ఉపాధి కూలీలకు ఫొటోల చిక్కులు

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకం సాంకేతిక సమస్యల సుడిగుం డంలో చిక్కుకుంది. క్షేత్రస్థాయిలో కూలీలు ఎదుర్కొం టున్న ఇబ్బందులు పథకం అసలు ఉద్దేశాన్నే దెబ్బతీస్తున్నాయి. మంగళవారం నవతెలంగాణ పత్రిక ప్రతినిధి పరకాల మండలం వెల్లంపల్లి గ్రామంలో గ్రామంలోని వంకాయ కుంట వద్ద జరుగుతున్న పని ప్రదేశాన్ని పరిశీలించగా, కొత్తగా ప్రవేశపెట్టిన ఎనఎన్ ఎంఎస్ యాప్ కూలీలకు శాపంగా మారింది. గతంలో పని ప్రదేశంలో ఎక్కడైనా హాజరు నమోదు చేసుకునే వెసులుబాటు ఉండగా, ప్రస్తుతం భువన్ యాప్ అనుసంధానంతో నిర్దిష్ట లొకేషన్‌లో మాత్రమే ఫోటో తీయాల్సి రావడం గమనార్హం. సిగ్నల్ సమస్యల వల్ల ఒకే చోట గంటల తరబడి నిలబడాల్సి రావడంతో, పని కంటే హాజరుకే ఎక్కువ సమయం వృథా అవుతోందని కూలీలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఐరిష్, ఫేస్ రికగ్నైజేషన్ ప్రక్రియలో ఎదురవుతున్న సాంకేతిక లోపాల వల్ల ఒక్కొక్కరితో ఫోటో తీయడం భారంగా మారింది. – (వూకె రామకృష్ణ దొర)
కేంద్ర ప్రభుత్వం 2023 జనవరి 1 నుంచి ‘మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం’ కింద పనిచేసే కూలీలకు ‘నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ’ (చీవీవీS) యాప్ ద్వారా హాజరును తప్పనిసరి చేసింది.నాటి నుంచీ ఈ విధానం వల్ల కూలీలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండు పూటలా ఫొటోలు అప్‌లోడ్ చేయాల్సి వస్తోంది.‘పని ప్రారంభంలో ఒకసారి, పని ముగిశాక రెండోసారి జియోట్యాగ్డ్, టైమ్‌స్టాంప్డ్ ఫొటోలను అప్‌లోడ్ చేయడం తప్పని సరి’ అని కేంద్రం నిబంధనలు పెట్టింది. ఏజెన్సీ ప్రాంతాల్లో సిగ్నల్స్ సరిగ్గా ఉండవు. సర్వర్లు మొరాయిస్తాయి. దీంతో ఉపాధి హామీ సిబ్బంది, కూలీలకు ఈ ఫొటో అప్‌లోడింగ్ ప్రక్రియతో తిప్పలు తప్పడం లేదు. ఇలాంటి సాంకేతిక కారణాల వల్ల కేవలం ఒక పూట మాత్రమే ఫొటో అప్‌లోడ్ అయితే, ఆ రోజుకు ఉపాధి కూలీలు తమ సగం వేతనం కోల్పోవాల్సిందే! రెండు పూటలా అప్‌లోడ్ కాకపోతే ఆ రోజు వేతనాన్ని వారు కోల్పోయినట్లే.
గత ఏడాది జూలైలో కేంద్రం జారీ చేసిన కొత్త మార్గదర్శకాల ప్రకారం, అప్‌లోడ్ చేసిన ప్రతి ఫొటోనూ గ్రామ పంచాయతీ స్థాయిలో 100 శాతం పరిశీలన చేయాల్సిందే. కూలీల హాజరును పారదర్శకంగా ఉంచేందుకు ప్రభుత్వం ఈ డిజిటల్ విధానాన్ని తెచ్చినప్పటికీ, సాంకేతిక కారణాలవల్ల పేద కూలీలు తమ కష్టార్జితాన్ని కోల్పోతున్నారు.దీంతో ఈ ఉపాధి చట్టంలో కేంద్రం తీసుకొచ్చిన మార్పులపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో గమనిస్తే, కేంద్రం ప్రకటించిన కనీస వేతనాల కంటే ఇంకా తక్కువ వేతనాలే ఉపాధి కూలీకు అందుతున్నాయి. వీరి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, నెట్‌వర్క్ లేని ప్రాంతాల్లో ఆఫ్‌లైన్ మోడ్‌లో ఫొటోలు తీసి, సిగ్నల్ ఉన్న చోట అప్‌లోడ్ చేసే సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించాలి. వీలైతే, ఇలా రెండు సార్లు ఫొటోలు తీసే కార్యక్రమాన్ని తక్షణమే రద్దు చేయాలని, కనీస వేతనాలు పక్కాగా అమలు చేయాలని ఉపాధి హామీ కూలీలు ప్రభుత్వాలను కోరుతున్నారు.
యాప్‌తో కూలీల అవస్థలు..
ఈజీఎస్ పనుల్లో నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ (ఎనఎంఎంఎస్)యాప్ ద్వారా కూలీల హాజరు నమోదు ప్రక్రియను అమలు చేస్తున్నారు. అయితే ఈ విధానం కూలీలకు తలనొప్పిగా మారింది.సాంకేతిక సమస్యలతో కొత్త ఇబ్బందులు తెచ్చి పెడుతున్నది. పని ప్రదేశంలో ఇంటర్నెట్, సర్వర్ సమస్యలతో ఫొన్‌లో ఫొటోలు స్కాన్ కావడం లేదు.ఫొటో క్యాప్చరింగ్ అటెండెన్స్ విధానంతో కొన్ని సందర్భాల్లో కూలీల హాజరు నమోదు కాక వారు వేతనాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది.
మొబైల్‌లో ఫొటో దిగేందుకు గంటల తరబడి ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొంది. కొందరి కూలీల ఫొటోలు స్కాన్ కాకపోవడంతో క్షేత్ర సహాయకులు కూలీలను కింద పడుకోబెట్టి తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు, పని ప్రదేశాల వద్ద కనీస సౌకర్యాలు కల్పించక పోవడంతో కూలీలు ఎండవేడిని తాళలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండ నుంచి ఉపశ మనానికి నీడ వసతి, తాగునీరు, ప్రథమ చికిత్స కిట్లు పని ప్రదేశంలో కల్పించాల్సి ఉంది. కానీ ఇవేమీ కనిపించడం లేదు.
అటెండెన్స్ రెండు సార్లు..
పని లేని నిరుపేదలకు ఏడాదిలో కనీసం వంద రోజుల పాటు పని కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం.. 2006లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంఎనఆర్ ఈజీఎస్) చట్టాన్ని తీసుకొచ్చింది. అయితే, తాజాగా ఈ పథకం పేరును వికసిత్ భారత్-గ్రామీణ రోజ్‌గార్ అజీవిక మిషన్ (వీబీజీ రామ్ జీ)గా మార్చిన కేంద్రం..చట్టంలో సరికొత్త మార్పులు చేపట్టింది.పని ప్రారంభంలో,ముగింపు సమయంలో పని ప్రదేశంలోనే కూలీలకు రెండు సార్లు ఎనఎంఎంఎస్ యాప్ ద్వారా వారి ఫొటో లను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే,గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సమస్యల కారణంగా ఫొటోలు అప్‌లోడ్ కాకపోవడంతో కూలీలు,సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ కొత్త యాప్ కారణంగా క్షేత్ర సహాయకులు నిర్దేశించిన మేరకు పనులు చేయించలేక, కూలీల ఫొటోలు తీసి ఆప్‌లోడ్ చేయడానికే పరిమితం అవుతున్నారు.దీంతో ఆసలు ఈ పథకం ఉద్దేశం పూర్తిగా నీరుగారుతున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
కూలీల పొట్ట కొట్టేందుకే ఈ యాప్
ఉపాధి హామీలో కొత్తగా తీసుకొచ్చిన ఫొటో అటెండెన్స్‌తో చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చే కుట్ర జరగు తున్నది. కొత్త కొత్త నిబంధనలు తీసుకురావడంతో ఇప్పటికే పనులకు వస్తున్న కూలీల సంఖ్య భారీగా తగ్గింది.ఇక సిగ్నల్ రాక,సర్వర్ డౌన్ కారణంగా హాజరు పడుతున్నదో,లేదో తెలుస్తలేదు.
సర్కారు పనిని బంద్ చేసే కుట్ర..
చాలా రోజుల ఉపాధి పనులకు వస్తున్న.కొత్తగా వచ్చిన ఫొటో యాప్ వల్ల మస్తు ఇబ్బందులు అయితున్నయ్. పనులు చేసుడు ఒక వంతైతే, ఫొటో దిగుడు మరో వంతైతున్నది. మోదీ ప్రభుత్వం సర్కారు పనిని బందు చేసేందుకు కుట్ర పన్నుతున్నది. పనికి వచ్చే వారందరూ ఫొటోలు దిగాలంటే గంటలు పడుతున్నది. అప్పుడప్పుడు ఫోనులో ఫొటోలు అస్తలేవు. పాత పద్ధతిలోనే తీసుకోవాలి.
కనీస సౌకార్యలు కల్పించాలి
ఉపాధి హామీ పనులు కల్పిస్తున్నప్పటికీ పని ప్రదేశంలో కనీస సౌకార్యలు సరిగా ఉంటలేవు. ఎండలు ఎక్కువగా ఉన్నాయి.నీడ సౌకర్యం లేకపోవడంతో చెట్ల కింద సేద తీరుతున్నాము. పని ప్రదేశంలో కూలీలకు నీడ, తాగునీటి సౌకర్యంతో పాటు ప్రథమ చికిత్స కిట్లను ఉం చాలి.నీడ వసతి కల్పించకుంటే వడదెబ్బ తగులుతుంది. అధికారులు చొరవ తీసుకొని కనీస సౌకర్యాలు కల్పించాలి.
సర్వర్ డౌన్‌తో సమస్యలు..
ఫొటో క్యాప్చర్ ద్వారా కూలీల అటెండెన్స్ తీసుకుంటున్నాము. కొంత మంది కూలీల ఫొటోలు తీసిన తర్వాత సర్వర్ డౌన్ అవుతుం డడంతో ఫొటో క్యాప్చర్‌కు ఇబ్బందులు వస్తున్నా యి. అటవీ ప్రాంతాల్లో పనులు జరుగుతుం డడంతో అప్పుడప్పుడు సిగ్నల్ సమస్య తలెత్తు తున్నది. ఆలస్యమైనా కూలీలందరి అటెండెన్స్ ఎనఎంఎంఎస్ విధానంలోనే తీసుకుంటున్నాం.
-హనీఫ్, ఫీల్డ్ అసిస్టింట్,కోనాపూర్