సమగ్ర గిరిజన దీపిక`కోయ సంస్కృతి
గిరిజనుల సమగ్ర అభివృద్ధి కోసం ఏర్పాటైన సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ- భద్రాచలం వారి సారధ్యంలో నిర్వహించబడుతున్న గిరిజన సంస్కృతి పరిశోధన శిక్షణా సంస్థ పక్షాన రూపొం దించబడిన సచిత్ర వర్ణ పుస్తకం ‘‘కోయతెగ సంస్కృతి’’ఇరవై ఒక్క అధ్యాయాల ఈ సమగ్ర వర్ణ చిత్రాల పుస్తకంలో గిరిజన తెగకు సంబంధించిన సంస్కృతి సంబంధపు అనేక విషయాలు విశేషాలు పొందుపరచబడ్డాయి.
శిక్షణా సంస్థ పర్యవేక్షకులు వీసం వసంత రావు పర్యవేక్షణలో కె.సీతారాములు,ఎన్. జగన్మో హన్ రావు గార్ల నేతృత్వంలో సోడే మురళి, మడకం లక్ష్మణరావు,మడకం చినరత్తయ్య, సోడె శివరామకృష్ణ, సోడె సత్యనారాయణ,తదితర ఆంథ్రో పాలజీ విద్యార్థుల రచనా సహకారంతో వెలువడిన ఈపుస్తకానికి,కొండవీటి గోపి వరప్రసాద్ అందించిన ఛాయాచిత్రాలు అదనపు ఆకర్షణగా నిలిచాయి.
తొలి అధ్యాయంలో పురాణ గాథల ఆధారంగా కోయతెగ పుట్టుపూర్వోత్తరాలు వివరిస్తూ… చందా,నాగుల,తాటి,జలరేల,వంశ చరిత్రలను సంబంధిత కుటుంబాల పెద్దలను సంప్రదించి వారు చెప్పిన పురాణాల ప్రకారంగా కథల ద్వారా వారి సమగ్ర సమాచారం భద్రపరిచి అందించే ప్రయత్నం చేశారు.
కోయ తెగ యొక్క పుట్టుపూర్వోత్తరాల గురించి ‘‘చందా వీరయ్య’’మాటల గాధను పొందుపరిచారు సృష్టి ఆవిర్భావానికి చెందిన ఆసక్తిదాయకమైన విషయాలు కథలుగా ఇందులో చెప్పారు.
రెండవ అధ్యాయంలో గట్లు,గోత్రాలు,గురించి పురాణాలుగా చెబుతూ ఒకటి నుంచి ఏడవ గట్టు వరకు ఏర్పడ్డ విధానాలు చెబుతూ అవి కోయ జాతి వంశవృక్షం ద్వారా నిర్దేశించిన తీరు, వివాహాలు బంధుత్వాలు దేవుళ్లను పూజించే సమయంలో ఏ విధంగా వాటి ప్రాధాన్యత ఉంటుందో ఇందులో సవివరంగా సహేతుకంగా వివరించారు.
ఆయా గట్లు గోత్రాలు ఏర్పాటుకు జానపద బాణీలోని పురాణ గాథలు అన్వయం చేసి చెప్పారు, వీటికి అంకెలతో పాటు పేర్లు కూడా ఉండే తీరు చెబుతూ వివాహాల విషయంలో ఏ గోత్రం/గట్టువారికి వియ్యం కుదురుతుందో
ఆవివరాలు కూడా పట్టిక రూపంలో వివరించడం ఎంతో ఉపయోగకరంగా ఉంది.
మూడవ విభాగం మొత్తం కుటుంబం, బంధుత్వాలతో చెప్పబడిరది.దీనిలో వీరు బంధువులను పిలుచుకునే విధానం,తెలుగు లిపితో చెప్పబడ్డ కోయ భాషలో ఉంటుంది,తెలుగు భాషకు కాస్త దగ్గర సంబంధంగల ఈకోయ భాష అర్థం చేసుకోవడం పెద్దకష్టం ఏమీ కాదు.
ఉదా: అమ్మను యవ్వఅని,అక్కను యక్క,మామ ను,మామాల్,అని సంబోధించడం వీరికి పరి పాటిగా ఇందులో పేర్కొన్నారు.
లిపిలేని కోయ భాషకు లిపిని ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత గురించి సహేతుకంగా సూచన ప్రాయంగా నాలుగవ అధ్యాయంలో ‘‘భాషా – లిపి’’ పేరుతో వివరించడం జరిగింది.
5,6 అధ్యాయాలుగా కొలుపులు,వేల్పులు, పండుగలు,గా పేర్కొనడంజరిగింది. సాధార ణంగా గిరిజనులు తమ కొలుపులుగా ముత్యా లమ్మ, నాగులమ్మ, సమ్మక్క సారక్క,లను పేర్కొం టారు. వీరిని కొలవడంలోని అంతరార్థం చెప్పడంతో పాటు ఆయా జాతరలు చేసే తీరు కూడా కూలంకషంగా వివరించారు.వీటితోపాటు గుంజేడు ముసలమ్మ,డాలుగడ్డ డోలీలు,వంటి జాతర్ల గురించి అవి కోయలు నిర్వహించే విధానాలు ఆసక్తిదాయకంగా అందమైన శైలిలో చక్కగా కొనసాగాయి.
ఇక ఆరవదైన ‘‘పండుగలు’’ విభాగంలో కూడా అనేక ఆసక్తికరమైన వివరాలు ఆవిష్కరణలు చేయడం జరిగింది.
అవి ఇంటి పండుగ, వేల్పుల పండుగ, విత్తనాల పండుగ,తో పాటు భూమి పండుగ, పచ్చ పండుగ, వంటి సాధారణ పండుగలతో పాటు లేలే పండుగ ,కొత్తల పండుగ, చిక్కుడు పండుగ, ఇప్పపూల పండుగ, తాటి చెట్ల పండుగ, చీడపీడల పండుగ, కప్పల పండుగ, తదితర పండుగల వివరాలు విశ్లేషణతో పాటు ఆయా పండుగలు చేసే విధానం. తదితరాలతో పాటు ఆయా పండుగలు చేసుకునే సందర్భంలో సామూహికంగా పాడుకునే పాటలు సైతం ఇందులో వివరించారు. ఓకే ఇంటి పేరు వాళ్ళు అంతా తొలకరి ఆరంభంలో ఒకే చోట ప్రకృతిని ఆరాధిస్తూ చేసుకునే పండుగ ‘‘ఇంటి పండుగ’’ దీని ద్వారా అందరిలో ఐక్యత భావం కలగడంతో పాటు సౌబ్రాతృత్వం వెల్లివిరుస్తుంది.
వస్త్రధారణ అలంకరణలు విభాగంలో కోయవారు ధరించే ఆభరణాల్లో ఖరీదు విషయం పక్కనపెడితే సహజసిద్ధంగా దొరికే లోహాలు వెండి ఇత్తడి మొదలైన వాటితో తయారు అయిన ఆభరణాలకే అధిక ప్రాధాన్యత ఇస్తారు. వీరి ఆభరణాల్లో అందం కన్నా సాంప్రదాయం అధికంగా ఉండ టం విశేషం. ఇక అడవి బిడ్డల ఆహారపు అల వాట్లు, వివాహా లు,చావు,మొదలైన విషయాల గురించి సుదీర్ఘంగా సహేతుకంగా ఇందులో వివరించ బడ్డాయి,వీటి ద్వారా అనేక ఆసక్తిదాయక విషయాలు విశేషాలు తెలుసుకోవచ్చు.
కోయల సంస్కృతిలో అత్యంత ప్రముఖ పాత్ర వహించేది ‘‘వెజ్జు’’, ఆరోగ్య విషయాల్లో ఎంతో సహకరించే ఈ వెజ్జు గురించి చాలా వివరంగా ఇందులో చెప్పారు, దీనిలో అంతర్భాగంగా మూలిక వైద్యం గురించిన వివరణలో వ్యాధులు వాటి నివారణ కోసం ఉపయోగించే మొక్కల పేర్లు పట్టిక రూపంలో వివరించడం చాలా ఉప యోగకరంగా ఉంది.
ఇక 14,15,అధ్యాయాలు ఇంటి నిర్మాణం, గృహోపకరణాలు,పనిముట్లు,గురించి చాలా చక్కగా వివరించి ఛాయాచిత్రసహితంగా అందిం చారు.అదేవిధంగా కళలు, జంతువులు, వేట, వ్యవసాయం,అటవీ ఉత్పత్తులతో పాటు,కోయ జాతిలో గల సామాజిక వ్యవస్థ, కట్టుబాట్లు, గురిం చి ఎంతో వివరణాత్మకంగా వ్రాయబడ్డాయి. భావి తరాలకు అడవిబిడ్డల సంస్కృతిని సచిత్రంగా భద్ర పరచబడిన ఈవిలువైన పుస్తకం పరిశోధకుల పాలిట కల్పవృక్షం,అనడంలో అసలైనసత్యంఉంది.
కోయతెగ-సంస్కృతి (వ్యాస సంకలనం)
పేజీలు: 226, ధర: 200/-రూ, ప్రతులకు: గిరిజన సంస్కృతి పరిశోధన శిక్షణ సంస్థ, సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ – భద్రాచలం,507111, భద్రాద్రి కొత్తగూడెం : జిల్లా, తెలంగాణ. సమీక్షకుడు : డాక్టర్ అమ్మిన శ్రీనివాసరాజు, చరవాణి : 77298 83223.- డా. అమ్మిన శ్రీనివాసరాజు