గిరిజన అభ్యున్నతిలో సమస్యలెన్నో..

దేశవ్యాప్తంగా గిరిజన జనాభా అధికంగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ పదకొండో స్థానంలోఉంది. రాష్ట్రంలోని గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వాల పరంగా ఎన్ని చర్యలు చేపడుతున్నా,అన్ని తెగలూ సమానంగా అభివృద్ధి చెందడం లేదు. దీంతో అంతర్గత అసమానతలు,అభివృద్ధి లో తారతమ్యాలు నెలకొంటున్నాయి.కేంద్ర ప్రభుత్వ నిర్దేశిత ప్రమాణాల మేరకు అత్యంత వెనుకబడిన,ప్రత్యేక రక్షణ అవ సరం ఉన్న చెంచులు కోలాం,కొండరెడ్డి, తోటి వంటి నాలుగు తెగలను తెలంగాణలో ఆదిమ గిరిజన తెగలు (పి.వి.టి.జి)గా గుర్తించారు.ఇందులో చెంచులు నాగర్క ర్నూల్,మహబూబ్నగర్,నల్గొండ, వికారా బాద్,రంగారెడ్డి జిల్లాల్లో విస్తరించిన అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్నారు.వీరి సంప్రదాయ వృత్తి వేట. అటవీ ఆధారిత జీవన విధానం నుంచి స్థిర వ్యవసాయానికి మార్పు చెందు తున్నారు. కలపయేతర అటవీ ఉత్పత్తులైన జిగురు,తేనె,కొండ చీపుర్ల సేకరణ వీరికి ప్రధాన ఆదాయ వనరులు.కొండరెడ్డి గిరిజ నులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి తీర అటవీ ప్రాంతాల్లో సాంప్రదాయకంగా పోడు వ్యవసాయం చేస్తున్నారు.వెదురు బుట్టలు,అలంకరణ వస్తువుల తయారీతో పాటు అటవీ కూలీ పని,మొక్కల పెంపకం వంటివి చేస్తారు.చింతపండు,తేనె,ఉసిరి వంటి ఉత్పత్తుల సేకరణ వీరి ప్రధాన జీవనోపాధి. తోటి తెగవారు ప్రధానంగా ఉమ్మడి ఆదిలా బాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తు న్నారు. గోండులతో సంబంధాలున్న సాంస్కృ తిక వాహకులుగా ప్రసిద్ధి.వంశపారంపర్యంలో భాగంగా పాటలు పాడతారు, సంప్రదాయ పచ్చబొట్టు వేస్తారు. వ్యవసాయంతోపాటు దినసరి కూలీ పనులు చేస్తారు. కొలాములు అనేవారు తోటీలుగోండులతో కలిసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్నారు.పోడు వ్యవసాయం చేస్తూ, కొండచరియలపై చిరుధాన్యాలు,పప్పుదిను సులు మొదలైన పంటలను సాగుచేసేవారు. ఇప్పటికీ కొంతమంది పోడుసాగు చేస్తున్నా ఎక్కువగా స్థిర వ్యవసాయమే చేస్తున్నా వెదు రు కళాకృతులు,బుట్టలు,చేపలవలలు, వ్యవ సాయ సాధనాలు,నిల్వ పాత్రల తయారీ వీరి ముఖ్య ఉపాధి.
క్షీణిస్తున్న జీవనోపాధులు
పీవీటీజీ తెగల వారు ఎక్కువగా వర్షాధారిత వ్యవసాయం,పోడు సాగు వంటి సంప్రదా య పద్ధతులనే అనుసరిస్తున్నారు.నీటిపారు దల సదుపాయాల కొరత,భూ యాజమా న్యం పరిమితంగా ఉండటం వంటి సమ స్యలు వారికి ప్రతికూలంగా నిలుస్తున్నాయి. అటవీ సంరక్షణ చర్యలవల్ల వేట,సేకరణ వంటి సంప్రదాయ జీవనోపాధులు క్షీణిస్తు న్నాయి.భూ హక్కుల లోపంతో వ్యవసాయ అవకాశాలు దెబ్బతింటున్నాయి.ఆధునిక ఉపాధి అవకాశాలకు కావాల్సిన నైపుణ్యాలు, అనుభవం లేకపోవడం,వాతావరణ మార్పుల ప్రభావం వల్ల సంప్రదాయ జీవనోపాధుల్లో అస్థిరత నెలకొంటోంది.ఆరోగ్య సదుపాయాలు లేకపోవడం, పోషకాహార లోపం,పేదరికం వేధిస్తున్నాయి. మిగిలిన వారితో పోలిస్తే ఆదిమ జాతి గిరిజన తెగల సగటు ఆయు ర్దాయ తగ్గడంతో వారి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది.ఈ నేపథ్యంలో ఆతెగల అభివృ ద్ధికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పలు ప్రత్యేక పథకాలను అమలు చేస్తున్నాయి. సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థద్వారా నివాసాలు, రోడ్లు,తాగునీరు,విద్యుత్,ఆరోగ్య శిబిరాల ఏర్పాటు,స్థిర వ్యవసాయం,ఉద్యానవనాల పెంపకానికి ప్రోత్సాహం అందిస్తున్నారు. తెలంగాణ షెడ్యూల్డ్ తెగల ఆర్థిక సహకార సంస్థ ద్వారా పశుపోషణ,వ్యవసాయం ఇతర చిన్న వ్యాపారాల కోసం ఆర్థికసహకారం అందుతోంది.ఆశ్రమ ఉన్నత పాఠశాలలు, గురుకుల నివాస విద్యాసంస్థల ద్వారా బాల బాలికలకు విద్య అందిస్తున్నారు.కేంద్ర ప్రభు త్వ పరంగా ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహాఅభియాన్ పథకంద్వారా సురక్షిత గృహాలు, శుద్ధమైన తాగునీరు,విద్య,ఆరోగ్యం, పోషకాహారం వంటి మౌలిక సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు.రోడ్లు, టెలి ఫోన్,విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నారు.స్థిరమైన జీవనోపాధి అవకాశాలు కల్పించడం ఈ పథ కం ప్రధాన లక్ష్యాలు.వన ధన్ వికాస కేంద్రాల పథక ద్వారా అటవీ ఉత్పత్తుల విలువ వృద్ధి, శిక్షణ, మార్కెటింగ్ మద్దతు దక్కుతుంది. జాతీ య ఆరోగ్య మిషన్లో భాగంగా పోషకఆహార లోపం తగ్గింపు,సీజనల్ ఆరోగ్య శిబిరాల ఏర్పాటు,సంచార వైద్య ఆరోగ్య కేంద్రాల సేవలు అందిస్తున్నారు.ఏకలవ్య మోడల్ నివాస విద్యాసంస్థల ద్వారా గిరిజన బాలబాలి కలకు చదువు చెబుతున్నారు.ఇంత చేస్తున్నా- తెలంగాణలోని ఇతర గిరిజన జనాభాతో పోల్చితే ఆదిమ గిరిజన తెగల్లో మానవ అభి వృద్ధి సూచీల్లో గణనీయమైన వెనుకబాటుతనం కనిపిస్తోంది.వీరి సామాజిక,ఆర్థిక స్థితిని మెరుగుపరచడం,పేదరికాన్ని తగ్గించడం, సుస్థిర అభివృద్ధిని సాధించడం సమ్మిళిత ప్రగతికి తప్పనిసరి అవసరం.
నైపుణ్య శిక్షణ అవసరం : ఆదిమ గిరిజన తెగల సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక కేంద్రీ కృత,కమ్యూనిటీ ఆధారిత జీవనోపాధి కార్యక్రమాలను బహుముఖ వ్యూహంతో అమలు చేయాలి.ఆర్థిక స్వావలంబన కల్పించాలి. ఇందుకోసం ఆధునిక వ్యవసాయ సాంకేతికతలు,సాగునీటి వసతులు కల్పించాలి.నేల ఆరోగ్య పరిరక్షణ పద్ధతులకు సహకారం అందిస్తూ వాతావరణ పరిస్థితులకు అనుగుణమైన సాగును ప్రోత్సహించాలి. నైపుణ్యాధారిత సూక్ష్మ సంస్థలు, వ్యవసాయేతర ఉపాధులు, హస్తకళలు, ఆహార ప్రాసెసింగ్, గ్రామీణ సేవా రంగాల్లో జీవనోపాధికి వీలు కల్పించాలి. శాస్త్రీయ పద్ధతిలో అటవీ ఉత్పత్తు ల సేకరణ, ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు, నిల్వ సదుపా యాలు సమకూర్చాలి. మార్కెటింగ్ సహకారం అందించాలి.ఆదిమ గిరిజన తెగల్లోని యువత,మహిళలకు నైపుణ్యాభివృద్ధి, వ్యాపారాభివృద్ధి శిక్షణ కల్పించాలి. తద్వారా సంప్రదాయ వృత్తులకు అతీతంగా ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు చూపించాలి. స్వయం సహాయ సంఘాలు, సహకార సంఘాలు, ఉత్పత్తిదారుల సమూహాలు వంటి కమ్యూనిటీ సంస్థలను బలోపేతం చేసి, సమష్టి కొనుగోలు, విక్రయశక్తిని పెంచాలి. ఆర్థిక సేవలు, ప్రాథమిక వసతులు, సాంకేతికతలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించాలి. ఇలాంటి అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని, రాష్ట్రంలో అత్యంత వెనుకంజలో ఉన్న 16,688 ఆదిమ గిరిజన తెగల కుటుంబాల సమగ్ర అభ్యున్నతి బాధ్యతను ప్రభుత్వం, సంబంధిత సంస్థలు స్వీకరించాలి. అప్పుడే వారి జీవన ప్రమాణాలు మెరుగుపడి ఇతర గిరిజన తెగలతో సమానంగా అభివృద్ధి సాధించగలుగుతారు.ఏజెన్సీలో ఉన్న ఆదిమ జాతి గిరిజనుల వ్యక్తిగత,సామాజిక అభివృ ద్ధికి ప్రణాళికలు రూపొందించి సమగ్ర అభి వృద్ధివైపు పయనించేలా ప్రభుత్వాలు కృషిచే యాల్సి ఉంది.వారి తాజా స్థితిగతులు,జీవన విధానం,వారి సమస్యలు,అవసరాలు,వారి భవిష్యత్తును మరింతగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టాలి. (మామిడాల లక్ష్మీప్రసాద్) – వ్యాసకర్త :స్టేట్ మిషన్ మేనేజర్,తెలంగాణ షెడ్యూల్డ్ తెగల ఆర్థిక సహకార సంస్థ(ట్రైకార్)