ఆదివాసీ యువతలో మేల్కోన్న చైతన్యం
“ యువ సామాజిక కార్యకర్త అశ్వని కంగే ఏర్పాటు చేసిన పీసా చట్టం మహోత్సవ్ సదస్సు ఆదివాసీ తెగల్లో కొత్త చైతన్యాన్ని నింపింది. ఇది కేవలం ఒక సదస్సుగా కాకుండా, ఆదివాసీ భవిష్యత్‌కు స్పష్టమైన దారిని చూపిన వేదికగా నిలిచింది. గ్రామసభ నుంచే గిరిజన అభివృద్ధి ప్రారంభమవుతుందన్న సందేశాన్ని బలంగా చాటి చెప్పింది.విస్తృత స్థాయిలో హాజరైన ఆదివాసీ యువతీఉయువకుల్లో రాజ్యాంగబద్ధమైన పీసా చట్టం ముఖ్య లక్ష్యలపై అవగాహనను పెంపొందించడంతో పాటు,గిరిజన సమాజ భవిష్యత్ దిశను నిర్దేశించే చర్చలకు ఈ మహోత్సవ్ దోహదపడింది.
ఇది కేవలం సదస్సుగా కాకుండా,గిరిజన సమాజ భవిష్యత్ దిశను నిర్దేశించే వేదికగా నిలిచిందని చెప్పవచ్చు.గత 30`40సంవత్సరాలుగా సామాజిక సేవ రంగంలో అనేక సమావేశాలు,సదస్సులకు హాజరైన అనుభవం ఉన్నా,యువత ఆసక్తితో,బాధ్యతతో, క్రమశిక్షణతో నిర్వహించిన ఈ శిబిరం లాంటి కార్యక్రమాన్ని ఎక్కడా చూడలేదనడం అతిశయోక్తి కాదు. సదస్సుకు హాజరైన యువతీఉయువకులు ప్రదర్శించిన క్రమశిక్షణ,సంప్రదాయ పద్ధతులపట్ల చూపిన గౌరవం,సమాజాభివృద్ధిపై వారిదృఢమైన నిబద్ధత విశేషంగా ఆకట్టుకున్నాయి.ఈ తరహా శిబిరాలు గిరిజన యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాకుండా, వారి హక్కులు, బాధ్యతలపై స్పష్టమైన అవగాహన కల్పిస్తున్నాయి. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని ప్రాంతాల్లో విస్తరించి, ఆదివాసీ సమాజం స్వయం నిర్ణయాధికారంతో ముందుకు సాగేందుకు దోహదపడాలని ఆకాంక్షంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.” ` రెబ్బాప్రగడ రవి,సమత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్,విశాఖపట్నం.
