మడ అడవుల పరిరక్షణ మన అందరి బాధ్యత
ప్రపంచంలోని వివిధ రకాల అరణ్య వ్యవస్థల్లో మడ అడవులకు ప్రత్యేకమైన స్థానం ఉంది. సముద్రం–నది కలయికతో ఏర్పడే ఉప్పు చిత్తడి నేలల్లో పెరిగే ఈ మడవనాలు, ప్రకృతి సమతుల్యాన్ని కాపాడే అద్భుతమైన జీవావరణ వ్యవస్థలు. సముద్రపు ఆటుపోట్ల సమయంలో భూక్షయాన్ని అడ్డుకోవడం,సునామీ వంటి ప్రకృతి విపత్తుల నుంచి తీర ప్రాంతాలను రక్షించడం,తుపాన్ల వేళ పెనుగాలుల తీవ్రతను తగ్గించడం వంటి కీలక పాత్రను మడ అడవులు నిర్వర్తిస్తున్నాయి.జీవ వైవిధ్యానికి ప్రతీకగా నిలిచే అనేక వన్యప్రాణులు, పక్షులు, మత్స్య జాతులకు ఇవి ఆశ్రయంగా ఉన్నాయి. ఈ ప్రాధాన్యతను గుర్తించిన యునెస్కో 2015లో ప్రతి ఏడాది అంతర్జాతీయ మడ అడవుల పరిరక్షణ దినోత్సవం నిర్వహించాలని నిర్ణయించింది.
అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మడ అడవుల విస్తీర్ణం వేగంగా తగ్గిపోతోంది.నదీ తీరప్రాంతాల్లో పుట్టగొడుగుల్లా పెరుగుతున్న పరిశ్రమలు,ఫార్మా కంపెనీలు,నివాస సముదాయాల విస్తరణ మడ అడవుల మనుగడను ప్రశ్నార్థకంగా మారుస్తోంది.కారణాలేవైనా,దీని ప్రభావం ప్రజా భద్రతతో పాటు జీవ వైవిధ్యంపై తీవ్రంగా పడుతోంది.
ఆంధ్రప్రదేశ్లో సుమారు 580చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మడ అడవులు విస్తరించి ఉన్నాయి. ముఖ్యంగా కోస్తాతీర ప్రాంతాలు,గోదావరి-కృష్ణా నదీముఖద్వార ప్రాంతాల్లో ఇవి అధికంగా కనిపిస్తాయి. ఇందులో కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో విస్తరించిన కోరింగ అభయారణ్యం (235.7చదరపు కిలోమీటర్లు) ప్రత్యేక ప్రాధాన్యత కలిగి ఉంది.గోదావరి సముద్రంలో పాయలుగా కలిసే ప్రాంతంలో విస్తరించిన ఈ దట్టమైన మడ అడవులు కనువిందు చేస్తాయి.సుమారు 108రకాల పక్షి జాతులు,600కు పైగా మత్స్య జాతులు, వందల సంఖ్యలో సముద్ర తాబేళ్లు, నీటి పిల్లులు తదితర జీవరాశులకు కోరింగ ఆలవాలంగా ఉంది.
అయితే ఇంతటి ప్రాధాన్యత ఉన్నప్పటికీ కోరింగ అభయారణ్యం కాలుష్య ముప్పును ఎదుర్కొంటోంది. గోదావరి జలాలు సముద్రంలో కలిసే ప్రాంతంలోకి రొయ్య శుద్ధి పరిశ్రమలు,నివాసాల నుంచి వచ్చే మురుగు జలాలు,వాణిజ్య-పారిశ్రామిక వ్యర్థాలు చేరడం తీవ్రసమస్యగా మారింది.ఈ కాలుష్యం జీవరాశులకే కాదు, మొత్తం పర్యావరణ వ్యవస్థకే ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.మడ అడవులులేని ప్రాంతాల్లో రహదారులు సముద్రంలో కలిసిపోతుండగా (ఉదాహరణ: ఉప్పాడ పరిసర ప్రాంతాలు), మడ అడవులు ఉన్న చోట పరిశ్రమల పేరుతో వినాశనం కొనసాగుతోంది (కోస్తా తీరప్రాంతాలు,విశాఖపట్నం పరిసరాలు).ఈపరిస్థితులు మడ అడవుల సంరక్షణపై ఆందోళన కలిగిస్తున్నాయి.
ఈనేపథ్యంలో మడ అడవుల పునరుద్ధరణ,సంరక్షణకు అంతర్జాతీయ సంస్థలు,ప్రభుత్వాలు ముందుకు వస్తున్నాయి.యునెస్కో ఆయా కమÖ్యనిటీలకు మద్దతు ఇస్తుండగా,గ్రీన్ క్లైమేట్ ఫండ్ (జీసీఎఫ్) సహకారంతో తీరప్రాంతాల్లో మడ అడవుల అభివృద్ధి,సంరక్షణకు అటవీశాఖ చర్యలు వేగవంతం చేసింది.మత్స్యకార సమాజాలను ప్రత్యక్ష భాగస్వాములుగాచేస్తూ,వారి జీవనాధారాలను పరిరక్షించడమే కాకుండా వాతావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కొనే దిశగా ప్రోత్సాహక కార్యక్రమాలు చేపడుతోంది.
ఈకార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలనే ఉద్దేశంతో సమత సంస్థ ఇటీవల మడ అడవుల పునరుద్ధరణ,సంరక్షణకు కృషి చేస్తున్న అటవీశాఖ,అడవుల పెంపకం రైతులతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది.అటవీశాఖ చేపడుతున్న అభివృద్ధిని తెలుసుకొని వారి చేస్తున్న పనులపైౖ సంతృప్తి వ్యక్తం చేస్తూనే,గ్రీన్ క్లైమేట్ ఫండ్ మరియు దాని స్వతంత్ర ఫిర్యాదు పరిష్కార వ్యవస్థ (ఐఆరఆచ) అంశాలపై సమగ్ర సమాచారం,సూచనలు అందించింది. మడ అడవులు తీర ప్రాంత ప్రజలను ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడడమే కాకుండా మత్స్య సంపద ఉత్పత్తికి దోహదపడుతున్నాయని ఈ సందర్భంగా స్పష్టం చేసింది.
నదీజలాలు సముద్రంలో కలిసే చిత్తడి నేలల్లో పెరిగే మడ అడవులు తీరప్రాంతానికి సహజసిద్ధ రక్షణ గోడలుగా నిలుస్తాయి.అందువల్ల కోస్తా తీర ప్రాంతమంతటా మడ అడవుల పెంపకం, సంరక్షణ చేపట్టాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.మడ అడవుల పరిరక్షణ ప్రభుత్వాలతోపాటు,ప్రజలు,పరిశ్రమలు,స్థానిక సమాజాలు అందరూ కలసి చేయాల్సిన సామాజిక సామÖహిక బాధ్యత.ఈప్రక్రియ ముందుకు సాగినప్పుడే తీర ప్రాంత భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది.– రెబ్బాప్రగడ రవి ,ఎడిటర్
