ఉచితాల‌పై అనుచిత ప్ర‌చారం

‘కూత నేర్చినోళ్ళ కులం కోకిలంటారా!? ఆకలేసి అరిచినోళ్ళు కాకులంటారా!?.’’ ప్రాణం ఖరీదు సినిమాలో ఓ పాటలోనివి ఈ వాక్యాలు. ప్రభుత్వ ఉచిత పథకాలు, వ్యయాలపై నేడు వ్యక్తమవుతున్న అభిప్రాయాలు చూస్తుంటే ఇవి గుర్తుకు రాకమానవు. అంటే తమ చాతుర్యాలతో లక్షల కోట్ల దేశ సంపదను ఆశ్రిత అవకాశ వాదంతో కాజేస్తున్న వారేమో ఉన్నతులు, శ్రమకు దగ్గ ప్రతిఫలాన్ని ఆశించకుండా, అడిగినంత ధరలు చెల్లిస్తూ వస్తు సేవలను పొందుతున్న ప్రజలేమో అధములన్న మాట! దేశ సంపదనంతా సామాన్యులకిచ్చే ఉచితాల ద్వారా సర్వనాశనం చేస్తున్నారంటూ వ్యక్తమవు తున్న సదరు అభిప్రాయాలపై జాలి కలుగు తున్నది. ప్రజలని ‘’అలగా జనం’’ అని సంబో దించిన చోట ఇంతకన్నా ఎక్కువ ఆలోచనను ఆశించడం అత్యాశే కాబోలు!. జి.తిరుపతయ్య
ప్రభుత్వాలు ప్రకటిస్తున్న ఉచిత పథకాల వల్ల ఆర్థిక వ్యవస్థకు చాలా నష్టమని, ఇది ఇలాగే కొనసాగితే శ్రీలంక ఎదుర్కొంటున్న ఆర్థిక అత్యవసర పరిస్థితి భారత్‌కూ తప్పదని ప్రధానమంత్రి నిర్వహించిన ఉన్నత అధికారుల సమావేశంలో పలువురు వ్యాఖ్యానించినట్లు వార్తా కథనాలు వెలువడ్డాయి. లోక్‌సత్తా నాయకుడు జయప్రకాశ్‌నారాయణ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. వీటిని ఆధారం చేసుకుని బూర్జువా పార్టీల ఏజెంట్లు, ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ శ్రేణులు పేదలకు ఇచ్చే ఉచితాలే పెను భూతాలు అనే విధంగా సోషల్‌ మీడియాలో ప్రచారం మొదలు పెట్టాయి. ఇందులో నిజానిజాలను తెలుసు కోకుండానే దావానలంలా ఆ ప్రచారాన్ని విశ్వవ్యాప్తి చేస్తున్నారు మన మధ్య తరగతి సోషల్‌ మీడియా మిత్రులు! మొదటిది, ఉచిత పథకాలు ఇవ్వమని ప్రజలు ఎప్పుడూ కోరలేదు, లేదా అలాంటి పథకాల కోసమేం వారు ఉద్య మాలూ చేయలేదు. రెండవది, ఈ ఉచితాలను ప్రకటిస్తున్నది ఎన్నికల వాగ్దానాల రూపంలో బూర్జువా పార్టీలు మాత్రమే. నిజానికి ఓట్ల కోసం సామాన్య ప్రజానీకాన్ని ప్రలోభ పెట్టే పాలక పార్టీల పన్నాగాలే ఇవన్నీ. అయితే ఈ ఉచిత పథకాలను అనుభవిస్తున్నది పేదలు మాత్రమే కాదు. కేంద్రం ప్రవేశపెట్టిన కిసాన్‌ సమ్మాన్‌ గానీ, రాష్ట్రం ప్రవేశపెట్టిన రైతుబంధు గానీ భూమి కలిగి ఉన్న పట్టాదారులందరికీ ఇస్తున్నారు తప్ప అర్హులైన, పెట్టుబడికి కొరవడిన పేద రైతులకు మాత్రమే చేరుతున్నాయా? ఇప్పటికీ అత్యధిక భూమి కొందరి చేతుల్లోనే ఉన్నది. అలాంటి ఉన్నత అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు లాంటి వారందరికీ రైతుబంధు అందుతున్నది. ఇక చౌక ధరల దుకాణాల అవకతవకలు అటుంచితే, ఇక్కడ సప్లయి చేయబడుతున్న వస్తువులు ఏవీ ప్రభుత్వానికి భారం కాదు. ఎందుకంటే నేరుగా రైతుల దగ్గర నుంచి తీసుకొని వినియోగ వస్తువులుగా మార్చిన తర్వాత ఇస్తున్న రేటు దాదాపు మధ్యవర్తిత్వం లేకుంటే పెద్దగా సబ్సిడీ ఏమీ ఇవ్వట్లేనట్లే. చివరికి వృద్ధాప్య పింఛన్లు, వికలాంగ పింఛన్లు, వితంతు పెన్షన్లు ఇవేనా ప్రభుత్వాలకు భారమైంది? లేదా 39లక్షల కోట్ల దేశ బడ్జెట్‌లో కేవలం 70వేల కోట్ల రూపా యలు కేటాయించి గ్రామీణ నిరుపేదలకు పని కల్పిస్తున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకమా? అరకొర నిధులు కేటాయించినప్పటికీ గ్రామీణ ఉపాధి హామీ పథకం వల్లనే గ్రామాలలో, కీన్స్‌ అనే ఆర్థిక వేత్త చెప్పినట్లుగా అందరి చేతిలో ఎంతో కొంత కొనుగోలు శక్తి మిగిలివుంది. ఉచిత పథకాల కన్నా వ్యవస్థీకృత లోపాలను సరిదిద్దే దీర్ఘ కాలిక మౌలిక వసతుల ప్రణాళికలు అవసరం. స్కూళ్ళల్లో పరిస్థితిని మెరుగుపరచ కుండా లాప్‌టాప్‌లు అందించడం అర్థరహితం. పాఠశాల విద్యార్థినుల హాజరు శాతాన్ని పెంచడానికి, వారు హాజరయ్యే విధమైన సౌకర్యాలను ఏర్పాటు చేయకుండా, సైకిళ్లను కొనివ్వడం అర్థరహితం. ఇక ఇలాంటి పథకాలకు నిధులు ఎక్కడి నుండి కేటాయించ బడుతున్నాయి, దాని పర్యవసనాలు ఎంటో కూడా పరిశీలించాలి. 2020-21సంవత్స రానికి గాను పరోక్ష పన్నులు స్థూల జాతీయ ఉత్పత్తిలో 5.4శాతం ఉంటే ప్రత్యక్ష పన్నులు 4.7శాతం మాత్రమే ఉన్నాయి. 2.7ట్రిలియన్‌ డాలర్ల(200 లక్షల కోట్లు) ఆర్థిక వ్యవస్థలో పరోక్ష పన్నుల ద్వారా 10.8 లక్షల కోట్ల రూపాయలు వస్తే ప్రత్యక్ష పన్నుల ద్వారా కేవలం 9.4లక్షల కోట్ల రూపాయలు వసూలు అయ్యాయి. అనేక అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వ్యవస్థల్లో చూస్తే మొత్తం పన్ను రాబడిలో 67.4శాతం ప్రత్యక్ష పన్నుల వాటా ఉంటే భారత్‌లో అది 38.3శాతంగా నమోదు అవుతుంది. (మూలం బిజినెస్‌ స్టాండర్డ్‌ పత్రిక ) ఈ రెండు గణాంకాలను చూస్తే చాలా సులభంగా అర్థం అయ్యేది పరోక్ష పన్నుల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం ఎక్కువ అని. మరి అట్లాంటి పరోక్ష పన్నులను చెల్లిస్తున్నది ఎవరు? వినియోగదారులైన ప్రజలు. ఆక్స్‌ ఫామ్‌ నివేదిక ప్రకారం కిందిస్థాయి 58శాతం ప్రజలు కేవలం 13శాతం ఆదాయంతో ఉన్నారు. అనగా అత్యంత తక్కువ ఆదాయం కలిగిన వాళ్ళు అత్యంత ఎక్కువ పన్నులు చెల్లించే పరోక్ష పన్నుల జాబితాలో ఉన్నారు. నిశితంగా గమనిస్తే సామాన్య ప్రజానీకం రెండు రకాల మోసాలకు గురవుతున్నారు. మొదటిది వారికి చెల్లించవలసిన వేతనం చెల్లించకుండా పెట్టుబడిదారులు మధ్యవర్తులు కొట్టేస్తున్నారు. రెండవది వారి నుండి పరోక్ష పన్నుల రూపంలో అధిక పన్నులు వసూలు చేస్తున్నారు. ఈ వాస్తవాన్ని గమనించకుండా ఉచితాల రూపంలో ప్రజలకు పంచి పెట్టడం నేరమని, అది దేశానికి ఘోరమని విపరీత అర్ధాలు తీయడం సరైంది కాదు. అయితే ఉన్నతాధి కారులు చెప్పిన మాటలు అవాస్తవమా? వారికి ఆ మాత్రం అవగాహన లేదా అని మన పాఠకులకు సందేహం రావచ్చు. ఈ బూర్జువా రాజకీయ పార్టీలతో పాటు అత్యంతపై స్థాయిలో ఉన్న బ్యూరోక్రాట్లు కూడా ‘’ట్రికిల్‌ డౌన్‌ థియరీ’’నే (పై వాడి కడుపు నిండిన తరువాత మిగిలిందే క్రింది స్థాయికి చేరాలనేది) నమ్ముతారు. ఎందుకంటే డబ్బు కొందరి చేతుల్లోనే ఉండాలి, ప్రజలకు సౌకర్యాలు అలవాటు కాకూడదు, అలవాటైతే వాటిని తీర్చడం ప్రభుత్వ బాధ్యత కాకూడదు అన్నది వారి ఆలోచన. ఇలా అమాయక ప్రజలకు ఇచ్చే ఆ నాలుగు రూపాయల మీద పడి బాధపడే కన్నా రాబడి మార్గాలను ఎందుకు పాటించడం లేదో ఈ బ్యూరోక్రాట్లు రాజకీయ నాయకులు సమాధానం చెప్పాలి. అనగా ప్రత్యక్ష పన్నుల వాటా పెరగాలి అంటే ఆదాయపన్ను చెల్లించే వారి సంఖ్య పెరగాలి. 6కోట్ల మంది పిఎఫ్‌ ఖాతాదారులు ఉన్నట్లుగా గణాంకాలు చెబుతుంటే 3.7కోట్ల మంది మాత్రమే వ్యక్తిగత ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేస్తున్నారని ఆదాయపు పన్ను అధికారులు తేల్చుతున్నారు. మరి ఈ వ్యత్యాసం ఏంటి? రిటర్నులు దాఖలు చేసిన వారిలోనూ నామ మాత్రపు పన్ను చెల్లించే వారి సంఖ్యే గణనీయం! దీనికి బాధ్యులెవరు? ఇక వ్యాపార వర్గాల నుండి ఆదాయపన్ను రాబట్టడానికి సమగ్రమైన ప్రణాళిక ఇంతవరకు లేదు. వ్యాపార లావాదేవీల్లో లాభాలను ఆర్జిస్తున్న అనేక మందిని పన్ను పరిధిలోకి తీసుకురావడంలో కేంద్రం పూర్తిగా విఫలమైంది. జీఎస్టీ విధానం అమలులోకి వచ్చాక జీరో వ్యాపారాలు పూర్తిగా తగ్గిపోయాయా? అనగా బిల్లులు రాయకుండా నమోదు చేయబడిన నగదు రూపంలోని వ్యవహారాల వల్ల ప్రభుత్వానికి పన్ను రాబడి తగ్గడం లేదా? ఈ వ్యవహారాల వల్ల తప్పుడు మార్గంలో ఎందరికో లబ్ధి చేకూరడం లేదా? వీటిపై అనేక సందర్భాల్లో మేధావులనేకులు హెచ్చరికలు చేసినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు ఏమాత్రం దృష్టి పెట్టవు. ఇక కూత నేర్చిన వారు (సంపన్నులు) రెండు రకాలుగా దేశాన్ని, ప్రజలను మోసం చేస్తున్నారు. ఒకటి, బ్యాంకుల్లో అత్యంత తక్కువ వడ్డీ రేటుకు రుణాలు పొందడం, వాటిలో కొంత భాగాన్ని మాఫీ చేయించుకోవడం లేదా ఎగ్గొట్టడం…! ప్రభుత్వం దీనికి బాహాటంగా సహకరించడం జరుగుతోంది!! రెండవది, టాక్స్‌ కన్సెషన్స్‌ (పన్ను మినహాయింపు)గా లక్షల కోట్ల రూపాయలను పొందడం. వీరికోసం కేంద్ర బడ్జెట్‌లో దాదాపు 15శాతం పన్ను మినహాయింపునకు పోతుంది… అంటే ఆరు లక్షల కోట్లు సగటున ప్రతి ఏటా వీరికి రాయితీగా ఇస్తున్నారు. కొందరు వ్యాపారస్తులూ, పారిశ్రామిక వేత్తలకు ఇచ్చే ఈ మొత్తం దేశంలోని అన్ని రాష్ట్రాలు కలిపి అమలు చేస్తున్న ఉచిత పథకాల కన్నా చాలా ఎక్కువ. దీనిపై జయప్రకాశ్‌ నారాయణ, ఇతర మేధావులు నోరు మెదపరెందుకు? ఎందుకంటే వీరు కూడా ఆ ట్రికిల్‌ డౌన్‌ థియరీనే ఇష్ట పడతారు. ఇక ఆదాయ పన్నును క్రమం తప్పకుండా చెల్లించే వేతన జీవులకూ ఈ ఉచితాలపై చాలా కోపం వస్తుంది. అయితే తమ నుండి బలవం తంగా,పన్ను మినహాయిం పులేవీ ఇవ్వకుండా, ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తున్న ప్రభుత్వా లపై కాకుండా, తాము పని చేసేందుకు ఆధారమౌతూ పేదరికంలో మగ్గు తున్న సామాన్యులపై కోపం రావడం సరికాదు. అందువల్ల, ప్రజల మూలుగుల్ని పీల్చి లాభాలు సంపాదిస్తున్న కార్పొరేట్లకు ఇచ్చే పన్ను మినహాయింపులూ,రాయితీల వల్ల ఆర్థిక వ్యవస్థకు నష్టం తప్ప, వీరి సరుకుల అమ్మకాలకూ, ప్రజల కొనుగోలు శక్తికీ ఆధారమవుతున్న చిన్న చిన్న ఉచిత పథకాల వల్ల కాదు.నిజానికి ఇది ఆర్థిక వ్యవస్థకు రక్త ప్రసరణలా పనిచేస్తుంది.