పీసా చట్టం ఎవరి కోసం!!?

గిరిజన ప్రాంతాల్లో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో 1996లో పార్లమెంట్ ఆమో దించిన పీసా(PజుSA)చట్టం..నేటికి 29ఏళ్లు గడిచినా ఇంకా సంపూర్ణంగా అమలుకాని చట్టంగానే మిగిలి పోయింది. ఈచట్టాన్ని రూపొందించడానికి ఏడాది పాటు నిపుణుల కమిటీ చేసిన కసరత్తును, గిరిజన స్వయం పాలన అనే భావనను రాష్ట్ర ప్రభుత్వాలు కావాలనే పక్కన పెట్టాయి.అప్పట్లో ఈచట్టాన్ని పట్టించుకోని ప్రభుత్వాలే, ఇప్పుడు ఒక్కసారిగా అమలు పేరుతో హడావిడి చేయడం అనుమానాలకు తావిస్తోంది.
ఇప్పటి పరిస్థితుల్లో పీసాచట్టం అమలుపై ప్రభుత్వాల ఆతృత గిరిజన సంక్షమం కోసమా? లేక షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని భూములు,అడవులు,ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పగించడానికా? అనే ప్రశ్నకు సమాధానం వెతకాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈచట్టం అమలుపై ఆసక్తి గత నాలుగేళ్లుగా మాత్రమే పెరగడం యాదృచ్ఛికం కాదు.
షెడ్యూల్డ్ ఏరియాల్లో గ్రామసభలకు అధికారం కల్పించాలన్న పీసా చట్టం సారాంశాన్ని వక్రీకరించి, గ్రామసభలనే అధికారాల నుండి ఖాళీ చేసి,కాగితాల మీద మాత్రమే ఉంచే ప్రయత్నం జరుగుతోంది. గ్రామసభ అనుమతి పేరుతో ముందే నిర్ణయించిన ప్రాజెక్టులకు ముద్ర వేయించడం, గిరిజనుల భూములను బహుళజాతి కంపెనీలకు ధారాదత్తం చేయడం నేడు బహిరంగ రహస్యంగా మారింది.
ఆంధ్రప్రదేశ్,ఛత్తీస్‌గఢ్,ఒడిశా,జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో పీసా చట్టం అమలుపై జరుగుతున్న హడావిడి వెనుక గిరిజనుల హక్కులు కాకుండా,సహజవనరులపై ప్రభుత్వ కార్పొరేట్ కూటమి కన్ను పడిందన్న ఆరోపణలను కొట్టిపారేయలేం.‘గ్రామ సభ దివాస’ల పేరుతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూనే, గ్రామసభల అధికారాలను క్రమంగా నిర్వీర్యం చేయడం తీవ్ర విరుద్ధాభాసం.
ఈ నేపథ్యంలోఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో పీసారూల్స్ తయారీ కోసం ఏర్పాటు చేసిన కమిటీకి నన్ను ఛైర్మన్‌గా నియమించడం జరిగింది. కోవిడ్ వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ మా కమిటీ దాదాపు 300 పేజీల సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.అయితే ఇంత శ్రమతో రూపొందించిన నియమ నిబంధనలు ప్రభుత్వ ఫైళ్లలోనే పడి ఉండటం,అధికార యంత్రాంగం గిరిజన స్వయం పాలనపై ఎంత నిజాయితీగా ఉందో ప్రశ్నిస్తుంది.
ఈ కమిటీలో పనిచేసిన కోయ తెగ యువసామాజిక కార్యకర్త అశ్వని కంగే ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో నిర్వహించిన కోయ భూంకాల్ క్రాంతి సేన (కెబికెఎస్)శిబిరం ఒక స్పష్టమైన సంకేతం ఇచ్చింది. ఐదు రోజుల పాటు గ్రామసభ,పీసా చట్టం, ఆదివాసీ సంస్కృతి,సంప్రదాయాలపై జరిగిన చర్చలు, గిరిజన యువతలో ఉన్న అవగాహనను,చైతన్యాన్ని స్పష్టంగా చాటిచెప్పాయి. సుమారు 1500 మంది ఆదివాసీ యువతీఉయువకులు, ప్రజాప్రతినిధులు,అధికారులు పాల్గొన్న ఈ సదస్సు పీసా చట్టానికి స్పూర్తినిచ్చింది.
మÖడు దశాబ్దాల సామాజిక జీవితంలో ఎన్నో సమావేశాలు చూశాను. కానీ గిరిజన యువత ఇంత క్రమశిక్షణతో,తమ సంప్రదాయాలను గౌరవిస్తూ, చట్టాలపై లోతైన అవగాహనతో నిర్వహించిన శిబిరం అరుదు. ఈ సందర్భంలో పీసా చట్టంకోసం పోరాడిన ఐఏఎస్ అధికారి బీడీ శర్మ, ప్రొఫెసర్ జేపీరావు వంటి మేధావుల కృషి గుర్తుకు రాక మానదు.‘మా ఊళ్లో మారాజ్యం’ అనే నినాదాన్ని మారుమÖల గిరిజన గ్రామాల్లోకి తీసుకెళ్లి, గ్రామసభే స్వయం పాలన వ్యవస్థ అని చాటిచెప్పిన ఆ ఉద్యమకారులు నాటిన విత్తనం నేడు చెట్టుగా ఎదిగింది. కానీ ఆ చెట్టును నరికి వేయడానికి ఇప్పుడు ప్రభుత్వాలు చట్టబద్ధమైన గొడ్డళ్లతో సిద్ధంగా ఉన్నాయనే భావన గిరిజనుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
ఇప్పటికైనా గిరిజన ప్రజలు అప్రమత్తం కావాలి. పీసా చట్టం వారి భూములు,అడవులు, వనరులను రక్షంచడానికి వచ్చినదే తప్ప,వాటిని అమ్మకానికి పెట్టడానికి కాదన్న సత్యాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ప్రభుత్వాలు కార్పొరేట్ ఒత్తిళ్లకు లోనయ్యే విధానాలను ఎదుర్కొనే శక్తి గ్రామసభలకే ఉంది.పీసా చట్టం భవిష్యత్తు నేడు గిరిజనుల చేతుల్లోనే ఉంది.అది స్వయం పాలన వైపు నడుస్తుందా? లేక దోపిడీకి చట్టబద్ధతగా మారుతుందా? అన్నది వారు తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. – రెబ్బాప్రగడ రవి,ఎడిటర్