అసమానతలను ప్రశ్నిస్తున్న పన్నుల విధానం

ఒకఆదివాసీ ప్రాంతంలో నివసించే పేదమహిళ స్థానికదుకాణానికివెళ్లిఉప్పు,సబ్బు, వంట నూనె,పిల్లల పుస్తకాలు కొనుగోలు చేస్తుంది.ఆమె కొనుగోలుచేసే ప్రతివస్తువుపై జీఎస్టీ ఉం డదు.కొన్ని నిత్యావసరవస్తువులు మినహాయింపులు ఉన్నప్పటికీ, పన్ను వర్తించే వస్తువులపై మాత్రం ఆమెకూడా జీఎస్టీ చెల్లించాల్సిందే.మరోవైపు కోట్లాది రూపాయల విలువైన భూములు,భవనాలు, షేర్లు,పెట్టుబడులు కలిగిన అత్యంత సంపన్నుల మొత్తం నికరసంపదపై ప్రత్యేకంగా విధించే సంపదపన్ను ప్రస్తుతం దేశంలో అమల్లో లేదు.ఈ రెండు పరిస్థితుల మధ్య ఉన్నవ్యత్యాసం మన పన్నుల విధానంలో సామాజిక న్యాయం ఎంతవరకు ప్రతిబింబిస్తోందనే ప్రశ్నను లేవనెత్తుతోంది.
పేద కుటుంబాలు తమ ఆదాయంలో అధికభాగాన్ని ఆహారం,దుస్తులు,విద్య,వైద్యం,నిత్యా వసరాలకోసం ఖర్చుచేస్తాయి.పన్ను వర్తించే వస్తువుల కొనుగోళ్లపై జీఎస్టీ చెల్లించాల్సి వస్తుంది.పన్ను రేటు అందరికీ ఒకేలా ఉన్నప్పటికీ,తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలపై దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది.ఎందుకంటే వారి సంపాదనలో ఎక్కువ భాగం వినియోగానికే ఖర్చవుతుంది.సంపన్నుల ఆదాయం కేవలం జీతాల రూపంలోనే ఉండదు.భూములు,భవనాలు,షేర్లు,వ్యాపార సంస్థలు, పెట్టు బడులు,మూలధన లాభాలు వంటి అనేక రూపాల్లో వారిసంపద పెరుగుతుంది.వీటిపై ప్రస్తుత చట్టాల ప్రకారం వివిధ రకాల పన్నులు వర్తిస్తాయి.అయితే మొత్తం నికర సంపదపై ప్రత్యేకంగా విధించే సంపద పన్ను మాత్రం అమల్లో లేదు.అందువల్ల అత్యంత సంపన్నులపై సంపద ఆధారిత పన్ను విధానం అవసరమా? దానిని ఎలా అమలు చేయాలి? అనే చర్చకు ప్రాధాన్యం పెరుగుతోంది.సంపద కేంద్రీకరణ ప్రభావం ఆర్థికరంగానికే పరిమితం కాదు.అధిక వినియోగం, విలాసవంతమైన జీవనశైలి, భారీ పరిశ్రమలు,మైనింగ్ ప్రాజెక్టులు పర్యావరణంపై తీవ్ర ఒత్తిడిని పెంచుతున్నాయి.అడవుల నరికివేత, నీటి కాలుష్యం, భూగర్భ జలాల క్షీణత, భూముల విధ్వంసం,జీవవైవిధ్యానికి ముప్పు వంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.ఈ పర్యావరణ విధ్వంసం వల్ల ఎక్కువగా నష్టపోయేది ఆదివాసీ, గ్రామీణ సమాజాలే. అడవులపై ఆధారపడి జీవించే గిరిజనులు తమ సంప్రదాయ జీవనాధారాలను కోల్పో తున్నారు. నీటి వనరులు కలుషితమవుతున్నాయి.సాగు భూములు,అటవీ ఉత్పత్తులు,పశువుల మేతకు అవసరమైన ప్రాంతాలు దెబ్బతింటున్నాయి.వరదలు,కరువులు,వాతావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కొనే సామర్థ్యం కూడా వారికి పరిమితంగానే ఉంటుంది.ప్రకృతి వనరుల వినియోగం ద్వారా లాభాలు పొందే సంస్థలు ఒకవైపు ఆర్థికంగా బలపడుతుంటే,వాటి కార్యకలాపాలవల్ల కలిగే పర్యావరణ, సామాజిక నష్టాలను స్థానిక ప్రజలు భరిస్తున్నారు.

1997లో సుప్రీంకోర్టు వెలువరించిన చారిత్రాత్మక సమత తీర్పులిలి షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఆదివాసీ భూములు,సహజవనరుల పరిరక్షణకు కీలకమైన రాజ్యాంగ,చట్టపరమైన భరోసాను కల్పించింది. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో గిరిజనభూములను గిరిజనేతరులకు బదిలీ చేయడంపై ఉన్న చట్టపరమైన పరిమితులను స్పష్టం చేస్తూ,ప్రైవేటు సంస్థలకు మైనింగ్ లీజుల కేటాయింపుపై కీలక మార్గదర్శకాలను నిర్దేశించింది.ఈ తీర్పు సారాంశం కేవలం భూముల పరిరక్షణకే పరిమితం కాదు.ఆదివాసీ ప్రాంతాల్లోని ఖనిజాలు,అడవులు,నీరు,భూమి వంటి సహజ వనరులపై స్థానిక ప్రజల హక్కులు, వారి జీవనాధా రాలు,రాజ్యాంగ పరిరక్షణకు కూడా ఇది సంబంధించినది.ప్రకృతి వనరులపై స్థానిక సమాజాలకు ఉన్నహక్కులను విస్మరించి అభివృద్ధి పేరుతో చేపట్టే ప్రాజెక్టులు నిజమైన అభివృద్ధిగా పరిగణించలేం. సహజ వనరుల నుంచి వచ్చే సంపద కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతం కాకుండా,ఆవనరులపై ఆధారపడి జీవించే ఆదివాసీసమాజాల విద్య,వైద్యం,తాగునీరు, ఉపాధి, మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూడా దోహదపడాలి.ఇదే సమతతీర్పు స్ఫూర్తికి,సామాజిక న్యాయానికి అసలైన అర్థం.సమత తీర్పు మనకు గుర్తుచేసే ప్రధానసూత్రం ఏమిటంటే..ఆదివాసీ భూములు,సహజ వనరుల పరిరక్షణ రాజ్యాంగ, చట్టపరమైన బాధ్యత. సంపద సృష్టించే హక్కుతో పాటు సమాజం పట్ల బాధ్యత కూడా ఉండాలి.సంపద కొద్దిమందికి కేంద్రీకృతంకావడం అభివృద్ధి కాకుండా ఆసంపదతో సమాజంలోని చివరి వ్యక్తి జీవితం మెరుగుపడినప్పుడే నిజమైన అభివృద్ధి!– రెబ్బాప్రగడ రవి,ఎడిటర్