విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు

దేశంలో అతిపెద్ద సింగిల్ సైట్ ప్లాంట్ ఇది

సొంత ఖనిజ గనులు ఇచ్చి బలోపేతానికి బదులు గా ప్రైవేటు పరం చేసి ఆంధ్రుల భావోద్రేకాలను గాయపరిచిన చారిత్రక తప్పిదం .

చెల్లించక తప్పదు భారీమూల్యం.

ఆంధ్రులు ఆరంభ శూరులు అనే అపప్రధను తునియలు చేద్దాము

విశాఖ తీరాన ఉవ్వెత్తున ఎగిసిపడాలి ఉక్కు సత్యాగ్రహం .

ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడు కుందాము కుల మత రాజకీయాలకతీతంగా నవరత్న సంస్థ ను నిలుపని సంక్షేమం ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టడమే

ప్రత్యేక హోదా ముగిసిపోయిన అధ్యాయం అన్నారు ,కనీసం విభజన హామీలు అయినా తీర్చండి అని గట్టిగా అడిగే నాధుడు లేడు ,ఎవరి సొంత రాజకీయ ప్రయోజనాలు వారివి ,నెరవేరలేదు సరికదా కడపస్టీల్ ప్లాంట్ అడిగితే ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఎసరు పెట్టారు .విశాఖ జోను ,అమరావతి లైను రెండూ లేవు .దుగరాజపట్ణం ఊసులేదు ,బ‌డ్జెట్లో ఆంధ్ర రాజ‌ధాని అమ‌రావతి మాటే మరచారు ,రైతుల నోట్లో మూడు రాజధానులంటూ “అమ్మకి అన్నానికి గతిలేదు పిన్నమ్మకి గాజులన్న “నానుడి కి శ్రీకారం చుట్టారు .ఆంధ్రప్రదేశ్ కి జీవనాడి పోల‌వరం ప్రాజెక్ట్ పూర్తి ఎపుడు ?బడ్జెట్ లో కేటాయింపులు ఏవి ?పేరుకు జాతీయ ప్రాజెక్ట్ ,నిధుల మంజూరు లేదు ,ఇరవై అయిదు మంది ఎంపీ లు నిలదీసింది లేదు ,కంటితుడుపు మాటలు తప్ప .నిలతీయలేరని ప్రజలకూ అర్ధమైంది .అసలు ఆంధ్రప్రదేశ్ కి నూతన బడ్జెట్ లో ఎలాంటి కేటాయింపులు లేవు .చేతులు కాలాక ఆకులు పట్టుకొన్నట్టుగా ఉంది మన స్థితి .

ఇపుడు పుండుమీద కారం చందాన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని100% ప్రైవేటీకరణ చేస్తామని కేంద్రం ప్రకటించింది . జనవరి 27వ తేదీన జరిగిన కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోద ముద్ర కూడా వేసినట్లుగా కేంద్ర డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ కార్యదర్శి తుహిన్ కాంతా పాండే వెల్లడించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను పూర్తిగా ప్రైవేటీకరించడానికి కేంద్రం సిద్ధమైనట్లుగా పేర్కొన్నారు.1966 నుంచి దశాబ్దకాలం పాటు ‘విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’ నినాదంతో తెలుగు ప్రజలు సుదీర్ఘ పోరాటంలో 32మంది ప్రాణ త్యాగాలు, 64 గ్రామాల ప్రజలు ఇళ్ళు ఖాళీ, 22,000 ఎకరాల భూమిని త్యాగం చేసి సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకునేందుకు ఎలాంటి పోరాటానికైనా సిద్దమేనని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

1966 అక్టోబర్‌, నవంబర్‌ నెలలో ఉద్యమం బలపడింది. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ప్రజలు ఉద్యమించారు. గుంటూరు జిల్లా తాడికొండకు చెందిన టి. అమృతరావు 1966 అక్టోబర్‌ 15న విశాఖలో అమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. కొద్ది రోజులకే కాలేజీలు, స్కూళ్ల విద్యార్థులు ఉద్యమంలోకి వచ్చి ముందు వరుసలో నిల్చున్నారు. వారికి రాజకీయ పార్టీలు మద్దతుగా నిలిచారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ప్రారంభించారు. దశల వారీగా తరగతుల బహిష్కరణ, బంద్‌లు, హర్తాళ్లు, సభలు, సమ్మెలు, నిరాహార దీక్షలు సాగాయి. అన్ని రాజకీయ పక్షాలతో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో తెన్నేటి విశ్వనాథం, వి.భద్రం, రవిశాస్త్రి తదితరులు ఉద్యమ సారధులయిన చారిత్రక నేపధ్యం .

1966 నవంబర్‌ 1న విశాఖలో విద్యార్థులు భారీ ప్రదర్శన చేపట్టారు. ఆందోళనకారులను చెరగొట్టేందుకు చేసిన ప్రయత్నం విఫలం కావడంతో పోలీసులు కాల్పులు జరిపారు. తొమ్మిదేళ్ల బాలుడు కె. బాబురావు సహా తొమ్మిది మంది మరణించారు. వారిలో ముగ్గురు విద్యార్థులున్నారు. ‘విశాఖ ఉక్కు -ఆంధ్రుల హక్కు’ అన్న ఉద్ధృత పోరాటం ఫలితం గా 1971 లో శంకుస్థాపన చేసుకొన్న ఈ నవరత్న సంస్థలో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి 100% వాటాలున్నాయి .సముద్రతీరంలో ఏర్పాటైన తొలి సమీకృత ఉక్కు కర్మాగారం ఇదే .
ఒకప్పుడు భారీ నష్టాలతో కూరుకుపోయిన సంస్థ …తరువాతి కాలంలో తేరుకొని 21,851  కోట్ల టర్నోవర్ సాధించే స్థాయికి చేరింది .2010  నవంబర్ 17న దీనికి నవరత్న హోదా కల్పించారు .ఇంతటి ఘన చరిత్ర ఉన్న ఈ సంస్థ సొంత గనులు లేక వరుస నష్టాల్లో కూరుకు పోయింది .2015-16లో రూ .1420.64 కోట్లు 2016-17.లో రూ.1263.16కోట్లు2017-18..లో రూ .1369.01.  కోట్లు నష్టం వాటిల్లింది .

ఇందుకు ప్రధాన కారణాలు
1.సొంతగనులు లేకపోవడం.2.ముడి ఇనుము, బొగ్గు ధరలు భారీగా పెరగడంతో కొనుగోళ్లకు అధికమొత్తంలో ఖర్చుచేయాల్సి రావడం స్టీల్‌ప్లాంట్‌పై పెనుభారం మోపుతోందని వినిపిస్తున్నది .3.ఆధునికీకరణ, విస్తరణ వల్ల కూడా ఆర్ధిక ఇబ్బందులు పెరిగాయి. దీనికి తోడు ఉక్కు కర్మాగారాన్ని పోస్కో సెగలు కూడా తాకాయి. ప్రపంచ ఉక్కు దిగ్గజ సంస్థ అయిన పోస్కో తమ కార్మాగారాన్ని స్టీల్ ప్లాంట్ ఆవరణలో నిర్మిస్తుందన్న ప్రచారం జరిగింది. పోస్కో ప్రతినిధులు కొందరు స్టీల్‌ప్లాంట్‌ను పలుమార్లు సందర్శించడం ఈ ప్రచారానికి ఊతమిచ్చింది. 4.స్టీల్ ప్లాంట్ కింద ఉన్న కొన్ని ఎకరాలను పోస్కోకు కేటాయిస్తారన్న వార్తలపై స్థానికంగా ఆగ్రహం వ్యక్తమయింది. ఈ క్ర‌మంలో సంస్థ‌లో ఉద్యోగుల సంఖ్యను తగ్గించేందుకు వీలుగా అధికారులు బోర్డు అనుమతి కూడా ఇచ్చింది. విశాఖ నగరం శరవేగంగా అభివృద్ధి కావడంతో ఫ్యాక్ట‌రీ భూముల విలువ కూడా భారీగా పెరిగింది. ప్రస్తుతం భూములు, ప్లాంట్‌ విలువ కలిపితే రూ.లక్ష కోట్లకు పైగానే ఉంటుంద‌ని అంచ‌నా. కాగా, ప్రస్తుతం ఈ ప్లాంట్‌ 26,000 ఎకరాలలో విస్తరించి ఉంది. దీని సామర్థ్యం ఏటా 7.3 మిలియన్‌ టన్నులు. దాదాపు 16,000 మంది శాశ్వత ఉద్యోగులు, 17,500 మంది కాంటాక్ట్‌ కార్మికులు పని చేస్తున్నారు. పరోక్షంగా మరో లక్ష మంది ఉపాధి పొందుతున్నారు. సంస్థను   లాభాల బాటలో నడపడానికి మెకెన్సీ సంస్థను సలహాదారుగా పెట్టుకొని వాళ్ల సూచనలు పాటించి నష్టాల బాటనుంచి బయటపడాలని భావించారు దానికి కారణం దేశంలో స్టీలుకు డిమాండ్ పెరుగుతుండడం ,భవిష్యత్తుకు బంగారు బాట అవుతుందని భావించేలోపే కేంద్రప్రభుత్వం 100%    ప్రైవేటీకరణకు సిద్ధమవడం శరాఘాతం .స్టీల్‌ ప్లాంట్‌ను, విశాఖను విడదీసి చూడలేం. ఉక్కు ఫ్యాక్టరీతో విశాఖ ఉక్కు నగరంగా మారింది. వైజాగ్ అస్తిత్వానికి ప్రతీకగా నిలిచింది ఫ్యాక్టరీ. ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అంటూ నినదించిన స్వరాలు ఇంకా సాగర తీరంలో మారుమోగుతూనే ఉన్నాయి..”

ఒక నిర్ధిష్టమైన సమచారాన్ని సమగ్రంగా ,స్పష్టం గా ప్రజలకు చెప్పినపుడు మాత్రమే ఆలోచన ప్రజలను నిర్ధిష్టం గా ఆవహిస్తుంది .. .నిర్ధిష్టమైన ,స్పష్టమైన భావోద్రేక ఆలోచనను ప్రజల్లోకి తీసుకెళ్లగలిగితే  అది ఒక బలమైన ప్రజా ఉద్యమం గా మారుతుంది .అనేక చారిత్రక ప్రజా ఉద్యమాలు ఇందుకు రుజువు .తెలంగాణ ఉద్యమ విజయమే దీనికి ప్రత్యక్ష తార్కాణం .ప్రజాఉద్యమాలతో పరిష్కారం సాధించుకోవడానికి సమాయత్తమవ్వడమే మనముందున్న తక్షణ కర్తవ్యం .

డా .వసుంధర, (సామాజిక కార్యకర్త )