గిరిజనాభివృద్ధి జరగాలంటే.. స్థానిక వనరుల వినియోగించాలి

గిరిజనప్రజలైన..సామాజికకార్యకర్తలైన ప్రభుత్వం చేపట్టే అభివృద్ధికి వ్యతిరేకం కాదు. నిజమైన గిరిజనాభివృద్ధి జరగాలంటే ఏజెన్సీలో నిక్షేపమైన వనరులు స్థానిక గిరిజనులే వినియోగించు కొనేలా వారికే రాజ్యాంగబద్దమైన హక్కులు కల్పించాలి.స్థానిక వనరుల వినియోగంపై గిరిజనులను చైతన్యవంతులను చేసేలా చర్యలు చేపట్టాలి. ఐదవషెడ్యూల్‌ ఏరియాలో నివసించే గిరిజనులకు ప్రధానజీవనాధారం భూమి.ఇప్పటికీ అత్యధిక గిరిజన కుటుంబాలు వ్యవసాయం మీదే ఆధారపడి జీవిస్తున్నారు.గతంలో ప్రతీగిరిజను కుటుంబానికి సరిపోయనంత భూమి ఉండేది. అనేక కారణాలువల్ల గిరిజనులు తమ భూమిని కోల్పోతూవస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో,గిరిజనుల హక్కులపట్ల చైతన్యం కలిగించి,గిరిజనేతరుల దోపిడీని ప్రతిఘ టించే విధంగా వారిని సమీకరించడంపై ‘సమత’ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది.ఆదివాసీ ప్రజల సమస్యలు,వనరులు,పర్యావరణ పరిరక్షణ,వారిహక్కులను కాపాడుతూ పోరాటం సాగిస్తోంది. అయినా పీసాచట్టం,సమత జడ్జిమెంట్‌లను ఉల్లంఘించి,రాజ్యాంగానికి విరుద్దంగా,వారి వనరులపై గిరిజనేతరుల పెత్తనం సాగుతూనే ఉంది. ఫలితంగా పచ్చని పొలాలపై మైనింగ్‌ చిచ్చు రగులుతోంది. ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ,మైనింగ్‌ కాంట్రాక్టర్ల(ఏపీఎండీసీ) మైనింగ్‌ ప్రభావిత గ్రామ రైతుల మధ్య 2006 నుంచి ప్రచ్ఛన్నయుద్దం జరుగుతూనే ఉంది.
ఈ వివాదాల నేపథ్యంలో నిమ్మలపాడు కాల్సైట్‌ మైనింగ్‌ తవ్వకాల కోసం ఏపీఎండీసీ,జిల్లా రెవెన్యూ అధికార యంత్రాంగం ఏప్రిల్‌ 19న ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణ సదస్సును స్థానిక గిరిజనులు వ్యతిరేకించారు. గిరిజనాభివృద్ధిపై ప్రభుత్వానికి చిత్తశుద్దింటే సమత జడ్జెమెంట్‌ ప్రకారం స్థానికులకే లీజులు అప్పగించాలంటూ గిరిజనులు ముక్తకంఠంతో నినాదించారు. నిజానికి గిరిజనుల ఆవేదనకు అర్ధముంది. సమత తీర్పును ప్రభుత్వంగానీ,ఏపీఎండీసీ అధికార యంత్రాంగం గానీ సరిగ్గా అర్ధం చేసుకోవడం లేదు.ఆతీర్పు పూర్తిగా చదివితే మైనింగ్‌ తవ్వకాలపై సమత జెడ్జి మెంట్‌ వ్యతిరేకం కాదని అర్ధమౌతోంది.రాజ్యాంగబద్దంగా గిరిజన ప్రాంతానికి చెందిన వనరులు గిరిజనులకే చెందాలని, ఒకవేళ వనరులు వెలికితీస్తే గిరిజనులను సొసైటీలుగా ఏర్పాటు చేయించి,వారికే లీజులు ఇవ్వాలని ఆతీర్పులో సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కోంది.ఈతీర్పును అర్ధం చేసుకోకుండా గిరిజన బినామీల పేరుతో ప్రైవేటు వ్యక్తులకు లీజులు ఇవ్వడానికి ఏపీఎండీసీ మొగ్గు చూపుతోంది.
పదహారేళ్ల నుంచి స్థానిక గిరిజన సొసైటీలకు లీజులు ఇవ్వకుండా ఏపీఎండీసీ స్థానికేతర గిరిజనులకే లీజులు ఇవ్వడంపై కరకవలస,రాళ్లవలస,నిమ్మలపాడు మూడు గ్రామాల గిరిజన ప్రజలు ప్రతిఘటిస్తున్నారు. ఈప్రాంతంలో నాటికి నేటికీ గిరిజన ప్రజల స్థితిగతులు ఏమాత్రం మారలేదు. వారి అమయకత్వం కారణంగా వనరుల దోపిడికి గురవుతునే ఉన్నారు. ఈ మూడు గ్రామాల మధ్య 125 ఎకరాల్లో విలువైన కాల్సైట్‌ గనులు ఉన్నాయి. వీటిలో సుమారు పాతిక ఎకరాల్లో అత్యంత విలువైన కాల్సైట్‌ ఉంది.వీటిని చేజిక్కించుకోవడానికి మైనింగ్‌ మాఫియా ఏపీఎండీసీ అండతో మూడు దశాబ్దాల నుంచి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ దోపడి వ్యవస్థకు స్వస్తిపలికి ఏపీఎండీసీ అధికార్లు రాజ్యాంగనీతిని అనుసరించాలి.నిజమైన గిరిజనాభివృద్ధిని సాధించాలంటే గిరిజన ప్రాంతాల్లో ఉన్న స్థానిక వనరులను వినియోగించి అభివృద్ధి చేయాలి.పీసా,సమత జడ్జెమెంట్‌ స్పష్టం చేసిన తీర్పును అర్ధం చేసుకొని షెడ్యూల్‌ ప్రాంతాల్లో ఉన్న వనరులు స్థానికులకే హక్కు కలిగేలా చర్యలు తీసుకోవాలి.వారి వనరులు వారికే చెందేలా గిరిజన సొసైటీలుఏర్పాటు చేయించి,గిరిజనులకు లీజులు ఇచ్చిప్రొత్సహించాలి. అప్పుడే గిరిజన ప్రజలు ఆశించిన నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. ఆ దశగా ఏపీఎండీసీ,రెవెన్యూ యంత్రాంగం చర్యలు చేపట్టాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.!-రెబ్బాప్రగడ రవి ,ఎడిటర్