గనుల విధానాలు..అభివృద్ధి పేరుతో హక్కుల నష్టం?

భారతదేశం అభివృద్ధి దిశలో వేగంగా పయనిస్తోంది.పారిశ్రామికీకరణ,మౌలిక సదుపాయాల విస్తరణ,గ్లోబల్ మార్కెట్లలో పోటీ ఈ లక్ష్యాలన్నింటికీ ఖనిజ వనరులు కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో గనుల రంగాన్ని ప్రోత్సహించే ప్రభుత్వ విధానాలు మరింత దూకుడుగా అమలవుతున్నాయి. దేశంలోని ఖనిజ సంపద ఎక్కువగా ఉన్న ప్రాంతాలు గిరిజన జనాభా అధికంగా ఉన్న ప్రాంతాలే. ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్,ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో భూమి,అడవులు,నీరు కేవలం వనరులు కాదు..అవి జీవనాధారం, సంస్కృతి,ఆత్మగౌరవానికి ప్రతీకలు.అలాంటి ప్రాంతాల్లో గనుల విస్తరణ కేవలం ఆర్థిక చర్య కాదు; అది జీవన విధానాలపై ప్రత్యక్ష దాడి.
1991ఆర్థిక స్వేచ్ఛాకరణ తర్వాత గనులరంగంలో వచ్చిన మార్పులు ఈదిశగా మరింత వేగాన్ని అందించాయి. ప్రైవేట్ మరియు విదేశీ పెట్టుబడులకు మార్గం సుగమం చేయడం, అనుమతుల ప్రక్రియను సరళీకరించడం,గనుల లీజులను సులభతరం చేయడం వంటి చర్యలు పెట్టుబడులను ఆకర్షించడంలో సహాయపడినా,సామాజిక,పర్యావరణ పరిరక్షణ అంశాలను వెనక్కు నెట్టాయి.
ఇక్కడ ప్రధానంగా ఆందోళన కలిగించే అంశం రక్షణ చట్టాల బలహీనత. గిరిజన హక్కులను కాపాడేం దుకు రూపొందించిన పంచాయతీరాజ్‌చట్టం (PజుSA),అటవీ హక్కుల చట్టం(ఖీ=A),భూసేకరణ చట్టం వంటి కీలక న్యాయ వ్యవస్థలు అమలులో తరచూ నిర్లక్ష్యం ఎదుర్కొంటున్నాయి. గ్రామ సభల అనుమతులు కేవలం రూపకల్పనగా మారిపోతుండటం,పర్యావరణ అనుమతులు వేగంగా ఇవ్వడం,ప్రజల అభిప్రాయాలను పక్కన పెట్టడం వంటి పరిణామాలు ప్రజాస్వామ్యవ్యవస్థలపట్ల నమ్మకాన్ని దెబ్బ తీస్తున్నాయి.
గనులవల్ల కలిగే ప్రభావాలు కూడా గంభీరమైనవే.భూమి కోల్పోవడం, అడవుల నాశనం, నీటి కాలుష్యం, జీవనాధారాల నష్టం.ఇవి గణాంకాల్లో మాత్రమే కాకుండా వేలాది కుటుంబాల జీవనవాస్తవాలు. ముఖ్యంగా గిరిజన సమాజాలు అత్యధికంగా నష్టపోతున్నాయి.అభివృద్ధి పేరుతో వారు చెల్లిస్తున్న ధర అన్యాయంగా ఎక్కువ.

ఈ పరిస్థితుల్లో ప్రజల ప్రతిఘటన సహజమే. నియామగిరి నుంచి హస్దేవ్ అరణ్య వరకు దేశవ్యాప్తంగా గిరిజనులు,స్థానిక సమాజాలు తమహక్కుల కోసం పోరాడుతున్నాయి. ఈ ఉద్యమాలు కేవలం గనుల వ్యతిరేక పోరాటాలు కాదు..అవి జీవనహక్కుల,పర్యావరణన్యాయం,స్వయం నిర్ణయాధికారాలకోసం జరుగుతున్న ప్రజాస్వామ్య పోరాటాలు.సుప్రీంకోర్టు ఇచ్చిన సమతతీర్పు వంటి నిర్ణయాలు గిరిజన హక్కులకు బలమైన రక్షణను కల్పించినా, వాటి అమలు విషయంలో ప్రభుత్వాల సంకల్పం ప్రశ్నార్థకంగా ఉంది.విధానాలు ఒక వైపు,వాస్తవాలు మరోవైపు అన్న పరిస్థితి కొనసాగుతోంది.
ఇప్పుడు అవసరమైనది సమతుల్య దృక్పథం. అభివృద్ధి అవసరం అనేది వాస్తవం. కానీ అది గిరిజనుల హక్కులు,పర్యావరణ స్థిరత్వం, సామాజిక న్యాయాన్నిత్యాగం చేసి సాధించకూడదు. గ్రామ సభల నిజమైన భాగస్వామ్యం, పారదర్శక అనుమతి ప్రక్రియలు, న్యాయమైన పునరావాసం, లాభాల సమాన పంపిణీ ఇవి కేవలం సిద్ధాంతాలు కాకుండా ఆచరణలోకి రావాలి.
మొత్తానికి, గనుల చర్చ కేవలం ఆర్థిక వృద్ధి గురించి కాదు. అది ప్రజాస్వామ్యం, న్యాయం, సమానత్వం గురించి. అభివృద్ధి అనే పదానికి నిజమైన అర్థం ఇవ్వాలంటే, దేశంలోని అత్యంత బలహీన వర్గాల స్వరాలు వినిపించాలి, గౌరవించాలి.అప్పుడే భారతదేశం అభివృద్ధి మార్గం నిజంగా సమగ్రం, స్థిరమైనది అవుతుంది.– రెబ్బాప్రగడ రవి,ఎడిటర్