ప్రకృతికి శాపం..ప్లాస్టిక్ భూతం…!!
పూర్వం నాలుగు దశాబ్దాల క్రితం ఏజెన్సీప్రాంతాలను సందర్శించినప్పుడు గిరిజనులు డబ్బును “మైకా కాగితం” (ప్లాస్టిక్ సంచి)లో చుట్టి భద్రపరచుకునే దృశ్యాలు కనిపించేవి. అప్పట్లో అది కేవలం అవసరానికి ఉపయోగించే వస్తువుగా మాత్రమే ఉండేది.కానీక్రమంగా అదే ప్లాస్టిక్ నేడు సమాజాన్ని శాసించే స్థాయికి చేరుకుంది.ప్రకృతి సోయగాలకు ప్రసిద్ధిగాంచిన తూర్పు కనుమల్లోనూ ప్లాస్టిక్ వ్యర్థాలు పెరిగిపోవడం ఆందోళనకర పరిణామం.
దేశంలోని తూర్పు కనుమలంటే..మేఘాలను తాకేలా కనిపించే హరిత పర్వతాలు,చల్లనిగాలులు, పచ్చని ప్రకృతి అందాలతో కళకళలాడే ప్రాంతాలు.కానీ,నేడు పర్యాటక ప్రదేశాల్లో ప్లాస్టిక్ రాజ్యమేలుతోంది. నగరాలు,పట్టణాలకే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్లాస్టిక్ సమస్య రోజురోజుకు తీవ్రమవు తోంది. ఇది కేవలం పర్యావరణానికే కాకుండా మనుషులకు, పశువులకు కూడా ప్రాణాంతకంగా మారుతోంది.గ్రామాల్లో పారిశుధ్య సమస్యలు పెరుగుతున్నాయి.డ్రైనేజీ కాలువల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోవడంతో మురుగునీటి ప్రవాహం ఆగిపోతోంది. ఫలితంగా దుర్వాసనలు వ్యాపించి,దోమలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ చూసినా బహిరంగ ప్రదేశాల్లో ప్లాస్టిక్ చెత్త గుట్టలు కనిపిస్తున్నాయి.దీంతో గ్రామపంచాయతీలకు ఈ సమస్య పెద్ద సవాలుగా మారింది.గ్రామాల్లో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను ఏర్పాటుచేసి తడి,పొడి చెత్త వేర్వేరుగా సేకరించాలని ప్రభుత్వం ప్రచారం చేస్తున్నప్పటికీ,క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం భిన్నంగాఉం ది.మండలంలోని చాలా గ్రామాల్లో సాధారణ చెత్త కంటే ప్లాస్టిక్ వ్యర్థాలే అధికంగా ఉండటం పరిస్థితి తీవ్రత ను తెలియజేస్తోంది.ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన బుర్రా గుహలు,లంబసింగి,అరకు,పాడేరు,కటికీ జలపాతాలు, సిరియా జలపాతాలు తదితర ప్రాంతాల్లో కూడా పర్యాటకులు తీసుకువచ్చే ప్లాస్టిక్ వ్యర్థాలు ప్రకృతి అందాలను మసకబారుస్తున్నాయి. పచ్చని పొలాలు,చెరువులు కూడా ప్లాస్టిక్ చెత్తతో కలుషితమవుతున్నాయి.చెరువుల్లో పడేసే ప్లాస్టిక్ వల్ల నీటి నాణ్యత తగ్గి భూగర్భజలాలు కూడా కలుషితమయ్యే ప్రమాదం ఉంది.
దీంతోపాటుగా గ్రామాల్లో జరిగే శుభకా ర్యాల్లో కూడా ప్లాస్టిక్ వినియోగం విపరీతంగా పెరిగింది.తాగునీటి నుంచి భోజనాల వరకు అన్నింటికీ ప్లాస్టిక్ వస్తువులే వాడుతున్నారు.ప్లాస్టిక్ గ్లాసులు,వాటర్ బాటిళ్లు,పేపర్ప్లేట్లు ఉపయోగించిఎక్కడపడితే అక్కడ పారేస్తు న్నారు.రహదారులుశుభ్రం చేసే పారిశుధ్య కార్మికులు కూడా డ్రైనేజీల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ చెత్తను పూర్తిగా తొలగించకపోవడంతో సమస్య మరింత పెరుగుతోంది.దాంతో దోమలు పెరిగి ప్రజలు వివిధ వ్యాధుల బారిన పడుతున్నారు.
రోజురోజుకు ప్లాస్టిక్ భూతంలా విస్తరిస్తున్న ఈ సమస్యను అరికట్టేందుకు ప్రజలు, ప్రభుత్వాలు కలిసి పనిచేయాలి. ముఖ్యంగా చిన్నతనం నుంచే పిల్లల్లో ప్లాస్టిక్ వినియోగంపై అవగాహన పెంపొందించాలి. పాఠశాల స్థాయిలోనే చెత్తను వేరు చేసి వేయడం,ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం వంటి అలవాట్లు అలవరచాలి. చాక్లెట్ కవర్లు, పాల ప్యాకెట్లు,బిస్కెట్ కవర్లు వంటి వ్యర్థాలను వెదురు బుట్టల్లో వేయడం వంటి పద్ధతులను పిల్లలకు నేర్పించాలి.
అదేవిధంగా ప్రతి విద్యార్థి కనీసం ఒక మొక్క నాటేలా ప్రోత్సహించాలి. పర్యావరణ కాలుష్యం భవిష్యత్తులో మరింత పెరిగే ప్రమాదం ఉందని, దానికి మొక్కలే ప్రధాన పరిష్కారమని అవగాహన కల్పించాలి. ప్రకృతిని కాపాడటం మనందరి బాధ్యత అనే భావన సమాజంలో బలపడినప్పుడే ప్లాస్టిక్ ముప్పును తగ్గించగలం.– రెబ్బాప్రగడ రవి ,ఎడిటర్
