అడవితల్లికి గర్భశోకం

ఆదివాసుల సంప్రదాయ హక్కులపై ఆదినుంచి పోరాటాలు సాగుతూనే ఉన్నాయి. బ్రిటీష్‌ ప్రభుత్వం 1878లో అడవులపై ఆదివాసుల సంప్రదాయ హక్కులపై ఆంక్షల విధింపుతో అసంబద్ద సంప్రదాయం ప్రారంభమైంది.దాన్ని వ్యతిరేకిస్తూ విప్లవవీరుడు అల్లూరి సీతారామారాజు ఆదివాసులకే అడవిపై హక్కుకోసం పోరాటం చేశారు. తర్వాత 1932లో జమీందారు వ్యవస్థ హాయంలో ప్రముఖ సామాజికవేత్త రెబ్బాప్రగడ మందేశ్వర శర్మ విశాఖ మన్యప్రాంతాన్ని సందర్శించి అమాయక గిరిజనులు దోపిడికి గురవుతున్నట్లు గుర్తించారు. ఆతర్వాత ఐఎఫ్‌ఎస్‌ అధికారి రెబ్బాప్రగడ కృష్ణారావు అటవీ సంరక్షణ అధికారిగా చింతపల్లి,మినుములూరు,అనంతగిరి,పాడేరు,మారేడిమిల్లి వంటి గిరిజనప్రాంతాల్లో విధులునిర్వర్తించారు. ఆయన హాయంలోనే కాఫీతోటలు పెంపకాన్ని ప్రవేశ పెట్టి జీవనప్రమాణాలు మెరుగుపరిచారు.నేను చిన్నప్పటి నుంచే నాన్నగారితోకలసి ఆదివాసుల జీవనవిధానాలతో మమేకమ య్యాను. తరాలుగా అడవితల్లినీడలో బతుకుతున్న అటవీభూములపై హక్కుమాత్రం వారికి ఎండ మావిగానే మిగిలాయని గుర్తించాను. ఈనేపథ్యంలోనే సమత పుట్టికొచ్చింది.గిరిజనలకు రాజ్యాంగం కల్పించిన చట్టాలు,హక్కులు పరిరక్షణపై గత ముప్ఫైరెండేళ్ల నుంచి పోరాడుతుంది. విశాఖమన్యంలో బాక్సైట్‌,ఖనిజనిక్షేపాలు ప్రైవేటు కంపెనీలకు ధారతత్తం చేసినవైనాన్ని గుర్తించి అటుప్రభుత్వం,ఇటు ప్రైవేటు బహుళజాతికంపెనీలకు వ్యతిరేకంగాపోరాడిరది.ఆదివాసులకు రాజ్యాంగం కల్పించిన రక్షణ చట్టాలు,హక్కులు నిర్వీర్యమైపోతున్నాయంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిగా గిరిజనుల హక్కులను పునరుద్దరిస్తూ సర్వోన్నత (న్యాయస్థానం) సుప్రింకోర్టు చరిత్రాత్మకమైన1997లో సమత తీర్పు నిచ్చింది. నేడు ఈతీర్పుఫలితంగా భారతదేశంలోని షెడ్యూల్‌ ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదివాసీ ప్రజలకు రక్షణ గా నిలిచింది.స్థానికులైన గిరిజనుల భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడిరది. సామా జిక,ఆర్ధిక న్యాయం కోసంపోరాడే ఆదివాసులకు సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన సమత తీర్పు ఎంతో మనో నిబ్బరం కలిగించింది.ఈతీర్పును ఉల్లంఘించడానికి ప్రభుత్వాలు యథాశక్తి ప్రయత్నాలు సాగిస్తూనే వస్తోంది.అధికారంలోఉన్న ప్రభుత్వంఅటవీ సంపద మొత్తం కార్పొరేట్‌ సంస్థలకు ధారాదత్తం చేయడానికి రక్షణ చట్టాలను సవరించడం తీరని అన్యాయం.
అడవులతో గిరిజనులకు పెనవేసుకుపోయిన అనుబంధాన్ని విచ్ఛిన్నం చేసేందుకు పాలకులు చేయని ప్రయత్నమంటూ లేదు. అమాయకాదివాసుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రాజ్యాంగంలోని అయిదో షెడ్యూలులో పొందుపరిచన సూత్రావళి స్పూర్తిని మన పాలకులు అడ్డంగా విస్మరిస్తున్నారు. అడవులు,ఆదివాసులు అధికంగాఉన్న ఆంధ్రప్రదేశ్‌,ఛత్తీషఘడ్‌,ఒరిస్సా,జార్ఖండ్‌ రాష్ట్రాల్లో భారీ పరిశ్ర మల ఏర్పాటుకు,ఖనిజతవ్వకాలకు విచ్ఛలవిడిగా లాకులెత్తుతున్నారు.ఆస్మదీయుల,పెట్టుబడిదార్ల జేబులు నింపే కార్యక్రమాన్ని చేపట్టి ఆదివాసుల అగ్రహానికి గురవుతున్నారు.అడవులవృద్ధి,పరిరక్షణద్వారా ఒనగూడే ఆర్ధికప్రయోజనాలను గిరిజనులకు చేర వేయాలంటూ స్వాతంత్య్రానంతరం నిర్ధేశించుకున్న లక్ష్యాలన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి.
ప్రభుత్వం వేసే ప్రతి అడుగూ,తీసుకునే ప్రతినిర్ణయమూ సామాన్యునికి ఎంతోకొంత ఉప శమనం కలిగించాలి.వారి సమస్యలకు పరిష్కారంచూపాలి. కానీ,నేడు గిరిజన సంక్షేమం,అడువుల పరిరక్షణ పేరిట పాలకులు చేపడుతున్న చర్యలు ఆదివాసులకు న్యాయం చేయడం లేదు సరికదా..,వారి ఆందోళనను మరింత పెంచుతున్నాయి. అటవీ వనరులను అయినవారికి దోచిపెట్టడానికి,ప్రకృతి వనరుల పరిరక్షణపేరిట నిధులుస్వాహాలు,సర్కారీ పెద్దలుతెగబడుతున్న నైచ్యం నేడు బహిరంగ రహాస్యం.తమకు నిలువ నీడలేకుండా పాపం చేస్తున్నదెవరో గ్రహించలేనంతటి అమాయకత్వంలో ఈనాటి గిరిజనులులేరు.వారుఅన్నీ చూస్తున్నారు. అర్ధం చేసుకుంటున్నారు. అక్రమార్కులకు వంతపాడుతూ అడవి బిడ్డల జీవితాలతో ఆడుకుంటున్న పెద్దలు తీరు మార్చుకోవాల్సిన తరుణమిది!- రెబ్బాప్రగడ రవి,ఎడిటర్