అడవిపూల కదంబ మాల`ఆత్మగోష

ఆదివాసీల‘ఆత్మఘోష’ ను అక్షరీకరించి ఎత్తిచూపిన పాండు కామ్టేకర్‌ కథాత్మక కథనాల గుచ్చం ఇప్పటి వరకు తెలుగు కథా సాహిత్యాన్ని గిరిజనుల జీవిత ఇతివృతాలతో సుసంపన్నం చేసిన గిరిజన,గిరిజనేతర రచయితలు కూడా అబ్బుర పడేటంత గొప్పగా సంకలనీకరించిన అడవిపూల కదంబ మాల ఈ కథనాత్మక కథనాల సంపుటం…
అన్నం వండడానికి పొయ్యి మీద ఎసరు, పొయ్యి కింద మంటపెట్టి గాలికి వదిలేస్తే ఎసరొచ్చిన తరువాత ఆ అన్నం కుండ మీది మూత దానంతట అదే పైకి లేచి కిందపడిపోతుంది. అదే విధంగా తన గుండే గాడి పొయ్యిలో ఎసరులా మసిలిపోతున్న గిరిజనుల జ్ఞాపకాల భారాన్ని భరించి, భరించి ఇక భరించలేని స్థితిలోకి వచ్చిన కామ్టేకర్‌ అప్పటిదాకా ఎటువంటి రచనా చేసిన అనుభవం లేకపోయినప్పటికీ తను అనివార్యంగా ఈ కథా కథనాత్మక రచనకు శ్రీకారం చుట్టారు.

కామ్టేకర్‌ తన యాభై రెండేండ్ల జీవనయనంలో సుమారు పాతిక సంవత్సరాల పాటు ఆంత్ర పాలజిస్ట్‌ లపాలిటి బంగారు గని లాంటి ప్రాంతమైన చింతూర్‌ సమీప గ్రామమైన ‘కోయత్తూర్‌ బాట’ రామన్నపాలెంలో ఓస్వచ్ఛంద సంస్థలో నూటికి నూరుపాళ్ళు నిమగ్నమై, అదివాసీ జీవితాలకు సంబంధిం చిన సమస్త కోణాలనూ ఔపోసన పట్టినవాడు. పాఠకులు అతిశయోక్తి అనుకోకుంటే కామ్టేకర్‌ మన తెలంగాణాకు చెందిన మరో హైమం డార్ఫ్‌గా పేర్కొనదగినవాడు.తన స్వంత కుటుంబంతోపాటు మొత్తం ఆదివాసీ సమా జాన్నే తన బలగంగా భావించి,వారి అభ్యు న్నతికి తన పరిధి మేరకు అనేక విధాలుగా శ్రమించిన ఆదివాసీ ప్రేమికుడు. గిరిజన జీవితాలతో తనకున్న రెండున్నర దశాబ్దాల అనుబంధంలో తటస్థపడిన ప్రతి అనుభవాన్ని తన గుండెకవాటంలో తోరణాలుగా గుచ్చి ఒరుగులుగా దాచు కున్నవాడు కామ్టేకర్‌. తన వ్యక్తిగత,ఆరోగ్య కారణాలతో వ్యక్తిగా కోయ త్తూర్‌ బాట నుండి బయటికొచ్చినా మానసి కంగా తను అను నిత్యం గిరిజన జీవితాలనే శ్వాసిస్తున్న వ్యక్తి. అన్నం వండడానికి పొయ్యి మీద ఎసరు, పొయ్యి కింద మంటపెట్టి గాలికి వదిలేస్తే ఎసరొచ్చిన తరువాత ఆ అన్నం కుండ మీది మూత దానంతట అదే పైకి లేచి కింద పడి పోతుంది. అదే విధంగా తన గుండే గాడి పొయ్యిలో ఎసరులా మసిలిపోతున్న గిరిజనుల జ్ఞాపకాల భారాన్ని భరించి,భరించి ఇక భరించ లేని స్థితిలోకి వచ్చిన కామ్టేకర్‌ అప్పటిదాకా ఎటువంటి రచనా చేసిన అనుభవం లేకపోయి నప్పటికీ తను అనివార్యంగా ఈకథా కథనా త్మక రచనకు శ్రీకారం చుట్టారు. దాని ఫలి తమే మన చేతుల్లో వున్న ఈ సంపుటం. ఇందులో కోయపల్లె, పురుడు పోయడం,కొడ కల్పడం,బాణం తయారీ, సంతకు తయారీ, భూమి పండుగ, సుక్కుడు కాయ పండుగ,తాటి పండుగ,ఇప్పపూల పండుగ,కొలుపుల పండుగ,పెద్దమనిషి,చావు, కీడు నీళ్ళు,దినాలు, పేతర్లముంత,ఇంటి నిర్మాణం, గ్రంధాలయం, పెళ్లి,నేల-ఉపాధి,చీమ గుడ్ల కారం, ఆదివాసీ (కోయత్తూర్‌) కులమా? మతమా?, పోలవరం నిరసనలు,ఒంటరి మహిళలు-జీవన విధానం, గుజిడి, పోలవరం ప్రాజెక్ట్‌-తీరుతెన్నులు, ఓదార్పు-సమస్త జీవజాల మద్దతు,సమస్త సమాజానికి సూటి ప్రశ్న అనే ఇరవై ఎనిమిది శీర్షికలతో వ్రాసిన కథాత్మక కథనాలున్నాయి. ప్రతి కథనం ఒక్కో సమస్యను పాఠకుల ముందుకు తీసుకొచ్చి సవివరంగా వాటిని గురించి మనకు వివరిస్తూ మనను మనకు తెలియని లోకంలోకి చేయిపట్టి నడిపించుకు పోతాడు రచయిత కామ్టేకర్‌. మొట్ట మొదటి కథాకథనంలో ‘కోయపల్లె’లో చింతూర్‌ చుట్టుపక్కల ఉళ్ళన్నీ గుంపుల సముదాయం. ఒక్కొక్క గూడెంలో నాలుగు నుండి ఎనిమిది గుంపులుంటాయి.ప్రతి గుంపుకి ఓఇంటి పేరు వుంటుంది.ఆ ఇంటి పేరు వారే గుంపులో ఎక్కువగా వుంటారు. స్తూపాకారంతో చెక్కిన ఓవేప కర్రను పాతి, దాని చుట్టూ మట్టితో గద్దె వేస్తారు. దాన్ని ‘గామం’ లేదా బొడ్రాయి అంటారు. అక్కడే కొలుపుల పండుగ చేస్తారు. పండుగప్పుడు వెదురు బుట్టలో ఒక మట్టి ముంతను పెడతారు.దాన్ని ‘ముడుపు ముంత అంటారు. అందులో వున్న నీళ్ళల్లో పసుపు కలుపుతారు. ఆ పసుపును ‘బండారు’ అంటారు. ఆబండారును గుంపుల్లో అంటు వ్యాధులు ప్రబలినప్పుడు పిల్లలకు బొట్టు పెడతారు. వేల్పులు ఉన్న చోటును ‘అనె గొందే’ అంటారు. జువ్వి లేదా మద్ది చెట్టును గ్రామ దేవతగా ముత్యాలమ్మ పేరుతో కొలు స్తారు. పురుడు పోయడం కథా కథనంలో మంత్రసాని భద్రమ్మ ద్వారా గుంపుల్లో పురుడు ఏవిధగా పోస్తారో కూలంకషంగా వివరించిన సంద ర్భంలో కథకుడి జిజ్ఞాస ఏస్థాయిలో కొనసాగిందో మనకు అర్ధమౌతుంది. అదివా సీల్లో అమ్మాయి పుడితే కొడవలితోను, అబ్బాయి పుడితే బాణంతోనూ బొడ్డు కోస్తారట. ఈగ్రా మాల్లో గల గల పారే ఏటి దారిలో ఏర్పడే చిన్న చిన్న గుంతలను ‘అలంధర్‌’ అంటారట. ఈ అలంధర్ల దగ్గర ఆదివాసీలు విశ్రాంతి తీసుకుంటుంటారు.‘కొడ కల్పడం’అనే మరో కథా కథనంలో హిందూ ధర్మంలో కొన్ని సామాజిక వర్గాల్లో యుక్త వయస్కులౌతున్న మగపిల్లలకు మెడలో జంద్యము వేసి,దాన్ని ‘ఒడుగు’అంటారు. అదే ముస్లీముల్లో మగ పిల్లలకు సున్తీలు చేసి, ఒడుగు అంటారు.ఇక క్రైస్తవుల్లో ఓ నీటి మడుగులో చేయించే పవిత్ర స్నానాన్ని బాప్థిజమ్‌ పేరుతో ఒడుగు అంటారు. అదే ఆదివాసీల్లో పన్నెండేండ్ల మగపిల్లలందరినీ ఒకరోజు దేవర దగ్గరకు తీసుకుపోయి కోల్లను కోసి,వాటి మాంసంతో ఘాటైన చారు కాస్తారు. ఆ చారును ‘జొమ్ము’ అంటారు. ఆ చారుతో పాటు సారా,కల్లులను తాపించి పెద్దవాళ్ళతో సమానమైన హోదా ఇస్తారు.దాన్నే ఒడుగు అంటారు. ఆవిధంగా ఆలోచించి చూస్తే అన్నీ ధర్మాల్లోకల్లా అదీవాసీ ధర్మంలోనే అందరికన్నా ముందుగా ఈఒడుగు అనే ఆచారం ఆచరణలో వున్నట్టుగా అర్ధం చేసుకోవాల్సి వుంటుంది. ‘బాణం తయారీ’ కథా కథనంలో అడవిలో సంచరించే ఆదివాసికి బాణం అతిముఖ్యమైన వేట సాధనం.దాన్ని తయారు చేయడానికి ఎంతో నైపుణ్యం కావాల్సి వుంటుంది. ముందుగా పిల్లల్లు అడుకోడానికి చిన్న విల్లు బాణాలను తయారుచేసి ఇస్తారు. వాటిని ‘‘డుమ్మిరి విల్లు’’అంటారు.ఆ డుమ్మిరి విల్లే తదనంతరకాలంలో ‘డమ్మీ’ అనే ఆధునిక పదంగా మారిపోయి విస్తృత జనబాహుళ్యంలో వాడుకలో కొచ్చింది.‘ఎర్రగడ చేపలు’ అంటే? కొన్నిసార్లు ఎక్కువ చేపలు దొరికినప్పుడు కొన్ని తిని, మిగతా వాటిని తాటి కమ్మల్లో కాల్చి, దోరగా వేయించి,ఎండలో ఎండబెడతారు. వీటినే ‘ఎర్రగడ’ చేపలు అంటారు. వీటి రుచి ఆదివాసులకు ఎంతో ప్రీతి పాత్రమైనది. ‘సంతకు తయారు’ కథలో నేటి షాపింగ్‌ మాల్స్‌ కి మూల రూపమైన గిరిజన సంతలను గురించి కథకుడు చాలా విలువైన సమాచా రాన్ని అందించారు.అంతేకాదు నేటి ఆధునిక హెయిర్‌ డ్రెస్సర్స్‌ కు ఏమాత్రం తీసిపోని హెయిర్‌ డ్రెస్సర్స్‌ ఆదివాసీ మహిళల్లో ఏనాటి నుండో ఊహించ లేనంత కళాత్మకంగా వుండేదో కథకుడు ఎంతో వివరంగా తెలియజేశాడు.‘భూమి పండుగ’ కథా కథనం లో ఆదివాసీలు ప్రతిరోజూ సాయం కాలం తాటి కళ్ళు దింపుకుని వచ్చి,ఒకచోట కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ,తాక్కుంటూ, ఏదో ఒకటి నంజుకుంటూ గడుపుతారు.అట్లా కూర్చునే తావునే ‘‘గుజిడి’’ అంటారు.ఇట్లాగే ఇంకా మిగిలిన కథా కథనాల్లో కూడా మనకు తెలియని అనేక అంశాలను సందర్భో చితంగా వివరించిన రచయితకు ఆదివాసీల ఆచారవ్యవ హారాల్లో ఎంతటిలోతైన అవగాహన వుందో తెలుసుకుంటున్నా కొద్ది మనం ఆశ్చర్యచకి తులమై పోతుంటాము. వాటిల్లో మచ్చుకు కొన్ని….. కమతం అంటే? :- ఎక్కడైనా ఒక్కరే వ్యవసాయం చేసుకోవడం సాధ్యపడదు. అందుకే మూడు నాలుగు కుటుంబాలు కలిసి వారి భూమిని సమిష్టిగా కలిసి దున్నుకుని సాగుచేయడానికి చేసుకునే ఒప్పందం. ఈ కమతాల భావనే తదనంతర కాలంలో సహకార వ్యవసాయానికి మాతృక అయ్యిందేమో అన్పిస్తుంది.
రాగిపట్ట అంటే? :- గ్రామస్తులందరి భూమిని కలిపి ఒకే ఒక పట్టా రాగిరేకు పైన రాసి వుండేది.దీన్నే రాగి పట్టా అంటారు. నెయిదం అంటే? :- భూమి పండుగనాడు దేవతకు బలి ఇచ్చే జంతువు మాంసంతో చేసే వంటకం.ఆ మాంసంలోనే బియ్యం,పసుపు, కారం,ఉప్పు నూనె ప్రతి ఇంటి నుండి తెచ్చినవి అదే పాత్రలో వేసి,నీళ్ళు పోసి,దగ్గరికి ఉడికి స్తారు.అదే నేయిదం. ఆధునికులు చేసుకునే బిర్యానికి ఈ నేయిదమే మూలం అనవచ్చును. ‘కోయ వాళ్ళు’ అంటే? :- దేవరకు పెట్టే కోడిని కత్తితో కోయకుండా నేలకు కొట్టి చంపి, కోసు కుని తింటారు. కాబట్టి వాళ్ళను ‘కోయని వాళ్ళు’,కోయత్తురు అని అంటారు. పూర్ణ కల్లు అంటే? :- రోజు దించే కల్లును, దించకుండా వారంరోజులు వుంచితే చెట్టుకు కట్టి వుంచిన వెదురు గొట్టం నిండుతుంది. అలా నిండిన కల్లును ‘పూర్ణకల్లు’అంటారు. ఇప్ప పూల పండుగ అంటే :- ఇప్పచెట్టు పాలతో బండ కత్తుల పిడులను, కొడవళ్ళ పిడులను ఊడిపోకుండా వుండడానికి సన్నని ఇసుకతో కలిపి,పిడి చుట్టూ వున్న సందుల్లో ఇప్ప ఆకు పాలు పోస్తే ఆ పిడి గట్టిగా రాయిలాగా అతుక్కుంటుంది.అంతటి మహిమ గల చెట్టుకు మొట్టమొదటి సారిగా రాలిన పువ్వులను సేకరించే సందర్భంగా చేసుకునే పండుగానే ‘‘ఇప్పపూల పండుగ’’ అంటారు. బట్టలను ఉతకాలంటే :- మద్ది ఆకు బూడిదలో బట్టలన్నీ నానబెట్టి ఉతికితే మురికి అంతా పోయి, బట్టలకు కమ్మని వాసన వస్తుంది. వార్తలు :- చావు వార్తలు చెప్పడాని వెళ్ళేటప్పుడు చేతుల్లో గొడుగు పట్టుకెళితే అది కీడు కబురని అందరికీ తెలుస్తుంది.ఆ ప్రయాణాన్ని ఆపకుండా మిగతా వాళ్ళు సహకరిస్తారు. అదే శుభకార్యమైతే బాణం పట్టుకు పోతారు. వెట్టి అంటే?’’ :- ఆదివాసీలు తమ తమ ఇండ్లను పూర్తిగా సహకార పద్ధతిలో కట్టుకుంటారు. ఈ పద్ధతినే ‘వెట్టి’ అంటారు.కానీ,ఇదే వెట్టి అనే పదానికి భూస్వామ్య వ్యవస్థలో పేదవారు ముఖ్యంగా కులవృత్తుల వారు,భూస్వాములకు కొన్ని తరాలపాటు జీతం,బత్తెం లేని సేవలు చేయడాన్ని కూడా వెట్టి అంటారు.దీన్ని బట్టి ఒకే పదానికి సమాజాన్ని బట్టి,కాలాన్ని బట్టి అర్ధం మారిపోతుందన్న విషయం మన దృష్టికి వస్తుంది.
పెళ్లి అనే కథలో :- ఆదివాసీల్లో పెళ్లి చూపుల తతంగం ఏడు అంచలుగా సాగుతుంది. వాటిలోనూ పెళ్లి చేసుకునే అమ్మాయి, అబ్బాయి తరపువాళ్ళు ఏ ఒక్కరూ ఒకే తల్లి పాలు తాగివుండకూడదు.వాళ్ళ వరుసలు, గట్టులు అనుకూలంగా వున్నా, వారు ఒక తల్లి పాలు తాగితే వారి మధ్య అన్నా చెల్లి వరుస వున్నట్టుగా భావిస్తారు. అటువంటి బంధాన్ని ‘పాలవంకలు’ అంటారు. ఆటువంటి పెళ్ళిని వారు అంగీకరించరు.పెద్దల కారణంగా వచ్చే ఈ బాధలన్నీ పడలేకనే ప్రేమించుకున్న అమ్మాయిలు,అబ్బాయిలు చాలామంది లేచి పోయి,కొన్నాళ్ళ పాటు సహజీవనాలు సాగించి, ఆ తరువాత మెల్లగా పెళ్లిళ్లు చేసు కుంటారు. మామిడాకులన్నీ ఓచెట్టు చివరలో గుత్తులు గుత్తులుగా వుంటాయి. కొన్ని ఆకులు ఒకదాని కొకటి అంటుకొని ఒక సొరకాయ బుర్ర మాదిరిగా,గుండ్రంగా డొప్పలు డొప్పలు గా కట్టివుంటాయి.ఆ డొప్పల పైన వున్న రంద్రము లోకి ఎర్రచీమలు వస్తూ పోతూ వుంటాయి.ఆ చీమలను ‘అల్లి పెత్తెలు’ అంటారు.చీమలు ఆగూళ్ళల్లో పెట్టిన గుడ్లను సేకరించిన ఆది వాసీలు వాటిని చక్కగా వేయించి కారప్పొడి గాను,చారుగాను తయారు చేసుకుని తింటారు. అవి ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి. ఈ విధంగా పుస్తకం అంతటా మనం ఎరుగని ఆదివాసీల జీవితానికి సంబంధించి ఇప్పటి వరకూ ఎవ్వరూ ప్రస్తావించని అనే విషయా లను కామ్టేకర్‌ తనదైన శైలిలో మనకు అందిం చడమే కాదు. ముందు తరాల గిరిజనులకు ఒక నిధిని సమకూర్చి పెట్టిన వారుగా మిగిలిపోతారు. ప్రధానంగా ఆదివాసీ బిడ్డల సేవా కార్యక్ర మాల్లో మునిగిపోయిన కామ్టే కర్‌కి రచనా ప్రక్రియల్లో ప్రవేశం లేకుండా పోయింది.ఆ కారణం చేతనే ఎంతో విలువైన సమా చారాన్ని పాఠకుల్లో ఉత్సాహాన్ని రేకెత్తించే కథన పద్ధతిలో వ్రాయలేక పోయా రేమో అన్పిస్తుంది.అదో ప్రధానమైన లోపంగా మిగిలిపోయింది. అయినప్పటికీ ఇప్పటివరకూ ఎవరూ పట్టుకొని విధంగా ఆదివాసీ దేవతల ఆత్మల ద్వారా కథనాలను నడిపించడం వినూత్నంగా వుంది. పాతికేళ్ళపాటు తన కార్య స్థానమైన రామన్న పాలెం పరిసర ప్రాంతాలన్నీ పోలవరం ముంపులో జలసమాధి కావడాన్ని జీర్ణించుకోలేక పోతున్న ఆదివాసీల ఆత్మఘోషను వాళ్ళ దేవతల ఆత్మఘోషగా వెల్లడిరచడం అతని ఊహాశక్తికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.ముద్రా రాక్షసం కూడా అక్కడక్కడా కొంచం పాఠకుణ్ణి విసిగించే ప్రమాదం పొంచివుంది.
పై రెండు లోపాలను మినహాయిస్తే ఇప్పటి దాకా తెలుగులో వచ్చిన గిరిజన సాహిత్యంలో ఈ పుస్తకం ఒక మైలు రాయిగా నిలిచిపో యేంత గొప్పగావుంది.-ఇది శీరాంషెట్టి కాంతా రావు. రచయిత కామ్టేకర్‌ భవిష్యత్తు లోనూ ఇటు వంటి విలువైన మరిన్ని పుస్తకా లను వెలువరించాలని కోరుకుందాం!.
ఆత్మఘోష కథాసంపుట కోసం..:
ప్రచురణ : బోధి ఫౌండేషన్‌ పేజీలు : 241 ధర : 400/- రూ.లు.
సెల్‌ నెం. : 63004 84726

ప్రామాణిక వివరణ గిరిజనులు తిరుగుబాట్లు

ఒకప్పుడు మౌఖిక సాహిత్యంకే పరిమితమైన… మన ఆదివాసీ సాహిత్యం… అక్షరాస్యతలో వచ్చిన అభివృద్ధిలో భాగంగా .. వివిధ ప్రక్రియలలో పుస్తకాల రూపంలో… వస్తూ ప్రామాణికతకు చోటుచేసు కుం టుంది, ఈ గిరిజన సాహిత్యంలోని… పుస్తకాల వివరాలను ‘‘గవాక్షం’’ శీర్షికన… ‘‘థింసా పాఠకుల’’ కోసం ప్రతి నెల ఒక పుస్తకాన్ని పరిచయం చేస్తున్న పరిశోధక రచయిత డా. అమ్మిన శ్రీనివాసరాజు గారు ప్రముఖ రచయిత ‘ ప్రో ॥ రామ్‌దాస్‌ ’ కలం నుంచి జాలువారిన పరిశోధనాత్మకమైన ‘ తెలంగాణలో గిరిజనులు తిరగుబాట్లు’ అనే పుస్తకంపై సమీక్ష -డా. అమ్మిన శ్రీనివాసరాజు
మానవ జీవనమే పోరాటాలమయం మనిషి జీవిత కాలం ఏదో ఒక పోరాటాన్ని ఎదుర్కొంటూనే మనుగడ కోసం జీవన పోరాటం సాగించక తప్పదు. మానవ సమాజానికి మూలవాసులుగా ఆదివా సులుగా అభివర్ణించబడుతున్న ఈ అడవి బిడ్డల జీవితమే ఒక పోరాటం. ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో విభిన్న పేర్లతో జీవిస్తున్న ఈ ఆదివాసులు ప్రతి పోరాటానికి మూలవాసులే అనాలి.
ఇక మన తెలుగు ప్రాంతాల్లోని గిరి బిడ్డలు అటు ఆదిలాబాద్‌ నుంచి ఇటు నల్లమల మీదుగా ఉత్తరాంధ్ర వరకు వ్యాపించి ఉన్నారు. అడవుల జిల్లా ఆదిలాబాద్‌ లోని గోండులు పేరు చెప్పగానే కొమరం భీం పోరాటం, ఉత్తరాంధ్రలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నేతృత్వంలో జరిగిన తిరుగుబాట్ల పోరాటాలు, శ్రీకాకుళం గిరిజన తిరుగుబాటు మనకు తెలిసిందే!!
మనుగడ కోసం మొదలైన పోరాటం స్వాతంత్రం కోసం తీవ్ర రూపందాల్చింది. చివరికి స్వరాజ్యదేశంలో కూడా ప్రాంతీయత కోసం,అస్తిత్వాలు కాపాడుకోవడం భూమి కోసం భుక్తి కోసం ఆధునిక తిరుగుబాట్లు పోరాటాలు కొనసాగుతున్నాయి.
పోరాటాలను సమాజ విధముగా చర్యలుగా చూస్తూ వాటిని కూకటివేళ్లతో బికిలించి సమూలంగా నాశనం చేయాలనుకుని రక్షణ దళాల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ..అనేకమంది అమాయకులను బలి చేస్తున్న పాలకులు అసలు పోరాటాలకు మూల కారణం గురించి ఆలోచించడం లేదు.
అచ్చంగా అలాంటి ఆలోచన కోసమే ప్రొఫెసర్‌ రాందాస్‌ రూపావత్‌ పరిశోధ నాత్మకంగా గణాంకాలతో అందించిన ప్రామాణిక పుస్తకమే ‘‘తెలంగాణలో గిరిజనులు తిరుగుబాట్లు’’
ఈ పుస్తకంలో గిరిజనులు చేసిన పూర్వ పోరాటాలు వాటి నేపథ్యం వివరిస్తూ గిరిజనులకు అందించాల్సిన అవకాశాలు, చేయబడ్డ చట్టాలు గురించి క్షుణ్ణంగా వివరించారు రచయిత రామదాస్‌,
తెలంగాణలో గిరిజనులు భూస్వాములు మొదలు ఉద్యమ దశలు కొరకు ఐదు విభాగాలుగా రూపొందించబడిన ఈ ప్రామాణిక పరిశోధక పుస్తకం ద్వారా అనేక విలువైన విషయాలతో పాటు సమగ్ర సమాచారం క్షుణ్ణంగా తెలుస్తుంది.
ఇది కేవలం తెలంగాణ ప్రాంత గిరిజనులకే పరిమితం చేసినట్టు కన్పిస్తున్న దీనిలోని సమస్యలు పరిష్కార మార్గాలు అన్ని ప్రాంతాలకు వర్తిస్తాయి.
అడవి బిడ్డలు తరతరాలు ఓ అనుభవించిన బాధ వివక్షత తిరుగుబాట్ల రూపంలో పెల్లుబికింది,దాన్ని అంతం చేయడానికి పాలకులు చేసిన చర్యలు అన్నీ విఫలం కావడంతో గిరిజన గిరిజనేతల మధ్య అలాగే గిరిజనుల్లోని వివిధ తెగల మధ్య వైరుధ్యాల సృష్టించి అనేక కుట్రలతో ఆదివాసీలను, ఆదివాసీ నాయకులను,లోబర్చుకోవడానికి నిత్య ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి అంటారు రచయిత,
పోరాటాలపై ఎన్ని అణచివేతలు ఉన్నా గోండుల ఆరాధ్య దైవం కొమరం భీం ఆశయం అయిన జల్‌,జమీన్‌,జంగల్‌, కోసం నేటికీ తెలంగాణ అడవి బిడ్డలు తమ అవిశ్రాంత పోరాటం సాగిస్తూనే ఉన్నారు.
తెలంగాణ ప్రాంత గిరిజనుల ప్రధాన సమస్య భూ సమస్య,ఇక్కడి గిరిజనుల ప్రతి పోరాటం దీని చుట్టూనే తిరుగుతుంది.
సహజంగా శాంతికాంకులైన అడవి బిడ్డల్లో ఇలాంటి పరిస్థితులు రావడానికి కారణం తమ కట్టుబాట్లకు తమను దూరం చేస్తూ వారిపై ఆధునిక పెత్తనం చేయడమే ఈ తిరుగుబాట్లకు ప్రధాన కారణం అంటూ వాటిని సహేతు కంగా వివరించే ప్రయత్నం చేశారు.
గిరిజన ప్రాంతాల్లో బ్రిటిష్‌ వారి పాలనలోనే భూముల వ్యాపారం మొదలైంది అని చెబుతూనే 18 వశతాబ్దపు తొలి రోజుల్లో తెలంగాణలో నాటి నైజాం రాజ్యంలో గిరిజనులు బయట ప్రపంచానికి సంబంధంలేని చక్కని జీవనం గడిపేవారు కానీ బ్రిటిష్‌ ప్రభుత్వం నిజాం సర్కారుపై దండెత్తి ఆక్రమించి ఆధిపత్యం చిక్కించుకున్న సమయంలో (1800-1850) బ్రిటిష్‌ వారు చేసిన భూచట్టాలు తదితరాలవల్ల ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది తప్ప ఆదివాసులకు ఎలాంటి లాభం ఉండేది కాదు, అదేవిధంగా అడవుల మీద హక్కులు కూడా కోల్పోయారు.అడవులను రక్షిస్తూ పర్యావరణ సంరక్షకులుగా ఉన్న అడవి బిడ్డలు తమ సొమ్ములకు తామే పన్నులు కట్టే దుర్మార్గపు పరిస్థితి ఏర్పడిరది, అంటూ గిరిజన భూములకు కలిగిన అభద్రత గురించి వివరిస్తూ గిరిజన భూముల దురాక్రమణ కారణాలు వివరిస్తూనే భూ బదిలీ నియంత్రణ చట్టాల ఉల్లంఘన గురించిన వివరాలతో పాటు..
భూబదలాయింపు నిబంధన చట్టం అమలు అయిన వివరాలను పట్టిక రూపంలో పొందుపరిచారు.
రెండవ భాగములో స్వాతంత్రానికి ముందు తరువాత జరిగిన గిరిజన ఉద్యమాల గురించి చారిత్రక గణాంక ఆధారాలతో వివరించ బడిరది,గిరిజన ఉద్యమాల్లో తొలి ఉద్యమంగా 1879-80 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌ కోస్తా జిల్లాలో గల చోడవరం తాలూకాలోని ‘‘రంప’’ అనే గ్రామంలో జరిగిన తొలి ఆదివాసి తిరుగుబాటు అనంతర కాలంలో జరిగిన పోరాటాలకు మూలంగా నిలిచింది,1915- 16 సం:లో జరిగిన కొండ రెడ్ల ఉద్యమం, అనంతర కాలంలో1922-24 మధ్యకాలంలో మన్యంలో జరిగిన అల్లూరి సీతారామరాజు తిరుగుబాటు చరిత్రలో స్థిర స్థాయిగా నిలిచింది. అలాగే 1940 దశకంలో కొమరం భీమ్‌ చేసిన గోండుపోరు,1946-51మధ్య జరిగిన తెలంగాణ సాయుధ పోరాటం మరికొన్ని గిరిజన పోరాటాల గురించి వివరించి చివరగా స్వాతంత్రానంతరం గిరిజనుల దీనస్థితి గురించి కూడా సవివరంగా చెబుతూ దానికి కారణాలు నివారణ మార్గాల గురించి కూడా పరిశోధక రచయిత రామదాస్‌ సహేతుకంగా వివరించారు.
మూడవ విభాగంలో గిరిజన ప్రాంతాలపై జరిగిన పరిశోధనలు మార్గదర్శకాలు గురించిన వివరణలో గిరిజన ఉద్యమాలను నాటి బ్రిటిష్‌ వారు నేటి ప్రజాస్వామ్య పాలకులు ఎన్ని కుయుక్తులు చేసి వ్యూహాత్మకంగా ఉద్యమాల అణిచివేతకు ప్రయత్నాలు చేస్తున్న ఉద్యమాలు మాత్రం ఒక నిర్దిష్టమైన మార్గంలో ముందుకు పోతూ గిరిజనులను ప్రభావితం చేస్తున్నాయి అంటారు రచయిత.
నాల్గవ విభాగంలో తెలంగాణలో గిరిజనుల సామాజిక ఆర్థిక స్థితిగతుల పట్టికల ఆధారంగా విశ్లేషణలు చేయబడ్డాయి.
చిట్టచివరి భాగంలో భూ ఆక్రమణ తీరుతెన్నులు ఉద్యమ దశల గురించి వివరించిన ఈ వ్యాస సంపుటిలో గిరిజన ఉద్యమాలు మొత్తం భూమి కేంద్రంగా జరిగాయని అందుకు గిరిగినేతరులే ప్రధాన కారణం అన్న విషయం చెబుతూనే,చట్టాల గురించి అవగాహన కలిగించడం ద్వారా కలిగే ప్రయోజనాలు ఇందులో వివరించబడ్డాయి.
గిరిజన ప్రాంతాల్లో గిరిజన అభివృద్ధి కోసం ప్రస్తుతం చేపడుతున్న చట్టాలు చర్యలకు తోడు మరికొన్ని చట్ట సవరణలు అభివృద్ధి అవగాహన చర్యలు గురించి ఇందులో కూలంకషంగా వివరించారు.
గిరిజన సాహిత్య అధ్యయనకర్తలు, పరిశోధక విద్యార్థులకు ఎంతో విలువైన సమాచార దర్శిని ఈ ప్రామాణిక పరిశోధక వ్యాస సంపుటి.
తెలంగాణలో గిరిజనులు తిరుగుబాట్లు
రచన : ప్రొఫెసర్‌ రాందాస్‌ రూపావత్‌ పేజీలు : 82, వెల,60/-రూ ప్రతులకు : నవచేతన పబ్లిషింగ్‌ హౌస్‌, హైదరాబాద్‌- 68 ఫోన్‌ : 040-24224453/54. సమీక్షకుడు : డా: అమ్మిన శ్రీనివాసరాజు, సెల్‌ : 7729883223.

ఉచిత ఉపాధ్యాయులు ఆదివాసులు

ఒకప్పుడు మౌఖిక సాహిత్యంకే పరిమితమైన… మన ఆదివాసీ సాహిత్యం… అక్షరాస్యతలో వచ్చిన అభివృద్ధిలో భాగంగా .. వివిధ ప్రక్రియలలో పుస్తకాల రూపంలో… వస్తూ ప్రామాణికతకు చోటుచేసు కుం టుంది, ఈ గిరిజన సాహిత్యంలోని… పుస్తకాల వివరాలను ‘‘గవాక్షం’’ శీర్షికన… ‘‘థింసా పాఠకుల’’ కోసం ప్రతి నెల ఒక పుస్తకాన్ని పరిచయం చేస్తున్న పరిశోధక రచయిత డా. అమ్మిన శ్రీనివాసరాజు గారు ప్రముఖ రచయిత ‘ ప్రో ॥ కంచ ఐలయ్య షెఫర్డ్‌ ’ కలం నుంచి జాలువారిన ‘ ఉచిత ఉపాధ్యాయులు ఆదివాసీలు’ అనే పుస్తకంపై సమీక్ష -డా. అమ్మిన శ్రీనివాసరాజు
సంచల రచయిత కంచ ఐలయ్య గారి కలం నుంచి వెలువడిన పుస్తకం ‘ఉచిత ఉపాధ్యా యులు ఆదివాసీలు’ పేరుకు తగ్గట్టుగానే అందులోని అంశాలు కూడా ఆసక్తికరంగా ఉండి నూతన అంశాలను ఆవిష్కరించారు. పూర్వకాలం నుంచి లిపిలేని భాషలో సంభాషించుకుంటున్న అడవి బిడ్డలంతా ఆధునిక ఆంగ్ల భాష నేర్చుకుంటే అన్ని రంగాల్లో ఘనమైన అభివృద్ధి సాధించేవారు అన్నది రచయిత ప్రొఫెసర్‌ ఐలయ్య గారి భావన.పేర్లు సంస్కృతి,ఆదివాసి వ్యక్తిత్వం, ఆహార సంస్కృతి, శాఖాహార ఉద్దేశం, మద్యం ఆధ్యాత్మిక వాదం,పోడు ఉత్పత్తి ఆదివాసి సృజనాత్మకత,ఆదివాసి సాంకేతిక పరిజ్ఞానం, ఆదివాసి విత్తన వ్యవస్థలు, ఆదివాసి సజీవ నాయకత్వం,ఆధ్యాత్మికత,ప్రతికూల జాతీయ వాదం, సజీవ కథానాయకులు,స్వీయ ఆరాధన,స్త్రీ పురుష సంబంధాలు, ఆదివాసి వివాహం,అనే ఉప విభాగాలుగా సాగిన ఈ పుస్తక అక్షర ప్రయాణంలో ప్రతి అంశం ఒక కొత్త కోణంలో ఆవిష్కరించబడిరది. ఆదివాసీలు వ్యక్తిత్వం రీత్యా వారి జీవన విధానంద్వారా సమాజానికి ఎంతో కొంత నేర్పే వారే అన్న భావన అందించారు. మన సంస్కృతి నాగరికతలకు పునాదులు వేసింది ఆదివాసీలే అన్న విషయాన్ని ఇందులో రచయిత స్పష్టం చేశారు. ముఖ్యంగా ఆదివా సీలు తినే మాంసాహారంలోని ఆరోగ్య కారకాలు మనిషి మనుగడకు ఎలా దోహద పడుతున్నాయో వివరిస్తూనే వారు అలవాటు చేసిన మాంసాహారాన్ని నేటి ఆధునిక సమా జం అనుసరించి ఆధునికమైన కొత్త రుచు లతో ఆరగిస్తున్నారు అంటారు ఐలయ్య గారు. పోడు వ్యవసాయానికి చిరునా మాదారులైన గిరిజనులు వ్యవసాయ కార్యకలాపాల్లో తమదైన భుజశక్తికి ప్రాధాన్యత ఇస్తూ కర్ర ఇనుము కలగలిసిన వ్యవసాయ సాధనాలను కళాత్మకంగా ఉపయోగిస్తూ తమదైన సృజనాత్మకతతో పోడు వ్యవసాయం చేసుకోడాన్ని భిన్న కోణంలో ఆవిష్కరిస్తూ తద్వారా కూడా గిరిజనులు ఆధునిక సమాజానికి బోధకులు ఎలా అయ్యారో నిరూపించారు. ఆదివాసీలు త్రాగే ఆహార పానీయాల్లోని వినూత్న విషయం గురించి చెబుతూ చెట్లనుంచి కల్లు తీయడం వారికి మాత్రమే తెలిసిన గొప్ప ప్రక్రియగా అభివర్ణించారు. అంతేగాక అందులోని ఆరోగ్య కారకాలు శరీర ఆరోగ్యానికి ఎలా దోహద పడుతున్నాయో కూడా వివరించారు తాటిచెట్టు కల్లుతో పాటు ఈత,జీలుగ,వేప,చెట్ల నుంచి వారు తీసే కల్లు ఆరోగ్యానికి ఎలా సహకరిస్తుందో సవివరంగా సెలవిచ్చారు,అలాగే వారు ఆరాధించే దేవుడు సైతం ఈ మద్యాన్ని ఆరగిస్తారని మద్యానికి సైతం ఆధ్యాత్మిక వాదం అనుబంధం చేశారు రచయిత. నేటి మన ఆధునిక పద్ధతులకు ఆధారం ఆదివా సులు అవలంబించే పద్ధతులే కారకం అన్న రచయిత బలమైన వాదనఈ పుస్తకం లోని ప్రతిభాగంలో కనిపిస్తుంది.కొండారెడ్డి లంబాడాలు చెంచులు కోయలు ఉంటే సొంత సామాజిక పేర్లు కలిగి ఉన్న వీరిని ఆధిపత్య ధోరణిలో అందరిని ఒకే గాటిన కట్టేస్తూ గిరిజనులు, వనవాసులు,అని పిలవడం సరైన విధానం కాదు అన్నది రచయిత వాదనే కాదు,అలా పిలిపించు కోవడం వారికి ఇష్టం ఉండదు అని కూడా తేల్చి చెప్పారు దీనిలో వాస్తవికత లేకపోలేదు. ఇక ఆదివాసుల ఆహార నియమాల గురించిన వివరణ కూడా ఇస్తూ కొన్ని రకాల ఆహారం మాత్రమే పవిత్రమైనది మరికొన్ని రకాల ఆహారం అపవిత్రమైనది అనే భావన సరైనది కాదని అంటూనే పవిత్రంగా భావించే శాఖాహారం పట్ల ఆదివాసులు ఇష్టం చూపరు అని కాదు కానీ వారు ఇష్టంగా తినే మాంసా హారంలోని ఔషధ గుణాలను రచయిత కూలం కషంగా వివరించారు.అందులోని ఆదివాసుల పరిజ్ఞానాన్ని సహేతుకంగా చెప్పడంలో రచయిత పరిశీలన శక్తి అర్థమవుతుంది. ఆదివాసీలలో గల సాంకేతిక పరిజ్ఞానం గురించి చెబితే నేటి ఆధునికులకు నమ్మబుద్ధి కాకపోవచ్చు!! కానీ దీనిని సామరస్యంగా తెలుసుకుంటే అడవి బిడ్డల్లో దాగి ఉన్న సాంకేతిక పరిజ్ఞానం అర్థం అవుతుంది. ఇక్కడ మరో విషయం గమనించాలి వీరి సాంకేతిక పరిజ్ఞానం అంతా సహజసిద్ధంగా వారి శారీరక శ్రమనుంచే ఆవిర్బవిస్తుంది తప్ప కృత్రిమంగా యాంత్రిక శక్తుల సాయంతో మాత్రం కాదు. ఈ విషయంలో కూడా ఆధునికులమైన మనం వారి నుంచి నేర్చు కోవలసినది చాలా ఉంది అన్నది రచయిత వాదన ఆవేదన.విత్తనాల వ్యవస్థకు ఆదివా సీలకు గల సంబంధం గురించి చెబుతూ అటవీ ప్రాంతానికి, మైదాన ప్రాంతానికి గల వ్యత్యాసం ఇందులో వివరిస్తూ అటవీ ప్రాంతానికి చెందిన విధానాలు మైదాన ప్రాంతం వారివిగా అన్వయించుకొని అటవీ ప్రాంతం వారికి ఎలాంటి నైపుణ్యాలు తెలియవు అనే ముద్ర వేసిన తీరును కూడా ఇందులో వివరించారు.అగ్రవర్ణాల వారి ఆధిపత్య ధోరణుల వల్ల ఆదివాసీలకు జరిగిన అన్యాయాలు నష్టాలు గురించి సహేతుకంగా ఆలోచింపజేసే విధంగా వివరించారు.రాజ్యం అనే ప్రభుత్వాల వలే, పౌర సమాజం కూడా ఆదివాసీల్లోని సామాజిక శక్తుల సాంకేతికతల నైపుణ్యాలు ఎప్పుడు గుర్తించలేదు, మౌర్యుల కాలంలో చంద్రగుప్తునికి ఆదివాసీల పట్ల సరైన అభిప్రాయం లేకపోవడం కౌటిల్యునికి ఆది వాసీలపట్ల గల తీవ్ర వ్యతిరేకత కారణం గానే తన మంత్రి పదవిని వదిలి రాజ్యతంత్ర గ్రంథమైన ‘అర్థశాస్త్రం’ రచించాడు అనే చారిత్రక వాదన వినిపించారు రచయిత ఐలయ్య.
హిందూ సమాజంలో గల కుల వ్యవస్థ కారణంగా ఆదివాసీలు అందులో ఎమడలేక తమకు సమన్నత స్థానం దక్కక తమకు సము చిత స్థానం కలిగిస్తున్న ఇతర మతాలలోకి వలసలు పోతున్న వైనాన్ని కూడా ఇందులో కూలంకషంగా చెప్పుకు వచ్చారు రచయిత. భారత జాతీయ ఉద్యమంలో ఆదివాసులు చేసిన వీరోచిత పోరాటాలను సైతం జాతీయ వాద వర్గం గుర్తించిన పాపాలపోలేదు అసలు మన దేశంలో బ్రిటిష్‌ పాలకులపై తొలి తిరుగు బాటు ఎజెండా ఎగరవేసింది ఎన్నో ప్రాణ త్యాగాలు చేసింది ఆదివాసి వీర యోధులే కానీ చరిత్రలో ఎక్కడ వారి వివరాలు కనిపించ కుండా జాగ్రత్త పడిరది, అగ్రవర్ణాల వారైన ఆధునిక చరిత్ర రచయితలే!! అన్న విషయం ఈ పుస్తక రచయిత కులంకషంగా వివరిం చారు. ఇలా అనేక విధాలుగా అనేక రంగాల్లో అగ్ర భాగాల నిలిచిన ఈ ఆదివాసి అడవి బిడ్డల ప్రతి పని మనకు ఆదర్శనీయమైన బోధన అంశమే అలా అన్ని విషయాలు మనకు బోధించిన ఉచిత ఉపాధ్యాయులు ఆదివాసి బిడ్డలే అన్న చారిత్రక సత్యాన్ని ముందు తరాలకు అందించిన ఈ పుస్తకం అందరు చదవదగ్గది.
పుస్తకం పేరు : ఉచిత ఉపాధ్యాయులు ఆదివాసీలు
రచయిత :ప్రొఫెసర్‌ కంచ ఐలయ్య, పేజీలు :30, ధర 30/- రూ, ప్రతులకు :ప్రజాశక్తి బ్రాంచీలు
సెల్‌ :94900 99057, సమీక్షకుడు :డా:అమ్మిన శ్రీనివాసరాజు

గిరిజన ప్రగతికి చిహ్నం ఈ గిరిజన సాహిత్యం

ఒకప్పుడు మౌఖిక సాహిత్యంకే పరిమితమైన… మన ఆదివాసీ సాహిత్యం… అక్షరాస్యతలో వచ్చిన అభివృద్ధిలో భాగంగా .. వివిధ ప్రక్రియలలో పుస్తకాల రూపంలో… వస్తూ ప్రామాణికతకు చోటుచేసు కుం టుంది, ఈ గిరిజన సాహిత్యంలోని… పుస్తకాల వివరాలను ‘‘గవాక్షం’’ శీర్షికన… ‘‘థింసా పాఠకుల’’ కోసం ప్రతి నెల ఒక పుస్తకాన్ని పరిచయం చేస్తున్న పరిశోధక రచయిత డా. అమ్మిన శ్రీనివాసరాజు గారు ప్రముఖ రచయిత ‘‘ ఆచార్య ఎం.గోనా నాయక్‌ ’’ కలం నుంచి జాలువారిన ‘‘ గిరిజన సాహిత్యం ’’ అనే పుస్తకంపై సమీక్ష -డా. అమ్మిన శ్రీనివాసరాజు
పూర్వపు గిరిజన సాహిత్యం అంతా గిరిజనేతరులు రాసిన ‘‘అనుభూతి సాహిత్యం’’ నేటి ఆధునిక కాలంలో విద్యావంతులైన గిరిజన జన జాతి రచయితల రాస్తున్న ‘అనుభవ పూర్వక సాహిత్యం’ దీనిలో మరి కాస్త ప్రామాణికత ఉంటుంది అనేది విశ్లేషకులు మాట.
అచ్చంగా ఆ కోవకు చెందింది ఈ ‘గిరిజన సాహిత్యం’ అనే ప్రామాణిక పుస్తకం. రచయిత ఆచార్య యం.గోనా నాయక్‌ గిరిజన సామాజిక వర్గంకు చెందిన అత్యు న్నత విద్యాభ్యాసం పూర్తి చేసుకుని విశ్వ విద్యాలయ ఆచార్యునిగా వృత్తి జీవితం గడుపుతున్నారు.
ఆచార్య నాయక్‌ లక్ష్యం తమ గిరిజన సంస్కృతి భాషా సాంప్రదాయాలను ప్రామాణికంగా విశ్వవ్యాప్తం చేయాలని, అందులో భాగంగానే విశ్వవిద్యాలయ స్థాయిలో అధ్యయనం చేస్తూ, రాస్తూ, విద్యార్థుల పరిశోధనలకు చేయూతనిస్తున్నారు.
ఆయన రాసిన అనేక గిరిజన భాషా పరమైన రచనల్లో ఒకటి ఈ ‘గిరిజన సాహిత్యం’ అనే పుస్తకం.దీనిలో గిరిజన మూలాలు,గిరిజన తెగలు,గిరిజనులు సాంఘిక ఆచారాలు,గిరిజనసాహిత్యం, పొడుపు కథలు, అనే విభాగాలు ఉన్నాయి.
మానవ శాస్త్రవేత్తల్లో ప్రముఖుడైన మోర్గాన్‌ చెప్పిన సిద్ధాంతాన్ని అనుసరించి ఆది మానవుని కన్నా ముందుతరం నుంచి నాటి ఆటవిక యుగంలోనే ఆదిమ గిరిజనులు ఈ భూమి మీద నివసించారని ఆధుని కాలం నుంచి తమదైన సంస్కృతిని పరిరక్షించుకుంటూ నాగరిక సమాజానికి దూరంగా అడవుల్లో మైదాన ప్రాంతాల్లో తమదైన ప్రత్యేక జీవన శైలిలో నేటికీ వీరు జీవిస్తున్నారు.
మానవ శాస్త్రవేత్తల నిర్వచనాలను అనుసరించి గిరిజనుల నామౌచిత్యాల వివరణ చేసి వివిధ శాస్త్రవేత్తల నిర్వచనాలను క్రోడీకరించి అందులోని సారూప్యతల ఆధారంగా గిరిజనుల లక్షణాలు భాషా తదితరాలను అభివ్యక్తీకరించారు.
రెండవ విభాగంలో గిరిజన తెగల గురించిన వివరణ దేశంలోని రాష్ట్రాలు ప్రాంతాల వారీగా ఆయా తెగల వివరణలు అందించి మొత్తం 35 తెగలుగా నిర్ధారించారు. ప్రతి తెగకు సంబంధించిన ముఖ్యమైన లక్షణాలను కూడా ఇందులో సంక్షిప్తంగా తెలపడం ఉపేత్తంగా ఉంది ప్రాచుర్యమైన గిరిజన తెగతో పాటు రోనా,మూకదొర,కూలియ, మాలీలు,వంటి మరికొన్ని గిరిజన తెగల వివరాలు కూడా ఇందులో పొందు పరిచారు.దీనిలో ఆయా గిరిజనులకు సంబంధించిన వర్గీకరణ శాస్త్రీయంగా అందించారు.గిరిజనుల సాంఘిక ఆచారాల విషయానికి వస్తే గృహ నిర్మాణం మొదలుకుని వారి వేట,వేట సాధనాలు,పండుగలు,నృత్యాలు, రీతులు వివరించారు దీనిలో ఆయా గిరిజనులు చేసే నృత్యాల రకాలు సవివరంగా వ్రాశారు వీటిలో జాతావులు చేసేగజ్జల నృత్యం,గొలుసు నృత్యం,కోంధ్‌లు చేసే మయూరి నృత్యం, భగత, వాల్మీకి,తెగల వారు చేసే గుమ్మలాట నృత్య విశేషాలు గురించి ఆసక్తికరంగా వివరించారు.
నమ్మకానికి చిరునామాదారులైన ఆదివాసీల్లోని విభిన్న రకాల నమ్మకాలను క్షుణ్ణంగా సహేతుకంగా రచయిత గోనా నాయక్‌ వివరించారు
ఆదివాసీల నమ్మకాలు ఎక్కువగా ప్రాకృతిక శక్తుల నుంచి తమను తాము రక్షించు కోవ డానికి, సులభంగా వేటాడుకోవడానికి,వారి జీవనం సక్రమంగా సాగిపోవడం కోసం, ప్రకృతిలో కనబడని శక్తుల్ని పూజించటం, బలు లు ఇవ్వడం చేస్తారు.వీరిజీవితంలో జరిగే ప్రతి సంఘటన ఏదో ఒక నమ్మకాన్ని సూచిస్తుంది.
కలలకు సంబంధించి, ఆరోగ్య సంబంధం, గృహ సంబంధిత, వ్యవసాయ సంబంధిత,దైవ సంబంధిత, వార వస్తు, వేటకు సంబంధించిన వీరి నమ్మకాలు చాలా చిత్ర విచిత్రంగా ఉంటా యి. వీటిపూర్వకాల పద్ధతులు సంఘటనలు ముడిపడి ఉన్న సామాజిక శాస్త్రీయతలు కల గల్సి ఉంటాయి. గిరిజనుల్లో కనిపించే వైద్య విధానంలో నాటు పద్ధతులు కనిపించిన అంతర్గతంగా శాస్త్రీయత ఆగుపిస్తుంది వీరి వైద్యంలో ప్రధానంగా అనేకుల అనుభవాల సమ్మేళనం కనిపిస్తుంది వీరు ఎక్కువగా అడవుల్లో లభ్యమయ్యే వనమూలికలు,చెట్ల ఆకులు,బెరడు,అడవి జంతు వులను మందులుగా ఉపయోగిస్తారు.
పాల చెక్క పచ్చిపసుపుల మిశ్రమం నీళ్ళ విరోచనాలు తగ్గడానికి, బర్నిక చెట్టు పాలను దగ్గు తగ్గడానికి, మూర్ఛ వ్యాధి నయం కావడానికి పులి కొవ్వు, నడుం నొప్పికి ఉడు మాంసం ఒళ్ళు నొప్పులకు ఎలుగుబంటి కొవ్వు తాగించడం వంటి అనేక గిరిజన వైద్య విధానాలు ఇందులో తెలుసుకోవచ్చును.
ఇక ‘గిరిజనుల సాహిత్యం’ గురించి నాలుగో విభాగంలో వివరించారు, వీరి సాహిత్యమంతా మౌఖికంగా నృత్య గీతాలలో నిక్షిప్తం అయినట్టు ఇందులో చెప్పబడిరది.సాధారణంగా గిరిజనుల జీవన విధానం అంతా సంఫీుభావంతో ముడిపడి ఉంటుంది, వివిధ సామాజిక శాస్త్రవేత్తల నిజ నిర్ధారణ ద్వారా వీరి సంగీత నృత్య రీతులను నిర్ధారించి వివరించారు.
జానపద సంగీతం, శాస్త్రీయ సంగీతం,సృష్టి రూపాన్ని సంతరించుకోవడానికి ఎన్నో సంవత్స రాలకు ముందే ఈ గిరిజన సాహిత్యం పుట్టిం దని సంగీతానికి తొలి రూపం గిరిజనుల ఆటపాటలే అని నిర్ధారించారు.
నృత్య గీతాలు రకాలు నృత్య గీతాల అర్థ వివరణ వర్గీకరణ తదితరాలు ఇందులో క్రోడీకరించారు, దీనిలో వివిధ తెగల పాటలు అర్ధ వివరణలతో అందించడం వల్ల అందరికీ ఉపయోగంగా ఉంది.
అదేవిధంగా లంబాడాలు అని పిలవబడుతున్న బంజారాల మూలస్థానం గురించిన పూర్తి వివరణ సహేతుకంగా ఇచ్చారు.
వీరిలో కనిపించే సాంప్రదాయాల ఆధునీకరణ పద్ధతులు వారిలోని సంస్కృతి సాహిత్యాల అభివృద్ధి కారణాలు గురించి కూడా మనం ఇందులో కూలంకషంగా చదవవచ్చు.
సాహిత్యంలో భాగమైన పొడుపు కథలను చివరిదైనా ఐదవ భాగంలో ప్రస్తావించారు, గిరిజన తెగల్లో కూడా ఈ పొడుపు కథలు ప్రముఖ పాత్ర వహిస్తాయి ఇందులో వ్యవ సాయ,వివాహ,సామాజిక, పరిస్థితులకు సంబంధించిన వాటిని వర్గీకరించి వివరించారు.బంజారా భాషలోని పొడుపు కథలను తెలుగీక రించి ఇందులో రచయిత వివరించడం ఉపయుక్తదాయకం.
ఈ పుస్తకం నిడివిలో చిన్నదైన విషయ వివరణలో చాలా పెద్దది అనాలి,దీనిలో ప్రతి విషయాన్ని పరిశోధక రచయిత గోనా నాయక్‌ అత్యంత శ్రద్ధగా బాధ్యతాయుతంగా ప్రామా ణికంగా రాయడం అభినందనీయం.
నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభల ప్రచురణలో భాగంగా 2012లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రచురణగా వెలువడ్డ ఈ పరిశోధనాత్మక పుస్తకం పరిశోధకుల పాలిట కల్పవృక్షంగా చెప్పవచ్చును. పరిశోధకులతో పాటు గిరిజన సాహిత్య అధ్యయన విద్యార్థులు, ఆసక్తిగల ప్రతి ఒక్కరూ విధిగా చదవదగ్గ విలువైన పుస్తకం ఇది.
పుస్తకం పేరు : గిరిజన సాహిత్యం, రచన : ఆచార్య యం.గోనా నాయక్‌, పేజీలు :124, వెల:30/- రూ,
ప్రతులకు : తెలుగు అకాడమీ, హిమాయత్‌ నగర్‌,హైదరాబాద్‌.
సమీక్షకుడు : డా:అమ్మిన శ్రీనివాసరాజు, సెల్‌ : 7729883223.

అడవి బిడ్డల బ్రతుకు చిత్రం అనంత యానం

ఒకప్పుడు మౌఖిక సాహిత్యంకే పరిమితమైన… మన ఆదివాసీ సాహిత్యం… అక్షరాస్యతలో వచ్చిన అభివృద్ధిలో భాగంగా .. వివిధ ప్రక్రియలలో పుస్తకాల రూపంలో… వస్తూ ప్రామాణికతకు చోటుచేసు కుం టుంది, ఈ గిరిజన సాహిత్యంలోని… పుస్తకాల వివరాలను ‘‘గవాక్షం’’ శీర్షికన… ‘‘థింసా పాఠకుల’’ కోసం ప్రతి నెల ఒక పుస్తకాన్ని పరిచయం చేస్తున్న పరిశోధక రచయిత డా. అమ్మిన శ్రీనివాసరాజు గారు ప్రముఖ రచయిత ‘‘ గుమ్మడి లక్ష్మీనారాయణ’’ కలం నుంచి జాలువారిన ‘‘ అనంత యానం ’’ అనే పుస్తకంపై సమీక్షడా. అమ్మిన శ్రీనివాసరాజు
అడవి బిడ్డల బ్రతుకుచిత్రం అనంతయానం నేటి ఆధునిక తెలుగు సాహిత్యంలో అంత ర్భాగం అవు తున్న గిరిజన సాహిత్యం ప్రారం భంలో మౌఖికంగా తర్వాత కాలంలో ఆంత్రోపాలజిలో ఒక భాగంగా ఉండేది అనంతర కాలంలో విశ్వవిద్యాలయ స్థాయిలో పరిశోధనలకు ఎంతో ప్రధాన వస్తువుగా ఉన్న ఈ గిరిజన సాహిత్యం నేడు ఎంతో పరిణితి చెంది ప్రామాణిక దశకు చేరుకుంది. ప్రభుత్వాల లక్ష్య శుద్ధి తో గిరిజన యువతలో అక్షరాస్యత శాతం దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉద్యోగులుగా రచయితలుగా ఎదుగు తున్న శుభ తరుణం ఇది. అందులో భాగం గానే ఆదివాసి తొలి వ్యాసకర్తగా చరిత్రలో నిలిచిన ఆధ్యాపక రచయిత గుమ్మడి లక్ష్మీ నారాయణ కలం నుంచి వెలువడిన వ్యాస సంపుటి ఈ ‘‘అనంతయానం’’
సుమారు పాతికేళ్లపాటు ఆయన చేసిన అక్షర ప్రస్థానంలో అనేక ప్రామాణిక వ్యాసాలు వెలు వడ్డాయి,ఇవి అడవిబిడ్డలచరిత్ర,సంస్కృతి, సమకాలీన సమస్యలు,విద్య ఉద్యోగ ఆరోగ్య అంశాలు,సామాజిక జీవన పోరాటాలు,ఆధ్యా త్మిక సంబరాలు,తదితర అంశాలుగా విభజిం చబడి కూలం కశంగా సవివరమైన ప్రామా ణిక గణాంకాలతో పొందు పరచబడ్డాయి. ఇటు సమాచారానికి అటు పరిశోధనలకు ఎంతో ఉపయోగంగా ఉండే ఈగిరిజన వ్యాస రత్నాలన్నిటిని ఒకచోట రాసి పోసి అందించి నట్టు పుస్తక రూపంలో వెలువరించిన వ్యాస రచయిత గుమ్మడి లక్ష్మీనారాయణగారి అక్షర కృషి అభినందనీయం ఆచరణీయం.నిరంతర పరిశీలన అధ్యయనంద్వారా తన జాతి జనుల అభివృద్ధి కోసం రచనల పరంగా గుమ్మడి గారి కృషిలో ఆవేదన అడుగడుగునా అర్పి స్తుంది,తన జాతికి చెందిన మరుగునపడ్డ వీరుల వివరాలు గురించి గతంలో వివరిం చిన ఈరచయిత ఇప్పుడు అదే బాణిలో తన జాతి సంస్కృతిలోని చరిత్ర పుటలు తిరగేస్తూ అనేక ఆసక్తికర విషయాలు ఆవిష్కరించారు.
ఇప్ప చెట్టుకు,పచ్చబొట్టుకు,అడవి బిడ్డలతో గల అనుబంధం గురించి ఇందులో ఎంతో శాస్త్రీయంగా చారిత్రకంగా తెలిపారు.వారి పెళ్లిళ్లలోని నిరాడంబరత సంస్కృతిని ప్రతిబిం బించే నృత్యం సొగసులు గురించి చెబుతూ ఆదిమ గిరిజనులు అంటే ఆదివాసీలే అని సూత్రీకరించారు,అంతటితో ఆగకుండా అడవి బిడ్డలను ఆత్మ గౌరవ ప్రతీకలు అని నిరూ పించారు.
ఇంతటి ప్రాధాన్యత గల ఈ ఆదివాసీలు నాటి నిజాం కాలం నుంచి నేటి ప్రజాస్వామ్య ప్రభు త్వాల దాకా ఎదుర్కొన్న బాధల గురించి వివరించారు. అంతేగాక ఆదరణ కోల్పోతున్న ఆదివాసి వైవిధ్యం గురించి కూడా చర్చించారు.ఆదివాసుల భూసంరక్షణ కోసం ప్రతిష్టా త్మకంగా ఏర్పాటు చేసిన 1/70 చట్టంకు సంబంధించిన పూర్వ చరిత్ర దాని నిర్మాణం అనంతర కాలంలో దాని అమలులో అధికా రులు,గిరిజనేతరులు చేస్తున్న కుతం త్రాల కారణంగా చట్టం వల్ల ఆదివా సులకు జరుగు తున్న నష్టం అరణ్య రోదనగా అభివర్ణి స్తూ అధికారులను ఆలోచింపజేశారు.అలాగే అటవీ హక్కుల చట్టం,పెసా,గిర్‌గ్లాని,నివేదిక లు తదితర అంశాల గురించి వివరించిన విషయాలవల్ల వ్యాస రచయిత పరిశీలన, ఆవేదన,కూలంకషంగా అర్థమవుతాయి. బహుళ ప్రజాదరణ పొందిన గిరిజన చట్టాల వివరణతో పాటు అంతగా ప్రాచుర్యం పొందని ‘1960చట్టం’వివరణతో అమాయక గిరిజనులు వడ్డీవ్యాపారుల బారినపడ కుండా ఎలా రక్షణ కలిగిస్తుందో దీనిలో వివరిస్తూ ఏజెన్సీలో రెడ్డి వ్యాపారుల అక్రమాలు గురిం చిన వివరణ తెలిపారు వ్యాసకర్త. అలాగే పోలవరం నిర్వాసితుల గోడు గురించి చెబుతూనే గిరిజనుల అభివృద్ధి కోసం విడు దల చేస్తున్న నిధులకు అవినీతి చెదలు ఎలా పడుతున్నాయో వివరిస్తూ స్వయం పాలన, రాజకీయ చైతన్యం,గిరిజనుల రాజ్యాంగ రక్షణలు,ఐదవ షెడ్యూల్‌,గురించిన వివరణతో పాటు ఆదివాసీల స్వయం పాలనకు‘‘పెసా చట్టం’’ఎలా ఉపకరిస్తుందో తగు వివరణ అందించారు. ఇంద్రవెల్లి సంఘటనను గోండులకు మాయని గాయంగా గుర్తుచేస్తూనే అడవి బిడ్డల హక్కుల గురించి వివరించారు. తెలంగాణ రాష్ట్రవృక్షంగా,విప్ప చెట్టును ప్రక టించాలనే డిమాండ్‌ గట్టిగానే వినిపించారు. ఇక అడవి బిడ్డల ఆధ్యాత్మిక విషయాలకు వస్తే,నాగోబా,వంటి కుల దేవతల గురించే గాక సమ్మక్క సారక్క గుండం రామక్క, జంగుబాయి,ముసలమ్మ,వంటి వీరవనితల ప్రస్తావన తీసుకువచ్చారు,కోయిల మాఘ పున్నమి గోవులు దండారి పాండవుల ఏడు బావుల జలపాతం గురించి వివరణ చేస్తూనే అసలు ఆదివాసీలది ఏమతం? అనే ప్రశ్నను వివరించిన వైనం ఉపయుక్తంగా ఉంది.
నేటి ఆధునిక గిరిజన సమాజంకు అందుతున్న విద్యా ఉద్యోగ ఆరోగ్యం గురించిన వ్యాసపరం పరలో రచయిత ఆవేదన అర్థమవుతుంది, ఏజెన్సీలో నిర్వహించబడుతున్న విద్యా విధా నం అంతరించిపోతున్న ఆదిమ భాషలో వాటిని కాపాడాల్సిన బాధ్యతలు గిరిజనులకు మాతృభాషలో విద్యాభ్యాసం అందించాల్సిన అవసరం ఆన్లైన్‌ విద్యద్వారా సమాచార వ్యవస్థకు అల్లంత దూరాన ఉండే ఆదివాసీ సమాజానికి జరుగుతున్న నష్టాలను సహేతు కంగా వ్యాస రచయిత అందించారు. రాజ్యాంగం ప్రకారం గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్లు పెరుగుతున్నప్పటికీ అది అసలైన ఆదివాసీల దరి చేరడం లేదనే విషయాన్ని కూడా సవివరమైన గణాంకాలతో వివరంగా అందించారు, ప్రభుత్వాలు,రాజకీయ పక్షాలు, ఆదివాసీల హక్కులకు రిజర్వేషన్లకు ఆటంకం కలిగించే శక్తులను గురించి రక్షణ కల్పిం చాల్సిన తక్షణ కర్తవ్యాన్ని గుమ్మడి తన వ్యాసాక్షరాల గుండా నిర్ధారించారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోనే గిరిజన జాతులపై జరిగిన జరుగుతున్న దాడులు సామూహిక హత్యల గురించి సభ్య సమాజానికి కూడా తెలియడం లేదని ఇలాంటి దాడులకు కారకులైన వారిపై చట్టపరమైన చర్యలు తక్షణం తీసుకోవాల్సిన అవసరాన్ని పాలకులకు హెచ్చరిక వంటి సందేశాన్ని ఇందులో ఉటంకించారు, వాస్తవానికి అతి ప్రాచీన కాలానికి చెందిన ఆదిమ జాతులైన ఆదివాసీలను ప్రామాణి కంగా చారిత్రకంగా గుర్తించలేదని కేవలం వారిలోని నిరక్షరాస్యత కారణంగా వారి ఉత్కృష్టమైన చరిత్ర సంస్కృతులు మరుగున పడిపోతున్నాయి, కానీ వారిదైనా చిత్రలిపి పడిగెలు మౌఖిక సాహిత్యాల ద్వారా వారి అమూల్యమైన చరిత్రను నిక్షిప్తం చేసుకున్నారనే పరిశోధనాత్మక అంశాలను ఇందులో పొందుపరిచారు రచయిత లక్ష్మీనారాయణ. ప్రధాన వ్యాసావళికి అనుబంధంగా అందిం చిన అనుబంధంలో కూడా చాలా విలువైన విషయాలు పొందుపరిచారు పుస్తక రచయిత ఆదివాసీల పోరాట విజయాలకు ప్రతీక అయి నా మేడారం సమ్మక్క సారక్క జాతర గురిం చిన చారిత్రిక విజయాలు జాతర పరాయి కరణ అవుతున్న తీరు. ఆదిలాబాద్‌ ప్రాంతా నికి చెందిన గోండులు ఆరాధ్య దైవంగా భావించే ‘‘జంగుబాయి’’ని వారు ఆరాధించే వైనం,వింత ఆచారాలు గురించిన సమాచారం మనం ఇందులో చదవవచ్చు. నేటి ఆధునిక ఆదివాసీ సమాజంలో ఆదివాసి యువత సాధించిన విజయాల స్ఫూర్తిగాథలు సైతం ఇందులో అందించడం ద్వారా నేటి గిరిజన యువత సాధించిన ప్రగతి ప్రపంచానికి తెలుస్తుంది ఇలా ప్రతి విషయం ప్రామా ణికంగా అక్షయకరించిన ఈ గిరిజన వ్యాసాలు భావితరం పరిశోధకులకే కాక గిరిజన సాహిత్య వికాసానికి ఎంతగానో ఉపకరిస్తాయి.ఎంతో విలువైన గిరిజన జాతి సమాచారం సేకరించి పుస్తక రూపంగా అక్షరబద్ధం చేసిన రచయిత అక్షర కృషి వెలకట్టలేనిది.
అనంత యానం (వ్యాస సంపుటి) రచయిత : గుమ్మడి లక్ష్మీనారాయణ పేజీలు : 226 వెల : రూ 300/- ప్రతులకు : రచయిత `9491318409 సమీక్షకుడు : డా:అమ్మిన శ్రీనివాసరాజు సెల్‌ : 7729883223.

సమ్మక్క సారక్కల చారిత్రిక వీరగాధ పోరుగద్దే మేడారం

ఒకప్పుడు మౌఖిక సాహిత్యంకే పరిమితమైన… మన ఆదివాసీ సాహిత్యం… అక్షరాస్యతలో వచ్చిన అభివృద్ధిలో భాగంగా .. వివిధ ప్రక్రియలలో పుస్తకాల రూపంలో… వస్తూ ప్రామాణికతకు చోటుచేసు కుం టుంది, ఈ గిరిజన సాహిత్యంలోని… పుస్తకాల వివరాలను ‘‘గవాక్షం’’ శీర్షికన… ‘‘థింసా పాఠకుల’’ కోసం ప్రతి నెల ఒక పుస్తకాన్ని పరిచయం చేస్తున్న పరిశోధక రచయిత డా. అమ్మిన శ్రీనివాసరాజు గారు ప్రముఖ రచయిత ‘‘జయధీర్‌ తిరుమల రావు’’ కలం నుంచి జాలువారిన ‘‘ వీరుల పోరు గద్దె మేడారం’’ అనే పుస్తకంపై సమీక్ష -డా. అమ్మిన శ్రీనివాసరాజు
ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసి జన జాతరగా చరిత్రలో నిలిచిన మేడారం జాతరకు కారకురాలైన గిరిజన వీరవనిత ‘‘సమ్మక్క’’కు సంబంధించిన సంపూర్ణ చరిత్ర గాని, దానికి ఆధారమైన శాసనాలు, ఇతర ఏ ఆధారాలు ప్రామాణికంగా ఇంతవరకు ఎక్కడా లభ్యం కాలేదు. మరి అంత పెద్ద సంఘటనకు సాక్ష్యం గిరిజనుల విశ్వాసం,వారి పూర్వీకుల నుంచి మౌఖిక రూపంలో అందిన పుక్కిట పురాణ గాథలే..! సమ్మక్క పుట్టుక,జీవనం,వీర మరణాలకు సంబంధించి వివిధ కథనాలు వినిపిస్తూ కొన్ని తేడాలు అనిపిస్తున్న. అన్ని కథనాలు కాకతీయ ప్రభువు ప్రతాపరుద్రుని కేంద్రంగా తీసుకుని నడుస్తు న్నాయి. అయితే కాకతీయుల చరిత్రకు సంబంధించిన ఏశాసనాలు గ్రంథాలలో మేడారం సమ్మక్క ప్రస్తావనగాని,జరిగిన పోరాటం గురించి గానీ,ఉఠంకించబడలేదు. అంత పెద్ద కాకతీయ రాజ్యంలో మేడారం ప్రస్తావన, ఆనాటి వారికి అత్యంత చిన్న విషయం అయి ఉండవచ్చు. ఇక గిరిజనులు నిరక్షరాస్యులు కావడం చరిత్రలను భద్రపరు చుకునే శక్తి లేకపోవడం వంటి కారణాలతో నేటి ఇంత పెద్ద జన జాతరకు ఆనాటి చరిత్రలో చిరు స్థానం కూడా దక్కలేదు. అర్థ శతాబ్ద కాలం క్రితం ఈ మేడారం సమ్మక్క జాతర కేవలం కొన్ని గిరిజన కుటుంబాలకే పరిమితమై స్థానిక గిరిజన జాతర పండుగ మాత్రమే. ఇటీవల ఈజన జాతర విశ్వవ్యాప్తం కావడంతో అందరి దృష్టి దీని మీద నిలిచింది, దానితో ఊహాత్మకమైన కథలు,రచనలు,పాటలు,సినిమాలు,రావడం మొదలయ్యాయి. ఏ విశ్వవిద్యాలయాలు గాని ఇంతవరకు ప్రామాణికమైన పరిశోధనలు అందించలేదు. ఆ లోటు తీర్చే సంకల్పంతోనే ప్రముఖ రచయిత, గిరిజన సాహితీవేత్త, జయధీర్‌ తిరుమలరావు ఎంతో శ్రమతో తన క్షేత్ర పర్యటనల సాయంగా పూర్వ ఖమ్మం జిల్లా మణుగూరు మండలంలోని తోగ్గూడెం గ్రామానికి చెందిన డోలి వారితో పడిగె సాయంతో సకిన రామచంద్రయ్య బృందంతో గానం చేయించిన ‘‘సమ్మక్క సారలమ్మల వీర గాధ’’ను పుస్తక రూపంలో ప్రచురించారు. తరాలతరబడి డోలి కళాకారుల ద్వారా పాటల రూపంలో ప్రదర్శించబడుతున్న ఈ మౌఖిక సాహిత్యంకు అక్షర రూపం కలిగించటం అభినందనీయం ఉపయోగకరం. 136 పేజీల ఈ ఉపయుక్త పుస్తకంలో విషయం పాటల రూపంలో ఉన్న, వాటి దిగువ అందించిన వచన సమాచారం,కొన్ని గిరిజన భాష మాటలకు పాద సూచికల రూపంలో అందించిన వివరణతో సంపూర్ణ సమాచారం తెలుస్తుంది. గిరిజనులు పరమ పవిత్రంగా భావించి,పూజించే,‘‘పడిగె’’ సాయంగా ఈ వీర గాధ వివరించారు.కోయ వారి చరిత్రకు శాసనాల వంటివి ఈ పడి గెలు, త్రికోణకారంలో గుడ్డలతో తయారు చేయబడే వీటి మీద వివిధ రంగులు ఆకారా ల్లో చిత్రించబడే గుర్తులు ద్వారా ఆయా చరిత్రలకు సంబంధించిన గోత్రాలు గోత్రపు పురుషుడు ఇంటిపేర్లు ప్రాంతాలు వాహనాలు పోరాటాలు మహిమలు అన్ని చిన్నచిన్న రేఖా చిత్రాల రూపంలో ఈ పడిగెల మీద ఉంటా యి. వాటి సాయంగా డోలి వారు ఆయా చరిత్రల గాథలను చర్మ వాయిద్యం ఆయన ‘‘డోలు’’ వాయిస్తూ గేయ కథా రూపంలో గానం చేస్తూ ఉంటారు. గిరిజనుల ఆశ్రిత కులం వారైనా ఈ డోలీలను గిరిజనుల చరిత్ర గురువులుగా,పూజారులు,అడ్డెలు,గా ఇందులో అభివర్ణించారు. అభిప్రాయాలు మొదలు పాద సూచికల వరకు 8 విభాగాలతో పాటు అనుబంధంగా ప్రధాన సంపాదకుని అను భవాలు, చిత్రాలతో ఈ పుస్తకాన్ని పొందు పరిచారు. ప్రతి విభాగంలో ఎంతో విలువైన అనుభవైఖ్యమైన సమాచారం అందించారు. ముఖ్యంగా సమ్మక్క వంశవృక్షం దీనిలో ప్రాధాన్యత సంతరించుకుంది నాలుగో గట్టు కోయరాజులైన సాంబశివరాజు-తూలుముత్తి దంపతుల ఐదుగురు సంతానంలో పెద్ద కుమార్తె సమ్మక్క.ఆమె భర్త పగిడిద్దరాజు వారికి సారలమ్మ అనే కూతురు,జంపన్న అనే కుమారుడు ఉన్నారు. ఇది పడిగె సహాయంతో డోలీలు చెప్పిన ప్రామాణికమైన సమ్మక్క వివరాలు, అలాగే పగిడిద్దరాజు వంశవృక్షం కూడా ఇందులో మనం చూడవచ్చును. పడమటి దేశానికి చెందిన ఎడవగట్టు పారేడు కోయరాజు వంశానికి చెందిన,బాలసంద్రుడు శివమందాకిని దంపతులకు ఐదుగురు సంతా నం,వారు పగిడిద్దరాజు,గోవిందరాజు, గడి కామరాజు,కొండాయి,అనే నలుగురు కొడు కులు లక్ష్మీదేవి, అనే ఏకైక కుమార్తె ఆమెకే ‘‘ముయ్యాల’’ అని ముద్దు పేరు.పగిడిద్దరాజు కు సమ్మక్క నాగులమ్మ అనే ఇద్దరు భార్యలు, ఇద్దరినీ పెళ్లి చేసుకోవడానికి తటస్టించిన పరిస్థితులతో పాటు పగిడిద్దరాజు తన పరివారంతో ఇంద్రావతి నది దాటి తన ప్రాంతానికి పడమటి దిక్కు కదిలి ఓరుగల్లు వచ్చి అటు నుంచి ‘‘ఓయిమూల’’ ప్రాంతం చేరిన తీరు ఈడోలీల గానంద్వారా వివరించ బడిరది,నేటి చల్వాయి,తాడ్వాయి, మేడారం, ప్రాంతాలను కలిపి ఆనాడు కోయరాజులు ‘‘ఓయిమూల’’ అని పిలిచేవారు. ఈ ప్రాంతం లో తేనె,గడ్డలు,ఆకులు,అలములు,ఇప్ప పూల తో పాటు చల్లని నీడ చెట్లు, తోగులు, తాగే నీరు, పుష్కలంగా దొరికేవట ప్రతాపరుద్రుని రాజ్యంలో గల ఆ ప్రాంతంలో పగిడిద్ద రాజు తన సామంతరాజ్యం ఏర్పాటు చేసుకోవడం, కాలానుగుణంగా వచ్చిన ప్రకృతి వైపరీత్యాల వల్ల కరువు కాటకాలతో అక్కడివారు కాకతీ య ప్రభువుకు రకం సకాలంలో చెల్లించలేక పోవడం జరుగుతుంది. కోయ రాజుల మూల వంశానికి చెందిన కాకతీయ ప్రభూ తమ వారు అనే కృతజ్ఞత కూడా లేకుండా పగిడిద్ద రాజు సామంతరాజ్యం మీద తన బలగాలతో యుద్ధం ప్రకటించటం ఆ యుద్ధంలో మొదట పగటిదరాజు పరివారం ఓటమి అంచులకు చేరడం విషయం తెలిసిన సమ్మక్క ఆదిపరా శక్తిగా కోయల కుటుంబంలో ఇష్టంగా జన్మించడంతో తమ జాతి సంరక్షణార్థం అపర కాళీమాతల యుద్ధరంగంలో దునికి ఆధునిక కాకతీయ సైనికుల ఆయుధాలను కూడా నిర్వీర్యం చేసి సైనికులను అందర్నీ మట్టు పెట్టింది, క్షతగాత్రుడైన భర్త పగిడిద్ద రాజు,ను అక్కడ నుంచి తీసుకుని వెళ్లి చిలకలూరిగుట్టకు చేరిపోయింది,మూడేళ్ల కోసారి సమ్మక్క పగిడిద్దరాజు కళ్యాణం జరుగుతుందని డోలీలు ఈపాటలో పాడు తారు. మేడారం ఒకనాటి వీరోచిత యుద్ధ క్షేత్రం, సమ్మక్క గాధ ఒక కోయ వీరనారి పోరాట కథ, కొద్దిపాటి కాల్పనికత ఉన్న, ఈ డోలీలు పటం సాయంతో చెప్పే ఈ వీరగాథ లో ఆదివాసీల చరిత్ర మూలాలు కనిపి స్తాయి.గతంలో సమ్మక్క చరిత్రకు సంబంధిం చిన ప్రచార ఉదంతాలకి ఈ ‘‘డోలిగానకథ’’ పాఠ్యం ఒక క్రమరీతిని కలిగిస్తుంది అనడంలో సందేహం లేదు.ఈ వీర గాధల బృంద గానంలో..‘‘ఓరేలా..రే రేలా..రే రేలయ్యో…’’ అనే కూతతో ప్రారంభమై ‘‘అయ్యారే… యమ్మాలే.’’ అనే పల్లవులు పునరావృతం అవు తుంటాయి. ఆదిపరాశక్తి అంశ అయిన సమ్మక్క మొదట అన్ని కులాలలో వెలవాలని తలచి చివరికి కోయవారి కులం లోనే వెలిచింది అని చెప్పడానికి..‘‘కోమటోరిళ్ళల్లో నాకు కోరిన కొబ్బర్లు ు అయ్యారే/ అది నాకు గాని కావాలా అయ్యారే../బాపనోళ్ళ ఇళ్లల్లో అది బందీన తల్లిలే-అయ్యాలే ..’’అంటూ డోలీ గానం సాగుతుంది. గిరిజన మౌఖిక భాషకే పరిమితం అయిన తూర్పు దేశం (బస్తరు), రొట్టదంటు (పెద్ద అడవి), మాయ మందు (ఇప్ప సారా) కాలికొమ్మలు (సన్నాయి వాద్యాలు), పిట్టె పూరోడి పట్నం.(తాడ్వాయి దగ్గరి అంకన్నగూడెం గ్రామం), వంటి పదాలకు అర్థాలు పాద సూచికల ద్వారా అం దించడం చదువరులకు సౌలభ్యంగా ఉంది. అనుబంధంలో ఈ పుస్తక సంపాదకులు ‘‘జయధీర్‌ తిరుమల రావు’’ గారి గిరిజన క్షేత్ర పర్యటనల అనుభవ వ్యాసాలు మరింత అదనపు సమాచారం కలిగి ఉన్నాయి. బైండ్ల కథలో కాకతీయ రాజుల ఉదంతం, కోయ వీర గాథలు తెలిపే పగిడెలు, పటాలు, ఆరు కోయగాథలు వెలుగు చూసే రుతువు, నలు గురు కోయరాజులు 8 పడిగ కథలు ఈ అనుబంధంలో చదువుకోవచ్చు, భావి పరిశో ధకులు కోయ వీర గాథలు అధ్యయ నంకు పరిశోధనలకు ఈపుస్తకంఓ ప్రామా ణిక పునాదిగా ఉపకరిస్తుంది.
వీరుల పోరుగద్దె ‘‘మేడారం’’ (కోయ డోలీల కథ),సంపాద కుడు: జయధీర్‌ తిరుమలరావు, పేజీలు:136, ధర:80/- రూ, ప్రతులకు: సాహితీ సర్కిల్‌, హైదరాబాద్‌ – సెల్‌: 99519 42242.

గిరిజన సంస్కృతి వాచకం…

ఒకప్పుడు మౌఖిక సాహిత్యంకే పరిమితమైన… మన ఆదివాసీ సాహిత్యం… అక్షరాస్యతలో వచ్చిన అభివృద్ధిలో భాగంగా .. వివిధ ప్రక్రియలలో పుస్తకాల రూపంలో… వస్తూ ప్రామాణికతకు చోటుచేసు కుం టుంది, ఈ గిరిజన సాహిత్యంలోని… పుస్తకాల వివరాలను ‘‘గవాక్షం’’ శీర్షికన… ‘‘థింసా పాఠకుల’’ కోసం ప్రతి నెల ఒక పుస్తకాన్ని పరిచయం చేస్తున్న పరిశోధక రచయిత డా. అమ్మిన శ్రీనివాసరాజు గారు ప్రముఖ రచయిత డా: పిరాట్ల శివరామకృష్ణ కలం నుంచి జాలువారిన ‘‘ గిరిజనులు సంస్కృతి పగ్రతికి సవాళు ’’ అనే పుస్తకంపై సమీక్షడా. అమ్మిన శ్రీనివాసరాజు
మన దేశ సంస్కృతి సారథి స్వామి వివేకానంద 150వ జయంతి సందర్భంగా వెలువరించబడ్డ ‘‘ఆంధ్రప్రదేశ్‌ లో గిరిజనులు సంస్కృతి ప్రగతికి సవాళ్లు….’’ అనే పుస్తకాన్ని ప్రముఖ గిరిజన పరిశోధకు రచయిత డా: పిరాట్ల శివరామకృష్ణ రాశారు. గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాల గురించి ఇప్పటి వరకు చాలా పుస్తకాలు విలువడ్డాయి కానీ వాటి అన్నిటికన్నా భిన్నమైనది సంక్షిప్తంగా సమగ్ర సమాచారాన్ని అందించింది ఈ పుస్తకం,70 పేజీలుగల ఈ రచన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లోని అన్ని గిరిజన ప్రాంతాలను స్పృశిస్తూ చారిత్రక, భౌగోళిక, సంస్కృతి, సాంప్రదాయాలను కూలంకషంగా అందిం చింది.
రచయిత శివరామకృష్ణ తెలుగు ప్రాంతా లలోని గిరిజన ఆవాసాలు విస్తృతంగా పర్యటించి ప్రత్యక్షంగా అక్కడి వారి స్థితిగతులు అర్థం చేసుకున్న అనుభవంతోనే ఈ పరిశోధనాత్మక రచన చేశారు, ప్రసిద్ధ ఒరియా రచయిత ‘‘గోపీనాథ మహంతి’’ వ్రాసిన అమృత సంతానం నవల చదివి గిరిజనులకు వారిదైన ఒక ప్రాపంచిక దృక్పథం ఉంటుందని దానిని తెలుసుకోకుండా మనం వారిని అర్థం చేసుకోలేము అనే విషయాన్ని అర్థం చేసుకున్న స్వానుభవంకూడా రచయిత ఈ రచనకు తోడు తీసుకున్నారు. గిడుగు రామ్మూర్తి, హైమన్‌ డార్ప్‌లతో పాటు యానాదుల పరిశోధకుడు వెన్నెల కంటి రాఘవయ్య, వంటి వారు సైతం ఆయా గిరిజనుల గురించిన పరిశోధన కృషి చేసేటప్పుడు వారి సమాచారాన్ని సేకరించటం కన్నా వారి ప్రపంచంలో సంచరించడం మీదే ఎక్కువ దృష్టి పెట్టారనే అంశం ఈ రచయిత స్పష్టం చేశారు, ఇది భావి పరిశోధకులు అందరికీ శిరోధార్యం అయిన విషయం.
‘‘గణరాజ్యాలు’’ మొదలు ‘‘గిరిజనులు రాజ్యాంగ హక్కులు అభివృద్ధిలో వాటాలను కోల్పోతున్నారా?’’ అనే శీర్షిక వరకు ముచ్చటగా మూడు ప్రధాన శీర్షికలు గల ఈ పుస్తకంలో గిరిజనులకు సంబంధించిన చారిత్రక, సాంస్కృతిక, వర్తమాన, సాంఘిక, సమాచారం గణాంకాలతో సైతం సమగ్రంగా అందించబడిరది. గణరాజ్యాల యందు నాటి చక్రవర్తులకు గిరిజనుల కు మధ్య ఎలాంటి సత్సంబంధాలు ఉండేవి, నల్లమల అడవుల్లో గిరిదుర్గాలు చెంచుల నాయకత్వంలో ఉన్న విషయం, కొండ రెడ్ల జాతి ఆవిర్భావం,గోండు జాతి గిరిజనులలోగల ఉపతెగల వివరాలు, మన్యం కొట్టాలు,బోయకొట్టాలు,పితూరీలు, ఏర్పాటుతో పాటు అవి చేసిన కృషి ఫలితాల గురించిన విశ్లేషణ ఇందులో చదవవచ్చు. అలాగే మార్గ, దేశి, గిరిజన సంప్రదాయాలు, సంచార గిరిజన తెగల గురించి చెబుతూ భారతదేశంలో ప్రధాన భాషలు పదుల సంఖ్యలో ఉంటే గిరిజనుల భాషలు వందల సంఖ్యలో ఉన్నాయన్న ఆసక్తికర విషయం రచయిత ఇందులో లేవనెత్తారు. మనకు సాధారణంగా తెలిసిన గిరిజనుల పండు గలతో పాటు, వివిధ ప్రాంతాల్లో స్థానికంగా చేసుకునే విలక్షణ పండుగల సమాచారం కూడా ఈ పుస్తకానికి అదనపు ఆకర్షణ. అరకులోయలోని ఆదివాసులు పాటించే కాలచక్రం చాలా విలువైన భౌగోళిక సమాచారం అందిస్తుంది, ఆ విషయాల గురించి రచయిత ఇందులో కూలం కషంగా వివరించారు. గిరిజనులు చేసుకునే ‘‘నంది పండుగ’’ మొదలు తెలుగు నెలల వారీగా చేసుకునే గిరిజనుల పండుగలు విశేషాలు తెలిస్తే అడవి బిడ్డలకు తెలుగు భాష పట్ల గల అభిమానం అర్థం అవుతుంది. కళింగ రాజ్యంలోని శ్రీముఖలింగం క్షేత్రంలో గల మధుకేశ్వర స్వామి అవతరణలో ఆరాజ్య సవర గిరిజన రాజు కుమార్తె, సవరరాజుల ప్రస్థావనతో ఆ ప్రాంతంలో గిరిజన రాజులస్థానం. అలాగే పూరీ జగన్నాథుడు సవర గిరిజనుల దేవుడుగా ఉన్న విషయం, కాకతీయుల సేనా ధిపతుల్లో 12 వేల విలుకాండ్ల దళానికి నాయకుడైన కోయరాజు ‘‘సీతాపతి రాజు’’ విషయంతో పాటు అతడు ‘‘శితాబ్‌ ఖాన్‌’’ గా మార్చబడ్డ వైనం ఇందులో చర్చించబడిరది.
ఇలా ఎన్నో ఆసక్తికర గిరిజన చారిత్రక సంఘటనలు ఈ పుస్తకంలో మనం చదవవచ్చు.
రెండవ విభాగం నిండా నిజాం, బ్రిటిష్‌ ,పాలకులతో గిరిజనులు చేసిన ప్రత్యక్ష పోరాటాలు వివరాలు వ్రాయబడ్డాయి.
నైజాంతో పోరాడి అమరుడైన కొమరం భీమ్‌ గురించి ఇందులో ప్రధానంగా చెప్పబడిరది, ఏడు నెలల పాటు జోడెడ్‌ ఘాట్‌ ప్రాంతంలో జరిగిన అభీకర పోరాటం వివరాలు కూడా ఇందులో పొందుపరిచారు. ఇక తూర్పు కనుమల్లో గిరిజనులు చేసిన స్థానిక తిరుగుబాట్లు, పితురీలతో పాటు 1920- 24 సంవత్సరాల మధ్య అల్లూరి సీతారా మరాజు నాయకత్వంలో జరిగిన గిరిజన పోరాటాలు తిరుగుబాటుల గురించి కూలంకషంగా వివరించ బడ్డాయి.ఈ పోరా టాల సమగ్ర అధ్య యనం ద్వారా తెలిసే విషయాలు, వివిధ ప్రాంతాలలోని గిరిజనులు అంతా సమీప రాజులు, జమీందారులతో సత్సం బంధాలతో స్నేహం చేస్తూ… వారి పాలనలో పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ సైనికుల వలే ముందుండి నడిచే వారిని. కొన్ని రాజ్యాలకు సామంత రాజులుగా కూడా వ్యవహరించే వారనే విషయాలు ఈ సందర్భంగా తేటతెలమవుతాయి. అదేవిధంగా స్వాతంత్ర పోరాటంలో కూడా తెలుగు ప్రాంతాలలోని గిరిజనుల పాత్ర అజ్ఞాతంగా ఉండేదనే విషయం అర్థమవుతుంది. స్వాతంత్ర అనంతరం కూడా గిరిజన సమాజంలో అలజడులు పోరాటాలు కొనసాగడానికి కారణాలను కూడా సామాజికవేత్తలు అధ్యయనం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది అనే విషయం రచయిత సూచించారు. స్వతంత్ర భారతదేశంలో పాలనాపరమైన రాజ్యాంగం అమలై… గిరిజనుల కోసం ప్రత్యేక చట్టాలు, నిధులు, కేటాయించిన, వాటి అమలులో చూపిస్తున్న అశ్రద్ధ కారణంగా కొన్ని గిరిజన తెగలు నేటికీ వెనుకబడి అన్ని విధాలా నష్టపో తున్నారు అసంతృప్తితో రగిలి పోతున్నారు అనే విషయం కూడా రచయిత రేఖామాత్రంగా పేర్కొన్నారు.మూడవ విభాగంలో ‘‘గిరిజనులు రాజ్యాంగ హక్కు లను అభివృద్ధిలో వాటాలను కోల్పో తున్నారా?’’ అంటూ తెలుగు ప్రాంతాలలో ఏర్పాటు చేసిన షెడ్యూలు ప్రాంతాల వివరాలు, ప్రాంతాల వారీగా జనాభా గణన,జిల్లాల వారీగా గిరిజన తెగల వ్యాప్తి, వారిలో గల విభిన్న సంస్కృ తులు. గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వాలు అమలు చేసిన పంచశీల విధానాలతో పాటు భారత రాజ్యాంగంలో ఆర్టికల్‌ 46 ప్రకారం గిరిజన అభివృద్ధికి తీసుకున్న ప్రత్యేక చర్యలు, అటవీ హక్కుల చట్టం 2006, పిసా చట్టం, వంటి ప్రధాన చట్టాల గురించిన సమాచారంతోపాటు గిరిజనులు హిందూజాతి వారే అనడానికి సహేతుక కారణాలు వివరిస్తూ గిరిజన అభివృద్ధిలో వనవాసి కళ్యాణ ఆశ్రమం కృషి తదితర విలువైన సమాచారం ఇందులో అందించారు. గిరిజనుల సమగ్ర సమాచారం ‘‘కొండ అద్దమందు’’ అన్న చందంగా ఆవిష్కరించబడ్డ ఈ పుస్తకం సమస్త పరిశోధకులకు గిరిజన ఆధ్యయనకర్తలకు చక్కని దారి దీపంలా పనిచేస్తుంది, అనడంలో నిండైన నిజం ఉంది.
పుస్తకం పేరు:- ‘‘ఆంధ్రప్రదేశ్‌ లో గిరిజనుల సంస్కృతి ప్రగతికి సవాళ్లు..’’
రచయిత: డా: పిరాట్ల శివరామకృష్ణ,. పేజీలు: 72, వెల: 20/- రూపాయలు.
ప్రతులకు: సాహిత్య నికేతన్‌, బర్కత్‌ పురం, హైదరాబాద్‌ – 27, ఫోన్‌: 040- 27563236.
సమీక్షకుడు :- డా: అమ్మిన శ్రీనివాసరాజు, సెల్‌: 7729883223.