అటవీహక్కుల చట్టంతోనే… ఆదివాసీలకు భరోసా….!

ఆదివాసీలు, గిరిజనులకు అడవి అమ్మ లాంటిది. వారిని కంటికి రెప్పలా కాపాడుకునేది అడవే. వారి బతుకుదెరువు మొత్తం అడవిపైనే ఆధారపడి ఉంది. అటవీ వనరులను వాడుకుంటూ, పోడు భూములను దున్నుకుంటూ బతికేవారే ఎక్కువ. వీరి హక్కులను కాపాడేందుకు ఉద్దేశించిందే అటవీ హక్కుల చట్టం. ఈ చట్టాన్ని అమలు చేయడమంటే ప్రజాస్వామిక విలువలను పాటించడమే. ఈ చట్టాన్ని సక్రమంగా అమలు చేస్తేనే ఆదివాసీలు,గిరిజనేతరుల హక్కులను రక్షించగలు గుతాం. అడవుల పరిరక్షణకు, ఆదివాసీల హక్కులకు మధ్య తలెత్తే వివాదాలకు సామరస్యపూర్వకంగా పరిష్కారం చూపించగలుగుతాం.
అన్ని రాజకీయపార్టీలు,ప్రజాసం ఘాలు కలిసికట్టుగా చేసిన పోరాటం ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి అటవీహక్కుల చట్టాన్ని అమలు చేసి పోడు రైతుల సమస్యలకు పరిష్కారం వెతుకు తామని ప్రకటించింది. ఇదిఆహ్వానించ దగిన పరి ణామం. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈచట్టం అమలు బాధ్యతను పూర్తిగా అటవీ శాఖకు అప్పగిం చేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. అటవీ శాఖ అధికా రులు శాటిలైట్‌ ఫొటోల్లో 2005కు ముందు పోడు భూములు దున్నుకున్నట్టు సాక్ష్యం కనబడకపోతే క్లైమ్‌ ఫారాలను తిరస్కరించే ప్రమాదం కనబడు తోంది. ఈ ప్రమాదం నుంచి పోడు రైతులు రక్షణ పొందాలంటే ముందుగా రాష్ట్ర ప్రభుత్వం అటవీ హక్కుల చట్టాన్ని అర్థం చేసుకోవాలి.
హక్కును కోల్పోయిన ఆదివాసీలు
అడవులను చట్టబద్ధంగా గుర్తించి, ప్రభుత్వ అధీ నంలోకి తీసుకొచ్చే క్రమంలో ఆదివాసీలకు, ఆడవు ల్లో నివసించే ఇతర సమూహాలకు జరిగిన అన్యా యాలను సరిదిద్దడానికే అటవీ హక్కుల చట్టం వచ్చింది. బ్రిటిష్‌ పాలకులు అడవులను హస్తగతం చేసుకున్న నాటికే.. అడవుల్లో ఆదివాసీలు, గిరిజనే తరులు నివసిస్తున్నారు. అటవీ వనరులను వీరంతా ఉపయోగించుకునే వారు. దానికి తోడు అడవుల్లోనే పోడు చేసుకొని బతుకుదెరువు పొందేవారు. అడవి వారికి ఇల్లు, జీవిక. ఎప్పుడైతే ఈ అడవుల చుట్టూ గీత గీసి వాటిని తమసొంత ఆస్తిగా బ్రిటిష్‌ పాల కులు,స్థానిక సంస్థానాధీశులు ప్రకటించారో.. అక్కడ నివసించే ఆదివాసీలు, గిరిజనేతరులు అప్ప టి వరకు తాము అనుభవించిన వనరులపై కలిగి ఉన్న సంప్రదాయక హక్కులను కోల్పోయారు. హక్కులను కాపాడేందుకే కుమ్రం భీం పోరాటం ఇటువంటి పరిస్థితుల్లో ఆదివాసీల హక్కులను కాపాడటం కోసమే కుమ్రంభీం పోరాటం చేశారు. 1940దశకంలో నిజాం ప్రభుత్వం అడవుల సం రక్షణ పేరుతో చట్టం ప్రకారం అడవులను ప్రభుత్వ ఆస్తిగా ప్రకటించింది. అందువల్ల అడవుల్లో నివ సించే ఆదివాసీలు,గిరిజనేతరులు ఆక్రమణదారు లుగా మారిపోయారు. అడవుల్లో దున్నుకోవటానికి గాని, అటవీ ఉత్పత్తులను అనుభవించడానికి గాని వారికి అవకాశం లేకుండా పోయింది. అటవీ ఉత్పత్తులను సేకరించినందుకు,ఉపయోగించినందు కు వారిపై అటవీశాఖ శిక్షలు వేయడం ప్రారంభిం చింది. అలా అడవులను తమ ఇల్లుగా భావించిన ఆదివాసీలు,గిరిజనేతరులను రాష్ట్ర ప్రభుత్వం చొరబాటుదారులుగా చూడటం మొదలైంది. దాని ఫలితంగా ఆదివాసీలు తమ బతుకుదెరువు కోల్పో యారు. తమ హక్కుల సాధన కోసం కుమ్రం భీం నేతృత్వంలో పోరాడారు. అప్పటి నుంచి ఆదివాసీలు పోయిన తమ హక్కుల సాధన కోసం ప్రతి ప్రభు త్వాన్ని అడుగుతూనే ఉన్నారు.
ఇది భూమి పంపిణీ చట్టం కాదు
చివరికి 2004లో అధికారంలోకి వచ్చిన మన్మోహన్‌సింగ్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం సంప్రదాయకంగా ఆదివాసీలు అనుభ విస్తున్న హక్కులను గుర్తించడానికి అంగీకరించింది. ఈ నేపథ్యంలో వచ్చిందే అటవీ హక్కుల చట్టం. ఇది భూమి పంపిణీ కోసం ఏర్పడిన చట్టం కాదు. ఆదివాసీల, ఇతర అటవీ సమూహాల సంప్రదాయక హక్కుల పరిరక్షణ కోసం వచ్చింది. ఆహక్కులను గుర్తించడానికి కూడా ఇది వరకటి చట్టాల మాదిరి గా కాకుండా చాలా వినూత్నమైన పద్ధతు లను తీసుకొచ్చింది. హక్కుల గుర్తింపు ప్రక్రియలో ప్రజ లకు విస్తృత భాగస్వామ్యం కల్పించింది. ఇవన్నీ అర్థమైతే తప్ప ఈ అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయడం సాధ్యం కాదని గమనించాలి. అందుకే ఈ చట్టాన్ని అమలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
అనుభవిస్తున్న భూమికి పట్టాలు
ఈచట్టం మిగతా భూమి పంపిణీ చట్టా లు, ఉత్తర్వుల కన్నా భిన్న మైనది. ఆచట్టాల ప్రకా రం ప్రభుత్వ మిగులు భూమి ఉంటే, అధికారులు సర్వే చేసి అలాంటి భూమిని పంపిణీ చేయవచ్చు. భూమి పంపిణీకి ఒకగరిష్ట పరిమితి ఉన్నది. అంత కు మించి ఇవ్వరాదు. ఈ చట్టాలతో పోలిస్తే అటవీ హక్కుల చట్టానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అటవీ హక్కుల చట్టం భూమిని పంచదు. అడవుల్లో ఆదివాసీలు,గిరిజనేతరులు అనుభవిస్తున్న హక్కు లను గుర్తిస్తుంది. 10ఎకరాల లోపు ఎంత భూమి అనుభవిస్తే అంత భూమికి పట్టా ఇవ్వాలి. పోడు రైతుల యాజమాన్యపు హక్కులను నిర్ధారించేది గ్రామసభ ద్వారా ప్రజలేనని తెలుసుకోవాలి. దరఖా స్తులు తీసుకునేది, క్లెయిములను పరిశీలించేది గ్రామ సభ నియమించిన అటవీ హక్కుల కమిటీ అని గుర్తు పెట్టుకోవాలి.
రాజకీయ జోక్యం తగదు
చట్టం అమలులో ఎమ్మెల్యేలకు పాత్ర కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు మీడి యాలో వార్తలు వస్తున్నాయి. ఇది ప్రజలకు, పోడు రైతులకు నష్టం చేసే విషయం. గ్రామసభ పనిలో కానీ,క్లెయిమ్‌ ఫారాల పైన నిర్ణయాల్లో కానీ రాజకీ య జోక్యం ఉండరాదు. సబ్‌-డివిజన్‌, జిల్లా కమి టీల నిర్మాణం జరగాలి. అన్ని నిర్ణయాలు కమిటీ ల్లోనే తీసుకోవాలి. రాష్ట్ర స్థాయిలో చీఫ్‌ సెక్రటరీ నేతృత్వంలో మానిటరింగ్‌ కమిటీ ఏర్పడాలి. ఈ కమిటీ అటవీ హక్కుల చట్టం అమలును పర్య వేక్షించాలి. గిరిజన సంక్షేమ శాఖను నోడల్‌ ఏజెన్సీ గా నియమించాలి. అన్ని శాఖల మధ్య సమన్వయం చేసే బాధ్యత గిరిజన సంక్షేమ శాఖకు ఇవ్వాలి. కనీసం ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే చట్టం అమలు కావడం కష్టంగా మారుతుంది.
చట్టాన్ని అర్థం చేసుకోవాలె
అటవీ హక్కుల చట్టం అమలు చేయా లంటే ప్రజాస్వామిక విలువలను అర్థం చేసుకొని పాటించడం చాలా అవసరం. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం చట్టం అమలులో మార్గదర్శిగా, గ్రామసభ ద్వారా తన పాత్రను పోషించాలి. ప్రజల నిర్ణయశక్తిపైన గౌరవం లేకపోతే ప్రభుత్వ యం త్రాంగం చట్టాన్ని అర్థంచేసుకొని అమలు చేయ లేదు. అవినీతికి తావివ్వకుండా, రాజకీయ జోక్యం లేకుండా,పారదర్శకంగా,ప్రజాస్వామికంగా వ్యవ హరిస్తేనే అడవులను కాపాడవచ్చు. ఆదివాసీల, గిరిజనేతరుల హక్కులను రక్షించవచ్చు. అడవుల పరిరక్షణకు,ఆదివాసీల హక్కులకు మధ్య తలెత్తే వైరుధ్యాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించ వచ్చు. చివరగా ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. అటవీ హక్కుల చట్టాన్ని అమలుచేయడమంటే ప్రజా స్వామిక విలువలను పాటించడమే. ఈ స్పృహతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని ప్రతి పౌరుడు కోరుకోవాలి. అలావ్యవహరించేటట్టు ప్రతి ప్రజా స్వామికవాది తమ వంతు ప్రయత్నం చేయాలి.
గ్రామ సభకే సకల అధికారాలు
అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేసే అధికారం గ్రామసభకే ఉన్నదని ప్రభుత్వం గుర్తిం చాలి. గ్రామ సభ తన తరఫున తాను నిర్వర్తించ వలసిన పనులను చేయడానికి అటవీ హక్కుల కమిటీని ఏర్పాటు చేస్తుంది. అటవీ హక్కుల కమిటీ సాక్ష్యాలను పరిశీలిస్తుంది. భూమి సరిహద్దులను రెవెన్యూ,అటవీశాఖలతో కలిసి నిర్ధారిస్తుంది. అటవీ హక్కుల కమిటీ నివేదికపై తుది నిర్ణయం గ్రామసభదే. గ్రామసభను పని చేయనివ్వక పోతే చట్టం అమలులో అటవీశాఖ పెత్తనం మాత్రమే కొనసాగుతుంది.
శాటిలైట్‌ ఫొటోలు ప్రామాణికం కాదు
భూమిని అనుభవిస్తున్నట్టు సాక్ష్యంగా పూర్తిగా శాటిలైట్‌ ఫొటోల మీద మాత్రమే ఆధార పడటానికి వీలు లేదు. చట్టానికి సంబంధించిన నియమాల్లో 14రకాల సాక్ష్యాలను పేర్కొన్నారు. అందులో ఏ రెండు ఉన్నా చాలునని నియమాలు చెపుతున్నాయి.నిజానికి శాటిలైట్‌ ఫొటోలను ప్రామా ణికంగా తీసుకోరాదని గతంలో గుజరాత్‌ హైకోర్టు తీర్పు చెప్పింది.
ఉనికి కోల్పోయే పరిస్థితుల్లో ఆదివాసీలు
అడవి తల్లి ఒడిలో జీవించే ఆదివాసీ లు తమ ఉనికిని కోల్పోయే పరిస్థితుల్లో ఉన్నారు. అటవీ భూములు,సహజ వనరులపై ఆధారపడి జీవించే గిరిజనులకు మేలు చేయాల్సిన పాల కులు.. వారిని ఇంకింత భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అడవిలో మొక్కలు నాటే నెపంతో.. భూములు గుంజుకోవడం,పంటలు ధ్వంసం చేయ డం,నివాసాలు ఖాళీ చేయిస్తూ..వారి హక్కులను కాలరాస్తున్నారు. తమకు అన్యాయం చేయొద్దని ప్రశ్నించే ఆదివాసీలపై కేసులు పెట్టి ఇబ్బంది పెడు తున్నారు. అడవి బిడ్డల హక్కుల రక్షణకు గతంలో ఎన్నో చట్టాలు వచ్చినా అవేవీ అమలు కావడం లేదు. రాష్ట్రప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆది వాసీల హక్కులను కాపాడాలి. ప్రపంచవ్యాప్తంగా 90దేశాల్లో దాదాపు 40కోట్ల ఆదివాసీల జనాభా ఉంది. ఏడువేలకు పైగా భాషలు,5 వేలకు పైగా విభిన్న సంస్కృతులు ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నా యి. ప్రకృతితో పెనవేసుకున్న పర్యావరణహిత సాంప్రదాయాలు ఆదివాసీ జీవనశైలిలో అంత ర్భాగం. ప్రపంచవ్యాప్తంగా ఆదివాసీలు తీవ్ర సమ స్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. అటవీ భూములు, సహజ వనరులే వీరికి జీవనాధారం. ఐక్యరాజ్య సమితి క్షేత్రస్థాయిలో వివిధ ప్రభుత్వ వ్యవస్థల్లో ఆదివాసీల హక్కులకు రక్షణ కవచాలు ఏర్పాటు చేశాయి. కానీ అవి వారి హక్కులను పూర్తి స్థాయి లో కాపాడటం లేదు. అభివృద్ధి, ఇతర అవసరాల పేరుతో ఆదివాసీలు సాగు చేసుకుంటున్న భూములు ప్రభుత్వాలు, అధికారులు లాక్కోవడం పరిపాటిగా మారుతోంది. సహజ వనరులు కోల్పోవడం వల్ల వారి ఉనికి ప్రమాదంలో పడటంతో ఆదివాసీ కుటుంబాలు ఉపాధి,విద్య, ఆర్థిక అవసరాల కోసం నగరాలకు వలస పోతున్నాయి. నగర జీవనంలో వీరికి కనీస పౌర సేవలు అందడం లేదు. ఇండి యాలో 2011జనాభా లెక్కల ప్రకారం దేశంలో 8.6శాతం అంటే 10.42కోట్ల ఆదివాసీలు ఉన్నారు. ఇందులో 461రకాల ఆదివాసి తెగలు ఉన్నాయి. వీరిలో 90శాతం గిరిపుత్రులు అటవీ ప్రాంతాల్లో పోడు వ్యవసాయం,వేట,అటవీ ఉత్ప త్తులపై ఆధారపడి జీవిస్తున్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభు త్వాలు కొత్త పథకాలు అమలు చేస్తున్నా వారి పరిస్థితిలో మార్పు రావడం లేదు. అత్యంత వెనక బడిన ఆదివాసీ తెగలు(పీటీజీ) నివసించే ప్రాంతా ల్లో రహదారులు కూడా లేవు. మంచినీరు, ఆరోగ్య సేవలు,విద్య తదితర సౌకర్యాలకు దూరంగా వారు దుర్భరమైన జీవితం సాగిస్తున్నారు.
చట్టాలు ఉన్నా..
గతంలో ఆదివాసీల హక్కులపై అనేక పోరాటాలు వచ్చాయి. వీటి ఫలితంగానే ప్రభు త్వం1/70 పీసా చట్టం చేసింది. ఆనాటి యూపీఏ ప్రభుత్వం 2005లో అటవీ హక్కుల చట్టం తీసుకు వచ్చింది. ఈ చట్టం ప్రకారం.. షెడ్యూల్డ్‌ తెగలు, తరతరాలుగా అడవిలో నివసిస్తున్న సంప్రదాయక అటవీ వాసులకు అటవీ భూములపై హక్కులు ఉంటాయి. ఉమ్మడిఆంధ్రప్రదేశ్‌ అటవీ చట్టం 1967 ప్రకారం.. సెక్షన్‌ 4 ప్రకటించే నాటికి ఉన్న హక్కులు గుర్తించబడతాయి. భారత అటవీ హక్కుల చట్టం 2006 ప్రకారం..2005 డిసెంబర్‌ 13 వరకు ఆక్రమణలో ఉన్న భూములపై ఆదివాసీలకు హక్కులు ఉంటాయి. ఇతర సంప్రదాయక అటవీ వాసులు అయితే 13 డిసెంబర్‌ 2005 ముందు మూడు తరాలు అంటే 75 ఏళ్లు అదే అడవిలో నివసిస్తూ జీవిస్తున్న వారికి హక్కులు సంక్రమి స్తాయి. ఆయా రాష్ట్రాలకు చెందిన షెడ్యూలు తెగలైతే ఆ తేదీ నాటికి నివసిస్తే చాలు. వ్యక్తులకు సమాజానికి ఇలాంటి అటవీ హక్కులు ఏ మేరకు ఉన్నాయో నిర్ణయించే ప్రక్రియ ప్రారంభించే అధికా రం గ్రామసభలకు మాత్రమే ఉంటుంది. అటవీ హక్కులు పొందాలంటే 13 డిసెంబర్‌ 2005 నాటికి భూమి ఆక్రమణలో ఉన్నట్టు చూపాలి. ప్రభుత్వ డాక్యుమెంట్లు గానీ,ప్రభుత్వ రికార్డులు గానీ,ఏదైనా సెటిల్‌మెంట్‌,మ్యాపు,గూగుల్‌ మ్యాపు, వర్కింగ్‌ ప్లానులు,అటవీ ఎంక్వయిరీ రిపోర్టు లాం టిది ఆధారాలుగా చెల్లుతాయి. రేషన్‌ కార్డు, ఓటర్‌ ఐడీ కార్డు,ఇంటి పన్నురసీదు,ఇంటి నివాస సర్టిఫికెట్‌, కోర్టు ఆర్డర్‌,సర్వే రిపోర్టు,సంస్థానాలు ఇచ్చిన సర్టిఫికెట్లు, వంశ వృక్షాలు గ్రామ పెద్దల స్టేట్‌మెంట్‌ ఇలా అన్ని ఆధారాలుగా చూపవచ్చు. అటవీ హక్కుల చట్టం 2005-06 ప్రకారం ప్రతి ఆదివాసి కుటుంబానికీ పది ఎకరాల పట్టా ఇవ్వాలి. ఆప్రకారం రాష్ట్రంలో 1.78లక్షల ఎకరాలు లబ్ధి దారులకు పట్టాలు ఇచ్చారు. ఆ తర్వాత చట్టాలను అమలు చేయకుండా పక్కనపెట్టేశారు. పైగా ఆర్వో/ఎస్‌ఆర్‌ చట్టాలు ఇచ్చిన భూములను సైతం ప్రస్తుతం లాక్కుంటున్న పరిస్థితి నెలకొంది. వందలాది ఆది వాసీల మీద అక్రమ కేసులు నమోదవుతున్నాయి.
ప్రభుత్వ నియంతృత్వం..
గిరిజనులు సాగుచేస్తున్నభూమిపై ప్రభు త్వం నియంతృత్వంగా వ్యవహరిస్తోంది. అటవీ అధికారులు,ప్రభుత్వం ఆదివాసీల పోడు భూము లపై యుద్ధం ప్రకటించారు. వారిని భూముల నుంచి వెళ్లగొట్టడానికి కందకాలు తవ్వుతున్నారు. పచ్చని పంటలను ధ్వంసం చేస్తున్నారు. ఆ పేద బతుకులపై యుద్ధం చేస్తూ ప్రభుత్వం హరితహారం పేరుమీద మొక్కలు నాటుతోంది. తమ భూముల్లో మొక్కలు పెట్టి జీవనాధారం నాశనం చేయొద్దంటూ ఆదివాసీ బిడ్డలు ఫారెస్ట్‌ఆఫీసర్ల కాళ్లు మొక్కుతు న్నారు. అటవీ శాఖ అధికారులు మాత్రం తమను అడ్డుకుంటున్నారన్న నెపంతో గిరిజనుల మీద కేసులు పెడుతున్నారు. తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం,మహబూబాబాద్‌,ఆదిలాబాద్‌, మహబూ బ్‌నగర్‌,వరంగల్‌ తదితర ప్రాంతాల్లో ఈ సమస్య తీవ్రంగా కనిపిస్తోంది.ఆఫీసర్ల వేధింపులు తట్టు కోలేక కొందరు ఆత్మహత్యలు చేసుకుం టు న్నారు.2011జనాభా లెక్కలప్రకారం తెలంగాణ లో 31లక్షల75వేలమంది ఆదివాసీలుఉన్నారు. ఆదివాసీల్లో ఉప తెగలు చాలా ఉన్నాయి. గత పాలకులతో పాటు ఇప్పుడు ఉన్న పాలకులు వాళ్లను సాటి మనుషులుగా చూడకపోవడం మాట అటుం చితే..వారి వనరులు దోచుకోవడం,ఆవాసాలను, భూములను లాక్కోవడం దారుణం.
హరితహారం పేరుతో..
పట్టాల కోసం ఆదివాసీలు అధికారులు, కోర్టుల చుట్టూ తిరుగుతుంటే, తెలంగాణ ప్రభుత్వం హరితహారం పేరుతో వారు సాగు చేస్తున్న భూమి లో మొక్కలు నాటిస్తోంది. రాష్ట్రంలో 33శాతం అడవి పెంచాలని ప్రభుత్వం అనుకుంటోంది. ప్రపంచ బ్యాంకు నిధులు రూ.240కోట్లతో మొక్క లకు శ్రీకారం చుట్టింది.ఈలక్ష్యం మంచిదే అయి నా.. ఈ హరితహారం ఆదివాసీలపై యుద్ధంలా మారుతోంది. ఫారెస్టు అధికారులు అత్యుత్సాహంతో గిరిజనులపై దాడులు చేస్తున్నారు. కందకాలు తీస్తు న్నారు. ఇక పంటలు ధ్వంసం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో వందలాది ఆదివాసీలపై కేసులు నమో దయ్యాయి. కొందరిని అరెస్టు కూడా చేశారు. మహి ళలు,వృద్ధులు అని చూడకుండా వారిపై దాడులు చేస్తున్నారు.గుండాల మండలం జగ్గయ్య గూడెంలో ఏళ్లతరబడి సాగు చేసుకుంటున్న భూముల్లో అధికా రులు దాడులు చేశారు. సిర్పూర్‌కాగజ్‌ నగర్‌ టీఆర్‌ ఎస్‌ ఎమ్మెల్యేనే అటవీశాఖ అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆదివాసీచట్టాలు నిర్వీర్యం అవు తున్నాయి. పోలీసులు, కోర్టుల గురించి స్పష్టంగా తెలియని ఆదివాసీలు భయంతో వందలాది ఎక రాలు భూములు కోల్పోతున్నారు. టీఆర్‌ఎస్‌ అధినేత సీఎం కేసీఆర్‌ కుర్చీ వేసుకొని పోడు భూముల సమస్య పరిష్కరిస్తానని గతంలో చెప్పారు. ఇంత వరకు దానిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆది వాసీల భూములకు పట్టాలు ఇవ్వడంతోపాటు, ధరణి వెబ్‌ సైట్‌లో నిషేధిత జాబితాలో ఉన్న28 లక్షల ఎకరాలను అందులోంచి తీసేయాలి. లేదం టే రాష్ట్రం కోసం కొట్లాడిన ఆదివాసీలు, గిరిజనులు మరో జల్‌,జంగల్‌,జమీన్‌ పోరాటానికి సిద్ధమ వుతారు.
– వ్యాసకర్త : రాష్ట్ర అధ్యక్షుడు,తెలంగాణ లోక్‌ సత్తా పార్టీ.

ఏపీలో పీఆర్‌సీ రగడ

  • ఫిబ్రవరి 7 నుంచి ఏపీ ఉద్యోగుల సమ్మె
    ఎపి ప్రభుత్వం విడుదల చేసిన పిఆర్సి జీఓలను తిరస్కరిస్తున్నట్లు ఎన్‌.జి.ఓ సంఘం నేతలు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రకటించారు. ఐ.ఆర్‌.కన్నా తక్కువ ఫిట్‌ మెంట్‌ ఇచ్చిన సందర్భం చరిత్రలో లేదని శ్రీనివాసరావు అన్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉద్యోగు లంతా ఆందోళనలు చేపట్టారు. కొత్త పిఆర్సి తమకు అవసరం లేదని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 7 నుంచి ఏపీ ఉద్యోగుల సమ్మె బాట పట్టనున్నారు. పీఆర్సీ పోరాట కార్యాచరణపై చర్చించి సమ్మె పై నిర్ణయంతీసుకుని ..ఈనెల 25న అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, ధర్నాలు చేపట్టనున్నట్లు ప్రకటన. ఈనెల 26న అన్ని తాలుకా కేంద్రాల్లో అంబేడ్కర్‌ విగ్రహానికి విజ్ఞాపన పత్రాలు అందజేస్తామని ప్రకటించారు. 27 నుంచి 30 వరకు అన్ని జిల్లా కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు, ఫిబ్రవరి 3న చలో విజయవాడ కార్యక్రమం, ఫిబ్రవరి 5 నుంచి సహాయ నిరాకరణ చేపట్టనున్నట్లు ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడి.
    ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పీఆర్సీపై రగడ కంటిన్యూ అవుతోంది. ఫిబ్రవరి 7 నుంచి ఏపీ ఉద్యోగుల సమ్మె సైరన్‌ ప్రకటించారు. పీఆర్సీ నివేదికను తక్షణమే బయటపెట్టాలని ఉద్యోగ నేతలు డిమాండ్‌ చేయగా..సర్కార్‌ మాత్రం నో చెప్పింది. సాంకేతిక అంశాల్ని అధ్యయనం చేయాల్సి ఉందన్న అధికారులు.. పీఆర్సీ నివేదిక బయటకు చెప్పేది లేదన్నారు. పది రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తామని చెప్పారు. దీంతో సర్కార్‌ తీరుపై ఉద్యోగ సంఘాల నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. పీఆర్సీ రిపోర్ట్‌ ఇవ్వకుండా చర్చలు ఎలా సాధ్యమని ప్రశ్నించారు.ప్రభుత్వం కావాలనే కాలయాపన చేస్తోందని మండి పడ్డారు. ప్రతిపక్షంలో వున్నప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని వైసిపి తీవ్రంగా విమర్శించింది. ఉద్యోగులకు మెరుగైన పిఆర్‌సి ఇస్తామని ఊరించింది. చివరికి టిడిపి ప్రభుత్వాన్ని మించిపోయి ఉద్యోగి వ్యతిరేక ప్రభుత్వంగా మిగిలింది. ఆర్థిక పరిస్థితి సరిగా లేదు కాబట్టి ముఖ్యమంత్రి తనకున్న పరిమితులను చెప్పట మంటే…తాను ఇచ్చిన వాగ్దానాలన్నింటిని తుంగలో తొక్కిన లెక్కలోకి వస్తుంది. ఆర్థిక పరిస్థితి పేరుతో ఉద్యోగుల మీద దాడి చేస్తుందని ముందుగా ఊహించినదే జరిగింది. సంక్షేమ పథకాలకు ఎవరూ వ్యతిరేకం కాదు. సంక్షేమ పథకాలతో పాటుగా ఉద్యోగుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత, వారి సంక్షేమాన్ని చూడాల్సిన కర్తవ్యం ప్రభుత్వంపై ఉంటుంది. కనీస నైతిక సూత్రాలకు వైసిపి ప్రభుత్వం తిలోదకాలివ్వటం స్పష్టంగా బైటపడిరది.
    కనీస నైతిక సూత్రాలకు తిలోదకాలు
    పిఆర్‌సి నివేదిక వచ్చినప్పుడు దానిని వెల్లడిరచకుండా,చర్చ పెట్టకుండా వైసిపి ప్రభుత్వం దాచి పెట్టింది. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా నివేదికను వెల్లడిరచకుండానే, ప్రభుత్వ సెక్రటరీలతో కమిటీ వేసి సిఫార్సులు చెయ్యమన్నది. సెక్రటరీల కమిటీ సిఫార్సు చేసిన 14.29 శాతం కంటే ఎక్కువగా తాము 23.29 శాతం ఎక్కువ ఇస్తున్నామని ముఖ్యమంత్రి ప్రకటిం చారు. ఇంటెరిమ్‌ రిలీఫ్‌గా ఇచ్చిన 27శాతం కంటే తాము ఇచ్చింది తక్కువ అనేది చెప్పలేదు. సమావేశంలో కూర్చున్న ఉద్యోగుల ప్రతినిధులు ఎవ్వరూ మారు మాట్లాడలేదు. ముఖ్యమంత్రి దగ్గర ఎవ్వరూ మాట్లాడకూడదని ముందుగానే ఇచ్చిన సూచనలను పాటించారు. దాంతో ఉద్యో గుల ప్రయోజనాలు ఒక్కొక్కటే కాలరాయటం కొనసాగింది. వై.ఎస్‌ రాజశేఖర రెడ్డి ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు సైతం ఇంటెరిమ్‌ రిలీఫ్‌గా ఉన్న 21శాతాన్ని 16శాతానికి తగ్గించి ఉద్యో గులకు అన్యాయం చేశారు. ఇంటెరిమ్‌ రిలీఫ్‌ కంటే ఫిట్‌మెంట్‌ తక్కువ ఇవ్వటం పిఆర్‌సి చరిత్రలోనే మొదటిసారి. డిఏ ను బేసిక్‌లో కలిపి దాని మీద ఫిట్‌మెంట్‌ ఇవ్వ కుండా బేసిక్‌ మీద మాత్రమే ఫిట్‌మెంట్‌ ఇచ్చి దానికి డిఏ ను కలపడం కూడా కనీస సూత్రా లకు విరుద్ధం. స్థూల వేతనాలు తగ్గకుండా చూస్తామని ప్రభుత్వ సలహాదారులు చెప్పిన మాట కూడా ఖరారు కాకుండా, చివరికి స్థూల వేతనాలు తగ్గటమే ఖరారైంది. ఫిట్‌మెంట్‌ సంగతి వదిలేసిన జెఎసి నాయకత్వం హెచ్‌ఆర్‌ఎ, సిసిఎ లకు పరిమితం కావటం నష్టం చేసింది. చివరికి హెచ్‌ఆర్‌ఎ,సిసిఎలు కూడా కోతకు గురిఅయ్యాయి. ఉద్యోగులు ప్రభుత్వానికి ఎదురు కట్టాల్సి రావడం విచారకరం. 5 సంవత్సరాలకు ఒకసారి ఉన్న పిఆర్‌సిని 10 ఏళ్లకు మార్చి వైసిపి ప్రభుత్వం ఉద్యోగులకు తీవ్ర అన్యాయం చేసింది. పెన్ష నర్లకు అదనపు పెన్షన్‌ వచ్చే వయస్సు అర్హతను పెంచి వారికి నష్టం చేసింది. సిపిఎస్‌ రద్దు విషయం తేల్చకుండా వాయిదా వేసింది. గ్రామ సచివాలయ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌కు కూడా కట్టుబడలేదు.
    కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు నష్టం
    కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులందరూ శాశ్వతంగా ఉండే పనులలోనే ఉన్నారు. అటువంటప్పుడు వారి సర్వీసులను రెగ్యులరైజ్‌ చెయ్యాల్సిన బాధ్యత, నైతికత ప్రభుత్వం మీద ఉంటుంది. కాని, మిగతా ప్రభుత్వాల మాది రిగానే వైసిపి ప్రభుత్వం కూడా వీరిని విభజించి పాలిస్తోంది. డైరెక్ట్‌ కాంట్రాక్ట్‌,థర్డ్‌ పార్టీ కాంట్రాక్టు అని విభజించినా…వారిద్దరూ చేసే పని ఒక్కటే. 2016లో వచ్చిన సుప్రీం కోర్టు తీర్పుకు కూడా కొన్ని పరిమితులున్నాయి. సుప్రీంకోర్టు మినిమం బేసిక్‌ మాత్రమే ఇవ్వాలని చెప్పగా,కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ చట్టం నిబంధనలలో పర్మినెంట్‌ వర్కర్లు చేసే పనినే కాంట్రాక్ట్‌ వర్కర్లు చేస్తుంటే కాంట్రాక్టు వర్కర్లకు పర్మినెంట్‌ వర్కర్ల వేతనాలు, డి.ఎ, అలవెన్సులు, ఇతర బెనిఫిట్లన్నీ కల్పించాలని ఉంది. సమాన పనికి సమాన వేతనానికి కాంట్రాక్ట్‌ వర్కర్ల చట్టం రూల్స్‌లో చెప్పింది మాత్రమే సరితూగుతుంది. ఇలా వుండగా… కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగు లందరిని పర్మినెంట్‌ చేస్తామనే వాగ్దానంతో జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చారు. ప్రతిపక్షంలో ఉండగా తాము అధికారం లోకి వస్తే అందరినీ పర్మినెంట్‌ చేస్తామని అసెంబ్లీలో చంద్రబాబు నాయుడికి సవాలు విసిరారు. కాని ఇప్పుడు ఆయన అడుగుజాడల్లోనే నడుస్తున్నారు. కనీసం డైరెక్ట్‌ కాంట్రాక్ట్‌ ఉద్యోగులను కూడా పర్మినెంట్‌ చెయ్యటం గురించి పట్టించుకోవటం లేదు. ఈ పిఆర్‌సి లో వీరి వేతనాల నిర్ణయంలో కూడా గతంలో మాదిరిగానే తీవ్రమైన అన్యాయం జరిగింది. అందరి ముందు పిఆర్‌సి ప్రకటించే సమయంలో కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు మినిమం బేసిక్‌ అమలు చేస్తామని, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ఇప్పుడు వస్తున్న వేతనాల మీద 30శాతం పెంచు తామని ప్రకటించారు. ఆచరణలో ఈ రెండు అవాస్తవాలైనాయి. అంతిమంగా ఇచ్చిన జీవో లలో జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ బాట పట్టింది. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు అన్యాయం చేసింది.
    పీఆర్సీ విధులు,విధానాలు
    పీఆర్‌సీని ఆంగ్లంలో (ూA్‌ RజుపIూIూచీ జూవీవీIుుజుజు) (వేతన సవరణ సంఘం) అని పిలుస్తారు. ప్రతి ఐదు సంవత్సరాలకు ఉద్యోగ, ఉపాధ్యాయులకు, పింఛన్‌ దారులకు వేతనా లను స్థిరీకరించి తాజాగా వేతనాలను సవరించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పిస్తుంది. వేతన సవరణ తేదీ నాటికి ఉన్న మూల వేతనం,కరువు భత్యం,ఫిట్‌మెంట్‌లను కలిపి వచ్చిన మొత్తాలను తాజాగా మూలవేతనాలు గా కూర్పు చేసేదే పీఆర్‌సీ. తాజా మాస్టర్‌ స్కేలు,ఇంక్రిమెంట్లు, కరువు భత్యంలను ప్రతి పాదించేదే పీఆర్‌సీ. తాజా ద్రవ్యోల్బణం,అయి దేళ్లలో ధరల స్థిరీకరణ సూచికను పరిశీలించి, గత పీఆర్‌సీ నివేదికలను పరిశీలించి లోపాలను సవరించి శాస్త్రీయంగా తాజా మూల వేతానా లను ప్రతిపాదిస్తుంది.
    మధ్యంతర భృతి(ఐఆర్‌)
    ప్రతీ పీఆర్‌సీ కమిటీ వేసిన తరువాత సకాలం లో వేతన సవరణ జాప్యానికి ప్రతిఫలంగా మంజూరయ్యే భృతినే మధ్యంతర భృతి అంటారు. ఇది ప్రస్తుత కాల ధరల సూచిక, ద్రవ్యోల్బణం విలువలపై ఆధారపడుతుంది. పీఆర్‌సీ అముల్లోకి వచ్చిన వెంటనే ఐఆర్‌ రద్దవుతుంది.
    ఫిట్‌మెంట్‌
    తాజా ద్రవ్యోల్బణం ధరల సూచికను ఆధారం చేసుకొని మూల వేతనాలను పెంచాల్సిన స్థితి శాతాన్ని ప్రభుత్వం నిర్ధారించి పీఆర్‌సీలో ప్రకటించేదే ఫిట్‌మెంట్‌ అంటారు. అయిదేళ్ల కాలంలో పెరిగిన ధరల స్థితిని సమన్వయ పరిచి ఉద్యోగి జీతాన్ని ఫిట్‌మెంట్‌ ద్వారా పెంచుతారు. ప్రారంభ డీఏ, పీఆర్‌సీ జరిగిన వెంటనే గత కరువు భత్యం విలువ రద్దయి వెంటనే తాజాగా ప్రకటించే కరువు భత్యాన్ని ప్రారంభ డీఏ అంటారు. డీఏ కలపడంలో వేతన స్థిరీకరణ జరిగే తేదీ నాటికి ఉన్న డీఏను మూల వేతనంలో కలుపడాన్ని డీఏ మెర్జ్‌ అంటారు.
    మాస్టర్‌ స్కేల్‌
    మూత వేతనాల శ్రేణినే మాస్టర్‌ స్కేల్‌ అంటారు. పాత మూల వేతనాలు,కరువు భత్యం,ఫిట్‌మెంట్‌లను సమన్వయ పరిచి తాజా ధరల స్థితిని బేరీజు వేసి ఇంక్రిమెంట్ల కూర్పులో నూతన మూలవేతనాల శ్రేణిని కమిటీకి నివేది స్తారు. కొత్త మూల వేతనాలు,మాస్టర్‌ స్కేల్‌ను బట్టి నిర్ణయిస్తారు.మాస్టర్‌ స్కేల్‌లో మూల వేత నాల ప్రతి సంవత్సరం పెరిగే ఇంక్రి మెంట్‌ విలువలు పొందు పరుస్తారు.వేతన స్థిరీకర ణలను మాస్టర్‌ స్కేల్‌ ప్రకారం జరుపుతారు.- పి.అజయ కుమార్‌

అమ్మాయి వివాహం వ‌య‌స్సు 21కి పెంపు

అమ్మాయిల కనీస వివాహ వయసును 21 సంవత్సరాలకు పెంచేందుకు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. హిందూ వివాహ చట్టం (1955)ను అనుసరించి అమ్మాయిల కనీస వివాహ వయసు 18 సంవత్సరాలు ఉండేది. దీనిని పురుషులతో సమానంగా 21 సంవత్సరాలు చేసేందుకు క్యాబినెట్‌ అంగీకారం తెలిపింది. ఈ నిర్ణయా నికి అనుగుణంగా ప్రత్యేక వివాహ చట్టం (1954), బాల్య వివాహాల నిరోధక చట్టం (2006), హిందూ వివాహ చట్టం(1955)లో కూడా తగిన సవరణలు చేయాల్సి ఉంటుంది. అమ్మాయిల వివాహ వయసును 18 సంవత్సరాలుగా 1978లో నిర్ణయించారు. అమ్మాయిల పెళ్లి వయసు పెంపుపై నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వం కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖ నేతృత్వంలో టాస్క్‌ ఫోర్స్‌ కమి టీని నియమించింది.21 సంవత్సరాలకు పెంచా లని ఈ కమిటీ ప్రతిపాదించింది. ఇందు కోసం దేశవ్యాప్తంగా 16 యూనివర్సిటీలు,15 స్వచ్చంద సేవాసంస్థల నుంచి అభిప్రాయాలను సేకరించింది. ఈ కమిటీకి సమతా పార్టీమాజీఛైర్మన్‌ జయ జైట్లీ నేతృత్వం వహించారు. ఈమెతో పాటు, ఈ కమిటీ లో నీతిఆయోగ్‌సభ్యులు డాక్టర్‌ వి.కె.పాల్‌, న్యాయ మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్‌ అధికారులు కూడా సభ్యులుగా ఉన్నారు.స్కూళ్లలో లైంగిక విద్యను తప్పని సరి చేయాలని కూడా ఈ కమిటీ సూచించింది.ఈ నిర్ణయం లింగ సమానత్వాన్ని సాధించేందుకు సహకరిస్తుందని ప్రభుత్వం చెబు తోంది. అమ్మాయిలు,అబ్బాయిల వివాహ వయసు లోని అంతరాన్ని తొలగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఈ నిర్ణయం లింగ సమానత్వాన్ని సాధిస్తుందా?
సమాజంలో పితృస్వామ్య భావజాలాన్ని పెంచి పోషించినంత వరకూ బాలికల హోదాలో, పరిస్థి తుల్లో ఎటువంటి మార్పులు రావని స్త్రీవాద పత్రిక ‘భూమిక’సంపాదకురాలు కొండవీటి సత్యవతి అంటారు. బాలికల కనీస వివాహ వయసును ప్రభుత్వం 21సంవత్సరాలకు పెంచడంపై ఆమె ఒక వ్యాసం రాశారు. సామాజిక వాతావరణాన్ని ప్రక్షాళన చేయకుండా వివాహ వయో పరిమితిని పెంచడంలో అర్ధం లేదు. బాలికలపై చూపించే వివక్షకు మూలకారణాలను తెలుసుకోకుండా సమా నత్వాన్ని సాధించడం కష్టమని ఆమె అంటారు. ప్రభుత్వం ఈనిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతి స్తున్నానని అంటూ లింగ సమానత్వం సాధించ డానికి ఇదొక మెట్టు లాంటిదని ఆంధ్రయూని వర్సిటీ లా కాలేజీ విభాగాధిపతి డాక్టర్‌ సుమిత్ర అన్నారు.

ఈ నిర్ణయం బాల్య వివాహాలను ఆపుతుందా?
భారతదేశంలో 2019-20నాటికి బాల్య వివా హాలు 23% ఉన్నట్లు ఇటీవల విడుదలైన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే తెలిపింది. ఇది 2015-16లో 27% ఉండేది.బాల్య వివాహాలు శిశు మరణాలకు, ప్రసూతి మరణాలకు కూడా కారణం అవుతున్నాయి.చిన్న పిల్లల పెళ్లిళ్ల గురించి చర్చ మొదలై 150 సంవత్సరాలు గడిచిపోయినా, నేటికీ ఇదొక సమస్యగానే ఉండిపోవడం విచారకరమని సత్యవతి అంటారు. ‘‘చిన్న వయసులోనే రజస్వల అవ్వడంవల్ల చురుకుగా మారే హార్మోన్ల ఒత్తిడిని అమ్మాయిలు ఎలా అధిగమిస్తారు? గ్రామాల్లో హై స్కూల్‌ అయిపోయిన తర్వాత ఎక్కడ చదివించాలనే సందేహం,ఆడపిల్లలను దూరంగా పంపించి చది వించేందుకు ఇష్టం చూపకపోవడం, అమ్మాయిలకు సురక్షిత వాతావరణం లేకపోవడం, లైంగిక వేధింపులు కూడా బాల్య వివాహాలకు దారి తీస్తున్నాయి’’ అని ఆమె అన్నారు. యుక్తవయసులో ఉన్న 51% చదువు లేని అమ్మాయిలు, ప్రాధమిక విద్యను మాత్రమే అభ్యసించిన 47%మంది అమ్మా యిలు 18సంవత్సరాలులోపే వివాహం చేసు కున్నట్లు యూఎన్‌ఎఫ్‌పీఏ ఇండియా-2020 నివేదిక చెబుతోంది. భారత్‌లో 1.5కోట్ల మంది అమ్మాయిలకు 18ఏళ్లలోపే వివాహమైందని నివేది కలో జయ చెప్పారు. అయితే ఇదివరకు 46శాతం (మొత్తం బాలికల్లో 46శాతం మంది)గా ఉండే ఈ వివాహాలు ప్రస్తుతం 27శాతానికి తగ్గాయని జయా జైట్లీ పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గిరిజన తెగల్లో మార్పు తెస్తుందో లేదో సందేహమేనని అంటున్నారు నిర్ణయ్‌ స్వచ్చంద సంస్థకు చెందిన నిఖిని వర్మ. ఆమె తెలంగాణలోని ఆదిలాబాద్‌ జిల్లాలో గిరిజన మహిళలు, బాలికల విద్య కోసం పని చేస్తున్నారు.‘‘గిరిజన ప్రాంతాల్లో పాటించే ఆచారాలు వారి సంస్కృతి పై ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా,ఈప్రాంతాల్లో ప్రతి నిర్ణ యానికి గ్రామపెద్దపై ఆధారపడతారు. ఈ ప్రాంతా ల్లో 18 ఏళ్లురాక ముందేపెళ్లి చేసేస్తారు. ఆ విష యం గురించి ఫిర్యాదు కూడా ఎవరూ చేయరు. పెళ్లి వయసు 21లేదా25కు పెరిగినా 18 సంవత్స రాలే ఉన్నా అది గిరిజనసమాజాల్లో పెద్దగా ప్రభావం చూపించదు’’అనిఅన్నారు.కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం స్పెషల్‌ మ్యారేజ్‌ చట్టం (1954) హిందూ వివాహచట్టం(1955)ప్రకారం వివాహం చేసుకునేవారికి ఈనిర్ణయం వర్తిస్తుంది.

మహిళా సాధికారత సాధించేందుకు తోడ్పడు తుందా?
చట్టంలో మార్పులు చేసినంత మాత్రాన మహిళా సాధికారత వస్తుందని చెప్పలేం,కానీ,ఇదొక మార్పు కు నాంది పలుకుతుందని డాక్టర్‌ సుమిత్ర అంటారు.‘‘సాధికారతకు సమానత్వం తొలి మెట్టు’’. సమానత్వ భావన అనేది సామాజికంగా వచ్చే వరకూ సాధికారత సాధ్యం కాదని ఆమె అంటారు. ఆర్ధిక,రాజకీయ సమానత్వం కొంత వరకు సాధిం చాం కానీ, సామాజిక సమానత్వం ఇంకా పూర్తిగా రాలేదంటారు డాక్టర్‌ సుమిత్ర.
‘‘మహిళలు కూడా జెండర్‌ స్టీరియోటైప్స్‌ ను దాటి ఆలోచించగలగాలని అన్నారు. సమాజం ఒక పరి ణామం చెందుతున్న దశలో ఉంది.చట్టంతో పాటు సామాజిక దృక్పధం కూడా మారాలి. కానీ, మార్పు సాకారమయ్యేందుకు చాలా సమయం పడుతుంది’’ అని అన్నారు.అమ్మాయిల వివాహ వయసును పెంచ డం ద్వారా వారి విద్య ఉద్యోగావకాశాలు పెరిగితే, ఆర్థికాభివృద్ధికి కూడా దోహదం చేస్తుందని సుమిత్ర అన్నారు.

అమలు చేయడంలో ఉన్న సవాళ్లేంటి?
అమ్మాయిల వివాహ వయసును పెంచడం ద్వారా పిల్లలు,మహిళలపై మాత్రమే కాకుండా కుటుం బం,ఆర్ధిక,సామాజిక పరిస్థితులపై ప్రభావం చూపి ిస్తుందని టాస్క్‌ ఫోర్స్‌ కమిటీ అభిప్రాయపడిరది. కొన్ని వెనుకబడిన వర్గాల్లో 70% బాల్య వివాహాలు చోటు చేసుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. చదువును ఆపేసిన పిల్లల్లో 3నుంచి4రెట్లు మందికి పెళ్లిళ్లు చేసే అవకాశముందని లేదా వారి వివా హం నిశ్చయం అయిపోయి ఉంటుందని ఇంట ర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఆన్‌ విమెన్‌ నిర్వహిం చిన అధ్యయనం పేర్కొంది. గ్రామీణ,గిరిజన ప్రాం తాల్లో నాటుకుపోయిన నమ్మకాలు, ఆచారాలను ఆపమని చెప్పడం చాలా కష్టమని అంటారు నిఖిని వర్మ.‘‘అదిలాబాద్‌ జిల్లాలోజరిగే నాగోబా జాతర లో వధూవరులను ఎంపిక చేసుకుంటారు. మాకు దేముడు చూపించిన మనువు అని అంటూ ఉంటారు. అటువంటి వారిని18లేదా21 సంవత్స రాల వరకూ పెళ్లి చేయకుండా ఆపమని ఒప్పించ డం చాలా కష్టమైన పని’’అని అంటారు నిఖిని. లోహారా గ్రామంలో బాల్య వివాహాలను ఆపేం దుకు పిల్లల తల్లితండ్రులను ఒప్పించడం చాలా కష్టంగా మారినట్లు వివరించారు.
పెంపు ద్వారా లింగ సమానత్వం సాధ్యమా…? ప్రపంచంలో జరిగే బాల్యవివాహాల్లో మూడవ వంతు మనదేశంలోనే ఉండటం ఆందోళన కలిగిస్తుంది. ఆడపిల్లలు అంటే ‘’ఆళ్ళ’’ పిల్లలే అని దురభిప్రాయం మన కుటుంబాల్లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నది. అందు చేతనే పదవ తరగతి చదువుతున్న రోజుల్లోనే ఆడ పిల్లలకు పెళ్ళిళ్ళు చేసేందుకు సన్నాహాలు చేస్తు న్నారు. రాజస్థాన్‌ ఈవిషయంలో దేశంలోనే మొద టి స్థానంలో ఉంది. దేశ వ్యాప్తంగా నేటికీ 47 శాతం బాల్యవివాహాలు జరుగుతున్నాయి అని ఐక్య రాజ్యసమితి బాలలనిధి తెలియజేస్తున్నది. చదువు కున్న వారు కూడా బాల్యవివాహాలు జరిపించడం బాధాకరమైన విషయం. మగ పిల్లలు ఎక్కువ, ఆడపిల్లలు తక్కువఅనే భావం నేటికీ అనేక కుటుం బాల్లో కనపడుతోంది. ఈరకమైన ఆలోచనలు మార్చుకోవాలి.‘’లింగ సమానత్వం’’ దిశగా ప్రయా ణం చేయాలి. మత విశ్వాసాలను, మూఢ విశ్వా సాలను, ఆచారాలను పక్కన పెట్టాలి. అందరూ సమానమే అనే భావన రావాలి. స్త్రీని దైవంగా కొలిచే ఈ దేశం నిరంతరం మహిళల వేదింపు లకు నిలయంగా ఎందుకు ఉంటుందో ఆలోచన చేయాలి. మన సంస్కృతి సాంప్రదాయాలను పాశ్చా త్య దేశాల్లో గొప్పలుగా చెప్పుకొంటున్న మనం, ఈరోజున మన దేశంలో ఉన్న వాస్తవ పరిస్థితులకు ఏమి సంజాయిషీ ఇస్తాం…?ఆకలి బాధలు, ఆక్రందనలు, వివక్షత, పేదరికం, అవిద్య, అక్రమ రవాణా,అఘాయిత్యాలు,ఆత్మహత్యలు,యాసిడ్‌ దాడులు,పరువు హత్యలు,వరకట్న వేదింపులు, వ్యభిచారకూపాలు, అవహేళనలు, గృహహింసలు, లైంగిక దోపిడీ,ర్యాగింగ్‌,రేప్‌లకు నిలయంగా ఉన్న ఈదేశంలో సగౌరవంగా స్త్రీబతికేది ఎప్పు డు…? ఆలోచన చేయాలి.అందుకే ‘’ఒకదేశ అభి వృద్ధి,ఆ దేశ మహిళా అభివృద్ధిపై ఆధారపడి ఉంటుంది’’ అంటారు అంబేద్కర్‌. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని, దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చిత్తశుద్ధితో అమలు చేయాలి. కానీ అంతమాత్రానికే దేశంలో మహి ళలకు రక్షణ, భధ్రత, సమానత్వం కలుగుతుందా?. పురుషులుతో సమానంగా స్త్రీలు అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుస్తారా?. దేశాభివృద్ధికి తిరుగులేని శక్తిగా నిలబడుతారా? దిశయాప్‌,షీ టీం,మహిళా పోలీస్‌ స్టేషన్లు, నిర్భయ చట్టం ఉన్నా, అనునిత్యం దేశంలో ఏదో ఒకచోట మహిళల ఆక్రందనలు ఎందుకు వినిపిస్తున్నాయో గుర్తెరగాలి.
ఇటీవలి కాలంలో దేశంలో లింగ నిష్పత్తిలో 1000 మంది పురుషులకు, మహిళలు 1020 పైబడి నమోదు కావడం శుభ పరిణామంగా భావించాలి. భ్రూణ హత్యలు తగ్గాయి.అయితే అదే సమయంలో అఘాయిత్యాలు, గృహహింస రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ కరోనా కాలంలో మరింత ఎక్కువయినాయి. చట్టాలు ఎన్నిఉన్నా సమాజంలో మహిళలపై చిన్న చూపు,వివక్షత కొనసాగుతూనే ఉంది. ఈ విషయా లపై ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. -జి.ఎన్‌.వి.సతీష్‌

మతోన్మాదుల విష కౌగిలిలో రాజ్యాంగం

ఆర్టికల్‌ 29 ప్రకారం మైనారిటీ మతానికి చెందిన పౌరులు తమ మతానికి చెందిన ఆరాధన పద్ధతులు, సంస్కృతులు, సాంప్రదాయాలు స్వేచ్ఛగా ఆచరించే హక్కు రాజ్యాంగం ఇచ్చింది. ఈ హక్కు అమలు అనేది నేడు పెద్ద సవాలుగా మారింది. మన రాజ్యాంగంలో పౌరులకు మత స్వేచ్ఛ ఉంది. కానీ రాజ్యానికి (ప్రభుత్వానికి) మతం లేదు. ఉండదు కూడా. ఎందుకంటే అది లౌకిక రాజ్యం. మతం పేరుతో రాజకీయాలు చేయడం రాజ్యాంగ విరుద్ధం. అయితే ప్రస్తుతం మతమే రాజకీయం అయింది. ప్రతి విషయాన్ని మత కోణంలో చూడడం పెరిగిపోయింది.` మహమ్మద్‌ అబ్బాస్‌ దేశంలో లౌకిక,ప్రజాస్వామిక విలువలకు మతో న్మాద ప్రమాదం తీవ్రంగా పరిణ మించింది. రాజ్యాంగం ప్రజలకు కల్పించిన హక్కులపై దాడి తీవ్రమైంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14దేశ పౌరులం దరు సమానులే అని ఉద్ఘాటిస్తుంటే, ఆర్టికల్‌ 15 మతం,కులం, జాతి,లింగం,పుట్టిన ప్రాంతం ఆధారంగా ఏ పౌరుని పట్ల వివక్ష చూప రాదని,అలా ఎవరైనా ప్రవర్తిస్తే చట్టరీత్యా నేరం అని స్పష్టం చేసింది. కానీ బిజెపి పాలిత ఉత్తరప్రదేశ్‌ లోని కాన్పూర్‌లో రిక్షా తొక్కి కుటుంబాన్ని పోషించు కుంటున్న తస్లీమ్‌ బేగ్‌ను బజరంగ్‌ దళ్‌ మూక లు చుట్టు ముట్టి ‘జై శ్రీరామ్‌’ అనాలని, తన మైనర్‌ కూతురు సమక్షంలోనే తీవ్రంగా కొట్టారు. పోలీసు స్టేషన్‌లో కేసు పెడితే నిందితులను మూడు రోజులలో వదిలేశారు. వారు బయటికి వచ్చి హిందూ ఏరియాలోకి వస్తే చంపేస్తామని బహిరంగంగా హెచ్చరిం చారు. మధ్యప్రదేశ్‌ దివాస్‌ జిల్లాలో సైకిల్‌పై తిరిగి బిస్కెట్లు అమ్ముకునే జాయెద్‌ ఖాన్‌ అనే వ్యక్తిని ఆధార్‌ కార్డు చూపించమని కొట్టారు. గ్రామాలలో తిరిగి బిస్కెట్లు అమ్మితే చంపే స్తామని బెదిరించారు. అలాగే చిత్తు కాగితాలు, పాత ఇనుప సామానులను కొనుగోలు చేసే మరో వీధి వ్యాపారిని ఇదే రకంగా కట్టేసి కొట్టారు. ఇప్పు డు వీరు బయటికి రావాలంటే భయంతో వణికి పోతున్నారు. దాడి చేసినవారి పై పోలీస్‌ కేసులు లేవు, కేవలం మందలించి వదిలేస్తున్నారు. మధ్యప్రదేశ్‌ బోర్లి ప్రాంతంలో గర్బాహ అనే గ్రామంలోకి హిందూయేతరులు రావడాన్ని నిషేధిస్తూ వి.హెచ్‌.పిబోర్డులు ఏర్పాటు చేసింది. ద్వారకా ప్రాంతంలో హజ్‌ భవన్‌ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ విశ్వ హిందూ పరిషత్‌ ధర్నా నిర్వహించి నిర్మాణాన్ని అడ్డుకున్నారు. ఈ ఘటనలన్ని స్పష్టం చేస్తున్నదేమిటంటే చట్టం అందరికీ సమానం కాదని,మతం పేరుతో విచక్షణ చూపించినా, దాడులు చేసినా చట్టం ఏమీ అనదు అనే సందేశాన్ని ఇస్తున్నాయి.ఆర్టికల్‌ 21 ప్రతి మనిషికి స్వేచ్ఛగా జీవించే హక్కును కల్పిం చింది. హర్యానా నోజిల్లా కేర్‌ ఖలీల్‌ గ్రామంలో ఆసిఫ్‌ ఖాన్‌ అనే 27సంవత్సరాల యువకుడిని అకారణంగా మతోన్మాదుల గుంపు దారుణంగా హత్య చేయడంతోపాటు, గ్రామంలో ముల్లాల నందరిని వదిలిపెట్టం అని హెచ్చరించింది. గతంలో కూడా గో రక్షణ దళాల పేరుతో పెహ్లూ ఖాన్‌,అఖ్లాక్‌ లాంటి అనేక మందిని అందరూ చూస్తుండగానే దారుణంగా హత్య చేసారు. ఉపాధి అవకాశాలను కూడా దెబ్బ తీశారు. ఇవన్నీ రాజ్యాంగం ప్రసాదించిన జీవించే హక్కును హరించేవే. ఆర్టికల్‌ 23 సెక్షన్‌ (2)ప్రకారం రాజ్యం (ప్రభుత్వం) మతం,కులం,జాతి,లింగం,పుట్టిన ప్రాంతం ఆధారంగా ఏమనిషి పట్ల వివక్ష చూపరాదు. కానీ అఖ్లాక్‌ హత్య కేసులో నిందితులకు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించింది. విద్వేష ప్రకటనలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న విశ్వహిందూ పరిషత్‌, బజరంగ్‌ దళ్‌,బిజెపి,ఆర్‌ఎస్‌ఎస్‌ కు చెందిన నాయకులపై ఎలాంటి కేసులు పెట్టడం లేదు. త్రిపురలో మైనారిటీలపై వి.హెచ్‌.పి దాడులకు పాల్పడి ఆస్తులను,ఇళ్ళను,ప్రార్థనాస్థలాలను ధ్వంసం చేసి నిప్పంటించినా వారిపై కేసులు పెట్టలేదు. కానీ మైనారిటీలపై జరిగిన మత హింసను విచారించడానికి వెళ్లిన నిజనిర్థారణ బృందంపై దేశ ద్రోహం కింద కేసులు పెట్టారు. హింసాత్మక చర్యలకు పాల్పడిన వారిని వది లేసి,బాధితులను పరామర్శించిన వారిపై కేసులు పెట్టడం అంటే మతోన్మాద దాడులను ప్రోత్సహించడమే కదా ! ఆర్టికల్‌ 25 సెక్షన్‌ (1) ప్రకారం దేశ పౌరులందరికీ మత స్వేచ్ఛ ఇవ్వబడిరది. పౌరులు తమకు నచ్చిన మతాన్ని, ఆరాధన పద్ధతులను స్వేచ్ఛగా ఆచరించవచ్చు. ప్రచారం చేసుకోవచ్చు. ఏమతంపై విశ్వాసం ప్రకటించకుండా స్వతంత్రంగా ఉండే హక్కు కూడా పౌరులకు ఇవ్వబడిరది. ఎవరిపైనా బలవంతంగా విశ్వాసాలను,నమ్మకాలను రుద్దరాదని రాసుకున్నాం. అయితే మానవ హక్కుల సంఘాల నివేదిక ప్రకారం 2021లో సెప్టెంబర్‌ నెలాఖరు నాటికి అంటే 9 నెలల కాలంలోనే క్రైస్తవ ప్రార్థనా సమావేశాలపై 300 దాడులు జరిగాయి. ప్రార్థనల్లో పాల్గొన్న వారిని తీవ్రంగా కొట్టారు. దాడులకు గురైన వారంతా దళితులు, గిరిజనులు. బలవంతపు మత మార్పిడులు అనే పేరుతో దళితులకు,గిరిజను లకు రాజ్యాంగం ప్రసాదించిన మత స్వేచ్ఛ హక్కును హరిస్తున్నారు. కులం పేరుతో, అంటరానితనం పేరుతో అణిచివేసినప్పటికీ వాళ్ళ కాళ్ళ కింద పడి ఉండాలనేది వారి ఉద్దేశ్యం. అందుకే దాడులతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. శుక్రవారం రోజున ముస్లింలు ప్రార్థనలు చేయకుండా రెసిడెన్షియల్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ పేరుతో…హర్యానా రాష్ట్రం గుర్గావ్‌ లోని ఎనిమిది ప్రాంతాలలో అడ్డుకు న్నారు. ఈ రకంగా దేశంలో మైనార్టీలకు ఉన్న మత స్వేచ్ఛను, ఆరాధన స్వేచ్ఛను కాలరాశారు. చట్టాలను ఉల్లంఘిస్తూ, అధికారాన్ని దుర్విని యోగం చేస్తూ, దాడులకు దిగుతున్నారు. ఈ దాడులపై ప్రభుత్వ యంత్రాంగం కఠినంగా వ్యవహరించిన పరిస్థితి లేదు. ఆర్టికల్‌ 29 ప్రకారం మైనారిటీ మతానికి చెందిన పౌరులు తమ మతానికి చెందిన ఆరాధన పద్ధతులు, సంస్కృతులు, సాంప్రదాయాలు స్వేచ్ఛగా ఆచరించే హక్కు రాజ్యాంగం ఇచ్చింది. ఈ హక్కు అమలు అనేది నేడు పెద్ద సవాలుగా మారింది. మన రాజ్యాంగంలో పౌరులకు మత స్వేచ్ఛ ఉంది. కానీ రాజ్యానికి (ప్రభుత్వానికి) మతం లేదు ఉండదు కూడా. ఎందుకంటే అది లౌకిక రాజ్యం. మతం పేరుతో రాజకీయాలు చేయడం రాజ్యాంగ విరుద్ధం. అయితే ప్రస్తుతం మతమే రాజకీయం అయింది. ప్రతి విషయాన్ని మత కోణంలో చూడడం పెరిగిపోయింది. టి 20వరల్డ్‌ కప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ ఓడితే దానికి ముస్లిం కాబట్టి బౌలర్‌ షమీని బాధ్యుడిని చేసి మతం పేరుతో దుర్మార్గంగా ట్రోల్‌ చేశారు. బౌలర్‌ షమీపై మతం పేరుతో దాడి చేయడాన్ని కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ వ్యతిరేకించినందుకు ఆయన ఏడాది వయసున్న కూతురిపై అత్యాచారం చేస్తామని బెదిరింపులకు దిగారు. అలా బెదిరింపులకు దిగింది తెలంగాణకు చెందిన ఉన్నత విద్యావం తుడు కావడం మనం రాష్ట్రానికే అవమానం. అంతేకాదు. తెలంగాణలో విస్తరిస్తున్న మతో న్మాద విష సంస్కృతికి ఇది నిదర్శనం. అసోం రాష్ట్రంలో కొన్ని దశాబ్దాలుగా భూములు సాగు చేసుకుని జీవిస్తున్న రెండు గ్రామాల ప్రజలు కేవలం ముస్లింలు అయినందువలన వారిపైన పారామిలటరీ దళాలను ప్రయోగించి, కాల్పులు జరిపి భూముల నుండి బలవంతంగా తొలగిం చారు. ఆ కాల్పుల్లో ఇద్దరు పౌరులు చనిపో యారు. చనిపోయిన వ్యక్తి శవంపై మీడియా ఫొటోగ్రాఫర్‌ ఎగిరి గంతులు వేయడం కొంత మందిలో పెరుగుతున్న విద్వేష మానసిక స్థాయికి పరాకాష్ట. ఈ దారుణాన్ని చూసి ప్రపంచమే నివ్వెరపోయింది. అంతర్జాతీయ మీడియా ‘డాన్సింగ్‌ ఆన్‌ డెడ్‌ బాడీ’ పేరుతో సంపాదకీయం రాసి దేశంలో పెరుగుతున్న మత ఉన్మాదపు సంస్కృతిని నిరసించింది. గుజరాత్‌లో రోడ్డు పక్కన మాంసాహార పదా ర్థాల అమ్మకాలను నిషేధించారు. వీధి వ్యాపా రం చేస్తూ జీవించేవారిలో మైనారిటీలు, దళితు లు ఎక్కువ మంది ఉన్నారు. ఈ నిషేధం మతోన్మాద కుట్ర తప్ప మరొకటి కాదు. కేరళలో హలాల్‌ పేరుతో రెస్టారెంట్లో వ్యాపారాన్ని దెబ్బతీయడం కోసం బిజెపి పెద్ద ఎత్తున కుట్రకు తెరలేపింది. చివరికి అయ్యప్ప స్వామి ప్రసాదం తయారు చేయడానికి వాడే బెల్లంపై కూడా హలాల్‌ పేరుతో వివాదం సృష్టించి అభాసుపాలైంది.ఇలా రోజూ ఏదో పేరుతో మత విద్వేషాలు, వివాదాలు సృష్టిం చడం, ప్రచారం చేయడం తప్ప మనుషుల గురించి,వారి విద్య, ఉద్యోగా లు,ఆరోగ్యం, వైద్యం,ఉపాధి, జీవన సౌకర్యాల మెరుగుదల గురించి ఏరోజు కూడా పట్టించు కునే పరిస్థితి లేదు. ఒకవైపు అంబానీ,అదానీ లాంటి కార్పొరేట్‌ శక్తులు పాలకుల అండతో లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం కొల్లగొట్టి ప్రపంచ కుబేరుల జాబితాలో చేరిపోతుంటే, మరోవైపు దేశంలో నిష్ట దరిద్రుల సంఖ్య 6 కోట్ల నుండి 13.5 కోట్లకు పెరిగింది.ప్రజా సమస్యలు చర్చ లోకి రాకుండా పక్కా ప్రణాళిక ప్రకారం విద్వేష రాజకీయాలు, విద్వేష ప్రకటనలు చేస్తూ సంఘ పరివార్‌ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నది. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే ప్రజల వాస్తవ సమస్యలు చర్చ లోకి రావాలి. అలా జరగాలంటే దేశంలో శాంతియుత, సామరస్యపూర్వక వాతావరణం ఏర్పడాలి. లౌకిక, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ జరగాలి. రాజకీయాల నుండి మతాన్ని విడదీయాలి. బెంగాల్‌,త్రిపుర రాష్ట్రా లలో అధికారంలో ఉన్నప్పుడు మార్క్సిస్టు పార్టీ ఆ పనిని విజయవంతంగా చేసింది. అందుకే బెంగాల్‌లో వామపక్ష ప్రభుత్వం అధికారంలో ఉన్న 35 సంవత్సరాల కాలంలో మత కలహా లు జరగలేదు. బాబ్రీ విధ్వంసం తర్వాత దేశమంతా మత కలహాలతో అట్టుడికి పోయిన ప్పటికీ బెంగాల్‌లో ఆనాటి లెఫ్ట్‌ఫ్రంట్‌ ప్రభుత్వం ఎలాంటి మత కలహాలు జరగకుండా సమర్థ వంతంగా కట్టడి చేయగలిగింది. దేశంలోనే అత్యధిక మంది స్వయం సేవకులు ఉన్న కేరళలో సైతం సిపిఐ(ఎం) నేతృత్వం లోని ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం మతోన్మాదాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నది. త్రిపురలో కూడా సిపిఐ(ఎం) అధికారంలో ఉన్నంత కాలం ఏ ఒక్క మత ఘర్షణ గాని, మత విద్వేష దాడులు గాని జరిగిన దాఖలాలు లేవు. మార్క్సిస్టులు బలహీనపడిన తరువాతే బెంగాల్‌, త్రిపుర రాష్ట్రాలలో మతోన్మాదం బుసలు కొడుతోంది. ఇది వర్తమాన చరిత్ర మనకు నేర్పిన గుణపాఠం. దేశంలో మతోన్మాదాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే లౌకిక, ప్రజాస్వామిక విలువలను నిక్కచ్చిగా అమలు చేయగలిగే సైద్ధాంతిక పునాది కలిగిన వామపక్ష శక్తులు బలపడాల్సిన అవసరం ఉంది.
వ్యాసకర్త : సీపీఐఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు (నవతెలంగాణ సౌజన్యంతో)

పోల‌వ‌రంపై పాత‌పాటే!

పోలవరం ప్రాజెక్టుపై ఎప్పటి కప్పుడు పరిశీలిస్తామని చెబుతున్న కేంద్రం తాజాగా దక్షి ణాది రాష్ట్రాల మండలి సదస్సు సందర్భంగా కూడా ఆపాత పాటనే వినిపించింది. 2017లో చెప్పినట్లుగానే 100 శాతం నిధులను భరిస్తామని మాత్రమే చెప్పిన కేంద్రం సహాయ పునరావాసం, తాజా అంచనాలపై మాత్రం స్పష్టత ఇవ్వడంలేదు. ఎస్‌జెడ్‌సి సదస్సు సందర్భంగా నవంబర్‌ 8,10వ తేదీల్లో రాష్ట్రానికి రాసిన రెండు లేఖల్లోనూ స్పష్ట మైన వివరాలు చెప్పకపోవడం గమనార్హం. 8వ తేదీన రాసిన లేఖలో 2014కు తరువాత జాతీయ హోదా పొంది,అనంతరం జరిగిన పనుల్లో మొత్తం100 శాతం తామే భరిస్తామని చెప్పిన విషయాన్నికూడా ఆ లేఖలో పునరుద్ఘాటించింది. అయితే, ఇరిగేషన్‌ కాంపోనెంట్‌ విలువను మాత్రమే భరించనున్నట్లు పేర్కొంది. అరటేప్రాజెక్టుకు సంబం ధిరచి సహాయ పునరావాసం పనులకు నిధులివ్వ డానికి సానుకూలంగా లేనట్టేనని రాష్ట్ర అధికా రులు ఆరదోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే తాజా గా పెరిగిన పనుల అంచనా, కొత్త డిజైన్లపై మాత్రం స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం. పైగా 2017-18 ధరల మేరకు కొత్త అంచనా రూ.47,725 కోట్లుకు సంబంధించిన ప్రతిపాదనలు ‘ఇన్‌ ప్రోగ్రెస్‌’గా ఉన్నట్లు లేఖలో పేర్కొన్న కేంద్రం, దాని వాస్తవిక పరిస్థితి ఏమిటన్నది స్పష్టం చేయక పోవడం గమనార్హం. ఇక10వ తేదీన రాసిన మరో లేఖలో కూడా ఆర్ధిక పరమైన అంశాలపై పాత పాటే పాడింది. జాతీయ హౌదా ప్రకటిరచిన తరువాత ఇప్పటివరకు 13,226 కోట్ల రూపాయలు ఖర్చు జరిగిరదని, అరదులో ఇప్పటికే రూ.11, 600 కోట్లు రీయింబర్స్‌ చేసామని వివరించింది. మరో రూ.302 కోట్లు బిల్లులు ఆర్ధిక శాఖ వద్ద ఉన్నాయని పేర్కొంది. మిగిలిన రూ.605 కోట్ల విలువైన బిల్లులు పోలవరం ప్రాజెక్టు అథారిటీ వద్దనే పరిశీలనలో ఉన్నట్లు పేర్కొంది. 2013-14ధరల మేరకు మారిన అంచనా 20,398 కోట్లు గా చెప్పిన కేంద్రం 2014కు ముందు జరిగిన వ్యయం తీసివేయగా మిగిలింది రూ.15,667 కోట్లుగా గతంలోనే అరగీకరించింది. ఈ నిధులను మాత్రమే ఇస్తామని చెప్పడంతో కొత్త అంచనాలపై ఆశలు గల్లంతవుతున్నట్టే కనిపిస్తోంది. ఇప్పుడు ఈ లేఖలు రాష్ట్ర ఆర్ధికశాఖ, నీటిపారుదల శాఖల్లో చర్చనీయాంశాలుగా ఉన్నాయి. స్పష్టమైన హామీలు రాకపోవడంవల్ల మరోసారి హస్తిన యాత్ర చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు.పోలవరానికి తిలోదకాలే!!
పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం రోజుకో నాటకమాడుతోంది.తుది అంచనా వ్యయాన్ని ఆమో దించకుండా దాగుడుమూత లాడుతోంది. దీని కంతటికీ ప్రస్తుత సీఎంజగన్మోహన్‌రెడ్డి నిర్వా కమే కారణం.చేసిన పాపం ఆయన్ను ఇప్పుడు కట్టి కడుపు తోంది. ప్రాజెక్టు తుది అంచనా వ్యయాన్ని రూ.55, 548.87 కోట్లుగా చంద్రబాబు ప్రభుత్వం నిర్ణ యించినప్పుడు..వేలకోట్లు దోచుకోవడానికే అంచ నాలు పెంచారని నాటి విపక్ష నేతగా ఉన్న జగన్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్రానికి ఫిర్యాదులు చేశారు.ఎన్‌జీటీ, సుప్రీంకోర్టుల్లో కేసులు వేయిం చారు.నిజం తెలిసీ పోలవరం చంద్రబాబుకు ఏటీ ఎంలా మారిందని ప్రధాని మోదీ ఎన్నికల ప్రచా రంలో ఆరోపించారు.ఇప్పుడు అధికారంలోకి వచ్చిన జగన్‌.. నాడు చంద్రబాబు రూపొందించిన తుది అంచనా వ్యయాన్నే ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.కానీ కేంద్ర జలశక్తి శాఖ నియమించిన కమిటీ రూ.47,725.25 కోట్లకు దానిని కుదించింది. తర్వాత ఈ వ్యవహారం కేంద్ర ఆర్థిక శాఖను చేరింది.ప్రాజెక్టులో సాగునీటి కాంపోనెంట్‌కే నిధులస్తామని మెలిక పెట్టింది. సాగునీటి అవసరాలకు సంబంధించిన వ్యయాన్ని రాష్ట్రమే భరించాలని అంది.ఆ తర్వాత 2017లో కేంద్ర కేబినెట్‌ ఆమోదించిన రూ.20,398 కోట్ల తుది అంచనాకే కట్టుబడి ఉంటామని పేర్కొంది. దానిప్రకారమే రాష్ట్రప్రభుత్వాన్ని ఒప్పించాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)కి సూచిం చింది. పీపీఏ అత్యవసర భేటీలో రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ తీవ్ర అభ్యంతరం తెలియజేశారు. 2013-14 అంచనా ధరలకు ప్రాజెక్టు ఎలా పూర్తవుతుందో చెప్పాలని నిలదీశారు.అది సాధ్యం కాదని కేంద్ర జలసంఘం అధికారులు కూడా స్పష్టం చేశారు. దీనిపై ఆర్థిక శాఖ నిర్ణయం కోసం రాష్ట్రప్రభుత్వం ఎదురుచూస్తోంది.కానీ కేంద్రం నిధులివ్వదని మాత్రం అర్థమైంది. అందుకే ప్రాజెక్టు ఎత్తును కుదించాలని దాదాపు నిర్ణయించినట్లు తెలిసింది.
సాధికారికంగా బలి..
ఆంధ్రుల జల-జీవ నాడిగా తెరపైకి వచ్చిన పోలవరం ప్రాజెక్టును ‘బలి’ చేసే ప్రక్రియ సాధికారికంగానే మొదలైంది. కేంద్రం నుంచి పోరాడి నిధులు సాధించడం పక్కనపెట్టి..నీటి నిల్వ ఎత్తును తగ్గించడంపైనే జగన్‌ సర్కారు దృష్టి పెట్టింది. ప్రాజెక్టులో నీటిని 45.72 మీటర్ల ఎత్తు వరకు నిల్వ చేయాలన్నది తొలి ప్రతిపాదన. దీని ప్రకారం పోలవరం నిర్మాణ వ్యయం రూ.55వేల కోట్లు! కానీ,2013-14 అంచనా వ్యయానికే కట్టు బడి ఉంటామని..20వేల కోట్లు మాత్రమే ఇస్తామని కేంద్ర ఆర్థికశాఖ తేల్చి చెప్పింది.దీంతో.. పరిహారం ఖర్చును తగ్గించుకునేలా నీటి నిల్వను 41.15 మీటర్ల ఎత్తుకే పరిమితం చేసేందుకు రాష్ట్రప్రభుత్వం సమాయత్తమైంది. అదే జరిగితే..అటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమ ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బ తింటాయి.సాగునీటి రంగంపై ఆమధ్య సమీక్ష జరిపిన జగన్‌..పోలవరంలో నీటిని41.15 మీటర్ల ఎత్తువద్ద నిల్వచేస్తే భూసేకరణకు ఎంత వ్యయం అవుతుందో పూర్తిస్థాయి సమాచారం తీసుకురా వాలని అధికారులను ఆదేశించారు. నిర్వాసితులు, సహాయ పునరావాసం వంటి అంశాలనూ తెలియ జేయాలన్నారు. వెరసి..ప్రాజెక్టు ఎత్తు కుదింపుపై స్పష్టమైన సంకేతాలు పంపారు. 41.15 మీటర్ల ఎత్తులో నీటి నిల్వ చేపట్టాలంటే భూసేకరణ, సహాయ పునరావాసానికి రూ.3500కోట్ల అవసర మవుతాయని సహాయ పునరావాస కమిషనర్‌ చెప్పారు.దీనికోసం నెలకు రూ.300 కోట్లు చొప్పున విడుదల చేయాలని సీఎంవో కార్యదర్శి ధనుంజ యరెడ్డిని జగన్‌ ఆదేశించారు.ఇక నిర్మాణ పనులకు రూ.1000 కోట్లు కావాలని ప్రాజెక్టు సీఈ సుధాకర బాబు కోరారు.దీంతో మొత్తంగా రూ.5000 కోట్లు అవసరమవుతాయని,ఈ మొత్తాన్ని ప్రతినెలా విడ తల వారీగా మంజూరు చేస్తామని జగన్‌ తెలి పారు. పోలవరంలో నీటి నిల్వను 41.15 మీటర్లకు పరిమితం చేస్తే భూసేకరణ,పునరావాసానికి రూ.3 500 కోట్లు అవసరమవుతాయి. 69,688.38 ఎకరాల భూసేకరణ అవసరం.ఇందులో 68, 087.88 ఎకరాలు ఇప్పటికే సేకరించి నందున.. మరో1600.50 ఎకరాలు సేకరిస్తే సరిపోతుంది. భూసేకరణతో20,870మంది నిర్వాసితులవు తారు. వారిలో ఇప్పటికే 3110 మందికి పరిహారం చెల్లించినందున..మరో 17,760 మందికి నష్ట పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. విశాఖ పారిశ్రా మిక, తాగునీటి అవసరాల కోసం పోలవరం నుంచి పైపులైన్‌ వేసే విషయంపై ప్రతిపాదనలు తేవాలని సీఎం ఆదేశించారు.నిజానికి విశాఖ వరకు ప్రధాన కాలువ ఎప్పుడో పూర్తయింది.ఇప్పుడు కొత్తగా పైపులైన్‌ అవసరమేంటి? అంటే ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని నిర్ణయించినట్లే కదా! 41 మీటర్లకే పరిమితమైతే అదిబహుళార్థ సాధక ప్రాజెక్టు కాదు..సాధారణ బ్యారేజీగా మిగిలిపోతుంది.
కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయమే కీలకం !
పోలవరం అంచనాలపై ఢల్లీిలో కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావతతో రాష్ట్ర మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, పి.అనిల్‌ కుమార్‌, జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్య దర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి తదితరులు భేటీ అయ్యారు.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కూడా ఈ భేటీలో పాల్గొం టారని సీఎంవో లీకులిచ్చింది.అయితే అలాంటి కార్యక్రమమే ఖరారు కాలేదు. కేవలం షెకావతను కలిశారు. కేంద్ర జల సంఘం సిఫారసు చేసిన అంచనా వ్యయం రూ.47725.74 కోట్లకు ఆమోదం తెలపాలని ఆయన్ను కోరారు.అయితే కేంద్ర ఆర్థిక శాఖే నిర్ణయం తీసుకోవాలని ఆయన తేల్చేశారు.ఈ సమావేశం ఎలాంటి ఫలితాలూ ఇవ్వలేదు. ఈ భేటీ తర్వాత మంత్రులు బుగ్గన, అనిల్‌ విలేకరులతో మాట్లాడారు.గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టుపై అవలంబించిన విధానాలపై మోదీ సర్కారుకు దురభిప్రాయం ఉందని..జగన్‌ పగ్గాలు చేపట్టాక కేంద్ర వైఖరిలో మార్పు వచ్చిందని చెప్పారు. ప్రాజెక్టుకు నిధుల విషయంలో ఉదారత చూపుతోందని అన్నారు.అదే నిజమైతే 20.398 కోట్లే ఇస్తానని ఎలా చెబుతుంది? చంద్రబాబు సీఎంగా ఉండగా..ఇంత మొత్తమే ఇస్తామని ఎప్పుడూ చెప్పలేదు. ఆయన రూపొందించిన 55 వేల కోట్ల తుది అంచనాలకు సాంకేతిక సలహా మండలి (టీఏసీ) ఆమోదముద్ర వేసిందని రాజకీయ పరిశీలకులు గుర్తుచేస్తున్నారు.పైగా వైసీపీ నంబర్‌ టూ విజయసాయిరెడ్డి ప్రాజెక్టులో అవినీతిపై రాజ్యసభలో ప్రశ్నించినప్పుడు ఆ అవకాశమే లేదని ఇదే షెకావత పార్లమెంటు సాక్షిగా తేల్చిచెప్పారు.పైగా టీడీపీ వ్యయం చేసిన నిధులు రూ.8,500 కోట్లను కేంద్రం రీయింబర్స్‌మెంట్‌ చేసిందని గుర్తు చేస్తున్నారు. అదేవిధంగా చంద్రబాబు ప్రభుత్వం వ్యయం చేసిన మొత్తం నుంచే జగన్‌ సర్కారుకు ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.1,850 కోట్లు..తాజాగా 2,234.288 కోట్లు విడుదల చేసింది.జగన్‌ ప్రభుత్వం వ్యయం చేసిన మొత్తానికి సంబంధించి ఇప్పటి వరకూ ఒక్క బిల్లు కూడా రీయింబర్స్‌ కాలేదు.ఈ బిల్లులు ఇంకా పీపీఏ వద్దే ఉన్నాయి.ఇంకా కేంద్రానికి పంపనేలేదు.ఎందుకంటే చేసిన పనులకు, పెట్టిన బిల్లులకు పొంతన లేదు. 55 వేల కోట్ల అంచనాలను ఆమోదించిన టీఏసీ..ఇంజనీరింగ్‌ అధికారుల బృందమే తప్ప కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కాదని ప్రతిపక్షంలో ఉండగా వైసీపీ అడ్డగోలుగా వాదించింది. ఇప్పుడు అదే టీఏసీ నిర్ధారణ మేరకే రూ.55,548.87 కోట్ల అంచనా వ్యయానికి అంగీకరించాలని..కనీసం సవరించిన అంచనా వ్యయం రూ.47,725.74 కోట్లకైనా ఆమోదం తెలపాలంటూ..ప్రధాని మోదీని, అమితషా, నిర్మలా సీతారామన్‌, షెకావతలను ముఖ్యమంత్రి నుంచి మంత్రుల దాకా అభ్యర్థిస్తున్నారు.ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలంటే..ఒక్క భూసేకరణకే రూ.28 వేల కోట్లు వ్యయమవుతాయని ఇప్పుడు చెబుతున్నారు.చంద్రబాబు చెప్పినప్పుడు అవినీతి ఆరోపణలు గుప్పించారు.అయితే..గతంలో వైసీపీ నేతలు చేసిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకున్నందునే..ఎన్నికల ప్రచారం మోదీ నోట పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకు ‘ఏటీఎం’గా మారిందన్న ఆరోపణలు వచ్చాయని చెబుతున్నారు. కేంద్రంపై ఒత్తిడి పెంచే సత్తా లేక ఇప్పటికే ప్రత్యేక హోదాను అటకెక్కించిన జగన్‌..ఇప్పుడు పోలవరానికి మూతబండ వేసే దిశగా అడుగులు వేస్తున్నారు.రాష్ట్రానికి తీరని అన్యాయం చేయబోతున్నారు.రాష్ట్ర ప్రయోజనాల కంటే సొంత ప్రయోజనాలకే పెద్దపీట వేస్తే ఇలాంటి అనర్థాలే సంభవిస్తాయని జగన్‌ గుర్తెరగాలి.కేంద్రంపై ఒత్తిడి పెంచే మార్గాలను అన్వేషించాలి.అంతేతప్ప తన మంత్రులతో చంద్రబాబును నాలుగు బూతులు తిట్టించి పబ్బం గడుపుకోవాలంటే ప్రజలు క్షమించరన్న సంగతి తెలుసుకోవాలని రాజకీయ వర్గాలు అంటున్నాయి.
పోలవరంపై కేంద్రం ఉపేక్ష, ముంపు గ్రామాలకు శిక్ష..
ఏపీ విభజన చట్టంలో జాతీయ ప్రాజె క్టుగా ఘనంగా ప్రకటించబడిన పోలవరం కేంద్రం వివక్షతో సమస్యాత్మకంగా నడుస్తుంటే జరిగిన మేరకు పనులు కూడా ప్రజల పాలిట ప్రాణాంతక మవుతున్నాయి. పెరిగిన వ్యయాన్ని లెక్కలోకి తీసు కోకపోవడం ఒకట్కెతే ప్రాథమిక సూత్రమైన సహాయ పునరావాస కార్యక్రమాలకు బాధ్యత లేదని దులి పేసుకోవడం కేంద్రం చేస్తున్న దారుణం. గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పునరావాస పనులు సరిగ్గా జరగలేదని తాము అధికారంలోకి రాగానే పటిష్టంగా ఆదుకుంటామని ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌ పదేపదే ప్రకటించారు. అప్పట్లో ఎన్నికల ప్రచారంలో స్వయంగా ప్రధాని మోడీనే పోలవరం నిర్మాణం అక్రమాలకు నిలయంగా మారిందని ఆరోపించారు. తర్వాత ఆయన మళ్లీ ప్రధాని అయ్యారు, జగన్‌ ముఖ్యమంత్రి అయ్యారు గాని పోలవరం వెతలు మాత్రం తీరలేదు.. సరికదా తీవ్రమానవ సంక్షోభంగా మారుతు న్నాయి. కఫర్‌డాం ఘనంగా కట్టేసిన కారణంగా వర్షాలు పెద్దగా కురవకపోయినా సరే నీళ్లు ముం చేస్తున్నాయి.
ఫలితం లేని వినతులు
నిర్మాణ వ్యయం మాత్రమే అది కూడా 2014 నాటిలెక్కల ప్రకారం 22 వేల కోట్లు అది కూడా ముందు రాష్ట్రం ఖర్చు చేసిన తర్వాత మాత్రమే తాము విడుదల చేస్తామని కేంద్రం చాలా సార్లు ప్రకటించింది. ఏ ప్రాజెక్టు కట్టినా ముందు పునరావస కల్పన జీవనోపాధి పునరుద్ధరణ జరిగాకే జరగాలని సుప్రీంకోర్టుతో సహా న్యాయస్థానాలు అనేక సార్లు చెప్పి వున్నాయి. ఈ అంశంపై కేంద్రంలోని మోడీ సర్కారు కావాలనే వంకరటింకరవాదనలతోచేతులు దులిపేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం నిష్క్రియా ప్రియత్వం వహిస్తున్నది. అడపాదడ వినతులతో సరిపెడుతున్నది. గత నెలలోనే ముఖ్యమంత్రి జగన్‌ స్వయంగా ఢల్లీికి వెళ్లి వినతి పత్రాలు ఇచ్చి వచ్చారు. కేంద్రం నుంచి ఈ విషయంలో రావలసిన సహాయం రావడం లేదనేది వాస్తవం. ప్రజలకు చెప్పి ప్రతిపక్షాలను కలుపుకొని వొత్తిడి పెట్టె బదులు టిడిపి, వైసీపీ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంలో మునిగి తేలుతున్నాయి. 55 వేల కోట్లకు పెరిగిన ప్రాజెక్టు అంచనా వ్యయం పెంపును తాము ఆమోదింప చేసుకుంటే ఈప్రభుత్వ హయాంలో వెనక్కు పోయిం దని టిడిపి చాలా కాలం విమర్శించింది. అయితే తర్వాత జల్‌శక్తి శాఖ పోలవరం ప్రాజెక్టు అధారిటీ (పిపిఎ)ఈపెరిగిన ఖర్చుకు ఒప్పుకున్నట్టు అది తమ విజయమైనట్టు వైసీపీనేతలు చెప్పుకున్నారు. అందులో భాగంగా కొన్ని వందలకోట్లు విడుదల చేస్తే అదో ఘనతగా చూపించుకున్నారు. అసలు సమస్యగా వున్న పునరావాసం దాటేస్తున్నారు. ప్రచారార్భాటంతో పర్యటనలకు వెళ్లి ప్రతిపక్షంపై సవాళ్లు విసిరే మంత్రులు అనిల్‌కుమార్‌ వంటివారు దీనిపై మాట్లాడకుండా అధికారులకు ఆదేశాలు ఇచ్చేసి అంతా అయిపోయినట్టే అభినయిస్తారు.
9 గ్రామాలకే దిక్కులేదు,అన్నీఖాళీ అయితే?
ఈప్రాజెక్టు నిర్మాణం, నీటినిల్వ ప్రవా హం కారణంగా 275 గ్రామాలలో 1,07లక్షల కుటుంబాలు నిర్వాసితమవుతాయి. లక్షాముప్పై వేల ఎకరాలు మునిగిపోతాయి. పశ్చిమగోదావరి జిల్లాలో కుకునూరు, వేలేరుపాడు, బూర్గంపాడు మండలాలు, తూర్పుగోదావరిజిల్లాలో పోలవరం, దేవీపట్నం,అంగలూరు, వరరామచంద్రాపురం (విఆర్‌పురం) చింతూరు, ఏటపాక, కూనవరం మండలాలు మునిగిపోతాయి.ఇందులో దేవీ పట్నం పోలవరం మినహా మిగిలిన మండలాలన్ని తెలం గాణ నుంచి బదలాయించబడినవే.కఫర్‌డ్యాం ఎత్తు పెంచాలనీ,వీల్కెతే దానిద్వారా ముందే నీళ్లు ఇవ్వా లని ఉత్సాహపడిన సర్కార్లు ఫలితంగా సంభ వించే ముంపుబాధితుల గోడు మాత్రం పట్టించు కోలేదు. అరకొర పునరావాసం కల్పించింది మాత్రం కేవలం 9 గ్రామాలలో 3300 కుటుంబా లకు మాత్రమే. ఇది మూడు శాతం కూడా కాదు. విద్యుత్‌ పనుల కోసం మరో 60 గ్రామాలవారిని బలవంతాన అక్కడినుంచి తొలగించినంత పని చేశారు. ఇక 41.15 కాంటూరు పరిధిలోకి వచ్చే 90 గ్రామాలు ఖాళీ చేయించాలని ప్రభుత్వం వత్తిడి చేస్తున్నది. ఇప్పుడు నిల్వ చేసిన నీటిని వదలడానికి స్పిల్‌వే గేట్లు ఉపయోగిస్తున్నారు. రేపు ఆగేట్లు మూ సేస్తే మొత్తంవూళ్లూ మునిగిపోతాయి. 2013 భూసేకరణ చట్టంప్రకారం భూమికి భూమిఉపాధి కల్పించాలి. కాని గిరిజనుల పోడు భూము లకు పట్టాలు లేవనే సాకుతో పరిహారమే ఎగవేశారు, ఇదిగాక 39సదుపాయాలతో ప్రత్యామ్నాయ గృహనిర్మాణం ప్రభుత్వాల నిర్మాణ సంస్థలబాధ్యత. చంద్రబాబు ఎకరాకు 1.25 లక్షల చొప్పున ఇచ్చిన ప్యాకేజీ సరిపోదని తామువస్తే 10లక్షలు ఇచ్చి పంపిస్తామని జగన్‌ హామీ ఇచ్చారు, ఇప్పటికీ సమీక్షలలో చెబుతుంటారుగాని ఇచ్చింది లేదు.
నిబంధనల ఉల్లంఘన, అర్హులకు అన్యాయం
ఇక అర్హుల విషయమే చూస్తే గతంలో అనర్హులను చేర్చడం వల్ల దాన్నిసాకుగా చూపి బాధితులకు కూడా అన్యాయం చేశారు పాలకులు. వాస్తవానికి ఆ సంఖ్య పెరుగుతున్నది. 2017ను కొలబద్దగా తీసుకుని 18ఏళ్లు పైబడినవారు 1.25 లక్షల మంది వున్నారని లెక్కవేశారు. 2021 నాటికి పూర్తికాని పనులతో ఆ సంఖ్య 5లక్షలు దాటింది. నిర్వాసితులకోసం కట్టిన కాలనీలు లోపభూయిష్టం గా ఎలాంటి వసతులు లేకుండా కాస్తవానకే కారుతూ కన్నీళ్లు తెప్పిస్తున్నాయి, ఏకంగా 30లక్షల ఇళ్లు కట్టి పండుగ చేస్తానంటున్న సర్కారు ముంపు ప్రాంతాల్లో ఎందుకుకట్టడం లేదు? గిరిజనులకు షెడ్యూలు ప్రాంతాలలోనే పునరావాసం కల్పించాలి గాని నాన్‌షెడ్యూల్‌ ప్రాంతాలకు తరలించి తంతు పూర్తి చేయడం మరో రాజ్యాంగ విరుద్ధ చర్య. ఇక్కడ దాదాపు 60 శాతం గిరిజనులే. ఇవన్నీగాక మానవ హక్కుల సమస్యలు కూడా వున్నాయి. ఉదాహరణకు ముంపు వచ్చేలోగా సరుకులు తీసుకు పోవడానికి టేకూరు వాడపల్లి తూటూరు వంటి గ్రామాల నుంచి ఏలూరు వచ్చిన ప్రజలను తిరిగి వారి గ్రామాలకు పోనీకుండా పోలీసులు అడ్డు కోవడం తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఇటీవల అఖిల పక్ష నాయకులు ఆ గ్రామాలలో పరిశీలనకు వెళ్లినప్పుడు నిర్వాసితులు చెప్పిన వాస్తవాలు హృద యవిదారకంగావున్నాయి. వాటిపై విజయ వాడలో దీక్షలకు పిలుపునిస్తే ఎక్కడికక్కడ నిర్బంధించి రాకుండాచేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పుండు మీద కారం రాసింది. కేంద్రంజాతీయ ప్రా జెక్టు అంటూనే పోలవరం నిర్మాణ నిధులు పునరా వాస వ్యయం విడుదల చేయకపోవడం బాధ్యతా రాహి త్యమే. వ్యవసాయం నిలిచిపోయిపంటలూ పనులు లేక ఆప్రజలు గోడుపెడుమంటున్న నేపథ్యం మరింత దారుణంగా వుంది. కేంద్రంతో పోరాడి 33వేలకోట్ల నిధులు తక్షణం రాబట్టి కనీసవసతు లతో కాలనీలు నిర్మించి వారిని తరలించకపోతే తీవ్ర అసంతృప్తికి గురి ఆగ్రహానికి గురికావలసి వస్తుంది. ప్రత్యేకహోదాకు ఎగనామం. లోటు భర్తీకి మంగళం..రాజధానికి రిక్తహస్తం.. విశాఖ ఉక్కు బేరం..వంటి కేంద్ర చర్యలు రాష్ట్ర ప్రజల సహనాన్ని పరీక్షిస్తున్నాయి, ఏ ఒక్క అంశంలోనూ ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలనే ధోరణి మోడీ సర్కారులో లేకున్నా గట్టిగా అడిగే చేవ జగన్‌ సర్కారుకూ వుండటం లేదు. ప్రజల బాధలు విని సత్వర సహాయం పునరావాసం కల్పించడం కేంద్ర రాష్ట్రాల బాధ్యత.లేకుంటే వారి నిరసన అని వార్యం.
-జిఎన్‌వి సతీష్‌

బాల్యం అంద‌మైన జ్ఞాప‌కం

పాపం పుణ్యం ప్రపంచ మార్గం/ కష్టం సౌఖ్యం శ్లేషార్ధాలూ/ ఏమీ ఎరుగని పూవుల్లారా/ ఆకసమున హరివిల్లు విరిస్తే/ అవి మీకే అని ఆనందించే/ కూనల్లారా’ అంటూ బాలలను ముద్దు చేస్తాడు మహాకవి శ్రీశ్రీ. కష్టసుఖాలు ఎన్నున్నా సంపూర్ణ ఆరోగ్యంతో… విజ్ఞానవంతులు కావాలి బాలలు. వారు దేశ భవితకు వనరులు…వారధులు… ఆశాదీపాలు.వారి శ్రేయస్సే దేశాభివృద్ధికి మూలం. అందుకే అంటారు…‘నేటి బాలలే రేపటి పౌరులు’ అని. బాల్యాన్ని ఆనందంగా…ఆరోగ్యవంతంగా అనుభవించడం ప్రతి చిన్నారి జన్మహక్కు. ఎవరికై నా బాల్యం ఒక అందమైన జ్ఞాపకం. ‘స్వచ్ఛ మైన పువ్వులు/విచ్చుకున్నబంధాలు/పెంచుకున్న అను బంధాలు/చిన్ననాటి జ్ఞాపకాలు’అనిఓకవి అంటాడు. మనిషి వ్యక్తిత్వం బాల్యాన్ని పెనవేసుకునే వికసి స్తుంది. మనిషిగా ఎంత ఎదిగినా…బాల్యపు జ్ఞాప కాలు…అనుభవాలు అప్పుడప్పుడు తట్టి లేపుతూనే వుంటాయి. అమ్మ లాలిపాట, గోరుముద్దలు, నాన్న మురిపెం,అమ్మమ్మ,నానమ్మ,తాతయ్యల గారా బాలు…అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు, అత్తామామల ప్రేమానురాగాల మధ్య బాల్యం ఆనందంగా గడిచిపోతుంది.అందమైన జ్ఞాపకంగా మిగిలి పోతుంది. తిరిగిరాని బాల్యాన్ని తలచుకొని ‘నా సర్వస్వం నీకిచ్చేస్తా… నా బాల్యం నాకు ఇచ్చెరు’ అంటాడు సినారె. బాల్యం అంటే…రంగురంగుల అనుభూతులే కాదు… మింగుడుపడని విషాదాలూ వుంటాయి.తన ప్రమేయం లేకపోయినా అనుభ వించక తప్పని కష్టాలూ వుంటాయి.
చిట్టిచిట్టి చేతుల చిన్నారులు బాల కార్మికుల వుతున్నారు. ఆడిపాడాల్సిన వయస్సులో నాలుగు గోడల మధ్య బందీ అవుతున్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో విజ్ఞానవంతులు కావాల్సిన పిల్లలకు తగిన ఆదాయాలు లేక తల్లిదండ్రులు పౌష్టికాహారం అందించలేకపోతున్నారు. గర్భస్థ శిశువు నుండే అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. తక్కువ బరువుతో పుట్టడం,అంగవైకల్యంతో పుట్టడం వంటి కారణాల వల్ల వీరు మిగతా పిల్లలతో సమానంగా వుండలేకపోతున్నారు. చిన్నారుల్లో పోషకాహార లోపాలు, వయసుకు తగిన బరువు లేకపోవటం, శిశు మరణాల రేటు వంటి అంశాలను పరిగణ నలోకి తీసుకున్న ‘ప్రపంచ ఆకలి సూచీ-2021’ లో…107 దేశాలతో పోల్చితే మన దేశం 94వ స్థానంలో వుంది. దేశంలోని ప్రజల ఆదాయం, ఆర్థిక అసమానతలు వంటి అంశాలను లెక్క తీసు కుంటే… ‘ప్రపంచ ఆహార భద్రత సూచీ-2021’లో 113 దేశాలతో కూడిన ఈజాబితాలో మనం 71వ స్థానంలో వున్నాం. చిన్నతనంలో ఎదుర్కొనే సమ స్యలు పిల్లల భవిష్యత్‌పై ప్రభావం చూపుతాయని అనేక పరిశోధనలు చెబుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా విద్య,ఆరోగ్యం,గృహవసతి,పోషకా హారం,పారిశుధ్యం,నీరు అందుబాటులో లేని పిల్లల సంఖ్య 120కోట్లు ఉండగా,కోవిడ్‌ కారణంగా మరో 15కోట్ల మంది అదనంగా యునిసెఫ్‌ అధ్య యనం వెల్లడిరచింది. బాలల జనాభా అత్యధి కంగా గల భారత్‌లో కూడా దీనిప్రభావం భారీ గానే వుంటుందని ఈ నివేదిక నొక్కి చెబుతోంది.
అమ్మమ్మ, నానమ్మ ఇళ్లల్లో ఆటపాటల మధ్య సాగిపోయే బాల్యం…నేడు ఒంటరిపాలైంది. కుం చించుకుపోయిన కుటుంబ వ్యవస్థలో…ఇరుకు ఇళ్ళలో..పలకరింపులు కూడా మరిచి, ప్రపంచీ కరణ వలలో చిక్కుకుపోయిన తర్వాత అందమైన బాల్యం,బాల్య స్నేహాల బంధమెక్కడిది? ప్రభుత్వాలు రుద్దిన ఆర్థిక భారాలతో భార్యాభర్తలిద్దరూ ఉద్యో గాలు చేయాల్సిన పరిస్థితి అనివార్యంగా ఏర్ప డిరది. పిల్లల మంచిచెడ్డలు చూడడమూ కష్టతర మౌతోంది. ఏబిడ్డకైనా తల్లి తొలి గురువు. తల్లిదం డ్రులతో పాటు పెద్దలు నేర్పిన నీతి,బాధ్యతలు మంచి పౌరులుగా ఎదగడానికి ఉపయోగపడ తాయి. ఇవన్నీ జరగాలంటే ప్రభుత్వాలు కనీస మౌలిక వసతులను కల్పించాలి. ఆహ్లాదకరమైన వాతావరణం…మౌలిక వసతులు కల్పించడం మన బాధ్యత. ‘బాల బాలికలందరికీ ప్రభుత్వ పాఠ శాలల్లో ఉచితంగా చదువు నేర్పాలి. బాలబాలికలు పని చేసే పద్ధతిని నిర్మూలించాలి. అలాంటి ఒక సుహృద్భావ వాతావరణంలో పిల్లలు ఎదగాలి. ‘మీదే మీదే సమస్త విశ్వం/మీరే లోకపు భాగ్య విధాతలు/ మీ హాసంలో మెరుగులు తీరును/ వచ్చే నాళ్ల విభాప్రభాతములు’ అంటాడు శ్రీశ్రీ. చిన్నారుల మోమున హాసం మెరిసినప్పుడే నిజమైన ‘బాలల దినోత్సవం’.
బాలల హక్కులపై సమత అవగాహన సదస్సులు
బాలల హక్కుల దినోత్సవం సందర్భంగా సమత ఆధ్వర్యంలో పలు గిరిజన గ్రామాలు,పాఠశాలల్లోని విద్యార్ధులకు అవగాహన సదస్సలు నిర్వహించింది. బాలల హక్కుల వారోత్సవాలపై యూనిసెఫ్‌ నవంబరు 14 నుంచి 20వరకు వారోత్సవాలు నిర్వహించడానికి పిలుపు నిచ్చింది. ఇందులో భాగంగా సమత సరుగుడు ప్రభుత్వ ఉన్నత పాఠశాల,రామన్నపాలెం గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించింది. ఈసందర్భంగా గోడపత్రికలను స్థానిక ఉపాధ్యాయులు,సరుగుడు పంచాయితీ సర్పంచ్‌, గిరిమిత్ర సొసైటీ అధ్యక్షుడు బండి గంగ రాజు, సమత డైరెక్టర్‌ విక్కీ,కో`ఆర్డినేటర్లు కె.సతీష్‌, జి.సైమన్‌లతో కలసి సరుగుడు యూపీ స్కూల్‌ ప్రదానోపాధ్యాయుడు డి.సుబ్రహ్మణ్యే శ్వరరావు కలసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో విద్యా ర్ధినీ, విద్యార్థులు బాలల హక్కులపట్ల భారత రాజ్యాంగం బాలలకు కల్పించిన హక్కులపై వారి కున్న అనుభవాలను లఘునాటికల ద్వారా ప్రదర్శిం చారు. అనంతరం విద్యార్థులు ప్లకార్డులతో బాలల హక్కుల పరిరక్షిద్దాం..పిల్లల హక్కులను భాగస్వా మ్యం కల్పిద్దాం..నేటిబాలలే..రేపటి పౌరులు, పరిసరాల పరిశుభ్రత మన హక్కు అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమాన్ని పురస్కరించుకొని సమత డైరెక్టర్‌ విక్కీ,సత్తీష్‌ కుమార్‌ పిల్లలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు,విధులపై వివరిం చారు.
కందుకూరి సతీష్‌ కుమార్‌

ఆ గాలిలోనే గ‌ర‌ళం

దేశ రాజధాని నగరంఢిల్లీ మరోసారి వణికిపోతోంది. వాయ కాలుష్యం అమాంతంగా పెరిగిపోయింది. వాయ నాణ్యత దారుణంగా క్షీణిస్తుండటంతో ఆందోళన రేగుతోంది.ఢిల్లీలో వాయు కాలుష్యం పెరగడానికి కారణమేంటంటే.. దేశ రాజధానికి ఉన్న ఒకే ఒక పెను సమస్య వాయు కాలుష్యం. ప్రతియేటా అక్టోబర్‌-నవంబర్‌-డిసెంబర్‌ వస్తే చాలు కాలుష్యం మరింతగా పెరిగిపోతుంటుంది. ఢిల్లీలో హఠాత్తుగా కాలుష్యం రేటు 14శాతంగా నమోదై ఆందోళన కల్గించింది. ఇంత పెద్దమొత్తంలో కాలుష్యం నమోదవడం కలవరం రేపుతోంది. ఇటీవల కురిసిన తేలికపాటి వర్షాలతో కాస్త ఉపశమనం కలిగినా.. మళ్లీ గాలి నాణ్యత క్షీణించడం ప్రారంభమైందని ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ సూచించింది. పంట వ్యర్ధాల్ని ప్రతియేటా అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ మధ్యలో రైతులు అక్కడే పొలాల్లో తగల బెడుతుంటారు. ఇదంతా ఢిల్లీ సరిహద్దు లోని హర్యానా, రాజస్థాన్‌,ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో జరుగు తుంటుంది. ఆ పొగంతాఢిల్లీను కమ్మేస్తుం టుంది. ఒక్కసారిగా 14శాతం కాలుష్య రేటుకు కారణం కూడా పంటవ్యర్ధాల్ని తగలబెట్టడ మేనని తెలిసింది. ఇండియన్‌ అగ్రికల్చర్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ అందించిన డేటా ప్రకారం పంజాబ్‌లో గత రెండ్రోజుల్లోనే 1089 పంట వ్యర్ధాల్ని తగలబెట్టారు. అదే విధంగా రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, హర్యానాల్లో 1789 పంటవ్యర్ధాల్ని కాల్చారు. పొరుగు రాష్ట్రాల ప్రభావంతోనే ఢల్లీిలో వాయు కాలుష్యం(ణవశ్రీష్ట్రఱ Aఱతీ ూశీశ్రీశ్రీబ్‌ఱశీఅ) పెరుగు తోంది. పదిరోజుల్లో జరిగిన సంఘటనల కంటే రెండ్రోజుల్లో నమోదైన పంట వ్యర్ధరాల తాలూకు పొగ ఎక్కువగా ఉందని డేటా చెబుతోంది. సాధారణంగా అక్టోబర్‌-నవంబర్‌ నెలల్లో పంజాబ్‌, హర్యానా రాష్ట్రాల్లో వరికోతలుంటాయి. ఆ తరువాత గోధుమ, బంగాళాదుంప సాగు చేస్తారు. పంట అవశేషాల్ని త్వరగా తొలగించే ప్రక్రియలో భాగంగా రైతులు వ్యర్ధాలకు నిప్పు పెడుతుంటారు. ఢిల్లీఎన్‌సీఆర్‌(ణవశ్రీష్ట్రఱ చీజR) పరిధిలో వాయు కాలుష్యం పెరగడానికి ఇదే ప్రధాన కారణంగా ఉంటోంది.
ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో పెరుగుతున్న కాలుష్యం వల్ల ఆసుపత్రిలో చేరేవారి సంఖ్య వారంలో 22 శాతం నుంచి 44శాతానికి పెరిగింది. అయితే ఈ ప్రాంతంలోని ప్రజలు కాలుష్యం తగ్గించడానికి మూడు రోజుల లాక్‌డౌన్‌ విధించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తు న్నారు. తాజా సర్వేలో ఈ విషయం వెల్లడైంది. డిజిటల్‌ ప్లాట్‌ఫారమ్‌ లోకల్‌ సర్కిల్స్‌ సర్వే ప్రకారం.. రెండో వారంలో వాయు కాలుష్యం అధికంగా పెరిగింది. ప్రజల పరిస్థితి మరింత దిగజారింది.86 శాతం ఢిల్లీ-ఎన్‌సిసిఆర్‌ కుటుంబాలలో ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యులు విషపూరిత గాలి ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొంటున్నారు. దాదాపు 56 శాతం కుటుంబాల్లో ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మందిలో గొంతునొప్పి, కఫం, గొంతు బొంగురుపోవడం, కళ్ల మంటలు వంటి సమస్యలు ఉన్నాయి. ఈ సర్వేలో ఢిల్లీ, గుర్గావ్‌, నోయిడా, ఘజియాబాద్‌, ఫరీదాబాద్‌లకు చెందిన 25000 మందికి పైగా ప్రజల అభిప్రాయాలను తీసుకున్నారు. ఈ నగరాల్లో గాలి నాణ్యత సూచిక 300-1000 మధ్య ఉంది. సర్వే ప్రకారం..’’ గత రెండు వారాల్లో డాక్టర్‌ లేదా ఆసుపత్రిని సందర్శించే వారి శాతం రెండిరతలు పెరిగింది. సహాయం కోరే కుటుంబాలు 22 శాతం నుంచి 44 శాతానికి పెరిగాయి.
ప్రపంచంలోనే టాప్‌ పొల్యూటెడ్‌ సిటీ ఢిల్లీ
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరింది. దీపావళి పండుగ తర్వాత నుంచి పరిస్థితి మరింత దిగజారుతూ వస్తున్నది. ప్రస్తుతం ఇంట్లోనే ఉన్నా మాస్క్‌ పెట్టుకోవాల్సిన దుస్థితి ఎదురవుతున్నది. శీతాకాలం మంచుతో పాటు కాలుష్యం తోడవడంతో ప్రపంచంలోనే అత్యంత కాలుష్యం ఉన్న పది నగరాల్లో ఢిల్లీ మొదటి స్థానంలో నిలిచి.. చెత్త రికార్డును మూట గట్టుకున్నది. ఈ జాబితాలో ముంబై, కోల్‌కతా కూడా చేరాయి.స్విట్జర్లాండ్‌కు చెందిన క్లైమేట్‌ గ్రూప్‌ ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ (IూA)ని తాజా జాబితాను విడుదల చేసింది. ఈ గ్రూప్‌ గాలి నాణ్యత, కాలుష్యాన్ని పర్యవేక్షిస్తుంటుంది. టాప్‌-10 జాబితాలో పాకిస్థాన్‌లోని లాహోర్‌, చైనాలోని చెంగు నగరాలున్నాయి. దేశ రాజ ధానిలో నెలకొన్న ఈ దుస్థితికి వాహనాల నుంచి వెలువడే కాలుష్యంతో పాటు పాటు పంజాబ్‌, హర్యానాల్లో వ్యవసాయ వ్యర్థాలను కాల్చడం ప్రధాన కారణాలని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. వ్యర్థాల విషయంలో రాష్ట్రాల మధ్య వాగ్వాదాలు జరుగుతూ వస్తున్నది. అలాగే యూపీలోని బులంద్‌షహర్‌, హాపూర్‌, నోయిడా, మీరట్‌, ఘజియాబాద్‌లోనూ ఏక్యూఐ 400కు పెరిగింది. రాజస్థాన్‌లోని జైపూర్‌, ఉదయపూర్‌, అజ్మీర్‌, పుష్కర్‌ సహా 15 జిల్లాల్లో కాలుష్యం పెరిగింది. వాయు కాలుష్యంతో ఊపిరితిత్తులకు నష్టం సీపీసీబీ ప్రకారం.. ఢిల్లీలోగాలిలో పీఎం2.5 స్థాయి శుక్రవారం అర్ధరాత్రి 300 మార్క్‌ను దాటింది. సాయంత్రం 4 గంటలకు క్యూబిక్‌ మీటర్‌కు 381 మైక్రోగ్రాములు. గాలి నాణ్యంగా ఉండా లంటే పీఎం 2.5 స్థాయి క్యూబిక్‌ మీటరుకు 60 మైక్రోగ్రాములుండాలి. ప్రస్తుతం ఆరు రెట్లు ఎక్కువగా కాలుష్యం ఉన్నది. పెరుగుతున్న వాయు కాలుష్యం ఊపరితిత్తుల క్యాన్సర్‌తో పాటు తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతుందని నిపుణులు హెచ్చరి స్తున్నారు. అత్యవసర సమయాల్లో తప్ప ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావొద్దని సూచిస్తున్నారు.
ప్రాణవాయువే… ప్రాణాంతకం
ప్రాణవాయువే…ప్రాణాంతకంగా మారితే అంతకన్నా ఘోరం ఉంటుందా? కాలుష్యం దెబ్బకు గాలి నాణ్యత గణనీయంగా పడి పోయిందనే కారణంతో ఏకంగా దేశరాజ ధానిలో కొద్ది రోజులు లాక్డౌన్‌ పెట్టే ఆలోచన చేస్తున్నారంటే ఇంకేమనాలి? దట్టంగా కమ్మేసిన వాయు కాలుష్యం… యమునా నదిని నింపేసిన విషపు నురగలతో జల కాలుష్యం…గత పది రోజుల్లో రెండున్నర వేలకు పైగా కొత్త డెంగ్యూ కేసులు…ఉన్నట్టుండి పెరుగుతున్న కోవిడ్‌ కేసులు -ఇలా ఢల్లీిలో పరిస్థితులు దయనీయం అనిపిస్తున్నాయి. సోమవారం సుప్రీమ్‌ కోర్టు వేసిన మొట్టికాయలను బట్టి చూస్తే, ఏయేటి కాయేడు పెరుగుతున్న కాలుష్య సమస్యపై దృష్టి పెట్టని పాలకుల నిర్లక్ష్యం వెక్కిరిస్తోంది. చలి పెరిగేవేళ, ప్రధానంగా కొయ్యకాళ్ళు కాల్చే అక్టోబర్‌ చివర నుంచి నవంబర్‌ వరకు ఒక పక్క వాతావరణం, మరోపక్క ఇతర కాలుష్యా లు కలగలిసి ఢల్లీిలో ఆరోగ్య సమస్యలు సృష్టిస్తున్నాయి. ఏడెనిమిదేళ్ళుగా ఇది చర్చనీ యాంశమే. ఈ ఏడాది పంటకోతలు ఆలస్యమై, అక్టోబర్‌లో పరిస్థితి మెరుగ్గా ఉంటుందని ఆశలు రేపింది. కానీ,నవంబర్‌ మొదట్లో దీపావళి టపాసులు,పక్క రాష్ట్రాలలో పెరిగిన పంట వ్యర్థాల మంటలు తోడై,ఈ నెలలో తొలి పది రోజులూ ఢిల్లీలో వాయుకాలుష్యం తారస్థా యికి చేరింది. గాలి గరళంలా మారడంతో నవంబర్‌ 13న సుప్రీమ్‌ కోర్టు కొరడా జుళిపిం చింది. ఢిల్లీ సర్కారు అత్యవసరంగా సమా వేశమై, కరోనా తర్వాత మొన్నామధ్యే తెరిచిన స్కూళ్ళను సైతం మూసేసి, నిర్మాణ కార్యక లాపాలకు బ్రేక్‌ ప్రకటించింది. లాక్డౌన్‌కు కూడా సిద్ధమైంది. ప్రపంచ కాలుష్య నగరాల్లో ముందు వరుసలో ఉన్న ఢల్లీిలో ఏడాది పొడుగూతా ‘వాయు నాణ్యత సూచి’ (ఏక్యూఐ) ఆందోళనకరమే. సగటున గంటకో చెట్టు నరికివేతకు గురవుతోందని లెక్కిస్తున్న ఢల్లీిలో దుమ్ము ధూళి,పరిశ్రమలు, వాహనాల లాంటి అనేక కాలుష్య కారణాలున్నాయి. కేవలం 3 వేల చిల్లర ప్రభుత్వ బస్సులే నడుస్తున్నాయనీ, ఆమ్‌ ఆద్మీ పార్టీ పాలనలో గత ఏడేళ్ళలో కొత్త బస్సుల ఊసే లేదనీ ప్రతిపక్ష ఆరోపణ. ఏమైనా,ఢిల్లీలో ప్రైవేట్‌ వాహనాల సంఖ్య యథేచ్ఛగా పెరుగుతోంది. ఇక, పంటపొలాల మంటలు చుట్టుపక్కలి హర్యానా,పంజాబ్‌ మీదుగా రాజధాని దాకా వ్యాపిస్తున్న సమస్య. ఢిల్లీ హైకోర్టు, సుప్రీమ్‌ కోర్టు కొన్నేళ్ళుగా పంజాబ్‌ సహా అనేక ఉత్తరాది రాష్ట్రాలను కాలుష్యంపై హెచ్చరిస్తూనే వస్తున్నాయి. ఫలితం లేదు. యమునా నది శుద్ధీకరణకు రూ. 4 వేల పైగా కోట్లు పాలకులు ఖర్చు పెట్టారంటున్నా, జరిగిందేమిటో నురగ రూపంలో కనిపిస్తోంది. ప్రభుత్వాలు మాత్రం సమస్యను వదిలేసి, రైతుల తప్పును ప్రస్తావిస్తూ రాజకీయాలు చేస్తుండడమే విచారకరం. నిజానికి, పంట కోసేశాక, మిగిలిన వరి దుబ్బులనే ఇలా కాలుస్తున్నా రనుకోవడం తప్పు. పత్తి, చెరకు, కాయధాన్యాలు, గోదుమలు – ఇలా అనేక పంటలకు పంజాబ్‌, హర్యానాల్లో ఇదే పద్ధతి అనుసరిస్తున్నారు. అందుకే, ఉత్తర భారతంలో కాలుష్య సమస్య మరింత తీవ్రంగా ఉంది. రైతుల వైపు నుంచి చూస్తే, కొయ్యకాళ్ళను వెంటనే తొలగిస్తే కానీ, తరువాతి పంట వేసుకోలేరు. అందుకు తగిన యంత్ర సామగ్రి అందుబాటులో లేకపోవడంతో, కాలుష్యమని తెలిసినా సరే కాల్చడమే మార్గమవుతోంది. ప్రభుత్వాలు ఈ సమస్య పరిష్కారంపై శ్రద్ధ పెట్టాలి. వాయు ఉద్గారాలు లేకుండా, పంట వ్యర్థాలను ఇంధనంగా, ఎరువుగా మార్చే చౌకైన, పోర్టబుల్‌ యంత్రాన్ని రూపొందించి, అవార్డందుకున్న ‘తకచర్‌’ సంస్థ లాంటి వాటి అనుభవాన్ని ఉపయోగించుకోవాలి. తాజా పర్యావరణ సదస్సు ‘కాప్‌-26’లో ప్రపంచ పరిరక్షణకు వాగ్దానాలు చేసిన మన ప్రభుత్వం, అంతకన్నా ముందుగా మన ‘జాతీయ రాజధాని ప్రాంతం’ (ఎన్సీఆర్‌)పై దృష్టి పెట్టడం అవసరం. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల్లో ఒకటికి రెండు మన నగరాలే కాబట్టి, నివారణ చర్యల్లో చైనా లాంటి దేశాల అనుభ వాలను ఆదర్శంగా తీసుకోవాలి. విద్య మొదలు ఆర్థిక వ్యవస్థ దాకా అన్నీ స్తంభించే లాక్డౌన్‌ లాంటివి తాత్కాలిక ఉపశమనమే తప్ప, దీర్ఘకాలిక పరిష్కారాలు కాలేవు. అందుకే, ఇప్పటికైనా ఉత్తరాది రాష్ట్రాల పాలకులను ఒకచోట చేర్చి, కాలుష్యంపై ప్రణాళిక రూపకల్పనకు కేంద్రం చొరవ తీసుకోవాలి. కాలుష్యానికి కారణం వ్యవసాయ వ్యర్థాలా, వాహనాలా, పారిశ్రామిక ఉద్గారాలా అనే రాజకీయ చర్చ, పరస్పర రాజకీయ నిందారోపణలు మాని, పనిలోకి దిగడం మంచిది. ఎందుకంటే, ఈ అసాధారణ వాతావరణ ఎమర్జెన్సీ వేళ అసాధారణ రీతిలో స్పందించడమే అత్యవసరం. మీనమేషాలు లెక్కిస్తే…మొదటికే మోసం!
ఢిల్లీలో వాయు కాలుష్యం మరింత తీవ్రమైంది. స్థానిక పరిశ్రమల నుంచి, వాహనాల నుంచి వెలువడే పొగ కారణంగా అక్కడ ప్రతి శీతాకాలంలో వాయు కాలుష్యం తీవ్రమవుతుంది. ప్రతి ఏటా దీపావళి పటాసులవల్ల కూడా వాయు కాలుష్యం తీవ్రత పెరుగుతున్నది. ప్రస్తుతం ఢిల్లీ వాయు కాలుష్యం తీవ్రతపై ఓ సోషల్‌ మీడియా సంస్థ అధ్యయనం చేసింది. ప్రతి ఐదు కుటుంబాల్లో నాలుగు కుటుంబాలపై కాలుష్యం ప్రభావం పడిరదని తెలిపింది. ప్రతి ఐదు కుటుంబాల్లో నాలుగు కుటుంబాలవాళ్లు ఒకటి లేదా అంత కంటే ఎక్కువ అనారోగ్య సమస్యలతో బాధపడు తున్నారని వెల్లడిరచింది. సర్వే సంస్థ ఢిల్లీ, గుర్గావ్‌,నోయిడా,ఘజియాబాద్‌,ఫరీదాబాద్‌ లలో మొత్తం 34,000 మంది నుంచి అభిప్రాయాలు సేకరించింది.
సర్వేలో పాల్గొన్న వారిలో 66శాతం మంది పురుషులు, 34 శాతం మంది మహిళలు ఉన్నారు. 16 శాతం మంది గొంతు సమస్య లేదా దగ్గు లేదా రెండిరటితో బాధపడు తున్నారు. మరో 16 శాతం మంది ముక్కు కారడం, కండ్ల మంట సమస్యతో సతమత మవుతున్నారు. ఇంకో 16 శాతం మంది తాము శ్వాస సంబంధ సమస్య తో బాధపడు తున్నామని చెప్పారు.కేవలం 20 శాతం మంది మాత్రమే తమపై కాలుష్యం ప్రభావం లేదని తెలిపారు. ఇంకో 24శాతం మంది పైన పేర్కొన్న అన్ని రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. మరో 8 శాతం మంది కనీసం రెండు రకాల అనారోగ్య సమస్య లతో బాధపడుతున్నారు. ఇదిలావుంటే ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కొనేందుకు కేవలం 28 శాతం మంది మాత్రమే ఎయిర్‌ ప్యూరిఫయర్స్‌ ఉపయో గించాలనుకుంటున్నారని,61శాతం మంది ప్రస్తుతం పరిస్థితిని తట్టుకునేందుకు యాంటీ పొల్యూషన్‌ మాస్కులను వినిగియోగిస్తున్నారని సర్వే సంస్థ తెలిపింది.

-జి.ఎన్‌.వి.సతీష్‌

ఆదివాసీల ఆత్మగానం

త్తరాంధ్ర కథకులు,రచయిత,కవి మల్లిపురం జగదీశ్‌ రాసిన కొత్త పుస్తకం‘‘దుర్ల’’ కవితా సంపుటి. ఈకవితా సంపుటిని పరిచయం చేస్తూ హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ పరిశోధక విద్యార్ధి సారిపల్లి నాగరాజు గారు రాసిన సమీక్ష వ్యాసం – ఎడిటర్‌

మల్లిపురం జగదీశ్‌ మాష్టారు దాదాపుగా రెండు దశాబ్దాలు పాటు రాసిన కవితలన్నింటినీ సమూ హంగా చేసి ‘‘దుర్ల’’ పేరుతో ప్రచురిం చారు. తమ జాతి సంప్రదాయాలను, ఆచారాలను పాటిస్తూ కథలు, కవిత్వం, గేయాలు రాయడమే కాకుండా వారి రచనలకు కూడా ఆ సంప్రదాయాలకు తగినట్టుగానే శీర్షికలు పెట్టారు. గాయం మనిషికి తగిలినా మనసుకు తగిలినా గాయం తాలూకా జ్ఞాపకాలు అలాగే నిలిచిపోతాయి. బాధల ప్రవాహాన్ని అక్షరాలతో వెతికి హృదయాన్ని హత్తుకునేలా అల్లి నప్పుడు ఆ భాధలు గాథలవుతాయి, గీతాల వుతా యి. కవితల వెల్లువవుతాయి. గిరిజనుల బాధలను, కష్టాలను, ఇబ్బందులను అక్షరీకరిస్తున్న కవి మల్లిపు రం జగదీశ్‌. తమ జాతి మూలాలను అలాగే ఒడిసి పట్టుకొని వారి సంస్కృతి, సంప్రదాయాలను, పండగ లను, ఆచార వ్యవహారాలను తమ కవిత్వంలో చూపిస్తూ, తమ జాతికి జరిగే అన్యాయాలపై కవిత్వపు చైతన్య బావుటాను ఎగరవేస్తున్న గిరిపుత్రుడు మల్లిపురం జగదీశ్‌.
తెలుగు కథాసాహిత్యంలో సుస్థిర స్థానాన్ని ఆపాదించుకున్న కథకులు మల్లిపురం జగదీశ్‌. ఈయన కలం నుంచి ‘‘గాయం’’, ‘‘శిలకోల’’, ‘‘గురి’’ అను కథా సంపుటిలు ఇదివరకే తెలుగు పాఠకలోకం ఆదరణకు నోచుకున్నాయి. ఇప్పుడు ‘‘దుర్ల’’ కవితా సంపుటితో ఆదివాసీ జన జీవితాన్ని, సంప్రదాయాలను, బాధలను, ఇబ్బందులను, వారికి జరుగుతున్న అన్యాయాలను చాలా ఆర్ద్రంగా చెప్పుకొచ్చారు. కథకుడిగా చేయి తిరిగిన జగదీశ్‌గారు ఇప్పుడు కవిత్వంలో కూడా తనదైన ప్రతిభను చూపించారు. ఆదివాసీ సమూహాల మీద జరుగున్న అన్యాయాలకి, ప్రభుత్వం వారి పట్ల చూపిస్తున్న నిర్లక్ష్య ధోరణికి స్పందించి సందర్భానుసారంగా కవితలు రాసి ‘‘దుర్ల’’గా మన ముందుంచారు. ఆదివాసీ జనుల కష్టాలు,పథకాల పేర జరు గుతున్న మోసం,గిరిజనులకు అందని విద్య, ఆమడ దూరంలో ఉన్న వైద్యం, నరకయాతన పెట్టే రహదారులు మొదలైన గిరిజన సమస్యలు కళ్ళకు కట్టినట్లుగా ఈ కవితా సంపుటి నిండా జగదీశ్‌ గారు ఎత్తి చూపారు. ‘‘దుర్ల’’ కవితా సంపుటి 52 కవితల సమాహారం. ఇందులో ప్రతి కవితా పాఠకుల హృదయాన్ని ద్రవింప జేసి, చదివింపజేస్తుంది. ‘‘దుర్ల’’ సంపుటి కవిత్వంలోనే కాదు, కవితా శీర్షికల్లోనూ ఆ నూతనత్వం పాఠకుడిని పలకరిస్తుంది. శీర్షిక నుండే కవితా వస్తువుకు చెందిన ఆలోచనల్లోకి, సందిగ్ధావస్థల్లోకి, పరిశీలనాతత్వంలోకి, ఉత్సుకతలోకి పాఠకుడు అడుగులు వేస్తాడు. ‘‘పోరు ఎప్పటికీ ఆగదు,మాట్లాడుతాం,తూకం, పాట దారి,కొండ భాష,సృష్టి’’ వంటి శీర్షికల్లో కవి ఏ వస్తువును కవిత్వంగా మలచబోతున్నాడు అన్న ఉద్రిక్తత, సందిగ్ధత పాఠకుడిని సంఘర్షణ లోకి దించుతుంది. కవి తొలి విజయం కవితా శీర్షికల్లోనే పాఠకుడి నాడిని పట్టుకుని కవితలోకి వారి మనసును అంతర్లీనం కావించడం. ఈకవితా సంపుటికి శీర్షికగా నిలిచిన ‘‘దుర్ల’’. కవిత నిండా ఆదివాసీ సంప్రదాయాలు, సంస్కృతి, అడవి సౌందర్యం,ఆదివాసీ ఆడపడుచుల థింసా నృత్య సన్నివేశాలు స్పష్టంగా కనిపిస్తా యి. రచయిత తన మూలాలను,జీవితాన్ని ఈ కవిత నిండా చూపించే ప్రయత్నం చేసారు.‘‘పసుపు నీళ్ళ స్నానమాడి గుగ్గిలం ధూపంలోఎజ్జోడి మంత్రాలతో కొత్త కలల బొట్టుపెట్టుకొని కోడిపిల్లను ధరిస్తుంది గొడ్డలమ్మ’’ అని గిరిజన సంస్కృతిని,వారి ఆరాధ్య దైవాన్ని కొనియాడిన పద్ధతిని ఈకవితలోచిత్రీకరించారు. గిరిజను లంతా బృందంగా వెళ్ళి గొడ్డలమ్మ తల్లికి నీరాజనాలు పలికి,థింసా నృత్యాన్ని ఆ తల్లి ఎదుట ప్రదర్శిస్తారు. ఆ సన్నివేశాల న్నింటిని జగదీశ్‌ గారు చాలా చక్కగా‘‘దుర్ల’’ కవితలో చూపించారు.‘‘దుర్ల’’ అంటే అర్థం కంది కొత్తల పండుగలో.. పూజలందుకున్న గొడ్డలమ్మను చుట్టు ప్రక్కల ఊర్లకు ఊరేగిం పుగా తీసుకు పోవడమే ‘‘దుర్ల’’. ఇది ఉత్సవం జరుగుతున్న గ్రామాలన్నీ ఒకేసారి జరుపు కుంటారు. ఒక గ్రామ దుర్ల సమూహం మరొక గ్రామ దుర్ల సమూహానికి ఎదురైనప్పుడు గానీ, కలిసి నపుడుగానీ అక్కడ కలిసి రెండు గొడ్డల మ్మలూ నృత్యం చేస్తాయి. ఒక గ్రామం మరొక గ్రామం తో నేస్తరికం చేయడం దీనిలో ఆం తర్యం. ‘‘దుర్ల’’ ఆదివాసీ సమూహాలలో స్నేహంకి, సౌభ్రాతృత్వంకి,బంధంకి… ప్రతీక. నేటి ప్రపంచీకరణ యుగంలో అడవి,కొండ స్థానాలు ఎలాఉన్నాయో ‘‘తూకం’’ కవితలో చాలా ఆర్ద్రంగా చెప్పుకొచ్చారు.‘‘సంతదారిలో బరువెంతైనా బతుకు తూకంలో కొండెప్పుడూ తేలికే’’ అనే మాటలు పాఠకుల హృదయాన్ని ఆలోచింపజేస్తాయి. ఇది జగదీశ్‌ మాష్టారి దుఃఖం మాత్రమే కాదు యావత్తు ఆదివాసీ సమూహ దుఃఖం.పచ్చని చీరతో నిండుగా ఉన్న అడివితల్లిని విద్వంసం చేస్తున్న ప్పుడు ఉబికిన కన్నీటి దుఃఖం ఇది. కొండపై అంతటి అవ్యా జమైన ప్రేమను కలిగిన కవి మల్లిపురం. అంతరించిపోతున్న తమ జాతి సంస్కృతి, సంప్రదాయాలను తలచుకొని ‘‘ఏవితల్లీ!’’ అనే కవితలో తన మనసులోంచి తన్నుకొస్తున్న బాధను అక్షరాల్లో పొందుపర్చారు.‘‘ఏవి తల్లీ…నాఅడవితల్లీ!! నిన్న మోగిన తుడుం డప్పులూ…? ఏవి తల్లీ…నాకొండ తల్లీ!! నిన్న పాడిన నాసవర గీతాలూ…?ఏవి తల్లీ… నాపోడు తల్లీ!! నిన్న నాటిన నా కలల విత్తు లు…? ఏవి తల్లీ…నాకొండ మల్లీ…!! నిన్న వేసిన ధింసా అడుగులు…?ఏవి తల్లీ… నాజా కర తల్లీ…!! నిన్ను కొలిచే నావారేరి తల్లీ?’’ అంటూ అడివిలోని అంతరించిపోతున్న తమ జాతి సంస్కృతి,సంప్రదాయాలపట్ల ఆవేదనను వ్యక్తంచేశారు. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణంలో ఇల్లులు కోల్పోయి, నిర్వాసితులైన ఆదిమ జాతి కన్నీళ్ళును ‘‘ముంపు కన్నీళ్ళు’’ పేరుతో చెప్పుకొచ్చారు..‘‘కట్టండి ప్రాజెక్టులు మా సమా ధుల మీద…మా చితి మంటల మీద… మా గుడిసెల మీద..మునిగిపోతున్న మా బతుకులమీద.. పోలవరం అంటే ప్రోజేక్టుడు కన్నీళ్ళు పోలవరం అంటే ములిగిపోయిన వెల జీవాలు పోలవరం అంటే చెరిగిపోయిన ఆదిమ ఆనవాళ్ళు పోలవరం అంటే మాయమైపోయిన ఒకానొక అరణ్యం’’ అంటూ పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణం వల్ల ఆదివాసీలకు జరిగిన అన్యాయాన్ని గురించి వారికి జరుగుతున్న నష్టాన్ని జగదీశ్‌ మాష్టారు చెప్పారు. తమ రచనలు, గేయాలు ఎప్పుడూ తమ జాతికి దిక్సూచి కావాలనే మనస్తత్వం కలిగిన వారు జగదీశ్‌ మాష్టారు. ఆ క్రమంలోనే ‘‘పాట దారి’’ అనే కవితను రాశారు. ‘‘పాటంటే ఒక ఆయుధం ఒక జీవన నాదం ఒక నిప్పుకణం నా దృష్టంతా రేపటి మీదే పల్లవి పదునైనదైతే చరణాలు వాటంతటవే వేడెక్కుతాయ్‌ పాట దానంతటదే రగులుకుంటుంది..పది మందికి దారి చూపు తుంది’’ అని వారి భవిష్యత్తు ఆలోచన క్రమాన్ని ఈ కవితలో చెప్పారు. మౌనంగా ఉంటే తమ జాతి ప్రజలకి ఎప్పటికైనా రాజ్యం ఏలే సమయం వస్తుంది అది ఎప్పుడో కాదు అతి త్వరలోనే వస్తుంది. తమ హక్కులు తాము అనుభవించే రోజులు దగ్గరగానే ఉన్నాయి అని ‘‘ఎదురు చూపు’’ కవితలో తన ఆశాభావాన్ని వ్యక్తంచేసారు.
‘‘ఏదో ఒక రోజు…నీను కోరిన నా రాజ్జిము ఒస్తాది…నీనుండగానే ఒస్తాది ఆ నా రాజ్జిము సూసె ఎల్తాను అందాకా… ఎంత కష్టమైనా పడతాను గానీ పట్టొగ్గను… ఒగ్గనంతే… ఒగ్గను’’ అని తన ధృడ సంకల్పాన్ని ఈ కవితలో తెలియజెప్పారు. జగదీశ్‌ తన కథలు, కవిత్వం, గేయాల ద్వారా నిరంతరం గిరిజన యువతను చైతన్యపరుస్తునే ఉన్నారు. నిద్రాణమై ఉన్న తమ జాతి జనులను తన రచనల ద్వారా మేల్కొపుతూనే ఉన్నారు. తమ జాతి నిర్మాణానికి నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు. ‘‘జాగో… ఆదివాసీ! జాగో!!’’ కవితలో తన వేదనని, ఆవేదాన్ని వ్యక్తం చేసారు. ‘‘పీక తెగి పడుతున్నా కొండలు తరగనీకు జాగో… ఆదివాసీ! జాగో!! అంటూ ఎన్ని ఇబ్బందులు, కష్టాలు వచ్చిన పడినా కొండను ఎవరినీ తాకనివ్వొద్దని గిరిజనులను తన గళంతో,కలంతో మల్లిపురం జగదీశ్‌ గారు హెచ్చరిస్తూ, చైతన్యపరుస్తున్నారు. ‘‘రంగులు మార్చే రాజకీయాల్ని గమనిస్తూ వుండు కొండలు వెనుక పులులూ సింహాలు తిరుగుతున్నాయ్‌ నిన్ను ఉద్దరిస్తాయని రంగుబట్టలేసుకొని నీ భుజమ్మీద చెయ్యేసి నీతోనే అడుగులెస్తుంటాయ్‌ సంక్షేమ పథకాల ప్లకార్డులు పట్టుకుని నీ వెనకే గోతులు తవ్వుతుంటాయ్‌ జాగో.. ఆదివాసీ! జాగో!!’’ అంటూ ఆదివాసీ జనులను తన కవిత్వంతో జాగృతపరుస్తున్నారు. గిరిజనులను అభివృద్ధి పేరట నాగరికులు చేసే మోసాన్ని, రాజకీయ నాయకులు చేసే కుతంత్రాలను ఈ కవితలో జగదీశ్‌ గారు ఎండగట్టారు. గిరిజనులపై అటవీ అధికార్ల దాష్టీకాలు, పోలీసుల బెదిరింపులు నాటి నుంచి నేటి వరకు ఎప్పుడూ సాగుతూనే ఉన్నాయి. వాళ్ళ చేతిల్లో ఆదివాసీలు ఎల్లవేళలా నలిగి పోతూనే ఉన్నారని మల్లిపురం జగదీశ్‌ ‘‘పోరు ఎప్పటికీ ఆగదు’’ అనే కవితలో ఎలుగెత్తి చెప్పారు. ‘‘యుద్ధం తప్పనిసరైనప్పుడు ఆయుధం అనివార్యమవుతుంది..అది ఎండు గడ్డి పరక వ్వచ్చు అక్షరమైనా కావచ్చు’’ అని తన అక్షరాన్ని ఆయుధంగా ప్రకటించి, తన ధిక్కార స్వరాన్ని నాగరిక ప్రపంచానికి వినిపించారు. ఆదివాసీ లపైన జరిగిన దాడులు ఇప్పటివి కాదు అని అవి తరతరాలుగా సాగుతూనే ఉన్నాయని ఈ కవితలో స్పష్టం చేసారు.‘‘వనాలనే కాదు వాసు లనూ నరకడమే ఒకానొక సంస్కృతి నేటిదా? తెగిపడ్డ ఏకలవ్యుని బొటనవేలు చెబుతుంది ఏనాటిదో! రాలిపడ్డ శూర్పనఖ ముక్కు చెవులు చెబుతాయి ఈ దమన కాండ ఎప్పటిదో!’’ అంటూ ఆదివాసీ సముహంపై అనాది నుండి జరుగుతున్న దాడులను కవి ఇప్పటికీ ఖండి స్తూనే ఉన్నారు. ప్రపంచమంతా దినదినాభివృద్ధి చెందుతూ సాంకేతిక పరిజ్ఞానంతో తేజరిల్లు తున్న కాలంలో కూడా కొండాకోనల్లో నివసిస్తూ అడివికే పరిమితమైన తమ జాతి స్థితికి, వారి బతుకుకి అద్దంపట్టే కవిత ‘‘మేము’’… ‘‘ఇప్పటికే నెట్టివేయబడ్డవాళ్ళం..అడుగు తీసి అడుగెయ్యని వాళ్ళం..అడవి నుంచి బయటకు రానివాళ్ళం..కొండాకోనల్లో ఇరికిపోయినవాళ్ళం ఊష్టమొస్తేలి ఎజ్జోడివైపే ఆశగా చూస్తున్న వాళ్ళం..డోలీల్లోనే రాళ్ళదారులు సాగుతూ ఆసుపత్రికి తరతరాల దూరంలో నిలిచిపోయిన వాళ్ళం’’ అని తమ జాతి వారికి ఇంకా సమృ ద్ధిగా చేరువలో వైద్యం అందక చనిపోతున్న గిరిజనులను చూసి చలించిపోతూ ‘‘శిలాక్షరాల దారిలో బిగించిన పిడికిలితో సిద్ధమయ్యాం ఒక వేకువ కోసం!!!’’ అంటూ తన ఆగ్రహాన్నిజగదీశ్‌ వ్యక్తం చేసారు. ఇన్నేళ్ళు నాగరిక ప్రపంచానికి దూరంగా ఉండి అడవికే పరిమితమైన మేము ఇప్పుడు మాట్లాడుతాం..ఎవరికీ భయపడేదే లేదని, ఇప్పుడు మాకు మాట్లాడే సమయం వచ్చిందని మల్లిపురం ‘‘మాట్లాడుతాం’’ కవితలో తన మాటలను తూటాల్లా ఈ కవితలో పొందు పర్చారు.‘‘మౌనం ఇప్పుడు నిషేధం మాట్లాడ్డం తప్పనిసరి ఇప్పుడు మాట్లాడ్డం అంటే ఆయు ధాల్ని సిద్ధం చేయడమే ఇప్పుడు మాట్లాడ్డం అంటే నిశ్శబ్ధంగా మాటుకాయడమే ఇప్పుడు మాట్లాడ్డం అంటే కొండను మింగేబోతున్నోడి పీకమీద అడుగెయ్యడమే’’ అని తమ జాతి ఆవేదనను తన గళం ద్వారా వినిపిస్తూ.. ‘‘మాట్లాడుతాం! మాట్లాడుతాం! కొండ మీద దీపాలు వెలిగేదాక మాట్లాడుతాం!! మా దీపా లు ఆర్పినోడి దీపం ఆరేదాకా మాట్లాడుతాం!!! అని ఇప్పుడు మీరు కాదు. మేము మాత్రమే మాట్లాడే సమయం. మేమే మాట్లాడుతాం అని తన ఆవేశాన్ని, ఆగ్రహాన్ని ఈ కవితలో వెల బుచ్చారు.మల్లిపురం జగదీశ్‌ మాష్టారులో ఉత్తరాంధ్ర యాస,వెటకారం,వ్యంగ్యం కలగ లసిన క్రియాశీల కవి. ఆయన వ్యంగ్యానికి నిదర్శనంగా ‘‘తేడా’’ కవిత నిలుస్తుంది.‘‘నీ అక్ష రాలు ఆకలిని చూడ్డానికి వెనకడుగేస్తాయి! నా అక్షరాలు ఆకలి తీర్చడానికి అంబలిని వుడకేస్తుంటాయ్‌!! నీ అక్షరాలు అధికారపు అహంకారాలు నా అక్షరాలు ఆకలి కేకల హాహాకారాలు’’ అంటూ ఉత్తరాంధ్ర ప్రజలకు పొట్ట చింపినా అక్షరం ముక్క రాదు అని అన్నవాళ్ళకు ఈ కవిత గొప్ప కనువిప్పు.జగదీశ్‌ గారి భవిష్యత్తు ప్రణాళికకు,వ్యూహాత్మక రచనకు ప్రతీక ‘‘దుర్ల’’ కవితా సంపుటి. కవిగా తాను భవిష్యత్తులో చేయవలసిన పనులు, రచనలు మొదలైన విషయాలు అన్నీ ఇందులో సంపూ ర్ణంగా దర్శనమిస్తాయి.‘‘కలం’’ కవితలో ఆయన తాత్త్వికత కనిపిస్తుంది.‘‘గతం చీకటి వర్తమానం నెత్తురు భవిష్యత్‌ దహనం జ్వలనం నా కర్తవ్యం’’అని తాను నిరంతరం తమ జాతి కోసం వెలిగే దీపమై ఉంటానని, తమ జాతి నిర్మాణానికి నడుం బిగిస్తానని తన రచనల ద్వారా వ్యక్తంచేసారు. ఆదివాసీ సమూహాన్ని తన అక్షరాలతో నిరంతరం ఉత్తేజపరుస్తూనే ఉన్నారు జగదీశ్‌ మాష్టారు. ఆయన లక్ష్యం, గురి ఎప్పుడూ తమ జాతి ప్రజలకు జాగృత పరచడమే. ఆనేపథ్యం లోంచే పుట్టుకు వచ్చిన కవితా సంపుటి ఈ‘‘దుర్ల’’.ఈ సంపుటిలో‘‘సృష్టి’’ కవిత పాఠకుల్ని మరింత ఆకర్షిస్తుంది. ‘‘నా అక్ష రాలు వెన్నెల రాల్చే తుడుం దెబ్బలు నాఅక్ష రాలు రాత్రికి రంగులద్దే డప్పు వరసలు నా అక్ష రాలు కందికొత్తల సాయంత్రాన ఒకటై నడిచిన ధింసా అడుగులు నా అక్షరాలు కొండ దొంగ లపై ఎక్కుపెట్టిన శిలకోల మొనలు నా అక్షరాలు రేపటికి పదును పెట్టే నేటి కవితా పాద పద్యాలు నాకు కవిత్వమంటేఅరణ్యాలను సృష్టించడమే!’’ అంటూ తన కవిత్వం ఎప్పుడూ తమ జాతి జనులను చైతన్య పరచడం కోసమే నిర్మించబడుతుంది అని ఎలుగెత్తి చాటి చెప్పారు. అడవులలో, కొండలలో నివసించే గిరిజనుల బతుకు చిత్రాలను తన కవితలలో జగదీశ్‌ మాష్టారు చూపించారు. గిరిజనుల సంస్కృతిని, అడవి సౌందర్యాన్ని ఒకవైపు చూపిస్తూ, పెత్తందార్లు, పెట్టుబడిదార్లు, షావుకార్లు, నాగరికులు, రాజకీయ నాయకులు వచ్చి గిరిజనుల సంపదను దోచుకుని, కొండను ఆక్రమించుకొని, ఆ కొండకు వాళ్ళని దూరం చేసే దుర్మార్గ సన్నివేశాల్ని మరో వైపు బలంగా చూపించారు. ప్రభుత్వాన్ని, పాలక వర్గాన్ని వ్యతిరేకిస్తూ తమ జాతికి జరుగుతున్న అన్యాయాలను అక్షరీకృతం చేస్తున్న పదునైన కలం జగదీష్‌ మాష్టారిది.కవిగా జగదీష్‌ మాష్టారు మాట్లాడాల్సిన చోట చాలా గట్టిగా మాట్లాడి తన ధిక్కార స్వరాన్ని వినిపిస్తాడు. తమ జాతి హక్కుల కోసం, ప్రగతి కోసం తన రచనలు సాగిస్తాడు.‘‘దుర్ల’’ కవితా సంకల నంలో ప్రతి కవితా సభ్య సమాజానికి ఒక ప్రశ్నే. ప్రతి కవితా చైతన్య గీతమై సమాజాన్ని మేల్కొల్పుతుంది. ఇంత మంచి కవితా సంక లనాన్ని తను పుట్టి, పెరిగిన‘‘పి.ఆమిటి’’ గ్రామా నికి అంకితం ఇవ్వడం ఆయనలోని కృతజ్ఞతకు నిదర్శనంగా కనిపిస్తుంది. అంతేకాకుండా అదే గ్రామంలో గిరిజన సంప్రదాయ పద్ధతిలో జాకరమ్మ తల్లి ఎదుట ఎజ్జోడు(పూజారి) మంత్రాల నడుమ గ్రామ ప్రజలందరి మధ్య ఆవిష్కరణ జరిపి తన భక్తిని, విశ్వాసాన్ని నిరుపించుకుని మరో అడుగు ముందుకేసారు. ఈ ‘‘దుర్ల’’ కవితా సంపుటి ఆదివాసీ సామాజిక వర్గానికి చెందినదే అయినా దాని వెనుక గిరిజనుల అవస్థలు, వారిపై పెత్తందార్లు, షావుకార్ల, రాజకీయ నాయకులు దోపిడిని ఇతర వర్గాలు కూడా గమనించాల్సిన అవసరాన్ని కవి చెప్పకనే చెప్పారు. జగదీశ్‌ కేవలం గిరిజన కవి మాత్రమే కాదు. సమాజంలో ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే వాటిపై ప్రతిస్పందించడమే గాక, వాటికీ అక్షర రూపమిచ్చి సమాజంలోని రుగ్మతులను రూపుమాపాలని తపనపడే కవి మల్లిపురం.- సారిపల్లి నాగరాజు ,8008370326

కొమరం భీమ్‌

అయనో అగ్గిబరాట … ఆదివాసీల అగ్గిరవ్వ..గెరిల్లా పోరాటంలో మడమతిప్పని యోధుడు..జంగ్‌ సైరన్‌తో నిజాం సర్కారు గుండెల్లో ధడ పుట్టించిన గోండు బిడ్డడు జల్‌,జంగల్‌,జమీన్‌ నినాదంతో గిరిజన హక్కుల కోసం తన చివరి శ్వాస వరకూ పోరాడిన మహనీయుడుకొమరం భీం నిజాం పాలకుల నిరంకుశత్వానికి..అధికారుల దమన నీతికి ఎదురు నిలిచి పోరాడిన వీరుడతను.జల్‌,జంగిల్‌,జమీన్‌ అని నినదించి ఆదివాసీల హక్కుల కోసం ప్రాణాలను సైతం లెక్కచేయక ఉద్యమించిన యోధుడతను.గిరిజనుల అభ్యున్నతికి తన ప్రాణాలను తృణప్రాయంగా వదిలేసిన అమరుడతను. ఇప్పటికీ అడవిబిడ్డల గుండెల్లో కొలువైన ఆవ్యక్తే కొమరంభీమ్‌.ఆమహా నీయునిపై ఎస్‌.ఎం.ప్రాణ్‌రావు రచించినకొమరంభీమ్‌నవల.ఇది పక్క పరిశోధక నవల కావడంతో ప్రముఖ సాహిత్యవేత్త, గిరిజన కథావిశ్లేషకులు..డాక్టర్‌ అమ్మిన శ్రీనివాస రాజు గారు రాసిన అత్యాంత విలువైన సమీక్షా వ్యాసం ఇది.వారివిలువైన సమయాన్నికేటాయించి..శ్రమించి మన థింసా పాఠకులకోసం ఈసమీక్ష వ్యాసాన్ని అందించినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు- ఎడిటర్‌
దక్షిణ భారతదేశ గిరిజన పోరాటయోధుడు, దమ్మున్న ఆదివాసి అమరుడు, కొమురం భీం.. సుమారు 1901లో జన్మించి 1940లో వీర మరణం చెందిన ఈఅడవి బిడ్డ జీవించిన కాలం నాలుగు పదులే అయిన తరతరాలకు స్ఫూర్తిని పోరాట విలువలను అందించడమే కాక తమ గోండు జాతి వికాసానికి కారకుడ య్యాడు.తాను చేసిన భూపోరాటం తన కాలం లో కాకపోయినా తదనంతర కాలంలో విజ యం సాధించి లక్ష్యాన్ని చేరుకుంది. తను ఏనైజాం రాజ్యపాలకుల అరాచక పాలనపై తిరుగుబాటు చేశాడో ఆ నైజాం ప్రభువులు కొమరం భీం చేసిన సంఘటిత పోరాటానికి తన జాతి కష్టార్జిత సంపద అడవులు, భూముల,రక్షణ కోసం చేసిన ప్రాణత్యాగానికి పశ్చాత్తాపం చెంది ఆప్రాంత ప్రజల అభివృద్ధి కోసం ప్రముఖ మానవ శాస్త్రవేత్త ‘‘హైమన్‌ డార్ప్‌’’ నేతృత్వంలో అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేశారు. అది అంతటితో ఆగకుండా తదనంతర పాలకులు కూడా ఆగిరిజన అభివృద్ధి పథకాలు కొనసాగిస్తూ గిరిజన హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టాలు చేసి, విద్య ఉద్యోగ రాజకీయ ఆర్థిక రంగాలలో వారి అభివృద్ధికి పాటు పడుతున్నారు. అడవుల జిల్లా అయిన ఆదిలాబాద్‌లో గల అధిక సంఖ్యాకులైన ఆదివాసీ తెగ ‘‘రాజ్‌ గోండు’’ స్వాతంత్రానికి పూర్వం నైజాం పాలనలో గోండుజాతి గిరిజనులు అనుభ వించిన శ్రమదోపిడి,జీవన అస్తిత్వం,మొదలైన పీడనలు,పాలకులు ప్రజల మధ్య వారదులైన అధికారులు,గుత్తేదారులు,నిత్యం అక్కడ గిరిజ నులపై చేసే దౌర్జన్యాలు,విద్రోహాలు,కారణంగా రాజుకుందే ఆ‘‘గోండు పోరాట జ్వాల’’.దానికి ముందుండి నడుం బిగించి తనజాతి అభివృద్ధి కోసం ఆహుతైన అగ్నికణమే ‘‘కొమరం భీమ్‌’’. అక్కడ జరిగింది భారీపోరాటం..కానీ నాటి పాలకుల దృష్టిలో అదిఒకస్థానిక పోరాటం గానే మిగిలిపోయింది.
స్వాతంత్య్రానంతరం జరిగిన గిరిజన వికాసంలో భాగంగా, అభివృద్ధి చెందిన సాహిత్యం సాక్షిగా,అల్లం రాజయ్య,సాహు , వంటి సామాజిక స్పృహగల రచయితల సాయంగా ..‘‘కొమురం భీం’’ చేసిన పోరాట పటిమ సభ్యసమాజానికి చేరడమేకాక,స్థానిక పోరాట యోధుడి,చరిత్ర రాష్ట్రవ్యాప్తంగా జాతీయ చరిత్రలో భాగమైంది.
ఆంధ్రదేశ గిరిజన పోరాటాల్లో అగ్రభాగంగా నిలిచిన అల్లూరి సీతారామరాజు పోరాటం, దానిలో సీతారామరాజు బ్రిటిష్‌ పాలకుల చేతుల్లో అమరుడైన ఆయన నింపిన పోరాట స్ఫూర్తి గిరిజనుల్లో చక్కని చైతన్యంకలిగించింది. కొమరంభీమ్‌,అల్లూరి సీతారామరాజుల,జీవిత కాలాలు,ప్రాంతాలు,ఒకటి కాకపోయినా,వారి లక్ష్యాలు మాత్రం ఒకటే! వారు జీవించింది కొద్ది కాలమే అయినా అనంతకాల స్ఫూర్తిని ఖ్యాతిని సొంతం చేసుకున్న త్యాగమూర్తులు వారు. కొమరంభీం త్యాగ చరిత్ర వెలుగు చూడటానికి ఆలస్యమైనా అతనిదే అసలైన పోరాటం,రన్‌ గేమ్స్‌ కం తన అమరత్వానికి ప్రతిఫలంగా తన జాతి హక్కులు,స్వేచ్ఛ,పొంది ఆర్థికవిద్య అభి వృద్ధి సాధించి తద్వారా సామాజిక గౌరవం పొందుతుంది. గిరిజనజాతి సంస్కృతిపై జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో పరిశోధనలు జరగడానికి కారణం అయింది. ప్రారంభంలో కేవలం మౌఖిక సాహిత్యంగా మాత్రమే ఉండి ఆదిలాబాద్‌ గోండల గుండె గదుల్లో గుడి కట్టు కుని ఉన్న ‘‘భీమ్‌ పోరాట గాథ’’ పత్రికల పరంగా సభ్య సమాజంలో పాదం మోపిన, తెలియాల్సినంతగా తెలియలేదు.
1990లో విస్తృత ప్రచార సాధనమైన సినిమాగా కొమరం భీమ్‌ కథ సినిమాగ చిత్రీకరించబడ్డ అది విడుదల కావడానికి మరో 20 సంవత్సరాలు పట్టి విడుదలైన చిన్న చిత్రాల జాబితాలో చేరి, ఆచిత్ర లక్ష్యం అందరికీ చేరకుండానే తెరమరుగైంది. అయినా ఆ సినిమాకు కథ మాటలు రాసిన ప్రముఖ చారిత్రక నవలా రచయిత, నల్లగొండ వాసి ఎస్‌.ఎం.ప్రాణ్‌ రావుటసర బాద ముఖ్య ప్రాణ్‌ రావుఊ కలం నుండి పరిశోధనాత్మక నవల ‘‘కొమరంభీమ్‌’’ వెలువడిరది. తెలుగు సాహిత్యానికి ఒక ప్రామాణిక నవల దక్కింది. సినిమా చిత్రీకరణలో భాగంగా భీం నివాస ప్రాంతం, నైజాం పోలీసులతో పోరాటం జరిగిన వీర భూమి,జోడేఘాట్‌, కొమరం భీమ్‌ భార్య సోంబాయి నివాస ప్రాంతం ‘‘దో బె’’ తదితర గిరిజన గ్రామాలు స్వయంగా సందర్శించి భీమ్‌ సమకాలికులతో ముఖ్యంగా భీమ్‌ భార్యతో ముచ్చటించి ఆనాటి పరిస్థితులు, భీమ్‌ వ్యక్తిత్వం,తదితర అంశాలు ప్రత్యక్షంగా చెప్పగా విని రచయిత ఈనవల రాశారు. ‘‘అవ్వల్‌’’ తాలూక్దారు… అబ్దుల్‌ సత్తార్‌… జోడేఘాట్‌లో భీం నాయకత్వంలో జరిగిన గోండు పోరాటానికి సంబంధించిన కాల్పుల గురించి పై అధికారులకు రాసిన నివేదిక పత్రాల ఆధారాలు,‘‘ముషిర్‌- ఎ- డక్కన్‌’’ పత్రికలో 05 అక్టోబరు 1940 తేదీన ప్రచురించబడ్డ వార్తాకథనాలు ఈ నవలకు అధికార ధ్రువపత్రాలు గా చెప్పవచ్చు. ఇక నవల శైలి చారిత్రక కథనంకు అద్దం పడుతుంది. సుమారు 80 సంవత్సరాల క్రితం ఆదిలాబాద్‌ అడవుల్లో నియంత నిజాం సర్కారు,అతని గుత్తేదారులు,ప్రభుత్వ ఉద్యో గులు,అమాయకత్వానికి చిరునామాలైన అక్కడి గిరిజనులపై చేసిన మోసాలకు ప్రతిరూపంగా ఈ నవల ఆద్యంతం కొనసాగుతుంది. ఒకవైపు నవల కథనం కొనసాగుతూనే,మరోవైపు అంతర్భాగంగా సందర్భోచితంగా గోండు జాతి గిరిజనుల సాంప్రదాయ పండుగలు,జాతరలు, వారాంతపు సంతలు, మొదలైన వారి వారి సాంఘిక జీవన చిత్రాలు సంక్షిప్త రూపంగ అందించడంలో రచయిత సామాజిక దృష్టి స్పష్టమవుతుంది. ఈ నవలలో మరో ప్రాముఖ్యత….కొమురం భీం గురించిన గత విశ్వాసాలు నిరాధార విషయాలను తేటతెల్లం చేయడం. ఇందులో భీమ్‌ వ్యక్తిత్వం, పోరాటపటిమ,వాక్‌ చతురత,అతను మాతృభాష గోండుతో పాటు తెలుగు భాష నేర్చుకోవడం, ముఖ్యంగా తమ జాతి జనావళిలో తన పోరాటంపట్ల, తనపట్ల,నమ్మకం కలిగించ డంలో చేసిన నాయకత్వకృషి,మొదలైన విషయాల నూతన కోణాలు దీనిలో ఆవిష్కృతం అవుతాయి,నూతన నాయకత్వందారులకు ఈ నవల ఆదర్శంగా నిలుస్తుంది.ఈ నవలలో ప్రధాన పాత్ర కొమరంభీం. అతని చిన్నతనంలో తమ వంశస్థులు రాజులుగా ఉండి పాలన చేసిన వారు, ప్రస్తుతం పాలితులుగా ఉండి బాధలు అనుభవిస్తున్న తీరు..బ్రిటిష్‌ పాలకుల ఆదేశాల ప్రకారం నిర్మల్‌ తాలూకా దార్‌, రాంజీగోండును 1860లో నిర్మల్‌లో ఉరి తీసిన ధీనగాథలు,తన కులగురువులైన’’ప్రధాన్‌’’ల గేయాల ద్వారా విన్న యువ భీమ్‌..లో..తమ జాతి స్వేచ్ఛకై పోరాట బీజాలు నాటు కుంటాయి. భీమ్‌ ప్రధాన నాయకత్వానికి సహాయకులుగా,కురంగ రాము, కురిసెంగ సాము, కుమార లింగు, ఆత్రంరఘు, మడవి సోము, రాజు పటేల్‌, తదితరులు ఉండగా ఈ నవలలో ప్రధాన స్త్రీ పాత్రలు రెండు రెండు ఉన్నాయి. ఒకటి భార్య సొంబాయి, ముఖ్య అను చరుడు రాము భార్య జంగుబాయి,నిజాం పాలకుల పక్ష అధికారులైన అబ్బాస్‌ అలీబేగ్‌, సిద్దఖి, హజర్‌ హాసన్‌, పట్వారీ దేశ్‌ పాండే, లు.. గోండు ప్రజలను చిత్రహింసలకు గురి చేసిన క్రూర పాత్రలుకాగా, పైకాజి, మహ్మద్‌ ఆలీ, లు భీమ్‌ పోరాటంలోని న్యాయ, ధర్మం గురించి ఆలోచించిన సౌమ్య పాత్రలు. తిర్మాజి అనే పత్రికా సంపాదకుడు భీమ్‌ పోరాటానికి చేయుత నిచ్చిన అక్షర సేనాని. ఇక గోండు జాతికి చెందిన ‘‘కుర్దూ’’ దురాశతో స్వార్థంతో పటేల్‌ పదవికి ఆశపడి భీమ్‌ పోరాట వ్యూహాలు, నైజాం పోలీసులకు చేరవేసే వెన్నుపోటు దారుడుగ చిత్రించబడ్డాడు. ఈ నవలలో అత్యంత ప్రధాన ఘట్టం ‘‘జోడేఘాట్‌’’ కేంద్రంగా గోండులకు నైజం సైన్యానికి జరిగిన యుద్ధం, కొమరం భీం సంఘటిత నేతృత్వానికి భయపడిన నిజాం అధికారులు కుట్రలో భాగంగా భీమ్‌ కు 30 ఎకరాల వ్యవసాయ భూమి ఇవ్వడానికి ఆశ చూపిన, నిస్వార్ధంగా దాన్ని తృణప్రాయంగా తిరస్కరించి తన యావత్‌ జాతి సముద్దరణ ప్రధాన ధ్యేయంగా.. పోరాటానికి సిద్ధం అవుతాడు. ప్రతి ఘట్టంలో భీమ్‌ పాత్రను ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ చిత్రించడంలో రచయిత నేర్పు అక్షర అక్షరాన అగుపిస్తుంది, తన అనుచర వర్గంలో ఆత్మస్థైర్యం నింపడంలో భీమ్‌ కృషి, మాటల తీరు, రచయిత దృశ్యిక రించిన వైనం అద్భుతంగా సాగుతుంది. ఆధునిక ఆయుధాలు కలిగిన నైజాం సైనికులతో ఆత్మస్థైర్యంమే ప్రధాన ఆయుధంగా సాధారణ ఆయుధాలతో అసాధారణమైన పోరాటం చేసిన భీమ్‌ యుద్ధ నైపుణ్యంను కళ్ళకు కట్టినట్టు అక్షరీకరించిన తీరు కూడా ఆచరణీయం, కథ చారిత్రాత్మకమైన వాస్తవ చిత్రాలతో పాఠకులను ఆనాటి కాలానికి నడిపించుకుంటూ వెళుతుంది ప్రత్యక్షంగా ఎదిరించలేక నిజాం సైన్యం కుట్రదారుడు అయినా కుర్దూ సహకారంతో భీమ్‌ స్థావరాలపై అర్ధరాత్రి దాడి చేసినిప్పు పెట్టి, భీంను అతని అనుచర గణాన్ని అంతం చేసిన నైజాం పోలీసు మూక విజయగర్వంతో వెనుతిరుగగా, ఏడాది కొడుకును ఎత్తుకొని వచ్చి ఆరని మంటల వెలుగుతున్న భర్త మృతదేహం పక్కన మోకాళ్ళ మీద కూర్చుని, భర్త మొహాన్ని కడసారి చూసుకుని, వెలుగుతున్న దివిటీని ఒక చేత, ఏడాది కొడుకుని చంకలో ఎత్తుకుని భీమ్‌ భార్య ‘‘సొమ్‌ బాయ్‌’’ అడవిలోకి వెళ్ళి పోవడంతో నవల ముగుస్తుంది. ఒక వీరుడి మరణం తో పోరాటం ఆగదనే అక్షర సత్యాన్ని భీమ్‌ జీవన చిత్రం ద్వారా అనితర సాధ్యంగా చెప్పడంలో రచయిత కృషి విశేషంగా ఉంది, మనకున్న అనేక చారిత్రక నవలల్లో ఒక భిన్నమైన, నిజమైన, చారిత్రక నవల ఈ ‘‘భీం నవల’’ అక్షరీకరించిన రచయిత కృషి ఎన్నటికీ వన్నె తగ్గదు. డాక్టర్‌ అమ్మిన శ్రీనివాస రాజు

ప్రజల సిరులు ప్రైవేటు పాలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన దరిమిలా లాభాలు ఆర్జిస్తున్న ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించడం లేక అమ్మివేసే (దీనినే -వ్యూహా త్మక పెట్టుబడుల ఉపసంహరణ అంటారు) ప్రక్రి యను ప్రత్యేక శ్రద్ధాసక్తులతో అమలు చేసేందుకు కృషి చేస్తూ ఉంది. దేశ ప్రజానీకానికి పలు విధాలుగా సేవలందిస్తున్న ప్రభుత్వరంగ సంస్థలు భార తీయ రైల్వేలు, ఎయిర్‌పోర్టులు, సీపోర్టులు, పవర్‌గ్రిడ్‌, ట్రాన్స్‌మిషన్‌ లైన్లు, జాతీయ రహదార్లు మున్నగువాటిని దేశీయ, విదేశీ బడా కార్పోరేట్‌ కంపెనీలకు అప్పగిం చడం కోసం ‘మానిటైజేషన్‌ పైప్‌ లైన్‌’ విధానాన్ని శరవేగంగా అమలుచేసేందుకు పూనుకున్నది. గతంలో నష్టాలతో నడుస్తున్న ప్రభుత్వరంగ సంస్థలలో కొంత వాటాను కానీ, సంస్థను పూర్తిగా కానీ అమ్మివేసే ప్రక్రియ ఆర్థిక సంస్కరణలలో భాగంగా కొనసాగుతూ వస్తోంది. 2014కి పూర్వం పదేండ్లు అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వాల హయాంలో ఆ ప్రైవేటైజేషన్‌ ప్రక్రియ నిదానంగా కొనసాగుతూ వచ్చింది. కొన్ని సంస్థలలో 25శాతం లోపు పబ్లిక్‌ ఇష్యూ ద్వారా కొంతమేరకు ప్రైవేటీకరణ జరిగింది.
2019 సార్వత్రిక ఎన్నికలలో లోక్‌సభ లో తిరుగులేని మెజారిటీ సాధించిన బిజెపి ప్రభుత్వ రంగ సంస్థలను, ప్రభుత్వ ఆస్తుల (ప్రజా ఆస్తులు)ను కారుచౌకగా బడా పెట్టుబడిదారులకు అప్పజెప్పేం దుకు దృఢనిశ్చయంతో ముందుకు సాగుతోంది. ఈ అమ్మకాలను సదరు ప్రభుత్వరంగ సంస్థలలో పనిచేస్తున్న కార్మికులు,ఉద్యోగులకు మాత్రమే సంబంధించిన వ్యవహారంగా ప్రజలు భావించ కూడదు. స్వాతంత్య్రం పొందిన తొలినాళ్ళలో టాటా,బిర్లా లాంటి కొద్దిమంది బడా పారిశ్రామిక వేత్తలు తప్ప, దేశం పారిశ్రామికంగా అభివృద్ధి చెందేందుకు అవసరమైన పెట్టుబడులు పెట్టగల స్థోమత ప్రైవేట్‌రంగానికి లేకపోయింది. తత్కార ణంగా విద్యుదుత్పత్తి,ట్రాన్స్‌మిషన్‌,రైల్వేలు, జాతీయ రహదారులు,పెట్రోలియం,ఫార్మాస్యూటికల్‌, నౌకా శ్రయాలు,ఎయిర్‌పోర్టులు,వంటి వాటిలో ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటయ్యాయి. ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన ధనం,బ్యాంకుల నుంచి రుణా లు,కార్మికులు,ఉద్యోగుల శ్రమవగైరాలతో ఈ సంస్థ లు అభివృద్ధి చెందాయి. వివిధ రాష్ట్రాలలో ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటు వల్ల కొంతమేరకు అభివృద్ధి వికేంద్రీకరణ జరగడంతోపాటు, వాటికి అనుబం ధంగా ప్రైవేట్‌ రంగంలో కొన్ని పరిశ్రమలు ఏర్పాట య్యాయి. ఉదాహరణకు హైదరాబాద్‌లో ఐడిపి ఎల్‌ ఏర్పాటు కావడంతో అనంతరకాలంలో పలు ఫార్మాస్యూటికల్‌ సంస్థలు ఏర్పాటయ్యాయి. దీనితో హైదరాబాదుకు విశిష్టస్థానం లభించింది. ప్రభుత్వ రంగ సంస్థలయినందున రిజర్వేషన్‌ సూత్రాన్నను సరించి ఎస్‌సి,ఎస్‌టి వర్గాలకు చెందిన వారికి ఉపాధి లభించి, కొంతమేరకు సామాజిక న్యాయం జరిగింది. మోదీ సర్కార్‌ కొద్ది సంవత్సరాలుగా ప్రభుత్వరంగ సంస్థలకు ఉన్న రిజర్వ్‌ను, మిగులు మొత్తాలను వ్యూహాత్మకంగా ఉపసంహరిస్తూ వాటి విలువ తగ్గేందుకు పావులు కదిపింది. ప్లానింగ్‌ కమిషన్‌ స్థానంలో ఏర్పాటైన ‘నీతి ఆయోగ్‌’కు ఏఏ సంస్థలను ప్రైవేటీకరించాలో సూచించాల్సిన బాధ్య తను అప్పగించింది. 38సంస్థలను ప్రైవేటీకరిం చాలని,26సంస్థలను మూసివేయాలని,10 సంస్థ లను అమ్మివేయాలని నీతి ఆయోగ్‌ సూచించింది. 50శాతం షేర్‌ హోల్డింగ్‌ కన్నా తక్కువ శాతాన్ని ప్రైవేటీకరించినప్పుడు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే సంస్థ కొనసాగుతుంది. సదరు సంస్థకు మార్కెట్‌లో షేర్‌ వాల్యూ ప్రకారం కొంత ధనం చేకూరుతుంది. ప్రభుత్వరంగ సంస్థను అమ్మినపుడు, మేనేజ్‌మెంట్‌ మార్పిడి జరిగినపుడు సదరు సంస్థ రిజర్వ్‌ ప్రైస్‌ లెక్కించేటప్పుడు,ఆసంస్థకు ఉన్నభూమి, ఇతర భౌతిక ఆస్తుల మార్కెట్‌ విలువను కూడా జోడిరచాలని డిజిన్వెస్ట్‌మెంట్‌ కమిషన్‌ సూచించింది. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తి కాంత దాస్‌ 2016 మార్చి4నచేసిన ఒక ప్రకటనలో పిఎస్‌యుని అమ్మేస్తున్నప్పుడు సందర్భంలో, యాజ మాన్యం ప్రభుత్వం నుంచి కొనుగోలుదారునికి మారిన సందర్భంలో భూమి విలువను కూడా రిజర్వ్‌ప్రైస్‌లో చేర్చుతామని స్పష్టంగా చెప్పారు. అయితే మోదీ ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌, బిపిసిఎల్‌ వంటి పలు సంస్థల స్ట్రాటజిక్‌ అమ్మకాల విషయంలో ఈసూత్రాన్ని విస్మరించడం పలు అను మానాలకు తావిస్తోంది. విమానాశ్రయాల ప్రైవేటీకరణ సందర్భంగా ఒకే సంస్థకు రెండిరటిని మించి ఇవ్వరాదని ఉన్నతస్థాయి కమిటీ చేసిన సిఫారసును ప్రక్కనపెట్టి గౌతమ్‌ అదానీకి 6 ఎయిర్‌ పోర్టులను కట్టబెట్టడం, సిబిఐతో దాడులు నిర్వ హించి ప్రైవేట్‌ సంస్థ యాజమాన్యాలను భయపెట్టి సదరు సంస్థలను అదానీ ఖాతాలోకి వెళ్ళేట్లు కృషిచేయడం వంటి కారణాలవల్ల ఆ రెండు సంస్థ లను గౌతమ్‌అదానీ,ముఖేష్‌అంబానీ,అనిల్‌ అంబా నీలకు కట్టబెట్టేందుకే మోదీ ప్రభుత్వం కృతనిశ్చ యంతో ఉన్నట్లు ప్రజలు భావిస్తున్నారు.
ప్రజల సుదీర్ఘ పోరాటం, ఎంపీలు, ఎంఎల్‌ఎల రాజీనామాలు,32మంది ఆంధ్రుల ప్రాణత్యాగం ఫలితంగా ఏర్పాటైన ఉక్కు ఫ్యాక్టరీని ఈనాడు నూటికి నూరుశాతం అమ్మివేయడం గానీ, మూసివేయడం గానీ జరుగుతుందని ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ పదేపదే ప్రకటిస్తున్నారు. దాదాపు 30వేలఎకరాలు స్టీల్‌ప్లాంట్‌ కిందఉంది. ఆభూమి బుక్‌వాల్యూను రూ.56 కోట్లుగా ప్రభుత్వం లెక్కవేస్తోంది.మార్కెట్‌ విలువ కనీసం రూ.60 వేల కోట్లు ఉంటుంది. సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నప్పటికీ వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ రిజర్వ్‌ప్రైస్‌ గురించి సమా చారాన్ని కేంద్రం ప్రకటించకపోవటం దుర్మార్గం. అలాగే లక్షలకోట్లు రూపాయల ఆస్తులతో వేలకోట్లు లాభాలను ఆర్జిస్తున్న 2వ అతి పెద్ద చమురు సంస్థ బిపిసిఎల్‌ను కొద్ది వేలకోట్ల రూపాయలకే అమ్మి వేయాలనుకోవడం అత్యంత దురదృష్టకరం. ప్రభుత్వ ఆస్తుల అమ్మకం ద్వారా లభించే ధనాన్ని తిరిగి నూతనంగా మౌలిక వసతులు కల్పించేందు కు, విద్యా,వైద్యరంగాలలో ఖర్చుచేయడానికి విని యోగిస్తామని ప్రభుత్వం చెబుతోంది. దీర్ఘకాలం కిందట అత్యంత తక్కువ ధరలలో భూములను, పరిశ్రమలను,మౌలిక వసతులను ఏర్పాటు చేసుకుని, అభివృద్ధి చేసినవాటిని 25 నుంచి 50 సంవత్సరాల కాలవ్యవధితో కారుచౌకగా బదలాయిస్తూ, ఇప్పుడు కొత్తగా మౌలిక వసతులను పెంపొందిస్తామని చెప్పడం కంటే నయవంచన మరొకటి ఉండదు. మోదీ ప్రభుత్వం ఇంతవేగంగా ప్రభుత్వరంగ సంస్థలను అమ్మాలనుకోవడం,‘మానిటైజేషన్‌ పై ప్‌లైన్‌’ అమలుచేయాలనుకోవడానికి బలమైన కారణం ఉంది. యుపిఎ ప్రభుత్వంలో కంటే మోదీ ప్రభుత్వంలో బడా కార్పొరేట్‌ సంస్థలకు చాలా హెచ్చుస్థాయిలో రుణాల మంజూరు ప్రక్రియ కొనసాగడమే కాక మొండిబాకీల పరిమాణం చాలా అధిక స్థాయికి చేరింది. 2013-14నాటికి బ్యాం కులకు తిరిగి రాకపోవచ్చని భావించిన రుణాల మొత్తంరూ.2.05 లక్షల కోట్లు ఉండగా 2018–19 నాటికి ఆ మొత్తం 11.73లక్షల కోట్లకు పెరిగింది. మనదేశంలో బ్యాంకింగ్‌ వ్యవస్థ ద్వారా బట్వాడా అవుతున్న రూ.100రుణంలో రూ.16లు కేవలం 20 అధిక స్థాయి రుణగ్రహీతల ఖాతాలకు వెళ్తోంది. 2018-19లో కూడా ఈ 20 ఖాతాల మొత్తం రుణాల పరిమాణం రూ10.94 లక్షల కోట్ల నుంచి రూ.13.55 లక్షల కోట్లకు పెరిగింది. మొత్తం పారిశ్రామిక రంగంలో ఉన్న10కోట్ల చిన్న, సూక్ష్మ,మధ్య తరహా పరిశ్రమలలో 30 కోట్ల మంది ఉపాధి పొందుతున్నారు. భారీపరిశ్రమల రంగం లో కేవలం 1 కోటి మందికి ఉపాధి లభిస్తోంది. భారీ పారిశ్రామికరంగానికి రూ.24 లక్షల కోట్లు, సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు 3.75 లక్షల కోట్లు, మధ్యతరహా పరిశ్రమలకు రూ 1.06 లక్షల కోట్లు రుణం లభించింది. మొత్తం పారిశ్రామికరంగానికి అందిన రుణ సదుపాయంలో 50శాతం పైన ఈ 20అధికస్థాయి రుణగ్రహీతలకు లభించడం ఆశ్చర్యకరం. కార్పొరేట్లు లక్షల కోట్ల రూపాయలు తిరిగి చెల్లించనందున కేంద్రప్రభుత్వం రిజర్వ్‌ బ్యాంకు ద్వారా బ్యాంకులకు ‘క్యాపిటల్‌ ఇన్‌ఫ్యూ జన్‌’ చేస్తూ ఉంటుంది. యుపిఎ ప్రభుత్వం ఏడేళ్ల లో రూ.68,000 కోట్లు బ్యాంకులకు అందచేయగా మోదీ సర్కార్‌ కేవలం ఐదేళ్లలో రూ 3,20,000 కోట్లు ‘క్యాపిటల్‌ ఇన్‌ఫ్యూజన్‌’ కింద అందజేసింది. ప్రస్తుతం కేంద్రప్రభుత్వ రుణభారం జూన్‌ 2019లో రూ 88లక్షల కోట్లు ఉండగా, జూన్‌ 2020 నాటికి రూ.101లక్షల కోట్లకు పెరిగింది. ఈ నేపథ్యంలోనే నరేంద్ర మోదీ ప్రభుత్వం అడ్డగోలుగా లక్షలాది కోట్ల రూపాయల ప్రభుత్వరంగ ఆస్తులను, రిటైల్‌ ఫుడ్‌ రంగాన్ని బడా కార్పోరేట్లకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తోంది.బ్రిటీష్‌ హయాంలో పలు రూపా లలో భారతీయ సంపదను తరలించుకు పోయిన కారణంగానే, కొద్దిశతాబ్దాల క్రితం ప్రపం చంలోనే అత్యధిక జిడిపిగల భారత్‌, స్వాతంత్య్రం పొందే నాటికి ఆర్థికంగా క్షీణదశకు చేరుకుంది. ఒకవైపు రైతులకు, మరొక వైపున సంఘటితశక్తి ద్వారా దీర్ఘకాల పోరాటాల ద్వారా శ్రామికవర్గం సాధించు కున్న ప్రయోజనాలకు భంగం కలిగిస్తూ నాలుగు లేబర్‌కోడ్‌లను తీసుకురావడం, మరొకవంక అత్యధికస్థాయిలో ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొ రేట్లకు కట్టబెట్టడం వంటి దుర్విధానాల వల్ల కోట్లాది ప్రజానీకం ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారే ప్రమాదం ఎంతైనా ఉంది. ఈ వాస్తవాన్ని అర్థం చేసుకుని, ఇప్పుడు రైతులు, పారిశ్రామిక కార్మికులు, ప్రజాసంఘాలు యావన్మంది ఏకమై, మానిటైజేషన్‌ ప్రక్రియకు అడ్డుకట్ట వేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. (వ్యాసకర్త:మాజీ వ్యవ సాయశాఖ మంత్రి, మాజీ లోక్‌ సభ సభ్యులు)
‘సామాన్యులపై ప్రభావం ఏమిటో చెప్పడం లేదు’
` ప్రొ.బిశ్వజిత్‌ ధర్‌
విలువైన ఆస్తులను మానిటైజ్‌ చేస్తే దాని పర్యవసానాలు ఏవిధంగా వుండబోతు న్నాయో సామాన్య ప్రజానీకానికి తెలియజేయడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. వీటిని ప్రైవేటు రంగానికి అప్పజెప్తే వాళ్ళు వీటినితమ లాభాల కోసం నడుపు తారే తప్ప ప్రజల ప్రయోజనాల కోసంకాదు. అంటే వీటి చార్జీలు గణనీయంగా పెరుగుతాయి. ఈ ఆస్తులను నిర్మించడం కోసం గతంలో ప్రజలు పన్నుల రూపంలో అదనపు భారం మో శారు. ఇకముందు ప్రైవేటు వ్యక్తుల లాభాల కోసం మరోసారి అదనపు భారాన్ని మోయవలసి వస్తుంది.
మానిటైజేషన్‌ అనే పదాన్ని వాడడం ప్రభు త్వానికి ఇదేమీ మొదటిసారి కాదు. గతంలో ఎయిర్‌ ఇండియా, తదితర ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడులను ఉపసంహరించే ప్రతిపాదనలను చేసినప్పుడు కూడా ఈ పదాన్ని ఉపయోగించారు. అందుచేత ఆస్తుల మానిటైజేషన్‌ అంటే ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటీకరించడానికి పెట్టిన మరో పేరు మాత్రమే.
‘’పని చేస్తున్న’’ (పెర్‌ఫార్మింగ్‌) ఆస్తులను బద లాయించడం ద్వారా ‘’నిరర్ధకంగా’’ (ఐడిల్‌) వున్న పెట్టుబడిని విడుదల చేసి ఇతర ప్రాజెక్టుల నిర్మాణానికి వినియోగించి ‘’అదనపు ప్రయోజనా లను పొందుతాం’’- ఇది నీతి ఆయోగ్‌ నివేదిక మానిటైజేషన్‌ గురించి ఇచ్చిన వివరణ. ఇక్కడ మొదటి సందేహం : పని చేస్తున్న ఆస్తులైతే నిరర్ధకం గా ఎలా ఉంటాయి? ఒకవేళ నిరర్ధకంగా ఉంటే పని చేస్తున్నట్టు ఎలా ఔతుంది? ఈ రెండిరట్లో ఏదో ఒకటే సాధ్యం. రెండు పరస్పర విరుద్ధమైన పదాలను- ‘’పని చేస్తున్న’’, ‘’నిరర్ధక’’ ఒకే వాక్యంలో కలిపి చెప్పడం తప్పుదోవ పట్టించడం కాదా?
రెండో సందేహం : ఈ ‘’అదనపు ప్రయోజనాలు’’ సామాన్య ప్రజలకు అందుతాయని ఆశించగలమా? మూడవది : ఇలా టాక్స్‌ పేయర్ల సొమ్ముతో సమ కూరిన ఆస్తులను ప్రైవేటువారికి అప్పజెప్పే బదులు ఇతర మార్గాల ద్వారా వనరులను సమీకరించడం సాధ్యం కాదా ? మానిటైజేషన్‌ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం గుర్తించిన ‘’పని చేస్తున్న’’ ఆస్తులలో 26,700 కి.మీ. జాతీయ రహదారులు,400 రైల్వే స్టేషన్లు, 90పాసింజర్‌ రైళ్ళు, డార్జిలింగ్‌ హిమా లయన్‌ రైల్వే తో సహా నాలుగు పర్వత ప్రాంత రైల్వేలు ఉన్నాయి. ఇవిగాక ప్రభుత్వ రంగంలోని టెలికాం, విద్యుత్‌ ట్రాన్స్‌మిషన్‌, డిస్ట్రిబ్యూషన్‌, పెట్రోలియం, పెట్రో ఉత్పత్తులు, సహజవాయువు పైప్‌ లైన్లు ఉన్నాయి. ఇటువంటి అత్యంత విలువైన జాతి సంపదను ఆ జాబితాలో చేర్చకుంటే ప్రైవేటు కార్పొరేట్లు మానిటైజేషన్‌ వైపు కన్నెత్తి కూడా చూడరు.
ఇవన్నీ ‘’నిరర్ధక ఆస్తులు’’ కానే కావు.
ఇటువంటి విలువైన ఆస్తులను మానిటై జ్‌ చేస్తే దాని పర్యవసానాలు ఏవిధంగా వుండ బోతు న్నాయో సామాన్య ప్రజానీకానికి తెలియ జేయడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. ప్రజలు ప్రత్యక్షంగా, పరోక్షంగా చెల్లిస్తున్న పన్నుల ద్వారా వచ్చిన ఆదాయంతోనే ఈ ఆస్తులను ప్రభుత్వం సమకూర్చింది. వీటి నిర్వహణలో ప్రజల ప్రయోజ నాలు చాలా ఉన్నాయి. ఇక ఇంతవరకూ వీటిని ప్రభుత్వం నిర్వహించింది గనుక ప్రజల ప్రయోజ నాలను దృష్టిలో వుంచుకుని వీటిని నిర్వహించింది. అందుకే వీటి ద్వారా వసూలు చేసే చార్జీలు ప్రజ లకు అందుబాటులో వుండేటట్లున్నాయి. ఇక ముం దు వీటిని ప్రైవేటు రంగానికి అప్పజెప్తే వాళ్ళు వీటిని తమ లాభాలకోసం నడుపుతారే తప్ప ప్రజల ప్రయోజనాల కోసంకాదు. అంటే వీటి చార్జీలు గణనీయంగా పెరుగుతాయి. ఈ ఆస్తులను నిర్మించడం కోసం గతంలో ప్రజలు పన్నుల రూపంలో అదనపు భారం మోశారు. ఇకముందు ప్రైవేటు వ్యక్తుల లాభాల కోసం మరోసారి అదనపు భారాన్ని మోయవలసి వస్తుంది. ఒకసారి ప్రైవేటు పరం అయ్యాక వీటిధరలను నియంత్రించే అధి కారాన్ని ప్రభుత్వం కోల్పోతుంది. అలా కాకుండా వీటి ధరలను ప్రభుత్వం అప్పుడు కూడా నియంత్రిం చాలనుకుంటే ఆ మేరకు ప్రభుత్వమే ఆ కంపెనీలకు సబ్సిడీ రూపంలో ముట్టజెప్పవలసి వుంటుంది.
ఢల్లీి అనుభవం ఏమిటి ?
దేశ రాజధాని ఢల్లీి లో విద్యుత్‌ పంపి ణీని గతంలో కాంగ్రెస్‌ హయాంలో ప్రైవేటీకరిం చారు. ఆ తర్వాత పెరిగిన విద్యుత్‌ చార్జీలు పేదలే కాకుండా మధ్య తరగతి సైతం మోయలేనంతగా గుదిబండగా మారాయి. అప్పుడు ప్రజలకు చౌకగా విద్యుత్‌ అందిస్తామని హామీ ఇచ్చి ఆమ్‌ ఆద్మీ పార్టీ అధికారం లోకి వచ్చింది. విద్యుత్‌ చార్జీలను తగ్గించింది. ఆ తగ్గించిన మేరకు ప్రైవేటు విద్యుత పంపిణీ సంస్థలకు సబ్సిడీ ఇస్తోంది. ఆ సబ్సిడీని ప్రజల నుండివసూలు చేసిన పన్నుల ద్వారా చెల్లిస్తోంది. ఢల్లీి ప్రజలు పెరిగిన విద్యుత్‌ చార్జీల రూపంలోనో,కాకుంటే అదనపు పన్నుల రూపం లోనో భారాం అదనంగా మోయక తప్పడం లేదు. ప్రైవేటు కంపెనీలు మాత్రం దర్జాగా లాభాలు పోగేసుకుంటున్నాయి.
ఆదాయం సమకూర్చుకునే మార్గాలు వేరే లేవా ?
మన దేశ జిడిపికి,వసూలు చేసే పన్నులకు మధ్య నిష్పత్తి 2019-20లో17.4 శాతంగా ఉంది. ఇది ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే చాలా తక్కువ. అందుచేత అదనంగా సంపన్నుల మీద పన్ను పెంచవచ్చు. అంతే కాదు, ఈ ప్రైవేటు కంపెనీలు ఎగవేస్తున్న పన్నుల మాటేమిటి?కంపెనీలకు వస్తున్న లాభాలను, అవి చెల్లిస్తున్న పన్నులను ప్రభుత్వం ప్రచురిస్తున్న గణాంకాల ద్వారా తెలుసుకోవచ్చు. 2005-2006 లో40శాతం ప్రైవేటు కంపెనీలు తమకు ఎటు వంటి లాభాలూ రాలేదని ప్రకటించాయి. అదే 2018-19 నాటికి ఏకంగా 51 శాతం కంపెనీలు తమకు ఏలాభాలూ రావడం లేదని ప్రకటించాయి. ఒక కోటి రూ., లేదా అంతకన్నా తక్కువ లాభాలు వచ్చే కంపెనీల శాతం 2005-2006లో 55గా ఉంది. అదికాస్తా 2018-19 నాటికి 43 శాతానికి పడిపోయింది. అంటే దేశంలోని బడా ప్రైవేటు కంపెనీలు చట్టాలలోని లొసుగులను ఉపయోగించు కుని తక్కువ లాభాలను చూపిస్తూ పన్నులు చెల్లించ కుండా తప్పించుకుంటున్నాయి. ప్రభుత్వం పక్కాగా చట్టాలను రూపొందించి పన్నులను వసూలు చేస్తే అదనపు ఆదాయం సమకూరుతుంది.ఎందుకు ఆ పని చేయలేకపోతున్నారు ? అంతే కాదు, ప్రభుత్వ రంగ సంస్థల అసమర్ధత గురించి నీతిఆయోగ్‌ పదే పదే మాట్లాడుతూ వుంటుంది. కాని వాస్తవం వేరు.బడా ప్రైవేటు కంపెనీల్లో నష్టాల్లో నడుస్తున్నవి 51 శాతం. అదే ప్రభుత్వ రంగ సంస్థల్లో నష్టాల్లో నడుస్తున్నవి 28 శాతం. ఎవరి సామర్ధ్యం ఎక్కువ? ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటు పరం చేస్తే పెరిగేవి లాభాలా?లేకనష్టాలా?ఈమాత్రం ఆలోచించ లేకపోతోందా ఈ ప్రభుత్వం?
( వ్యాసకర్త – జెఎన్‌ యు ‘సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్‌ స్టడీస్‌’ లో ప్రొఫెసర్‌)/ ‘ది హిందూ’ సౌజన్యంతో
వడ్డే శోభనాద్రీశ్వరరావు

1 2 3 4 5 6 7