వైవిధ్య జీవన చిహ్నాలు నూకదొర గిరిజనులు
గిరిజనులు అంటేనే భిన్న జీవన సంస్కృతుల సమ్మేళనం,ఒక్కో తెగది ఒక్కో ప్రత్యేకత,కానీ నదులన్నీ సముద్రం చేరినట్టు ఈ అడవి బిడ్డల సంస్కృతి జీవనాలు అన్ని“ఐక్యత సంస్కృతి సంరక్షణ”అనే ప్రధాన సూత్రంలోకే వస్తాయి, అందులో భాగంగానే ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన శ్రీకాకుళం,విజయనగరం,విశాఖ పట్నం,తో పాటు తూర్పుగోదావరి జిల్లాలో అరుదుగా నివసించే గిరిజనతెగ “నూకదొర గిరిజనులు”.
సురవర ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ‘జానపద గిరిజనవిజ్ఞాన పీఠం వరంగల్లు’ ఆచార్యుల బృందం చేస్తున్న విస్తృతకృషిలో భాగంగా చేసిన క్షేత్ర పర్యటనల్లో తెలుగు రాష్ట్రాల్లోగల వివిధ గిరిజన ఆవాసాలు సందర్శించి ఆయా గిరిజనజాతుల చరిత్ర, జీవన విధానాలు,సంస్కృతి పద్ధతులు, ప్రత్యక్షంగా తెలుసుకొని ప్రామాణిక పరిశోధనా పద్ధతిలో వాటిని పుస్తకాలుగా ప్రచురించి అమూల్యమైన గిరిజన సంస్కృతిని సచిత్రంగా భావితరాల కోసం భద్రపరుస్తున్న తీరు అభినం దనీయం ఆచరణాత్మకం.ఇందులో భాగంగా వెలువడిందే విశాఖ జిల్లా గూడెంకొత్తవీధి మండలం లోని కొత్త వెదురుపల్లి,గ్రామానికి చెందిన “నూకదొర గిరిజనుల జీవన విధానం”Úస్తకం.
ఆచార్య బట్టు రమేష్,డాక్టర్ గడ్డం వెంకన్న, గార్ల నేతృత్వంలో వారి గిరిజన విజ్ఞాన పీఠం 2007,2008,సంవత్సరాల్లో చేసిన క్షేత్ర పర్యటనల ఫలితమే ఈపుస్తకం.దీనిని ప్రామాణికత సౌలభ్యం కోసం ఆరు విభాగా లుగా విభజించుకొని ఉపోద్ఘాతం,గ్రామీణ జీవనం,సామాజిక జీవనం,ఆర్థిక జీవనం, మత జీవనం,రాజకీయ పరిపాలన,అనే భాగాలలో ‘నూక దొరగిరిజనుల’కు సంబం ధించిన పూర్తి వివరాలు అందించారు. ఉపోద్ఘాతంలో విశాఖ చరిత్ర దాని ఆవిర్భావ నేపథ్యంతో పాటు అక్కడి గిరిజనులను పరిచయంచేసి జనాభా లెక్కల ప్రాతిపదికన జిల్లాలు,మండలాలు,గ్రామాల, వారీగా వివిధ తెగల గిరిజనుల జనాభా వివరాలు పొందుపరిచారు. 2011 సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం 42,375 మంది నూకదొర గిరిజనులు ఉన్నట్టు పేర్కొన్నారు.ఒరిస్సా ప్రాంతం నుంచి వలస వచ్చిన వీరు ద్రావిడ భాష నుండి వేరుపడి పరిణామం చెందిన‘నూక దొర భాష’ మాట్లాడతారని,ఆచార్య ప్రసన్నశ్రీ, ఈ భాషకు 20 అక్షరాలు లిపిని కూడా నిర్మించినట్టు చెప్పారు.
అడవులు,గ్రామాల,మధ్య జీవించే ఈ అల్ప జాతి గిరిజనులు నూకదొరలను ప్రారంభంలో మూక (ముఖ్యమైన)దొర అనేవారు.కారణం మిగతా గిరిజనుల కన్నా ముఖ్యమైన వారు అని, మూక దొర కాస్త కాలక్రమంలో “నూక దొర”గా మారిందని ఒక కథనం.
వీరు సాధారణ గిరిజనులవలే అటవీ ఉత్పత్తుల సేకరణ,పోడు వ్యవసాయం,వ్యవసాయ కూలీ, పనులు చేస్తూ జీవనం సాగిస్తారు.మిగతా గిరిజనుల నుంచి వీరిని వేరు చేసే ఆచారం నూకదొర గిరిజన స్త్రీ పురుషులు జంజం ధరించడం,మరే ఇతర గిరిజనతెగ వారు జంజం ధరించరు,ఇది కేవలం ఈగిరిజన తెగకు మాత్రమే సొంతం.దీనిని వారికి పెళ్లిలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ధరింప చేస్తారు.
మూడు వరసల చొప్పున 9వరుసల నూలు దారాన్ని జంజంగా తయారు చేసిపెళ్లి పెద్ద అయిన ‘ముహూర్త గాడు’అబ్బాయికి, అమ్మా యికి,ఎడమ భుజం మీదుగా వేదం చదువుతూ ధరింప చేస్తాడు.ఇది చనిపోయే వరకు శరీరం మీద ఉండాలని నియమం ఉంది.ప్రతి ఏడాది ‘జంజరాల పండుగ’రోజు కొత్త జంజాలు ధరించి పాతవి తీసివేస్తారు.ఆడవారు కూడా జంజం ధరించే సంప్రదాయం వీరిలో తప్ప మరెక్కడ కనిపించదు.భర్త చనిపోయిన స్త్రీకి తాళి,మట్టెలు,గాజులు, బొట్టు,తీస్తారు.కానీ జంజం తీయరు,అలాగే భార్య చనిపోయిన పురుషునికి మొలతాడు తీస్తారు తప్ప జంజం తియ్యరు ఇటువంటి విశేషమైన వీరి ఆచారాల గురించి మనం ఇందులో చదవవచ్చు.
రెండవ అధ్యాయం గ్రామీణజీవనంలో నూక దొర గిరిజనుల యొక్క గ్రామ నిర్మాణం,పేర్లు, ఇతర తెగలతో సంబంధాలు,పర్యావరణం, ఆహారం నిల్వ చేసుకునే పద్ధతులు,వేష భూషణాలు,శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, వాద్యాల గురించిన వివరణలు,సచిత్రంగా ఉన్నాయి.మూడవ అధ్యాయం అయిన ‘సామాజిక జీవనం’లో కుటుంబం,జీవిత చక్ర సంబరాలు, వైద్యం గురించిన వివరాలు ఉం డగా,నాల్గవది అయిన ఆర్థిక జీవనంలో వృత్తి విజ్ఞానం, అటవీ ఉత్పత్తుల సేకరణ, గురించి. ఐదవ అధ్యాయం మత జీవనం,ఆరవదైన రాజకీయ పరిపాలన,విభాగాల్లో పండుగలు, దేవరలు, మరియు గ్రామ పరిపాలన, పంచాయతీ విధానాలు, వరుసగా పేర్కొన బడ్డాయి.ముందే అనుకున్న విధంగా మిగతా గిరిజన తెగల కన్నా నూకదొర గిరిజనులు విశిష్టమైన లక్షణాలు కలిగి ఉంటారు.అందుకు ప్రధాన ఉదాహరణ,వీరు శాస్త్రసాంకేతిక పరి జ్ఞానం,ఖగోళ విషయాలు,వాతావరణం గురిం చి,సాంకేతిక నైపుణ్యఅవగాహన కలిగి ఉం టారు.ఈ తెగల పూజారిగా వ్యవహరించబడే వ్యక్తికి ఆకాశంలోని నక్షత్రాల గురించి,వాటి గమనం గురించి స్పృహ ఉంటుంది.దీని ఆధా రంగా కాలం గురించి,పండుగలు గురించి,శుభముహూర్తాల గురించి,ముందుగా తమ జనజాతికి చెబుతాడు.వీచే గాలులను బట్టి, పక్షుల అరుపులను బట్టి,ఆకాశంలోని మబ్బుల రంగులను బట్టి,వర్షాల వివరాలు ముందుగా పసిగట్టే నైపుణ్యం నూకదొర గిరిజన పూజారికే ఉంటుంది.ఇలాంటి ఆసక్తిదాయకమైన అనేక విషయాలు ఈక్షేత్ర పర్యటన పుస్తకంలో మనం చదవవచ్చు.
ఇకపోతే ఈ గిరిజనులు తమ ఆహార దినుసు లను నిలవ చేసుకునే పద్ధతులు కూడా చాలా ఆసక్తిదాయకంగా ఉంటాయి. అవి తెలియాలి అంటే రెండవ అధ్యాయంలోని ‘నిల్వ చేసుకునే పద్ధతులు’ విభాగం విధిగా చదవాలి,వీరు తమ చుట్టూ గల ప్రకృతి సంపదను ఉపయోగించు కుంటూ,దానికి అనుకూలంగా జీవనం సాగిస్తుంటారు.అందులో భాగంగానే ప్రకృతిని రక్షించుకుంటూ పర్యావరణ పరిరక్షకులుగా కూడా ప్రసిద్ధి పొందారు.నూకదొర గిరిజనుల పండుగలు అన్ని ప్రకృతితో మమేకమై ఉం డటం మరో విశేషంగా చెప్పవచ్చును,సౌలభ్యం కోసం వీరి పండుగల వివరాలు తెలిపే పట్టికను కూడా ఏర్పాటు చేసి పండుగ పేరు. ఏ రోజు ఏకాలంలో చేస్తారు,పూజించే దేవుడు ప్రదేశం,మొక్కుబడి నైవేద్యం,పూజించే ప్రత్యేక వ్యక్తి, వివరాలు ఇందులో స్పష్టంగా వివరిం చారు.విత్తనాల పండుగ,ఆవటి కొత్త పండుగ, బుడమ కొత్త పండుగ,సంక్రాంతి,జంజాల పండుగ,సంకుపండుగ,నెలదోషంపండుగ, ప్రధానంగా పేర్కొన్నారు.దీనిలో ఈగిరిజన జాతికి మాత్రమే పరిమితమైన ‘జంజాల పండుగ’ వీరికి ఎంతో ప్రత్యేకం పవిత్రం. అలాగే ప్రతినెలా చేసుకునే సామూహిక పండుగ ‘నెలదోషం పండుగ’ గూడెంలోని అందరూ ఆరోగ్యంగా జీవించాలని వారి ఇలవేల్పైన సుంకుదేవుడుని పూజిస్తారు.
ఇక ఈనూకదొర గిరిజనులు సామూహికంగా అందరూ ఒకేచోట జీవనం సాగిస్తారు.ఒకే వరుసలో గదుల నిర్మాణం చేసుకున్న ‘కేటం ఇల్లు’ అందుకు ఉదాహరణగా కనిపిస్తుంది. అలాగే ఈగిరిజనుల వివాహాల్లో కనిపించే ఒడి బాలు,నేస్తంచుట్టం,అద్దె ఇల్లు,జంజం, తొగ రులు పోయడం,ఇల్లియ్యడం, వంటి తంతులు గురించి ప్రత్యేకంగా ఇందులో చెప్పబడ్డాయి.
వీరి మరణం తాలూకు అంతిమ కార్యక్రమాల్లో కూడా ప్రత్యేక పద్ధతులు కనిపిస్తాయి. సహజంగా మరణించిన వారిని గొయ్యి తవ్వి పూడ్చి పెడతారు, ప్రమాదంవల్ల కానీ వ్యాధితో కానీ మరణిస్తే కట్టెలు పేర్చి కాల్చుతారు. అంతిమ కార్యక్రమాల్లో జేజవ,పసుపు ముట్టడం,కాకులకూడు వంటి తంతులు చేసే ఆచారం వీరి తెగల్లో ఉంటుంది.
ఇలా గిరిజన సామాజిక పద్ధతుల నేపథ్యంలో జీవిస్తూ మిగతా గిరిజన తెగల కన్నా భిన్నంగా ఉండటం నూకదొర గిరిజనుల వైవిధ్య జీవన పద్ధతులకు తార్కాణంగా ఉంటుంది.అల్ప సంఖ్యతో కొన్ని ప్రాంతాలకే పరిమితమైన అరుదైన ఈగిరిజనుల పూర్తి జీవిత విశేషాలు తెలియాలి అంటే ఈపుస్తకం ఆసాంతం చదవాలి.
నూక దొర గిరిజన జీవన విధానం (పరిశోధన వ్యాసావళి)
పేజీలు : 180
ధర : 140/`
ప్రతులకు : ప్రచురణ విభాగం,సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం,బాచుపల్లి హైదరాబాద్-500118
చరవాణ ì : 94413 05070
సమీక్షకుడు : డా: అమ్మిన శ్రీనివాసరాజు, చరవాణి : 77298 83223.
