తెలంగాణ గట్టుమీద పోలవరం

ప్రముఖ పరిశోధక రచయిత, విశ్లేషకులు, డాక్టర్‌ అమ్మిన శ్రీనివాసరాజు థింసా పత్రిక కోసం ప్రత్యేకంగా రాస్తున్న ‘గిరిజన కథావిశ్లేషణ’ ధారావాహికంగా అందిస్తున్న ఈ నెల సంచికలో కథా విశ్లేషణ తెలుగు సాహితీలోకానికి సుపరిచితులైన ‘కోమాకుల సీతారాములు’’ కథా రచన ‘ తెలంగాణ గట్టు మీద పోలవరం ’ కథా చదవండి..! – సంపాదకులు
సీతారాములు కథల్లో పోరాట చైతన్యం కనిపిస్తుంది… బహుముఖీనమైన కళాసేవతో సీతారాములు రాసిన అనేక కథల్లో ఇది ఒకటి.‘‘బహుళార్థక పోలవరం ప్రాజెక్టు’’ నిర్మాణంలో మార్పులు తేవాలనే లక్ష్యంతో ‘‘ముంపు మండ లాలపోరాటం’’ మొదలైన తరుణంలో సామాజిక స్పృహ నిలువెల్ల పులుముకున్న ఉద్యమ రచయిత సీతా రాములు. ఆ స్వానుభవానికి అక్షర రూపమే ఈ కథ. ఇది ఏదో పోరాట కథనం అనుకుంటే పొరపాటే.. చక్కటి ఒక భిన్నమైన కథ రచనా కాలం 2015. .
కేవలం ఉద్యోగ వృత్తితో కాలం గడపకుండా, సంపూర్ణ సామాజిక స్పృహతో తన చేరువలోని అడవిబిడ్డల వికాసమే లక్ష్యంగా కృషి చేసిన సామాజిక కార్యకర్త రచయిత ‘కోమాకుల సీతారాములు’ మానుకోట జన్మస్థలం గల వీరు సుమారు పుష్కర కాలం పాటు భద్రాచలం మన్యం ప్రాంతంలో విద్యార్థి ఆవాస కేంద్రాల పర్యవేక్షకుడిగా ఉద్యోగ ధర్మాన్ని పాటిస్తూ,.. ఇక్కడి గిరిజనులతో మమేకమై ఎందరో గిరిజన విద్యార్థులకు దారి దీపం అయ్యారు. గాయకుడిగా,రచయితగా,నటుడిగా,శిక్షణా ధ్యక్షుడుగా,బహుముఖీనమైన కళాసేవ చేసిన సీతారాములు రాసిన అనేక కథల్లో ఒకటి ‘‘తెలంగాణ గట్టుమీద పోలవరం’’.దీని రచనా కాలం 2015 సంవత్సరం.ఊహించిన విధంగా అందివచ్చిన తెలంగాణ రాష్ట్రం యావత్తు, ఆనందంతో సంబరాలు చేసుకుంటున్న వేళ.. భౌగోళికంగా రాష్ట్రంలో అంతర్భాగమైన భద్రాచలం మన్నెసీమకు కుడిచేయి వంటి ‘పోలవరం ముంపు ప్రాంతమండలాలు’ పాలకులముందుచూపు..,వ్యూహాలతో..స్వార్థ ఒప్పందాలతో అక్కడే నివాసం ఉంటున్న గిరిజ నులను బలవంతంగా ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేయడంతో అక్కడి అన్ని వర్గాలప్రజల్లో ఆందో ళనతో కూడిన విషాదఛాయలు అలుము కున్నాయి. ఈ ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపవద్దని అంతేకాక అధిక నష్టదాయకమైన ‘‘బహుళార్థక పోలవరం ప్రాజెక్టు’’ నిర్మాణంలో మార్పులు తేవాలనే లక్ష్యంతో ‘‘ముంపు మండ లాలపోరాటం’’ మొదలైంది. సామాజిక స్పృహ నిలువెల్ల పులుముకున్న ఉద్యమ రచయిత సీతా రాములు ముంపుమండలాపోరులో కీలక పాత్ర పోషించారు.ఆ స్వానుభవానికి అక్షర రూపమే ఈ ‘తెలంగాణ గట్టుమీద పోలవరం’ కథని ఇది ఏదో పోరాట కథనం అనుకుంటే పొరపాటే…!! రచయితకు ఉండే సాధారణ ఆశావాదం.. అందమైన అడవిబిడ్డల జీవనవిధానం,సుందరమైన గోదావరి అడవి అందాలు,అంతర్గతంగా అభివర్ణిస్తూ…. మరో పక్క అడవిబిడ్డల జీవన విధానంతో కూడిన వారి పోరాటగాథను రచయిత హృద్యంగాచెప్పే ప్రయత్నం చేశారు. కారు మబ్బుల సాక్షిగా చిరుజల్లుల్లో తడుస్తూ ‘‘కోడేరు’’ గిరిజన గ్రామ స్తులంతా సంప్రదాయబద్ధంగా ఏటా జరుపుకొనె భూమిపండుగ కోలాహలంతో ఈ కథ మొదలవుతుంది. ‘రాములమ్మ’అనే గిరిజన యువతి ఈకథలో ప్రధాన పాత్రగా అగు పిస్తుంది. అనుచరులుగా రాజన్న,కొమ్మారెడ్డితో పాటు కథా రచయిత కూడా ఈకథలో అతిధి పాత్రగా దర్శనమిస్తాడు. ఇక కథ విషయానికి వస్తే ఎంతో ఆనందంగా కొమ్ము,డోలు,నృత్యా లతో భూమిపండగ చేసుకుంటున్న ఆగూడెం గిరిజనులకు పిడుగులాంటి వార్త చెబుతాడు రాజన్న. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంవల్ల తెలంగాణ ప్రజలంతా ఆనందోత్సవాలతో తేలి ఆడుతుండగా….ఆ రాష్ట్రంలో భాగమైన మన్య సీమ లోని గిరిజన గ్రామాలకు నిరుత్సాహంతో కూడిన,బాధ కలిగించే వార్త చెప్పడం ఈ కథ ప్రారంభంలోని ఎత్తుగడ.
కానీ ఎత్తుగడలో ఎలాంటి ఉత్కంఠత గాని, సందేహాలు గాని, లేకుండా అసలు విషయం వెంటనే వెల్లడిరచి రచయితే స్వయంగా ఒక పాత్ర ధరించి కథలో ప్రవేశించడంతో విష యం శక్తి సన్నగిల్లిన,కథనంతో కాస్త కష్టపడి కథను చివరికంటూ చదివింప చేసే ప్రయత్నం జరిగింది. కథలోని తొలి పాత్ర అయిన రాము లమ్మ, డిగ్రీ వరకూ చదువుకొని ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నా ఆదివాసీ యువతి,తాను చదువుకున్న చదువు ద్వారా లభించిన విజ్ఞానం, విషయ పరిజ్ఞానం ద్వారా తనప్రాంత గిరిజ నుల్లో చైతన్యం తెచ్చే ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాలు అయిన ఏడు మండలాల ప్రాంతాన్ని తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్ర ప్రాంతంలో కలుపుతున్నట్లు వెలువడ్డ టీవీ వార్తలు గురించి రాజన్న ద్వారా విన్న రాములమ్మ, వెంటనే తనకు గతంలో తెలిసిన విజ్ఞానం సాయంతో గూడెం ప్రజలనంతా… ఒకచోటకు చేర్చి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం లోని లొసుగులు గురించి చెబుతుంది.తాను చదువుకునే సమయంలో సీతారాములు సార్‌ (కథా రచయిత) చేసిన ఉపన్యాసాల సారాంశం గుర్తుచేసుకుని,గతంలో గిరిజన సమాజాల్లో సమ్మక్క సారక్క,హైమన్డార్ఫ్‌,సీతారామరాజు, గంటందొర,కొమరంభీమ్‌ వంటి వారు చేసిన పోరాటాలు,త్యాగాలు, చైతన్యపుకృషి, గురించి వివరిస్తుంది రాములమ్మ. అలా ఆమె చెప్పిన మాటల ద్వారా రానున్న కష్టకాలం తలుచు కుంటూ భవిష్యత్‌ కార్యాచరణ గుర్తు చేసు కుంటూ ఎవరి ఇళ్లకు వారు వెళ్ళిపోతారు. పూర్వం దేశమంతా స్వాతంత్య్ర సంబరాలు జరుపుకుంటూ ఉంటే ఒక హైదరాబాద్‌ సంస్థాన ప్రాంత ప్రజలు మాత్రం నిరుత్సా హంగా ఎలా ఉండిపోయారో ,ఇప్పుడు అదే పరిస్థితి ఈపోలవరం ముంపు ప్రాంత గిరిజన గ్రామాలది. తెలంగాణ వచ్చిన సంతోషం కన్నా తెలంగాణ ప్రాంతం నుంచి గెంటివేయ బడ్డామన్న బాధ ఈప్రాంతవాసులకు ఎక్కు వైంది.తిరిగి పోలవరం వ్యతిరేక ఉద్యమం మొదలైంది.సీతారాములు సార్‌ పాత్ర మళ్ళీ ప్రారంభమైంది,ఏడు మండలాలకు చెందిన యువ కార్యకర్తలకు కార్యాచరణ చేయడం కోసం,ఏర్పాటుచేసిన శిక్షణ శిబిరంకు వెళ్ళిన సీతారాములు అనేక లెక్కలు,చారిత్రక విశేషా లతో కూడిన సుదీర్ఘ ప్రసంగం చేయడంతో కథ అంతా వ్యాసపుముసుగు వేసుకుని నడుస్తుంది. కథలో రూపం మారిన పాఠకులకు విసుగు రాకుండా చదివింప చేయడంలో రచయిత పడ్డ శ్రమ చివరికి ఫలించిందనే చెప్పాలి.ఈ పోల వరం ముంపు పోరాట ఉద్యమంకు నూతన పంథాలో, గిరిజనుల సంప్రదాయ సంస్కృతి ఆయుధాల సాక్షిగా ఉద్యమ నిర్మాణం జరిగి పోతుంది.‘పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాం తం’ దిగ్బంధం లక్ష్యంగా కార్యాచరణ సాగు తోంది.‘పోలవరం ఆపండి ఆదివాసులను కాపాడండి’ అనే నినాదాలతో అడవి అంత మారుమోగుతుంది, భారత ప్రభుత్వం న్యాయం చేసే వరకు పోరాటం చేయాలని అక్కడి గిరిజ నులంత తీర్మానం చేసుకున్నారు. అందుకు అన్ని ప్రాంతాల ప్రజలు,ఉద్యోగులు,సంఘాల వారు తమ మద్దతు తెలుపుతారు,‘పోలవరం దిగ్బం ధం’ చేసే రోజు ఖరారు అయ్యింది. పోలవరం ముంపు ప్రాంతపు గిరిజనులు చేసే పోరాటానికి అన్ని ప్రాంతాల నుంచి ట్రాక్టర్లు,లారీలు, లాంచీ లు,పడవలు, ఇలా రకరకాల ప్రయాణ సాధ నాల ద్వారా నిర్బంధ ప్రాంతానికి జనాలను చేరవేయడానికి, నాయకులు ఎవరికి వారు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఇక్కడ వరకు కథ వాస్తవానికి దగ్గరగా భూతకాలంలో నడిచింది. చివరిలో రచయిత తన ఆశావహ దృక్పథాన్ని వ్యక్తపరుస్తూ ఒక గొప్ప ఆశయం చాటుతూ కథను ముగిస్తారు. కథ చివరి ఘట్టం అంతా అడవి బిడ్డలు చేసిన పోరాట రూపం, దానికి సహచరులు అంతా తెలిపిన సంఫీు భావం,అక్కడ వారు రహదారులను దిగ్బంధం చేసినతీరు,వంటావార్పులుతో నిరసన తెలిపిన వైనం తదితరాలు కళ్లకు కట్టినట్లు అభివర్ణిం చడంలో రచయిత స్వయంగా చేసిన ఉద్యమాల అనుభవాలు వ్యక్త పరిచారు.ఈ పోలవరం పోరులో అడవి బిడ్డలు ఉపయోగించిన వస్తు వులు,ఎండుగుబ్బ,పూరిదికట్ట,బొంగుది కర్ర , టేకుది సిర్ర,డోలు మొదలైన వాటి గురించి వివ రించడంలో రచయితకు గల పరిసరాల అవగా హన ఎంత పటిష్టంగా ఉందో అర్థం వుతుంది. ఉద్యమంలో వారు చేసిన నినాదాలు,పాడిన పాటలు,ఆడిన ఆటలు, మొదలైనవి చూస్తే ఈ అడవి బిడ్డలలోని ఆత్మస్థైర్యం,కష్టాలను ఎదు ర్కొనే ధైర్యం,ఎంతో ఆదర్శంగా చిత్రిం చడంలో రచయిత సీతారాములు కృషి నెరవేరింది అని పిస్తుంది.‘పోలవరం కడితే అందులో జల సమాధిఅయ్యి చనిపోయే దానికంటే.. ఇప్పుడే ఇక్కడే పోరాడి చనిపోతాం భావితరాలైనా ఈప్రాంతాన్ని కాపాడుకుంటారు’ అనే భావన గిరిజన యువతి రాములమ్మ నుంచి చెప్పిస్తాడు రచయిత.పోరాటాలు ఏవైనా తక్షణ ఫలితాలు అందించక పోయినా భావితరంలో రావాల్సిన మార్పులకు బీజాలుగా తప్పక మారుతాయి.. అన్న చారిత్రక ఆలోచనలు నిజమే కదా అని పిస్తుంది. ఇక కథ చివర్లో ఉద్యమకారులకు పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణ వాతావ రణం చూపిస్తూ ‘బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదె సుమతీ’ అన్న సుమతీశతక కర్త బద్దెన వాక్కుకు నిజం చేస్తూ.., గిరిజనుల ఐక్యత, తెగింపు, వారికి లభించిన సంఫీుభావంతో పోలీసులు వెనకడుగు వేయ టం,రాష్ట్రపతి ప్రధాని,జోక్యం చేసుకుని సమస్య పరిష్కరించడానికి ముందుకు రావడం జరుగు తుంది. వారు కోరుకున్నట్టుగా 7మండలాలు తెలంగాణ భూభాగంలోని కొనసాగించడానికి ఒప్పుకోవడం తో పాటు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గురించి కూడా పునరాలోచన చేస్తా మని హామీ ఇవ్వడంతో,మనిషిని మాటను, సం పూర్ణంగా నమ్మే గిరిజనులు శాంతించివారు చేస్తున్న పోరాటం ఆపి ఎవరి ఇళ్లకు వారువెళ్లి రాబోయే బంగారు తెలంగాణ సమాజాన్ని తలచుకుంటూ నిద్రలోకి జారుకుంటారు.అంటూ రచయిత తన ఆశాభావాన్ని రంగరించి తనదైన క్రాంతదర్శనంతో కథను సుఖాంతం చేయ డంతో పాఠకులు సంతృప్తి చెందుతారు.ఈకథ లో గిరిజనజీవితాల్లో అంతర్భాగంగా అగుపించే ‘పోరుబాట’ను వివరిస్తూనే వారివారి సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేస్తూ, ఒక వార్తా కథనాన్ని అందమైన కథగా తీర్చిదిద్ది తెలుగు కథా సాహిత్యానికి ఒక ‘గిరిజన కథ’అందించిన సీతారాములు కృషి లెక్కించదగిన అభినందిం చాల్సినది. (వచ్చే మాసం ఎస్‌.బాలసుధాకర్‌ మౌళి కథా విశ్లేషణ ‘‘థింసా దారిలో’’…. మీకోసం)