పంటల వైవిధ్యమే పోషకాహారానికి మూలం

ప్రజాస్వామ్య సౌధానికి మూలం వైవిధ్యం. సామాజికంగా, సాంస్కృతికంగా, రాజకీయంగా వివిధ ప్రజా సమూహాలు ఈ వైవిధ్యానికి ప్రాణం పోస్తాయి. అందుకే పాలనలోనూ ఈ ప్రజాస్వామిక స్వభావాన్ని ప్రభుత్వాలు సంతరించుకోవాలి. సాధారణంగా లాభాల కోసం పని చేసే పెట్టుబడి వైవిధ్యానికి వ్యతిరేకం. పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం పని చేసే పాలకులు కూడా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. అందుకే అన్ని ప్రజాస్వామిక, నాగరిక విలువలనూ తుంగలో తొక్కి, ఏకస్వామ్య పాలన సాగిస్తుంటారు. పాలకుల సంస్కృతి ప్రజలను కూడా ప్రభావితం చేస్తుంది కనుక ప్రజలు తమ నిత్య జీవితంలోనూ అలాగే వ్యవహరిస్తుంటారు.


తెలంగాణలో పంటల వైవిధ్యం పడిపోవడం చూస్తుంటే పాలకులలోనూ, గ్రామీణ ప్రజలలోనూ ఈ మోనో కల్చర్ ధోరణులు ఎంత బలంగా పని చేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ గడ్డ మొదటి నుంచి, ప్రధానంగా వర్షాధార ప్రాంతమే. ప్రత్యేక భౌగోళిక స్వభావం కలిగి ఉన్నది. కానీ ఎప్పుడూ వైవిధ్యమైన పంటలకు ఈ నేల కేంద్రంగా ఉండేది. ఫలితంగా వైవిధ్యమైన ఆహారం ప్రజల అలవాటులో భాగంగా ఉండేది. నేల సారాన్ని బట్టి, సాగునీరు అందుబాటును బట్టి ప్రజలు పంటలు వేసేవారు.
కానీ ఇప్పుడు అదంతా గడిచిపోయిన చరిత్ర. ప్రస్తుతం తెలంగాణలో కేవలం 3 లేదా 4 పంటలే 95 శాతం భూములను ఆక్రమించాయి. కాలక్రమంలో కొన్ని పంటలు కనుమరుగవుతున్నాయి. 2020 ఖరీఫ్‌లో రైతులు వరి 53,33,477, పత్తి 60,53,890, కంది 10,84,557 సోయాబీన్ 4,00,998 ఎకరాలలో సాగు చేశారు. మొత్తం 1,35,63,492 ఎకరాలలో పంటలు సాగయితే ఈ నాలుగు పంటలే 1,28,72,922 ఎకరాలలో సాగయ్యాయి. యాసంగిలో కూడా వరిని 50,58,128 ఎకరాలలో సాగు చేశారు. ఫలితంగా రెండు సీజన్లలోనూ మిగిలిన పంటల విస్తీర్ణం బాగా పడిపోయింది.
ఈ ధోరణి వల్ల, సాగునీటిపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతున్నది. అన్ని పంటల సగటు దిగుబడులు పడిపోతున్నాయి. కొన్ని పంటల విస్తీర్ణం గణనీయంగా పెరగడం వల్ల, మార్కెట్ సమస్య కూడా ఎదురవుతున్నది. నిల్వ కోసం అవసరమైన గిడ్డంగుల కొరత కూడా ఏర్పడుతున్నది. ఒకేసారి వ్యవసాయ కార్యకలాపాలు జరగడం వల్ల కూలీల కొరత సైతం ఏర్పడుతున్నది. యంత్రాల కిరాయిలతో సహా అన్ని రకాల సాగుఖర్చులు పెరిగి రైతులకు నికర ఆదాయాలు పడిపోతున్నాయి. కొన్ని వాణిజ్య పంటలకే డిమాండ్ పెరిగి, భూముల కౌలు ధరలు కూడా పెరిగిపోతున్నాయి.
ఇప్పుడు మార్కెట్ మాత్రమే రాష్ట్ర పంటల ప్రణాళికను శాసిస్తున్నది. వాతావరణంలో వస్తున్న మార్పులను ఏ మాత్రం పట్టించుకోకుండా పంటలను ప్రోత్సహించే ధోరణి తెలంగాణ పాలకులలో ఎక్కువగా ఉంది. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా భూగర్భ జలాలను అడుగంటి పోయేటట్లు చేస్తున్నా, ఫలితంగా యాసంగి సీజన్‌లో పంటలు ఎండిపోతున్నా, ప్రభుత్వానికి పట్టడం లేదు.
వాస్తవానికి రాష్ట్ర ప్రజల ఆహార అవసరాలు, పశువుల ఆహార అవసరాలు, రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ముడిసరుకు అవసరాలు దృష్టిలో ఉంచుకుని ఏ ప్రభుత్వమైనా రాష్ట్రంలో ఉన్న సాగుభూములను ఉత్పత్తికి ఉపయోగించుకోవాలి. అందుకు అనుగుణంగా రైతులతో కలసి గ్రామ, మండల స్థాయిలో ప్రణాళికలు రచించుకోవాలి. బఫర్ స్టాక్, ప్రకృతి వైపరీత్యాలు దృష్టిలో ఉంచుకుని కొంత అదనంగా ఉత్పత్తి ప్రణాళిక రూపొందించుకోవచ్చు. ఈ అవసరాలు తీరాక అంతగా భూములు మిగిలితే, అప్పుడు ప్రభుత్వ వ్యవసాయ మార్కెటింగ్ శాఖతో కేంద్రం, ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు, కంపెనీలు చేసుకునే ముందస్తు ఒప్పందాల ప్రాతిపదికన ఇతర రాష్ట్రాల కోసం, దేశాల కోసం కూడా పంటలు పండించవచ్చు.
ఈ మొత్తం ప్రక్రియలో రాష్ట్ర వాతావరణం, సాగు భూముల స్వభావం, సాగునీరు అందుబాటు, దానికోసం రైతులు తవ్వుకునే బావులు, బోర్లు, ప్రభుత్వాలు అప్పు తెచ్చి నిర్మించే ఎత్తిపోతల పథకాలు, వాటి నిర్మాణ, నిర్వహణ వ్యయం, వాటి విద్యుత్ అవసరాలకు చెల్లింపులు, ఫలితంగా పెరిగే పంటల ఉత్పత్తి ఖర్చు పరిగణనలోకి తీసుకోవాలి. కేంద్రం ప్రతి సంవత్సరం పంటల మద్దతుధరల విషయంలో అనుసరించే అపసవ్య ధోరణులు, ప్రభుత్వ సంస్థలకు పంటల సేకరణలో ఉన్న పరిమితులు కూడా దృష్టిలో ఉంచుకోవాలి. అమెరికా, యూరప్, చైనా దేశాలు అక్కడి రైతులకు వివిధ పేర్లతో ఇస్తున్న భారీ సబ్సిడీలు, ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల ఒడిదుడుకులను కూడా ఇక్కడ పంటల ప్రణాళిక సమయంలో దృష్టిలో ఉంచుకోవాలి.
వీటిపై రైతులందరికీ అవగాహన ఉండకపోవచ్చు కానీ ప్రభుత్వానికి తప్పకుండా ఉండాలి. ఈ సందర్భంలో ప్రజాపక్షంగా ఆలోచించి సూచనలు చేసే వ్యవసాయ ఆర్థిక నిపుణుల అభిప్రాయాలూ, వాతావరణ మార్పులకు అనుగుణంగా పంటల పొందికపై వ్యవసాయ విశ్వవిద్యాలయాలు చేసే సూచనలూ ప్రభుత్వాలు ఆలకించాలి. ప్రగతి భవన్లో తీసుకునే నిర్ణయాలన్నీ పారదర్శకమైనవి, శాస్త్రీయమైనవి కావని గత 7 సంవత్సరాల పాలన నిరూపించింది.
భారత వైద్య పరిశోధనా సంస్థ (ICMR), ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు 400 గ్రాముల ఆహారధాన్యాలు, 60 గ్రాముల పప్పుధాన్యాలు, 60 గ్రాముల నూనెలు, 25 గ్రాముల సుగంధ ద్రవ్యాలు, 325 గ్రాముల కూరగాయలు, 100 గ్రాముల పండ్లు ఆహారంగా తీసుకోవాలని సిఫార్సు చేసింది. అంటే ఆహార అవసరాల కోసం ఏ గ్రామం, జిల్లా, రాష్ట్రం, దేశం అయినా వీటి ఉత్పత్తికి స్థానికంగా ప్రణాళిక రూపొందించుకోవాలి. అందుకు అనుగుణంగా భూములను కేటాయించుకోవాలి. ఇంకా సాగు భూములు మిగిలితే పశుగ్రాసం కోసం, పరిశ్రమల అవసరాల కోసం, ఇతర ఆహార అవసరాల కోసం సాగు భూముల కేటాయింపు జరగాలి. అప్పటికీ భూములు మిగిలితే అప్పుడు మార్కెట్ ఆధారిత, ముందస్తు ఒప్పంద ఆధారిత పంటల ఉత్పత్తి కోసం కేటాయించుకోవాలి. స్థానికంగానే ఉత్పత్తి, నిల్వ, ప్రాసెసింగ్, పంపిణీ, మార్కెటింగ్ జరిగితే రైతులకు ఉత్పత్తి ఖర్చులు తగ్గుతాయి. వినియోగదారులకు స్థానికంగా నాణ్యమైన ఉత్పత్తులు తక్కువ ధరలకు దొరుకుతాయి. ప్రజలు ఇప్పటిలా, కేవలం తెల్ల వరి బియ్యం మాత్రమే ప్రధాన ఆహారంగా తీసుకోకుండా జొన్నలు, ఇతర చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, వివిధ రకాల నూనెలు, కూరగాయలు, పండ్లు, సుగంధద్రవ్యాలు ఆహారంలోకి తీసుకోవడం వల్ల ప్రజలకు పౌష్టికాహారం అందుతుంది. ఆరోగ్యాలు మెరుగవుతాయి. అన్నిటికీ మించి రైతులకు స్థానికంగానే అన్ని వ్యవసాయ ఉత్పత్తులకు లాభసాటి ధరలు లభిస్తాయి. పశువులకు కూడా వైవిధ్యమైన పశుగ్రాసం దొరికి ఆరోగ్యకరమైన పాలు, మాంసం, గుడ్ల దిగుబడులు గణనీయంగా పెరుగుతాయి. ఈ మొత్తం వ్యవసాయ, పశు ఆధారిత ఉత్పత్తుల ప్రక్రియలో ఎరువుల ధరలు పెరుగుతూ, పంటల ఉత్పత్తి ఖర్చులు మరింత పెరిగే అవకాశం ఉన్నందున విష రసాయనాలను వదిలేసి సేంద్రీయ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తే ప్రజల ఆరోగ్యాలూ ,పర్యావరణమూ బాగుపడతాయి. రాష్ట్రంలో సాగునీటిపై కూడా ఒత్తిడి తగ్గుతుంది. తద్వారా విద్యుత్ వినియోగం తగ్గుతుంది. ఎందుకంటే వరి, పత్తి, పామాయిల్ లాంటి పంటలకు నీటి అవసరం ఎక్కువ. మిగిలిన పంటలు ప్రధానంగా మెట్ట పంటలు. ఇప్పటి వరకూ వీటిని అశ్రద్ధ చేయడం వల్ల రాష్ట్రం అన్ని విధాలా నష్టపోయింది. కేంద్రం తెచ్చిన మూడు చట్టాల నేపథ్యంలో మార్కెట్ ధరలు రైతులకు అనుకూలంగా ఉండే అవకాశం లేదు. రాష్ట్రంలో రెండు మూడు పంటల విస్తీర్ణాన్నే ప్రోత్సహిస్తే వాటి మార్కెటింగ్ కష్టం అవుతుంది. ప్రభుత్వం కూడా చివరి గింజ వరకూ ఎప్పుడూ కొనే అవకాశం ఉండదు.
అందువల్ల ప్రభుత్వం కొన్ని నిర్దిష్ట చర్యలు వెంటనే ప్రారంభించాలి. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ దృష్టితో కాకుండా తెలంగాణ రాష్ట్ర అవసరాల ప్రాతిపదికన పంటల ప్రణాళిక చేపట్టాలి. రాష్ట్రస్థాయిలో చర్చించడం కాకుండా, రైతులకు అవగాహన కల్పించడం ద్వారా, గ్రామ, మండల స్థాయిలో ఈ ప్రణాళికలు రూపొందాలి. ఈ చర్చలలో స్థానికంగా ఉండే రైతు సహకార సంఘాలను, రైతు ఉత్పత్తిదారుల కంపెనీలను, గ్రామీణ మహిళా సహకార సంఘాలను, పశు పోషకులను, కోళ్ళ పెంపకందారులను భాగస్వాములను చేయాలి. ఈ సహకార సంఘాల ఆధ్వర్యంలోనే ప్రాసెసింగ్ యూనిట్లు, గిడ్డంగుల కోసం నిధులు కేటాయించవచ్చు. కస్టమ్ హైరింగ్ సెంటర్లు నిర్వహించవచ్చు.
రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తుల ఆధారంగా పరిశ్రమలు నడుపుతున్న పారిశ్రామికవేత్తలతో జిల్లా, రాష్ట్ర స్థాయిలో సమావేశాలు జరిపి వాళ్ళ అవసరాలు తెలుసుకోవాలి. ఇతర రాష్ట్రాలను, బడా వ్యాపారసంస్థలను సంప్రదించి, వాళ్ళకు రాష్ట్రం నుంచి అవసరమైన వ్యవసాయ, ఇతర గ్రామీణ ఉత్పత్తుల గురించి చర్చలు జరిపి, కనీస మద్దతుధరల చెల్లింపు ప్రాతిపదికన వారితో ముందస్తు ఒప్పందాలు చేసుకోవాలి. వాటిని కూడా గ్రామ, మండల స్థాయిలో పంటల ఉత్పత్తి ప్రణాళికలలోకి తీసుకురావాలి. పంటల ఉత్పత్తి ఖర్చులు, దిగుబడుల మధ్య వ్యత్యాసం వల్ల, రైతులకు వచ్చే ఆదాయాల మధ్య వ్యత్యాసం తప్పకుండా ఉంటుంది కనుక, వారు నష్టపోకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఎకరానికి కనీస ఆదాయం గ్యారంటీ ఇవ్వాలి. అప్పుడే రైతులు భరోసాతో అన్ని పంటలను సాగు చేస్తారు. అడవి జంతువులు, ప్రకృతి వైపరీత్యాల నుంచి రైతులు తట్టుకోవడానికి సమగ్ర బీమా పథకాలను అమలు చేయాలి.
రాష్ట్రప్రభుత్వం ఈ వానాకాలం సీజన్‌కు ముందే, పాత తప్పులు పునరావృతం కాకుండా చర్చలు ప్రారంభించి నిర్దిష్ట విధానాలను అమలు చేయాలి.(ఆంధ్ర‌జ్యోతి సౌజ‌న్యంతో..)
కన్నెగంటి రవి, రైతు స్వరాజ్య వేదిక

ఆస్తుల అమ్మకంలో ఆంతర్యమేమి?

రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విశాఖ నగరం లోని భూములను వేలం ద్వారా అమ్మకానికి పెట్టాలని నిర్ణయించింది. దీని కనుగుణంగా ‘నేషనల్‌ బిల్డింగ్‌ కనస్ట్రక్షన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా’ వారు మార్చి 30వ తేదీన నగరంలోని ఐదు ప్రదేశాలలో ఉన్న 17.48 ఎకరాల భూమిని వున్నది వున్నట్లుగా అమ్మాలని ‘ఇ టెండర్ల’ను ఆహ్వానించారు. నగరం నడిబొడ్డున ఆర్కే బీచ్‌ను ఆనుకుని ఉన్న 13. 59 ఎకరాల భూమి కూడా ఇందులో ఉంది. ప్రభుత్వం భూములు ఎందుకు అమ్ముతోంది అన్నది ఒక అంశం కాగా, అలా అమ్మడం సహేతుకమేనా అన్నది మరొక అంశం. వాస్తవానికి గత సంవత్సరమే ప్రభుత్వం ఇలాంటి ప్రయత్నం చేసినా హైకోర్టు ఆర్డర్‌ వల్ల నిలిచిపోయింది.

అధికారంలోనికి వఛ్చిన సంవత్సరమే రాష్ట్ర ప్రభుత్వం ‘బిల్డ్‌ ఎ.పి మిషన్‌’ అమలుకు ముఖ్యమంత్రి అధ్యక్షతన ఒక స్టేట్‌ లెవెల్‌ మోనిటరింగ్‌ కమిటీని (ఎస్‌ఎల్‌ఎంసి) జీఓ నెం. 447 (తేదీ 5.11.02019) ద్వారా ఏర్పాటు చేసింది. అందులో మూడు అంశాలను ప్రధానంగా పేర్కొన్నారు. ఒకటి రాష్ట్ర ప్రభుత్వ ‘నవరత్నాలు, నాడు-నేడు’ వంటి పథకాల అమలుకు నిధులు సమకూర్చుకోవడం, రెండవది రాష్టంలో నిరుపయోగంగా ఉన్న స్థలాలను అమ్మడం ద్వారా ఆ నిధులు రాబట్టడం, మూడవది ఈ పనిని సమర్ధవంతంగా చేయడానికి నేషనల్‌ బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌ (ఎన్‌బిసిసి) అనే కేంద్ర ప్రభుత్వ రంగ పరిశ్రమతో ఒప్పందం చేసుకోవడం. ఇప్పుడు ఈ సంస్థ కూడా కేంద్ర ప్రభుత్వ అమ్మకాల జాబితాలో ఉండడం గమనార్హం.

గత సంవత్సరం మార్చి 2వ తేదీన జరిగిన ఎస్‌ఎల్‌ఎంసి సమావేశంలో సుమారు పది వేల కోట్ల రూపాయల విలువచేసే 1400 ఎకరాల భూమి 250 ప్రాంతాలలో ఉందని గుర్తించారు. ఈ భూమిని వివిధ దశలలో అమ్మాలని ప్రతిపాదించారు. మొదటి దశలో విశాఖపట్నం జిల్లాలో 28, కృష్ణా జిల్లాలో 5, గుంటూరు జిల్లాలో 7 మొత్తం 40 స్థలాలను అమ్మవచ్చని ఎన్‌బిసిసి ఎంపిక చేసింది. ఈ స్థలాల నుండి అత్యధిక రాబడి సాధించేందుకు అవసరమైన సహకారానికి కెనడా రాజధాని టోరొంటో ప్రధాన కేంద్రంగా ఉన్న ‘కొలియర్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రవేట్‌ లిమిటెడ్‌’, అమెరికా లోని చికాగో ప్రధాన కేంద్రంగా ఉన్న ‘జెఎల్‌ఎల్‌ ప్రాపర్టీ కన్సల్టెంట్స్‌’ సంస్థలతో ఒప్పందం చేసుకున్నారు. ఈ రెండూ రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ప్రపంచం లోనే అతి పెద్ద కంపెనీలు.

ఇలా అమ్మకానికి పెడుతున్న స్థలాలు ఎపిఐఐసి, ఇరిగేషన్‌, మునిసిపల్‌, రెవిన్యూ, ఆరోగ్య, జైళ్ల శాఖలకు చెందినవి ఉండడంతో, ఎలాంటి వివాదాలకు తావులేకుండా అమ్మకానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడానికి జిల్లా కలెక్టర్‌ అధ్యక్షులుగా, జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కన్వీనరుగా డిస్ట్రిక్ట్‌ ప్లానింగ్‌ అండ్‌ ఇంప్లిమెంటేషన్‌ కమిటీని అన్ని జిల్లాలలో ఏర్పాటు చేశారు.

అసలు ఇలా భూములు అమ్మడం వివేకమేనా అనే ప్రశ్న అలా ఉండగా ఇంకా విచిత్రమైన రెండు విశేషాలు ఇందులో ఉన్నాయి. ఒకటి స్థలాల విలువ కట్టడమైతే, రెండోది ఈ స్థలాలలో ప్రస్తుతం ఏమున్నాయనేది. మార్కెట్‌ విలువ కంటే అన్ని స్థలాలలోనూ తక్కువే వస్తుందని వారు పేర్కొన్నారు. అదే సందర్భంలో సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ రేట్ల కంటే కూడా వీరు తక్కువ మార్కెట్‌ రేటును పొందుపరిచారు. దీనర్ధమేమిటంటే భూములను చవకగా అమ్మడం. వీరు అమ్మాలనుకున్న కొన్ని స్థలాలలో ప్రధానమైన ప్రభుత్వ డిపార్ట్‌మెంట్లు పని చేస్తున్నాయి. ఉదాహరణకు గుంటూరు నగరంలోని అరండల్‌ పేటలో వున్న తహసీల్దార్‌ ఆఫీసు, జైలును ఖాళీ చేయించి ఆ స్థలాన్ని అమ్మేయాలని నిర్ణయించారు. అలాగే విశాఖ నగరం లోని సీతమ్మధారలో ఉన్న తహసీల్దార్‌ ఆఫీసు, రెవిన్యూ ఉద్యోగుల క్వార్టర్లను ఖాళీ చేయించి అమ్మకానికి పెడుతున్నారు. ఇంకా విచిత్రంగా, అక్కడే ఉన్న ప్రభుత్వ కంటి ఆసుపత్రిని, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్‌ కార్యాలయాన్ని కూడా తరలించి, ఆ పదకొండు ఎకరాల స్థలాన్ని కూడా వేలానికి పెట్టాలని నిర్ణయించారు.

ఇంకో విశేషమేమిటంటే గత ప్రభుత్వం విశాఖ నగరంలోని 13.59 ఎకరాల భూమిని ‘లులు మాల్‌’ కు కేటాయించింది. ఈ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన వెంటనే ఆ కేటాయింపును రద్దు చేసింది. ప్రభుత్వం దీనిని ప్రజావసరాలకు వినియోగిస్తుందని భావించి ప్రజలు ఈ రద్దును హర్షించారు. కానీ వారికి దిమ్మదిరిగేలా ప్రభుత్వం నేడు ఆ భూమిని కూడా అమ్మకానికి పెట్టింది. ఆ కాడికి పాత కేటాయింపును రద్దు చేయడమెందుకు? ‘లులు మాల్‌’ కే వదిలేస్తే పోయేది కదా అనే భావనతో ఇప్పుడు ఆ ప్రజలే ముక్కున వేలేసుకుంటున్నారు. ఇదంతా చూస్తుంటే ‘బిల్డ్‌ ఎ.పి” అంటే ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడం కాకుండా అమ్మకానికి పెట్టడంలా ఉంది. ఒక పక్క అమ్మేస్తూ, ఇదెలా నిర్మించడం అవుతుందో ఆ పేరు పెట్టిన వారికే తెలియాలి.

ఈ మొత్తం వ్యవహారం అనేక సందేహాలకు తావిస్తోంది. దీనికి తోడు ప్రభుత్వ వివేచనను ప్రశ్నించేలా చేస్తోంది. ఇలా అమ్ముకుంటూ పోతే ఆస్తులు తరుగుతాయే కానీ పెరగడానికి ఇదేమీ ఊరే జల కాదు కదా! ఈ అమ్మకాలలో విదేశీ బడా రియల్‌ ఎస్టేట్‌ సంస్థలను భాగస్వామ్యం చేయడం వెనుక ఏమైనా మతలబుందా అనే సందేహం కూడా సామాన్యులకు కలగడం సహజం. ప్రభుత్వ ఆఫీసులను కూడా ఖాళీ చేయించి మరీ అమ్మకానికి పెట్టడంలో ఆంతర్యమేంటనే సందేహం కూడా కలుగుతుంది. ఇటువంటి సందేహాలను కొట్టిపారేయకుండా నివృత్తి చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇంటి రోజువారీ ఖర్చులకు ఆదాయ మార్గాలను వెతుక్కోకుండా ఇంట్లో సామాన్లన్నీ అమ్ముకుంటూ పోతే, ఆ ఇల్లు ఎలా దివాళా తీస్తుందో మన రాష్ట్ర పరిస్థితి కూడా అక్కడికే చేరుకుంటుందనడం అతిశయోక్తి కాదు.

సంక్షేమ పథకాలు అమలు చేయడం మంచిదే కానీ, ఆ పేరుతో ప్రభుత్వ ఆస్తులను అమ్ముకోవడం వివేకవంతమైన ఆలోచనేనా? అలా అమ్ముకుంటూ పోతే కొన్నాళ్ళకు ప్రభుత్వ ఆస్తులన్నీ అయిపోతే అప్పుడు ఏం చేస్తారనే ప్రశ్నలు సహజంగానే తలెత్తుతాయి. ప్రభుత్వ ఆస్తులన్నీ అమ్మేయడమే తమ విధానమని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వ బాట లోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా పయనిస్తోందా అనే భావం కూడా ప్రజలకు కలుగుతుంది. ఇప్పుడు విశాఖ భూములతో ప్రారంభించి అనేక ప్రాంతాలలో భూములను అమ్మడం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంగా అవగతమవుతోంది.

ప్రభుత్వం ఇప్పటికైనా విజ్ఞతతో పునరాలోచించి స్థిరంగా వచ్చే ప్రత్యామ్నాయ ఆదాయ వనరులపై దృష్టి సారించాలి. కేంద్రం నుండి రావలసిన మన వాటా నిధులకై అవసరమైతే అందరినీ కలుపుకుని ఒత్తిడి తేవాలి. అంతేకాని ఇలా ఆస్తులను అమ్ముకోవడం రాష్ట్రానికి ఏ మాత్రం శ్రేయస్కరం కాదు. విజ్ఞత అంతకంటే అనిపించుకోదు.
ఎ. అజ శర్మ /వ్యాసకర్త ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి