వాతావరణానికి ఏమైంది?

వాతావరణం మారిపోయింది. ప్రతి నోటా ఇప్పుడు ఇదేమాట. ఆకస్మిక వరదలతో మహానగరాలు అతలాకుతలం అవుతున్నాయి. అనావృష్టితో ఎడారిని తలపించే అనంతపురం, కర్నూలు వంటి జిల్లాల్లో ఉన్నఫళంగా భారీ వర్షాలు దంచికొడతాయి. చలికాలంలో రోళ్లు పగిలే ఎండలు.. వర్షాకాలంలో ఎముకలు కొరికే చలి.. కాలాలకతీతంగా వాతావరణంలో వైపరీత్యాలు చూస్తున్నాం. శిశిరం, గ్రీష్మం, హేమంత రుతువులన్నీ ఏక మవుతున్న పరిస్థితి. ధ్రువ ప్రాంతాల్లో మంచు మేటలు కరిగిపోతున్నాయి. సముద్ర జలాలు తీరం దాటి ముంచు కొస్తున్నాయి. ప్రపంచమంతటా ప్రకృతి విపత్తులే. భూమం డలంలో సంభవిస్తున్న ఈ వైపరీత్యాలకు భూతాపం పెరిగిపోవడమే ప్రధాన కారణం. మానవాళి కొనితెచ్చు కున్న ఈ విపత్తును నివారించకపోతే వాతావరణ మార్పుల ప్రభావం మానవ మనుగడకే ముప్పు తెస్తుందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. భూతాపాన్ని తగ్గించాలంటే కర్బన ఉద్గారాలను తగ్గించు కోవాలి. పారిశ్రామిక విప్లవ నేపథ్యంలో అమెరికా, బ్రిటన్‌ లాంటి సామ్రాజ్యవాద దేశాలు ప్రపంచంలోని మిగిలిన అన్ని దేశాలకంటే ముందే కర్బన ఉద్గారాలు యథేచ్ఛగా వెదజల్లి పర్యావరణాన్ని పాడు చేశాయి. కర్బన ఉద్గారాల్లో ఇప్పటికీ పెట్టుబడిదారీ దేశాలదే మెజార్టీ వాటా. కానీ పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే త్యాగాలు తప్ప వంటూ … ఆ త్యాగం పేద దేశాలు, వర్ధమాన దేశాలు చేయాలన్నదే అమెరికా, దాని అనుంగు దేశాల వాదన. ప్రపంచ దేశాల మధ్య యుద్ధోన్మాదాన్ని రగిలిస్తూ ఐక్యతను దెబ్బతీస్తున్న ఈ పెట్టుబడిదారీ దేశాలు ఇటు ప్రజలకే కాకుండా పర్యావరణానికి కూడా ప్రధాన శత్రువులే అనేందుకు వారు చేస్తున్న ఈ వాదనే నిదర్శనం.
భూమండలంపై పెరుగుతున్న ఉష్ణో గ్రతలను1.5సెంటిగ్రేడ్‌ డిగ్రీలకు పరిమితం చేయాలన్నది 2015లో పారిస్‌ ఒప్పందంలో ప్రపంచ దేశాలకు నిర్దేశించిన ప్రధాన కర్తవ్యం. కానీ అమెరికా లాంటి దేశాలు ఈ ఒప్పందం నుంచి వైదొలిగి నేలతల్లికి ద్రోహం చేశాయి. జీవా వరణాన్ని ధ్వంసం చేసిన పెట్టుబడిదారీ దేశాలే మిన్నకుండిపోతే ఇక పేద,వర్ధమాన దేశాలు చేసే దేముంది? భూతాపం అందుకే పెను ప్రమాదంగా మారుతోంది. భూతాపాన్ని తగ్గించేందుకు ప్రస్తుతం ప్రపంచ దేశాలు తీసుకుంటున్న చర్యలు ఏ మూ లకూ చాలవని ఐక్యరాజ్యసమితి సైతం ఆందోళన వ్యక్తం చేసిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. భూమండలం వాతావరణ సంబంధిత తుపానులు, వడగాలులు, వరదలతో ఇబ్బందులు పడుతోందని, ఉష్ణోగ్రతలు కూడా పారిశ్రామిక యుగానికి ముందు నాటి స్థాయిల కన్నా ఎక్కువగా 1.2 డిగ్రీల సెల్సి యస్‌కు చేరుకుందని ఐక్యరాజ్య సమితి వాతావరణ నిపుణులు హెచ్చరించారు. పెట్రోలు, డీజిలు వంటి శిలాజ ఇంధనాల వినియోగంవల్ల గాల్లోకి వెదజల్లే గ్రీన్‌హౌస్‌ వాయువులే భూతాపానికి కారణం. భూమండలానికి రక్షణగా ఉన్న ఓజోన్‌ పొరను ఈ గ్రీన్‌హౌస్‌ వాయువులు ధ్వంసం చేయడం వల్ల సూర్య కిరణాలు నేరుగా భూమిని తాకడంతో భూతాపం పెరిగిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా 1.5 డిగ్రీల సెల్సియస్‌కు ఉష్ణోగ్రతలను పరిమితం చేసేందుకు అనుసరించాల్సిన పంథాకు కనీసం దగ్గరలో కూడా లేమన్నది ఐక్యరాజ్య సమితి వాతా వరణ మార్పుల విభాగం ఆందోళన. 2010 స్థాయిలతో పోలిస్తే 2030 నాటికి కాలుష్య వాయు వులు43శాతం తగ్గాల్సిన అవసరం వుంది. అప్పుడే పారిస్‌ ఒప్పంద లక్ష్యాన్ని సాధించగలం. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తే 2030 నాటికి కాలుష్యాలు 10.6శాతం పెరిగాయని ఐరాస నివేదిక పేర్కొన డం మానవాళి ముందున్న ప్రమాదాన్ని తెలియ జేస్తోంది.శిలాజ ఇంధనాల వినియోగంతో పెరిగి పోతున్న కాలుష్యం ప్రజల ప్రాణాలనూ తోడే స్తోంది. భారత్‌లో 2021లో ఏకంగా 3,30,000 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ‘ద లాన్సెట్‌’ మెడిక ల్‌ జర్నల్‌ నివేదించింది. ప్రతి రెండు నిమిషాలకు ఒకరు కాలుష్య కాటుకు బలైపోతున్నారన్నమాట. పర్యావరణ, వైద్యారోగ్య నిపుణుల హెచ్చరికలు పారిశ్రామిక యుగంలో తెగబలిసిన పెట్టుబడిదారీ దేశాల ప్రభుత్వాధినేతలకు తలకెక్కడం లేదు. ఈజిప్టులో నవంబరు 6 నుంచి 18 వరకూ కాన్ఫ రెన్స్‌ ఆఫ్‌ పార్టీస్‌ (కాప్‌) 27 సదస్సు జరగనుంది. వాతావరణ మార్పుల సమస్యను చక్కదిద్దేందుకు చేపట్టాల్సిన కార్యాచరణను రూపొందించడమే ఈ సదస్సు ముఖ్యోద్దేశం. బ్రిటన్‌ నూతన ప్రధానమంత్రి రిషి సునాక్‌ ఈసదస్సుకు హాజరుకాబోరని కథనాలు వెలువడ్డాయి. పర్యావరణ పరిరక్షణకు తమ మద్ద తు ఉంటుందని సుభాషితాలు వల్లించే ఆధిపత్య దేశాల అధినేతలు కాప్‌ వంటి సదస్సులకు డుమ్మా కొట్టడం వారి అసలు నైజాన్ని చాటుతోంది. పర్యా వరణం అంటే మన చుట్టూ ఉండే జీవావరణమే. దీనిని రక్షించుకోవడం మనందరి బాధ్యత.
ఎందుకీ అధిక వర్షాలు.. అసలు కారణాలేంటి?
కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి దాకా ఒకటేవర్షాలు. అదికూడా రోజుల తరబడి. గతం లో ఎప్పుడూ ఇలాంటి వాతావరణం లేదు. వాగులు పొంగుతున్నాయి. వంకలు పొర్లుతున్నా యి. చెరువులు అలుగులు పోస్తున్నాయి. నదులు ఉప్పొంగుతున్నాయి. పట్టణాలు నీట మునుగుతు న్నాయి. నగరాలు కాకావికలమవుతున్నాయి. కాలం కాని కాలంలో వర్షాలు కురుస్తుండడంతో మనిషి జీవితం అస్తవ్యస్తమవుతోంది. పంటలన్నీ చేతికొచ్చే సమయంలో జలార్పణమవుతున్నాయి.రోడ్లు కొట్టుకుపోతుండటంతో ప్రభుత్వానికి ?కోట్లల్లో నష్టం వాటిల్లుతోంది. గతంలో ఒకటి లేదా రెండు మహా అయితే మూడు రోజుల వరకే వర్షం పరిమి తమయ్యేది. తర్వాత కొంచెం గ్యాప్‌ ఇచ్చి కురిసేది. కానీ కొన్నేళ్ల నుంచి వర్షం కురిస్తే రోజుల తరబడి ఉంటున్నది.
ఎందుకు ఈ అకాల వర్షాలు
వాతావరణంలో ఆకస్మాత్తుగా చోటు చేసుకుంటున్న మార్పులకు అసలు కారణం భూమి వేడెక్కడం..సైన్స్‌ పరిభాషలో చెప్పాలంటే గ్లోబల్‌ వార్మింగ్‌. భూమి మీద వాతావరణం సూర్యరశ్మీని గ్రహించి వేడెక్కుతుంది. ఆ వేడిని చుట్టూ వ్యాపింప చేస్తుంది. ఇదే లేకపోతే భూమిచల్లగా ఉండి అసలు జీవించడానికి పనికొచ్చేది కాదు. అయితే సహజం గా ఏర్పడే ఈగ్రీన్‌ హౌస్‌ ఎఫెక్ట్‌కు మనుషులు చేసే పనులు మరింత వేడిని పెంచుతున్నాయి. ఆధునిక వ్యవసాయం, పురుగు మందుల వాడకం పెరగటం,కాలుష్యంవల్ల మరిన్ని ఉద్ఘారాలు విడు దలై వాతావరణంలో వేడిని మరింత ఎక్కువ చేస్తు న్నాయి. వాస్తవానికి వాతావరణంలో కార్బన్‌ డై యాక్సైడ్‌ సహజంగా ఉంటే ప్రకృతి సమతుల్యం అసలు చెడిపోదు.కానీ పెట్రోలు ఉత్పత్తుల వాడకం పెంచడంతోపాటు వాటి నుంచి వెలువడే కార్బన్డ యాక్సైడ్‌ ను గ్రహించే చెట్లను ఇష్టానుసారంగా కొట్టేస్తుండటంతో కర్బన సంబంధ,సల్ఫర్‌ సంబంధ ఉద్గరాలు పెరిగిపోతున్నాయి.పారిశ్రామిక అభివృద్ధి తర్వాత గాలిలో కార్బన్‌ డయాక్సైడ్‌ స్థాయిలు 30 శాతం,వాయువులు 140శాతంపెరిగాయని పర్యా వరణవేత్తలు చెబుతున్నారు. పైన మండే సూర్యుడు కింద చల్లని సముద్రాలు ఉండగా పర్యావరణానికి మనం కలిగించగల నష్టం ఏపాటిదిలే అనుకున్న మనిషిదాన్ని ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. గనుల్ని ఇష్టానుసారంగా తవ్వడం, పరిశ్రమలు ఏర్పాటు చేసి ఘన, ద్రవ, వాయు వ్యర్థాలను ఇష్టాను సారంగా గాలిలోకి, నీటిలోకి వదలడం వల్ల పర్యా వరణ చక్రం గతి తప్పుతోంది. విద్యుత్‌ అవసరా లకు బొగ్గును మండిచడం, వ్యవసాయ అవసరా లకు,గృహఅవసరాలకు అడవులను ఇష్టాను సారం గా కొట్టేయడం,సముద్రాలను డంపింగ్‌ యార్డ్‌ లుగా మార్చడంవల్ల జరగాల్సిన నష్టంజరిగి పోతోంది.
ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి
మనిషి శరీర ఉష్ణోగ్రత రెండు డిగ్రీలు పెరిగితేనే తట్టుకోలేడు. కొంతకాలంగా భూమి ఉష్ణోగ్రత పెరుగుతూ వస్తోంది. మనిషి చేస్తున్న విధ్వంస పనులే భూమి వేడిని అంతకంతకు పెంచు తున్నాయి. ఈ ఉష్ణోగ్రతల పెరగడం వల్ల ధ్రువ ప్రాంతాల్లో మంచు వేగంగా కరుగుతోంది. అక్కడ మంచు కరిగితే మనకొచ్చే ముప్పు చాలా తీవ్రంగా ఉంటుంది. అదే తీరిన కరుగుతూ ఉంటే ఈ శతాబ్దం అంతానికి సముద్ర నీటిమట్టం ఒక మీటర్‌ వరకు పెరుగొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తు న్నారు. అదే జరిగితే మాల్దీవులు,సీ షెల్స్‌ వంటి ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన దీవులన్నీ మునిగిపోతా యి. లండన్‌, వియత్నాం నెదర్లాండ్స్‌ బంగ్లాదేశ్‌ లాంటి దేశాల్లో చాలా భాగం ముంపునకు గురవు తుంది. అధికంగా సముద్రతీరం ఉన్న మనదేశం లోనూ నష్టం అపారంగా ఉంటుంది. కలకత్తా, చెన్నై,ముంబాయి, కేరళ వంటి వాటిపై ఆశలు వదులుకోవాల్సి ఉంటుంది.-జిఎన్‌వి సతీష్‌