పది తర్వాత ఏమి చేయాలని ఆలోచిస్తున్నారా..?
విద్యార్థి దశలో పదోతరగతి అత్యంత కీలక మైంది.ఇటీవలే పదోతరగతి ఫలితాలు విడుదలయ్యాయి.తదనంతరం ఏకోర్సు చదవాలనే ఆలోచ నలు అనేక మందిలో మొదలయ్యాయి.చక్కగా ఆలోచించి సరైననిర్ణయం తీసుకుంటే భవిష్యత్తు బంగారుమయం అవుతుంది.విద్యార్థులు తమశక్తి సామర్థ్యాలు,అభిరుచులకు అనుగుణంగా కోర్సులను ఎంచుకోవాలని విద్యానిపుణులు సూచిస్తున్నారు.ఇంటర్మీడియట్ విద్యలో చేరేందుకు ప్రభుత్వ పరంగా ఏఏ కళాశాలలు,కోర్సులు అందుబాటులో ఉన్నాయనే వివరాలు మీకోసం.- జి.ఆనంద్ సునీల్ కుమార్
గురుకులాలు ఆహ్వానిస్తున్నాయ్ గురుకుల(రెసిడెన్షియల్) విద్యను ప్రభుత్వం ప్రతి ష్ఠాత్మకంగా తీసుకుంటోంది. ప్రవేశ పరీక్షల్లో (ఎంట్రన్స్ టెస్ట్) ఉత్తమ ఫలితాలను సాధించిన వారు వీటిలో చేరవచ్చు.ఆంగ్ల విద్యతో పాటు వసతి సౌకర్యం కూడా ఉంటుంది. ఈ గురు కులాల్లో రుచికరమైన భోజనాన్ని అందిస్తారు. కార్పొరేట్ కళాశాల తరహాలో ఎప్‌సెట్,నీట్ తదితర వాటి కోసం విద్యార్థులను సన్నద్ధం చేస్తారు.
వృత్తి విద్యా కోర్సులతో ఉపాధి
తక్కువ సమయంలో ఉపాధి అవకాశాల కోసం వృత్తివిద్యా(వొకేషనల్) కోర్సులను ఎంచుకోవటం ఉత్తమం. పదోతరగతి పాసైనవారు ఐటీఐ కాలేజీల్లో చేరవచ్చు. తమ ఆసక్తికి అనుగుణంగా కోర్సులను ఎంచుకోవచ్చు. ఐటీఐ చేసిన వారికి పరిశ్రమల్లో మంచి డిమాండ్ ఉంది. నైపుణ్యాలు ఉంటే కొలువు సంపాదించడం సులువే.
పాలిటెక్నిక్‌తో బీటెక్‌కు దగ్గరి దారి!
పాలిసెట్ ప్రవేశపరీక్షలో మంచి ర్యాంకులు సాధించినవారు పాలిటెక్నిక్ కోర్సులో చేరాలి.3 ఏళ్ల పాటు శిక్షణ తీసుకోవాలి. పూర్తిచేసిన వారు నేరుగా బీటెక్ సెకండ్ ఇయర్లో చేరవచ్చు. ఈ కోర్సులు పూర్తి చేసిన వారికి ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగావకాశాలు పుష్కలంగా లభించే అవకాశం ఉంది. మరోవైపు వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలు కూడా ఉన్నాయి. వ్యవసాయ రంగంపై ఆసక్తి కలిగిన విద్యార్థులు ఈ కోర్సుల్లో చేరవచ్చు. ఇది ఇంటర్మీడియట్ విద్యతో సమానం. వ్యవసాయ పాలిటెక్నిక్ కోర్సు వ్యవధి రెండేళ్లు ఉంటుంది. కోర్సు పూర్తయి నట్లయితే వ్యవసాయ విస్తరణ అధికారుల కొలువులు సాధించవచ్చు.
ఆర్జీయూకేటీ పిలుస్తోంది
పదోతరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించే గ్రామీణ విద్యార్థులకు ట్రిపుల్ ఐటీ విద్య ఒక మంచి అవకాశం అని చెప్పవచ్చు. బాసరలోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ)లో 6ఏళ్ల సమీకృత ఇంజినీరింగ్ కోర్సు ఉంటుంది.పదోతరగతి మార్కుల ఆధారంగా ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశం పొందవచ్చు. విద్యార్థులు తమ అభిరుచులకు అనుగుణమైన కోర్సులను ఎంపిక చేసుకోవచ్చు. అన్ని సామాజికవర్గాల వారికీ వీటిలో అవకాశం ఉంటుంది.
ఏకలవ్య, ఆదర్శ స్కూల్స్
ఇంగ్లిష్ మీడియంలో ఇంటర్ విద్యనభ్యసించా లనుకునే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఏకలవ్య, ఆదర్శ విద్యాలయాలు(మోడల్ స్కూల్లు) అందుబాటులో ఉన్నాయి. ఎంట్రన్స్ టెస్ట్‌లో మంచి ర్యాంకులు వస్తే వీటిలో చేరవచ్చు. సాధారణ ఇంటర్ చదువులతో పాటు వృత్తివిద్యా కోర్సులను కూడా ఇక్కడ బోధిస్తారు.
కేజీబీవీలు బాలికలకు వరం
కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు విద్యార్థినులకు వరం లాంటివి అని చెప్పవచ్చు. ఈ కేజీబీవీల్లో ఇంటర్ విద్య కొనసాగుతోంది. ప్రవేశ పరీక్షలు లేకుండా పదోతరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థినులు వీటిలో చేరవచ్చు. ఎంపీసీ, బైపీసీ,సీఈసీ, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ (ఎంపీహెచ్‌డబ్ల్యూ) వంటి కోర్సులు ఈ కేజీబీవీల్లో అందుబాటులో ఉంటాయి.
పదో తరగతి తర్వాత ఎన్నో కోర్సులు!
వీటితో వేల సంఖ్యలో కెరియర్లకు మార్గం సుగమం చేసుకోవచ్చు. ఎంపికలో మాత్రం గుంపులో గోవింద అని, అందరు అందులో చేరుతున్నారని, స్నేహితులు చెప్పారని, అమ్మానాన్నల ఆశయమని, అవకాశాలు మెండుగా ఉన్నాయని నిర్ణయానికి రాకూడదు. ఇవేవి మీకు సరైనవి కాకపోవచ్చు. వీటి ఎంపికలో మీ ముద్ర లేకోపోవడమే ఇందుకు కారణం. మీ దారి మహోన్నతం కావాలంటే నిర్ణయం తీసుకోవాల్సింది మీరే!.ఎవరి మార్గాన్ని వారు నిర్ణయించుకునే అవకాశం పదో తరగతి తర్వాత వస్తుంది. ఉన్న వాటిలో గమ్యాన్ని చేర్చేదాన్ని ఎంచుకోవడమే ప్రధానం. ఇందుకు స్వీయ సామర్థ్యాలే కొలమానం. ప్రతి విద్యార్థీ ఎవరికి వారే ప్రత్యేకం. అందువల్ల నైపుణ్యాలు, ఆసక్తులు గుర్తించి, సరైన కోర్సు ఎంచుకుంటే మేటి భవిష్యత్తు దిశగా మొదటి అడుగు పడినట్లే!
నిర్ణయం మీదే
మీ గురించి మీకంటే ఎక్కువగా మరెవరికీ తెలీదు. స్వీయ సమీక్షే కీలకం. ఇందుకోసం మీ సామర్థ్యం, ఆసక్తులను పరిగణనలోకి తీసుకోండి. మీ బలహీనతలేమిటో గుర్తించి, వాటి ప్రకారం పది తర్వాత ఉన్న కోర్సుల జాబితాలో కొన్నింటిని వదిలేయండి. మిగిలినవాటిలో మీకు సరిపోయేది ఏదో ఎంచుకోవాలి. ఈ క్రమంలో సమగ్రత కొరవడకుండా చూసుకోండి. పది తర్వాత ఉన్న అన్ని కోర్సులు, మార్గాలపైనా అవగాహన పెంచుకోవాలి.
సరిపోయేవి ఎంచుకోవాలి
పది తరగతి పూర్తిచేసుకున్న వారికోసం ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్, డిప్లొమాలు,ఐటీఐ, వొకేషనల్ కోర్సులు,ఉద్యోగాలు, ప్రత్యేక డిప్లొమాలు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ ప్రాధాన్యం ఉన్నవే. అయితే మీకు సరిపోయేవి ఏవో మీరే గుర్తించాలి. ఉన్న వాటిలో ఏదో ఒక్కటి మాత్రమే ఎంచుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల బాగా ఆలోచించి,విశ్లేషించుకుని నిర్ణయం తీసుకోవాలి.
సబ్జెక్టు రాదని మరో కోర్సు వద్దు
మ్యాథ్స్ అంటే భయం కాబట్టి బైపీసీ,సైన్స్‌పై ఆసక్తి లేక సీఈసీ ఇలా వేరే కోర్సులు తీసుకుంటే రాణించలేరు.ఎందుకంటే బైపీసీ తీసుకోవడానికి మ్యాథ్స్ రాకపోవడం కారణం కాకూడదు. సైన్స్ అంశాల్లో పట్టు లేదు, అందుకే ఆర్ట్స్ కోర్సుల్లో చేరాలని నిర్ణయించుకోవద్దు. ఏఅంశాల్లో ప్రావీణ్యం ఉందో గుర్తించి,సంబంధిత కోర్సులు ఎంచుకోవాలి. ఒక సబ్జెక్టులో ఆసక్తి, ప్రావీణ్యం లేదనే కారణంతో ఇంకో కోర్సు ఎంచుకోవద్దు. అన్ని కోణాల్లోనూ ఆలోచించి నిర్ణయానికి రావాలి.
ఎవరికోసం కోర్సులు వద్దు
చదువులో రాణించలేని ఎక్కువమంది విద్యార్థులు చెప్పే ప్రధాన కారణం ఫలానా వాళ్ల ఒత్తిడితో ఇష్టం లేకుండా ఈకోర్సులో చేరి నష్టపోయానని అంటారు. అందువల్ల తెలిసినవాళ్లు, బంధువులు సూచించారనో,స్నేహితులతో కలిసి ఉండొచ్చనో, ఎక్కవ డబ్బులు సంపాదించవచ్చనో, సులువుగా ఉత్తీర్ణత సాధించవచ్చనో, ఎక్కువ మంది చేరుతు న్నారనో ఇలాంటి కారణాలతో కోర్సు, గ్రూపులను ఎంచుకోవద్దు. చేరిన కోర్సులో రాణించాల్సిన బాధ్యత మీదేనని మర్చిపోవద్దు. అందుకే ఎవరి భవిష్యత్తుని వాళ్లే నిర్ణయించుకుని కెరియర్ సౌధాన్ని నిర్మించుకోవాలి. పిల్లల సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుని తల్లిదండ్రులు వారికి సరిపోయే కోర్సులను ఎంపిక చేయాలి. వ్యక్తిగత ఆశయాలను రుద్దితే భవిష్యత్తులో ఇద్దరికీ సమస్యే. కొన్నిసార్లు తీవ్ర ఒత్తిడితో అనుకోని పరిణామాలూ ఎదుర్కోవాల్సి రావచ్చు. పిల్లలపై వ్యక్తిగత ఆశయా లను రుద్దకూడదు. ఆసక్తి లేకుండా, తల్లిదండ్రుల ఇష్ట ప్రకారమే చదవాల్సి వస్తే వాళ్లు ఒత్తడికి గురవుతారు.
ఈ షార్ట్ టర్మ్కోర్సులు నేర్చుకుంటే సూపర్ బెనిఫిట్స్! :
సాంకేతిక నైపుణ్యాలు, ఆరోగ్య సంరక్షణ సేవలు కలయికగా రూపొం దించిన కోర్సు ఇది. హైదరా బాద్, విజయవాడ ల్లోని గవర్నమెంట్ డెంటల్ మెడికల్ ఎడ్యు¹ ¿షన్తో పాటు పలు ప్రైవేటు దంత వైద్య కాలేజీలు రెండేళ్ల కోర్సును అంది స్తున్నాయి. డెంటల్ ప్రోథెస్టిక్స్,అసిస్ట్ డెంటిస్ట్, ల్యాబ్ పరికరాల నిర్వహణ లాంటి నైపుణ్యాలను శిక్షణలో భాగంగా నేర్పుతారు. కోర్సు పూర్తి చేసిన వారికి డెంటల్ ల్యాబ్‌లు, క్లినిక్‌ల్లో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఇందులో అనుభవం గడించి, విద్యార్హత పెంచుకుంటే సొంతంగా ప్రాక్టీస్ ప్రారంభించవచ్చనని విద్యవేత్తలు సూచిస్తున్నారు.
ఆకర్షించే స్టాక్ ట్రేడింగ్
ప్రస్తుతం అనూహ్యంగా పెరుగుతూ, అందరినీ ఆకర్షిస్తున్న రంగం స్టాక్ మార్కెట్ అప్‌స్టాక్, జెరోదా,ఫైనాన్షియల్ ట్రేడింగ్ లాంటి కొత్తతరం ట్రేడింగ్ కంపెనీల రాకతో ఆన్లైన్లో స్టాక్స్ కొనడం,అమ్మడం, పెట్టుబడి పెట్టడం ఈజీ అయిపోయింది. నేటి ట్రెండ్‌కు తగినట్లుగా యువతరానికి ట్రేడింగ్ ప్రాథమిక అంశాలు, ఫైనాన్షియల్ ప్లానింగ్, పెట్టుబడుల విశ్లేషణ నేర్పే కోర్సులు అందుబాటులో వచ్చాయి. (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్సియల్ మార్కెట్ (ఎనఐఎఫఎం) సంస్థతో పాటు యుడెమీ, జెరోదా వర్సిటీ లాంటి ఆన్లైన్ వేదికల్లోనూ స్వల్పకాల సర్టిఫికేట్ కోర్సులున్నాయి.స్టాక్ ట్రేడింగ్‌లో ప్రాథమిక అంశాల నుంచి నష్టభయం నియం త్రణ, పోర్ట్‌ఫోలియో నిర్మాణం వరకు అన్ని అంశాలు నేర్పుతారు. ఈ నైపుణ్యాలతో ఫైనాన్స్ సంస్థల్లో ఎంట్రీలెవల్ ఉద్యోగాలను అందుకోవచ్చు లేదా సొంత అవకాశాలను సృష్టించుకోవచ్చనని కెరియర్ కౌన్సెలర్లు చెబుతున్నారు.
దూసుకొస్తున్న గిగ్ ఉద్యోగాలు
నేటి యువతరాన్ని గిగ్ రంగం అమితంగా ఆకట్టుకుంటూ మంచి అవకాశాలు చూపుతోందని విద్యా నిపుణులు పేర్కొంటున్నారు. ఇవి టాస్క్ బేస్డ్? ఉద్యోగాలు (నిర్ణీత పని ఆధారితం). అమెజాన్ ప్లెక్స్, స్విగ్గీ, అర్బన్ కంపెనీ లాంటివన్నీ గృహోపకరణాలు, అలంకరణ సేవలు, డ్రైవింగ్, సరకు డెలివరీ, ఎలక్ట్రానిక్ పరికరాల మరమ్మత్తులో నైపుణ్యం ఉన్నవారిపైనే ఆధారపడతాయి. ఈ రంగాన్ని ప్రభుత్వాలు కూడా గుర్తించి ప్రోత్సహిస్తున్నాయని నిపుణులు వివరిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (TASఖ) ఉచితంగా స్వల్పకాల శిక్షణ ఇస్తున్నాయి. ప్రాథమిక ఐటీ సేవలు, మొబైల్ ఫోన్ రీపేర్, డిజిటల్ మార్కెటింగ్ లాంటి కోర్సులు నేర్పిస్తూ గిగ్ రంగానికి పనికొచ్చేలా మారుస్తున్నాయి.
