రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎంపిక హర్షనీయం

భారతదేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము విజయం సాధించడం అభినందనీయం.జయాపజయాలు పక్కనపెట్టి ప్రజాస్వామ్య విలువలను,పౌర హక్కులను పరిరక్షించి సమాజ పురోభివృద్ధికి కృషి చేసేవారే సరైన పాలకులౌవుతారు.రాజ్యాంగ పరిరక్షణ బాధ్యతలు కలిగియున్న రాష్ట్రపతి పీఠానికి ప్రత్యేక విశిష్టతలూ,విశేషాధి కారాలూ ఉన్నాయి. స్వాతంత్య్రం అనంతరం జన్మించి రాష్ట్రపతి పీఠాన్ని అధిష్టించిన తొలివ్యక్తిగా,తొలి ఆదివాసీ మహిళగా నిలిచారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా..అణగారిన ఆదివాసీతెగల నుంచి అత్యున్నత రాష్ట్రపతి పీఠం అధిష్టించే స్థాయికి ఎదిగిన ముర్ముపై ఆయా తెగలు ప్రజలు, సామాన్యలు అనేక ఆశలు,ఆకాంక్షలు పెట్టుకున్నారు.ఇప్పటికైన తమకు రాజ్యాంగం కల్పించిన చట్టాలు,హక్కులు,వనరులకు రక్షణ ఉంటుందని ఆశిస్తున్నారు. ఆదివాసీగిరిజన జీవన విధానం ఇంతకు ముందు పూర్తి ప్రత్యేకతను సంతరించుకుంటే,ఈమధ్యన బయటి ప్రపంచంతో సంబంధాలు పెరిగిన తర్వాత మార్పులు వస్తున్నాయి. వాటిలో కొన్ని మంచిని కలిగించే మార్పులయితే,మరికొన్ని వారి ప్రాంతాలను,జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తున్నాయి. రాజ్యాంగపరంగా షెడ్యూల్డ్‌ తెగలకు కల్పించిన రక్షణలను పరిరక్షించుకోవడానికి నియమించబడిన భారత జాతీయ ఎస్టీ కమిషన్‌ పూర్తిస్థాయిలో నేటికీ భర్తీ కాలేదు.సగానికిపైగా ఖాళీలున్నాయి. ఆదివాసీ ప్రజ లను సమస్యల సుడిగుండంలోకి నెట్టేసి వారి గిరిజన ప్రజలసంపద, భూమి, అడవులు, సహజవనరులను కార్పొరేట్‌ కంపెనీలకు దోచి పెట్టే చర్యలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. ఆదివాసీలను బలిపీఠం ఎక్కించేలా కార్పొరేట్‌ అనుకూల సంస్కరణలతో అటవీ సంరక్షణ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు సర్కార్‌ కొన్ని కొత్త నిబంధ నలను తెరపైకి తెచ్చింది. దేశంలోని ఖనిజ తవ్వకాలు,పునరుత్పాదక విద్యుత్‌,పర్యాటకం,వన్యమృగాల పరిరక్షణ జోన్ల పేరుతో ఇప్పటికే అడవిబిడ్డలను అడవికి దూరం చేయడంతో వారంతా దోపిడికి గురవుతున్నారు.
రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత గిరిజన గ్రామాలను అయిదో షెడ్యూల్‌లో చేర్చారు.అదే సమయంలో కొన్ని గిరిజన గ్రామాలను వదిలేశారు. ఇలా ఐదో షెడ్యూల్‌లో చేరని గిరిజనులు నివాసముండే గ్రామాలను నాన్‌ షెడ్యూల్‌ ఏరియా గిరిజన ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 552 గ్రామాలు ఉన్నాయి.నాన్‌ షెడ్యూల్‌ ఏరియాను షెడ్యూల్‌ ప్రాంతంలో కలపాలనే ఈ సమస్యతో గతకొన్ని దశాబ్దాల నుంచి పోరాడుతున్నారు.భూరియా కమిటీ సిఫార్సుల అనంతరం షెడ్యూల్‌ ప్రాంతాలను స్థానిక పాలనా కోసం కేంద్రప్రభుత్వం పంచాయితీ విస్తరణ చట్టం (పెసా)`1996 చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ సిపార్సుల్లో మెసా (మున్సిపల్‌ ప్రాంతాలవిస్తీరణ చట్టం)చట్టం చేయలేదు. ప్రస్తుత ప్రభుత్వాలు మెసా చట్టం లేకుండానే కొన్ని గిరిజన ప్రాంతాలను మున్సిఫల్‌ పరిధిలోకి విలీనం చేయడానికి కుట్ర జరుగుతుంది. వాస్తవానికి గ్రామసభల ద్వారానే కొత్తవాటిని విలీనం చేసే అవకాశం ఉన్నప్పటికీ నిబంధనలను గాలికి వదిలేసి ప్రభుత్వాలు ఉదాసీనవైఖరి అవలంబిస్తున్నాయి. ఉదాహరణకు ఉమ్మడి విశాఖ జిల్లా సరుగుడు పంచాయితీలోని కొన్ని గ్రామాలను విశాఖమెట్రో పాలిటిన్‌ ప్రాంతీయ అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ)లో విలీనం చేస్తున్నారు.దీనవల్ల గిరిజనుల మనుగడ ప్రశాన్నర్ధంగామారే ప్రమాదంఉంది.వారిసంస్కృతి, సంప్రదాయాలకు విఘాతం కలిగే అవకాశాలు న్నాయి.ఈ విధంగా దేశంలోని పది రాష్ట్రాలలో ఈ సమస్య ఉంది.
ఈ నేపథ్యంలో ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలపట్ల కొత్త రాష్ట్రపతి ముర్ము ఎలాంటి విధానాన్ని అవలంబిస్తారనేదే ప్రస్తుతం కీలక ముఖ్యఅంశంగా మారింది. కార్పొరేట్‌ ప్రయోజనాల కోసం గిరిజనులను బలిపీఠమెక్కిస్తున్న కేంద్రప్రభుత్వం తమ విశేషాధి కారాలను వినియోగించుకొని అడవిబిడ్డలను,ప్రజాస్వామ్య విలువలను,రాజ్యాంగ పునాదులను పరిరక్షిస్తారని ఆదివాసీ సమాజం ఎదురు చూస్తోంది.ఎలాంటి పక్షపాతం లేకుండా రాజ్యాంగ సంరక్షకురాలిగా ముర్ము తన విధులు నిర్వహిస్తార’ని ఆశిద్దాం! – రెబ్బాప్రగడ రవి‍,ఎడిటర్