చరిత్రను చదవలేదు..చరిత్రనే మలిచారు
“చరిత్రను చదివేవాళ్లు చాలామంది ఉం టారు… చరిత్రను రాసేవాళ్లు కొందరే ఉం టారు… కానీ…చరిత్రలోనే ఒక కొత్త అధ్యా యాన్ని సృష్టించేవాళ్లు మాత్రం చాలా అరుదు. పొట్లపల్లి కమలమనోహర్ రావు లాంటి అరుదైన వ్యక్తి. ఆయన చేతిలో ఉన్నది కేవలం ఒక ప్రభుత్వ అధికారి బాధ్యత కాదు..అడవుల్లో తరతరాలుగా జీవించిన వేలాది మంది గిరిజనుల జీవితాల్లో వెలుగు నింపారు. “ప్రభుత్వం గిరిజనుల దగ్గరకు వెళ్లాలి… గిరిజనులు ప్రభుత్వాన్ని వెతుక్కుంటూ రావాల్సిన అవసరం లేదు.” అనే ఆలోచన ఒక వ్యవస్థకు మార్గదర్శకంగా మారింది. “మేము కూడా ఈ దేశంలో సమాన భాగస్వాములమే” అనే ఆత్మవిశ్వా సాన్ని నింపారు.ఆయన కృషి ఒక ఉద్యోగ కాలానికి పరిమితం కాలేదు…అది ఒక సమాజం కోసం సాగిన జీవితకాల ప్రయాణం. హక్కులు తెలియని చేతులకు,హక్కులపై అవగాహన కల్పించారు. విద్యకు దూరమైన పిల్లల కళ్లలో,భవిష్యత్తుపై కలలు నింపారు. ఆయన తన విధిని దాటి, ఒక సమాజం కోసం నిలబడిన ఓ బాటపారి.ఇది కేవలం చరిత్ర కాదు…చరిత్రను మార్చిన ఒక మనిషి ప్రయాణం.”
ఆయన జీవిత విశేషాలు..
1919 డిసెంబర్ 20న తెలంగాణలోని అశ్వరావుపల్లిలో పొట్లపల్లి కమలమనోహర్ రావు జన్మించారు. గ్రామీణ వాతావరణంలో పెరిగిన ఆయనకు చిన్నప్పటి నుంచే సమా జంలోని అసమానతలు పరిచయ మయ్యా యి. అదే సమయంలో అట్టడుగు వర్గాల జీవితంపట్ల ఆయనలో ఒకప్రత్యేక మైన ఆసక్తి పెరిగింది.తరువాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆంత్రోపాలజీ చదవ డం ఆయన జీవితానికి కీలకమైన మలుపు గా మారింది. ఆరోజుల్లో గిరిజన సమా జాన్ని చాలామంది దూరంగా ఉన్న ఒక సమూహంగా మాత్రమే చూశారు. కానీ కమలమనోహర్ రావు మాత్రం వారిని అర్థం చేసుకోవాల్సిన సమాజంగా చూశారు.వారి వెనుకబాటుతనానికి కార ణం ఏమిటి? వారికి భూమి ఎందుకు లేదు? విద్య ఎందుకు అందడం లేదు? ప్రభుత్వ పథకాలు ఎందుకు వారి గూడేలకు చేరడం లేదు?అనే ప్రశ్నలు ఆయనను వెంటాడాయి. ఆ ప్రశ్నలకు సమాధానాలు వెతకడం క్రమంగా ఆయన జీవిత లక్ష్యంగా మారింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆంత్రో పాలజీ చదువుతున్న సమయంలో ప్రముఖ మానవ శాస్త్రవేత్త క్రిస్టోఫ్ వాన్ ఫ్యూరర్-హైమెండార్ఫ్ పరిచయం ఆయన ఆలోచ నలకు మరింత పదును పెట్టింది.హైమెం డార్ఫ్ గిరిజన జీవన విధానాన్ని దగ్గరగా అధ్యయనం చేసిన పరిశోధకుడు.ముఖ్యంగా ఆదిలాబాద్ ప్రాంతంలోని గోండు సమాజంపై ఆయన చేసిన పరిశో ధనలు విశేషంగా గుర్తింపు పొందా యి. హైమెండార్ఫ్ మార్గదర్శకత్వంలో కమల మనోహర్ రావు గిరిజనులు,వెనుకబడిన వర్గాల సంక్షేమానికి సంబంధించిన కార్యక్ర మాల్లో పనిచేసే అవకాశం పొందారు. అది ఆయనకు ఒక ఉద్యోగం మాత్రమే కాదు.
ఆదివాసీ సమాజంతో కలిసి నడిచే జీవి తానికి అది ఆరంభం..: నిజాం ప్రభుత్వంలోని సామాజిక సంక్షే మ శాఖలో చేరిన తర్వాత కమల మనోహర్ రావు సాధారణ అధికారిలా కార్యాలయంలో కూర్చుని ఫైళ్లను పరి శీలించలేదు.ఆయన గిరిజన గూడేలకు వెళ్లారు.గోండుల మధ్య నడిచారు. కొలాములతో మాట్లాడారు.కోయలు, కొండరెడ్లు,లంబాడీల జీవనాన్ని అర్థం చేసుకున్నారు.అడవిలోని మారు మూల ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ప్రభుత్వ కార్యాలయం ఎంత దూరమో,వారి సమస్యలను పరిష్కరించే వ్యవస్థ కూడా అంతే దూరంగా ఉందని ఆయన గుర్తిం చారు.ఒక శాఖ విద్య గురించి చూస్తుం ది.మరోశాఖ భూమి గురించి చూస్తుంది. ఇంకోశాఖ సంక్షేమం గురించిచూస్తుంది. మరొక శాఖ ఆర్థిక సహాయం గురించి చూస్తుంది. కానీ గిరిజన కుటుంబానికి ఇవన్నీ విడివిడిగా కాకుండా ఒకే జీవిత సమస్యగా కనిపిస్తాయి. ఈఅంత రాన్ని తొలగించడానికి ఆయన ప్రతిపాదిం చిన ఆలోచనల్లో ‘సింగిల్ విండో అప్రోచ’ ఒకటి.గిరిజనుల కోసం పనిచేసే వివిధ సేవలను సమన్వయం చేసి,ఒకే వ్యవస్థ ద్వారా సమస్యలకు పరిష్కారం చూపాల న్నది ఈ ఆలోచన సారాంశం.ఆకాలానికి ఇది ఎంతో ముందుచూపుతో కూడిన పరిపాలనా ఆలోచన.గిరిజనుల సమస్య లకు ప్రత్యేక దృష్టి,ప్రత్యేక వ్యవస్థ అవస రమని కమలమనోహర్ రావు బలంగా వాదించారు.అనేక చర్చలు, ప్రయత్నాల అనం తరం 1966లో ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక గిరిజన సంక్షేమశాఖ ఏర్పాటుకు ఆయన కీలక పాత్ర పోషించారు. ఆశాఖ కు ఆయన తొలి డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు.అది ఒక పదవి.కానీ ఆయనకు మాత్రం అది ఒక బాధ్యత. 1975లో పదవీ విరమణ చేసే వరకు ఆయన గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం విస్తృతంగా పనిచేశారు. ఆదిలాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని అరకు ప్రాంతాల వరకు గిరిజన ఆవాసా లను సందర్శించి, అక్కడి పరిస్థితులను అధ్య యనం చేశారు.ప్రభుత్వ పథకం కాగితంపై రూపొందించడం ఒక విష యం.అది ఒక గిరిజన గూడెలోని కుటుం బానికి చేరేలా చేయడం మరో విషయం. కమలమనోహర్ రావు రెండో దానినే ముఖ్యం అనుకున్నారు.అందుకే గిరిజన ప్రాంతాల్లో స్వయంగా పర్యటించి,అక్కడి ప్రజల సమస్యలను తెలుసుకుని,వాటికి అనుగుణంగా చర్యలు తీసుకునే ప్రయత్నం చేశారు. గిరిజన సమాజానికి భూమి అంటే కేవలం ఆస్తి కాదు.అది జీవనాధారం.అది ఆహారం. అది సంస్కృతి.అది తరతరాల గుర్తింపు. అందుకే గిరిజనుల భూమి హక్కుల సమస్యను ఆయన అత్యంత ప్రాధా న్యంతో చూశారు. భూమిపై హక్కులు లేక తరత రాలుగా అడవుల్లో జీవిస్తున్న అనేక గిరిజన కుటుంబాలకు పట్టాలు,భూమి హక్కులు కల్పించేందుకు ఆయన కృషి చేశారు.వరంగల్ ప్రాంతంలోని మహబూ బాబాద్, నర్సంపేట,ములుగు ప్రాంతాల్లో నిరుపేద ఎస్సీ,ఎస్టీ కుటుంబాలకు భూమి కేటా యింపుతో పాటు నివాస కాలనీలు, నీటి సదుపాయాల ఏర్పాటుకు సంబంధిం చిన కార్యక్రమాల్లో ఆయన పాత్ర ఉంది. ఆయన దృష్టిలో భూమి ఇవ్వడం అంటే కేవలం ఒక పట్టా ఇవ్వడం కాదు. ఒక కుటుంబానికి భవిష్యత్తు ఇవ్వడం. గిరి జన పిల్లల వెనుకబాటు తనానికి ప్రధాన కారణాల్లో విద్య అందుబాటులో లేకపో వడం ఒకటని ఆయన గుర్తించారు. అందుకే గిరిజన గూడేల్లో పాఠశాలలు, అవసరమైన చోట హాస్టళ్ల ఏర్పాటు కోసం కృషి చేశారు.ఈరోజు ఒకగిరిజన విద్యార్థి ఇంటి నుంచి దూరంగా వెళ్లి చదువుకోవడానికి ప్రభుత్వ హాస్టల్లో ఉండటం మనకు సాధారణంగా కని పించవచ్చు.కానీ ఆసౌకర్యాల వెనుక ఒకప్పుడు జరిగిన పోరాటాన్ని గుర్తు చేసు కుంటే దాని విలువ తెలుస్తుంది. ఒక గిరిజన బిడ్డ చేతిలో పుస్తకం కనిపించడం అంటే కేవలం విద్య కాదు. తరతరాలుగా మూసుకుపోయిన ఒక తలుపు తెరుచు కోవడం.ఆదిలాబాద్ జిల్లా మార్లవాయి ప్రాంతంలో గోండు గిరిజనుల జీవన విధానంపై హైమెం డార్ఫ్ సుదీర్ఘంగా పరిశోధనలు చేశారు. గిరిజన సమాజాన్ని దగ్గరగా అర్థం చేసు కోవడంలో కమలమనోహర్ రావు చేసిన కృషిని కూడా ఆయన గుర్తించారు. ఆయన సేవలను అభినందిస్తూ హైమెం డార్ఫ్ రాసిన లేఖలు ఆయన పని పట్ల ఉన్న గౌరవానికి నిదర్శనంగా నిలిచా యి. ఇది ఒకఅధికారి గురించి మరో అధికారి రాసిన ప్రశంస కాదు.గిరిజన సమాజాన్ని అర్థం చేసుకోవడంలో జీవి తాన్ని అంకితం చేసిన ఇద్దరు మానవ శాస్త్రవేత్తల మధ్య ఉన్న ఆలోచనా సంబంధానికి ఇది గుర్తు.
1968లో తూర్పు కనుమల్లోని అరకు సమీపంలోని మాడగడ అనే గిరిజన పల్లెపై గిరిజన శాఖ ప్రచురించిన పుస్త కానికి కమలమనోహర్ రావు రాసిన ముందు మాట ఒక అరుదైన విశ్లేషణ. గిరిజన జీవన విధానంలోని అనేక అంశాలను వెలుగులోకి తీసుకొచ్చింది. ఈరోజు అరకు ప్రాంతం దేశ,విదేశీ పర్యాటకులను ఆకర్షించే ప్రాంతంగా ఎదిగింది. అయితే ఆ ప్రకృతి అందాల వెనుక శతాబ్దాలుగా జీవిస్తున్న గిరిజన సమాజం ఉంది. ఆసమాజాన్ని అర్థం చేసుకోవడానికి దశాబ్దాల క్రితమే పరిశో ధనలు చేసిన వారిలో కమలమనోహర్ రావు ఒకరు.1975లో ఆయన పదవీ విరమణ చేశారు. కానీ గిరిజనుల గురించి ఆయన ఆలోచన ఆగలేదు. అధ్యయనం ఆగలేదు.పరిపాలనా సంస్క రణలపై ఆయన ఆలోచనలు,రచనలు తరువాత కూడా కొనసాగాయి.గిరిజన అభివృద్ధి పరిపాలనను సరళీకరించాల్సిన అవసరాన్ని వివరిస్తూ ఆయన చేసిన సూచనల్లో ‘సింగిల్ విండో అప్రోచ’, వికేంద్రీకరణ,వివిధ గిరిజన అభివృద్ధి సంస్థల మధ్య సమన్వయం వంటి అంశాలు ఉన్నాయి.గిరిజన సహకార సంస్థలు కేవలం రుణాలు ఇవ్వడానికే కాకుండా వాణిజ్యం,మార్కె టింగ్, సంక్షేమ కార్యక్రమాలను సమన్వయం చేయాలని కూడా ఆయన సూచించారు. అంటే ఆయన ఆలోచన కేవలం ‘సంక్షే మం’ దగ్గర ఆగ లేదు.గిరిజనుడు తన కాళ్లపై తాను నిల బడేలా చేసే సంస్థాగత అభివృద్ధి గురించి కూడా ఆయన ఆలో చించారు.కమల మనోహర్ రావు చేసిన పనిని ఈరోజు వెనక్కి తిరిగి చూస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. ఆయన గిరి జనుల కోసం పథకాలు మాత్రమే రూపొం దించలేదు. గిరిజనుల సమస్యలను ప్రభు త్వం చూసే దృష్టినే మార్చడానికి ప్రయత్నిం చారు. అడవిలో నివసించే వ్యక్తిని ‘లబ్ధి దారు’గా మాత్రమే కాకుండా హక్కులు ఉన్న పౌరుడిగా చూడాలి. వారి భూమిని రక్షిం చాలి. వారి సంస్కృతిని గౌరవించాలి.వారి పిల్లలకు విద్య అందించాలి.వారిని ప్రభుత్వ వ్యవస్థలో భాగస్వాములను చేయాలి.వారి ఆర్థిక జీవితాన్ని బలోపేతం చేయాలి.ఇదే ఆయన ఆలోచనల సారాంశంగా కనిపి స్తుంది. గిరిజన సంక్షేమం గురించి మనం ఈరోజు మాట్లాడుతున్నప్పుడు పాఠశాలలు, హాస్టళ్లు,భూమి హక్కులు,సహకార సంస్థలు, ప్రత్యేక అభివృద్ధి సంస్థలు,గిరిజన ప్రాంతాల కోసం ప్రత్యేక పరిపాలన వంటి అనేక అం శాలు మన ముందుంటాయి.కానీ ఈ వ్యవ స్థలు ఒక్కరోజులో ఏర్పడలేదు.వాటి వెనుక అనేక మంది అధికారులు,సామాజిక కార్య కర్తలు,పరిశోధకుల కృషి ఉంది.ఆప్రయా ణంలో పొట్లపల్లి కమలమనోహర్ రావు ముఖ్యలు.ఆయన జీవితాన్ని అధ్యయనం చేయడం అంటే ఒక వ్యక్తి జీవిత చరిత్రను తెలుసుకోవడం మాత్రమే కాదు. ఒక సమా జాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అభివృద్ధి అంటే ఏమిటి? ప్రభుత్వ వ్యవస్థ అట్టడుగు మనిషి దగ్గరకు ఎలా చేరాలి? భూమి,విద్య, ఆత్మగౌరవం మధ్య సంబంధం ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానాలు వెతకడం కూడా.ఒక అధికారి పదవీ విరమణ చేస్తే ఆయన కార్యాలయ తలుపులు మూసుకుపోతాయి.కానీ ఒకవ్యక్తి ఆలోచ నలు సమాజంలో కొనసాగితే అది పదవీ విరమణ కాదు.అది వారసత్వం.కమల మనోహర్ రావు వారసత్వం కూడా అదే. ఆయన వేసిన బాటలో నడిచిన గిరిజన విద్యార్థులు ఉన్నారు.భూమిపై హక్కు పొందిన కుటుంబాలు ఉన్నాయి. ప్రభుత్వ వ్యవస్థకు చేరువైన గిరిజన గూడేలు ఉన్నాయి.ముఖ్యంగా ‘మేమూ చేయగలం’అనే ఆత్మవిశ్వాసంతో ముం దుకు నడిచిన ఒకతరం ఉంది.అందుకే కమలమనోహర్ రావును కేవలం ఒక మాజీ ప్రభుత్వ అధికారిగా గుర్తు చేసు కోవడం సరిపోదు.ఆయన ఒక కాలంలో పనిచేసిన అధికారి.కానీ ఆయన ఆలోచ నలు అనేక తరాలకు సంబంధిం చినవి. అడవుల్లో నివసించే ప్రజలకు అభివృద్ధి చేయడం మాత్రమే కాదు…వారి గౌర వంతో,వారి హక్కులతో,వారి భాగస్వా మ్యంతో అభివృద్ధి జరగాలని నమ్మిన మనిషి ఆయన.చరిత్రను చదివినవారు చాలామంది ఉంటారు.చరిత్రను రాసిన వారూ ఉంటారు.కానీ ఒకఅట్టడుగు సమాజం భవిష్యత్తు మారేలా చరిత్రను మలిచినవారి సంఖ్య మాత్రం చాలా తక్కువ.కమలమనోహర్రావు ఆ అరుదైన వ్యక్తుల్లో ఒకరు.ఆదివాసీల కోసం అంకి తమైన ఒక జీవితం…ఒక వ్యవస్థకు పునాది వేసిన ఒక ఆలోచన… తరతరా లకు వెలుగునిచ్చిన ఒక వారసత్వం.– (రచయిత:శ్యాంమోహన్)
