మ‌హిళా నీకో వంద‌నం..!

ఆమె..శక్తి స్వరూపిణి. సృష్టికి మూలం. ఆది అంతానికి సంధానకర్త. కుటుంబానికి సారథి. బాంధవ్యాలకు వారథి. రెప్పల మాటున కన్నీటి చుక్కలు దాచుకుని కుటుంబంపై పన్నీటిని చల్లేందుకు ప్రయత్నించే ప్రేమమయి. ఆమె త్యాగం అజరామరం. ఇంటా, బయట వివక్ష, వేధింపులే బహుమానంగా ఇస్తున్నా అంతులేని ఆత్మవిశ్వాసం ఆమె సొంతం. అదే ఆమె స్థైర్యానికి చిహ్నం. మహిళ జన్మనే కాదు.. జీవితాన్నిస్తుంది. అవసరమనుకుంటే జీవిత భారాన్ని మోస్తుంది. తాను పస్తులుండి బిడ్డల కడుపు నింపుతుంది. ఒక్కటేమిటి భారం మోసేది..బాధ్యతలు పంచుకునేది.. త్యాగానికి సిద్ధపడేది.. ఒక్క మహిళ మాత్రమే. అంతటి మాతృమూర్తిని చిన్నచూపు చూడటమా..? ఇది ఒకప్పటి మాట. ఆంక్షల చట్రాన్ని చీల్చుకుని అవకాశాల్లో క్షేత్రంలో విజయం కోసం పోరాడుతోంది నేటి మహిళ. ఆకాశంలో సగం.. అవకాశాల్లో సగం అని దూసుకు పోతున్న మహిళలు ఇప్పుడు యుద్ధక్షేత్రం లోనూ శత్రువుతో తలపడేందుకు సిద్ధమం టున్నారు. నింగి,నేల,నీరు..ఎక్కడైనా మేమున్నామని తమ శక్తియుక్తులు చాటు కుంటున్నారు. ఇలా అమ్మగా, అక్కగా, జీవన సహచరిగా బహుముఖ రూపంలో.. లాలనలోనూ, పాలనలోనూ, ఆటల్లోనూ, పాటల్లోనూ, శ్రమైక జీవన యానంలోనూ, అవనిలోనూ, అంతరిక్షంలోనూ ఆమె చెరగని సంతకం లిఖించుకుంటోంది. మార్చి 8 ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా అందిస్తున్న కథనం.
అన్నింటా ఆమె..
ఆకాశంలో సగం..అవకాశం సగం.. ఇది పాత నినాదం. అన్నింటా మేము.. కాదు కాదు అన్నిటా మేమే.. ఇదీ ఈనాటి మహిళల తాజా గళం. పట్టుదల,క్రమశిక్షణ పెట్టుబడిగా నేటి మహిళ ఓర్పు, నేర్పు, తెగువతో రాణిస్తోంది. ఇంటిని చక్కదిద్దే తత్వవేత్తగా,ఉద్యోగం చేసే మేటి వనితగా,చట్టసభల్లో సంస్కర్తగా పురుషులకు ధీటుగా ముందుకెళ్తోంది. ఒడిదుడుకుల్లో వెనుకంజ వేయకుండా అద్వితీయంగా అడుగులేస్తోంది. జిల్లాలోని పలువురు మహిళలు పేదరికాన్ని పట్టుదలగా తీసుకొని ఆత్మవిశ్వాసంతో ఎదురొడ్డి విజయం సాధిస్తున్నారు. కన్నీటి కష్టంలోనూ,కడుపు తరుక్కుపోయే విషాదంలోనూ ధీర వనితగా ప్రశంసలు అందుకుంటున్నారు. మరికొందరు పేద కుటుంబంలో పుట్టి ఉన్నత శిఖరాలను అధిరోహించారు. ఉద్యోగ బాధ్యతలు చూస్తూనే కుటుంబాన్ని అద్వితీయంగా సాకుతున్నారు. ఇంకొందరు వ్యాపార రంగంలోనూ శభాష్‌ అనిపించుకుంటున్నారు. ఈ క్రమంలో నేటి మహిళలు అడుగు పెట్టని చోటులేదు. సాధించని విజయం లేదు.ఒకప్పుడు మహిళలంటే వంటిల్లు..సంప్రదాయాలు, కట్టుబాట్లకు మధ్య గడిపే జీవితమే జీవితం. ఇవాళ దాని అర్థమే మారిపోయింది. తమకున్న ఓర్పుని,సహనాన్ని పెట్టుబడిగా పెట్టి మరీ సాధించుకున్న విజయాలకు ప్రతినిధిగా నేటి మహిళ నిలుస్తోంది.
గృహిణి నుంచి పాలకురాలిగా..
సూర్యోదయానికి ముందే స్త్రి విధి నిర్వహణ ఆరంభమవుతుంది.ఆమెకు అతిపెద్ద బాధ్యత పిల్లల పెంపకం.పిల్లలను బడికి పంపడం తొలి విధి. ఐదు నిమిషాలు ఆలస్యమైనా క్యారేజీ ఉండదనో,స్కూలు బస్సు పోతుందనో భయం. పిల్లల ఆలనాపాలనా చూసుకుంటూనే మిగిలిన పనులు చక్కబెట్టాలి. అందుకే సైకాలజిస్టులు గృహిణి పాత్రకంటే ఉద్యోగ జీవితం మేలు అంటారు. సాధారణ గృహిణి నుంచి ప్రభు త్వాలను నడిపించగల సామర్థ్యం ఉన్న శక్తిగా మహిళ ఎదిగింది. రాజకీయాలు,క్రీడలు, పాలనా..ఇలా ముఖ్యమైన అన్ని రంగాల్లో రాణిస్తూ పురుషులకు ఏ మాత్రం తీసుపోని నైపుణ్యాన్ని ప్రదర్శిస్తోంది. ఇది నాణానికి ఒకైపు. మరోవైపు వివక్ష, అడుగడుగునా ఇబ్బందులు ఉన్నాయి. స్త్రి విలాస వస్తువు కొందరికి,ఇంటి యంత్రం మరికొందరికి. ఆమె అభిప్రాయానికి విలువ లేదు. ఆమె సూచన పట్టించుకునే వారు లేరు. ఆమె ఇష్టాఇష్టాలకు గౌరవం దక్కదు. అయినా వెరవని ధైర్యంతో ముందుకు సాగుతోంది మహిళ. బయట మాట పక్కన పెడితే ఇంట్లో కూడా గౌరవాన్ని ఆశించే చాలామంది మహిళలకు నిరాశే మిగులుతోంది. బాల్యం నుంచే స్త్రి ఇబ్బందులు ఎదుర్కొంటూ ముందుకు సాగుతోంది. చిన్నప్పుడు ఆడపిల్ల ఆనే వివక్ష, యవ్వనంలో ఆకతాయిలు, పోకిరీల సమస్య, ఉద్యోగ జీవితంలో లైంగిక వేధింపులు, పెళ్లాయాక్కైనా ఆమె జీవితానికి ఆసరా లభిస్తుం దనుకుంటే అక్కడా ఇబ్బందులు పడేవారే అధికం.అత్తింటి ఆరళ్లు, భర్త వరకట్న వేధిం పులు.. ఇలా ఎన్నో సమస్యలు వెన్నంటే నడుస్తుంటాయి. ఇంటిల్లిపాదికి బండెడు చాకిరీ చేసినా సమయానికి అల్పాహారం తీసుకునే పరిస్థితి కూడా చాలామందికి ఉండదు. దీంతో అనారోగ్య సమస్యలు వెన్నంటే ఉంటాయి. కనీసం మధ్యాహ్నమైనా సమయానికి తింటుందా అంటే ఆ అవకాశం కూడా ఉండటం లేదు. ఇంటిపని, ఆఫీస్‌ పని చేసుకునే మహిళలు తమకు తెలియకుండానే ఓ రకమైన ఒత్తిడికి గురవుతున్నారు. దాదాపు 80శాతం మంది మహిళలది ఇదే పరిస్థితి అన్నది నిపుణుల మాట. ఈ మహిళల హక్కుల కోసం వందేళ్ల క్రితం జరిపిన పోరాటం సాక్షిగా మహిళా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా మార్చి 8న మొదలైంది.1911లో మహిళలు రగిల్చిన స్ఫూర్తి ఎందరో మహిళల్లో ధైర్యాన్ని నింపింది. నేటి స్త్రీ చదువుల్లో,ఉద్యోగాల్లో ముందుండి. ఏ రంగంలోనైనా నేను సైతం అంటున్న స్త్రీని సమాజం ఇప్పటికీ ఆమె వ్యక్తిత్వాన్ని, ఇష్టా ఇష్టాలను అభిప్రాయాలను గుర్తించడం లేదు.అనంతర పరిణామాల్లో భాగంగా 1975లో యుఎన్‌ఒ స్త్రీల సమస్యలను చర్చించడానికి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఏదేశానికీ, ఏ జాతికి చెందిన స్త్రీ అయినా సమానంగానే అణిచివేతకు గురవుతున్న స్త్రీల సమస్యలపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరగాలని ఆ సమావేశం పేర్కొంది. అప్పటి నుంచి 1975లోనే మార్చి 8వ తేదీని అంతర్జా తీయ మహిళా దినోత్సవంగా ప్రకటించింది.
ఆరోగ్యమూ అంతంత మాత్రమే..
పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే దాకా ఎన్నో పనులు, మరెన్నో బాధ్యతలు..! క్షణం తీరికలేని ఈ నిత్య సమరం ముందు ఆమె తన ఆరోగ్యాన్ని పణంగా పెడుతోంది. మహిళలు పనుల్లో పడిపోతున్నారని,ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని అనేక సర్వేల్లో తేలింది. అనారో గ్యానికి గురైనప్పుడే మాత్రమే రెగ్యులర్‌ చెకప ్‌లకు వెళుతున్నట్టు 63శాతం మంది మహిళలు అంటున్నారు.16మంది మాత్రమే రెగ్యులర్‌ చెకప్‌లకు వెళ్తున్నట్లు తెలిసింది.71 శాతం మహిళలు ఏడాదిలో ఒకటిరెండుసార్లు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. ఇన్ని సమస్యలు చుట్టుముడుతున్నా కేవలం 39శాతం మంది మహిళలకు మాత్రమే హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఉంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడంలో మగవారితో పోల్చుకుంటే కీళ్ల నొప్పులు,రక్తహీనత,హార్మోన్ల అసమతుల్యత క్యాన్సర్ల బారిన పడే అవకాశాలు మహిళల్లో ఎక్కువని ఆరోగ్య నిపుణులు చెబుతు న్నారని ఒక నివేదిక తేల్చి చెప్పింది.
మహిళల స్థితిగతులు ఇలా
వ్యవసాయేతర ఉపాధిలో మహిళలు 20 శాతమే.పట్టణ శ్రామిక శక్తిలో మహిళలు 33.9 శాతం,గ్రామాల్లో 49.9శాతం ఉన్నారు.
ఆడపిల్లను భారంగానే చూస్తున్నారు
ఆడపిల్ల పుడితే గుండెల మీద భారంగానే నేటికీ భావిస్తున్నారు. ఈ వివక్షే ఆడపిల్లకు కొనిచ్చే బొమ్మల దగ్గర నుంచి చదివించి పెళ్లిళ్లు చేసే వరకు కొనసాగుతోంది. ఆడపిల్ల ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలంటే చిన్నవాడైన తమ్ముడిని తోడు తీసుకుని వెళ్లమంటారు. అప్పటి నుంచే నువ్వు బయటకి వెళితే భద్రత ఉండదని నేర్పిస్తారు. అలా ఒక ముందడుగు వేస్తే… రెండు అడుగులు వెనక్కి లాగుతారు తల్లిదండ్రులు. ఇంటి పనుల్లో సాయం చేయ మని కూతురిని అడుగుతారు. కానీ కొడుకును అడుగరు. ఇలాంటి ఎన్నో వివక్ష మూలాలు ప్రతి ఇంట్లో..ప్రతి బిడ్డా పురిటికందుగా ఉన్నప్పటి నుంచే మొదలవుతాయి. ఇక మంచి చెడులను విడమర్చి అర్థం చేసుకునే అవకాశం కూడ లేకుండా పోయింది దీంతో. తల్లి దండ్రు లు ఆడపిల్లలను ఒకే చట్రంలో బంధిస్తున్నారు.
భయపెడుతున్న గణాంకాలు
సాంకేతికంగా ఎంత అభివద్ధి చెందినప్పటికీ బాలికల, మహిళలు పట్ల వివక్ష పెరుగుతూనే ఉందని పలు సంస్థలు చేసిన సర్వేలు చెబుతు న్నాయి. 2011జనాభా లెక్కల ప్రకారం. ఆరేళ్ల లోపు చిన్నారుల్లో ప్రతి వెయ్యిమంది మగ పిల్ల లకు కేవలం 914మందే ఆడపిల్లలు ఉన్నారు. 2001లో ఆరేళ్లలోపు మగ,ఆడపిల్లల నిష్పత్తి 1000:943 ఉండగా,పదేళ్ల అనంతరం ఆడ పిల్లల సంఖ్య మరింతగా దిగజారడం ఆందోళ నకర పరిణామం.2015 సెప్టెంబరు నాటికీ వెయ్యి మంది పురుషులకు 943 మంది ఆడపిల్లలున్నారు. అంతే కాదు, మహిళలపై జరుగుతున్న హింస కూడా పెరిగింది. ప్రత్యక్షం గా మహిళలు అన్ని రంగాల్లో ముందు న్నా సమానత్వం మాత్రం పూర్తిగా లభించలేదని చెప్పవచ్చు. ముఖ్యంగా మహిళలకు భద్రత కరువయ్యింది. అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు చట్టసభల్లో సమానత్వం ఉందని చెబుతున్నా ‘పేరుకే పెత్తనం’ అనే చందంగా వ్యవస్థ సాగుతోంది.
రాజకీయంగా రాణింపు
మహిళలు రాజకీయంగా సమాన అవకాశాలను పొందుతున్నారు. ప్రస్తుతం ఉత్తరాంధ్ర జిల్లా ల నుంచి శాసనసభ, పార్లమెంటుకు నలుగురు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటీవల జరిగిన జెడ్పీటీసీ/మండల/గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జిల్లాలో 564 మహిళా సర్పంచ్‌లు, 6117 మహిళా వార్డు మెంబర్లుగా గెలిచి గ్రామీణా భివృద్దిలో కీలకపాత్ర పోషిస్తున్నారు. రాజకీయ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి విద్యావంతులైన యువతలు చొరవ చూపి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచారు.
ఆర్థిక సాధికారత.. మహిళకు భద్రత
మన దేశంలో మహిళలు ఆర్థిక సాధికారత విషయంలో ఇంకా వెనుకబడి ఉన్నారు. విభిన్న రంగాల్లో మహిళలు ఎంతగానో పురోగమిం చినా ఆర్థిక సాధికారతలో మాత్రం వెనుక బడిపోవడానికి కుటుంబ కట్టుబాట్లు, తల్లిదం డ్రుల ఆలోచనా ధోరణులు,మహిళలు స్వయం గా విధించుకునే పరిమితులు కారణమని చెప్పవచ్చు. పని ప్రదేశాల్లో మహిళలకు పురుషులతో పోల్చితే తక్కువ వేతనాలు అందు తున్నాయి. ఆర్థికపరమైన అంశాలపై అవగా హన లేకపోవడం, కుటుంబ బాధ్యతలు, వివాహపరమైన అవరోధాలు మహిళలు ఆర్థికంగా పురోగమించకుండా అడ్డు తగులు తున్నాయి. చట్టాల్లో కూడా వారి పట్ల వివక్ష అధికంగా ఉంది. ఈ అవరోధాలన్నీ దాటు కుంటూ వారు ఆర్థిక సాధికారత సాధించడం ఎలాగంటే.. ఆర్థిక అక్షరాస్యతకు ప్రాధాన్యం భారత మహిళలు ఆర్థిక బాధ్యతలు చేపట్టేం దుకు విముఖంగా ఉంటారు. దీనివల్ల వారి వ్యక్తిగత ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో కూడా పురుషులదే పైచేయిగా మారుతుంది. ఉద్యోగా లు చేస్తున్న మహిళలు కూడా తమ ఆర్థిక వ్యవహారాల నిర్వహణను భర్తకు అప్పగిస్తుం టారు. దీంతో ఆర్థికపరమైన అంశాలపై అవగాహన తక్కువగా ఉండటానికి అవకాశం ఏర్పడుతుంది. పురుషులతో పోల్చితే మహిళల సగటు జీవిత కాలం అధికంగా ఉంటుంది. ఒక అధ్యయనం ప్రకారం 60 ఏళ్లు నిండే సమ యానికి పురుషుల సగటు జీవిత కాలం 77.2 సంవత్సరాలుంటే మహిళలకు 78.6 సంవత్స రాలుంది. అంటే పురుషులతో పోల్చితే మహిళలే సగటున ఎక్కువ కాలం జీవిస్తు న్నారన్న మాట. 2011 జనాభా లెక్కల ప్రకారం అవివాహితలు,విడాకులు తీసుకు న్నవారు, భర్త లేని వారు, ఒంటరి మహిళల సంఖ్య 7.4 కోట్లుంది.ఇలాంటి వారు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండాలంటే ఆర్థిక అక్షరాస్యత ఎంతైనా అవసరం. పొదుపు పెరగాలిపురుషులతో పోల్చితే మహిళలు అందుకునే వేతనాలు తక్కువగా ఉండడం పరిపాటి. సమాన హోదాలో పనిచేస్తున్నప్పటికీ వారు తక్కువ వేతనాలు పొందుతున్నారు. దీనికి తోడు మహిళలు ఆర్థిక వ్యవహారాలు సమర్థవం తంగా నిర్వహించలేరనే అపోహ కూడా సమాజంలో ఉంది. మహిళల సగటు జీవిత కాలం అధికంగా ఉంటున్న తరుణంలో సొంతంగానే ఆర్థిక వ్యవహారాలు చక్కబెట్టు కోగల నైపుణ్యాలు సాధించడం,దీర్ఘకాలిక పొదుపుపై దృష్టి పెట్టడం అవశ్యం. వేతనాలు తక్కువ ఉన్నందు వల్ల పురుషుల కన్నా అధికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది. మహిళలు ఉద్యోగం చేసే కాలపరిమితి పురుషులతో పోల్చితే తక్కువ. మాతృత్వపు సెలవులతోపాటు కుటుంబ సభ్యులు తీవ్ర అనారోగ్యం పాలైతే వారి సంరక్షణ బాధ్యతలు నిర్వర్తించేందుకు దీర్ఘకాలిక సెలవులు తీసుకోవడం వంటివి తప్పనిసరి.
భద్రత ప్రధానంకుటుంబ సంక్షేమంతో పాటు తమ సొంత భద్రతకు మహిళలు ప్రాధాన్యం ఇవ్వాలి. తమ పిల్లల భవిష్యత్‌ కోసం పొదుపు చేయడంతో పాటు తమ రిటైర్మెంట్‌ కోసం పొదుపు చేయడంపై దృష్టి పెట్టాలి. ఇందుకు విభిన్న పొదుపు సాధనాలను ఎంచుకోవడంతో పాటు వయసుల వారీగా కేటాయింపులు చేసుకోవాలి. ఉదాహరణకు 30 ఏళ్ల వయసున్న మహిళలు తమ కోసం పొదుపు చేసుకునే మొత్తంలో 70 శాతం ఈక్విటీకి, 30 శాతం డెట్‌కు కేటాయించుకోవచ్చు. వీటిలో ఈక్విటీ ఫండ్లతో పాటు ఈపీఎఫ్‌, వీపీఎఫ్‌, పీపీఎఫ్‌, ఎన్‌పీఎస్‌ వంటి రక్షిత సాధనాలపైనా దృష్టి పెట్టాలి. పొదుపు ఒక్కటే కాదు.. ఏదైనా ఆర్థిక సంక్షోభం తలెత్తితే ఆదుకునేందుకు కనీసం నాలుగు నుంచి ఆరు నెలల పాటు కుటుంబ ఖర్చులను తట్టుకోగల అత్యవసర నిధి సమకూర్చుకోవాలి. అంతేకాకుండా వార్షిక వేతనానికి 7 నుంచి 10 రెట్లు అధికంగా బీమా రక్షణ పొందాలి. జీవిత బీమాతోపాటు ఆరోగ్య రక్షణ ప్లాన్లు, క్రిటికల్‌ ఇల్‌నెస్‌ ప్లాన్లపై దృష్టి పెట్టాలి. ఒకేసారి ఇంత భారీ మొత్తం ఇన్వెస్ట్‌ చేయడానికి తటపటాయించే ఆస్కారం ఉంది.
అత్తమామల కోసం పెట్టే పెట్టుబడిలో కొంత మొత్తాన్ని ఆరోగ్య బీమాకు కేటాయించాలి. వయసు పెరిగే కొద్ది అనారోగ్యాల రిస్క్‌ అధికంగా ఉంటుంది. ఆ రిస్క్‌ను తట్టు కోవాలంటే అత్తమామలకు బీమా ఉండి తీరాలి. అలాగే పిల్లల కోసం పెట్టుబడి పెట్టే తరుణంలో 18 ఏళ్లు నిండే సమయానికి వారి ఆర్థిక అవసరాలకు అనుగుణంగా స్వల్పకాలిక, దీర్ఘకాలిక సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. పిల్లలకు 18 ఏళ్లు నిండే నాటికి ఉన్నత విద్యాభ్యాసం, వివాహం కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం దీర్ఘకాలిక క్రమానుగత పెట్టుబడి ప్రణాళిక (సిప్‌)ను అనుసరించాలి.
నేరాలు…చట్టాలు…శిక్షలు…
ా సెక్షన్‌ 228-ఎ – లైంగిక దాడికి గురైన మహిళ అనుమతి లేకుండా మీడియాలో ఆమె పేరు,ఫొటో,వివరాలు ప్రచురించ కూడదు.
ా సెక్షన్‌ 354 – మహిళ శరీరాన్ని లైంగిక ఉద్దేశంతో చూసినా, తాకినా, కనుసైగ చేసినా నేరమే.
ా సెక్షన్‌ 376 – వైద్యం కోసం వచ్చిన మహిళను లైంగికంగా వేధిస్తే ఈ సెక్షన్‌ కింద కేసు నమోదు అవుతుంది.
ా సెక్షన్‌ 509 – మహిళలతో అవమానకరంగా మాట్లాడినా, సైగలు చేసినా, అసభ్యకరమైన వస్తువులను ప్రదర్శించినా శిక్షకు అర్హులు.
ా సెక్షన్‌ 294 – మహిళలు రోడ్డుపైన నడుస్తున్నా, బస్టాపుల్లో వేచిఉన్నా, అసభ్యకరమైన పాటలు పాడుతూ, శబ్దాలు చేసి ఇబ్బంది పెడితే ఈ సెక్షన్‌ ప్రకారం 3 నెలలు శిక్ష పడుతుంది.
18 ఏళ్లలోపు బాలికను వ్యభిచార వృత్తిలోకి దించితే సెక్షన్‌ 373 ప్రకారం పదేళ్లు జైలు శిక్ష పడుతుంది. ఒకరికన్నా ఎక్కువ మంది ఉన్న బృందంలో ఒంటరిగా ఉన్న మహిళపై లైంగిక దాడి జరిగితే ఆ బృందంలోని ప్రతి వ్యక్తీ నేరస్తుడే. సెక్షన్‌ 376-బి కింద అందరికీ శిక్ష పడుతుంది. అత్యాచారం..ఐపీసీ 375 ప్రకారం ఏడేళ్లు జైలు శిక్ష నుంచి జీవిత ఖైదు. అవమానపరిచి దాడి చేస్తే ఐపీసీ 354 ప్రకారం 5నుంచి 7వరకు జైలు శిక్ష పడు తుంది. పెళ్లయినా కానట్లు మోసగించిన పురుషులకు ఐపీసీ 496 ప్రకారం 7ఏళ్లు జైలు,జరిమానా తప్పదు. ఇలాంటి ఎన్నో కఠినమైన చట్టాలు,శిక్షణలు ఉన్నా మహిళలపై జరుగుతున్న లైంగికదాడులు,వేధింపులు ఆగకపోవడం శోచనీయం. – సైమన్‌ గునపర్తి