చరిత్ర పాఠాల తొలగింపు

జాతి నిర్మాణానికి విలువలు కలిగిన విద్యార్థు లను తయారు చేయడమే విద్యావ్యవస్థ లక్ష్యం. కాని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ నూతన విద్యా విధానం (ఎన్‌ఇపి) జాతిలక్ష్యాలకు, రాజ్యాంగ సూత్రాలకు భిన్నం గా నిర్ణయాలు చేస్తున్నది. రాష్ట్రంలో ఇప్పటికే క్లస్టరైజేషన్‌, డిజిటలైజేషన్‌, విలీన ప్రక్రియలు, వృత్తి విద్యా కోర్సులలో ఎన్‌ఇపి అమలు వలన ఎటువంటి దుష్ఫరిణామాలను చవిచూస్తున్నామో అనుభవాలు రుజువు చేస్తున్నాయి. ఇదిలావుండగా సిలబస్‌లో, పాఠ్యాంశాలలో కూడా కేంద్రం జోక్యం పెరుగుతున్నది. తాజాగా 2023-24 విద్యా సంవత్సరానికి సంబం ధించి పన్నెండవ తరగతి పాఠ్యపుస్తకాలలో చరిత్రకు సంబంధించిన చాప్టర్లను తొలగించారు.
భావి పౌరులకు దేశచరిత్ర తెలియ కూడదనే సరిగ్గా కోవిడ్‌ విపత్తు సమయంలో, వ్యవస్థ లేవీ పని చేయలేని విపత్కాల పరిస్థితులతో కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఇపి అమలుకు పూనుకుంది. విద్యా సంస్థలు కోల్పోయిన పనిదినాలను దృష్టిలో పెట్టు కుని విద్యార్థులపై భారం తగ్గించాలని 30 శాతం సిలబస్‌ను తగ్గించాలని ఎన్‌సిఇఆర్‌టి కూడా సూచిం చింది. ‘వేటిని తొలగించాలి? ఎవరి అభిప్రాయా లు తీసుకోవాలనే ప్రక్రియగాని, పారదర్శకతగాని లేదు.2021లోని సిలబస్‌ను తగ్గించేటపుడు విద్యా ర్థులపై భారాన్ని తగ్గించే విధంగా లేదు. పాలకుల భావజాల వ్యాప్తికి అడ్డంకిగా వున్న పాఠ్యాంశాలను తొలగించారు.కోవిడ్‌ విపత్తును అవకాశంగా మలు చుకుని, వారి ఎజెండా అమలుకు పూనుకున్నది. ఎన్‌ఇపి ముసాయిదాను విడుదల చేసినపుడు అది అమలైతే ఎటువంటి ప్రమాదాలు వస్తాయని ఊహించామో అవి నేడు విద్యారంగంలో జరిగి పోతున్నాయి.
నాడు తొలగించిన వాటిలో ముఖ్యమైనవి
లౌకికవాదం, ప్రజాస్వామ్యం,హక్కు లు,పౌరసత్వం,ఉద్యమాలు,జాతీయవాదం,ప్రాంతీ య అవసరాలు,స్థానిక సంస్థలు,ప్రభుత్వాలు,ఆహార భద్రత,పర్యావరణం,పంచవర్ష ప్రణాళికలు ఇతర దేశాలతో సంబంధాలు,అలీన విధానం,పర్యావ రణం,సహజవనరులు,భిన్నత్వంలో ఏకత్వం వంటి అంశాలకు సంబంధించిన పాఠ్యాంశాలను తొల గించారు.ఇవన్నీ మనదేశచరిత్ర,వారసత్వ సంపదకు సంబంధించిన అంశాలు. ఒక్క మాటలో చెప్పా లంటే ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదులు, రాజ్యాంగ లక్ష్యాల సాధన, దేశ చరిత్రను పూర్తిగా కనుమరుగు చేస్తున్నారు. అంతేకాకుండా ఈ కాలంలో పాలకుల వైఫల్యాలకు సంబంధించిన ప్రపంచీకరణ విధానా లు,లింగ వివక్ష, పెద్ద నోట్ల రద్దు, జిఎస్‌టి వంటివి తొలగించారు.
నేడు తొలగిస్తున్న పాఠ్యాంశాలు …
ఎన్‌ఇపి అమలు నేపథ్యంలో ఎన్‌సిఇ ఆర్‌టి రూపొందించిన కొత్త పుస్తకాలలో మహాత్మా గాంధీకి సంబంధించిన పలు పాఠ్యాంశాలను తొలగించారు. ప్రధానంగా తొలగించిన అంశా లివి.

థీమ్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ హిస్టరీ పార్ట్‌-2 (16వ,17వ శతాబ్దాలకు సంబంధించినది)

  1. పదకొండవ తరగతిలో సెంట్రల్‌ ఇస్లామిక్‌ ల్యాండ్స్‌, సంస్కృతుల ఘర్షణ
  2. పన్నెండవ తరగతి పౌరశాస్త్రంలో స్వాతంత్య్రం నుండి భారత రాజకీ యాలలో ప్రసిద్ధ ఉద్యమాల వరకు
  3. పన్నెండవ తరగతి పొలిటికల్‌ సైన్స్‌ పాఠ్యపుస్తకం నుంచి గాంధీజీ హత్యానంతరం ఆర్‌ఎస్‌ఎస్‌ పై విధించిన నిషేధానికి సంబంధిం చిన కొన్ని పేరాలనూ, అలాగే హిందూ-ముస్లిం ఐక్యతకు గాంధీ చేపట్టిన కృషికి సంబంధించిన కొన్ని పేరాలను కూడా తొలగించారు.
  4. గతేడాది కర్ణాటక పాఠ్యపుస్త కాలతో ప్రముఖస్వాతంత్య్ర సమరయోధుడు భగత్‌ సింగ్‌ పాఠ్యాంశాన్ని తొలగించారు.
  5. సంఘసం స్కర్తలు పెరియార్‌, నారాయణ గురు,బసవడు వంటి ప్రముఖుల పాఠాలను తొలగించారు.
  6. పాఠ్యాంశాలే కాదు. సిబిఎస్‌ఇ సిలబస్‌కు సంబంధించిన ప్రశ్నాపత్రాలలో ‘గుజరాత్‌లో ముస్లింలపై దాడులు ఎవరు చేశారు?’ వంటి ప్రశ్నలు దేనికి సంకేతాలు?
    జాతీయోద్యమ స్ఫూర్తి అవసరం లేదా?
    జాతీయోద్యమ కాలంలోలౌకిక, ప్రజా స్వామ్యం,సార్వత్రిక విద్యకు డిమాండ్‌ పెరిగింది. కులమతాలకు అతీతంగా జాతిని ఐక్యం చేసే విద్య ను కోరుకున్నారు. సామాజిక దురాచారాలకు వ్యతి రేకంగా సంఘ సంస్కరణల ఉద్యమాలు ప్రారంభం అయ్యాయి. ఈ ఉద్యమాలు సామాజిక మార్పులుకు దారితీశాయి.ఈ క్రమంలో ప్రగతిశీల శక్తులు, సం ఘాలు,వ్యక్తులు,సంస్కర్తలు ఏకమై బ్రిటిష్‌ సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడిన మన దేశ చరిత్ర మన బాలలకు, భావి పౌరులకు అవస రం లేదా?
    ప్రాణాలకు వెరవకుండా భగత్‌సింగ్‌ చేసిన అద్భుతమైన పోరాటం,త్యాగం దేశ ప్రజ లను కదిలించింది.క్విట్‌ ఇండియా, సహాయ నిరా కరణ ఉద్యమం వంటివి లక్షోపలక్షలుగా యువ తను,లాయర్లను,ప్రజలను, విద్యార్థులను జాతీయో ద్యమం లోకి ఆకర్షించాయి. స్వాతంత్య్రం వచ్చిన తరువాత దేశవిభజనకు కుట్ర పన్నిన ఆర్‌ఎస్‌ఎస్‌ లాంటి మతసంస్థల చర్యలను అంగీకరించని గాంధీజీ మత సామరస్యం కోసం హిందూ-ముస్లిం భాయిభాయి అంటూ విస్తృతంగా పర్యటించాడు. ఇవి నచ్చని హిందూత్వ శశ్తులకు ప్రతినిధి అయిన గాడ్సే…మహాత్ముడిని హత్య చేశాడు.
    మత రాజ్యం కోసం అవసరమైన ప్రయ త్నాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం విద్య కాషాయీ కరణలో భాగంగా ఉద్దేశ పూర్వకంగానే ఎన్‌ఇపి ద్వారా గాంధీజీకి సంబంధించిన చరిత్ర ఘట్టాలను తొలగిస్తున్నది.ఎన్‌ఇపి అమలు కాకముందు పరిస్థితికి, అమలవుతున్న తరువాత పరిస్థితికి స్పష్టమైన తేడా కనిపిస్తుంది.- (కె.విజయ గౌరీ/కె.శేషగిరి)

బాల సాహిత్యం..వికాసం..విజ్ఞానం

అనగనగా కథలు.. బాల్యంలో సృజనను పెంచే మాలికలు.. అమ్మమ్మ, బామ్మా.. తాతయ్యలు లేని చిన్న కుటుంబాల్లో చిన్నారుల చింత తీర్చేది బాలసాహిత్యమే. చిన్ననాడు చందమామ, బాలమిత్ర సాహిత్య పఠనంతో పెద్దయ్యాక సృజనాత్మక రచన చేస్తున్న వారెందరో.. పిల్లల పట్ల ప్రేమతో రాసినవే నాడూ నేడూ మేలైన కథలు.. భాషపై మమకారం పెంచేది బాల సాహిత్యమే.. కథనం ఎంత ముఖ్యమో.. బాలసాహిత్యంలో చిత్రానికీ సమప్రా ధాన్యం.. పిల్లల్ని ఆకట్టుకునేది కంటికింపైన బొమ్మలే! ఈ విషయంలో ప్రపంచ బాల సాహిత్యంపై సోవియట్‌ ప్రచురణలు చేసిన కృషి అద్వితీయం..
మనం ఎలాంటి విత్తనాలు నాటితే అలాంటి చెట్లే వస్తాయి.బాల్యం నుండే మంచి సాహిత్యం అందిస్తే అలాంటి మంచి వ్యక్తిత్వం గల బాలలు తయార వుతారు. చందమామ అలాంటి సాహితీ సేద్యం చేసింది. దానివల్ల మన భాష, సంస్కృతి, సంప్రదాయాలు, విలువలు బతికాయి. ఇప్పుడు చందమామ లేదు. బాలసాహితీ వేత్తలే ఆ బాధ్యత తీసుకోవాలి. బాల సాహిత్యంలో భాషా సం కరం లేని రచనలు వస్తాయి. తల్లిభాష తలెత్తుకుని తిరుగుతుంది.బాల సాహి త్యాన్ని ముందు పెద్దలు చదివి, పిల్లలతో చదివించాలి.బాలసాహితీ వేత్తలు రాసినంత మాత్రాన సరిపోదు.తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పనిగట్టు కుని బాలసాహిత్యాన్ని ప్రోత్సహించాలి.అలాచేస్తే పుస్తక పఠనం తగ్గదు. కొత్త విష యాలు,మంచి సంగతులు,జీవితానికి, భవిష్యత్తుకి పనికొచ్చే సూత్రాలు తెలుసు కుంటున్నామన్న అభిప్రాయం కలిగితేనే ఎవర్క్కెనా పుస్తకాలు చదువు తారు. బాల సాహితీవేత్తలు ఈ రహస్యం దృష్టిలో ఉంచుకుని,రచనలు చేయాలి.అప్పుడే ఆ రచనలు పంచతంత్రం, ఈసఫ్‌ కథల్లా దశాబ్దాల తరబడి నిలిచి పోతాయి. ఆధునిక విజ్ఞాన విషయాలనూ అతి సరళంగా, ఆసక్తికరంగా రాయాలి.అలా రాయాలంటే పిల్లల రచనలు చేసే వారికి నిబద్ధత ఉండాలి. పిల్లలపట్ల, వారి భవిష్యత్తు పట్ల ప్రేమ ఉండాలి.వారే చరిత్రలో నిలిచిపోతారు. వారి రచనలు చిరంజీవులవుతాయి.- చొక్కాపు వెంకట రమణ,కేంద్ర బాల సాహిత్య,అకాడమీ పురస్కార గ్రహీత,
నేటి బాల సాహిత్యం
తెలుగు బాలసాహిత్యం తొలి నుంచి నీతులు ప్రధానంగా నడిచింది.కుమార శతకం, కుమారీ శతకం…నీతి కథా మంజరి వంటివి ప్రధానంగా చాలాకాలం బాల పఠనీయ సాహిత్యంగా ఉన్నాయి. నేటికీ పిల్లల కోసం చేసే రచనలు పిల్లల నడవడికను ప్రభావితం చేసేవి. నీతి ప్రధానంగా ఉండాలనే రచయితలే ఎక్కువశాతం. వినోద ప్రధానంగా పరమానందయ్య శిష్యులు, తెనాలి రామకృష్ణ కథలు మాత్రమే మిగిలాయి. అనువాద రచనల్లోనూ పిల్లల అద్భుత సాహస గాథలు ఎక్కువభాగం లేకపోవడం శోచనీయం. నేటి పిల్లలకు భాష ఒక సమస్య. కాగా వారి పాఠ్యాంశాల బరువు మరో సమస్యగా తయా రైంది. బాల సాహిత్యం చదివే పిల్లల సంఖ్య చాలా తగ్గిపోయింది. బడిలోని కథల పుస్తకాలను పిల్లల చేత చదివించే టీచర్లు మృగ్యమయ్యారు. బడి పిల్లల చేత కథలు రాయించి, సంకలనాలు తేవడం మంచి చొరవ అయినా ఆ కథలలో కొత్తదనం, ఊహలు లేకపోవడం పెద్దల సృజన లేమిని ప్రతిఫలి స్తోంది. చరవాణిలో పాఠాలు నేర్చుకునే స్థితిలో పిల్లలకు అద్భుత ఊహాలోకం పరిచయం చేయాల్సిన పని రచయితలది. మాట్లాడే పక్షులు, జంతువులు, నది, ఆకాశం, కొండ అన్నీ బాలలకు నచ్చేవే. వాటిని ఎలా అల్లగల మనేది రచయితల మేధకు పరీక్ష. అంత సమాచారాన్ని అందంగా అద్భుతంగా సాహ సాలతో తీర్చిదిద్దడం నేటి రచయితల బాధ్యత. పర్యావరణం, ప్రకృతి సంరక్షణ వంటివే నేటి అవసరం. ఏడో గదిలోకి తీసుకెళ్దాం!
చాలామందిలాగే నా బాల్యం ‘చందమామ’ బాలల పత్రికతో ముడిపడి ఉండేది. అప్పట్లో జానపద సీరియల్స్‌కి ‘చిత్రా’గారు, పౌరాణిక సీరియల్స్‌కి ‘శంకర్‌’గారు, చందమామ ముఖ చిత్రాలు వడ్డాది పాపయ్యగారు వేసేవారు. కథలో పాత్రలకు దీటుగా చిత్రాగారు తన కుంచెను రaళిపించేవారు. పిల్లల కథల పుస్త కాలలో కథల్నీ బొమ్మల్నీ విడివిడిగా చూడ లేము. ఉదాహరణకు రష్యన్‌, చైనా పిల్లల కథల పుస్తకాలలో పేజీ నిండుగా పెద్ద బొమ్మ ఉండి,దాని కింద రెండు లైన్ల కథ ఉంటుంది. దీనిని బట్టి బాలసాహిత్యంలో చిత్రకారుల పాత్ర ఎంత ఉందో అర్థమవుతోంది. బొమ్మలు చూస్తూ కథ చదవడం పిల్లలకు ఒక అద్భుత మైన అనుభూతి.పిల్లల కోసం బాలసాహిత్యం విరివిగా రావాలి.బాల సాహిత్యంలో ఎవరి పాత్ర ఎంత అనే ప్రశ్నే లేదు. చిత్రకారుడు, రచయిత తలుచుకుంటే ఎన్ని అద్భుతాలైనా సృష్టించవచ్చు. ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో పిల్లల సాహసగాథలు ఇంగ్లీష్‌ సాహిత్యంలో ఉన్నాయి. తెలుగు పిల్లలు అడ్వెంచర్స్‌ కావాలంటే ఇంగ్లీష్‌ సాహిత్యం మీద ఆధారప డాలా? మన వాళ్ళకి మనం సాహస కథలు ఇవ్వలేమా?తిప్పి తిప్పి కొడితే మనకు ‘బుడుగు’ తప్ప వేరే క్యారెక్టర్‌ కనిపించదు.రకరకాల విచిత్ర జంతువులు,ఒంటి కన్ను రాక్షసులు, మాంత్రికులే కాదు రెక్కల గుర్రాలూ మనవే. ఏడు తలల నాగేంద్రుడు ఏగుహలో పడుకు న్నాడో అతనిని నిద్ర లేపండి. ఏనుగుని సైతం ఎత్తుకుపోయే గండ బేరుండాలు మనకు ఉండనే ఉన్నాయి. దీనివల్ల పిల్లలు పాడైపొ యేదేమీ ఉండదు. మహా అయితే వారిలో సృజనశక్తి పెరుగుతుంది. తమ ఊహల్లో కొత్త లోకాలను చూడగలుగుతారు. ఇప్పుడు రాయక పోతే ఇకముందు పిల్లల కోసం ఏమీ ఉండదు. చెప్పినంత కాలం నీతి కథలు చెప్పాము. మన జానపద హీరోలను ఏడోగది లోకి మాత్రం వెళ్ళకు అంటే..ఏడో గదికే వెళ్ళి సాహసాలు చేయడమేకాక, రాకుమారినీ దక్కించుకొనేవారు. ఇప్పుడా రాకుమారుడికి ఏడోగది కరువైంది. మీరు చేయవలసిందల్లా ఆ ఏడోగది చూపిం చటమే.- చైతన్య పైరపు, ప్రసిద్ధ చిత్రకారులు
సామాజిక మాధ్యమంలోనూ..
బాలసాహిత్య విస్తృతికి, వికాసానికి సామాజిక మాధ్యమాలు ఎంతో దోహదపడు తున్నాయి. అందులో వాట్సప్‌, ఫేస్‌బుక్‌, ఇ-బుక్స్‌, యూ ట్యూబ్‌ ప్రముఖపాత్ర పోషిస్తున్నాయి. సామాజిక మాధ్యమాల్లో బాలల వ్యక్తిత్వ వికాసాన్ని, విజ్ఞా నాన్ని అందించే అనేక కథలు, గేయాలు, పాట లను స్వయంగా రచయితలే ప్రచురించు కుంటు న్నారు. బాలసాహిత్యం కోసం గతం లోలా కష్ట పడాల్సిన అవసరం లేదు.కొన్ని బాల పత్రికలు ఆన్‌లైన్‌లో లింక్‌ ఓపెన్‌ చేసి, చదువు కునే అవకాశాన్ని కల్పించాయి. నేడు పిల్లలకు ఎలాగూ ఆన్‌లైన్‌ క్లాసులు జరుగుతున్నాయి. అందువల్ల సెల్‌ఫోన్‌, కంప్యూటర్ల మీద విద్యార్థులకు అవగాహన కలిగింది. ప్రతి బడిలోనూ కంప్యూటర్‌ ఉంది. యానిమేషన్‌ ద్వారా కథలు పిల్లలకు అందించాలి. కాకుంటే పిల్లలకు ఊహా ప్రపంచానికి దూరం చేస్తాం. వాట్సాప్‌ గ్రూపులు నడిపే రచయితలు బాలసాహిత్యం పిల్లలకు చేరువయ్యేలా చూడాలి.- సైమన్ గునపర్తి  

గిరిజనాభివృద్ధి జరగాలంటే.. స్థానిక వనరుల వినియోగించాలి

గిరిజనప్రజలైన..సామాజికకార్యకర్తలైన ప్రభుత్వం చేపట్టే అభివృద్ధికి వ్యతిరేకం కాదు. నిజమైన గిరిజనాభివృద్ధి జరగాలంటే ఏజెన్సీలో నిక్షేపమైన వనరులు స్థానిక గిరిజనులే వినియోగించు కొనేలా వారికే రాజ్యాంగబద్దమైన హక్కులు కల్పించాలి.స్థానిక వనరుల వినియోగంపై గిరిజనులను చైతన్యవంతులను చేసేలా చర్యలు చేపట్టాలి. ఐదవషెడ్యూల్‌ ఏరియాలో నివసించే గిరిజనులకు ప్రధానజీవనాధారం భూమి.ఇప్పటికీ అత్యధిక గిరిజన కుటుంబాలు వ్యవసాయం మీదే ఆధారపడి జీవిస్తున్నారు.గతంలో ప్రతీగిరిజను కుటుంబానికి సరిపోయనంత భూమి ఉండేది. అనేక కారణాలువల్ల గిరిజనులు తమ భూమిని కోల్పోతూవస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో,గిరిజనుల హక్కులపట్ల చైతన్యం కలిగించి,గిరిజనేతరుల దోపిడీని ప్రతిఘ టించే విధంగా వారిని సమీకరించడంపై ‘సమత’ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది.ఆదివాసీ ప్రజల సమస్యలు,వనరులు,పర్యావరణ పరిరక్షణ,వారిహక్కులను కాపాడుతూ పోరాటం సాగిస్తోంది. అయినా పీసాచట్టం,సమత జడ్జిమెంట్‌లను ఉల్లంఘించి,రాజ్యాంగానికి విరుద్దంగా,వారి వనరులపై గిరిజనేతరుల పెత్తనం సాగుతూనే ఉంది. ఫలితంగా పచ్చని పొలాలపై మైనింగ్‌ చిచ్చు రగులుతోంది. ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ,మైనింగ్‌ కాంట్రాక్టర్ల(ఏపీఎండీసీ) మైనింగ్‌ ప్రభావిత గ్రామ రైతుల మధ్య 2006 నుంచి ప్రచ్ఛన్నయుద్దం జరుగుతూనే ఉంది.
ఈ వివాదాల నేపథ్యంలో నిమ్మలపాడు కాల్సైట్‌ మైనింగ్‌ తవ్వకాల కోసం ఏపీఎండీసీ,జిల్లా రెవెన్యూ అధికార యంత్రాంగం ఏప్రిల్‌ 19న ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణ సదస్సును స్థానిక గిరిజనులు వ్యతిరేకించారు. గిరిజనాభివృద్ధిపై ప్రభుత్వానికి చిత్తశుద్దింటే సమత జడ్జెమెంట్‌ ప్రకారం స్థానికులకే లీజులు అప్పగించాలంటూ గిరిజనులు ముక్తకంఠంతో నినాదించారు. నిజానికి గిరిజనుల ఆవేదనకు అర్ధముంది. సమత తీర్పును ప్రభుత్వంగానీ,ఏపీఎండీసీ అధికార యంత్రాంగం గానీ సరిగ్గా అర్ధం చేసుకోవడం లేదు.ఆతీర్పు పూర్తిగా చదివితే మైనింగ్‌ తవ్వకాలపై సమత జెడ్జి మెంట్‌ వ్యతిరేకం కాదని అర్ధమౌతోంది.రాజ్యాంగబద్దంగా గిరిజన ప్రాంతానికి చెందిన వనరులు గిరిజనులకే చెందాలని, ఒకవేళ వనరులు వెలికితీస్తే గిరిజనులను సొసైటీలుగా ఏర్పాటు చేయించి,వారికే లీజులు ఇవ్వాలని ఆతీర్పులో సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కోంది.ఈతీర్పును అర్ధం చేసుకోకుండా గిరిజన బినామీల పేరుతో ప్రైవేటు వ్యక్తులకు లీజులు ఇవ్వడానికి ఏపీఎండీసీ మొగ్గు చూపుతోంది.
పదహారేళ్ల నుంచి స్థానిక గిరిజన సొసైటీలకు లీజులు ఇవ్వకుండా ఏపీఎండీసీ స్థానికేతర గిరిజనులకే లీజులు ఇవ్వడంపై కరకవలస,రాళ్లవలస,నిమ్మలపాడు మూడు గ్రామాల గిరిజన ప్రజలు ప్రతిఘటిస్తున్నారు. ఈప్రాంతంలో నాటికి నేటికీ గిరిజన ప్రజల స్థితిగతులు ఏమాత్రం మారలేదు. వారి అమయకత్వం కారణంగా వనరుల దోపిడికి గురవుతునే ఉన్నారు. ఈ మూడు గ్రామాల మధ్య 125 ఎకరాల్లో విలువైన కాల్సైట్‌ గనులు ఉన్నాయి. వీటిలో సుమారు పాతిక ఎకరాల్లో అత్యంత విలువైన కాల్సైట్‌ ఉంది.వీటిని చేజిక్కించుకోవడానికి మైనింగ్‌ మాఫియా ఏపీఎండీసీ అండతో మూడు దశాబ్దాల నుంచి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ దోపడి వ్యవస్థకు స్వస్తిపలికి ఏపీఎండీసీ అధికార్లు రాజ్యాంగనీతిని అనుసరించాలి.నిజమైన గిరిజనాభివృద్ధిని సాధించాలంటే గిరిజన ప్రాంతాల్లో ఉన్న స్థానిక వనరులను వినియోగించి అభివృద్ధి చేయాలి.పీసా,సమత జడ్జెమెంట్‌ స్పష్టం చేసిన తీర్పును అర్ధం చేసుకొని షెడ్యూల్‌ ప్రాంతాల్లో ఉన్న వనరులు స్థానికులకే హక్కు కలిగేలా చర్యలు తీసుకోవాలి.వారి వనరులు వారికే చెందేలా గిరిజన సొసైటీలుఏర్పాటు చేయించి,గిరిజనులకు లీజులు ఇచ్చిప్రొత్సహించాలి. అప్పుడే గిరిజన ప్రజలు ఆశించిన నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. ఆ దశగా ఏపీఎండీసీ,రెవెన్యూ యంత్రాంగం చర్యలు చేపట్టాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.!-రెబ్బాప్రగడ రవి ,ఎడిటర్

1 2