నెరవేరని జాతీయ కనీస వేతన వ్యధ…!

పార్లమెంట్‌లో పాస్‌ అయిన వేతనాల కోడ్‌ ప్రకారం కనీస వేతన నిర్ణయం కోసం కనీస వేతనాల సలహా బోర్డుల సలహాలు తీసుకోవాలి. అంతిమంగా సదరు ప్రభుత్వాలు కనీస వేతనాన్ని ఖరారు చేయడానికి… కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వేతనాల కోడ్‌ నిబంధనల ప్రకారం… 15వ భారత కార్మిక మహాసభ సిఫార్సులను, సుప్రీంకోర్టు తీర్పులను ప్రాతిపదికగా తీసుకోవాలి. కాని తాను పాస్‌ చేసిన ఈ చట్టానికి వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది.
జాతీయ కనీస వేతనం తిరిగి చర్చనీయాం శమైంది. మోడీ ప్రభుత్వం 2017లో పార్లమెంట్‌ లో వేతనాల కోడ్‌ బిల్లు ప్రవేశపెట్టిన తరువాత జాతీయ కనీస వేతన సిఫార్సు కోసం ‘వి.వి.గిరి జాతీయ కార్మిక సంస్థ’కు చెందిన డాక్టర్‌ సత్పతి అధ్యక్షతన ఒక కమిటీ వేసింది. అనేక పరిమితులతో ఆ కమిటి చేసిన కొద్దిపాటి సిఫార్సులను కూడా ఆమోదించకుండా ఏకపక్షంగా జాతీయ కనీస వేత నాన్ని రోజుకు రూ.176గా నిర్ణయించింది. దేశ మంతా ఈ నిర్ణయంపై గగ్గోలు పెట్టిన తరువాత దాన్ని రూ.2 పెంచి రూ.178 చేసింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం వేతనాల కోడ్‌ నిబంధనలను ప్రతిపాదించిన తదుపరి ఇప్పుడు కొత్తగా జాతీయ కనీస వేతనంపైనే కాకుండా కేంద్ర మరియు రాష్ట్రాల లేబర్‌ కమిషనర్లు నిర్ణయించే కనీస వేతనంపై కూడా సిఫార్సులు చెయ్యమని గణాంక శాస్త్రజ్ఞుడు ఎస్‌.పిముఖర్జీ అధ్యక్షతన కమిటీ వేసింది.దాంతో జాతీయ కనీస వేతనం మరోసారి చర్చకు వచ్చింది.
ఈ ఏడాది మార్చి 28,29 తేదీల్లో కార్మిక సంఘాలు మరియు స్వతంత్ర ఉద్యోగ సంఘాల ఫెడరేషన్లు చేయబోయే రెండు రోజుల అఖిల భారత సమ్మె కోర్కెలలో నెలకు కనీస వేతనం రూ. 26,000 ఇవ్వాలనేది ప్రధానమైనది. జాతీయ కనీస వేతనం అయినా,కనీస వేతనం అయినా ఒకటిగానే ఉండాలి. వాటి నిర్ణయానికి ప్రామాణి కాలు ఒకటిగానే ఉండాలి. కాని మోడీ ప్రభుత్వం వేతనాల కోడ్‌ ప్రతిపాదిత నిబంధనలలో కనీస వేతన నిర్ణయానికి 1957లో జరిగిన 15వ భారత కార్మిక మహాసభ సిఫార్సులను, 1992 సుప్రీంకోర్టు తీర్పులను ప్రామాణికాలుగా తీసుకోవాలని చేర్చింది. జాతీయ కనీస వేతనానికి మాత్రం ఈ ప్రామాణికాలు పెట్టలేదు. వేతనాల కోడ్‌ లోనూ, దాని నిబంధనలలోనూ కొత్తగా జాతీయ కనీస వేతనాన్ని చేర్చింది. ఇంతకు ముందటి కనీస వేతన చట్టంలో ఇది భాగంగా లేదు. ఇప్పుడు మోడీ ప్రభుత్వం దానికి చట్టబద్ధత తెచ్చింది.పైగా జాతీ య కనీస వేతనానికి తక్కువగా కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు మరియు ప్రైవేటు యాజమాన్యాలు కనీస వేతనాన్ని నిర్ణయించగూడదని చేర్చింది (జాతీయ కనీస వేతనం రూ.178 గానే వుంది).
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 7వ పే కమిషన్‌ భారత కార్మిక మహాసభ సిఫార్సులు మరియు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నెలకు రూ.18 వేలను కనీస వేతనంగా సిఫార్సు చేస్తే కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆమోదించింది. చదువులు, ఆరోగ్య అవసరాలు, వినోదం, పండగలు పబ్బాలు, భవి ష్యత్‌ అవసరాల కోసం కనీస వేతనంలో 25 శాతం ఉండాలన్న సుప్రీంకోర్టు తీర్పును 15 శాతా నికి తగ్గించింది. 15వ భారత కార్మిక మహాసభ సిఫార్సులలోని అద్దెకోసం సంబంధించిన ప్రామాణి కాన్ని కూడా తీసుకోకుండా, దాన్ని నెలకు 18 వేలుగా చేసింది. ఈ సిఫార్సును కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తిరస్కరించి తమకు 2015 ధరలలో నెలకు రూ.26 వేలు కనీస వేతనంగా ఇవ్వాలని కొంత కాలంపాటు ఆందోళన చేసినా మోడీ ప్రభు త్వం రూ.18 వేలనే ఖరారు చేసింది. ఆ ప్రకారం చూసినా ఇప్పటి ధరల్లో కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.
2017లో మోడీ ప్రభుత్వం జాతీయ కనీస వేతనంపై వేసిన కమిటీ 2011-2012 జాతీయ శాంపిల్‌ సర్వే (ఎన్‌ఎస్‌ఎస్‌) తాలుకా వినిమయ ఖర్చులను,ప్లానింగ్‌ కమిషన్‌ పేదరిక రేఖను నిర్ణయించటానికి తీసుకున్న ఆహార కేలరీల లెక్కను పరిగణనలోకి తీసుకొని జాతీయ స్థాయిలో కనీస వేతనాన్ని రోజుకు రూ.375, నెలకు రూ.9750 గా సిఫార్సు చేసింది. భారత కార్మిక మహాసభ సిఫార్సు చేసిన 2700 కేలరీల ఆహారాన్ని 2400కు తగ్గించింది. దీనికి నేషనల్‌ శాంపిల్‌ సర్వేను ప్రాతి పదికగా తీసుకుంది. పేదరిక రేఖ మాత్రమే ఈ కమిటీకి ప్రాతిపదిక అయ్యింది. ఆర్థిక వెనుకబాటు తనం వల్ల వినిమయాన్ని తగ్గించుకుంటే దాన్ని కూడా లెక్కలోకి తీసుకుంది. అదనంగా పట్ట ణాలలో ఇంటి అద్దెకు రూ.1430 ఇవ్వాలన్నది. పల్లెటూళ్లల్లో అత్యధిక మంది సొంత ఇళ్లల్లో ఉంటారని సర్వేలో తేలినందున వారికి ఇంటి అద్దెను సిఫార్సు చెయ్యలేదు. ప్రత్యామ్నాయంగా దేశంలో ఉన్న రాష్ట్రాలను 5 జోన్లుగా విభజించి 5 రకాల వేతనాలను తక్కువ స్థాయిలో రోజుకు రూ.341, నెలకు రూ.8878 గా,అధిక స్థాయిలో రోజుకు రూ.446,నెలకు రూ.11610లను సిఫార్సు చేసిం ది. కార్మికులు, వారి కుటుంబాల కనీస అవస రాల కోసం ఈ వేతనాలు సరిపోతాయని వాటిని చట్టబద్దం చెయ్యవచ్చని చెప్పింది. మోడీ ప్రభుత్వం అతి తక్కువగా ఉన్న ఈవేతనాలను కూడా ఆమోదించకుండా జాతీయ కనీస వేతనాన్ని రోజుకి రూ.178,నెలకు రూ.4628గా నిర్ణయించి ప్రకటించింది. ఈ జాతీయ కనీస వేతనం ఎలా వచ్చింది, ఎక్కడ ప్రారంభమయ్యింది, ఇప్పటికీ రూ.178గానే ఎందుకు వుందనేది తెలుసుకుంటే దేశంలోని పెట్టుబడిదారీ దోపిడీ వ్యవస్థ అసలు రూపం బయటపడుతుంది.1991లో కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ మరియు గ్రామీణ కార్మికుల వేతనంపై వేసిన కమిటీ చేసిన సిఫార్సులు అత్యంత కార్మిక వ్యతిరేకమైనవిగా ఉన్నాయి. 1979-80 ధరల్లో నేషనల్‌ శాంపిల్‌ సర్వే నివేదిక ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో 2400 కేలరీల ఆహారానికి (పేదరిక స్థాయి) గాను ఒక్కో వ్యక్తి వినిమయ ఖర్చు సరాసరిన నెలకు రూ.76. ఆ సమయంలో వ్యవసాయ కార్మికుల వినిమయ సూచి పాయింట్లు 360 ఉన్నాయి.దీనిని 1990 అక్టోబర్‌లో తాజా పరిచి అప్పటి వినిమయ సూచి 804 పాయింట్ల దగ్గర నెలకు రూ. 170గా కమిటీ తేల్చింది (360 నుండి 804పాయింట్లు 223.33 శాతానికి పెరిగాయి కాబట్టి రూ. 76 లను కూడా 223.33 శాతానికి పెంచి రూ.170 చేసింది.ఒక్కో పాయిం ట్‌ ప్రాతినిధ్యం వహించే రూపాయలలో ఉండే ధరల పెరుగుదలను లెక్కలోకి తీసుకోలేదు. ఇప్పటికీ ఇదే పద్ధతి కొనసాగుతోంది).కుటుంబానికి ముగ్గురు గా లెక్కించి కుటుంబం మొత్తానికి నెలకు రూ.510, సంవత్సరానికి రూ.6120గా లెక్కేసింది. సర్వే ప్రకారం కుటుంబంలో 1.89 మంది పనిలో ఉన్నారని చెప్పి రూ.6120లను1.89 మందికి పంచి రూ.3238.09గా చేసింది. కాని సంవత్స రంలో 159 రోజులే పనులు దొరుకుతున్నందున ఆ వచ్చిన మొత్తాన్ని 159తో భాగించి రోజుకు రూ.20.37 లుగా తేల్చింది. దీన్ని రౌండ్‌ ఫిగర్‌గా మార్చిన తరువాత వచ్చిన రూ.20లను, 1996లో అప్పటి వినిమయ సూచి ప్రకారం రూ.35 చేశారు. ప్రతి రెండు సంవత్సరాలకీ దీన్ని మార్చుతూ 2017లో రోజుకు రూ.176గాప్రకటించారు. 2017లో ఇదే సమయంలో వ్యవసాయ కార్మికుల (క్యాజువల్‌ లేబర్‌) కనీస వేతనం లేబర్‌ కమిషనర్‌ నిర్ణయం ప్రకారం రూ.244.25 పైసలు ఉంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర లేబర్‌ కమిషనర్‌ జారీ చేసే జీవో లలో వ్యవసాయేతర పనులకు ఇండెక్స్‌లో ప్రతి పాయింట్‌కు ఎక్కువ ఎంప్లారుమెంట్లలో రూ.6.55 పైసలు విడిఎ వస్తోంది. కాని గ్రామీణ కార్మికుల వేతనాల కోసం నియమించిన కమిటీ పెరిగిన పాయింట్లను మాత్రమే పరిగణన లోకి తీసుకొని పాయింట్లలో పెరిగిన శాతాన్ని బట్టి మాత్రమే రోజు వేతనాన్ని పెంచటాన్ని సిఫార్సు చేసింది. దీని వలన జాతీయ కనీస వేతనంలో ఎటువంటి ఎదుగుదల లేకుండా గొర్రె తోక లాగ ఉండిపోయింది. ఈవేతనం ఇప్పుడు మోడీ ప్రభుత్వానికి ఆచరణయోగ్యంగా కనపడిరది. 2017లో జాతీయ కనీస వేతనంపై వేసిన కమిటీ చేసిన సిఫార్సు రోజుకు రూ.375లను కూడా కాదనిరూ.176 లనే ఖరారు చేసింది. పైగా దీనికి ఇప్పుడు చట్టబద్దత తెచ్చింది.
తాజాగా కార్మిక సంఘాలు నెలకు రూ.26, 000 కనీస వేతనాన్ని డిమాండ్‌ చేస్తున్న పరిస్థి తులలో…మోడీ ప్రభుత్వం మోసపూరితంగా… జాతీయ కనీస వేతనం మరియు లేబర్‌ కమిషనర్లు నిర్ణయించే కనీస వేతనం పైన కూడా సిఫార్సు చెయ్యమని ఎస్‌.పిముఖర్జీ అధ్యక్షతన కమిటీ వేసింది. పార్లమెంట్‌లో పాస్‌ అయిన వేతనాల కోడ్‌ ప్రకారం కనీస వేతన నిర్ణయం కోసం కనీస వేతనాల సలహా బోర్డుల సలహాలు తీసుకోవాలి. అంతిమంగా సదరు ప్రభుత్వాలు కనీస వేతనాన్ని ఖరారు చేయడానికి… కేంద్ర ప్రభుత్వం ప్రతి పాదించిన వేతనాల కోడ్‌ నిబంధనల ప్రకారం… 15వ భారత కార్మిక మహాసభ సిఫార్సులను, సుప్రీంకోర్టు తీర్పులను ప్రాతిపదికగా తీసుకోవాలి. కాని తాను పాస్‌ చేసిన ఈ చట్టానికి వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. కార్మిక వ్యతిరేక మోడీ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కార్మిక సంఘాలు, కార్మికులు పోరాడి నెలకు రూ.26,000 కనీస వేతనంగా సాధించుకోవాలి. పేదరికంలో ఉన్న కార్మికులను పేదరికంలోనే ఉంచేలా రోజు వేతనాన్నిరూ.176గానిర్ణయించటాన్ని తిప్పికొట్టాలి.
వ్యాసకర్త : సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు- (పి.అజయ కుమార్‌)