ఓటరు అనే నేను

శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయతను చూపుతానని, దేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడడానికి.. ఒక ఓటరుగా, నా కర్తవ్యమైన ఓటును శ్రద్ధతో, అంత:కరణ శుద్ధితో భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా నోటుకు, మద్యానికి, కులానికి, మతానికి, సంక్షేమ పథకాల ఎరకు కూడా లొంగకుండా వివేచనా, విచక్షణా జ్ఞానంతో రాజ్యాంగం నాకు కల్పించిన అత్యద్భుతమైన అవకాశం అయినటువంటి ఓటు హక్కును వినియోగించుకుంటానని మన భారత రాజ్యాంగం మీద త్రికరణ శుద్ధిగా ప్రమాణం చేస్తున్నాను.
ఓసాఫ్ట్‌వేర్‌ ఉద్యోగితో ఇటీవల జరిగిన సంభాషణ. ఆమె పేరు కవిత.
‘నీకు ఇక్కడే ఓటుందిగా?’ ‘లేదు మేడం.. ఓటు నమోదే చేయించుకోలేదు. ఇంతవరకూ నేను ఓటే వేయలేదు. అయినా, మనం వేయకపోతే- పోయేది ఏముంది? ఎవరొకరు గెలుస్తారు. ఎవరు గెలిచినా ఏం ఒరుగుతుంది కనుకా.. ‘అంది నిర్లిప్తంగా…ఇలా ఒక్క కవిత మాత్రమే కాదుబీ ఇంకా చాలామంది అలాంటి ఆలోచనలతో, ఉదాసీనతతో ఉన్నవారు మనచుట్టూ చాలా మందే ఉన్నారు. ఓటు మన బాధ్యత కదా! కానీ ఈ నిర్లిప్తత ఎందుకు వస్తుంది? నిజమే ఒక్కసారి ఆలోచిస్తే ఈదేశ పౌరులుగా మనం చేస్తుంది నిజంగా బాధ్యతా రాహిత్యమే. ఓటు వేయకపోతే శిక్షలు వేస్తారన్న భయంకాదు కానీ..రాజ్యాంగం కల్పించిన హక్కును వినియోగించుకోవాలన్న స్పృహ లేకపోవడం నిజంగానే క్షమించరాని నేరం.
నా చిన్నప్పుడు నేను చదువుకోవడానికి ప్రభుత్వ విద్య అందుబాటులో ఉండేది. ఊరందరం ఒకే స్కూల్లో చదివేవాళ్లం. ఇప్పుడు నా పిల్లల్ని చదివించాలంటే కార్పొరేట్‌ స్కూళ్ల వైపు చూడాల్సి వస్తోంది. ప్రభుత్వ విద్య చాలాకాలంగా నిర్వీర్యం చేయబడిరది. ప్రయివేటు విద్యాసంస్థల్లో చదివించాలంటే- చాలా డబ్బులు పోయాలి. ఈ విద్యావిధానం ఇలా మారడానికి కారణం ఎవరు? ప్రభుత్వమే అన్నది సమాధానం.. కానీ ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకొనేది.. ఎన్నుకుంది మనమే కదా?! అంటే మన విద్యావిధానం ఇలా తయారుచేసే పాలకులను ఎన్నుకోవడం నాఓటుతోనే. దాన్ని మార్చాలన్నా నాఓటుతోనే సాధ్యం. అసలు ఓటు వేయకపోయినా మనలాంటివారి ఓట్లు పడక ప్రజానాయకులు ఓడిపోతు న్నారేమో? ఒక్కసారి ఆలోచించండి. ఆఓటు వేసే చైతన్యమే మనకు రావాలి. అందుకే ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందే. తొలిసారి ఓటు హక్కు పొందినవాళ్లకు ఓ సదవకాశంగా భావించాలి. భావి భారత పౌరులుగా ఓటు హక్కు వినియోగించుకోవాలి. మన పాలకులు ఎవరో నేనే నిర్ణయించగలనన్న మాట.. ఇలా అనుకుంటుంటేనే నాకెంతో శక్తి ఉందనిపిస్తోంది.
గ్రామీణ పరిస్థితులు..
మా తాతయ్యను చిన్నప్పటి నుంచీ చూస్తున్నా. కౌలుకు తీసుకునే.. వ్యవసాయం చేస్తున్నాడు. ఏడాదంతా కష్టపడతాడు గానీ, అప్పు తప్ప ఇంట్లోకి ఉప్పూ తేలేని పరిస్థితి. రుణమాఫీ అవుతుందని ఎన్నికల కోసం ఎదురుచూడటం అలవాటైపోతుంది. కానీ, ఈ కష్టాలన్నింటికీ.. ఈ వ్యవసాయ విధానం ఇలా కావడానికి ప్రభుత్వానిదేగా బాధ్యత. ఒక్కసారి కూడా దీన్ని ఆలోచించకపోవడం వల్లే..మన భవిష్యత్తును బాగుపరిచే వారికన్నా..తాత్కాలిక ప్రలోభాలకు, వాళ్ల మాయ మాట లకు లోనయ్యి, ఓమందు బాటిల్‌, రెండు పచ్చ నోట్లకు ఆశపడి కొందరు ఓట్లేసేస్తున్నారు. దాంతో మళ్లీ మన కష్టాలు అవే..వారి స్వార్థాలు వారివే…అందుకే మన ఓటుకున్న పవరేంటో చూపిద్దాం. ఆ పవర్‌తో పవర్‌లోకి ప్రజాపక్షం వహించేవారిని తీసుకొద్దాం.
దేశ సార్వభౌమత్వం..?
అంతెందుకు నేను ఇప్పుడు ఇంత చదువుకున్నా నా ఉద్యోగమేంటో.. నా సంపాదనేంటో..నేను ఏదేశం వెళ్లాలా? అందుకు డబ్బులెలా సంపాదించాలా? అక్కడికెళ్లి ఎంత సంపాదించాలా? అదీ కాకపోతే ఏకార్పొరేట్‌ కంపెనీలో ఉద్యోగం సంపాదించాలో అన్నదే నాలాంటి వాళ్ల ఆలోచనగా ఉంది. అంతేకానీ, మన బతుకుల్ని, భవిష్యత్తునూ నిర్ణయించే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలన్న స్పృహ ఉండటం లేదు. అసలు ఓటు నమోదు చేసుకోవాలన్న విజ్ఞత ఉండటం లేదు. నాకు ఓటుందా? నేను ఓటేసే రోజుకు కచ్చితంగా వచ్చి, నా హక్కు నేను కాపాడుకోవాలనే ధ్యాస అసలే ఉండదు. పైగా ఆరోజు ప్రభుత్వం సెలవిస్తే దాన్నీ ఎలా ఎంజారు చేద్దామా? ఓటీ చేసి మరింత సంపాదిద్దామా? అనే ఆలోచిస్తున్నాం. విదేశాలకు వెళ్లేటప్పుడు, అక్కడుండాల్సిన పరిస్థితిలో ఎదురయ్యే ఇబ్బందులకు ప్రభుత్వాలు అనుసరించే విధానాలేనన్నది విస్మరించేస్తున్నాం. ఈరోజు అభివృద్ధి చెందిన దేశాలతో దేశభ విష్యత్తు ను తాకట్టు పెట్టే విధంగా మన విదేశాంగ విధానాలున్నాయి. ప్రపం చంలో విశ్వమానవాళి అభిలషించే పక్షం కాకుండా వేరొకవైపు మొగ్గి ఉన్నామన్నది విస్పష్టం. ఈపరిస్థితికి కారణం మనం ఎన్నుకున్న పాలకుల విధానాలే కారణం. మనం ఇంత చదువుకున్న నాకు ఈ దేశ పౌరునిగా బాధ్యత లేదా? అని నన్ను నేను ఒక్కసారి ప్రశ్నించు కోవాలి. ఈపరిస్థితి మారాలంటే నా ఓటేగా కీలకం. అలాంటి పరిస్థితి ఏర్పడడానికీ నా నిర్లక్ష్యమేగా కారణం. అందుకే నేను ఓటు వేయాలి.
యుద్ధం..కారణం.. : అంతెందుకు ఈ రోజు దేశంలో యుద్ధ వాతావ రణాన్నీ రాజకీయా లకు ఉపయోగించుకునే కుత్సితమైన విధానాలు అనుసరిస్తున్నది చూస్తూనే ఉన్నాం. రాజకీయ ప్రయోజనాల కోసం యుద్ధం వచ్చే పరిస్థితికి సృష్టికర్తలు ఎవరు? కాశ్మీర్‌ సమస్య అలాగే నేటికీ ఉండిపోవ డానికి కారణం ఎవరు? అక్కడి పౌరులపై సైనిక నిర్బంధాల్ని ప్రయోగి స్తూ పిట్టల్లా ప్రాణాలు తీసేస్తున్నారు. అందుకు కారణం ఎవరు? ఈ అత్యవసర పరిస్థితుల్లో కొంతమంది యువత ఉగ్రవాదులుగా తయారు కావడానికి కారకులెవరు? ఇవన్నీ మనం ఎప్పుడైనా ప్రశ్నించు కున్నా మా? ప్రశ్నించామా? ప్రశ్నించుకుంటే.. ఇవన్నీ మారాలంటే ఓటునే ఆయుధంగా చేసుకుంటాం. మన నిర్లిప్తతవల్ల అంతమంది సైనికు లను, పౌరులను బలితీసుకున్నాం. వేడినెత్తురు ప్రవాహం నీకు తగిలే వరకూ నీలోచలనం లేకపోవడానికి బాధ్యత నీదేగా? అని ఇప్పుడు అనిపిస్తుంది. మనదేశ రక్షణకు, సమగ్రతకు మన బాధ్యత ఎంతైనా ఉంది. అందుకు ఉపయోగించాల్సిన అత్యంత శక్తివంతమైన వెపెన్‌ ఓటే! అలాంటి ఓటును ఏదో యథాలాపంగా.. ఏమాత్రం ఆలోచించ కుండా కొంతమొత్తానికి అమ్ముకోవద్దు.. మత్తులో తూగిపోవద్దు.. కుల, మతాల తూకంలో చేరిపోవద్దు. కొన్ని బహుమతులకూ ఆశప డొద్దు. నాలాంటి నిర్లక్ష్యం నిండుగా ఉండేవాళ్లు ఇప్పటికైనా దాన్ని వదిలి చైతన్యంతో ఓటేటస్తే సరి.
వ్యాపారం.. రాజకీయం..: పదవీ వ్యామోహాలతో..రాజకీయ వ్యా పారం జరుగుతున్న పరిస్థితులు నేడు గల్లీ నుంచి ఢల్లీి వరకూ జరుగు తున్నవే. అందుకోసం అవినీతితో అంటకాగడానికి ఏమాత్రం వెను కాడడం లేదు. ఈపరిస్థితి ఎందుకు వచ్చింది? మన చుట్టూనే మనల్ని సర్వనాశనం చేస్తున్న పరిస్థితులు రోజురోజుకు చుట్టుముడుతున్నా.. మనం పట్టించుకోని స్థితిలో ఎందుకున్నాం? ఈరోజు మన రాష్ట్ర రాజకీయాల్లోనేంటీ, దేశ రాజకీ యాల్లోనేంటీ కుటుంబ పాలనలు.. రాష్ట్రాలు, దేశాలు వాళ్ల సొంత ఆస్తులన్నట్లు వ్యవహరిస్తున్నారు. రాజకీయాలను అడ్డంపెట్టుకుని వారి వాణిజ్యాలను విదేశాలకూ విస్తరిస్తున్నారు. అనేక నేరాలకు పాల్పడు తున్నారు. ఒక్క శాతం వద్దే దేశంలోని పెద్దమొత్తంలో డబ్బంతా పోగుబడి ఉంది. కానీ 99శాతం మంది పౌరులు పడరాని కష్టాలు పడుతున్నారు. తినటానికి తిండి లేక, ఉండటానికి గూడులేక, వేసుకోవ డానికి బట్ట లేక. ఆకలితో చచ్చిపోతున్నారు. అప్పులతో ఆత్మహత్యలు చేసుకునే రైతన్నలు. మహిళలపై భ్రూణ హత్యలు, అత్యాచారాలు.. హత్యలు.. అఘాయి త్యాలు నిత్యకృత్యమై ఎందరో బలైపోతున్నారు. వరకట్న హత్యలకైతే లెక్కే లేదు. నిరుద్యోగసైన్యం పెరిగిపోయి, నిరాశ, నిస్పృహలతో బలవన్మరణాలకు పాల్పడడం.. పెడదారులు పట్టడం.. ఉగ్రవాదులు గా తయారుకావడం.. ఇవన్నీ మనమందరం చూస్తున్న నడుస్తున్న చరిత్ర. కానీ,నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరి స్తున్నాం. మనపాటికి మనం మూవీలూ, టీవీలూ చూస్తూ..అదీ కాకపోతే పోర్నోగ్రఫీల్లో ఓలలాడుతూ ఈ ప్రపంచానికి దూరంగా మనల్ని మనం నాశనం చేసుకుంటున్నాం. నాకిప్పుడు అనిపిస్తుంది నా ఓటుతోనే వీటన్నింటి మార్చే అవకాశం ఉందని. అది చేయకపోవడమే ఇన్ని అనర్థాలకు కారణమని. ఈదుస్థితికి నావంతు బాధ్యత నేను వహించాల్సిందే. నాజీవన ఆరాటంలో నేను ఓసరైన గమ్యంలో అయి నా ఉన్నానా అంటే అదీ లేదు. ఈ అగమ్య పరిస్థితులు ఒకవైపు ఉంటే.. మరోవైపు నాతర్వాత తరానికి మరింత దారుణమైన పరిస్థితు లు కల్పిస్తున్నాన్న విషయాన్ని విస్మరిస్తున్నా. ఇప్పటికైనా మనం మేలుకోవాలి.అంతా మేలుకోవాలి.. మన కర్తవ్యం ఓటు వేయడమే. ఓటు అనే ఆయుధంతో మన భవితను, దేశ భవితను సమూలంగా మార్చుకోగల ఓమంచి అవకాశం కోల్పోవద్దు.– శాంతిశ్రీ

ప్రజాస్వామ్యంల ఓటే ఆయుధం

‘‘ ఓ ఓటర్‌ మహాశయా
ఒక్క నిమిషం ఆలోచించండి..
ఓటును కులం, మతం,
పార్టీ ప్రతిపాదికన వేయడం ఆపేయండి
కులం..కేవలం గుర్తింపు మాత్రమే
అభివృద్ధికి మాత్రం కాదూ..
పార్టీ ఎదయినా అభివృద్ధి చేయగల
అభ్యర్ధికే నీ ఓటు వేయండి..!’- గునపర్తి సైమన్‌
‘‘ మంచి పాలకులను ఎంచుకునే హక్కు ప్రజల చేతుల్లోనే ఉంటుంది. కేవలం ఓటు అనే వజ్రాయుధంతోనే అదిసాధ్యం. ప్రజాస్వామ్యం మనకిచ్చిన హక్కు ఓటు. అందరూ ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడే దానికి సార్థకత ఉంటుంది. అందుకే ఎవరూ ఓటు అనే విలువైన ఆయుధాన్ని నోటుకు అమ్ముకోవద్దు. మనం వేసే ఓటుతోనే నవసమాజ నిర్మాణం సాధ్యమవుతుంది’’
డబ్బుకు, ఇతర ప్రలోభాలకు లోబడి ఓటు వేయడం చట్ట విరుద్ధం. రాజకీయ ప్రజాస్వామ్యం పరిఢ విల్లాలంటే సాంఘిక,ఆర్థిక,సమానత్వాన్ని సాధించాలి. ఐదేళ్లకు ఒక్కసారివచ్చినా, మన జీవితాలను, తల రాతను మార్చేది ఎన్నికలు. మనం వేసే ఓటుతోనే నవసమాజం నిర్మితమౌతుంది. అందుకను గుణంగా ఓటు ఆవశ్యకత, ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటుకున్న పాత్రగురించి యువ ఓటర్లను చైతన్యం చేయాలి. ప్రజాస్వామ్యదేశమైన మనదేశంలో ప్రజలే పరిపాలకులు. మనం వేసే ఓటే మన భవిష్యత్తు, రాబోయే తరాల మనుగడ నిర్ణయిస్తాయి. కానీ మన దేశంలో ఎన్నికల పరిస్థితి దారుణంగా ఉంది. ఎన్నికలసమయంలో దేశం మొత్తంలో 60శాతం పోలింగ్‌ కూడా నమోదు కావడం లేదు. 125కోట్లజనాభా కలిగిన మన దేశంలో సుమారు 100కోట్ల మందిఓటర్లు వుంటే, కేవలం50కోట్లలోపు ఓటర్లు మాత్రమే ఓటు హక్కు వినియోగిం చుకుంటున్నారు. మన దేశపరిస్థితి ఇలా వుంటే, ఇతర దేశాల్లో మాత్రంఓటు వేయడం తప్పనిసరి. ఒకవేళ ఓటువేయకుండా వుంటే ఎన్నికల సంఘం నుంచి జరిమానా పత్రం ఇంటికి వెళుతుంది. అంతేకాదు చట్టబద్దమైన చర్యలు తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ మనదేశంలో అనేక మంది ఓటింగ్‌ రోజును కేవలం సెలవు దినంగా మాత్రమే చూస్తారు. ఓటుప్రాముఖ్యతను ఎంతమంది ఎన్నిరకాలుగా చెప్పినా పట్టించుకునే వారు చాలా అరుదు. అందుకే ఇతర దేశాల మాదిరి మన దేశంలో కూడా ఓటుహక్కుపై కఠిన నియమాలు పెట్టవచ్చు. కచ్చితంగా ఓటుహక్కు వినియోగించు కొనేలా ప్రతిపౌరున్ని మేల్కొల్పాలి. ఎన్నికల కమిషన్‌, ప్రభుత్వ పెద్దలు ఈబాధ్యతను నిర్వర్తించాలి. అపుడే మనదేశంలో ప్రజాస్వామ్యం విజయవంతమవుతుంది.
యువతా మేలుకో.. ఓటు విలువ తెలుసుకో : ఏప్రజాస్వామ్య దేశంలోనైనా ప్రజలే నిర్ణేతలు. వారి మనోభావాలను ప్రకటించేందుకు ప్రజల చేతిలో ఉన్న ఏకైక పదునైనఆయుధం ఓటు. రాజకీయ పార్టీల జాతకాలు మార్చాలన్నా.. భ్రష్టుపట్టిన వ్యవస్థకు చరమగీతం పాడాలన్నా వజ్రాయుధం ఇదే. ప్రజలగళం వినిపిం చాలన్నా, ప్రజాస్వామ్య వ్యవస్థ పదిలంగా ఉండాలన్నా ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదై, ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఓటుకు నేతల రాతనే కాదు..దేశ తలరాతనే మార్చే సత్తా ఉంది. ఓటు హక్కుపై అన్ని వర్గాల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ఏటా జనవరి 25న ‘జాతీయ ఓటరు దినోత్సవం’ నిర్వహిస్తున్నారు. స్థానిక సంస్థలు, చట్టసభలకు ఎన్నికలు జరిగినప్పుడు ప్రజలంతా ఓటువేయడానికి వెళ్లేలా ఆ రోజున సెలవు దినంగానూ ప్రకటిస్తున్నారు. అయినప్పటికీ ఎవరూఓటు వేసేం దుకు ముందుకు రావడం లేదు. ముఖ్యంగా పల్లెల కంటే పట్టణాల్లో ఓటు శాతం తక్కువగా ఉంటోంది. ప్రతిఒక్కరినీ ఓటరుగా నమోదు చేసేందుకు జిల్లా యంత్రాంగం తీవ్ర కసరత్తులు చేస్తోంది. ముఖ్యంగా గత నెల రోజుల కాలంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది.
యువతలో చైతన్యం వస్తేనే..: ఒక ఓటు దేశ గమనాన్నే మారుస్తుంది. యువతలో చైత న్యం వచ్చి..ఓటు హక్కును సమర్థంగా వినియోగించుకున్న నాడే దేశాభివృద్ధి సాధ్యం. అయితే, జిల్లాలో యువ ఓటర్ల నమోదు ప్రతిసారీ అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. నమోదు పెంచడానికి జిల్లా అధికార యంత్రాంగం ఏటా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోంది.18 సంవత్సరాలు నిండిన వారంతా ఓటు హక్కు పొందేలా కార్యక్రమాలు చేపట్టారు. పరిపాలన సజావుగా సాగాలన్నా, సరైన నేతలకు పగ్గాలు ఇవ్వాలన్నా అది ఓటు ద్వారానే సాధ్యమన్న సత్యాన్ని ఓటరు దినోత్సవం నాడైనా అందరూ మననం చేసుకోవాలి. ముఖ్యంగా యువత మేలుకొని ఓటు హక్కు నమోదుకు ముందుకు రావాలని జిల్లా అధికార యంత్రాంగం కోరుతోంది.
ఒక్క ఓటుతో కూలిన ప్రభుత్వాలు : ఎన్నికల్లో అనేక మంది అభ్యర్థులు ఒక్క ఓటుతో ఓడిపోయిన సంద ర్భాలు ఉన్నాయి. పలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశ్వాస పరీక్షలో ఒక్క ఓటుతో ఓడిపోయిన అరుదైన సంఘటనలు చరిత్రలో లేకపో లేదు. గత 2008లో రాజస్థాన్‌ శాసనసభ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేసులో ఉన్న కాంగ్రెస్‌ అభ్యర్థి సీపీ జోషీకి 62,215 ఓట్లు వచ్చాయి. సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి కళ్యాణ్‌ సింగ్‌కి 62,216 ఓట్లు వచ్చాయి. అయితే, కొందరు టెండర్‌ ఓటు వేశారని కోర్టు దాకా వెళ్లడంతో తిరిగి లెక్కించగా ఇద్దరికీ సమానంగా ఓట్లు వచ్చాయి. దీంతో డ్రా తీయడంతో బీజేపీ అభ్యర్థి కళ్యాణ్‌ సింగ్‌ను గెలుపు వరించింది. అదేవిధంగా 2004లో కర్నాటకలోని సంతేమరహళ్ళి స్థానంలో జరిగిన ఎన్నికల్లో జేడీఎస్‌ అభ్యర్థి కృష్ణమూర్తికి 40,751 ఓట్లు రాగా, కాంగ్రెస్‌ అభ్యర్థి ఆర్‌.ధృవ్‌నారాయణ్‌కు 40,752 ఓట్లు వచ్చాయి. ఒక్క ఓటుతో కృష్ణమూర్తి ఓటమిపాలయ్యారు. అందుకే ఒక్క ఓటు కూడా ఎంతో విలువైనదేనని రాజ్యంగ నిపుణులు అంటున్నారు.
ఓటు కథలో ఎన్ని మలుపులో….:సార్వత్రిక ఎన్నికల వేళ ఇందుగలదని… అందులేదని, సందేహంబు వలదన్నట్లు ఎక్కడ చూసినా, ఏది విన్నా…అక్కడ ఓటు చర్చే సాగుతోంది. రాజకీయం చేసేవారిలోనే కాదు..ప్రజల నోళ్లలోనూ నానుతోంది ఓటే. అసలీ ఓటు కథేంటో తెలుసా? ఓటు వేయడమనేది ఆంగ్లేయుల పాలనా కాలంలోనే మొదలైనా 1988 నాటికి అది ఓ రూపాన్ని సంతరించుకుంది. మన దేశంలో బ్రిటిష్‌ వారి పాలనలో భారతీయులకు పరిమితంగానే కల్పించిన ఓటుహక్కును భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చాకే పౌరులందరికీ సార్వత్రిక వయోజన ఓటు హక్కు సాకారమైంది.
ా 1907లో ఏర్పడిన రాయల్‌ కమిషన్‌ స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఓటుహక్కుపై చేసిన సిఫార్సుల ఆధారంగా 1909 కౌన్సిల్‌ చట్టం పరిమిత ప్రాతిపదికన భారతీయులకు ఓటు హక్కు వచ్చింది.
ా 1919 కౌన్సిల్‌ చట్టం ఓటు హక్కును కొంత మేర విస్తృత పరిచింది.
ా 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా ఓటుహక్కు దేశ జనాభాలో 10.5 శాతానికి పెరిగింది.
ా 1947లో రాజ్యాంగ పరిషత్తు ఎన్నికల సందర్భంగా దీనిని 28.5 శాతానికి పెంచారు.
ా స్వాతంత్య్రానంతరం భారత ప్రభుత్వం ప్రజాస్వామ్య విధానానికి కట్టుబడి, రాజ్యాంగం ప్రకారం భారత పౌరులకు సార్వత్రిక వయోజన ఓటు హక్కును కల్పించారు.
ా ప్రజాస్వామ్యంలో సమానత్వ సూత్రాన్ని అనుసరించి ఒకవ్యక్తికి ఒక ఓటును మాత్రమే కల్పించారు.
ా ఆర్టికల్‌ 325 ప్రకారం కుల,మత,వర్గ,వర్ణ,జాతి,ప్రాంత, లింగ భేదాలు వంటి తేడాలతో ఏవ్యక్తికీ ఓటు హక్కును నిరాకరించ కూడదు.
ా 1952లో సాధారణ ఎన్నికల సందర్భంగా అధికరణ 326 కింద సార్వత్రిక వయోజన ఓటు హక్కును కల్పించింది. 21 ఏళ్లు పైబడిన వారందరూ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు.
ా 1988లో 61వ రాజ్యాంగ సవరణ ద్వారా అప్పటి రాజీవ్‌గాంధీ ప్రభుత్వం ఓటు హక్కు వయోపరిమితిని 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించింది.
విలువ చాలా తక్కువ మందికి తెలుసు. : ఓటు అనే రెండక్షరాలకు ప్రపంచ గతిని మార్చే శక్తి ఉంది. ఓటు వ్యక్తి అస్తిత్వాన్ని గుర్తిస్తుంది, వ్యవస్థ మార్పుకు నాంది పలుకుతుంది. ఉన్నత విలువలతో కూడిన ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన రాజకీయ నేతలే నేరస్తులైతే నేరమయ భారతం నిర్మితమౌతుంది. దీన్ని అడ్డుకొనే సంస్కరణలు తీసుకు రావడానికి 1975లో తార్కుండే కమిటి, 1998లో ఇంద్రజిత్‌ గుప్తా కమిటీలను కేంద్రం ఏర్పాటుచేసింది. ఈ కమిటీలు అనేక ఉన్నతమైన సంస్కరణలు ప్రతిపాదించాయి. అందులో భాగంగానే 1971 నుండి ఎన్నికల కోడ్‌ ఆప్‌ కండక్ట్‌ అమలవుతోంది. లోక్‌సభ ఎన్నికల ఖర్చు 25లక్షలు, అసెంబ్లీ ఎన్నికల ఖర్చు10 లక్షలు దాటకూడదని 2004లో నిబంధనలు విధించిన ప్పటికీ అభ్యర్థులు మాత్రం కోట్లాది రూపాయలు ఖర్చుచేస్తున్నారు. అభ్యర్థి నేరస్తుడైనా కోట్ల రూపాయల డబ్బు ఉంటే చాలు ఎన్నికల్లో టికెట్‌ ఇచ్చి ప్రతి పార్టీ ప్రోత్సహిస్తోంది. సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నా పాలకుల మితిమీరిన జ్యోక్యంతో సత్ఫలితాలు రావడం లేదు. మంచినాయకత్వం లేకుండా మంచి సమాజం ఏర్పడదు. వయోజనులైన ప్రతి వ్యక్తికీ ఎలాంటి భేదభావాలు లేకుండా ఓటుహక్కును కల్పిం చింది మన రాజ్యాంగం. రాజకీయ ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంటే సాంఘిక, ఆర్థిక, సమానత్వాన్ని సాధించాలని, రాజ్యాంగం యొక్క లక్ష్యం కూడా అదేనని, రాజకీయ ప్రజాస్వామ్యం సామాన్యులకు అందకపోతే బాధితులు ఈ రాజ్యాంగ వ్యవస్థను కూల్చేస్తారని నవంబర్‌ 26, 1949న భారత రాజ్యాంగాన్ని పార్లమెంట్‌కు సమర్పిస్తూ అంబే డ్కర్‌ హెచ్చరించారు.
ఓటుకూ ఓ లెకుంది…: ఎన్నికల పండగలో ఓటే కీలకం. తమను పాలించే ప్రజాప్రతినిధుల్ని ఎంపిక చేసుకునే అధికారం పౌరులకు దక్కేది దీనితోనే. అయితే సాధారణంగా మనం ఓటు ఒకటే అనుకుంటాం. కానీ ఓటుల్లోనూ రకాలున్నాయని.. ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత ఉందని చాలామందికి తెలియదు. ఈ ఏడాది కొత్తగా ప్రవాస భారతీయులకు కూడా ఓటు హక్కు పొందే అవకాశం కల్పించారు.
ఎన్నారై ఓటు : ప్రవాస భారతీయులకు తొలిసారిగా ఈ ఏడాది జరగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో తమ ఓటును వినియోగించుకునేందుకు అవకాశం కల్పించారు. ప్రపంచంలోని వివిధ దేశాల్లో చదువు, ఉద్యోగం,ఉపాధితో పాటు బంధువుల ఇళ్లకు తాత్కాలికంగా వెళ్లి, ఎన్నికలప్పుడు రాలేని వారి ఈకోసం ఈ అవకాశం ఉంటుంది. ఆన్‌లైన్‌లో ఫారం-6ఎ ద్వారా ఎన్నారైలు దరఖాస్తు చేసుకుని, తగిన ఆధారాలు చూపించి, ఓటును పొందవచ్ఛు వారి ఆసక్తి మేరకు విదేశాల నుంచి వచ్చి తమ ప్రాంత ప్రజాప్రతినిధిని ఎన్నుకునే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది.
సర్వీసు ఓటు : దేశరక్షణ సంబంధ శాఖల్లో పనిచేసే వారికి ఈఓటు హక్కు ఉంటుంది. ఎన్నికల సమయంలో వారు ఇక్కడకు రాలేరు. అలాంటి వారి ఓటు కూడా కీలకంగా భావించి, ఓటు హక్కును కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలు కల్పిస్తు న్నాయి. తపాలాశాఖ, తమ ప్రతినిధి ద్వారా ఈఓటును పంపవచ్ఛు లేని పక్షంలో సరిహద్దుల్లో ఉండే సైని కులు ఎలక్ట్రానిక్‌ టాన్స్‌ఫర్‌బుల్‌ ఓటును ఆన్‌లైన్‌ ద్వారా కూడా వినియోగించుకోవచ్ఛు.
పోస్టల్‌ బ్యాలెట్‌ : ఎన్నికల సమయంలో ఎన్నికల విధులను ప్రభుత్వ ఉద్యోగులే నిర్వహి స్తారు. వీరు కూడా ఓటర్లే కావటంతో తమ ప్రజాప్రతినిధులను ఎంపిక చేసుకోవటంలో వీరు కూడాభాగస్వాములే కాబట్టి వీరికి పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యంఉంది. ఎన్నికల షెడ్యూలు వెలువడిన తర్వాత అందరికంటే ముందు ఓటు హక్కును తపాలాశాఖ ద్వారా పంపవచ్ఛు ఉద్యోగులు తమకు ఓటు ఉన్నచోట అభ్యర్థులకు ఓటు వేసి తిరిగి పోస్టు ద్వారా ఎన్నికల అధికారి చిరునామాకు పంపుతారు. ఎన్నికల్లో పాల్గొనే సిబ్బందికి శిక్షణ ఇస్తున్న సమయంలోనే వీరు తమ ఓటు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా అధికారులకు పంపిస్తారు. ఓట్ల లెక్కింపు అయ్యాక వీటిని లెక్కిస్తారు. కొన్ని సందర్భాల్లో పోస్టల్‌ ఓట్లే కీలకంగా మారుతాయి.’
టెండర్‌ ఓటు : ఓటర్ల జాబితాలో పేరు ఉండి, పోలింగ్‌ బూత్‌లోకి తమ ఓటును వినియోగించుకునేందుకు వెళ్లే సరికి అప్పటికే ఆవ్యక్తి ఓటు హక్కు వినియోగించుకున్నట్లు చూస్తూ ఉంటాం. అనేక సందర్భాల్లో ఈ తరహాలో ఓటర్లు నిరుత్సాహం చెందుతారు. అలాంటి సందర్భాల్లో తాను ఓటు హక్కును వినియోగించుకోలేదని ఎన్నికల అధికారికి నిరూపించి పొందేదే టెండర్‌ ఓటు. ఎన్నికల అధికారి అనుమతితో టెండర్‌ ఓటును వేయవచ్ఛు బ్యాలెట్‌ పేపర్‌ ద్వారా ఈ తరహా ఓట్లు వేసుకునే అవకాశం కల్పిస్తారు.
సాధారణ ఓటు… : 18 సంవత్సరాలు దాటిన ప్రతీ భారతీయ పౌరుడు అన్ని రకాల ఎన్నికల్లో పాల్గొనేందుకు అవకాశం కల్పించేదే సాధారణ ఓటు. ఫారం-6 నింపి,18 సంవత్సరాలు దాటినట్లుగా, స్థానికంగా నివాసం ఉంటున్నట్లుగా ఆధారాలు చూపిస్తే ఓటు హక్కు కల్పిస్తారు. ఏటా ఓటర్ల నమోదు, ఓటర్ల ముసాయిదా ప్రచురణ జరుగుతూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు 18 సంవత్సరాలు దాటిన వారంతా ఓటు హక్కు పొందవచ్ఛు మన దేశంలో ఈఓటర్లే కీలకం. బయటి వ్యక్తులువచ్చి ఓటు వేస్తున్నారని పోలింగ్‌ కేంద్రంవద్ద ఎన్నికల ఏజెంట్‌ కానీ, అక్కడి ఓటర్లు కానీ అభ్యంతరాలు వ్యక్తం చేసిన సందర్భాల్లో ఈఓటు ప్రస్తావన వస్తోంది. అరోపణలు ఎదుర్కొనేవ్యక్తి ఫొటో, ఓటు తమదేనని, సంబంధిత ఓటరు తానేనని నిరూపించి సవాలు చేయవచ్ఛు అనంతరం ఓటు వేసే అవకాశం కలుగుతోంది. ఇలాంటి సందర్భాల్లో ఓటరుపై ఉద్దేశపూర్వకంగా ఎవరైనా ఫిర్యాదు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటారు. ఇంకొకరి ఓటు వేసేందుకు వచ్చినట్లు నిర్ధారణ అయినా, అతనిపై చర్యలు తీసుకుంటారు.

గిరిజన నేస్తం

తూర్పు అడవుల్లో ఇప్పపువ్వు సీజన్‌ నడుస్తున్నది. ఏటా మార్చి నుంచి మే చివరి దాకా సేకరణలో గిరిజనం నిమగ్నమవుతుంది. ఈ సారి గతానికి మించి సందడి నెలకొన్నది. తునికాకుతో పాటు ఉపాధినిచ్చే ఇప్పపూల కోసం మంటుటెండను సైతం లెక్కచేయ కుండా చిన్నాపెద్దా తరలుతు న్నారు. తెల్లవారుజామునే తట్టా బుట్టా, అంబలి బుర్రతో బయలుదేరి, సాయంత్రం కల్లా ఊళ్లకు చేరుతున్నారు.-జి.ఎన్‌.వి.సతీష్‌
గిరిజనులకు ఇప్పపూల సేకరణే ప్రధాన ఆదాయవనరు. దీనిని గిరిజనులు పవిత్రం గా భావిస్తారు. గిరిజనులు జరుపుకునే సాంప్ర దాయ, వేడుకలు, సంబరాలు, పెళ్లి సమయాల్లో ఇప్పపూల నుండి తయారుచేసిన సారాయి తాగడం ఆచారంగా పాటిస్తారు. సారాయి కాచడమే కాకుండా ఇప్పపూలతో ఇప్పజామ్‌, కేక్‌, లడ్డు, హల్వా, నూనె తదితర ఉపయోగాలు ఎన్నో ఉన్నాయి. ఎండాకాలం ముందు ఫిబ్రవరి, ఏప్రిల్‌ నెలల విప్ప చెట్లు ఆకురాలుస్తాయి. ఆ సమయం లోనే కస్తూరి వాసన కలిగిన పూలు పుష్పించడం మొదలవుతుంది. పూలు సాధారణగా ఉదయం సమయంలోరాలుతాయి. 30 సంవత్సరాల వయస్సు గల ఒక చెట్టు నుండి సుమారు 100 నుండి 150 కిలోల ఇప్ప పూలు లభిస్తాయి. ఇలా రాలిపడిన పూలను సేకరించి నీడలో ఆరబెడుతారు. బాగా ఎండిన తరువాత లావుపాటి కర్రతో పూలలోని పొట్టు పోయేంత వరకు కొట్టి, గాలి దూరని విధంగా వెదురు బుట్టలలో నింపి నిల్వచేస్తారు. వీటిని తమ అవస రాలకు అనుగుణంగా కావాల్సినప్పుడు వాడుతుంటారు. గిరిజన ప్రాంతాల్లో ఇప్ప పువ్వు అంటే కేవలం సారాయి తయారు చేయడానికే వాడుతారు అనే భావన ఉంది. ఢల్లీికి చెందిన డాక్టర్‌ ఎస్‌ఎన్‌.నాయక్‌ భారత శాస్త్రీయ, సాంతికేక మంత్రిత్వ శాఖ సహకారంతో నిర్వహించిన పరిశోధనలో ఇప్ప పూల నుండి పంచదార పాకం తయారు చేసి దీంతో బిస్కెట్‌, చాక్లెట్‌, జామ్‌, కేక్‌లు తయారు చేసే విధానాన్ని కనిపెట్టారు. 1999లో పేటెంటు కొరకు దరఖాస్తు చేశారు. ఆయుర్వేద వైద్య విధానం ప్రకారం ఇప్ప పూలు బాలింతలకు చాలా ఉపయోగకరంగా పనిచేస్తాయి. సాధారణ శారీరక బలహీనత నుండి రక్షిస్తుంది. వీటిని నేరుగా తినడం వల్ల పిల్లలు పోషకహార లోపం నుండి బయట పడవచ్చు. గతంలో గిరిజనులందరూ ఇప్ప పూలను మంగళంలో పొడిగా చేసి వేపి, వేపిన గోంగూర గింజల పొడిని కలుపుతూ ఇప్ప నూనె కొంచెం చేర్చి ఉండలుగా చేసుకొని తినేవారు. రెండు లడ్లు తింటే ఒక రోజుకు సరిపడా శక్తి శరీరానికి లభించేది. కొన్ని రాష్ట్రాల్లో గిరిజనులు ఈ పూలను రొట్టెల పిండిలో కలిపి తింటారు.
ఇప్పపూలతో ఇప్పజామ్‌గిరిజనులకు ఇప్పపూల సేకరణే ఆధారం
నవతెలంగాణ-ములుగు
గిరిజనులకు ఇప్పపూల సేకరణే ప్రధాన ఆదాయ వనరు. దీనిని గిరిజనులు పవిత్రంగా భావిస్తారు. గిరిజనులు జరుపుకునే సాంప్రదాయ, వేడుకలు, సంబరాలు, పెళ్లి సమయాల్లో ఇప్పపూల నుండి తయారుచేసిన సారాయి తాగడం ఆచారంగా పాటిస్తారు. సారాయి కాచడమే కాకుండా ఇప్పపూలతో ఇప్పజామ్‌, కేక్‌, లడ్డు, హల్వా, నూనె తదితర ఉపయోగాలు ఎన్నో ఉన్నాయి. ఎండాకాలం ముందు ఫిబ్రవరి, ఏప్రిల్‌ నెలల విప్ప చెట్లు ఆకురాలుస్తాయి. ఆ సమయంలోనే కస్తూరి వాసన కలిగిన పూలు పుష్పించడం మొదలవుతుంది. పూలు సాధారణగా ఉదయం సమయంలో రాలుతాయి. 30 సంవత్సరాల వయస్సు గల ఒక చెట్టు నుండి సుమారు 100 నుండి 150 కిలోల ఇప్ప పూలు లభిస్తాయి. ఇలా రాలిపడిన పూలను సేకరించి నీడలో ఆరబెడుతారు. బాగా ఎండిన తరువాత లావుపాటి కర్రతో పూలలోని పొట్టు పోయేంత వరకు కొట్టి, గాలి దూరని విధంగా వెదురు బుట్టలలో నింపి నిల్వ చేస్తారు. వీటిని తమ అవసరాలకు అనుగుణంగా కావాల్సినప్పుడు వాడుతుంటారు. గిరిజన ప్రాంతాల్లో ఇప్ప పువ్వు అంటే కేవలం సారాయి తయారు చేయడానికే వాడుతారు అనే భావన ఉంది. ఢల్లీికి చెందిన డాక్టర్‌ ఎస్‌ఎన్‌.నాయక్‌ భారత శాస్త్రీయ, సాంతికేక మంత్రిత్వ శాఖ సహకారంతో నిర్వహించిన పరిశోధనలో ఇప్ప పూల నుండి పంచదార పాకం తయారు చేసి దీంతో బిస్కెట్‌, చాక్లెట్‌, జామ్‌, కేక్‌లు తయారు చేసే విధానాన్ని కనిపెట్టారు. 1999లో పేటెంటు కొరకు దరఖాస్తు చేశారు. ఆయుర్వేద వైద్య విధానం ప్రకారం ఇప్ప పూలు బాలింతలకు చాలా ఉపయోగకరంగా పనిచేస్తాయి. సాధారణ శారీరక బలహీనత నుండి రక్షిస్తుంది. వీటిని నేరుగా తినడం వల్ల పిల్లలు పోషకహార లోపం నుండి బయట పడవచ్చు. గతంలో గిరిజనులందరూ ఇప్ప పూలను మంగళంలో పొడిగా చేసి వేపి, వేపిన గోంగూర గింజల పొడిని కలుపుతూ ఇప్ప నూనె కొంచెం చేర్చి ఉండలుగా చేసుకొని తినేవారు. రెండు లడ్లు తింటే ఒక రోజుకు సరిపడా శక్తి శరీరానికి లభించేది. కొన్ని రాష్ట్రాల్లో గిరిజనులు ఈ పూలను రొట్టెల పిండిలో కలిపి తింటారు.
ఇప్పపూలతో ఇప్పజామ్‌
గిరిజనులు చెట్ల కింద పడిన పూలను ఏరి ఆరుబయట నేలపై ఆరబెడుతారు. భద్రాచలం పుణ్య కేత్రాన్ని సందర్శించిన భక్తులకు ఇప్పపూలను సీతమ్మ ప్రసాదంగా స్వీకరించడం ఆనవాయితీ. ఇప్ప పూల పొట్టు తొలగించి శుభ్రమైన నీటితో మూడు సార్లు కడికి కుక్కర్లో వేసి ఉడక బెట్టాలి. ఉడక బెట్టిన పూలను కొద్దిసేపు చల్లబడే వరకు ఉంచి మిక్సీలో వేసి ఫేస్ట్‌లా రుబ్బాలి. అదేవిధంగా బొప్పాయి. జామ, అరటి, యాపిల్‌ పండ్ల గుజ్జును కూడా తయారు చేసుకోవాలి. మొత్తం అన్నీ రకాల పండ్లు, ఇప్ప పూల గుజ్జును తూకం వేసి తూనికానికి సగం పంచదార కలిపి సన్నని సెగపై కింద అడుగు అంటకుండా మెదుపుతూ సుమారు 2 గంటల పాటు కాయాలి. కొంచెం తీసి నీళ్లలో వేసినప్పుడు ఆ కొంచెం నీళ్లలో కలవకుండా నేరుగా కిందికి దిగిపపోయినప్పుడు జామ్‌ తయారు అయినట్లుగా గుర్తించాలి.
విరిసిన ఇప్పపువ్వే బతుకుదెరువు
ఏటా వేసవిలో ఇప్పచెట్లు పూత, కాతలతో కళకళలాడుతుంటాయి. ఈ కాలన్నే గిరిజనులు ఇప్పసీజన్‌గా చెప్పుకుంటారు. ఈసారి ఇప్పపువ్వు సీజన్‌ ఆలస్యంగా ప్రారంభం కాగా, తూరుపు ప్రాంతంలో అడవిబిడ్డలు సేకరణలో తలమునకల య్యారు. వేకువజామునే బయలుదేరి, ఉదయం పదిగంటల్లోగా సేకరించి, ఇళ్లకు చేరుకుంటున్నారు. పలువురు తమ సొంత భూముల్లో ఉన్న చెట్లనుంచి సేకరించుకుంటుండగా, భూములు లేని గిరిజనులు అటవీప్రాంతంలో చెట్ల నుంచి ఏరుకుంటున్నారు.
వరా ్షకాలంలో అంబలి, ఇప్పపువ్వు అన్నం
గిరిజనులు సేకరించిన ఇప్పపూలను ఎండబెట్టి దానిలో పుప్పొడి రేణువులు పొయ్యేదాకా కర్రమొద్దులతో బాదుతారు. అనంతరం చెరిగి గుమ్ముల్లో దాచుకుంటారు. మొదట దాని అడుగున ఆకులు వేసి తొక్కుతారు. మధ్యమధ్య ఎండబెట్టిన వేపాకులు చల్లుతారు. దీంతో ఇప్పపువ్వు ఎక్కువ కాలం నిలువ ఉంటుంది. వర్షాకాలం వచ్చిందంటే చిక్కుడు గింజలు, అల్చందలు కలిపి ఉడికించి అంబలి కాస్తారు. ఇప్పపువ్వు కలిపి అన్నం వండుతారు. మరికొందరు గిరిజనులు ఇప్ప ఉండలను ఆల్పాహారంగా తీసుకుంటారు. ఇప్పపూలను పెంకుల్లో వేయించే సమయాన దంచిన వెల్లుల్లి, మిర్చి, అల్లం కలుపుతారు. అన్నీ కలిపి మోదుగాకుల్లో ఉండలుగా చు డుతారు. వాటిని నేతితో, ఇప్పనూనెతో కలిపి తింటారు. పలువురు ఇప్పపువ్వుతో సారా తయారు చేసి సేవిస్తారు. ఇప్పబద్దల నుంచి నూనె తీసి పంటలకు, దీపం చమురుగా వాడుతారు. అటవీ ప్రాంతానికి మేతకు వెళ్లే మేకలు, గొర్రెలు, పశువులు సైతం ఇప్పపువ్వు తింటాయి.
మందుల తయారీలో..
ఇప్పపూలను మందుల తయారీలోనూ ఉపయోగిస్తారు. పూల నుంచి తీసిన తైలాన్ని పక్షవాతం తదితర వ్యాధుల నివారణకు వాడుతారు. మాలిష్‌కు కూడా వినియోగిస్తారు. ఇప్పబద్దలను సబ్బులు, ఎరువుల తయారీలో ఉపయోగిస్తారు. ఇప్పపూలతో పళ్లు తోముకుంటే దంతవ్యాధులు, దగ్గు దరిచేరవని గిరిజనులు చెబుతున్నారు. ఇప్పపువ్వుతో తయారైన సారా తాగితే వృద్ధాప్య లక్షణాలు త్వరగా రాకుండా ఉంటాయని విశ్వసిస్తారు. పలు ఆయుర్వేద మందుల తయారీలోనూ వాడతారు.
వైద్యశాస్త్రంలో ప్రాధాన్యం
వైద్యశాస్త్రంలోనూ ఇప్పచెట్టుకు ఎంతో ప్రాధాన్యముంది. ఆయుర్వేదంలో ఇప్పచెట్టును మధూక వ ృక్షమని వ్యవహరిస్తారు. దీ న్ని శాస్త్రీయ నామం గ్లీజేరియా గ్లాబ్రా కాగా, మేడికేటెడ్‌ ఆయుర్వేదిక్‌లో దీన్ని వాడుతారు. అటవీ ప్రాంతంలోని గిరిజనులు టేకు చెట్లను సైతం నరికి వంట చెరుకుగా, కట్టెలుగా, దుంగలుగా, నాగళ్లుగా వాడుతారు కానీ, ఇప్పచెట్టును నరికే ప్రసక్తే ఉండదు. ఓఅంచనా ప్రకారం ప్రతి గిరిజనుడి భూమిలో పది నుంచి పదిహేను అంతకుమించిన సంఖ్యలో కూడా ఇప్పచెట్లుంటాయి.
కొనుగోలుకు ముఖం చాటేస్తున్న జీసీసీ
గిరిజనులు సేకరించిన అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు గ్రామాల్లో ఏర్పాటు చేసిన గిరిజన సహకార సంస్థ(జీసీసీ) కేంద్రాలు నామమాత్రంగానే మిగిలాయి. గిరిజనులు సేకరించిన ఇప్పపువ్వును ప్రభుత్వ మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాల్సి ఉండగా ఎక్కడా కనిపించడం లేదు. కిలో ఇప్పుపువ్వుకు రూ.15 చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించగా తూర్పున జీసీసీ కొనుగోలు చేయక పోవడంతో గిరిజనులు దళారులను ఆశ్రయిస్తున్నారు. దీంతో వారు నిర్ణయించిన ధరలకే అమ్మి నష్టపోతున్నారు.
ఇప్పపువ్వు..గ్రామీణులకు కల్పతరువు
గిరిజనులు అడవులను నమ్ముకుని జీవించడానికి ప్రధాన కారణం అడవిలో లభించే ఉత్పత్తులను సేకరించి వాటిని అమ్మడం ద్వారా ఉపాధి పొందు తున్నారు. కొందరు తడకలు అల్లితే మరికొందరు పండ్లు సేకరిస్తున్నారు. మరికొందరు తునికాకు,వంటి వాటిపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇందులో ఇప్పపువ్వు సేకరణ కూడా వారికి అధిక ఉపాధి కల్పిస్తోంది. గిరిజనులకు కాలానికనుగుణంగా ఉపాధినిచ్చే వృక్షాల్లో ఇప్పచెట్లు ప్రధానమైనవి. వేసవిలో వీటి ద్వారా గిరిజనులు ఉపాధి పొందడానికి అనేక అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఇప్పపువ్వు లభిస్తుండడంతో గిరిజనులు అడవుల్లోకి వెళ్లి తెల్లవారు జామునే ఇప్పపువ్వు సేకరించే పనిలో పడ్డారు. గిరిజనులు సూర్యోదయానికి ముందే అడవికి చేరుకుని ఇప్పపువ్వును సేకరిస్తున్నారు. తెల్లవారుజామున కిందపడిన ఇప్పపువ్వును మధ్యాహ్నంలోగా సేకరించి ఇంటికి తెచ్చి ఎండబెడుతున్నారు.
మూడు మాసాలు ఉపాధికి ఊతం..
ఖరీఫ్‌, రబీ పనులు ముగిసే సమయానికి ఇప్పచెట్లు విరగపూస్తాయి. వీటి పూత గాలికి నేలరాలుతుంటుంది. ఈ పువ్వులను గిరిజనులు సేకరిస్తారు. వీటితోపాటు మొర్రిపండ్లు సేకరించి తీసుకొస్తుంటారు. వీటిని విక్రయించి మూడు మాసాలపాటు అంటే మార్చి, ఏప్రిల్‌, మేనెలల్లో వీరు ఉపాధి పొందుతారు. ఇప్పపువ్వుల నుంచి తీసిన తైలాన్ని పక్షవాతం వంటి వ్యాధులకు ఉపయోగిస్తారు. అలాగే ఇప్పపువ్వుతో దంతాలను శుభ్రం చేసుకోవడంతో దగ్గుకు, దంతాలకు సంబంధించిన వ్యాధుల నివారణకు ఔషధంగా పనిచే స్తోంది. ప్రధానంగా స్వచ్ఛమైన ఇప్పపువ్వుతో తయారుచేసిన సారాయి సేవిస్తే వృద్ధాప్య లక్షణాలు త్వరగా రాకుండా ఉంటాయని పల్లె ప్రజలు విశ్వసిస్తారు. ఇన్నిరకాల ప్రయోజనాలున్న ఇప్పచెట్లు రోజురోజుకు స్మగర్ల చేతుల్లో నేలరాలుతున్న టేకు చెట్లతో పాటు ఇప్పచెట్లు నరికేస్తున్నారు. దీంతో క్రమంగా ఉపాధికి దూరమవుతున్నారు.
ఇప్పపువ్వులో ఎన్నెన్నో పోషకాలు..
అడవిలో లభించే ఇప్పపువ్వుల గింజల నుంచి తీసిన నూనెలో ఎన్నెన్నో పోషక విలువలు ఉన్నట్లు శాస్త్రీయంగా రూడీ అయింది. ఆదిలాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, కొమురంభీం జిల్లాల్లోని ఆయా మండలాల్లోని అడవుల్లో లభించే ఇప్పపువ్వుల పండ్లలో పోషక విలువల నివధికల ఆధారంగా భారతశాస్త్రీయ సాంకేతిక మంత్రిత్వశాఖ సహయంతో 1999లో నిర్వహించిన పరిశోధనల్లో ఎండిన ఇప్పపువ్వుల నుంచి పంచదార తయారుచేసి దీంతో జాము, కేకులు, చాక్లెట్లు తయారుచేసే విధానాన్ని కనిపెట్టారు. ఇప్పపువ్వు ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి మద్యమధ్యలో ఎండినవేప ఆకు పిచికారి చేస్తే ఎక్కువ కాలం నిల్వ ఉంటుందని తెలుసుకున్నారు. చిక్కుడు గింజలు, అలిచందలు కలిపి ఉడికించి అంబలి చేస్తారు. ఇప్పగింజల నుంచి తీసిన నూనెను దీపంగా వాడుతారు. గిరిజనులు కొంత మంది ఇప్పపువ్వును ఆహారంగానూ తీసు కుంటారు. ఇప్పపువ్వులో లభించే పోషకాలు పరిశీలిస్తే క్యాల్షియం 139.00, పాస్పర్‌ 137.00, ఫైబర్‌ 109.00, కార్బోహైడ్రేడ్స్‌ 68.00 మాయిశ్చర్‌ 11.66, ప్రోటీన్‌లు 6.67 శాతం ఉంటాయి.

అడవిపై హక్కు`ఆదివాసులదే’

రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్‌లో చేర్చిన ఈశాన్య రాష్ట్రాలయిన అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరామ్‌లాంటి రాష్ట్రాలలోని అడవిని నమ్ముకొని ఉన్న గిరిజన తెగలకు, దేశంలోని 6వ షెడ్యూల్‌లో లేని మిగతా దేశం మొత్తం మీద ఇతర రాష్ట్రాలలోని అడవిని నమ్ముకొని బతుకుతున్న అయిదవ షెడ్యూల్‌లోని ప్రజలందరికీ ఈ చట్టం వర్తిస్తుంది. ఈ చట్టంలోని కొన్ని సెక్షన్స్‌ ఆక్రమణదారులను తొలగించేందుకు స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేయగా, వాటిని దుర్వినియోగం చేస్తున్న ప్రభుత్వాధికారులు అడవి నుండి ప్రజలను తరిమివేసేందుకు పెద్ద కుట్రచేస్తూ రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, వాటి వెలుగులో వచ్చిన దేశ సర్వోన్నత న్యాయస్థానం(సుప్రీంకోర్టు), వివిధ రాష్ట్రాల హైకోర్టుల తీర్పులు, ఐదు, ఆరవ షెడ్యూల్ల స్ఫూర్తికి తిలోదకాలిచ్చి, బహుళజాతి సంస్థలకు, బడా పెట్టుబడిదారులకు అడవిని అప్పజెప్పేందుకు బృహత్‌ పథకాన్నే రచించాయి. -చిక్కుడు ప్రభాకర్‌
ఈదేశ మూలవాసులు ఆదివాసీలు. దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాలలో తరతరాలుగా అడవిలోనే జీవిస్తున్న 12 లక్షల ఆదివాసీలను, అడవి నుంచి ఖాళీ చేయించాలని ఫిబ్రవరి 13వ తేదీన దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. 2006 సంవత్సరంలో దేశ పార్లమెంటు ద్వారా చేసిన ఆదివాసీ అటవీ హక్కుల చట్టం-2006ను రద్దు చేయాలని, ఈ చట్టం ఆదివాసీలు అడవిలో నివసించేందుకు, వ్యవసాయం చేసుకునేందుకు, అలాగే వారితోపాటు జీవించే ఇతర నిరుపేద తెగలకు కూడా అడవి మీద హక్కు కల్పిస్తుందని, ఈ హక్కులు వన్యమృగాల రక్షణ చట్టం, 1972నిబంధనలకు, అభయారణ్యంలోని పులుల రక్షణ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నదని, ఈ చట్టాన్ని కొట్టివేయాలని ‘వైల్డ్‌ లైఫ్‌ ఫస్ట్‌’ అనే స్వచ్ఛందసంస్థతో పాటు ఇతర సంస్థలు 2009 సంవత్స రంలో సుప్రీంకోర్టులో ఒక పిటిషెన్‌ వేసాయి. ఈ రిట్‌ పిటీషన్‌ తరపున గత కొద్ది సంవత్సరాలుగా వాదనలు కొనసాగుతున్నాయి. అటవీ హక్కుల చట్టం-2006లోని సెక్షన్‌2(0) చాలా స్పష్టంగా, గత మూడు దశాబ్దాలుగా, 2005 సంవత్సరం డిసెంబర్‌ కంటే ముందుగా ఎవరైనా అడవిలో బతుకు తున్నట్లయితే, వారికి అడవిలో నివసించే హక్కు, అలాగే వారు సేద్యం చేసుకుంటున్న భూమి మీద సర్వహక్కులు కల్పించాలని చెబుతున్నది. అలాగే సెక్షన్‌ 3(1)(ఎ) చాలా స్పష్టంగా ఈ విధంగా చెబుతున్నది. అడవిలో భూమి, ఇల్లు కలిగి ఉండి అక్కడే జీవిస్తున్న ఆదివాసులకు అడవిపై హక్కు ఉన్నది. ఈ హక్కులు కూడా తరతరాలుగా వారు జీవిస్తున్న సాంఘిక, సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ స్థోమతలకు ఎటువంటి భంగం కలిగించకుండా హక్కులను గుర్తించాల్సిందిగా చెబుతున్నది. అలా కాకుండా అడవిలోకి ఆక్రమణదారులుగా వస్తున్నవారికి ఎటువంటి హక్కులు కల్పించరాదని కూడా చెబుతున్నది. అయితే తరత రాలుగా అడవిని నమ్ముకొని, అడవిలోనే జీవిస్తున్న వేలాది తెగల జీవితాలు రోజురోజుకు దిగజారుతున్నాయి. రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్‌లో చేర్చిన ఈశాన్య రాష్ట్రాలయిన అస్సాం, మేఘాలయ,త్రిపుర,మిజోరామ్‌లాంటి రాష్ట్రాలలోని అడవిని నమ్ముకొని ఉన్న గిరిజన తెగలకు, దేశంలోని 6వ షెడ్యూల్‌లో లేని మిగతా దేశం మొత్తం మీద ఇతర రాష్ట్రాలలోని అడవిని నమ్ముకొని బతుకుతున్న అయిదవ షెడ్యూల్‌లోని ప్రజలందరికీ ఈ చట్టం వర్తిస్తుంది. ఈ చట్టంలోని కొన్ని సెక్షన్స్‌ ఆక్రమణ దారులను తొలగించేందుకు స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేయగా, వాటిని దుర్వినియోగం చేస్తున్న ప్రభుత్వాధికారులు అడవి నుండి ప్రజలను తరిమివేసేందుకు పెద్ద కుట్రచేస్తూ రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, వాటి వెలుగులో వచ్చిన దేశ సర్వోన్నత న్యాయస్థానం(సుప్రీంకోర్టు), వివిధ రాష్ట్రాల హైకోర్టుల తీర్పులు, ఐదు, ఆరవ షెడ్యూల్ల స్ఫూర్తికి తిలోదకాలిచ్చి, బహుళజాతి సంస్థలకు, బడా పెట్టుబడిదారులకు అడవిని అప్పజెప్పేందుకు బృహత్‌ పథకాన్నే రచించాయి. ఇందులో భాగంగానే రాజ్యాంగాన్ని, దానికి అనుగుణంగా వచ్చిన భూమి మీద అటవీ ప్రజలకు కలిగిన హక్కులను, ఆయా చట్టాల్లోని సారాన్ని సంపూర్ణంగా హరించివేస్తూ అడవిలో బతికే ఈ దేశమూలవాసులకు తీరని అన్యాయం చేస్తున్నారు. నలభై లక్షల ధరఖాస్తులలో 12 లక్షల ధరఖాస్తులు ఎందుకు ఆమోదించలేదు? దానికి గల కారణాలు ఏమిటి? ఒకసారి అవి ఆమోదించి చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా వారికి దక్కాల్సిన హక్కులు ఎందుకు కల్పించలేదు? ఒకవేళ అవి తిరస్కరణకు గురైతే అవి చట్టబద్దంగానే తిరస్కరణకు గురైనాయా? అలా చట్టబద్దంగా తిరస్కరణకు గురికాగానే వారికి చట్టబద్దంగా పై ఫోరాలలో అప్పీల్‌ చేసుకునే అవకాశం ఇచ్చారా? 1996 సంవత్సరంలో దేశ పార్లమెంటు చేసిన పంచాయత్‌ ఎక్స్‌టెన్షన్‌ షెడ్యూల్‌ ఏరియా చట్టం(పెసా)లోని నిబంధనలను వీరి ధరఖాస్తు తిరస్కరణలకు వర్తింపచేశారా? ఆదివాసీలకు, అడవిలో జీవించే ప్రజలందరికి రాజ్యాంగం కల్పించిన రక్షణలు, వాటి వెలుగులో వచ్చిన దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పులతో పాటు, రాజ్యాంగ మౌలిక స్వరూపమైన, ఏ వ్యక్తికైనా సగర్వంగా సంపూర్ణ ఆరోగ్య జీవితం కల్పించాలని ఇచ్చిన తీర్పులన్ని ఆదివాసీ, అడవిలో బతికే వారందరికి వర్తిస్తాయి. కాని, ఇవేమీ పట్టించుకోకుండా దేశ సర్వోన్నత న్యాయస్థానంలో ముగ్గురు జడ్జీలు కలిగిన ధర్మాసనం ఇచ్చిన తీర్పు, 13 మంది జడ్జీలతో కూడిన ధర్మాసనం ఇచ్చిన తీర్పు కేశవానంద భారతి వర్సెస్‌ కేరళ నుంచి మొదలుకొని ఐదుగురు జడ్జీలు కలిగిన రాజ్యాంగ ధర్మాసనాలు వివిధ సందర్భాలలో ఇచ్చిన తీర్పులయిన, డి.టి.సి వర్సెస్‌ మజ్దూర్‌ కాంగ్రెస్‌, బంధుముక్తి మోర్చా వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా(1984), ఓల్గా తెల్లీస్‌ వర్సెస్‌ ముంబాయి మున్సిపల్‌ కార్పోరేషన్‌, సుభాష్‌కుమార్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ బీహార్‌, సి.ఇ.ఎస్‌.సి వర్సెస్‌ యన్‌.సి.బోస్‌ లాంటి ఎన్నో తీర్పులను ఆధారం చేసుకొని 1997 సంవత్సరంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం సమతరవి కేసులో విస్తృత ధర్మాసనం అడవిపై ఆదివాసుల సర్వ హక్కులను గుర్తించింది. ఈ తీర్పులన్నింటితోపాటు సమతరవి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ తీర్పును కూడా విస్త ృత దర్మాసనం నియమగిరి పర్వతాలలోని మైనింగ్‌ విషయంలో ఒరిస్సా మైనింగ్‌ కార్పోరేషన్‌ వేసిన కేసులో 2013 సంవత్సరంలో సమతరవి తీర్పును ఎత్తిపడుతూ, ఇదే విస్త ృత ధర్మాసనం అడవిలోని ఆదివాసుల, ఇతర గిరిజన, గిరిజనేతర ప్రజల సర్వహక్కులను ముఖ్యంగా జల్‌, జంగల్‌, జమీన్‌లను ధృవపరిచింది. అయితే విస్తృత ధర్మాసనం పై తీర్పులన్నింటిని పరిగణలోకి తీసుకోకుండా కనీసం కేంద్ర ప్రభుత్వం, కేంద్ర గిరిజన మంత్రిత్వశాఖ తమ ప్రమాణపత్రాలు దాఖలు చేయకుండానే, కేవలం అటవీ మంత్రిత్వశాఖ, వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ఉన్నత, ముఖ్య కార్యదర్శులు సమర్పించిన తప్పుడు ప్రమాణ పత్రాల ఆధారంగా రాజ్యాంగంలోని మౌలిక స్వరూపమైన జీవించే హక్కు, ఐదవ, ఆరవ షెడ్యూల్లు వాటి ఆధారంగా వచ్చిన వివిధ చట్టాలు, తమ సొంత తీర్పులకు భిన్నంగా రాసిన సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకించాల్సిన విశాల సమాజం, ఆదివాసీ, గిరిజన, హరిజన, బడుగు, బలహీనవర్గాల సామాజిక శక్తులవారు కూడా నోరు మెదపకపోవడం అత్యంత విషాదం. ఇటువంటి నిశ్శబ్ద పరిస్థితిని నా నాలుగు దశాబ్దాల ప్రజాజీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఈ రోజు కేవలం 12 లక్షల ఆదివాసులను అడవి నుంచి పంపే తీర్పుతో మొదలయ్యే ఈ దుర్మార్గ ప్రక్రియ రేపు మొత్తం దేశంలోని 10 నుంచి 12కోట్ల వరకున్న ప్రజానీకాన్ని తరిమివేసి, బహుళజాతి సంస్థలకు, దేశీయ బడా పెట్టుబడిదారులకు, వారి దళారులకు అడవిని అప్ప జెప్పేందుకు జరుగుతున్న బృహత్‌ పథ కంగా, సమాజంలోని ప్రగతిశీలశక్తులన్నీ గుర్తించాలి.

డేటా వార్‌లో ఓటర్లే బలిపశువులా?

ఇందులో టిడిపి ఇరకాటం, టిఆర్‌ఎస్‌ చెలగాటం, వైసీపీ బులపాటం దాచేస్తే దాగేవి కావు. ఎవరెవరి వ్యూహ ప్రతి వ్యూహాలు ఎలా వున్నా రెండు ప్రధాన పార్టీలు పోటా పోటీగా లక్షల ఓట్లు గల్లంతు చేస్తే సగటు ఓటరు సంరక్షణెలా అన్నది కీలక ప్రశ్న. విధానాలతో విశ్వాసం పొంది ఓట్లు వేయించుకోవాలి గాని మూకు మ్మడి తొలగింపులు ఆందోళనకరం. అనుమా నాస్పదంగా మారిన ఈ డేటా వార్‌ కపట నాటకంలో పాత్రధా రులు, సూత్రధారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఓటర్ల న్యాయమైన హక్కుల పరిరక్షణ తక్షణ కర్తవ్యంగా తీసుకోవాలి. ఎన్నికల సంఘం కుంభకర్ణ నిద్ర మానాలి. అంతిమంగా ప్రజలు తీర్పు చెప్పే సమయం కూడా ఎంతో దూరం లేదు. ఈలోగా కుట్రలు కుత్సితాలతో, కుళ్లు కుతంత్రాలతో ఏదో సాధించేద్దామని ఎవరనుకున్నా భంగపాటు తప్పదు. ఎందుకంటే ప్రజలు కేవలం కంప్యూటర్‌ డేటా కాదు.
ఎక్కడో మునిగి ఎక్కడో తేలినట్టు ఎ.పి రాజకీయాల్లో టిడిపి-వైసిపి-టిఆర్‌ఎస్‌ వైరం చౌర్యం అంచుల వరకూ వెళ్లింది. నవ రత్నాలని ఒకరు, నవీక ృత పథకాలతో మరొకరు గెలిచేశామని ఇరు పార్టీలూ చేసిన హడావుడి వెనక్కు పోయి పరస్పరం దొంగతనం నిందారోపణలు మార్మోగుతున్నాయి. ఇరు పక్షాల పోల్‌ మేనేజిమెంట్‌ పొలిటికల్‌ మార్కెటింగ్‌ క్రీడల్లో ప్రజలు లేదా ఓటర్లు కేవలం డేటాగా మారిపోయిన దుస్థితి దాపురించింది. ఈ రెండు పార్టీలకూ లేదా వారి వారి మిత్రులకూ సంబంధించిన వివాదాన్ని రెండు తెలుగు రాష్ట్రాల పోలీసు తగాదాగా చూపించే ప్రయత్నాలు కూడా ఉధ ృతంగానే సాగుతున్నాయి. లక్షల ఓట్ల తొలగింపు, ఓటర్ల ప్రభుత్వ డేటా దొంగిలింపు వంటి తీవ్రమైన ఫిర్యాదులు భారీగా వినిపిస్తున్నా ఎ.పి, తెలంగాణ పోలీసులు, రాజకీయ వేత్తలు బాహాటంగా తిట్టిపోసు కుంటున్నా ఎన్నికల సంఘం నిమ్మకు నీరెత్తినట్టు వుండిపోయింది. అంతర్రాష్ట్ర వివాదంలాగా మారిన ఈ ప్రతిష్టంభన లో కేంద్రం చోద్యం చూస్తున్నది. తాజాగా ఏపి సిఎం ఇచ్చిన అధికారిక వివరణలోనూ రాజకీయ ఆరోపణలు, ఆక్రోశాలు తప్ప సమగ్ర సమాధానాలు, సంత ృప్తికరమైన సమాచారాలు లేవు.
ఐటి గ్రిడ్‌ వ్యవహారం : ఎ.పి ప్రభుత్వ ఔట్‌ సోర్సింగ్‌ సంస్థ బ్లూ ఫ్రాగ్‌ (విశాఖ) టిడిపి ఐటి ప్రొవైడర్‌ ‘ఐటి గ్రిడ్స్‌’ (హైదరాబాద్‌) కేంద్రంగా ఈ వివాదం మొదలైంది. మార్చి మూడవ తేదీ అర్థరాత్రి హైదరాబాద్‌ అయ్యప్ప సొసైటీ కాలనీలో ఐటి గ్రిడ్స్‌ కంపెనీలో పోలీసులు ప్రవేశించారు. ఓటర్లను తొలగించే ప్రక్రియ కోసం ఎ.పి ప్రభుత్వ డేటా అక్కడ దుర్వినియోగం అవుతున్నట్టు లోకేశ్వరరెడ్డి అనే వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు వచ్చినట్టు చెప్పారు. నలుగురు సిబ్భందిని తీసుకువెళ్లారు. ఇంతలో ఎ.పి పోలీసులు లోకేశ్వరరెడ్డి ఇంటికి చేరుకున్నారు. తమ సిబ్బంది ఆచూకీ తెలియలేదని ‘ఐటి గ్రిడ్స్‌’ యజమాని అశోక్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వచ్చామనడంతో ఉభయ పోలీసుల మధ్య వివాదం నడిచింది. తెలంగాణ హైకోర్టులోనూ అశోక్‌ హేబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేయడంతో కోర్టు ఆ నలుగురిని హాజరు పర్చాలని ఆదేశించింది. పోలీసులు ఖాళీ కాగితాలపై విఆర్‌వోల సంతకాలు తీసుకోవడం ఏమిటని అక్షింతలు వేసింది. ఆ నలుగురు సిబ్బందిని సాక్షులుగా తీసుకున్నామే గాని అరెస్టు చేయలేదని వివరణ ఇచ్చిన పోలీసులు మరుసటి రోజు తీసుకురావడంతో కోర్టు పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఈలోగా ఎ.పి మంత్రి లోకేశ్‌, మరికొందరు తమ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ‘సేవామిత్ర’ అనే యాప్‌ తయారు చేస్తున్న ‘ఐటి గ్రిడ్స్‌’పై దాడి చేసి తెలంగాణ పోలీసులు డిస్క్‌లు, డేటా అపహరించుకుపోయారని ఆరోపించారు. హైదరాబాద్‌లో నివసించే టిడిపి వారిని వ్యాపారవేత్తలను భయభ్రాంతులను చేసేందుకు టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం మోడీ దర్శకత్వంలో వైసీపీతో కుమ్మక్కయిందని వారు ఆరోపించారు. ఇక ప్రభుత్వ డేటాను ఉపయోగించి ప్రతిపక్ష ఓటర్లను తొలగించేందుకు ప్రభావితం చేసేందుకు పెద్ద కుట్ర జరిగిందని వైసీపీ ఆరోపించింది. ఫిర్యాదు వస్తే పోలీసులు వెళ్లారు గాని ఏపి డేటాతో మాకేం అవసరమని టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసు తరహాలో చంద్రబాబును, లోకేశ్‌ను అవహేళన చేస్తూ మాట్లాడారు. వైసీపీ నేతలు టిడిపి డేటా చౌర్యం దొరికి పోయిందని ధ్వజమెత్తారు. సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సజ్జనార్‌ డేటా చౌర్యంపై దర్యాప్తు చేస్తున్నామని అవసరమైతే ఎ.పి ప్రభుత్వానికి కూడా నోటీసు ఇస్తామని ప్రకటించారు. అయితే ‘సాధికార మిత్ర’తో సహా సర్కారు పథకాలకు సంబంధించిన సమాచారం సురక్షితంగా వుందని ఎ.పి అధికారి ఒకరు ప్రకటించారు. తమ పార్టీకి సంబంధించిన సేవామిత్ర యాప్‌లో డేటా దొంగిలించి వైసీపీకి ఇచ్చేందుకు టిఆర్‌ఎస్‌ కుట్ర పన్నిందని టిడిపి ఎదురుదాడి చేసింది. అశోక్‌ తమ సంరక్షణలో వున్నారని కూడా ఆ పార్టీ నేత ఒకరు వెల్లడిరచారు. మన పార్టీపై ఇంత దాడి జరుగుతుంటే మీరు మంత్రులుగా గాక టిడిపి నేతలుగా మాట్లాడ్డం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహించినట్టు మీడియా రాసింది.
ఎప్పటి నుంచో ఆరోపణలు, అరెస్టులు : అరెస్టులు, ఆరోపణలు ఇప్పుడు భగ్గుమన్నాయి గాని ఈ ప్రహసనం చాలా కాలం కిందటే మొదలైంది. ఏపిలో 59 లక్షలకు పైగా దొంగ ఓట్లు చేర్పించినట్టు ఆరు మాసాల కిందటే వైసీపీ ఆరోపించింది. ఫిబ్రవరి 4న జగన్‌ ఢల్లీిలో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి వచ్చారు. అధికార పార్టీ దీనిపై మాట్లాడలేదు (పైగా టిడిపి ఓట్లకు డబ్బు ఇస్తే తీసుకోమని అన్నందుకు జగన్‌ ఓటు హక్కు రద్దు చేయాలని టిడిపి లీగల్‌ సెల్‌ వినతి పత్రం సమర్పించింది). రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య మూడున్నర కోట్లు అయితే అందులో దాదాపు 60 లక్షలు బూటకం అనడం అతిశయోక్తిగా వుందనే వ్యాఖ్యలు కూడా వచ్చాయి. అలాగే గ్రామాలలో సర్వేలంటూ జరిపి ప్రతిపక్ష ఓటర్ల సమాచారం తెలుసుకుని తొలగిస్తున్నారని వైసీపీ స్థానిక నేతలు అడ్డుపడటం వివాదానికి దారి తీసి అరెస్టులు కేసుల వరకూ వెళ్లింది. చిత్తూరు జిల్లా వంటి చోట్ల పోటా పోటీ ధర్నాలు జరిగాయి. అక్రమంగా ఓట్ల తొలగింపు జరిగిందని ఫిర్యాదు చేస్తే పోలీసులు బెదిరించిన ఘటనలు కూడా వెల్లడైనాయి. ఇంత జరుగుతున్నా ఎన్నికల సంఘం ఏ మాత్రం స్పందించలేదు. జగన్‌ ఫిర్యాదుల పైనా అధికారికంగా వ్యాఖ్యానించలేదు. వివాదం బాగా ముదిరాకనే ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదీ ఓట్ల తొలగింపు సులభం కాదని మూడు దశలు దాటాలని చెప్పారు. ఓట్ల తొలగింపును కోరే ఫారం-7 దరఖాస్తులు తమకు లక్షల సంఖ్యలో వస్తే పరిశీలిస్తున్నామని తెలిపారు. ఇంతలోనే హైదరా బాద్‌లో ఐటి గ్రిడ్‌పై దాడులు సంభవించాయి. డేటావార్‌ మొదలైంది.
ఇద్దరూ ఇద్దరే! : ఈ వార్‌ మొదలైన మరు రోజునే జగన్‌ నెల్లూరులో మాట్లాడుతూ తమ చిన్నాయన వివేకానందరెడ్డితో సహా లక్షల మంది ఓట్లను తొలగించినట్టు ఆరోపించారు. దొంగఓట్ల తొలగింపు కోసం తమ పార్టీ 8 లక్షల ఫారాలు సమర్పించిం దన్నారు. గవర్నర్‌కూ ఫిర్యాదు చేశారు. ‘అసలు మీ ఫిర్యాదు ఓట్ల తొలగింపు అయితే…మళ్లీ తొలగింపు కోసమే అన్ని లక్షల దరఖాస్తులు సమర్పించడం వైరుధ్యభరితం కాదా!’ అని నేను టీవీ చర్చల్లో అడిగాను. రెండు ప్రధాన పార్టీల మధ్య నడుస్తున్న ఈ ప్రహసనంలో ఏదో లోగుట్టు వుందని మాత్రం స్పష్టమై పోయింది. ఆ నాటకం ఏమిటో తేలాలని ఓట్ల జాబితా సక్రమంగా వుండేలా చూడాలని జనసేన -వామపక్షాలు కోరాయి. కాని ఎన్నికల సంఘం ఖండిరచడం తప్ప కదిలింది లేదు. దాంతో ‘అర్హులందరికీ ఓటు హక్కు’ అనే రాజ్యాంగ మౌలిక సూత్రం పరిరక్షణ వెనక్కుపోయి టిడిపి, వైసిపి, టిఆర్‌ఎస్‌ రాజకీయాలే ప్రధానమై డేటా వార్‌ను ఈ స్థితికి తెచ్చాయి. వైసిపి ఎం.పి విజయ సాయిరెడ్డి ఫిర్యాదు పత్రాలు చూపిస్తూ ‘ఇది బాహుబలిని మించిన కుట్ర’ అని ఆగ్రహిస్తున్న చంద్రబాబు నాయుడు ఎన్నికల సంఘానికి ఆయన చేసిన ఫిర్యాదులను ఎందుకు ముందే పట్టించుకోలేదు? అమెజాన్‌ క్లౌడ్‌లో ఈ డేటా పొందుపర్చడంపై సమాధానమేమిటి?
పొంతనలేని ప్రభుత్వాల తీరు : వార్‌ మొదలైన తర్వాత కూడా టిడిపి నాయకత్వం తడబాటుకు గురైంది. డేటా మాదైనప్పుడు తెలంగాణ పోలీసులు ఎందుకు వచ్చారంటూ మొదట్లో విమర్శ చేశారు. ఐటి గ్రిడ్స్‌ హైదరాబాదులో వుంది గనక ఈ ఆరోపణ నిలవలేదు. తామే వ్యతిరేక కూటమి వుందని ఆరోపించే చోట ఎందుకు వుంచారనే ప్రశ్న మరొకటి. రిజిస్టర్‌ కాని కంపెనీకి ఇంత ముఖ్యమైన డేటా అప్పగించడం కూడా విడ్డూరమే. ఒకే సంస్థకు ప్రభుత్వ యాప్‌ పార్టీ యాప్‌ కూడా కట్టబెట్టడం ఆరోపణలు పెంచుతుంది. పైగా ప్రభుత్వ డేటా పదిలంగా వుందని, టిడిపి యాప్‌లో సమాచారంలో రహస్యం లేదని చెబుతూ వచ్చారు. ప్రపంచమంతటా బిగ్‌ డేటా చౌర్యాలు పెరిగిపోతున్న కాలంలో అలాటి అలసత్వానికి తావే లేదు. జరిగింది డేటా సేకరణా బహుకరణా తస్కరణా అన్నది తేలవలసిందే. ఐటి గ్రిడ్స్‌పై తెలంగాణ పోలీసులు 23నే దాడి చేసి డేటా తీసుకున్నారంటున్న ఎ.పి ప్రభుత్వం అరెస్టుల విషయం రచ్చకెక్కేవరకూ కిమ్మనకపోవడానికి కారణాలు అనూహ్యం. మార్చి 4 తర్వాత కూడా ఐటి గ్రిడ్‌ తరపున హేబియస్‌ కార్పస్‌ వేశారే గాని తమ డేటా గురించి టిడిపి కేసు వేయలేదు. వైసీపీ టిఆర్‌ఎస్‌ బిజెపిలు జట్టు కట్టాయంటే దాన్ని ఎదుర్కోవడం టిడిపి రాజకీయ సమస్య తప్ప ఎ.పి,తెలంగాణ ప్రజల వివాదం కాబోదు. ఇటీవల ఎ.పికి చెందిన చిగురుపాటి జయరాం హత్య కేసు సందర్భంలో ఒక దశ తర్వాత ఇరు రాష్ట్రాల పోలీసులు సహకరించుకోవడం చూశాం. మరి ఏ.పికి సంబంధించిన డేటా సమస్యలో తెలంగాణ పోలీసులు ఎపి ప్రభుత్వానికి ఎందుకు తెలియజేయలేదన్న ప్రశ్న తలెత్తుతుంది. అందుకే వారు తెలంగాణ డేటా కూడా పోయిందని ఆలస్యంగా చెప్పడం మొదలు పెట్టారు. కేసుపై మాట్లాడే పోలీసు అధికారులు కూడా ఇప్పటికి ముగ్గురు మారారు. మాట్లాడిన ముగ్గురిలోనూ కొన్ని వైరుధ్యాలున్నాయి. కనుక ఇదంతా ఇరువైపులా పోటాపోటీ రాజకీయ ప్రయోజనాల వేట మాత్రమేనన్నది స్పష్టం. ఇందులో టిడిపి ఇరకాటం, టిఆర్‌ఎస్‌ చెలగాటం, వైసీపీ బులపాటం దాచేస్తే దాగేవి కావు. ఎవరెవరి వ్యూహ ప్రతివ్యూహాలు ఎలా వున్నా రెండు ప్రధాన పార్టీలు పోటా పోటీగా లక్షల ఓట్లు గల్లంతు చేస్తే సగటు ఓటరు సంరక్షణెలా అన్నది కీలక ప్రశ్న. విధానాలతో విశ్వాసం పొంది ఓట్లు వేయించుకోవాలి గాని మూకుమ్మడి తొలగింపులు ఆందోళనకరం. గత ఏడాది ఇలాగే భారీగా ఓట్ల తొలగింపు సమస్య తెలంగాణ ఎన్నికల్లోనూ వస్తే హైకోర్టు జోక్యం చేసుకుంది. అయినా ఫలితం లేకపోయింది. ఇప్పుడు ఎ.పి లోనూ న్యాయపరమైన చర్యలు తీసుకోవాలే గాని రాజకీయ రచ్చ నిరర్థకం. అనర్థకం. డేటా సురక్షితంగా వుందా లేదా అన్నది తెలంగాణ పోలీసుల తుది నివేదిక తర్వాతనే మాట్లాడాల్సిన విషయం. ఒకవైపు అధికార డేటా పోలేదంటూనే ఎ.పి ప్రభుత్వం అతిగా కంగారు పడటం ఆశర్యకరం. తమ పార్టీ డేటా పోయిందని టిడిపి నాయకులూ పరువు పోయిందని ఎ.పి మంత్రులూ రాష్ట్ర పోలీసులకు, కలెక్టర్లకు ఫిర్యాదులు చేయడం రాష్ట్రాల మధ్య మధ్య వివాదానికే తప్ప పరిష్కారానికి దోవ చూపదు. ఎన్నికల సంఘం ముందు, ఉన్నత న్యాయస్థానాల ఎదుటు తేలాల్సిన సమస్యలివి. అన్ని వైపులా అనుమానాస్పదంగా మారిన ఈ డేటా వార్‌ కపట నాటకంలో పాత్రధారులు, సూత్రధారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఓటర్ల న్యాయమైన హక్కుల పరిరక్షణ తక్షణ కర్తవ్యంగా తీసుకోవాలి. ఎన్నికల సంఘం కుంభకర్ణ నిద్ర మానాలి. అంతిమంగా ప్రజలు తీర్పు చెప్పే సమయం కూడా ఎంతో దూరం లేదు. ఈలోగా కుట్రలు కుత్సితాలతో, కుళ్లు కుతంత్రాలతో ఏదో సాధించేద్దామని ఎవరనుకున్నా భంగపాటు తప్పదు. ఎందుకంటే ప్రజలు కేవలం కంప్యూటర్‌ డేటా కాదు. – తెలకపల్లి రవి

చంద్రన్నో..జగనన్నో..కాదు..ప్రజల పాలన కావాలి

‘‘ చంద్రన్నో, జగనన్నో కాదు.. ప్రజల పాలన కావాలి. ఉత్తరాంధ్ర వెనుకబాటు తనాన్ని పట్టించు కోకుండా నిర్లక్ష్యం చేయడంలో ఇటు తెలుగుదేశం, అటు వైఎస్సార్‌ కాంగ్రెస్‌-రెండూ ఒక దానితో ఒకటి పోటీ పడుతున్నాయి. విభజన హామీల అమలును గాలికొది లేసిన బిజెపిని నాలుగేళ్లు టిడిపి అంటకాగితే ప్రస్తుతం వైఎస్సార్‌ సిపి అదే బాటలో నడుస్తోంది.’’- ఎ అజ శర్మ
రాష్ట్ర విభజన జరిగి ఐదేళ్లయినా ఇంకా విభజన చట్టంలోని అనేక అంశాలు సక్రమ అమలుకు నోచుకోవడం లేదు. పోలవరం జాతీయ ప్రాజెక్టు. చట్టప్రకారం కేంద్ర ప్రభుత్వమే ఈప్రాజెక్టును నిర్మించాలి. ఇతర రాష్ట్రాల అభ్యంతరాలను పరిష్కరించాలి. వివిధ శాఖల అనుమతులు కూడా కేంద్రమే తీసుకోవాలి. దీనినిర్మాణం, నిర్మాణానికి పూర్తి నిధులూ భరించాలి. కానీ ఆచరణలో ఇవేవీ అమలు కావడం లేదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఒక నినాదం కిందే మిగిలిపోయింది. వెనుకబడ్డ ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ నామమాత్రంగా మారడమేకాక అబివృద్ధి ఆవగింజంత కూడా లేదనడం అతిశ యోక్తి ఎంతమాత్రం కాదు. విద్యా సంస్థల ఏర్పాటు, నిర్మాణం నత్తనడకన నడుస్తు న్నాయి. ఎయిమ్స్‌కు నిధుల కేటాయింపు అంతంత మాత్రమే. కడప ఉక్కు ఫ్యాక్టరీ, రామాయపట్నం పోర్టు సముద్రంలో కలిసి పోయాయి. ప్రత్యేక రైల్వే జోన్‌ ఎన్నికల జిమ్మి క్కుగా ఇచ్చి శతాబ్దం పైగా చరిత్ర ఉన్న వాల్తేరు డివిజన్‌ను ఎత్తివేశారు. మొత్తంగా చూస్తే విభజన చట్టాన్ని, ఇచ్చిన హామీలను మోడీ ప్రభుత్వం ఒక ప్రహసనంలా మార్చి వేసింది. ఉత్తరాంధ్ర మరింత అన్యాయానికి గురయ్యింది. విభజన చట్టం అమలులోకి వచ్చి ఐదు సంవత్సరాల తర్వాత కూడా చట్టంలోని గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రకటనలే తప్ప, అవసరమైన కనీస చట్టపర చర్యలు కూడా మోడీ ప్రభుత్వం చేపట్టలేదు. ఫలితంగా ఇంకా తాత్కాలిక తరగతులు కూడా ప్రారంభం కాలేదు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ ఏర్పాటు చేయాలని ప్రజల చిరకాల కోరిక. దీనికై పెద్ద ఉద్యమమే జరిగింది. విశాఖనగరంలో మెట్రోరైలు నిర్మించాలని చట్టంలోఉన్నా దాని గురించి కేంద్రం ప్రస్తావనే లేదు. తమని గెలిపిస్తే రైల్వే జోన్‌తో సహా, ఉత్తరాంధ్ర అభివృద్ధి, విద్యా సంస్థలకు నిధుల కేటాయిం పుతో సహా అన్నివిధాలా అండగా ఉంటామని స్వయంగా మోడి గారే విశాఖ ఎన్నికలసభలో వాగ్ధానం చేశారు. వీటిని నమ్మి విశాఖ నుండి ఒక బిజెపి ఎంపిని, ఒక ఎమ్మెల్యేను ప్రజలు ఎన్నుకున్నారు. తీరా గెలిచిన తరువాత ఎలా తూట్లు పొడవాలనే చూశారు తప్ప వాటిలో ఒక్క దానిని కూడా చిత్తశుద్ధితో అమలు చేయలేదు సరికదా ప్రజలను ఇంకా మోసం చేయా లనే చూస్తున్నారు. ఉత్తరాంధ్రకు అభివృద్ధి ప్యాకేజీ కింద ముష్టి వేసినట్లు సంవత్స రానికి జిల్లాకు 50కోట్ల రూపాయల చొప్పున మూడు సంవ త్సరాలు ఇచ్చి తరువాత ఆపివేశారు. నాలగవ సంవత్సరం ఇచ్చిన నిధులు కూడా వెనక్కు తీసేసుకున్నారు. రైల్వే జోన్‌పై ఆఖరి ఘడియల వరకు తాత్సారం చేసి, చివరికి ప్రజలు ఛీ కొడతారనే భయంతో మాత్రమే, అక్కడ కూడా మోసకారితనంతోనే ఎవరికీ ఆమోదయోగ్యం కాని జోన్‌ ప్రకటించారు. ఇలామోడీ ప్రభుత్వం ఉత్తరాంధ్రకు తీరని అన్యాయం చేసింది. ఈ దుర్మార్గాన్ని ఎండగట్టి, ప్రజలను విశ్వాసంలోకి తీసుకుని కేంద్రపై ఒత్తిడి తేవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం ఆ పనిచేయక పోగా నాలుగేళ్ళు మోడీ ప్రభుత్వంతో అంటకాగింది. వారితో కలిసి కేంద్రంలో అధికారాన్ని పంచుకుంది. ఉత్తరాంధ్ర నుండి తెలుగు దేశం పార్టీ విజయనగరం ఎంపి కేంద్ర మంత్రిగా కొనసాగారు. అయినా ఎప్పుడూ ఉత్తరాంధ్ర సమస్యలను లేవనెత్తిందీ లేదు. పరిష్కరించిందీ లేదు. రాష్ట్ర అభివ ృద్ధి అంటే రాజధాని అభివృద్ధేననట్టు, పోలవరం ప్రాజెక్టేనన్నట్టు వ్యవహరించి చంద్రబాబు ఉత్తరాంధ్ర సమస్యలను నిర్లక్ష్యం చేశారు. ప్రభుత్వం ఎంత గొప్పలు చెప్పుకున్నా వాస్తవమేమిటంటే ఈ ఐదేళ్ళ కాలంలోనూ ఉత్తరాంధ్రకు ఒక్క చుక్క కూడా అదనంగా సాగు నీరు రాలేదు. ఫలితంగా ఉపాధి కోసం వలసలు ఈకాలంలో కూడా పెరుగుతూనే ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ సమస్యపై చంద్రబాబు ప్రభుత్వం ప్రకటనలే తప్ప చేసింది శూన్యం. విచిత్రమే మిటంటే ఈ జిల్లా నుండే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర మంత్రిగా ఉన్నా కిడ్నీ వ్యాధులతో వేలాది మంది ప్రాణాలు కోల్పోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం. ఉపాధి అవకాశాలు పెంచకుండా, ప్రత్యేక డిఎస్‌సి ప్రకటించకుండా, ఖాళీ పోస్టులను నింపకుండా అనేక మంది గిరిజన యువకులను గంజాయి దొంగలుగా మార్చి వేస్తోంది. పరిశ్రమలు, అభివృద్ధి పేరుతో వేలాది ఎకరాల భూమిని కార్పొరేటు సంస్థలకు ధారాదత్తం చేస్తోంది. విశాఖ నగరంలోని అత్యంత విలువైన భూములను అదానీలకు, షాపింగ్‌ మాల్సుకు కట్టబెడుతూ బ్రోకరులా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఉత్తరాంధ్రలో నేడు లక్షలాది ఎకరాల భూమి పరాయిపరమైంది. దేశంలోని అన్ని రాష్ట్రాలూ మా కొద్దు బాబోరు అని నిరాకరించిన అణు విద్యుత్‌ ప్లాంటును శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో ఏర్పాటుకు ప్రభుత్వం అక్కడి ప్రజల అభిష్టానికి భిన్నంగా నిర్ణయించింది. ఉత్తరాంధ్రకు ప్రకృతి వరమైన సముద్ర తీరాన్ని కలుషితం చేసే కాలుష్య కారక పరిశ్రమలకు విచ్చలవిడిగా అనుమతిస్తోంది. తీరప్రాంత రక్షణకున్న సిఆర్‌జెడ్‌ నిబంధనలు కేంద్ర ప్రభుత్వం మార్చివేస్తుంటే, వ్యతిరేకించవలసింది పోయిఉన్న కొద్ది పాటి రక్షణను కూడా రద్దు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పావులు కదుపుతోంది.రాష్ట్ర ప్రభుత్వ ఈదగాను ఎదుర్కొని, ప్రజలకు అండగా నిలవవలసిన ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఆబాధ్యతను నిర్వర్తిం చడంలో ఘోరంగా విఫలమైంది. ఉత్తరాంధ్ర ప్రజలు ఈపార్టీ ప్రజా ప్రతినిధులను గెలిపించి అసెంబ్లీకి పంపినా, ఉత్తరాంధ్ర ఒక్క సమస్యపై కూడా ఆందోళన చేయడం కాని ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం కాని చేసిన ఉదంతం ఒక్కటి కూడా లేకపోవడం పచ్చి మోసకారితనమే. అందుకే ద్రోహం చేసిన కేంద్ర ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట కూడా అనడం లేదు. ఉత్తరాంధ్ర విషయంలో తెలుగుదేశమూ, వైసిపి దొందూ దొందేనన్నట్టు వ్యవహరించాయనడానికి కొన్ని దృష్ట్యాంతాలు పరిశీలిద్దాం.
బాక్సైట్‌ మైనింగ్‌ : 1997లో చంద్రబాబు మైనింగ్‌ చేపడతానని ప్రకటించారు. ప్రజల ఉద్యమం ఫలితంగా వెనక్కి తగ్గారు. 2004లో రాజశేఖరరెడ్డి బాక్సైట్‌ మైనింగ్‌ మీద వేగంగా పావులు కదిపారు. ప్రజా ఉద్యమాలను దౌర్జన్యంగా అణచివేశారు. అప్పుడు బాక్సైట్‌ మైనింగ్‌ను వ్యతిరేకించిన చంద్రబాబు తాను అధికారంలోకి రాగానే తిరిగి మైనింగ్‌ చేపట్టడానికి జివో 97తెచ్చారు. ఇప్పటికీ రద్దు చేయలేదు. చంద్రబాబును ప్రతిఘటించవలసిన వైసిపి ఎమ్మెల్యేలిద్దరూ టిడిపి గూట్లో చేరారు. ఇప్పుడు జగన్‌ మళ్లీ రాజన్న రాజ్యం అంటున్నారు. బాక్సైట్‌ విషయంలో ఇద్దరికీ ఏంటి తేడా?
పంచ గ్రామాల భూసమస్య : చంద్రబాబు తెచ్చిన జివోను రద్దు చేసి ప్రజలకు న్యాయం చేస్తానని రాజశేఖరరెడ్డి హామీ ఇచ్చారు. 2009 వరకూ ఏమీ చేయలేదు. 2014ఎన్నికలలో చంద్రబాబు పంచ గ్రామా ల భూసమస్యను 100 రోజుల్లో పరిష్కరిస్తానన్నారు. ఎన్నికల ముందు 2019లో ఒక దుర్మార్గమైన జివో తెచ్చి తన మోసకారితనాన్ని బయట పెట్టుకున్నారు. ఇక జగన్‌ ఏనాడూ పంచగ్రామాల సమస్యను పట్టించు కోలేదు. దేవస్థానానికి అక్రమంగా భూమిని దఖలు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసే దమ్ము, నిజాయితీ ఇద్దరికీ లేదు.
గంగవరం : నిర్వాసిత మత్స్యకారులపై రాజశేఖరరెడ్డి కాల్పులు జరిపించారు. చంద్రబాబు పోర్టు యాజమాన్యానికి అంటకాగి నిర్వాసి తులకు ఉద్యోగాలివ్వకుండా నాటకమాడారు. మొత్తం మీద ‘చంద్రన్న పాలన’ అయినా, ‘రాజన్న రాజ్యం’ అయినా ఉత్తరాంధ్రకు జరిగిందీ, జరిగేదీ అన్యాయమూ,వంచనా,దగాయే తప్ప న్యాయం మాత్రం జరగదు. వీరిద్దరి వంచనకూ సరైన గుణపాఠం చెప్పేలా ఉత్తరాంధ్ర ప్రజలు తీర్పు ఇవ్వాలి. ఈప్రాంతంలో నికరంగా, నిజాయితీగా ప్రజల సమస్యలపైన,గిరిజనుల,మత్స్యకారుల సమస్యలపైన, అక్రమ మైనింగ్‌ పైన, కాలుష్యకారక పరిశ్రమల పైన పోరాడిరదీ, ప్రజలను జాగృతం చేసిందీ కమ్యూనిస్టులు. ప్రభుత్వ రంగ పరిశ్రమలను పరిరక్షించుకునే ఉద్యమంలో ముందున్నదీ కమ్యూనిస్టులే. ఈకమ్యూనిస్టులు జనసే నతో, బిఎస్పీతో కలిసి ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. ఈకూటమిని బలపరచడం ద్వారా ఉత్తరాంధ్రకు కొంతైనా న్యాయం జరిగేలా చేద్దాం.

ఎన్నికల కోలాహలం నిఘా పటిష్టం

ఏఫ్రిల్‌ 11న జరిగే పోలింగ్‌ సమయం మరింత దగ్గర పడుతుండటంతో పోలీసులు పటిష్టమైన బందోబస్తును సిద్ధంచేశారు. ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఖర్చుపై నిఘా బృందాలు నిఘా ఉంచాయి. అక్రమ మద్యం, డబ్బు పంపిణీ, ఓటర్లకు తాయిలాలు అనుమతి లేకుండా ప్రచార కార్యక్రమాలు నిర్వహించడంపై నిఘా బృందాలు కన్నెసి ఉంచాయి. ఎన్నికల ప్రచార ఘట్టం దగ్గర పడుతంఉడటంతో గ్రామాలు, పట్టణాల్లో అభ్యర్థులు సుడిగాలి పర్యటనలు చేస్తూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఎన్నికల నియమావళికి లోబడి ప్రవర్తిస్తున్నారా, సమావేశానికి ఎంత వెచ్చిస్తున్నారు అనే విషయాలను లెక్క తేల్చడానికి తనిఖీ బృందాలు వెంటాడుతున్నాయి. తాయి లాలపై ప్రత్యేక దృష్టి ఆయా పార్టీల అభ్య ర్థులు ఓటర్లకు తాయిలాల పంపిణీపై నిఘా బృందాలు ప్రత్యేకదృష్టి సారిం చాయి. డబ్బు, మద్యం పంపిణీపై ఓవైపు సివిల్‌ పోలీసులు, మరోవైపు ఎక్సైజ్‌శాఖ సిబ్బంది విస్త ృతంగా తనిఖీలు చేస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో వివిధ విభాగాలకు చెందిన 15వేల మంది పోలీసులు ఉండగా, మరో 10,000 మంది సెంట్రల్‌, స్టేట్‌ పారామిలటరీ బలగాలు రానున్నాయి. ఆరు ఫ్లయింగ్‌ స్వ్కాడ్‌ బృందాలు పనిచేస్తుండగా, అనుమా నస్పదమైన ప్రతి చోట పోస్టులను ఏర్పాటు చేశారు. ప్రతి వాహనాన్ని ఆపి విస్తృతంగా తనిఖీచేస్తున్నారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన నాటి నుంచి రూ.కోట్లాది రూపాయల నగదును పట్టుకున్నట్లు అధికారులు వెల్లడిరచారు.
సమస్యాత్మక గ్రామాల్లో అవగాహన రాష్ట్రంలో ఉన్న సమస్యాత్మక గ్రామాలపై ఆయా జిల్లాల ఎస్పీలు, నగర పోలీస్‌ కమిషనర్లు, ప్రత్యేక దృష్టి సారించారు. ఆయా గ్రామాల్లో ఏర్పాటుచేసి ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా యువత గొడవలకు వెళ్లకుండా వారిని చైతన్యం చేస్తున్నారు. ప్రత్యేకంగా పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నారు. ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా ఓటుహక్కును వినియోగించుకోవాలని ఓటర్లకు సూచిస్తున్నారు. అభ్యర్థుల సమావేశం, ప్రచారాలపై ఎస్పీ ఎప్పటికప్పుడు కిందస్థాయి అధికారుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. ఆయా జిల్లాలో ఉన్న పోలింగ్‌ కేంద్రాలువద్ద కూడా నిఘా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించారు. ఎస్పీ నేతృ త్వంలో పలు గ్రామాల్లో కార్డెన్‌సెర్చ్‌ నిర్వహిస్తూ అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బ్యాంకు లావాదేవీలపై నజర్‌ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బ్యాంకుల్లో వివిధ లావాదేవీలు జరిపే వారిపై ప్రత్యేక దృష్టి సారించారు. నామినేషన్ల పర్వం ముగి యడంతో ఓటర్లను ప్రలోభ పెట్టేం దుకు రాజకీయ పార్టీల నాయకులు వివిధ మార్గాల్లో ప్రయత్నాలు ఆరంభించారు. అభ్యర్థుల ఎత్తుగడలను అడ్డుకునేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు చేపట్టింది.ఖాతాల్లో ఒకేసారి నగదు జమకావడం, ఎక్కువ లావాదేవీలు నిర్వహించడం తదితర వాటిపై నిఘా ఉంచారు. రూ.50వేలు దాటితే పాన్‌కార్డు నంబర్‌ తప్పనిసరి అడుగుతున్నారు. ముఖ్యంగా రూ.లక్షలకు మించిన లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఆయా పార్టీలు డబ్బు సంచిలు కదలాడుతున్నాయి. ఎన్నికల బూత్‌ స్థాయి కన్వీనర్‌లకు చేరుతున్నాయి. నిఘా యంత్రాంగం దీనిపై దృష్టి కేంద్రీక రించారు. నిఘా కెమెరాలతో ఎప్పట్టికప్పుడు చిత్రీకరిస్తున్నారు. ముఖ్యంగా విశాఖపట్నం, రాజమండ్రి, కడప, కాకినాడ, కర్నూల్‌, గుంటూరు, విజయవాడ, మంగళగిరి వంటి ప్రాంతాల్లో క్షుణ్ణంగా తణిఖీలు చేస్తున్నఆరు. మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే ఓటర్లను చైతన్యవం తులను చేయడానికి సామాజిక సేవా బృందాలు పనిచేస్తున్నాయి. అలాగే సమస్యాత్మకమైన పోలింగ్‌ బూత్‌ల వద్ద ఘట్టి నిఘా ఏర్పాటు చేయడానికి ప్రణాళి కలు రూపొందించారు. యువత భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దు జిల్లాలో ఉన్న సమస్యాత్మక గ్రామాల్లో ఓటర్లకు అవగాహన కల్పించాం. ఓటర్లు ప్రలోభా లకు గురికాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఒకరి సమావేశాలు జరిగే సమయంలో మరొకరు అక్కడి వెళ్లి గొడవలు చేస్తే చర్యలు తప్పవు. ముఖ్యం గా యువత గొడవలకు దిగి వారి భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దు. డబ్బు, మద్యం పంపిణీ జరగకుండా చెక్‌పోస్టులు ఏర్పాటుచేశామని పోలీసులు పేర్కోన్నారు.

రసవత్తరం ఆంధ్రప్రదేశ్‌ రాజకీయం

‘‘ ఏపీలో ఏప్రిల్‌ 11న జరిగే ఎన్నికలు మునుపెన్నడు లేని విధంగా రాజకీయం వేడెక్కింది. ప్రధాన పార్టీలైన తెలుగుదేశం, వైఎస్సార్‌సీపీలు నువ్వా-నేనా అన్న చందంగా బరిలో ఉన్నాయి. జనసేన కూడా ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగుతుండటంతో ఓట్ల చీలిక ఖాయంగా కనిపిస్తోంది. అయితే.. ఈసారి రాష్ట్ర ప్రజలు ఏ అంశాన్ని ప్రాతిపదికగా తీసుకుని పార్టీలకు ఓట్లు వేస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది. ప్రధానంగా ఏపీ ఎన్నికల్లో ప్రత్యేక హోదాతో పాటు పలు అంశాలు కీలక పాత్ర పోషించే అవకాశం కనిపిస్తోంది ’’- గునపర్తి సైమన్‌
ఆంద్రప్రదేశ్‌ రాజకీయలు రోజుకోమలుపు తీసుకుంటున్నాయి. పొత్తులు, పొత్తులు లేకుండా వంటి అంశాలతో రోజుకో రంగు పులుము కుంటు న్నాయి. నిన్నటి వరకు అదికార టీడిపి ప్రతిపక్ష వైసీపి మద్య రసవత్తర పోరు ఉంటుందని భావించినప్పటికి మారిన రాజకీయ నేపథ్యంలో నాలుగు పార్టీలు తీవ్రస్థాయిలో తలపడనున్నాయి. ఏపీలో ఇప్పుడు చతుర్ముఖ పోటీ ఏపార్టీకి లాభం చేకూర్చుతుంది, ఎవరిని ముంచుతుంది అన్నచర్చ సాగుతోంది. బీజెపీ, వైసీపి పార్టీలు స్వతం త్య్రంగా తెరపైకి రావడం ప్రస్తుతం ఏపీలో నెలకొన్న రాజకీయ అంచ నాలను తలకిందలు చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో నువ్వా, నేనే అని పోటీపడ్డ టీడీపీ, వైసీపీలకు ఈ పరిస్థితులు కొంత సంకటంగా మారాయి.
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలతోపాటు శాసనసభకు ఎన్నికలు జరుగుతుండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతు న్నాయి. నామినేషన్‌ ప్రక్రియ ముగియడంతో ఎన్నికలబరిలో ఉన్న అభ్యర్థు లంతా ప్రచారంలో నిమగ్నమై ఉన్నారు. ఏప్రిల్‌ 11న తొలిదశలో పోలింగ్‌ జరుగుతుంది. పోలింగ్‌కు రెండురోజుల ముందే ప్రచారం నిలిచి పోనుంది. దీంతో ప్రధానపార్టీలైన టీడీపీ,వైసీపీ, జనసేన అధినేతలు సుడిగాలి ప్రచారాలు, కుల,మత రాజకీయాలు చేస్తున్నారు.ఈవిషయంలో చంద్రబాబు ఒకఅడుగు ముందేఉన్నారు. మరోవైపు వైసీపీ అధినేత జగన్‌, జనసేనాని పవన్‌ కూడా తన ఎన్నికల వ్యూహాన్ని ముమ్మరం చేశారు.
రసవత్తర రాజకీయాలు
ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో 2019కి ఓప్రత్యేకస్థానం ఉంది. పొత్తుల కుంపట్లు లేకుండానే ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల బరిలోకి దిగుతు న్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో కూడా అన్నిపార్టీలు ఒంటరిగా పోటీచేసిన దాఖలాలు లేవు. టీఆర్‌ఎస్‌ ఓసారి కాంగ్రెస్‌తో మరోసారి టీడీపీతో చేతులు కలిపి ఎన్నికలను ఎదుర్కొం టుంది. విభజన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో కూడా టీడీపీ, బీజేపీ కలిసి పోట ీచేశాయి, జనసేన వీరికి మద్దతిచ్చింది.
ఐదేళ్లు గడిచేలోగా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ముగ్గురు భాగస్వాములు మూడుదారులు చూసుకున్నారు. తెలం గాణలో టీడీపీ-కాంగ్రెస్‌ కలసి పోటీచేసినా, ఏపీలో ఆ సమీకరణాలు వర్కవుట్‌ కాలేదు. ఏపీలో కాంగ్రెస్‌, టీడీపీ పొత్తులేదని తేలడంతో ఇప్పుడు హస్తం పార్టీ కూడా 175 స్థానాలకు సై అంటోంది. టీడీపీ జనసేనను మచ్చిక చేసుకోవాలని చూస్తున్నా ప్రస్తుతానికి పవన్‌ లొంగడం లేదు. మొత్తమ్మీద ఈఏడాది అన్నిపార్టీలూ ఒంటరిగానే బరిలో దిగబోతున్నాయి.
కాంగ్రెస్‌, బీజేపీ, టీడీపీ, వైఎస్సార్సీపీ, జనసేన… విడివిడిగా 175 స్థానాలకు అభ్యర్థులను బరిలో దింపుతున్నాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులే ఈసారి 875మంది బీఫారాలతో రెడీగా ఉంటారు. వామ పక్షాలు జనసేనతోనే ఉంటాయి కాబట్టి వాటిని లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. పైగా వీళ్లది పొత్తు అని కూడా అనలేం. వామపక్షాల పరిస్థితి అలాంటిది. ఇక ఏపీ ఎన్నికల్లో వేలు పెడతామంటూ టీఆర్‌ఎస్‌ కవ్విస్తోంది. ఎంఐఎం తనకు పట్టున్న కొన్ని స్థానాల్లో అయినా పోటీ చేయడం గ్యారెంటీ. ప్రజా శాంతి పేరుతో హంగామా చేస్తున్న కేఏపాల్‌ కూడా అన్ని స్థానాల్లో పోటీచేసి ముఖ్యమంత్రిని అయిపోతా నంటున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆమ్‌ ఆద్మీ, లోక్‌సత్తా.. కూడా లైన్లో ఉన్నాయి. ఇండిపెండెంట్లుగా వెళ్లాలనుకునే అసంతృప్తులను ఆదుకోడానికి బీఎస్పీ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. అంటే ఈ ఏడాది ఏపీ ఎన్నికల్లో అభ్యర్థుల కోలాహలం ఓరేంజ్‌లో ఉత్కంఠభరితంగా ఉంది. పొత్తుల గోల తెగకపోయేసరికి ఏపీలో ఎవడిగోల వాడి దిగా మారింది. పొత్తులు లేని ఈఒంటరి పోరు ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీలుస్తుందని టీడీపీ ఆశ. మరోవైపు ఎలాంటి పొత్తుల అవసరం లేకుండానే అధికారంలోకి వస్తామనేది వైసీపీ నమ్మకం. మొత్తమ్మీద ఏపీలో ఈసారి ఎన్నికల రాజకీయం మరింత రంజుగా మారబోతోంది.
ఎన్నికల బరిలో బంధువర్గం
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్నది నానుడి. కానీ బంధువులు, బంధుత్వాలకు ఎప్పుడూ పెద్ద పీట వేస్తుంటారన్నది వాస్తవం. తాజాగా ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులను పరిశీలిస్తే ఈవిషయం స్పష్టం అవుతోంది.
దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ పోటీ పడుతున్న వారిలో సమీప బంధువుల సంఖ్య ఎక్కువగానే కనిపిస్తోంది.
నారా – నందమూరి
ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు బంధువులు పలువురు ఈ ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. చంద్రబాబు తనయుడు, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ప్రత్యక్ష పోరుకి తొలిసారిగా సిద్ధమయ్యారు. ఆయన గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.
టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌ తనయుడు, చంద్రబాబు వియ్యంకుడు కూడా అయిన నందమూరి బాలక ృష్ణ అనంతపురం జిల్లా హిందూపురం నుంచి రెండోసారి బరిలోకి దిగారు.
బాలక ృష్ణ చిన్నల్లుడు, నారా లోకేశ్‌ తోడల్లుడు భరత్‌ తొలిసారి విశాఖ ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్నారు.
కింజరాపు కుటుంబీకులకు పెద్ద పీట
ఇక ఉత్తరాంధ్ర జిల్లాలో టీడీపీ దివంగత నేత కింజరాపు ఎర్రం నాయుడు సమీప బంధువులు కూడా ఈసారి ఎన్నికల బరిలో ఉన్నారు. ఆయన వారసుడిగా కింజరాపు రామ్మోహన్‌ నాయుడు శ్రీకాకుళం ఎంపీగా మరోసారి పోటీ చేస్తున్నారు. ఎర్రంనాయుడి సోదరుడు, మంత్రి అచ్చెన్నాయుడు టెక్కలి అసెంబ్లీ స్థానం నుంచి మరోసారి రంగంలోకి దిగారు. ఎర్రంనాయుడి కుమార్తె, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కోడలు అదిరెడ్డి భవానీ తొలిసారిగా రాజమహేంద్రవరం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ పడుతున్నారు. రామ్మోహన్‌ నాయుడి మామ విశాఖజిల్లా పెందుర్తి సిట్టింగ్‌ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మరోసారి బరిలో దిగారు. కిమిడి కళా వెంకట్రావు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల స్థానంలో పోటీపడుతున్నారు. ఆయన సమీప బంధువు, మాజీ మంత్రి కిమిడి మృణాళిని తనయుడు కిమిడి నాగార్జున రాజకీయ అరంగేట్రం చేసి విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి పోటీపడుతున్నారు. ప్రస్తుతం తల్లి ప్రాతినిథ్యం వహిస్తున్న స్థానంలో ఈసారి కుమారుడికి అవకాశం కల్పించారు.
గజపతి కుటుంబం
కేంద్ర మాజీ మంత్రి, సీనియర్‌ నేత పూసపాటి అశోక్‌గజపతిరాజు సిట్టింగ్‌ సీటు విజయనగరం ఎంపీ స్థానానికి మళ్లీ పోటీ చేస్తు న్నారు. తొలిసారిగా అదే కుటుంబం నుంచి అశోక్‌ గజపతి రాజు కుమార్తె అదితి గజపతిరాజు విజయనగరం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే మీసాల గీతను కాదని అదితికి అవకాశం ఇచ్చారు.
గంటా వారసులు
విశాఖ జిల్లాకి చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావు ఈసారి విశాఖ ఉత్తరం నియోజకవర్గం నుంచి పోటీ పడుతున్నారు. ఆయన వియ్యంకుడు పులపర్తి రామాంజనేయులు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి వరుసగా మూడోసారి పోటీ చేస్తున్నారు. గంటా సమీప బంధువు పరుచూరి భాస్కరరావు జనసేన తరుపున అనకాపల్లి నుంచి పోటీ చేస్తున్నారు. ఆర్థికమంత్రి, టీడీపీ నేత యనమల రామక ృష్ణుడు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. గత రెండు ఎన్నికల్లో ఆయన ప్రత్యక్ష పోరుకి దూరంగా ఉన్నారు. ఆయన సొంత నియోజకవర్గం తూర్పు గోదావరి జిల్లా తునిలో సోదరుడు యనమల క ృష్ణుడు మళ్లీ పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. యనమలతో పాటు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌కు కూడా వియ్యంకుడైన టీటీడీ చైర్మన్‌ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ కడప జిల్లా మైదుకూరు నుంచి మళ్లీ పోటీ పడుతు న్నారు. గడిచిన ఎన్నికల్లో ఆయన ఇదే స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
కర్నూలులో నాలుగు కుటుంబాలు
తెలుగుదేశం పార్టీ తరుపున కర్నూలు జిల్లాలో మూడు కుటుం బాలకు అవకాశాలు దక్కాయి. అందులో ఉప ముఖ్యమంత్రి కేఈ క ృష్ణమూర్తి కుటుంబానికి రెండు సీట్లు కేటాయించారు. ఈసారి కేఈ కృష్ణమూర్తి ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉండడంతో ఆయన స్థానంలో తనయుడు కేఈ శ్యాంబాబు పత్తికొండ నుంచి పోటీ పడుతున్నారు. కేఈ ప్రతాప్‌కి డోన్‌ సీటు కేటాయించారు. మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డి కొద్దికాలం క్రితమే టీడీపీ కండువా కప్పుకున్నారు. ఆయనకు కర్నూలు లోక్‌సభ టికెట్‌ దక్కగా, ఆయన భార్య కోట్ల సుజాతమ్మ ఆలూరు నుంచి బరిలో ఉన్నారు. మరో మంత్రి భూమా అఖిలప్రియ ఆళ్లగడ్డ నుంచి పోటీ చేస్తున్నారు. ఆమె సోదరుడు, నంద్యాల ఉపఎన్నికల్లో గెలిచిన భూమా బ్రహ్మానందరెడ్డి టికెట్‌ దక్కించుకున్నారు. బ్రహ్మానందరెడ్డి సొంత మామ కాటసాని రామిరెడ్డి వైసీపీ తరుపున బనగానపల్లిలో పోటీ పడుతుండగా, రామిరెడ్డి సోదరుడు కాటసాని రాంభూపాల్‌ రెడ్డి పాణ్యం బరిలో వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు. సమీప బంధువులు రెండు ప్రధాన పార్టీల తరపున పోటీ పడుతుండడం విశేషం. కర్నూలు జిల్లాలకే చెందిన రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్‌ తనయుడు టీజీ భరత్‌ కి కర్నూలు ఎమ్మెల్యే టికెట్‌ దక్కింది. మరో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కుటుంబంతో సమీప బంధుత్వం ఉన్న రాయపాటి నరసరావుపేట ఎంపీగా బరిలో ఉన్నారు. గుంటూరు జిల్లాకు చెందిన వియ్యంకులు జీవీ ఆంజనే యులు వినుకొండ నుంచి, కొమ్మలపాటి శ్రీధర్‌ పెదకూరపాడు నియోజక వర్గాల నుంచి టీడీపీ తరపున పోటీ చేస్తున్నారు అనంతపురం జిల్లాలో జేసీ కుటుంబం నుంచి ఇద్దరు వారసులు ఎన్నికల బరిలో నిలిచారు. జేసీ పవన్‌రెడ్డి తన తండ్రి దివాకర్‌ రెడ్డి స్థానంలో అనంతపురం ఎంపీ స్థానం నుంచి పోటీ పడుతుండగా, జేసీ అస్మిత్‌ రెడ్డి కూడా తండ్రి ప్రభాకర్‌ రెడ్డి స్థానంలో తాడిపత్రి ఎమ్మెల్యే సీటు దక్కించుకున్నారు. ఇక జేసీ ప్రభాకర్‌ రెడ్డి సొంత బావమరిది నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి వైసీపీ తరుఫున నెల్లూరు జిల్లా కోవూరు నుంచి పోటీ చేస్తున్నారు.
వైసీపీలోనూ అదే వరుస
వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌.జగన్‌ పులివెందుల నుంచి రెండోసారి పోటీ చేస్తున్నారు. ఆయన బాబాయి కొడుకు వైఎస్‌.అవినాష్‌ రెడ్డి కడప లోక్‌సభ నుంచి, మేనమామ రవీంద్రనాథ రెడ్డి కమలాపురం నుంచి పోటీపడుతున్నారు. ఈ ముగ్గురు సిట్టింగ్‌ సీట్లలోనే బరిలో ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం అసెంబ్లీ స్థానానికి, ఆయన సోదరుడు ధర్మాన కృష్ణ దాసు నరసన్నపేట అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. గతంలో వీరిద్దరూ ఆయా స్థానాలకు ప్రాతినిధ్యం వహించారు. గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. విజయనగరం జిల్లాకు చెందిన మరో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబీ కులకు కూడా మూడు టికెట్లు దక్కాయి. బొత్స సత్యనారాయణ చీపురుపల్లి నుంచి పోటీ పడుతున్నారు. ఆయన సోదరుడు అప్పల నరసయ్య గజపతినగరం స్థానాన్ని దక్కించుకోగా, తోడల్లుడు అప్పలనాయుడు నెల్లిమర్ల నుంచి రంగంలో ఉన్నారు. కర్నూలు జిల్లా శ్రీశైలం నుంచి శిల్పా చక్రపాణిరెడ్డి పోటీ చేస్తున్నారు. ఆయన సోదరుడి కుమారుడు, శిల్పా రవిచంద్రారెడ్డి నంద్యాల నుంచి వైసిపి తరపున తొలిసారిగా రంగంలోకి వచ్చారు. ఎమ్మెల్సీగా ఉన్న గంగుల ప్రభాకర్‌ రెడ్డి తనయుడు గంగుల బిజేంద్రనాథ్‌ రెడ్డి ఆళ్లగడ్డ నుంచి పోటీ పడుతున్నారు. చిత్తూరు జిల్లాకి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు స్థానంలో పోటీలో ఉండగా, ఆయన సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకానాధ్‌ రెడ్డి తంబళ్లపల్లి నియోజక వర్గం నుంచి పోటీ పడుతున్నారు. ఇక రామచంద్రారెడ్డి తనయుడు మిథున్‌ రెడ్డి రాజంపేట ఎంపీ స్థానం కోసం పోటీ పడుతున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజక వర్గం సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి మరోసారి బరిలో ఉన్నారు. ఆయన సమీప బంధువు మోదుగుల వేణుగోపాల్‌ రెడ్డి గుంటూరు లోక్‌సభ సీటులో వైసీపీ అభ్యర్థిగా పోటీ పడుతున్నారు. నెల్లూరు ఎంపీ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా ఆదాల ప్రభాకర్‌ రెడ్డి అనూహ్యంగా తెరమీదకు వచ్చారు. ఆయన వియ్యంకుడు మేకపాటి చంద్రశేఖర్‌ రెడ్డి ఉదయగిరి అసెంబ్లీ స్థానం కోసం పోటీ పడుతున్నారు. ఇక మేకపాటి కుటుంబానికి చెందిన మాజీ ఎంపీ రాజమోహన్‌ రెడ్డి తనయుడు మేకపాటి గౌతమ్‌రెడ్డి సిట్టింగ్‌ సీటు ఆత్మకూరు కోసం మళ్లీ పడుతున్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావు మరోసారి ప్రకాశం జిల్లా పర్చూరు నుంచి పడుతున్నారు. ఆయన ఈసారి వైసీపీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు.
జనసేనలోనూ అదే సీన్‌
వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా మాట్లాడే పవన్‌ కళ్యాణ్‌ పార్టీలో కూడా పలువురు బంధువులకు టికెట్లు దక్కాయి. స్వయంగా పవన్‌ అటు భీమవరం, ఇటు గాజువాక రెండు స్థానాల నుంచి పోటీ చేస్తుండగా సోదరుడు నాగబాబు నర్సాపురం పార్లమెంట్‌ స్థానంలో పోటీపడుతున్నారు. నాగబాబు తోడల్లుడు,మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య పెందుర్తి నుంచి అసెంబ్లీ స్థానంలో పోటీ చేస్తున్నారు. వైసీపీ తరుపున భీమిలి నుంచి పోటీ చేస్తున్న సిట్టింగ్‌ ఎంపీ అవంతి శ్రీనివాస్‌ సోదరుడు ముత్తంశెట్టి క ృష్ణారావు కి జనసేన తరుపున అవనిగడ్డ నుంచి అవకాశం దక్కింది. ఇక భీమవరం వైసీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్‌ , తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి సత్యానందరావు స్వయంగా బావ,బావమరుదులు.
ఒకరిపై ఒకరు
ఒకే పార్టీ తరపున కొందరు, వేరు వేరు పార్టీల తరపున మరి కొందరు పడుతుండగా సమీప బంధువులు ముఖాముఖీగా తలపడుతున్న స్థానాలు కూడా ఉన్నాయి. విశాఖ జిల్లా అరకు పార్లమెంట్‌ స్థానం కోసం మాజీ ఎంపీ వైరిచర్ల కిశోర్‌ చంద్రదేవ్‌ పోటీ పడుతున్నారు. ఆయన టీడీపీలో చేరి టికెట్‌ దక్కించుకు న్నారు. ఆయనకు పోటీగా కాంగ్రెస్‌ తరఫున శృతిదేవి పోటీ చేస్తున్నారు. ఆమె కిశోర్‌చంద్రదేవ్‌కి స్వయంగా కూతురు కావడం విశేషం. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట అసెంబ్లీ నియోజక వర్గంలో అన్నదమ్ములు పోటీ పడుతున్నారు. టీడీపీ తరుపున మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పోటీ చేస్తుండగా, జనసేన అభ్యర్థిగా బండారు శ్రీనివాస్‌ బరిలో ఉన్నారు. ఉరవ కొండ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర్‌ రెడ్డికి మళ్లీ టికెట్‌ దక్కగా, మంత్రాలయం నుంచి పోటీ చేస్తున్న వై బాలనాగిరెడ్డి, ఆదోని నుంచి పోటీ చేస్తున్న వై సాయి ప్రసాద్‌ రెడ్డి, అనంతపురం అర్బన్‌ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న మాజీ ఎంపీ వై. అనంత వెంకట్రామిరెడ్డి కూడా సమీప బంధువులే కావడం విశేషం. మంత్రాలయం, అధోని నుంచి బాలనాగిరెడ్డి, సాయి ప్రసాద్‌ రెడ్డి కూడా ప్రస్తుతం సిట్టింగ్‌ ఎమ్మెల్యేలుగా ఉన్నారు.
ఏపిలో అప్పుడు రెండు పార్టీలమద్య పోరు..! ఇప్పుడు నాలుగు పార్టీల మద్య పోటీ..!!
కొంతకాలం క్రితం వరకూ ఏపీలో టీడీపీ, వైసీపీ మధ్యే పోరు అన్నట్లుగా సాగిన రాజకీయ వాతావరణం తారుమారైంది. దీంతో చతుర్ముఖ పోరు పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బీజేపీతో టీడీపీ దూరమైన నేపథ్యంలో వైసీపీ ఇంతవరకు ఏపార్టీకి దగ్గరవలేక పోవడం నేపథ్యంలో వామపక్షాలను కలుపుకొని జనసేన తెరపైకి రావడం, తప్పని పరిస్థితుల్లో బీజేపీ ఒంటరి బాట పట్టడం వంటి పరిణామాలు మున్ముందు ఏపీలో చతుర్ముఖ పోరుకు బాటలు వేస్తున్నాయా అన్న సంకేతాలు వెలువడు తున్నాయి. ఇదిలావుంటే ఎన్నికల అనంతరం బీజేపీతో వైసీపీ జతకట్టే అవకాశముందన్న ప్రచారమూ ఉంది. అదే సంద ర్భంలో టీడీపీ, కాంగ్రెస్‌ రెండూ చేతులు కలుపుతాయన్న ప్రచారం కూడా సాగుతోంది. అదే సందర్భంలో జనసేన, వామపక్షాలు సైతం కాం గ్రెస్‌, టీడీపీ పార్టీలతో అంతే దూరాన్ని పాటిస్తున్నాయి.

ఓటు విలువ తెలుసుకో..!

దేశవ్యాప్తంగా జరగనున్న ఈసార్వత్రిక ఎన్నికలు`2019చర్చినీయాంశంగా మారింది. మునుపెన్నడూ లేని విధంగా డబ్బుకు, ఇతర ప్రలోభాలకు లోబడి ఓటు వేసే పరిస్థితులు దాపురించాయి. సోషల్‌ మీడియా హవ్వా కూడా ఓటరుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఈ ఎన్నికలు నాటికీ నేటికీ భిన్నంగా కన్పిస్తున్నాయి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూర్చఉన్న చోట ఇవేచర్చలు. ప్రస్తుతం17వ సారి లోకసభ, 14వ సారి అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అప్పట్లో ఓటరు స్వచ్చంధంగా వచ్చి స్వేచ్ఛగా తమ ఓటును వినియోగించుకొనేవారు. ఆ పరిస్థితులకు విరుద్దంగా మారింది. దేశవ్యాప్తంగా రాజకీయం ఒక వ్యాపార సంస్థగా మారిపోయింది. నేడు కులం, డబ్బు, మాత్రమే ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. ప్రస్తుత రాజకీయాలు చాలా నీచమైన స్థాయి లోకి దిగజారిపోయాయి. ఎన్నికల్లో బాగా ఖర్చు పెట్టగల వ్యక్తులను మాత్రమే పార్టీ అభ్యర్ధులుగా బరిలో దిగారు. అవినీతి కూడా కొలమానంలో లేదు. సామాన్యుడితో ఐదునిమిషాలు ముచ్చటించి ఓటు అడిగే రోజులు పోయాయి. సమాజంలో విలువలకు, విశ్వసనీయత లేని రాజకీయ వ్యవస్థగా మారుతోంది. అంతా ప్రలోభాలు, డబ్బుమయంగా మారింది. అన్యాయాన్ని ఎదురించడానికి, అవినీతిని పారదోలడానికి మనిషి సృష్టించిన బలమైన ఆయుధమే ఓటునే విషయాన్ని విస్మరించి అమ్ముడుపోయే పరిస్థితులు ఎదురవుతున్నాయి.
ఐదేళ్లకు ఒక్కసారివచ్చి, మన జీవితాలను, తలరాతను మార్చేది ఎన్నికలు. మనం వేసే ఓటుతోనే నవసమాజం నిర్మితమౌతుంది. అందుక నుగుణంగా ఓటు అవశ్యకత, ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటుకున్న పాత్ర గురించి యువ ఓటర్లను చైతన్యం చేయాలి. ప్రజాస్వామ్య దేశమైన మన దేశంలో ప్రజలే పరిపాలకులు. మనం వేసే ఓటే మన భవిష్యత్తు, రాబోయే తరాల మనుగడ నిర్ణయిస్తాయి. కానీ మన దేశంలో ఎన్నికల పరిస్థితి దారుణంగా ఉంది. ఎన్నికల సమయంలో దేశం మొత్తంలో 60శాతం పోలింగ్‌ కూడా నమోదు కావడం లేదు. 125కోట్ల జనాభా కలిగిన మన దేశంలో సమారు 100 కోట్ల మంది ఓటర్లు ఉంటే, కేవలం 50కోట్ల లోపు ఓటర్లు మాత్రమే ఓటు హక్కు వినియోగించు కుంటున్నారు. ఓటు హక్కు వినియోగించుకొనేలా ప్రతి పౌరున్ని మేల్కోల్పాలి. ఎన్నికల కమిషన్‌ ప్రభుత్వ పెద్దలు ఈ బాధ్యతను నిర్వర్తించాలి. అప్పుడే మనదేశంలో ప్రజాస్వామ్యం విజయవంతమవుతుంది. ప్రస్తుత ఎన్నికల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. బ్యాలెట్‌ పోయి ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్లు(ఈవీఎం) వచ్చాయి ఈవీఎంలపై అపోహలను తొలగించడం, వినియోగంపై ప్రజలకు అవగాహన అవసరం. ఈవీఎం పనితీరు, వీవీ ప్యాట్‌, ఓటు హక్కును వినియోగించుకునే విధానంపై ఓటర్లను చైతన్యం చేయాలి.
ఇకపోతే ఈ ఎన్నికల్లో ఫోకస్‌ అంతా సోషల్‌ మీడియాదే హవ్వా. ఇప్పుడంతా యాప్‌ ఏజ్‌. సోషల్‌ మీడియాదే హవా. ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌.. ఇలాంటి ఆన్‌లైన్‌ సైట్లు అన్నీ ఓటరు ఆకర్షక వేదికలుగా మారాయి. ఒకప్పుడు ఎన్నికల వేళ ఓటర్లను ప్రభావానికి లోను చేసిన వాటిల్లో ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాలు ప్రధానంగా ఉండేవి. కానీ ఇప్పుడు సోషల్‌ మీడియా పాత్ర మాత్రం ఎనలేని ఆదరణ చూరగొన్నది. ప్రతి పార్టీ, ప్రతి రాజకీయ నాయకుడు.. తమ ఎన్నికల ఎజెండాను, ప్రణాళికలను..ఇలా అన్నిఅంశాలను సోషల్‌ మీడియా ద్వారానే పంచుకుంటున్నారు. ఇప్పుడు రాజకీయ పార్టీలకు ఆయుధాలుగా మారాయి. అవి ఓటర్లను ఆకర్షించే శక్తులుగా ఎదిగాయి. గూగుల్‌, ఫేస్‌బుక్‌ కూడా పొలిటికల్‌ యాడ్స్‌ను మానిటర్‌ చేయాలని ఆదేశించింది. కానీ చాలా సున్నితంగా మారిన సోషల్‌ మీడియా..లోక్‌సభ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనున్నది.
మరో విషయం..ఈఎన్నికలు బడుగు బలహీనవర్గాల ప్రజలకు ఉపాధి కల్పనగా మారింది. ఎన్నికల ప్రచారానికి తరలించేందుకు ఒక మహిళరోజులో అరపూట జెండా పట్టుకొని తిరిగేందుకు రోజుకు రూ.300 నుంచి రూ.500 వరకు ఆయా రాజకీయ పార్టీలు చెల్లిస్తున్నారు. ఇలా పూటగడవని నిరుపేదలు పది రోజుల పాటు ఉపాధి కల్గడం హర్షనీయమే. ఇకఆటోవాలా రోజుకు రూ.3వేల నుంచి ఐదువేల రూపాయలు సంపాదించుకొవడానికి ఎన్నికలు వరంగా మారాయి. అయితే ఈ పద్దతి ప్రజాస్వామ్యంలో ఎటువంటి పరిస్థితులకు దారితీస్తోందో అనేది ప్రజలు అర్ధం చేసుకోవాలి. సమాజంలో డబ్బే ప్రామాణికంగా తీసుకోవడం భావ్యమా? అలాగైతే భవిష్యత్తులో ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా కాపాడుకోగలమనేది ప్రశ్నించుకోవాల్సిన అవశ్యకత ఉంది. ప్రజాస్వామ్యంలో ఓటునేది ఓఆయుధం. ఓటు హక్కు కలిగిన ప్రతి పౌరుడు బాధ్యతగా ఎటువంటి ప్రలోభాలకు గురికాకుండా ఓటును వినియోగించుకుని మంచి ప్రజాస్వామ్యాన్ని తీసుకురావాలి. భవిష్యత్తులో భావితరాలకు ఈవ్యవస్థను సరిదిద్దాలి. రాజకీయ వ్యవస్థలో కూడా మార్పులు రావాలి. నవతరాన్ని ప్రోత్సహించాలి. రాజకీయ కురువృద్దుల స్థానంలో యువతరానికి చోటనివ్వాలి. అప్పుడే రాజకీయ వ్యవస్థ పెఢరిల్లుతోంది. వ్యక్తి అస్థిత్వాన్ని గుర్తించి వ్యవస్థ మార్పుకు నాంది పలుకుతుంది. మంచి నాయకత్వం లేకుండా మంచి సమాజం ఏర్పడదు. రాజకీయ ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా.. సాంఫీుక, ఆర్ధిక, సమానత్వాన్ని సాధించాన్నా, భావితరాల భవిష్యత్తును తీర్చిదిద్దే యువతరాన్ని ప్రొత్సహించి వ్యవస్థలో మార్పులు తీసుకురావాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది!- రెబ్బాప్ర‌గ‌డ ర‌వి,ఎడ‌టిర్

కరువు కోరల్లో బీడ్‌ కదలని ప్రభుత్వం

ఈఏడాది జనవరి నాటికే దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్ర ప్రభు త్వాలు 300జిల్లాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించాయి. వీటిలో మహారాష్ట్రలోని బీడ్‌జిల్లా ఒకటి. గతేడాది అక్టోబర్‌లోనే ఈ జిల్లాను కరువు ప్రాంతంగా గుర్తించారు. సీపీఐ(ఎం), కిసాన్‌ సభ జిల్లా నాయకులతో కలిసి నేను వివిధ తాలూకాల్లోని 25గ్రామాలలో వందలాది మంది బాధితులను కలిశాను. ఇప్పటికీ అక్కడ ఎటువంటి సహాయక చర్యలు కనుచూపు మేరలో కనిపించటం లేదు. పంట నష్టాన్ని అంచనా వేయటానికి ఒక్క ప్రభుత్వ బ ృందం కూడా గ్రామాల్ని సందర్శించలేదు.
ఎండిన పంటలను పొలాల నుంచి తొలగించాల్సి ఉన్నా అవి తీసేస్తే తమకు బీమా సొమ్ము అందదేమోనన్న భయంతో రైతులు వాటిని అలాగే ఉంచేశారు. మేం కలిసిన ప్రతి రైతూ అప్పుల్లో కూరుకు పోయి ఉన్నారు. అయినా ప్రభుత్వ సహకారం అందుతుందన్న ఆశ వారికి ఏమాత్రం లేదు. వ్యవసాయ కార్మికులు ముఖ్యంగా మహిళా కార్మికుల దుర్భర పరిస్థితి కొట్టొచ్చినట్టు కనిపించి మా మనసుల్ని కలచివేసింది. చాలా గ్రామాలలో కుటుంబంలోని పురుషులు ఇతర పనులు వెతుక్కుంటూ వలస వెళ్లిపోయారు.ఈప్రాంతం కరువు ప్రభావిత జిల్లాగా గుర్తించినప్పటికీ గ్రామీణ ఉపాధి పథకం కింద అవసరానికన్నా చాలా తక్కువ పని దొరకటం దీనికి ప్రధాన కారణం. బీడ్‌జిల్లాలో 2018-19సంవత్సరానికి కేవలం 43రోజులు మాత్రమే ప్రభుత్వం పని కల్పించింది.
జిల్లావ్యాప్తంగా గ్రామస్థాయి సమావేశాలు వేసి వాటిలో వచ్చిన అభిప్రాయాలు, వాస్తవ పరిస్థితిపై ప్రతినిధి బృందం కలెక్టర్‌కు నివేదిక అందజేసింది. మోడీ ప్రభుత్వం తయారు చేసిన ‘కరువు సహాయక మార్గదర్శకాలు 2016’లో కూడా ఈజిల్లా రైతులకు అన్యాయం చేశాయనేది వారి అనుభవం ద్వారా తెలుస్తోంది.
నష్ట తీవ్రత-పరిహారం, సహాయం
బీడ్‌లోని మొత్తం 11తాలూకాలను కరువు ప్రాంతాలుగా గుర్తించారు. అయితే నష్టాన్ని అంచనా వేయలేదు. నష్ట పరిహారం, బీమా చెల్లింపునకు ఇదే కీలకం. గతంలో జరిగినట్టే నష్టశాతాన్ని తక్కువ చేసి చూపించి సరైన పరిహారం ఇవ్వకుండా ఎగవేస్తారని రైతులు భయపడుతున్నారు. ఈ ఐదేండ్లలో కేవలం 2017లో మాత్రమే వర్షాలు పడటంవల్ల మిగిలిన నాలుగేండ్లూ ప్రజలు కరువుతో సతమత మయ్యారు. ఈ ప్రాంతంలో చెరకు, పత్తి, సోయా, కందులు, సజ్జలు, జొన్న సాగు చేస్తారు. కరువుకు తోడు 2016నుంచి బీటీ పత్తికి ‘బొండాలి’ పురుగు సోకుతోంది. దీని నివారణకు ఎరువులు, పురుగు మందులూ అధికంగా వాడటం వల్ల ఎకరాకి అయ్యే ఖర్చు పెరిగింది. రైతులు చెప్పినదాన్ని బట్టి వర్షాభావం వల్ల 80శాతం ఖరీఫ్‌ పంట, దానికి కొంచెం అటూ ఇటూగా రబీ పాడైంది. అప్పుల్లో మునిగిపోయి, గత 8నెలలుగా ఆదాయం లేక తల్లడిల్లుతున్న రైతులకు ప్రభుత్వ సహాయంగాని, బీమా పరిహారంగానీ ఇచ్చేందుకు అటు ప్రభుత్వం, ఇటు అధికారులు ఎలాంటి శ్రద్ధా చూపలేదు.
అరకొర రుణాలు-అప్పుల గాయాలు
ఒకవైపు ప్రభుత్వం పంట రుణ పథకాల గురించి ఊదర కొడుతున్నప్పటికీ మేం కలిసిన రైతుల్లో చాలామంది బ్యాంకుల నుంచి రుణాలను పొందలేదు. అనేక ఆందోళనలు చేసినా బ్యాంకుల నుంచి ఎలాంటి సమాధానం లేదు. పర్లి తాలూకా మందఖేల్‌ గ్రామంలో రుణం కోసం బ్యాంకుకు వెళ్లిన చెరుకు రైతులను ‘షుగర్‌ మిల్లు యజమానుల నుంచి గ్యారంటీ లెటర్‌ తెస్తేనే లోన్లు ఇస్తామ’ని అధికారులు తిప్పి పంపేశారు. ఇప్పటికే రాజకీయ ప్రాబల్యం కలిగిన యజమానులకు ఈచర్య మరింత బలాన్ని ఇవ్వటమే కాక చెరుకు రైతులపై వారి పట్టు మరింత బిగుస్తుంది. ఆప్రాంతంలోని అన్ని బ్యాంకులలో ఇదే పరిస్థితి ఉంది.
మహారాష్ట్ర ప్రభుత్వ రుణ మాఫీ పథకం వల్ల లాభపడిన ఒక్క రైతు కూడా మాకు కనిపించలేదు. బ్యాంకులు తమకు రుణాలు ఇవ్వకుండా వివక్ష చూపి తమను శిక్షిస్తున్నాయని వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులుచేసి ఇబ్బందులపాలవుతున్న రైతులు వాపోయారు. ధానూ ర్లో జరిగిన సమావేశంలో రైతు బాబా సాహెబ్‌ పవార్‌ మాట్లాడుతూ ‘బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడం వల్లే రైతులు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పు చేస్తున్నారు. అటువంటి వారికి ప్రభుత్వం ఇప్పుడు కరువు సాయం అందించననటం న్యాయమా?’ అని కన్నీటితో ప్రశ్నించాడు. అయితే తమ అప్పుల వివరాలను బహిరంగంగా చెప్పటానికి రైతులు నిరాకరించారు. ‘మాకు ఎంత అప్పు ఉన్నదీ పబ్లిగ్గా చెబితే మా పరువు పోవటమే కాదు. రేపు ఇంకా ఎక్కడా అప్పు పుట్టదు. అందుకే మేము ఆ వివరాలు చెప్పలేం’ అని ఒకవృద్ధ రైతు సమావేశం అనంతరం మాతో తమ వ్యధ చెప్పుకున్నాడు. ఎంత భయంకరమైన పరిస్థితి? ఒక వైపు అప్పుల భారాన్ని తమ భుజాలపై మోస్తున్నా దాని బరువును బయట పెట్టటానికి రైతులు ఒప్పుకోరు. కానీ ఆ భారంవల్ల కలిగే బాధను దాచుకోవటం సాధ్యమా?
యంత్రాలు మాట్లాడవు!
బీమా కంపెనీలతో రైతులకు అనేక చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఈఏడాది బీడ్‌ జిల్లాలో చెరుకు రైతులకు బీమా సౌకర్యం లేదు. ఎందుకని అడిగితే ప్రీమియం చాలా ఎక్కువ వున్నదని, రైతులు దానిని కట్టలేరని అధికారుల సమాధానం. అయితే వారు అసలు తమని ఎప్పుడూ సంప్రదించలేదని రైతులు చెప్పారు. ఈ విషయంలో మరింత లోతైన విచారణ జరగాల్సి ఉంది.
మజల్‌గావ్‌ ప్రాంతంలోని ధర్మేవాడి గ్రామంలో రైతులబ ృందం తమ అనుభవాలను తెలిపారు. పత్తి రైతు సందీపన్‌ భుంభ్లే మాట్లాడుతూ.. ‘2017లో నేను ఎకరా పత్తి పంటకు రూ.1200 బీమా చెల్లించా. వర్షం బాగానే ఉన్నా బొందాలి పురుగు ఆశించడంతో 10క్వింటాళ్లకి బదులు 6క్వింటాళ్లే పండిరది. బీమా కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడం చాలా కష్టమైంది. మా ఊళ్లో ఇంటర్‌నెట్‌ కనెక్షన్‌ చాలా బలహీనంగా ఉంటుంది. దీనివల్ల ఆన్‌లైన్‌లో పూర్తిచేయాటానికి చాలా సమయం వృధా అయింది. నేను చెల్లించిన ప్రీమియం రసీదు నా దగ్గరే ఉంది కానీ ఏం ఉపయోగం? గతంలో బీమా ఏజంటుని మేం నేరుగా కలుసుకుని మా అనుమానాలన్నీ అడిగే వాళ్ళం. ఇప్పుడు మిషను మాత్రమే ఉంటుంది. యంత్రాన్ని ఏమని అడగగలం? నా పంట నష్టాన్ని అంచనా వేసి, బీమా సొమ్ము ఇవ్వటానికి ఎవరైనా వస్తారేమోనని ఎదురు చూసేవాణ్ణి. ఎవ్వరూ రాలేదు. పరిహారం కింద ఒక్క పైసా కూడా అందలేదు. బ్లాక్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసుకి వెళ్ళటంవల్ల సమయం వ ృధాయేనని వదిలేశా’.
పశువులు – పశుగ్రాసం
అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో మొత్తం 5లక్షల ఆవులు, 2.6లక్షల ఎడ్లు, 2.4లక్షల గేదెలూఉన్నాయి. పశువులపోషణ, డైరీ ఫారం నిర్వహణ ఇక్కడి ముఖ్య ఆదాయ వనరు. అయితే పశుగ్రాసం, నీళ్లు కొరత వల్ల పశువులను పోషించటం చాలా కష్టంగా ఉంది. అందువల్ల అన్ని గ్రామాలలోను పశువుల మందను అమ్మ టానికి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాలేడ్‌ పంచాయితీ సమావేశంలో రైతులు చెప్పిన ప్రకారం ఒక జత ఎద్దులకు నెలకు సుమారు 8క్వింటాళ్ల గ్రాసం కావాలి. క్వింటాల్‌ రూ.2000 చొప్పున ఏడాదికి రూ.72,000 కేవలం గడ్డి కొనటానికే అవుతుంది. నీళ్ళ కొరత ఇంకొక పెద్ద సమస్య. పశువుల సంగతి తరువాత. మనుషుల అవసరాలకు సరిపడా ట్యాంకర్లు కూడా అందుబాటులో లేవు. ఇక గోరక్షణ పేరుతో బీజేపీ చేపడుతున్న విధానాల వల్ల మొత్తం పశువుల వ్యాపారమే బాగా దెబ్బతిన్నదని రైతులు వాపోయారు. దానికి తోడు కరువు వల్ల ధరలు కూడా బాగా పడిపోయాయి. తప్పనిసరి పరిస్థితుల్లో పశువుల్ని అయినకాడికి అమ్మటంవల్ల బాగా నష్టాలొ చ్చాయి. హామీ ఇచ్చిన ప్రభుత్వం గ్రామాలలో ఇంకా పశువుల కొట్టాలు ఏర్పాటు చేయలేదు. ప్రభుత్వమే గ్రామంలో పశుగ్రాసం సరఫరా చేయాలని రైతులు అడిగినా వాటిని మేత కోసం పశువుల కొట్టానికి తీసికెళ్లాలంటే ఒక మనిషి ఒక రోజు పనీ, ఆదాయాన్నీ వదులుకోవాలి.
కానరాని అదనపు సేవలు-సహకారం
ప్రభుత్వం నిర్వహించాల్సిన అదనపు సేవలు దాదాపు కను మరుగయ్యాయనే చెప్పవచ్చు. ఏరకమైన పంట వేయాలనే విషయంపై రైతులకు తాము అవగాహన కల్పిస్తామని, దానికనుగుణంగా రైతులు తమ పంటలను మార్చుకునేందుకు అవసరమైన సహకారం అంది స్తామని ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రకటిస్తూ ఉంది. కానీ ఇప్పటివరకు అటువంటిదేమీ అమల్లోలేదు. పైగా బీటీ కాటన్‌ విత్తనాలు, ఎరువుల అమ్మకానికి ప్రయివేటు ఏజన్సీలను అధికారులు ప్రోత్సహిస్తున్నారనీ, చక్కెర మిల్లు యజమానులకు పూర్తి మద్దతు ఇస్తున్నారనీ చెప్పారు. చక్కెర మిల్లులకు ప్రభుత్వమే విద్యుత్‌ ఇవ్వటం దీనికిసాక్ష్యం. ఇటు వంటి పరిస్థితుల్లో కరువు సమయాల్లో ఆచరించాల్సిన పద్ధతుల గురిం చి, ప్రణాళికల అమలు గురించి ఎక్కడా ఊసేలేదు. అదనపు సేవలు, మేలైన విత్తనాల ఉత్పాదనకు ప్రయోగాలు, నిరంతర వ్యవ సాయాన్ని పెంపొందించే చర్యలు మొదలైన వాటి లేమివల్ల వ్యవ సాయ ఉత్పాదకత, రైతుల ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి. వీటి అమలులో ప్రభుత్వం తన కనీస బాధ్యత నుంచి కూడా తప్పుకుంటోంది.
అధికారుల పాత్ర
అన్ని గ్రామాల్లోను రుణాలు, ఇన్సూరెన్స్‌ విషయాలలో రైతులు సమస్యలెదుర్కొంటున్నారని చెప్పినప్పుడు ‘సమస్య కొన్ని బ్లాకులలోనే ఉన్నదనేది’ కలెక్టర్‌ స్పందన. నిజానికి ఆన్‌లైన్‌లో ఇన్సూ రెన్స్‌ రిజిస్ట్రేషన్‌ విధానం రైతులకు చాలాకష్టం. అలాగే బీమా ప్రీమి యం కట్టించుకోవటంలో కంపెనీల బాధ్యత శూన్యం. ప్రభుత్వమే దానిని నిర్ణయిస్తుంది. బీమా ప్రీమియం ఖరారు, నష్టం అంచనాలో జాప్యానికి అధికారుల అలసత్వమే కారణమని కలెక్టర్‌ అంగీకరించారు. కరువు అంచనాకు సంబంధించిన కొత్త నిబంధనల ప్రకారం ఇకముందు గ్రామస్థాయి ప్రత్యక్ష తనిఖీ అవసరం లేదు. బ్లాకు లేదా జిల్లాస్థాయిలో సగటు దిగుబడి ఆధారంగా అంచనా కడతారు. దీనివల్ల భూస్వాములు,ధనిక,మధ్య తరగతి, చిన్నరైతుల మధ్య పెద్ద వ్యత్యాసం ఉండదు. నీటి పారుదలకు సంబంధించి సేకరించిన లెక్కలు కూడా అందుబాటులో లేవు. కొన్నిప్రాంతాలలో సంపన్నులైన రైతులు పంపులు, బోర్ల ద్వారా పొలాలకు నీరు పెట్టుకోగలుగుతారు కాబట్టి సహజంగానే వారి పంట దిగుబడి అధికంగానే ఉంటుంది. వారిని కూడా పేద రైతులతో సమానంగా లెక్కగడుతున్నారు. ఇది చాలా అన్యాయం. ఇప్పుడు కరువు నష్టం అంచనా విషయంలో కూడా ఏవో కొత్త పద్ధతుల ద్వారా వాస్తవ పరిస్థితిని మరుగున పడేసి తనకు అనుకూలంగా నివేదికలను తెప్పించుకునే అవకాశం లేకపోలేదు.
ఇటీవలే మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన ‘కరువు విధాన పత్రం – 2016’ను పరిశీలిస్తే దానిలో పొందుపరచిన అంశాలు కరువు తీవ్రతను తగ్గించి చూపేందుకు ప్రయత్నించినట్టు కనిపిస్తోంది. ఒక జిల్లాను కరువు ప్రభావిత ప్రాంతంగా ప్రకటించేందుకు తీసుకున్న ‘మధ్యస్థం’, ‘తీవ్రం’, ‘అతి తీవ్రం’ అనే కొలబద్దల స్వభావం మానవీ య విలువలతో కాక పూర్తిగా సాంకేతికంగా, కఠినంగా ఉన్నది. కరువు అంచనా వేయటంలో శాస్త్రీయ విధానమైన ప్రత్యక్ష తనిఖీని పూర్తిగా ఎత్తేశారు. పైన తెల్పిన మూడు కేటగిరీలు నిధుల కేటాయిం పులో కీలక పాత్ర వహిస్తాయి. కానీ నిధుల విషయానికి వచ్చేసరికి మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలే వాటిని భరించాలని తేల్చేశారు. సహాయ నిధుల్లో 2రకాలు ఉంటాయి. ఒకటి, ఎస్‌డీఆర్‌ఎఫ్‌-దీనిలో 75శాతం కేంద్ర ప్రభుత్వం, 25శాతం రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంటుంది. రెండవది,ఎన్‌డీఆర్‌ఎఫ్‌-ఇది మొత్తం కేంద్ర నిధుల నుంచే చెల్లించాలి. ఈ విధానపత్రం ప్రకారం మహారాష్ట్రలో కేవలం 3జిల్లాలు మాత్రమే కరువు ప్రభావిత ప్రాంతాల కిందికి వస్తాయి. రైతుల నుంచి తీవ్ర నిరసనా రాజకీయ తిరుగుబాటూ ఎదుర్కొంటున్న రాష్ట్ర సర్కార్‌ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయక తప్పలేదు. అయితే ఈ అంశంలో నిధుల కేటాయింపు కీలకం అయినందున కరువు తీవ్రత ప్రభావం ఇంకా నిర్ణయించాల్సి ఉంది. ఇప్పటికే బీడ్‌ జిల్లాలో కరువు సహాయానికి నిధుల కేటాయింపులో జరిగిన తీవ్ర జాప్యం వల్ల అక్కడి రైతుల దుస్థితి మరింత పెరిగింది. ప్రభుత్వ నేరపూరిత నిర్లక్ష్యమే దీనికంతటికీ కారణం!- బృందాకరత్‌

1 68 69 70 71 72 75