపీ ఇది విస్తరణకు దారితీస్తోందని అంటున్నారు. దీన్ని ప్రత్యేక మినహాయింపుగా కాకుండా వెనకబాటుతనానికి విరుగుడుగా చూడటం వల్లే వివిధ సామాజిక వర్గాలు రిజర్వేషన్ల కోసం ఆరాటపడుతున్నాయి.
ఏ రాష్ట్రంలో ఎంత శాతం?
రిజర్వేషన్లు 50శాతానికి మించకూడదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పినటికీ..కొన్ని రాష్ట్రాలు స్థానిక జనాభాను దృష్టిలో ఉంచుకుని అంతకుమించి రిజర్వేషన్లు ఇస్తున్నాయి. కొన్నింటిపై కోర్టులు స్టే ఇచ్చాయి.్చ హరియాణా70శాతం : ఎస్సీ20శాతం, బీసీ ఏ16శాతం,బీసీ బీ11శాతం,ప్రత్యేక వెనుకబడిన తరగతులు 10శాతం, ఆర్ధికంగా వెనుకబడిన తరగతులు 10శాతం, వికలాంగులు3శాతం ్చ తమిళనాడు69శాతం : ఎస్సీ18శాతం, ఎస్టీలు27శాతం, ఏబీసీలు22శాతం ్చ రాజస్థాన్‌54శాతం : ఎస్సీలు16శాతం, ఎస్టీలు12శాతం, ఏబీసీలు26శాతం
్చ ఆంధ్రప్రదేశ్‌50శాతం :బీసీలు 29శాతం, ఎస్సీలుI15శాతం, ఎస్టీలు 6శాతం, (బీసీల కోటాలోనే ముస్లిం రిజర్వేషన్లు అమలు) ్చ తెలంగాణ50శాతం : బీసీలు 28శాతం, ఎస్సీలు15శాతం, ఎస్టీలు 6శాతం, (బీసీల కోటాలోనే ముస్లిం రిజర్వేషన్ల అమలు)
్చ ఈశాన్య రాష్ట్రాలు(అరుణచల్‌ ప్రదేశ్‌,మేఘాలయ, నాగాలాండ్‌,మిజోరం)(ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్టీ రిజర్వేషన్లు`80శాతం, ఇతరులకు 20శాతం
రిజర్వేషన్లు కల్పించవచ్చు :
ప్రజాభ్యున్నతి దృష్ట్యా కోటా ఇవ్వొచ్చు.. సమానత్వం ప్రాతిపదిక కావాలి.. విస్పష్టంగా చెప్పిన రాజ్యాంగం. రాజ్యాంగ స్ఫూర్తి సమానత్వమేనని, ఏ వర్గానికైనా అవకాశాల్లో ప్రాతినిధ్యం తగ్గిందని పార్లమెంటు నిరభ్యంతరంగా రిజర్వేషన్లు కల్పించవచ్చని రాజ్యాంగం స్పష్టం చేస్తోంది. అధికరణాలు 15, 16 ఈ విషయాన్ని విపులీకరించాయి.
ఆర్టికల్‌ 15 : (1) మతం, జాతి, కులం, ప్రాంతం, స్త్రీ-పురుష ప్రాతిపదికన ప్రజలపై వివక్ష చూపరాదు (2) మతం, జాతి, కులం, లింగ, ప్రాంత ప్రాతిపదికన ప్రజలను హోటళ్లు, సినిమా హాళ్లు, షాపింగ్‌ మాల్స్‌లోకి ప్రవేశాన్ని అడ్డుకోరాదు. వారిని భారంగా చూడరాదు. ఆంక్షలు పెట్టరాదు. ఊరిలో అందరూ ఉపయోగించే బావులు, చెరువులు, స్నాన ఘట్టాలు, ప్రజా వినోద, విలాస ప్రాంతాల్లోకి అనుమతిని నిషేధించరాదు. (3)ఈ ఆర్డికల్‌లోని అంశాలను ప్రాతిపదికగా చేసుకొని ప్రభుత్వం మహిళలు, పిల్లలకు పత్య్రేక సదుపాయాలు కల్పించవచ్చు. (4) సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల లేదా ఎస్సీలు, ఎస్టీల అభ్యున్నతికి ప్రభుత్వం తీసుకొనే ఏ చర్యనైనా ఈ అధికరణ అడ్డుకోరాదు. అంటే ఆయా వర్గాల అభివ ృద్ధి నిమిత్తం ఏచర్యనైనా ప్రభుత్వం చేపట్టవచ్చు. ఆర్టికల్‌ 29 (2)కు కూడా ఇదే వర్తిస్తుంది.
ఆర్టికల్‌ 16 : దీని ప్రకారం ఉద్యోగావకాశాల్లో సమానత్వం పాటించాలి. (1) ప్రభుత్వం చేసే ఏ నియామకంలోనైనా లేక ఉపాధి కల్పనలోనైనా సమాన అవకా శాలు కల్పించాలి.(2) మతం, జాతి, కులం, వర్గం, లైంగిక, ప్రాంతీయ, నివాస ప్రాతిపదికన ఏ వ్యక్తికీ ఉపాధి కల్పనలో వివక్ష చూపరాదు.(3) ఏవర్గానికైనా ఉద్యోగావకాశాల కల్పించాలని పార్లమెంటు భావిస్తే ఈ అధికరణ అడ్డుకాబోదు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు లేక స్థానిక సంస్థలు…ఎక్కడైనా ఏ వర్గానికైనా ఉపాధి కల్పనకు ఇది అడ్డంకి కాదు. (4) ప్రభుత్వ విభాగాల్లో వెనుకబడ్డ వర్గాలకు నియామకాల్లో సరైన ప్రాతినిథ్యం లేదని ప్రభుత్వం భావించినపుడు నియామకాల్లో వారికి రిజర్వేషన్లు కల్పించవచ్చు. దానికి ఈ అధికరణ అడ్డుకాదు.
వెనుకబాటుతనం సామాజికమా? ఆర్థికమా? :
రిజర్వేషన్లు సామాజికంగా వెనకబడ్డ వర్గాలకు కల్పించాలా లేక ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాలకా? అన్న చర్చ దాదాపు 70 ఏళ్లుగా సాగుతూనే ఉంది. 1948లో రాజ్యాంగసభలో దీనిపై ఆసక్తికర చర్చే జరిగింది. అసలు వెనకబడ్డ (బ్యాక్‌వర్డ్‌) అనే పదాన్ని ఎలా నిర్వచించాలి? అన్న అంశంపైనే గంటన్నరకు పైగా చర్చ జరిగింది. రాజ్యాంగంలో ఎక్కడా వెనకబడ్డ అన్న పదాన్నే నిర్వచించలేదని హెచ్‌.ఎన్‌.కుంజ్రూ అసంత ృప్తి వ్యక్తం చేశారు. దీనిపై టీటీ కృష్ణమాచారి లేచి ‘ఈ పదం అస్పష్టం, సందిగ్ధం. దీనికి రక రకాల వ్యాఖ్యానాలు చెప్పుకోవచ్చు. పుట్టుకతో వెనకబాటుతనమా, సామాజికంగానా, ఆర్థికంగానా, నిరక్షరాస్యత వల్లా… ఇలా దేనికని వెనకబాటుతనం?’’ అని వ్యాఖ్యానించారు. రాజ్యాంగ రచనలో పాలుపంచుకొన్న కేఎం మున్షీ స్పందిస్తూ ‘‘ఇది అసలు కులానికి చెందినది కాదు.. వర్గానికి చెందినది. కాబట్టి షెడ్యూల్డ్‌ కులాలు, తెగలు అనకుండా వెనకబడ్డ వర్గాలు అని సంబోధించాలి. అప్పుడు అధికరణం 16(4)లో పేర్కొన్న దానికి సరైన అర్థం, సార్థకత వస్తాయి’’ అన్నారు. దీనికి అంబేడ్కర్‌ సమాధానమిస్తూ ‘ఉదాహరణకు నిర్దిష్ట పోస్టుల్లో ఓ వర్గానికి లేదా అన్ని వెనకబడ్డ వర్గాలకీ కలుపుకొని 70 శాతం రిజర్వేషన్లు ఇస్తే..జనరల్‌ కేటగిరీలో మిగిలేది 30 శాతమే. ఇది సమానత్వం కిందకు వస్తుందా? అందువల్ల మనం సమానత్వపు హక్కు కల్పించాలి. ఇన్నాళ్లూ ప్రాతినిధ్యం దొరకని కొన్ని కులాలకు అవకాశాలూ కల్పించాలి. ఏప్రాతిపదికన..? అవి సామాజికంగా, సాంస్క ృతికంగా వెనుకబడి ఉన్నవి. బ్యాక్‌వర్డ్‌ పదాన్ని వాడితే అది అధికరణం మొత్తాన్ని తినేస్తుంది. రిజర్వేషన్లు పరిమితిని మించి ఇస్తే అది మంచిదా కాదా.. అన్నది న్యాయవ్యవస్థే తీర్పిస్తుంది’’ అన్నారు.

ఎన్నికల మూడ్‌లో రాజకీయ పక్షాలు

త్వరలో జరగబోయే 2019 సార్వత్రిక ఎన్నికల కోసం అన్నీ రాజకీయ పార్టీలు సన్నద్దమవుతున్నాయి. లోక్‌సభతోపాటు, రాష్ట్ర శాసనసభకూ ఎన్నికలు ఒకేసారి నిర్వహించేందుకు రంగం సిద్దమవు తోంది ఫిబ్రవరి చివరి వారం లేదా ఫిబ్రవరి/మార్చి నెలల్లో ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం ఉంది. ఏపీలో మొత్తం 25లోక్‌సభ స్థానాలతోపాటుగా 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. రాష్ట్రానికి సంబంధించి తొలి విడతలోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల అధికా రులు ఇప్పటికే ప్రకటనలు జారీ చేశారు. ఇప్పటికే ఆయా జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆయా రాజకీయ పార్టీలు వ్యూహాలు, ప్రణాళికలు రూపొందించినట్లు తెలుస్తోంది. రాజకీయ పొత్తులు, మద్దతుదారులను కూడగట్టుకోవడం, కార్యకర్తలను బుజ్జగింపులు వంటి సంఘటనలు జోరందుకున్నాయి. ఓటర్లును ఆకట్టుకునేందుకు ఇప్పటికే టీడీపీ సామాజిక పింఛన్లను రెట్టింపుతోపాటు, రైతులకు తొమ్మిది గంటల విద్యుత్‌ సరఫరా పేరిట వరాలను ప్రకటించింది. ప్రధానంగా సన్నకారు, కౌలు రైతులను లక్ష్యంగా చేసుకుని భారీ నగదు ప్రయోజనం కలిగించే విధంగా ఈ పథకం ఉంటుందని తెలుస్తోంది. దీనిద్వారా రైతాంగాన్ని మచ్చిక చేసు కోవడంతోపాటు, ఎన్నికలలో గెలిచేందుకు సులువు అవుతుం దని టీడీపీ భావిస్తూ వ్యూహాలు చేస్తోంది. అదే విధంగా మరిన్ని పథకాలతో పాటు, రాయితీలు, వెసులబాట్లు అన్నీ కలిపి ఓటాను అకౌంట్‌ బడ్జెట్‌లో ప్రకటించాలని కూడా టీడీపీ ఆలోచిస్తోంది. బడుగు బలహీనవర్గాల కార్పొరేషన్లు ప్రభుత్వం ప్రకటించి ఆవర్గాల ప్రజలను ఆకట్టుకొంటోంది. ఈ విధంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రోజుకో పథకాన్ని ప్రవేశపెడుతూ ఎన్నికల చోరులో ఉన్నారు. డ్వాక్రా మహిళలకు పసుపు`కుంకమ పథకం పథకం కింద పదివేల రూపాయలు పంపిణీ వంటి పథకాలు ప్రవేశపట్టి ఆకట్టుకుంటున్నారు. అయితే ఇలా ఉండగా ఈ పథకాలన్నీ తమవే నని వైకాపా టీడీపీ పార్టీపై ఆరోపణలు చేయడంతో రాష్ట్రంలోని రాజకీయ పార్టీలతోపాటు ప్రజల్లో కూడా ఎన్నికల కౌంట్‌డౌన్‌ మొదలైంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కూడా ఎన్నికల హామీలకు పదును పెడుతోంది. ఫిబ్రవరి 19న బీసీ గర్జన పెట్టి బీసీ ఓట్లను రాబట్టేందుకు సన్నహాలు చేపట్టారు. ఈవిధంగా ప్రజలను తమ వైపునకు తిప్పుకోవాలని ఆపార్టీ వ్యూహరచన చేస్తోంది. ఇంకో వైపు జనసేన పార్టీ పార్లమెంటరీ నియోజక వర్గాల వారీగా అభ్యర్థలు కసరత్తు చేస్తోంది. ఇప్పటి రాష్ట్రంలోని అన్ని పార్టీలు కౌంట్‌ డౌన్‌ ప్రకటించాయి. 2019 సార్వత్రిక ఎన్నికలు లక్ష్యంగా 400 లోకసభ స్థానాల్లో రెండువందల ర్యాలీలు నిర్వహించేందుకు ఇప్పటికే బీజేపీ దేశవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించే పనిలో నిమగ్నమైంది.
ఇది ఇలాఉండగా ఈసారి లోక్‌సభ ఎన్నికలతో పాలుగా ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీల ఎన్నికల కూడా జరిపే అవకాశం ఉంటుదంటున్నారు. మరోపక్క తెలంగాణ లోని గ్రామీణ ప్రాంతాల్లో పంచాయితీ ఎన్నికల వేడి రాజుకుంది. వచ్చే ఎన్నికలకు కార్యకర్తలను సన్నద్దం చేసేందుకు అన్నీ రాజకీయ పార్టీలు సోషల్‌ మీడియాను ప్రధాన హస్త్రంగా తీసుకోవడం ప్రధాన అంశం. ప్రజల్ని, కార్యకర్తలను ఎన్నికల మూడ్‌లోకి తీసుకు వచ్చేందు కు ప్రజల వద్ద ఉన్న స్మార్‌ఫోన్లు ప్రచార సాధనాలుగా వినియోగించడం విశేషం. ముఖ్యంగా వాటిని ఎన్నికల ప్రచార సాధనాలుగా వాట్సాప్‌.. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇతర సోషల్‌ ప్రచార మాధ్యామాలను వినియోగిస్తూ ఆయా పార్టీల బలోపేతానికి రాజకీయ కార్యకర్తలను సిద్దంచేస్తున్నారు. అధికార పక్ష పార్టీలైన టీడీపీ, బీజేపీ పార్టీలు ఈనాలుగేళ్ల కాలంలో ఏం చేశారో ప్రజలకు చెప్పడానికి సిద్దపడుతున్నారు. ప్రతిపక్ష పార్టీల దుష్ప్రచారాన్ని సాధ్యమైనంత మేర తిప్పికొట్టి, ప్రజలకు ఆలోచించు కోవడానికి సమయం దొరుకుతుందనే భావంతో ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఉవ్వూళూరుతున్నారు. ఇక ప్రతిపక్షనేతలు అధికార పార్టీ నేతలు చేసిన అవినీతి, భూ కుంభకోణాలు వెలికితీసీ నాలుగేళ్లలో పాల్పుడిన అవినీతిని బట్టబయలు చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. అయితే ప్రజలు కూడా సార్వత్రిక ఎన్నికల మూడ్‌లోకి చేరిపోయారు. ఎన్నికలు కోసం ఎదురు చూస్తున్నారు. ఈనేపధ్యంలో ఎన్నికల సంఘం కూడా సూచనప్రాయంగా లోక్‌సభ ఎన్నికల తేదీలను ప్రకటించడంతో మరీంత ఊపుందుకుంది.
మార్చి మొదటి వారంలో ఎన్నికల ప్రకటన! :
లోక్‌సభ ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం మార్చి మొదటి వారంలో ప్రకటిస్తుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రస్తుత లోక్‌సభ పదవీ కాలం జూన్‌ మూడో తేదీన ముగియనుండడంతో ఆలోగానే ఎన్నికల నిర్వహణపై సన్నా హాలు ఆరంభమయ్యాయి. ఎన్ని దశల్లో పోలింగ్‌ నిర్వహించాలి? ఏయే నెలల్లో జరపాలి? అన్నదానిపై ఇప్పటికే కసరత్తు జరుగుతోంది. భద్రతా దళాల అందుబాటు, తదితర అంశాల ఆధారంగా ఎన్ని దశల్లో నిర్వహించాలన్నది నిర్ణయిస్తారు. సంప్రదాయాన్ని అనుసరించి లోక్‌సభ ఎన్నికలతో పాటు కాలపరిమితి ముగియనున్న ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీల ఎన్నికలు కూడా జరిపే అవకాశం ఉంది. రద్దయిన జమ్ము-కశ్మీర్‌ అసెంబ్లీకి కూడా లోక్‌సభతో పాటే ఎన్నికలు నిర్వహించే అవకాశాలను పరిశీలించవచ్చు. సంక్ష్లిష్టమైన శాంతి భద్రతల పరిస్థితి దృష్ట్యా అక్కడ కాస్త ముందుగానే అసెంబ్లీ ఎన్నికలు జరిపే అవకాశాలు కూడా లేకపోలేదు. అసెంబ్లీల కాల పరిమితి అయిదేళ్లు కాగా, జమ్ము-కశ్మీర్‌కు మాత్రం ఆరేళ్లు ఉంటుంది. వాస్తవానికి 2021 మార్చి16వరకు గడువు ఉన్నప్పటికీ 2018 నవంబరులోనే రద్దు చేశారు. ఆరునెలల్లోగా అంటే మే నెలలోగా దీనికిఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈవిషయాన్ని ఎన్నికల సంఘం అధికారప్రతినిధి వద్ద ప్రస్తావించగా, ఎన్నికల తేదీలను ఎప్పుడు వెల్లడిరచాలన్నదానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.
ఇంతకుముందు ఇలా..
2014లో 9దశల్లో ఎన్నికలు జరిగాయి. మార్చి 5న ప్రకటన వెలువడిరది. తొలిదశ ఏప్రిల్‌ 7న, చివరి దశ పోలింగ్‌ మే 12న జరిగాయి. 2009లో 5 దశల్లో ఎన్నికలు నిర్వహించారు. మార్చి 2న ప్రకటన రాగా, ఏప్రిల్‌ 16న తొలి దశ, మే 13న చివరిదశ ఎన్నికలను జరిపారు.
2004లో 4 దశల్లో ఎన్నికలు జరిగాయి. ఫిబ్రవరి 29న ప్రకటన వెలువడగా, తొలి దశ ఏప్రిల్‌ 20న, ఆఖరి దశ మే 10న నిర్వహించారు. – గునపర్తి సైమన్‌

గత కాలపు ఆనవాళ్లు ఆదివాసీ పజ్రలు

ఆధునిక సమాజ గత కాలపు ఆనవాళ్లు ఆదివాసీ ప్రజలు. సమిష్టి జీవన పద్ధతు లు, సహజీవనం, పారదర్శ కతకు నిలువెత్తు సాక్షులు వారు. వ్యష్టి జీవన పద్ధతులు, పరస్పర అసహనం, కని పించ ని కుట్రలు నేటి పారి శ్రామిక సమాజ లక్షణాలు. బ్రెజిల్‌, పెరూ దేశాలలో వందకుపైగా ఆదివాసి తెగలు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఉన్నారు. పెరూలోని ‘ముచి-పిచి’ పర్యావరణ పార్కుకు కేవలం 100 కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతంలో ఈ తెగలు ఇప్పటికీ జంతుప్రాయమైన జీవనాన్ని కొనసాగిస్తున్నారు. 50-60 వేల సంవత్సరాల నుంచి అటవీ దుంపలు ప్రధాన ఆహార వనరుగా జీవిస్తూ మొక్కజొన్న, బంగాళాదుంప సాగుకు ఈ తెగలు ఎంతో తోడ్పడ్డాయి. తాము వేటాడే జంతువులకు ఎరగా వేసే క్యురారే మొక్క నేడు ఓపెన్‌ హార్ట్‌ శస్త్రచికిత్సకు ఔషధంగా మారింది. గత సునామీలో అండమాన్‌ తెగలలో ఆదివాసి తెగలు ఎవరూ చనిపోలేదు. కారణం సముద్రం వెనక్కి వెళ్లగానే వారు ఎత్తైన కొండలపైకి వేగంగా కదిలి వెళ్లారు. జారవా, సెంటినిల్‌ తెగల ఆదివాసీల్లో కళ్లుతెరచి సముద్రపు నీటిలో చేపలవేటకు అనువుగా 50 శాతం మంది కళ్లు రూపాంతరం చెందాయి. ప్రపంచంలో సుమారు ఏడు వేల భాషలు ఉంటే అందులో ఆదివాసీ తెగలు మాట్లాడే బాషలే నాలుగు వేలు ఉన్నాయి. నేడు అత్యధికులు మాట్లాడే, వాడే ఆరు భాషలు (ఇంగ్లీషుతో సహా) గతంలో అంతరించిపోయిన ఆదివాసీ తెగలు వాడినవే.
బ్రతుకు పోరాటంలో ఆరితేరిన వారు ఆదివాసీలే. వారు నివసించే ప్రాంతాలు పుష్కలమైన సహజవనరులతో కళకళలాడుతుండేవి. నేడు ఆ వనరులు దోపిడీకి గురౌతున్నాయి. ‘అతి పురాతన సనాతన ప్రజల (మూలవాసులు) తెగలు అంతరించిపోతున్నాయి. సాటి మానవులుగా అనేక దేశాలలో వారికి తగిన గుర్తింపు, రక్షణ లేదు. ఆయా దేశాలలో కనీసపు చట్టాలు కూడా లేవు. ఫలితంగా వారు మానవులుగా జీవించడానికి పోరాడవలసిన స్థితి ఏర్పడిరది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ సనాతన ప్రజలను కాపాడవలసిన బాధ్యత మనపై ఉన్నది. అందుకు ప్రతి దేశం కొత్త చట్టాలు రూపొందించడం, వాటిని అమలుచేయడం, తద్వారా జీవించేహక్కుతో సహా ఆధునిక మానవునికి గల అన్ని హక్కులూ వారికి ఇవ్వవలసి ఉన్నది’ అని 1994 డిసెంబర్‌ 23న ఐక్కరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ 49/214 తీర్మానంలో పేర్కొన్నది. ఐక్యరాజ్యసమితి తీర్మానం మేరకు ప్రతి దేశం దశాబ్ద కాలంపాటు ఆదివాసీ తెగలను గుర్తించి, వారిని చట్టపరిధిలోకి తీసుకురావాలి. ఈ పదేళ్లపాటు ఆదివాసీ తెగలను మానవులుగా గుర్తించడం, వారి జీవన పరిస్థితులను మెరుగు పర్చడం, వారి నివాస ప్రాంతాలలోని సహజవన రులన్నింటినీ వారే సమిష్టిగా వినియోగించుకునే చట్టాలు చేయవలసి ఉన్నది. ఇది 1995 నుంచి 2004 వరకు వివిధ రూపాలలో ప్రచార కార్యక్రమాలు, అధ్యయనాలు చేయవలసి ఉన్నది. రెండవ దశాబ్దంలో 2005 నుంచి 2015 వరకు ఆదివాసీ తెగల అస్తిత్వం, తగిన హోదా కల్పించవలసి ఉంది.
పై తీర్మానంపై 148 దేశాలు సంతకాలు చేసినా, కొంతమేరకు అమలుచేసిన దేశాలు కేవలం 60 మాత్రమే. ఈ 60లో భారతదేశం లేదు. ప్రపంచవ్యాప్తంగానే తొలుత ఈ తీర్మానాన్ని అమలు చేయాలని ప్రయత్నించిన వారు ప్రపంచస్థాయి ఎన్‌జిఒలు మాత్ర మే. మనదేశంలో ఇప్పటికీ అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని ప్రభుత్వాలు జరపడం లేదు. ఎన్‌జిఒలు చేసే కార్యకలాపాలకు కొన్ని రాష్ట్రాలలో కేవలం ఆర్థిక తోడ్పాటును మాత్రమే ప్రభుత్వాలు అందిస్తున్నాయి. మన దేశంలో సుమారు 600 ఆదివాసీ తెగలు గుర్తించబడ్డాయి. భారత రాజ్యాంగం వీరికి చట్టపరమైన రక్షణలు కల్పించింది. అవే 5వ, 6వ షెడ్యూల్‌గా ప్రాంతీయ, పరిమిత స్వయంపాలనా హక్కు ఇవ్వబడిరది. ఆచరణకు వీలుగా పీసా చట్టం (పి.ఇ.ఎస్‌.ఎ-1996) చేయబడిరది. అయినా బూర్జువా పాలకవర్గాలు మనదేశంలో గిరిజన తెగలకు స్వయం పాలనా హక్కులు ఇవ్వలేదు.
ఆదివాసీలు-హక్కులు
వలస కాలం నుంచి మనదేశంలో ఆదివాసీ తెగలు బూర్జువా, భూస్వామ్యవర్గాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నాయి. ఒక రాజీగా అనేక రక్షణ చట్టాలు వచ్చాయి. ముఖ్యంగా 1874లోనే ప్రత్యేక షెడ్యూల్డ్‌ జిల్లాల చట్టం చేయబడిరది. 1917లో ఆదివాసీ తెగల నివాస ప్రాంతాలలో ఉమ్మడి భూమి హక్కులు ఇవ్వబడ్డాయి. అవే భారత రాజ్యాంగంలో పొందుపరిచారు. అనేక పోరాటాల అనంతరం ఆదివాసీ తెగలకు అటవీ భూములపై హక్కులు కల్పిస్తూ 2006లో చట్టం చేయబడిరది. చట్టం ప్రకారం అటవీ భూమిపై ఆధారపడి జీవిస్తున్న ప్రతి గిరిజన కుటుంబానికీ 10 ఎకరాల వరకూ పట్టా ఇవ్వవచ్చు. వారిపై గల కేసులను ఎత్తివేయాల్సి ఉంది. మన రాష్ట్రంలో దీని అమలు అరకొరగా జరిగింది. సుమారు 25 లక్షల ఎకరాలకు పట్టాలివ్వవలసిన భూమిని గుర్తించినప్పటికీ కేవలం 9 లక్షల ఎకరాలకు మాత్రమే పట్టాలిచ్చారు. దీనిలో లక్షా యాబై ఆరు వేల మందికి 3 లక్షల ఎకరాలు మాత్రమే దక్కింది. మిగతా 6 లక్షల ఎకరాలు 2 వేల విఎస్‌ఎస్‌ల పేర (వన సంరక్షణ సమితులు) పట్టాలిచ్చి అటవీశాఖ ఆధీనంలోనే ఉంచుకున్నారు. ఇన్ని చట్టాలు ఉన్నా, స్వాతంత్య్రం వచ్చి 68 ఏళ్లు అయినా ఆదివాసీ తెగలు తమ సంప్రదాయపు భూముల నుంచి, అటవీ ప్రాంతం నుంచి నెట్టివేయబడుతున్నారు. మన రాష్ట్రంలో 1/70 చట్టం అమలులో ఉన్నది. గిరిజనుల సాంప్రదాయక భూములు గిరిజన తెగలకే దక్కాలి. గిరిజనేతరులకు షెడ్యూల్డ్‌ భూమిపై ఎట్టి హక్కూ లేదు. కానీ మన రాష్ట్రంలో షెడ్యూల్డ్‌ ప్రాంతంలో 48 శాతం సంప్రదాయక గిరిజన భూములను గిరిజనేతరులు ఆక్రమించు కున్నారు. గిరిజన విద్య పేరుతో ప్రైవేటు, కార్పొరేట్‌ సంస్థలకు ఐటిడిఎలు దోచిపెడుతున్నాయి. ఈ సొమ్ముతో ఐటిడిఎనే జూనియర్‌ కాలేజీలను పెట్టవచ్చు లేదా తాము నడుపుతున్న రెసిడెన్షియల్‌ జూనియర్‌ కాలేజీల్లో చేర్పించవచ్చు.
ఆదివాసీ చట్టాలు-అక్కరకురాని చుట్టాలు
ఆదివాసీ చట్టాలు అక్కరకురాని చుట్టాలుగా మారాయి. పోలవరం ప్రాజెక్టు వద్దని గ్రామసభలు, పంచాయతీలు, మండల పరిషత్తులు(ఇవన్నీ షెడ్యూల్డ్‌ ఏరియాలో, పీసా చట్టం పరిధిలో ఉన్నవి) చేసిన తీర్మానాలకు రాష్ట్ర ప్రభుత్వం విలువే ఇవ్వలేదు. బాక్సైట్‌ త్రవ్వకాలు వద్దని విశాఖజిల్లాలోని గ్రామసభలు, పంచాయతీలు, మండల పరిషత్తులు చేసిన తీర్మానాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రక్కనపెట్టి ఐటిడిఎల ద్వారా బాక్సైట్‌ త్రవ్వకాలు జరుపుతామని చెబుతున్న మా టలు సుప్రీంకోర్టు ‘సమతా తీర్పును’ వెక్కిరించడం కాదా? ఆదివాసీ హక్కులను కాలరాయడానికి రాష్ట్ర ప్రభుత్వం వెనుకాడడం లేదు. షెడ్యూల్డ్‌ ప్రాంతంలో జీవో 3ప్రకారం అన్ని ప్రభుత్వ శాఖలలోని ఉద్యోగాలన్నింటినీ స్థానిక గిరిజన అభ్యర్థులతో నింపవలసి ఉన్నది. ప్రతి కార్యాలయంలో గుమస్తా నుంచి అధికారి వరకు ప్రతి స్కూలు, ఆసుపత్రి, వివిధ కార్యాలయాలలో నేడు స్థానిక అభ్యర్థులు 10 శాతం కూడా లేరు. స్థానికేతరులు, గిరిజనేతరులు, తాత్కాలిక ప్రాతిపదికపై గతంలో నియామకాలు జరిగాయి. ఈజీవోప్రకారం వారిని తొల గించి స్థానిక గిరిజన అభ్యర్థులతో నింపవలసి ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం స్కీం వర్కర్లలో ఎక్కువమంది గిరిజనేతరులనే నియమిస్తున్నది. అర్హులైన గిరిజన అభ్యర్థులు నిరుద్యోగులుగా ఉన్నారు. ప్రభుత్వం జీవో 3ను పటిష్టంగా అమలుచేసి స్థానిక గిరిజన అభ్యర్థులకే ఉద్యోగ అవకాశం కల్పించాలనే డిమాండ్‌ ముందుకు వస్తున్నది. ఆదివాసీ తెగలు ప్రత్యేక భాషలు, విశిష్టమైన సంస్క ృతిని కలిగి ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనేతర భాషలను వారిపై బలవంతంగా రుద్దుతు న్నాయి. మన రాష్ట్రంలో ప్రతి గిరిజన కుటుంబం ఇంట్లో తమ తెగ భాష మాట్లాడుతున్నారు.
స్కూలుకు వెళ్తే తెలుగు, ఇంగ్లీషులో బోధన జరుగుతున్నది. భాషా పరిజ్ఞానమేకాక సాధారణ విషయాలను కూడా అవగాహన చేసుకోవడం గిరిజన విద్యార్థులకు కష్టంగా ఉన్నది. ఫలితంగా స్కూల్‌ డ్రాపవుట్స్‌ ఎక్కువ అవుతున్నాయి. యునెస్కో సూచన మేరకు 10 వేల మంది మాట్లాడే ప్రతి భాషకూ లిపి కనిపెట్టాలని, వాడుకలో దానికి రక్షణనివ్వాలని ఉన్నది. అయినా లక్షలమంది మాట్లాడుతున్న ఆదివాసీ భాషలకు లిపి కనిపెట్టకపోవడం దారుణం. భాషా పరిశోధన సంస్క ృతి రక్షణలో భాగం. ఆదివాసీ తెగల వాయిద్య పరికరాలు, వారి న ృత్యాలు ప్రభుత్వం ప్రోత్సాహం లేక అంతరించిపోతున్నాయి. ఆదివాసీ ప్రాంతాలలోకి టూరిజం ప్రవేశించాక ఆదివాసీ కళలు వ్యాపార సరుకులుగా మారిపోయాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని పాటించాలి. నేడు జరుగుతున్న ఉత్సవాలు పాలకవర్గాల అవసరాల కోసమే తప్ప ఆదివాసీలను కాపాడడానికి కాదు. నిజమైన ఆదివాసీ దినోత్సవం, ఆదివాసుల ‘అవసరాలు- ఆకాంక్షలు’ నెరవేర్చేదిగా ఉండాలి.- జి.ఎన్‌.వి.సతీష్‌

పసిడి బాల్యమంటే అదేనా..?

ఆ ఇల్లంతా బొమ్మలే. రంగుల పుస్తకాలే. ఫోన్ల నిండా పిల్లల ఫొటోలే. స్టోరేజీ నిండా మ్యాజిక్‌ వీడియో మిక్స్‌లే. ఇప్పుడు పిల్లల్ని సెలబ్రెటీల కన్నా గొప్పగా పెంచేస్తున్న తీరు పెరిగింది. ప్రతిదీ కొనివ్వడం వరకే తల్లిదండ్రుల, కుటుంబ పెద్దల అభిమానానికి ఓపిక. చిన్నారులతో కొన్ని విలువైన సమయాల్ని గడిపే తీరికే లేదు. వెలకట్టలేని పసిదనాన్ని అమ్మకమంటూ బోర్డులు పెట్టేసే టారు కొట్ల ముందో, థీమ్డ్‌ బడుల వద్దో పెద్దలు తచ్చట్లాడుతున్నారు. బాల్యాన్ని సెలబ్రేట్‌ చేయడమంటే.. ఎవరో అమ్ముతున్నది పిల్లలకు కొనివ్వడమనే అనుకుంటున్నారు. పసిడి బాల్యమంటే అదేనా..?
పిల్లలకు ఖరీదు తెలీదు. డాడీ.. అప్పుచేసి డ్రోన్‌ కొని రిమోట్‌ చేతిలో పెట్టక్కర్లేదు. దగ్గరుండి న్యూస్‌పేపర్‌తో పతంగి తయారుచేసి ఎగరేస్తే చాలు. మబ్బుల్ని పట్టుకునేంత ఎత్తుకు చిన్నారుల ఆనందం ఎగురుతుంది. కానీ, పెద్దలకు టైంలేదు. సోషల్‌ మీడియాలో అటెండెన్స్‌ లేటవుతుంది. అటెన్షన్‌ లాస్‌ అవుతుంది. బాలలకు విలువ అర్థం కాదు. కాస్ట్‌లీ చాక్లెట్లని మమ్మీ హ్యాండ్‌ బ్యాగ్‌లోంచి తీసి ‘సర్‌ప్రైజ్‌’లివ్వకర్లేదు. తను తినే అన్నం ముద్దల్లో ఒకటి పిల్లల నోట్లోను పెట్టేంత నిదానంగా తింటే చాలు. కానీ, పెద్దలతో బిజీ బతుకు. వర్క్‌ పెండిరగ్‌లో పడుతుంది. టీమ్‌లో పేరు వెనుకబడుతుంది. చాలా ఇళ్లల్లో ఇదే పరిస్థితి. తండ్రి చాటుకు పరుగెత్తి గోరు ముద్దల అల్లరి చేసే పిల్లలకు… సొంతంగా భోజనమెలా చేయాలో నేర్పిస్తామంటూ ఎల్‌కేజీ సిలబస్‌లో కలిపేసుకున్న ప్లేస్కూళ్లు పెరిగాయి. పేరెంట్స్‌కు వంటింట్లో సాయమెలా చేయాలో కూడా మంచిపాఠమే కానీ, తాము మిగిల్చిన కాలాన్ని పెద్దలు టచ్‌స్క్రీన్‌కు బదిలీ చేస్తే పిల్లలేం కావాలి? ఇదివరకు బడి ఎగ్గొట్టేందుకు పిల్లలకు దొంగ జ్వరాలొచ్చేవి. కడుపు నొప్పి వచ్చేది. కానీ, ఇప్పుడు తల్లిదండ్రులు ఓ పూట పని మానుకుని తమ వద్దే ఉంటారని పిల్లలు జబ్బు చేస్తున్నారు.
విరిగిన బొమ్మలు
సురేష్‌కు ఫేస్‌బుక్‌ ఓ లోకం. అందులోనూ అల్లరి చేసే పిల్లల పేజీల్నీ ఫాలో అవుతుంటాడు. ఫన్నీ వీడియోలు చూస్తూ పడిపడీ నవ్వుతుంటాడు. పనిచోట ఇది నడవదు కనుక, ఇంటికెళ్లే ప్రయాణంలో ఫోన్‌ను మెడ తిప్పకుండా చూస్తుంటాడు. తీరా ఇంటికెళ్లాక పడుతూ లేస్తూ ఎదురొచ్చే కూతురిని అంతెత్తున ఎగరేసి ఎత్తుకుని, ముద్దిచ్చి మీద నుంచి దింపేస్తాడు. చకచకా రిఫ్రెష్‌ అయ్యి మళ్లీ ఫోన్‌ పట్టుకుని ఓ మూలకు చేరుతాడు. కూతురొచ్చి ఎంత బన్నీ లాగినా ‘2 మినిట్స్‌ తల్లీ.. 2 మినిట్స్‌’ అంటూ రెండు గంటలైనా వదలకుండా ఫోన్‌తోనే గడిపేస్తాడు. చిన్నారులకు ఖరీదు తెలీదు. విలువ అర్థం కాదు.. అలానే, గుర్తు ఉండదు కూడా. ఇలా ఎన్నిరోజుల్నుంచి తండ్రి పట్టించుకోకున్నా ప్రతి సాయంత్రం కూతురు అలానే ఎదురుచూస్తుంటుంది. మౌనంగా తండ్రికి దూరం జరిగి ఒక్కతే.. విరిగిన బొమ్మను మరింత విరగ్గొడుతూ మూలన కూర్చుని ఆడుకుంటుంది. ఇదో భరించలేనంత ఒంటరితనం. ఆఇంటి అట్టపెట్టె నిండా ఇలాంటి విరిగిన బొమ్మలెన్నో. అవెందుకు అలా విరిగిపోతున్నాయనే పట్టింపే లేకుండా మరో బొమ్మతో మరో వీకెండ్‌ దాటేస్తాడు సురేష్‌.
అతకని మనసులు
సంధ్యకు పనే ఓప్రపంచం. అందులోనూ పిల్లలకు గొప్ప భవిష్యత్తు ఇవ్వాలని ర్యాట్‌ రేస్‌లో చలోమంటుంది. ఒక పనిచేసే సమయంలో రెండు మూడు ప్రాజెక్టులు పూర్తిచేసేంత శక్తిని నింపుకుంటుంది. పనిచోటే ఇది నడవదు కనుక ఇంటికెళ్లేపుడు ఇవే ఆలోచనల్ని వెంటతీసుకెళుతుంది. తీరా ఇంటికెళ్లాక కళ్లూమూస్తూ నిద్రకళ్లతో తూలుతూ వచ్చే కొడుకుని గట్టిగా హత్తుకుని తల నిమిరి పక్కకు జరుపుతుంది. చకచకా డిన్నర్‌ వగైరా కానిచ్చి ఫైళ్లో, మెటీరియలో ముందేసుకుని హాల్‌ మధ్యకు చేరుతుంది. కొడుకొచ్చి ఎంత చేయిలాగినా ‘అయిపోయింది.. అయిపోయింది’ అంటూ అర్ధరాత్రైనా వదలకుండా పనితోనే గడిపేస్తుంది. చిన్నారులకు పట్టింపు ఉండదు కదా! ఎంత కాలం నుంచి తల్లి తెలీకుండానే పనిలో కూరుకుపోయినా ప్రతి రోజూ కొడుకు అలానే వేచిచూస్తాడు. అమ్మ చెప్పే బైబైలతో తలుపునో, గేటునో బలంగా తన్ని ఒంటరిగా టీవీ సెట్‌కో, తన లోకానికో అతుక్కుపోతాడు. ఇదో చెప్పలేనంత ఒంటరిభావం. ఎన్నో ఇళ్ల గదుల నిండా ఇలాంటి అతకని మనసులెన్నో. అవెందుకు ముక్కలవుతున్నాయనే పట్టింపే లేకుండా మరో ప్రాజెక్ట్‌తో వీకెండ్‌ మొదలెట్టేస్తుంది సంధ్య.
దగ్గరుండి నేర్పాలి
దారెంట ఓగ్యాస్‌బెలూన్‌ బండి కనిపిస్తే.. లోనున్న పిల్లలు అడిగి మారాం చేయకముందే కొని తీసుకెళ్తున్నారు. కొన్ని రోజులకు ఇలాంటి సర్‌ప్రైజ్‌లన్నీ చప్పబడిపోయి.. పిల్లల్లో అస్సలు స్పందన ఉండని పరిస్థితి తయారవుతుంది. జేబులు మరింత పెద్దవి చేసుకుని మరింత పెద్ద బహుమతులు, ఖరీదైన సర్‌ప్రైజ్‌లు ఇవ్వడం వరకే నేటి చాలామంది పేరెంట్స్‌ అవగాహన. దానికోసం మరింత ఉద్యోగాలకు, పనులకు అంకితమవడం.. చేజేతులారా వర్క్‌-లైఫ్‌ బ్యాలెన్స్‌ చెడగొట్టుకోవడం… పిల్లలకు మరింత దూరమవడం.. ఇదో ఒంటరి బాల్యపు చక్రం. వినిమయ ఛట్రంలో బందీ అయిపోయిన తమ లైఫ్‌స్టైల్‌నే చిన్నతనం నుంచే పిల్లలకూ వంటబట్టించేస్తున్నారు. తల్లిదండ్రుల సమక్షంలో ఓ స్కూల్‌ కాంపిటీషన్‌లో పాల్గొన్నా చాలనుకుంటారు పిల్లలు. విజేత ఎలాగూ ఒక్కరో, ఇద్దరో ఉంటారనే విషయం వాళ్లకు తెలీకున్నా తల్లిదండ్రులకు తమ పాటో, డ్యాన్సో, ప్రసంగమో, నటనో, ఆటో.. ఏదో ఒకటి చేసి అందరూ హీరోలైపోవాలని ముందు రాత్రి నుంచే కలత నిద్రపోతున్నారు. సైకిల్‌ కొనిస్తే సరిపోతుందని పేరెంట్స్‌ ఆలోచన. దాన్ని పక్కనే ఉంటూ నేర్పించడం బాలలు కోరుకునేది. చిట్టిపాదాలు సైకిల్‌ పెడల్‌ మీద స్థిరపడేలోపు ఎన్ని విలువైన క్షణాలు, మేమున్నామనే భరోసాలు.. కుదురుకుంటాయో తెలుసా..! చేతుల్ని గాల్లోకి వదిలేసి సైకిల్‌ ముందుకు నడిపించడంలో ఎన్ని సాహసాలు, ఉద్వేగాలు, కేరింతలు.. పేరెంట్స్‌ సాంగత్యంలో కోరుకుంటున్నారో తెలుసా..! పేరెంట్సే కనుక వీలు చేసుకుంటే.. సైకిల్‌ నేర్పేటపుడే ఎన్నేసి బతుకు పాఠాలు పిల్లలకు తేలిగ్గా తిప్పి చెప్పొచ్చో. నడిచేపుడే రెండు చక్రాల మీద సైకిల్‌ ఎలా బ్యాలెన్స్‌ అవుతుందో అనే విషయానికి ఓరోజు ఇష్టమైన క్లాస్‌ చెప్పుకోవచ్చు. బురదలో పడిన సైకిల్‌ని సరదాగా కలసి కడుగుతూ బంధాన్ని ఎంత శుభ్రం చేసుకోవచ్చో..! వెనుకే కూర్చుని అటు హ్యాండిల్‌ని కంట్రోల్‌ చేయడం నేర్పిస్తూ, ఇటు పెడల్‌కు ఆసరాగా పెద్దల కాళ్లబలాన్ని అందిస్తూ.. ఒక్కరిగా కాకుండా జట్టులో ఒకరిగా ఉంటే ఏం ప్రయోజనమో విడమర్చి చెప్పొచ్చు. ఎందుకు పక్కవాడు అవసరమో చిన్నారికి ఇట్టే తెలిసిపోతుంది. మీరెన్ని పుస్తకాలు కొనిచ్చినా.. ఎన్ని క్లాసులు తీసుకున్నా… ఆవలింతలొస్తాయి గానీ, బతుకు పాఠం ఆ చిట్టి బుర్రలకు బోధపడదు. పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ కాన్సెప్ట్‌ల్ని చిన్న వయస్సు నుంచే ఎక్కడో కొని పరిచయం చేస్తున్న తల్లిదండ్రులు పేరెంటింగ్‌ పాఠాల్ని నేర్వాలి.
అఆఇఈలు అద్దెకే…
అంతంత కళ్లేసుకుని పలకనే చూస్తూ.. విరిగేంత గట్టిగా బలపాన్ని పట్టుకుని తల్లి/ తండ్రి ఒళ్లో కూర్చుని అక్షరాలు నేర్చుకుంటున్న పిల్లల ద ృశ్యాల్ని ఇప్పుడు మనం తక్కువగా చూస్తున్నాం. సరిగ్గా అడుగులు కూడా వేయలేని వాడిని ఏదో మిలట్రీ ట్రైనింగ్‌కు పంపిస్తున్నట్టు బూట్లు, యూనిఫామ్‌, బ్యాగులతో ఏడిపిస్తూ ప్లేస్కూళ్లకు పంపిస్తున్న చిత్రవిచిత్రాల్నే ఎక్కువ చూస్తున్నాం. కిండర్‌గార్టెనే ఎక్కువనుకుంటే.. నర్సరీ, అంతకన్నా ముందే అనే వెనకబాటుకు ఇప్పటి బాల్యం బాటేస్తోంది. నిద్ర కూడా పనిష్మెంట్‌ అనే చోద్యం ఆ చిట్టి గదుల్లో చూస్తున్నాం. ఇల్లు అంటే ఓ భద్రభావన. తల్లి ఒడిలో ఉన్నంత హాయిదనం. దాన్ని బలవంతంగా తెగ్గోసేస్తున్నారు ఆధునిక విద్య పేరిట. ఇళ్లంటే తల్లిదండ్రులు ఒక్కరే అవ్వడమూ బాల్యానికి చెప్పలేనంత లోపమవుతోంది. అమ్మమ్మో, నాన్నమ్మో, తాతయ్యో.. ఇంకా కుదిరితే చిన్నాన్నో, అత్తమ్మో… కలసి ఉంటే తల్లిదండ్రులు ఇంట్లో లేని లోటుని భర్తీ చేస్తారు. అఆఇఈల నుంచి మరెన్నో విషయాల్ని చక్కగా నేర్పిస్తారు. అమ్మానాన్నల్ని కాసేపైనా మరిపిస్తారు. న్యూక్లియర్‌ ఫ్యామిలీలకెలానూ బంధాల్ని నాన్నీలు, ఆయమ్మల పేరిట అద్దెకు తెచ్చుకునే అవస్థ తప్పదు. కానీ, ఇంట్లో మరో పెద్ద దిక్కు ఉన్నా.. డబ్బులు తగలేసి అనేక పాఠాలకు వేరే దిక్కుకు చూస్తున్న పేరెంట్స్‌ తిప్పలేంటో ఓ పట్టాన అర్థం కాదు. నేటితరానికి తగ్గట్టు ఇంట్లోని పెద్దలు తయారవ్వలేదనే సాకు అయితే ఉండనే ఉంది. కంప్యూటరే ఆపరేట్‌ చేయలేకపోవచ్చు. స్మార్ట్‌ఫోన్‌లో యాప్‌లే సరిగ్గా అర్థం కాకపోవచ్చు. ఇంగ్లిష్‌నీ ఇరగదీసి మాట్లాడలేకపోవచ్చు.. పోటీతత్వాన్ని అరగదీసి ఎక్కించలేకపోవచ్చు.. కానీ, పిల్లలు మరింత రిమోట్‌గా, ఐసోలేట్‌గా కానీయకుండా.. నలుగురిలో ఎదిగేలా పదిమందిలో మెలగేలా చేయగలరు. ప్రతి సమస్యను, కష్టాన్ని పంచుకుంటూ, అర్థం చేసుకుంటూ చిన్ని హ ృదయాలకు జీవితం మీద ఆశ పెంచే ప్రయత్నమైతే చేస్తారు. టీనేజర్లకూ దిగులు రోగాలు, డిప్రెషన్‌లు, పోస్ట్‌మోడ్రనిజమ్‌ ఉనికిపోరు, సెలెబ్రెటీ సిండ్రోమ్‌లు చూస్తూనే ఉన్నాం. ఎన్నో బలవంతపు చావుల్ని దిగమింగలేకపోతున్నాం. వీటన్నింటికీ కారణం.. వందలాది సోషల్‌మీడియా స్నేహాల్లో ఒక్కరూ తమకు చాలా దగ్గరగా వచ్చింది లేదు. కనీసం బాధనైనా మాటల్లోనైనా పంచుకుంది లేదు. టీనేజ్‌ తరాన్ని రిపేర్‌ చేయడం అటుంచి… బాల్యం గురించి ఎంత ఎక్కువ పట్టించుకోవాలో అర్థం చేసుకోవాలి. తర్వాతి తరంవారైనా వాళ్లు మూడేళ్లైనా నిండకుండానే ఎంతటి ఒంటరితనంలోకి బలవంతంగా తోసేయబడుతున్నారో గమనించండి. ఇక్కడ అద్దెకు తీసుకునేది.. అ, ఆ, ఇ, ఈల్ని నేర్పే క్లాసుల్ని కాదు, ఇక్కడ కొనిచ్చేది పార్ట్‌టైం తోడుని కాదు… జీవితాంతం వెన్నంటే ఒంటరితనాన్ని, ఏకాకిభావనల్ని అని తెలుసుకోవాలి.
స్టేటస్‌ సింబల్స్‌, బ్రాండ్‌ మోడల్స్‌
సొసైటీలో బాగా బతుకుతున్నారని స్టాంప్‌ వేయించుకోవడానికి… తామెలాంటి బండి తీశారు, ఎలాంటి ఇంట్లో ఉంటున్నారు.. ఎంత కాస్ట్‌లీగా లైఫ్‌స్టయిల్‌ ఉంటుందనేది.. స్టేటస్‌ సింబళ్లుగా వాడుకునేవాళ్లు. ఇప్పుడు పిల్లల్ని అందుకు వాడేస్తున్నారు. తమ ఉనికికి వారిని బ్రాండ్‌ మోడల్స్‌ని చేసేస్తున్నారు. ఓ ఫంక్షన్‌కు వెళ్లినా, నలుగురితో ఓ విహార యాత్ర చేసినా… చివరకు ఏదో పని మీద రోడ్డు మీదకు వచ్చినా పిల్లల ఆహార్యం, చేష్టల మీద విపరీతమైన ఫోకస్‌ పెడుతున్నారు. నాలుగైదు పలుకుల ఇంగ్లిష్‌, అవాక్కయ్యే బ్రాండెడ్‌ బట్టలు, హుందాగా నడవడం, కూర్చోవడం, తిరగడం.. పిల్లలు ఇప్పుడు పిల్లల్లా ఉండటం లేదు. అల్లరల్లరిగా బాల్యం ఉండటం లేదు. పదుల కొద్దీ కామెంట్లు, వందలకొద్దీ లైకుల కోసం సోషల్‌ మీడియా గోడల నిండా వారిని అనేక రకాలుగా కుదించేసి, బాల్యాన్ని అందమైన బట్టల్లోకి దిగ్గొట్టేసి ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నారంతే. పరుగులు తర్వాత కనీసం కదలకుండా ఓ మంచి పోజు కోసం సెలబ్రెటీ క్రేవింగ్‌తో నలిపేస్తున్నారంతే. కనీసం ఆఫొటో సెషన్లు సాగేంత సేపన్నా ఉండటం లేదు.. ఆతల్లిదండ్రుల దగ్గరితనం. పోస్ట్‌ పెట్టడం, కామెంట్లకు రిప్లైలు ఇవ్వడంతో బిజీ అయిపోతున్నారు. మూలమూలల్లో ఉన్నవారంతా ఫ్యామిలీ గ్రూప్‌ పేరిటో, ఇంటిపేరు గ్రూప్‌తోనో, స్కూల్‌ ఇయర్‌ గ్రూప్‌తోనో, కాలేజీ బడ్డీస్‌ గ్రూప్‌తోనో.. ఓచోట కలిసే చోట ఈపిచ్చి మరీ పీక్స్‌కు చేరింది. పోటాపోటీ పిల్లల ఫ్యాన్సీ డ్రెస్‌ కాంపిటీషన్లు ప్రతిరోజూ నడిచిపోతున్నాయి. తమ ప్రతిభ, నైపుణ్యం, విజయం, ప్రత్యేకత… వదిలేసి పిల్లల స్టేటస్‌తో తమ ఉనికిని చలామణీ చేయించుకోవాలనే ఉబలాటం చాలా ప్రమాదం. చైల్డ్‌ ప్రొడిగీ.. అదేనండి ఇప్పుడు బాలమేధావులే కాదు, పెద్దలకూ అసాధ్యమైన ఫీట్లని ఆటల్లోను, పాటల్లోనూ.. ఇంకా నానారకాల సరదాల్నీ సీరియస్సుగా బతుక్కి దిగ్గొట్టుకున్న పిల్లల శిక్షణ సంస్థలు ఎక్కువవుతున్నాయి. ఆకారాగారాలు, కర్మాగారాల్లోకి పిల్లల బాల్యాన్ని ముడిసరుకు చేసేసి లాభాల్ని తమ అకౌంట్‌లో వేసుకుంటున్నట్టే మనం దీన్ని చూడాలి. ఇప్పుడు ప్రతిచోట ప్రతి ఇంట్లో బాలకార్మికుడు కనిపిస్తున్నాడు. కానీ, వేర్వేరు రూపాల శిక్షణలతో, కొత్తకొత్త మోడల్‌ పేర్లతో పిలవబడుతున్న శిక్షణశిబిరాలకు తరలుతూ.
పిల్లలకు ఆటవస్తువు కావాలి, అందమైన బొమ్మ కొనాలి.. కానీ, పెద్దల తోడు, స్నేహం, ప్రేమ పక్కనే లేకుంటే బాల్యమే కాదు తర్వాతి జీవితమూ పరిస్థితులూ, ప్రభావాల చేత ఆటబొమ్మయి పోతుంది. బాల్యస్మ ృతుల నిండా ఒంటరితనపు రీలే తిరుగుతుంది. దారం కట్టిన తూనీగలు, రెక్కలు పట్టుకున్న సీతాకోకచిలుకలు, సంకెళ్లు వేసిన ఉడతలూ, గేలంకి చిక్కుకున్న చేప పిల్లలు… ఇప్పటి బాలలు. అవి వాటికి చిక్కుకుని గిజగిజ లాడుతున్నట్టే చిన్నారులూ అనేక పోటీ ప్రపంచపు శిక్షణలు, పెంపకపు ప్రయోగాలతో పిల్లల్లానే మిగిలే… గెలవలేని ప్రయత్నం చేస్తున్నారు. ఆ గేలాల్ని, సంకెళ్లనీ కొంటోంది పెద్దలు. బోనుల్లో జింకలు, ఫిష్‌ట్యాంక్‌లో తాబేళ్లు, పంజరంలో పిట్టలు…
ఇప్పటి పిల్లలు. అవి అక్కడక్కడే టపటపా కొట్టుకున్నట్టే చిన్నారులూ అనేక క ృత్రిమత్వాల మధ్య కష్టంగానే సహజాతాలకు, సహజత్వానికి దగ్గరగా ఉండే విఫలయత్నం చేస్తున్నారు. ఆ కృత్రిమత్వమంతా కొని వారి ప్రపంచంలో నింపేసేది పెద్దలే. నిజానికి బాల్యానందం కొంటే వచ్చేది కాదు, ప్రదర్శిస్తే పెరిగేది కాదు. అమ్మానాన్నలు ఆత్మీయంగా పంచాల్సింది.. ప్రేమా, స్పర్శలతో ప్రతి క్షణం పెంపొందించాల్సింది!
బాల్యం.. నాట్‌ ఫర్‌ సేల్‌.
ఇదీ పసిమిదనం
। ‘బాల్యమంటే, మనం తెలుసుకోలేం.. గొప్ప జ్ఞాపకాల్ని, మధుర స్మృతుల్నీ తయారు చేసుకునేదని. ఏదో సరదాగా దొర్లే ఓదశ మాత్రమే కాదది’.
। ‘మీ చిన్నారి ప్రేమించే సాధారణ హ ృదయాన్ని అలానే ఎప్పుడూ ఉండనీయండి.’
। మనం పెద్దోళ్లమైపోవాలని ఎప్పుడూ కోరుకుంటాం, కానీ చివరకి తెలుసుకుంటాం.. పగిలిన హ ృదయం కంటే.. విరిగిన పెన్సిళ్లు, పూర్తిచేయని హోమ్‌వర్క్‌లే ఉత్తమమని’.
। మీ జీవితంలో గొప్ప విషయమంటూ ఒకటుంటే అది ఆనందమయమైన బాల్యం, ప్రేమించే ఇల్లు.’
। ‘భర్తీ చేయలేనిదేదో బాల్యంలో ఉంది.’
। ‘ప్రతిమనిషిలో ఒకటిమాత్రమే ప్రత్యేకంగానిలిచే కథ బాల్యం.’
। ‘జీవిత రుతువుల్లో కన్నా బాల్యమే అత్యంత అందమైన రుతువు.’
। ‘ఎవరూ చనిపోని రాజ్యమంటూ ఉంటే అదే బాల్యం.’
। ‘ఒక్కోసారి కొన్ని చిన్నిచిన్ని సంగతులే మీ హృది గదినంతా ఆక్రమించేస్తాయి.’
। ‘ఓరోజుని ఉదయమోలా చూపిస్తుందో.. మనిషిని బాల్యమలా ఉదయిస్తుంది.’
। ‘ప్రతి వసంతంలో ప్రక ృతి విరిసినట్టే.. బాల్యం తిరిగిపూస్తే ఎంత బాగుండో కదా..!’
। ‘జీవితమంతా మనగలిగేది బాల్యమే..!’
। ‘సంగీతమని చెప్పలేని దానికి కూడా నాట్యం చేసేదే బాల్యం.’
। ‘మీ పాతింటికి తిరిగి వెళితే.. మీరు కోల్పోయిందని అనుకునేది ఆ కట్టడం కాదు, మీ బాల్యం.’
। ‘బాల్యానికంటూ దాని ప్రత్యేకమైన ద ృష్టి, ఆలోచన, భావన ఉంటాయి. మన (పెద్దల) విషయాలతో దాన్ని భర్తీ చేయా లను కునేంత మూర?త్వానికి మించింది మరొకటి లేదు.’
। ‘బాల్యమొక సంభ్రమాశ్చర్యాల ప్రపంచం.’
। ‘కొన్ని నిమిషాల బాల్యాన్ని కోల్పోతే నీ జీవితకాలమంతా ఆ విషయాన్ని మర్చిపోలేరు.’
। బాల్యాన్ని ప్రేమించే కొందరు పెద్దల మాటలివి.- అజయ్‌ కుమార్‌ వారాల

1 4 5 6