ఆదివాసీ సమస్యలపై అలసత్వం

ఆదివాసీ హక్కుల పరిరక్షణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలసత్వం ప్రదర్శిస్తున్నాయి. వారి సంక్షేమం కోసం రూపొందించిన చట్టాల అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. గిరిజనుల గ్రామసభలకు సర్వాధికారాలు దఖలుపరచే పంచాయతీరాజ్‌-షెడ్యూలు ప్రాంతాల విస్తరణ చట్టం (పీసా చట్టం- 1996) అమలులోకి వచ్చి 22 ఏళ్లు అయింది. గిరిజనులకు అడవిపై గల హక్కుల విషయంలో జరిగిన తప్పిదాలను సరిదిద్దే ఉద్దేశంతో అటవీ హక్కుల గుర్తింపు చట్టం అమలులోకి వచ్చి 12 ఏళ్లు గడుస్తోంది. గిరిజనుల సంప్రదాయ హక్కులు, జీవనోపాధి, పరిపాలన వంటి కీలకమైన అంశాలతో ముడివడివున్న ఈ చట్టాల అమలులో ప్రభుత్వ వ్యవస్థలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయి. ప్రధాన చట్టాలను బలవంతంగా రుద్దడంతో ఆదివాసుల పరిస్థితి గందరగోళంగా మారింది. ఈ పరిస్థితిని నివారించేందుకే గిరిజన సంప్రదాయాలను గౌరవించి, వారి పద్ధతులకు సముచిత ప్రాధాన్యమిచ్చేందుకు పీసా చట్టం ద్వారా గ్రామసభలకు అధికారాలు కల్పించారు. వాస్తవంలో అవి ఎండమావుల్ని తలపిస్తున్నాయి.
పసలేని చట్టం… పట్టని ప్రభుత్వంగ్రామసభలకు విశేష అధికారాలు
రెండు దశాబ్దాల క్రితం పీసా చట్టం కోసం దేశవ్యాప్తంగా గిరిజనులు పోరాడారు. 73వ రాజ్యాంగ సవరణతో 1991లో అమలులోకి వచ్చిన పంచాయతీరాజ్‌ చట్టాన్ని దేశమంతటా ఒకేరీతిన అమలు చేయడంతో గిరిజనుల్లో తీవ్ర నిరసన మొదలైంది. వారు ఉద్యమబాట పట్టారు. దీంతో కేంద్ర ప్రభుత్వం దిలీప్‌సింగ్‌ భూరియా నేత ృత్వంలోని ఓ కమిటీని నియమించింది. కమిటీ సిఫార్సులతో 1996 డిసెంబరులో పీసా చట్టాన్ని అమలులోకి తీసుకువచ్చారు. ఈ చట్టం ప్రకారం ఆదివాసీ ప్రాంతాల్లో గ్రామపంచాయతీని కాకుండా గ్రామసభను కేంద్రబిందువు చేశారు. గ్రామసభకు విశేషాధికారాలను కల్పించారు. ఒక ప్రాంతంలో నివసించే ఓటుహక్కు కలిగి ఉన్న నివాసితులంతా గ్రామసభ పరిధిలోకి వస్తారు. వీరు తాము నివసించే ప్రాంతాల చుట్టూ గల సహజ వనరులు, అటవీ సంపదపై యాజమాన్య హక్కులు కలిగి ఉంటారు. ఆ వనరులను స్వీయ అవసరాల కోసం వినియోగించుకుంటూ, గిరిజన సంప్రదాయ పరిరక్షణకు దోహదపడతారు. ఆయా గ్రామాల్లో, ప్రాంతాల్లో ఏర్పాటయ్యే పాఠశాలలు, వైద్య కేంద్రాల పర్యవేక్షణ బాధ్యతలను గ్రామసభలకు అప్పగించారు. అభివ ృద్ధి ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ, నష్ట పరిహారం పంపిణీ, గనుల తవ్వకాలకు సంబంధించిన లీజులు, సామాజిక, ఆర్ధిక అభివ ృద్ధి కార్యమ్రాలకు సంబంధించిన ప్రణాళికల రూపకల్పన, ఉప ప్రణాళిక నిధుల ఖర్చుకు సైతం గ్రామసభల అనుమతి తీసుకోవాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో లబ్ధిదారుల గుర్తింపు, చిన్న తరహా అటవీ ఉత్పత్తులపై యాజమాన్య హక్కులు, మద్యం అమ్మకాలు, వడ్డీ వ్యాపారాలపై నియంత్రణ, నీటివనరుల నిర్వహణ తదితర విషయాల్లోనూ గ్రామసభలకే సర్వాధికారాలు కల్పించారు. గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ అభివ ృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన జమాఖర్చుల ధ్రువపత్రాన్ని జారీ చేసే అధికారం సైతం గ్రామసభలకు ఉంటుంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2011లో చట్టంలో కొత్తగా కొన్ని నిబంధనలు పొందుపరచింది. గ్రామసభలకు సంబంధించిన ముఖ్యమైన విషయాలు ఇందులో ఉన్నాయి. వీటిని క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో వైఫల్యం కనపడుతోంది. 2013 సెప్టెంబరులో గిరిజన సంక్షేమ శాఖ జిల్లా, మండల, పంచాయతీల వారీగా గ్రామసభలను గుర్తించి, జాబితాను నోటిఫై చేసింది. అంతేతప్ప పీసా చట్టం అమలు ద్వారా క్షేతస్థాయిలో గిరిజనులకు జరగాల్సిన మేలు, లభించాల్సిన హక్కులపై శ్రద్ద చూపలేదు. అయిదో షెడ్యూలు ప్రాంత పరిధిలోకి వచ్చే పర్వత శ్రేణుల్లో బాక్సైట్‌ ఖనిజం తవ్వకాల విషయంలో అక్కడి డోంగ్రియా ఆదివాసులు ఒడిశా ప్రభుత్వంపై చేసిన న్యాయపోరాటం ఫలించడానికి పీసా గ్రామసభ దిక్సూచిగా నిలిచింది. 2013లో పీసా చట్టం ప్రకారం అక్కడి గ్రామసభల అనుమతులు తీసుకున్నాకే ఖనిజ తవ్వకాలు చేపట్టాలని సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వడంతో గ్రామసభలు కీలకమయ్యాయి.
గడచిన రెండు దశాబ్దాల్లో పీసా అమలు తీరుతెన్నులను విశ్లేషించేందుకు ఉన్నతస్థాయి కమిటీని నియమించారు. ఆదివాసీ ప్రాంతాల్లో చట్టాన్ని పటిష్ఠంగా అమలు చేస్తే ప్రభుత్వ వ్యవస్థలపై గిరిజనులకు నమ్మకం పెరుగుతుందని ఆ కమిటీలు పేర్కొన్నాయి. భూసేకరణ, గనుల తవ్వకాల లీజులు వంటి విషయాల్లో గ్రామసభలను విస్మరించడం వల్ల ఆదివాసుల్లో అసంత ృప్తి, అశాంతి పెచ్చరిల్లుతాయని హెచ్చరించాయి. 2005నాటి రెండో పాలన సంస్కరణల సంఘం, తీవ్రవాద ప్రాంతాల్లో అభివ ృద్ధి, సవాళ్లపై 2008లో ఏర్పాటైన ప్రణాళికా సంఘ నిపుణుల కమిటీ, చిన్నతరహా అటవీ ఉత్పత్తుల యాజమాన్యం అంశంపై ఏర్పాటైన ఎ.కె.శర్మ కమిటీ, నిర్వాసిత సమస్య, అభివ ృద్ధి అంశాలపై అధ్యయనం చేసిన రాఘవచంద్ర కమిటీలతో పాటు, యూపీఏ ప్రభుత్వంలోని జాతీయ సలహా మండలి- పీసా చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పాయి. అయిదేళ్ల క్రితం అప్పటి జాతీయ సలహా మండలి ‘గ్రామసభ’ నిర్వచనానికి స్పష్టత తీసుకొస్తూ సవరణ బిల్లును సైతం రూపొందించింది. ఆ తరవాత వచ్చిన ప్రభుత్వాలు దీనిపై శ్రద్ధ చూపలేదు. ఆదివాసీ ప్రాంతాల్లో భూములు, గనులు, అడవులు, ఇతర సహజ వనరుల ఇష్టారాజ్య దోపిడిని అడ్డుకునేందుకు గొప్ప ఆయుధంగా పీసా చట్టం దోహదపడుతుందన్న ఆశలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉదాసీన వైఖరితో అడియాశలయ్యాయి. చాలా రాష్ట్రాలు చట్టం అమలుకు సంబంధించి కనీసం కార్యనిర్వాహక యంత్రాంగాలను ఏర్పాటు చేయలేదు. 1996లో కేంద్రం అమలులోకి తీసుకొచ్చిన చట్టంలో తమ రాష్ట్రాల్లోని గిరిజనుల కట్టుబాట్లు, వనరుల యాజమాన్యంలో సంప్రదాయ పద్ధతులకు అనుగుణంగా మార్పులు చేపట్టవచ్చని పేర్కొనడాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సాకుగా తీసుకున్నాయి. కేంద్ర చట్ట స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాలు చట్టాన్ని అన్వయించు కోవడంతో దాని స్వరూపమే మారిపోయింది. ఉదాహరణకు షెడ్యూలు ప్రాంతాల్లో ఏదైనా అభివ ృద్ధి ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ కోసం ముందు గ్రామసభలను సంప్రతించాలి. ఆ ప్రాజెక్టు వల్ల నష్టం అనర్ధం వాటిల్లక ముందే నష్ట పరిహారం, పునరావాసం కల్పించాలని కేంద్ర చట్టం చెబుతోంది. ఈ నిబంధనను కొన్ని రాష్ట్రాలు మార్చేశాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రూపొందించిన పీసా చట్టంలో భూసేకరణకు ముందు మండల పరిషత్‌లను సంప్రతించాలని పేర్కొంది. అంతేకాక అభివృద్ధి ప్రాజెక్టుల ప్రణాళికలు, పర్యవేక్షణ రాష్ట్ర ప్రభుత్వం అజమాయిషీలో ఉండేలా మార్పులు చేసింది. రaార?ండ్‌ రాష్ట్రం తీసుకువచ్చిన చట్టంలో అసలు ఈ వెసులుబాటే లేకుండా చేశారు. భూసేకరణకు ముందు తాలూకా పంచాయతీలను సంప్రతించాలని గుజరాత్‌ చట్టం చెబుతోంది. జిల్లా పంచాయతీ, రెవిన్యూ అధికారుల అజమాయిషీలో భూసేకరణ జరిగేలా ఒడిశా ప్రభుత్వం చట్టంలో మార్పులు చేసింది. గనుల లీజులు, నీటి పారుదల నిర్వహణ, అటవీ ఉత్పత్తుల యాజమాన్యం…ఇలా అనేక అంశాల్లో కేంద్ర చట్టం స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాలు తమ చట్టాల్లో మార్పులు చేశాయి. ప్రధాని నరేంద్రమోదీ ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మాట్లాడుతూ 2022 నాటికి నూతన, శక్తిమంతమైన భారతదేశాన్ని నిర్మించే లక్ష్యంతో వ్యూహ ప్రణాళికను ప్రకటించారు. ఇందులో భాగంగా దేశంలో వామపక్ష తీవ్రవాదం అధికంగా గల 115 జిల్లాల సామాజిక, ఆర్థిక, పరిపాలన పరమైన అభివ ృద్ధిపై ద ృష్టి సారిస్తామని వెల్లడిరచారు. ఈ జిల్లాలకు కేంద్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి హోదాలోని అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించడానికి కార్యాచరణ సిద్ధమైంది. గాయం ఒక చోట అయితే మందు మరో చోట పూస్తున్నట్టుగా ప్రభుత్వ వ్యవహారశైలి ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దేశంలో అత్యంత వెనకబాటుకు గురవుతున్న జిల్లాలు అన్నీ దాదాపుగా ఆదివాసులు నివసిస్తున్న ప్రాంతాలే. ఈ ప్రాంతాల్లో వామపక్ష తీవ్రవాదం ఉనికి బలంగా ఉంది. అటవీ వనరులపై హక్కులు కల్పించి, గ్రామసభల స్థాయిలో పరిపాలన పరమైన సామర్థ్యాన్ని పెంచినప్పుడే గిరిజనుల్లో నిజమైన సాధికారత సాధ్యమవుతుంది. విద్య, వైద్యం, రహదారులు, విద్యుత్‌ వంటి మౌలిక సౌకర్యాల కల్పనలో గ్రామసభలను మమేకం చేయాల్సిన అవసరం ఉంది. పంచాయతీ రాజ్‌ చట్టం మాదిరే మున్సిపల్‌ చట్టాన్ని గిరిజన ప్రాంతాలకు విస్తరించాలనే ప్రతిపాదన దశాబ్దకాలంగా కాగితాలకే పరిమితమైంది. దీంతో గిరిజన ప్రాంతాల్లో అధిక జనాభా ఉన్న పంచాయతీలను పురపాలక సంఘాలుగా మార్చడానికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. పీసా, అటవీ హక్కుల గుర్తింపు చట్టంతోపాటు రాజ్యాంగంలోని అయిదో షెడ్యూలు నిబంధనలను అమలు చేయడానికి రాష్ట్రాల్లో వ్యవస్థాగత యంత్రాంగం లేదు. ఈ చట్టాలకు సంబంధించిన నిబంధనలపై అవగాహన కల్పించే, అమలు తీరును పర్యవేక్షించే యంత్రాంగాలూ లేవు. తగినంత మంది సిబ్బంది లేరు. నిధులూ కొరవడ్డాయి. పీసా చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసే దిశగా ప్రభుత్వాలు చురుకందుకోవాల్సిన తరుణమిది. క్షేత్రస్థాయిలో సత్ఫలితాలు ప్రతి ఒక్కరికీ అందినప్పుడే చట్టానికి సార్థకత ఉంటుంది!- జి.ఎన్‌.వి.సతీష్‌