చలమ నీరు తాగుతూ ప్రాణాలు ఫణంగా..

“మాకు మంచినీళ్లు కావాలి” అంటూ పీవీటీజీ కొందు ఆదివాసి మహిళల ఆవేదన అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం జీనబాడు పంచాయతీ పరిధిలోని కొండశిఖర గ్రామమైన దాయెత్తి గ్రామంలో సుమారు 450 మంది పీవీటీజీ కొందు ఆదివాసులు నివసిస్తున్నారు. గ్రామానికి గతంలో రహదారి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలకు, ఇటీవల గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో రోడ్డు సౌకర్యం కల్పించబడింది. అయితే ఇప్పటికీ గ్రామానికి కనీస మంచినీటి వసతి లేక ప్రజలు చలమ నీటినే తాగుతూ జీవనం సాగిస్తున్నారు.
గ్రామస్తుల వేదన ఏమిటంటే..బోర్ వేయ డానికి యంత్రాలు గ్రామానికి చేరుకునే పరిస్థితి ఉన్నప్పటికీ, అధికారులు పట్టించు కోవడం లేదని ఆరోపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పీవీటీజీ గిరిజనుల కోసం ప్రవేశపెట్టిన “జన్‌మన”, “జల్ జీవన్ మిషన” వంటి ప్రత్యేక పథకాలు తమ కొండశిఖర గ్రామాలకు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కాలుష్యమైన నీరు తాగడం వల్ల గ్రామస్తులు జలుబు, మలేరియా వంటి వ్యాధులకు గురవుతున్నారని మహిళలు చెబుతున్నారు. అత్యవసర వైద్యం కోసం దేవరపల్లికి వెళ్లాలంటే ప్రత్యేక వాహనం అద్దెకు తీసుకోవాల్సి వస్తోందని, ఒక్కసారి ప్రయాణానికి రూ.2 వేల వరకు ఖర్చవు తోందని తెలిపారు. దాయెత్తి గ్రామ మహిళలు వంతల రాధా, సిదర్ లక్ష్మి, సిదర్ కాంతమ్మ, సిదరి దేవి మాట్లాడుతూ “మా గ్రామంలో వెంటనే బోర్ ఏర్పాటు చేసి, ఇంటింటికీ కొలాయిల ద్వారా మంచినీరు అందించాలి” అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇదే పంచాయతీ పరిధిలోని మడ్రేవు గ్రామంలో కూడా సుమారు 250 మంది పీవీటీజీ గిరిజ నులు నివసిస్తున్నారని,ఈ రెండు గ్రామాలకు జల్ జీవన్ మిషన్ ద్వారా తక్షణమే తాగునీటి సౌకర్యం కల్పించాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కే.గోవిందరావు డిమాండ్ చేశారు. స్థానిక నాయకులు శ్రీధర్ సోమన్న, కొండ పాముల నర్సింగరావు కూడా ప్రభుత్వాన్ని వెంటనే స్పందించాలని కోరారు.“తక్షణమే ఐటిడిఏ పీవో దాయెత్తి గ్రామాన్ని సందర్శించి సమస్యలు పరిష్కరించాలి. లేకపోతే ఐటిడిఏ కార్యాలయం వద్ద బిందెలతో ఆందోళన చేపడతాం” అని గిరిజనులు హెచ్చరించారు.- కే.గోవిందరావు