ఆదివాసీల అన్యాయంపై..ఊరాటనిచ్చిన సుప్రీం కోర్టు స్టే’

ఆదివాసీలు తరతరాలుగా అడవులపై గిరిజనులు వారసత్వపు హక్కు సహజంగానే అనుభవిస్తూ వస్తున్నారు. అడవులను ఆదాయ వనరులుగా ప్రభుత్వాలు గుర్తించడం ప్రారంభించనప్పటి నుంచి అటవీ వినియోగం నుండి గిరిజనులను దూరం చేయడం మొదలైంది. వారి సాంప్రదాయక హక్కులు హరింపజేస్తూ ఎన్నో చట్టాలు రూపొందించడం జరిగింది. అటవీ సంరక్షణ, క్రమబద్దీకరణ పేరుతో వారి హక్కులు కాలరాసి రాయితీలు కల్పిస్తూ నియమాలు రూపొందించారు. దేశవ్యాప్తంగా అటవీ భూవనరులపై హక్కుకోసం ఆదివాసీల పోరాటం సలిపారు. ఫోరాట ఫలితంగా ది షెడ్యూల్‌ ట్రైబ్స్‌ ఇతర సాంప్రదాయక అటవీ నివాసుల అటవీహక్కుల గుర్తింపు చట్టం`2006 నెం.2/2007ను భారత పార్లమెంట్‌లో 2006, డిసెంబరు 15న ఆమోదం పొందింది. అయినా సరే దీని అమల్లో ఆదివాసీ ప్రజలకు అన్యాయం జరుగుతూనే వస్తోంది. ఈ చట్టం ఆదివాసీలకు అటవీ భూములపై వ్యక్తిగత, కమ్యూనిటీ హక్కులతోపాటు అటవీ వనరులపై కూడా హక్కును కల్పిస్తుంది. చట్టం తీసుకువచ్చినప్పటికీ ఇది సక్రమైన రీతిలో అమలుకు నోచుకోవడం లేదు. దీనిఅమలుపట్ల పర్యావరణ పరిరక్షణ, అటవీశాఖ విభాగం సవితితల్లి ప్రేమగా చూపుతున్నారు. ఈనేపధ్యంలో చట్టం అమలుపై మరో ఘోరమైన పిడుగు పడిరది.
ఫిబ్రవరి 13వ తేదీన కేంద్ర ప్రభుత్వం 21 రాష్ట్రాలకు సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలు ఆదివాసీలు ఆందోళనకు గురయ్యారు. అడవులు ఆక్రమణకు గురవుతున్నాయని..అడవుల్లో అక్రమంగా నివసిస్తున్నవారి కారణంగా వన్యప్రాణి సంరక్షణ ప్రమాదంలో పడుతోందని వైల్డ్‌ లైఫ్‌ యాక్టివిస్ట్‌లు న్యాయస్థానాలను ఆశ్రయించిన కారణంగా11.8లక్షల ఆదివాసీలను తొలగించాలని సుప్రీం కోర్టు మధ్యంతరఉత్తర్వులిచ్చింది. అటవీ హక్కుల చట్టం అనేది అనాదిగా అరణ్యాల్లో నివసిస్తున్నవారికి భూమిపై హక్కు కల్పించడానికి ఉద్దేశించిందే కానీ..భూపంపిణీ, వితరణకు ఉద్దేశించింది కాదని పిటిషనర్లలో ఒకరైన వైల్డ్‌ లైఫ్‌ ట్రస్ట్‌కు చెందిన ప్రవీణ్‌ భార్గవ్‌ నివేదించారు. దీనికి కారణం కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని కాపాడలేకపోవడమేనని వారు పలువురు మేధావులు అభియోగాలు. ఏజెన్సీలో అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయకుండా అటవీశాఖ అధికారులు తూట్లు పొడిచి నిర్వీర్యం చేశారు. ఇది అటవీశాఖ అధికారులు, రాష్ట్ర,కేంద్రప్రభుత్వాల వైఫల్యమేనని పలువురు భావిస్తున్నారు. గతంలో 2002, 2004 మధ్య అటవీ ఆక్రమణలను నిరోధించేందుకుగాను సుమారు 3 లక్షల మందిని అడవుల నుంచి ఖాళీ చేయించారని ఈ వ్యవహారాలపై అధ్యయనం చేసే సీఆర్‌ బిజోయ్‌ ప్రకటించారు. ఆసమయంలో అకృత్యాలు జరిగాయని.. ఇళ్లను తగలబెట్టారని, పంటలను ధ్వంసం చేశారని, పోలీసుల కాల్పుల్లో ఎంతోమంది మరణించారని బిజోయ్‌ వెల్లడిరచారు. అడవుల్లో నివసించేవారికి మొదటి నుంచి యాజ మాన్య హక్కులు పత్రసహితంగా లేకపోవడం, చట్టప్రకారం కల్పించాలన్నా కూడా అది అధికారులపై ఆధారపడి ఉండడంతో చాలామంది అనాదిగా అరణ్యాల్లోనే నివశిస్తూ, ఆక్రమణదారులుగా మిగిలిపోతున్నారని బిజోయ్‌ నివేదిక వెల్లడిస్తోంది. దీంతో గిరిజనులు ఎంత దుర్బల జీవితం గడుపుతున్నారో అర్ధమవుతుంది. దేశవ్యాప్తంగా దట్టమైన అడవుల్లో పరవళ్లు తొక్కే నదులు..ఇనుము, బాక్సైట్‌ ఖనిజ నిక్షేపాల మధ్య బతికే గిరిజనులు ఇప్పటికే గనులు, ఆనకట్టలు, కర్మాగారాల కోసం తమ ఇళ్లను, భూములను కోల్పోయారు. ఇప్పుడు కోర్టు తీర్పు మేరకు ఇల్లూపొల్లూ వదిలి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది చాలు వారు ఎంత దుర్బల, దుర్భర పరిస్థితుల్లో ఉన్నారో చెప్పడానికి.
అడవి బిడ్డలకు ఊరటనిచ్చిన సుప్రీం స్టే
అటవీప్రాంతాల నుండి ఆదివాసీలను తొలగించాలన్న ప్రభుత్వ ఆదేశాలపై సుప్రీం కోర్టు ఫిబ్రవరి 21న (గురువారం) స్టే ఇచ్చింది. సుప్రీం కోర్టు తీర్పు అడవి బిడ్డలకు ఊరటనిచ్చింది. ఫిబ్రవరి 13వ తేదీన కేంద్ర ప్రభుత్వం 21 రాష్ట్రాలకు ఇచ్చిన ఆదేశాలను సుప్రీం కోర్టు ఈ రోజు నిలిపేసింది. అడవి బిడ్డల వాదనలను తోసిపుచ్చుతూ అవలంబించిన కేంద్ర ప్రభుత్వ విధానాలను వివరంగా అఫిడవిట్‌లో దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఆదివాసీలను అడవుల నుండి తొలగించాలని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను నిలుపుదల చేయాలని కోరుతూ.. దాఖలైన పిటిషన్‌ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ తీర్పు చెప్పింది. ఇన్నేళ్లుగా నిద్ర పోతున్నందుకు కేంద్ర ప్రభుత్వాన్ని మందలించింది. కేంద్ర ప్రభుత్వం తరఫున జాప్యం జరిగిందని సాలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా అంగీకరించడంతో మీరు ఇప్పుడే నిద్ర లేచారా..అని కేంద్ర ప్రభుత్వంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీం కోర్టులో రాష్ట్రాలు దాఖలు చేసిన అఫిడవిట్ల ప్రకారం..షెడ్యూల్డ్‌ తెగలు, అటవీ హక్కుల చట్టం కింద ఇతర సంప్రదాయ అటవీ నివాసులతో సుమారు 11,72,931 (1.17 మిలియన్‌) ఎకరాల భూమి, భూ యాజమాన్యం హక్కుల వాదనలు, వివిధ కారణాలపై తిరస్కరించబడ్డాయి. ఈ భూమి కనీసం మూడు తరాల నుండి వారి స్వాధీనంలో ఉన్నట్టు నిరూపించలేక పోయినవారు ఉన్నారు.రాష్ట్ర ప్రభుత్వాలు తమ సొంతచట్టాల ప్రకారం..ఆ భూములను ఖాళీ చేయించాలని ఫిబ్రవరి 13న జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, జస్టిస్‌ నవీన్‌ సిన్హా, జస్టిస్‌ ఇందిరా బెనర్జీల బెంచ్‌ ఆదేశించిన విషయం విధేతమే. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆదివాసులకు అన్యాయాలు జరగకుండా షెడ్యూల్లో పొందుపరిచిన రాజ్యాంగపరమైన చట్టాలను సమర్ధవంతంగా అమలు పర్చడానికి చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఆదివాసీ అన్యాయాలు జరగకుండా వారి అభివృద్ధికి కృషి చేయాల్సిన అవశ్యకత ఉంది !- ర‌వి రెబ్బాప్ర‌గ‌డ‌,ఎడిట‌ర్‌