నిధులేక కూనరిల్లుతున్న గ్రామ పంచాయితీలు
రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో గ్రామ పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యమైంది. పంచాయతీలకు నిధులు ఇవ్వకపోగా చివరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సంఘం నిధులను కూడా ఇష్టారీతిన వాడుకుని ఇప్పుడు చేతులెత్తేసిందన్న విమర్శలు వ్యక్తమవుతు న్నాయి. వైసీపీ సర్కారు నిర్వాకంతో తాజాగా విడుదల చేయాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులను కేంద్రం నిలిపేసింది. అవి రూ.100 కోట్లకుపైనే ఉన్నాయి. దీంతో గ్రామాలు సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇదిలా ఉంటే గత రెండేళ్ల నుంచి పంచాయతీలకు ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వకపోగా ఉన్న నిధులను కూడా లాక్కొంది. ఆ సంగతి మరిచి ఇప్పుడు తాజాగా పారిశుధ్యం, ప్లాస్టిక్ నియంత్రణ కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. దీనిపై సర్పంచ్‌లు మండిపడుతున్నారు. – జి ఎన్ వి సతీష్
కేంద్ర ప్రభుత్వం గతవారం దేశంలోని గ్రామ పంచాయతీల పని తీరు, అభివృద్ధి కార్యక్రమా లపై ”పంచాయితీల అభివృద్ధి ఇండెక్స” నివేదిక విడుదల చేసింది. పేదరిక నిర్మూలన, మెరుగైన జీవనోపాధి కల్పన, ఆరోగ్య సేవల లభ్యత, మంచి నీటి సదుపాయం, పారిశుధ్యం, మౌలిక సదుపాయాల అందుబాటు, సామాజిక న్యాయం, సుపరిపాలన తదితర ప్రమాణాల ఆధారంగా గ్రామ పంచాయ తీలకు గ్రేడ్లు కేటాయించారు. దేశంలోని మొత్తం 2.59 లక్షలకు పైగా పంచాయతీల స్థితిగతులను విశ్లేషించారు. వాటిలో ఏ ఒక్కటీ ”ఏ ప్లస” గ్రేడ్ సాధించలేకపోవడం మన దేశ పల్లెల దుస్థితికి అద్దం పడుతున్నది. 78 ఏళ్ల స్వతంత్రం అనంతరం కూడా నూటికి 65 శాతం మంది ప్రజలు జీవిస్తున్న గ్రామీణ భారతం దయనీయ స్థితిలో కొనసాగడం ఎంతో ఆందోళనకు గురిచేస్తున్నది. ”ఏ” గేడ్ వచ్చిన వాటిని చూస్తే దేశ వ్యాప్తంగా కేవలం 3,635 పంచాయతీలు మాత్రమే ఉన్నాయి. అంటే మొత్తం పంచాయతీలలో కేవలం 1.36 శాతం మాత్రమే! ఈ ప్రమాణాల్లో 60 శాతం బెంచ్ మార్క్ దాటినవి చూస్తే కేవలం 48 శాతం పంచాయతీలు మాత్రమే ఉన్నాయి. దేశంలో 1.23 లక్షల (సగానికి పైగా) గ్రామ స్థానిక సంస్థలు కనీస స్థాయిలో కూడా ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించలేక విలవిలలాడిపోతున్నాయి.
ఈ లెక్కలు కూడా ప్రభుత్వ పరిశోధనా సంస్థలు స్వతంత్రంగా క్షేత్ర స్థాయిలో సర్వే చేసి విడుదల చేసినవి కాదు. కేవలం రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వ పోర్టల్‌లో అప్లోడ్ చేసిన వివరాలివి. వీటిల్లో ఎంత వాస్తవికత ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇక మన రాష్ట్రంలో పరిస్థితి చూస్తే అత్యంత ఘోరంగా ఉంది. ఎ.పి లో మొత్తం 13,351 గ్రామ పంచాయతీలు న్నాయి. వీటిలో ఏ ఒక్కటి కూడా ”ఏ ప్లస” గ్రేడ్ సాధించలేక పోయింది. కేవలం 591 (4.42 శాతం) పంచాయతీలు మాత్రమే ”ఏ” గ్రేడ్‌కు ఎంపికయ్యాయి. మిగిలినవన్నీ బి, సి గ్రేడ్లలో ఉన్నాయి. ఇవి కనీస స్థాయిలో కూడా పౌరులకు సదుపాయాలు కల్పించ లేకపోతున్నాయి.
ఈ దుస్థితికి కారణం ఏమిటి? త్వరలో భారత దేశం ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారబోతుందని కేంద్ర బిజెపి ప్రభుత్వం ఊదరగొడుతున్నది. ఆంధ్ర ప్రదేశ్ కూడా రాబోయే 20 ఏళ్లలో దేశంలో అత్యంత సంపన్నమైన రాష్ట్రంగా మారి 2.4 బిలియన్ డాలర్ల (రూ. 200 లక్షల కోట్లు) ఆర్థిక వ్యవస్థకు చేరుకుంటుందని, స్వర్ణాంధ్ర సాధిస్తామని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం గొప్పలు చెబుతున్నది. కానీ సాధిస్తున్న ఈ అభివృద్ధి, సృష్టిస్తున్న సంపదలో కనీస స్థాయిలో కూడా 65 శాతం పైబడి ఉన్న పల్లె ప్రజల అభివృద్ధికి చేరటం లేదనడానికి నేటి పల్లెల దుస్థితే నిలువెత్తు సాక్ష్యం. తాగడానికి సురక్షిత మంచినీరు, పారిశుధ్యం, మురుగు నీరు పారుదల, కాలువలు, రోడ్లు, వీధి లైట్లు వంటి ఐదారు సదుపాయాలు కూడా కనీస స్థాయిలో కల్పించలేక పంచాయతీలు వెలవెలపోతున్నాయి. బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి డబ్బులు లేని ఆందోళనకర పరిస్థితిలో ఉన్న పంచాయతీలు కోకొల్లలు. దళిత, గిరిజన జనాభా ఉండే పంచాయతీలు, కాలనీల పరిస్థితి అత్యంత దారుణంగా ఉండటంతో పాటు అన్ని రకాల సామాజిక వివక్షతకు గురవుతున్నాయి. కేంద్రం విడుదల చేసిన గణాంకాలే దీనిని ధృవీకరిస్తున్నాయి. ఇక ప్రాథమిక ఆరోగ్య సదుపాయాలు కూడా పది శాతం పంచాయతీల్లో లేని పరిస్థితి.
స్థానిక సంస్థలు అనేవి రాజ్యంగ బద్దంగా ఏర్పడిన పరిపాలనా వ్యవస్థలు. ఇవి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అంగాలు కాదు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వలె స్థానిక ప్రభుత్వాలు ఇవి. వీటికి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వలె కొన్ని అధికారాలు, విధులు, నిధులు, స్వయం పరిపాలనకు రాజ్యాంగ బద్ధత కల్పించబడ్డాయి. కేంద్ర, రాష్ట్రాల దయాదాక్షిణ్యంపై ఆధారపడేవి కాదు. స్థానిక సంస్థలకు కూడా తమ పరిధిలో పరిమిత పన్నుల వసూళ్లు కేంద్ర, రాష్ట్ర పన్నుల ఆదాయాల్లో నిధుల వాటా కల్పించబడ్డాయి. కానీ ఇవేవీ అమలు చేయబడటంలేదు. రాజ్యాంగంలోని షెడ్యూల్ 11లో 29 అధికారాలు, విధులు మూడు దశాబ్దాల క్రితమే గ్రామ పంచాయతీలకు కల్పించబడ్డాయి. కాని, నేటికి కేవలం 10 మాత్రమే బదిలీ చేశారంటే వీటి పట్ల పాలకులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో గ్రామ పంచాయతీలకు రాష్ట్ర బడ్జెట్ నుండి ఒక్క రూపాయి కూడా నిధులు బదిలీ చేయలేదు. పైగా గ్రామ పంచాయతీలకు కేంద్ర ఆర్థిక సంఘం నుండి బదిలీ అయ్యే నిధులను కూడా ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులు పెడుతున్నది. గత ఆరు నెలల నుండి కేంద్ర ఆర్థిక సంఘం నిధులు బదిలీ చేయకుండా రాష్ట్ర అవసరాలకు వినియోగించుకుంటున్నది. అంతేగాక గ్రామ పంచాయతీల సొంత పన్నుల ఆదాయాలను రాష్ట్ర ప్రభుత్వాధీనంలో ఉండే సి.ఎఫ్.ఎం.ఎస్ కు తరలించుకుపోతూ వాడుకుంటున్నది. భూములు, భవనాలు, అమ్మకాల కొనుగోళ్లపై వసూలు చేసే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ చార్జీలపై విధించే సర్ చార్జీని కూడా గత రెండేళ్ల నుండి ఇవ్వకుండా దౌర్జన్యంగా రాష్ట్ర ఖర్చులకు దారిమళ్లిస్తున్నది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కింద సుమారు రూ.11,500 కోట్ల ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది. ఇందులో సర్ చార్జీ (రిజిస్ట్రేషన్ విలువలో 1.5 శాతం చొప్పున) గ్రామ పంచాయతీలకు కనీసం రూ.2300 కోట్లు బదిలీ చేయాలి. ప్రతి మూడు నెలలకు ఒకసారి వీటిని ఇవ్వాలి. కానీ ఇవ్వడం లేదు. వృత్తి పన్ను కూడా గత కొన్నేళ్ల నుండి ఇవ్వడం లేదు. సినరేజి చార్జీలు, మినరల్స్, మైనింగ్‌లపై రాయల్టీ ద్వారా వచ్చే ఆదాయంలో కూడా చట్టబద్ధంగా గ్రామ సంస్థలకు వాటా ఇవ్వాలి. అవి కూడా గత 15 ఏళ్ల నుండి ఇవ్వడం లేదు. ఇటీవల వ్యవసాయ భూములను వ్యవసాయేతర కార్యకలాపాలకు మార్చబడినప్పుడు చెల్లించే నాలా రుసుముల్లో కూడా వాటా ఇస్తామని చెప్పి ఇవ్వడంలేదు. చివరికి గ్రామాల ఆస్తి పన్నును కూడా గుంజుకెళ్తున్నది. ఆస్తి పన్నులో ఉండే జనరల్ ఫండ్‌ను అక్రమంగా ఫ్రీజ్ చేసింది. ప్రభుత్వం తన సొంత అవసరాలకు వాడుకుంటున్నది. రోజువారీ ఖర్చులు కూడా ప్రభుత్వాన్ని ప్రాధేయపడాల్సిన స్థితికి పంచాయతీలను దిగజార్చారు. ఈ ఏడాది పంచాయతీల ఆస్తి పన్ను వసూళ్లపై రాష్ట్ర ప్రభుత్వం హడావుడి చేస్తున్నది. 2025-26లో పంచాయతీల ద్వారా రూ.1013కోట్ల ఆస్తి పన్ను వసూలు చేశామని గొప్పలు చెప్పుకుంటున్నది. దీని పరిమాణం చూస్తే రాష్ట్రంలో ఒక్కో పంచాయతీకి సగటున రూ.7.5 లక్షలు. ఈ సొమ్ముతో పంచాయతీలు ఏ అభివృద్ధి పనులు చేపట్టగలవు? ఇప్పుడు ఆస్తి పన్ను ద్వారా పంచాయతీలకు చాలా తక్కువ ఆదాయం వస్తున్నదని మరో దుష్ప్రచారానికి కూటమి ప్రభుత్వం ఒడిగడుతున్నది. దీనిని కనీసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి విలువలో ఒక్క శాతానికైనా పెంచాలని, భవిష్యత్‌లో రాష్ట్ర ప్రభుత్వంపై నిధుల కోసం స్థానిక సంస్థలు ఆధార పడకూడదని అంటున్నది. ఒకవైపు స్థానిక సంస్థల పన్నుల ఆదాయాలను అక్రమంగా దారి మళ్లించి వినియోగించుకుంటూ నిస్సిగ్గుగా స్థానిక సంస్థలపై అభాండాలు వేస్తున్నది. ప్రజల నుంచి అదనంగా వసూలు చేయాలని హితబోధ చేస్తోంది.
ఇక రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా తన పరిధిలో క్రమం తప్పకుండా ప్రతి ఐదేళ్లకు ఒకసారి రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని నియమించాలి. అది చేసే సిఫార్సులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం తన సొంత పన్నుల ఆదాయం నుండి నిధులు బదిలీ చేయాలి. అభివృద్ధి నిధులు, గ్రాంట్లను ఇవ్వాలి. గ్రామ పంచాయతీలకు ఇదో ముఖ్యమైన ఆదాయ వనరు. ఇది రాజ్యాంగం కల్పించిన ఆర్థిక వనరు. చంద్రబాబు నాయుడు 2014 నుండి ఈ పక్రియను గాడి తప్పించేశారు. స్థానిక సంస్థలకు రాష్ట్ర బడ్జెట్ నుండి నిధులు ఇవ్వాల్సి వస్తుందనే దుర్బుద్ధితో రాష్ట్ర ఆర్థిక సంఘాన్నే నియమించడానికి నిరాకరించారు. రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఒక ప్రహసనంలా మార్చారు. గత 15ఏళ్ల నుండి రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు గ్రామ పంచాయతీలకు ఇవ్వడం లేదు. ఆఖరుకు గ్రామ పంచాయతీలకు రూ.25, మండల ప్రజా పరిషత్తులకు రూ.50,జిల్లా ప్రజా పరిషత్‌లకు రూ.25చొప్పున జనాభా ప్రాతిపదికన తలసరి గ్రాంటును లెక్కగట్టి పంచాయతీలకు ఇవ్వాలి.గత రెండేళ్ల నుండి టిడిపి కూటమి ప్రభుత్వం వాటినీ ఇవ్వడానికి నిరాకరిస్తున్నది. గడిచిన రెండేళ్లలో రూ.700 కోట్లు ఎగ్గొట్టింది. భవిష్యత్‌లో కూడా తలసరి గ్రాంటు ఇస్తారనే గ్యారంటీ లేదు. గతంలో వైసిపి ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. 2019-24 మధ్య కాలంలో రూ.1750 కోట్లు తలసరి గాంట్లు ఇవ్వకుండా వైసిపి ప్రభుత్వం వాడుకుంది. నేడు గ్రామ పంచాయతీలు వీధిలైట్లు, మంచినీటి సరఫరాకు వినియోగించే మోటార్ విద్యుత్ బిల్లులు కూడా చెల్లించు కోలేని దీన స్థితిలో ఉన్నాయి. పాడైపోయిన వీధి లైట్ల బల్బులను కూడా వెంటనే పునరుద్ధరించుకోలేక పోతున్నాయి. పంచాయతీలు వినియోగించే విద్యుత్ కేటగిరీనైనా వాణిజ్యం నుండి గృహ వినియోగ కేటగిరీకి మార్చమన్నా అంగీకరించడం లేదు. కనీసం రాష్ట్రంలో వెయ్యి జనాభా ఉన్న పంచాయతీలు 1895 ఉన్నాయి. వీటి విద్యుత్ బిల్లులనైనా రాష్ట్ర ప్రభుత్వం భరించాలని మొరపెట్టుకున్నా ఫలితం లేదు. ఐదవ రాష్ట్ర ఆర్థిక సంఘం 2025-30 కాలానికి స్థానిక సంస్థలకు అవసరమైన నిధులను తేల్చి రాష్ట్ర ప్రభుత్వానికి ఏడాది క్రితమే నివేదిక ఇచ్చింది. పంచాయతీరాజ్ సంస్థలకు రాబోయే ఐదేళ్లలో ఏడాదికి రూ.1407 కోట్ల చొప్పున రూ.7035 కోట్ల నిధులు బదిలీ చేయాలని చెప్పారు. దీనిని కూడా రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. ఈ నిధులు చాలా అత్యల్పం. రాష్ట్ర సొంత పన్నుల ఆదాయంలో చూస్తే కేవలం 1.4 శాతం లోపు మాత్రమే! దీనిని కూడా ససేమిరా అంటున్నదీ సర్కారు.
వాస్తవంగా 2025-26లో సొంత పన్నుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.లక్షా 5 వేల కోట్ల ఆదాయం సమకూరింది. ఈ ఆదాయం లో పట్టణ, గ్రామ స్థానిక సంస్థలకు ప్రతి ఏడాది కనీసం 20 శాతం అనగా రూ.21 వేల కోట్లు బదిలీ చేస్తే స్థానిక సంస్థలు ఎంతో పురోగతి చెందుతాయి. ఎందుకంటే స్థానిక సంస్థలు రాష్ట్ర జాబితాలోనివి. వీటిలో మౌలిక సదుపాయాలు, ఉన్నతమైన పౌర సేవలు కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుంది. కానీ రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఈ బాధ్యత నుండి తప్పుకొంటున్నది. గ్రామ పంచాయతీలను చావు దెబ్బ తీస్తున్నది.
అన్నింటినీ వాడేసుకున్న రాష్ట్రం
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతంలో ఎన్నడూ లేని విధంగా పంచాయతీల సొమ్ముపై కన్నేసింది. వాటికొచ్చే అన్నిరకాల నిధులను అన్యాయంగా ప్రభుత్వమే వాడేసుకుంటోది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన 15వ ఆర్థిక సంఘం నిధులను పంచాయతీల ఖాతా నుంచి పూర్తిగా లాగేసుకుంది. అందులో కొంత విద్యుత్ చార్జీల పేరుతో వాడేసుకుంది. కొంత మొత్తం స్వచ్ఛభారత్ కింద నియమించిన కార్మికుల జీతాలు చెల్లించే విధంగా కార్యదర్శులపై ఒత్తిడి తెచ్చింది. దీంతో గ్రామ పంచాయతీల్లో డబ్బులు లేక ఎక్కడి పనులు అక్కడ నిలిచిపోయాయి. అలాగే గతంలో వైసీపీ నాయకులు, ఆయా సర్పంచ్‌లు చేసిన పనులకు కూడా బిల్లులను మంజూరు కాని పరిస్థితి ఏర్పడింది. తాజాగా కేంద్రప్రభుత్వం 2022-23 సంవత్సరానికి సంబంధించిన ఆర్థికసంఘం నిధులను నిలిపి వేసింది. ఆర్థిక సంవత్సరం ప్రారంభమై రెండున్నర నెలలు దాటుతున్నా రూపాయి ఇవ్వలేదు. అంతకు ముందు ఏడాది మంజూరు చేసిన ఆర్థిక సంఘం నిధుల లెక్కలను కేంద్రానికి చెప్పాల్సి ఉంది. అయితే రాష్ట్రప్రభుత్వం లాగేసుకున్న నేపథ్యంలో ఆ లెక్కలకు సంబంధించిన వివరాలను కేంద్రానికి పంపని పరిస్థితి. దీంతో అసలుకే మోసం వచ్చింది.
నిలిచింది రూ.100 కోట్లపైనే..
ఇన్నాళ్లుగా ఆర్థికసంఘం నిధులు నిలిచిపో యినా ప్రభుత్వం ఏమీ తెలియనట్లుగా వ్యవహరిస్తున్నదన్న విమర్శలు వ్యక్తమవుతు న్నాయి. ఇటీవల 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నిధుల మంజూరుపై కేంద్రప్రభుత్వాన్ని సర్పంచ్ల సంఘం నాయకు లు ప్రశ్నించారు. దీంతో వాస్తవ పరిస్థితులు అక్కడి నుంచి వెలుగులోకి వచ్చాయి. గత ఏడాదికి సంబంధించిన ఆర్థిక సంఘం నిధుల వినియో గంపై రాష్ట్రప్రభుత్వం నుంచి వివరాలు అడిగితే ఇంత వరకూ సమాధానం లేదని చెప్పింది. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో జిల్లాకు రావా ల్సిన రూ.100కోట్లు నిలిచిపోయాయి.
అకౌంట్లలో జీరో బ్యాలెన్స్
ఇప్పటికే పంచాయతీ బ్యాంకు అకౌంట్లలో జీరో బ్యాలెన్స్ ఉండగా కార్యక్రమాల నిర్వహణకు కనీసం ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. పైగా పక్కాగా నిర్వహించాలని ఒత్తిడి చేయడంతో పంచాయతీ కార్యదర్శులు ఆందోళన చెందుతున్నారు. రోజువారీ కార్యక్రమాలను నిర్దేశించుకొని అమలుచేయడం తోపాటు అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు తీసి యాప్‌లలో అప్లోడ్ చేయాలని ఆదేశాలిచ్చారు. దీంతో దిక్కుతోచని స్థితిలో పాలకవర్గాలు ఉన్నాయి. కనీసం పంచాయతీలకు ఈ కార్యక్రమాల నిర్వహణకు అయినా నిధులు ఇవ్వాలని, లేదంటే ఆర్థిక సంఘం నిధులైన ఇప్పించాలని వారు కోరుతున్నారు.
ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు ఎలా?
నిధులు లేక ఇప్పటికే కూనారిల్లిపోతున్న గ్రామ పంచాయతీల్లో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లావ్యాప్తంగా ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై సర్పంచ్‌లు మండిపడుతున్నారు. వచ్చేనెల 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం నుంచి ప్రతి గ్రామ పంచాయతీలో పారిశుధ్యం, ప్లాస్టిక్ నిషేధం తదితర అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని పంచాయతీరాజ్ కమిషనర్ ఉత్తర్వులిచ్చారు. వీటిని అమలు చేయాలని జిల్లా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు. దీంతో సర్పంచ్‌లు, కార్యదర్శులు అయోమయంలో ఉన్నారు. ఇప్పటికే రూ. లక్షలు ఖర్చుపెట్టి వివిధ రకాల పనులు చేసి బిల్లులు రాక ఆర్థికంగా సతమతమవుతున్నామని, మళ్లీ ఈ ఉత్తర్వులు ఏమిటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు.
తాగునీటికి రూ.లక్ష ఏమైపోయాయి
గడిచిన పదేళ్లలో ఎప్పుడూ లేనంతగా ఈ ఏడాది రాష్ట్రంలో తాగునీటికి ఇబ్బందులు ఎదురయ్యాయి. పైప్లైన్లకు మరమ్మతు చేయలేక చాలా గ్రామాల్లో తాగునీటి సరఫరా నిలిచింది. దీంతో జిల్లాస్థా యి ఉన్నతాధికారులు తాగునీటి సరఫరా కు ప్రత్యేకమైన నిధులు వస్తున్నాయి. ప్రతి పంచాయతీకి రూ.లక్ష ఇస్తాం. ముందైతే ఇబ్బందులు లేకుండా నీటి సరఫరా చేయాలంటూ పంచాయతీ కార్యదర్శులకు చెప్పారు. ఈ విషయంలో ఇబ్బందులు వస్తే ఉన్నతాధికారులు కార్యదర్శులనే బాధ్యులను చేశారు. దీంతో చేసేది ఏం లేక ఒక్కో కార్యదర్శి రూ.30 వేల నుంచి రూ.ఒక లక్ష వరకు అప్పులు తెచ్చి తాగునీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణ, వీధి దీపా ల ఏర్పాటు ఇలా రకరకాల పనులపై పెట్టా రు. తీరా ఇప్పుడు పనులైపోయాక ఆ లక్ష రూపాయాల విషయం కూడా మాట్లాడే నాథుడే కరువయ్యారు. అప్పుల పాలై పోతున్నాం సార్ అంటూ పంచాయతీ కార్యదర్శులు వాపోతున్నారు. పంచాయతీల్లో పాలకవర్గానికి గడువు ముగియడంతో స్పెషల్ ఆఫీసర్లను నియమించినా.. వారు ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో తెలియడం లేదు. పాలకవర్గాలు లేకపోవడం, స్పెషల్ ఆఫీసర్ రాకపోవడంతో ప్రతి దానికి మేమే బాధ్యత వహించాల్సి వస్తుందంటూ బాధపడుతున్నారు.
