అడవి బిడ్డల బ్రతుకు చిత్రం అనంత యానం

ఒకప్పుడు మౌఖిక సాహిత్యంకే పరిమితమైన… మన ఆదివాసీ సాహిత్యం… అక్షరాస్యతలో వచ్చిన అభివృద్ధిలో భాగంగా .. వివిధ ప్రక్రియలలో పుస్తకాల రూపంలో… వస్తూ ప్రామాణికతకు చోటుచేసు కుం టుంది, ఈ గిరిజన సాహిత్యంలోని… పుస్తకాల వివరాలను ‘‘గవాక్షం’’ శీర్షికన… ‘‘థింసా పాఠకుల’’ కోసం ప్రతి నెల ఒక పుస్తకాన్ని పరిచయం చేస్తున్న పరిశోధక రచయిత డా. అమ్మిన శ్రీనివాసరాజు గారు ప్రముఖ రచయిత ‘‘ గుమ్మడి లక్ష్మీనారాయణ’’ కలం నుంచి జాలువారిన ‘‘ అనంత యానం ’’ అనే పుస్తకంపై సమీక్షడా. అమ్మిన శ్రీనివాసరాజు
అడవి బిడ్డల బ్రతుకుచిత్రం అనంతయానం నేటి ఆధునిక తెలుగు సాహిత్యంలో అంత ర్భాగం అవు తున్న గిరిజన సాహిత్యం ప్రారం భంలో మౌఖికంగా తర్వాత కాలంలో ఆంత్రోపాలజిలో ఒక భాగంగా ఉండేది అనంతర కాలంలో విశ్వవిద్యాలయ స్థాయిలో పరిశోధనలకు ఎంతో ప్రధాన వస్తువుగా ఉన్న ఈ గిరిజన సాహిత్యం నేడు ఎంతో పరిణితి చెంది ప్రామాణిక దశకు చేరుకుంది. ప్రభుత్వాల లక్ష్య శుద్ధి తో గిరిజన యువతలో అక్షరాస్యత శాతం దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉద్యోగులుగా రచయితలుగా ఎదుగు తున్న శుభ తరుణం ఇది. అందులో భాగం గానే ఆదివాసి తొలి వ్యాసకర్తగా చరిత్రలో నిలిచిన ఆధ్యాపక రచయిత గుమ్మడి లక్ష్మీ నారాయణ కలం నుంచి వెలువడిన వ్యాస సంపుటి ఈ ‘‘అనంతయానం’’
సుమారు పాతికేళ్లపాటు ఆయన చేసిన అక్షర ప్రస్థానంలో అనేక ప్రామాణిక వ్యాసాలు వెలు వడ్డాయి,ఇవి అడవిబిడ్డలచరిత్ర,సంస్కృతి, సమకాలీన సమస్యలు,విద్య ఉద్యోగ ఆరోగ్య అంశాలు,సామాజిక జీవన పోరాటాలు,ఆధ్యా త్మిక సంబరాలు,తదితర అంశాలుగా విభజిం చబడి కూలం కశంగా సవివరమైన ప్రామా ణిక గణాంకాలతో పొందు పరచబడ్డాయి. ఇటు సమాచారానికి అటు పరిశోధనలకు ఎంతో ఉపయోగంగా ఉండే ఈగిరిజన వ్యాస రత్నాలన్నిటిని ఒకచోట రాసి పోసి అందించి నట్టు పుస్తక రూపంలో వెలువరించిన వ్యాస రచయిత గుమ్మడి లక్ష్మీనారాయణగారి అక్షర కృషి అభినందనీయం ఆచరణీయం.నిరంతర పరిశీలన అధ్యయనంద్వారా తన జాతి జనుల అభివృద్ధి కోసం రచనల పరంగా గుమ్మడి గారి కృషిలో ఆవేదన అడుగడుగునా అర్పి స్తుంది,తన జాతికి చెందిన మరుగునపడ్డ వీరుల వివరాలు గురించి గతంలో వివరిం చిన ఈరచయిత ఇప్పుడు అదే బాణిలో తన జాతి సంస్కృతిలోని చరిత్ర పుటలు తిరగేస్తూ అనేక ఆసక్తికర విషయాలు ఆవిష్కరించారు.
ఇప్ప చెట్టుకు,పచ్చబొట్టుకు,అడవి బిడ్డలతో గల అనుబంధం గురించి ఇందులో ఎంతో శాస్త్రీయంగా చారిత్రకంగా తెలిపారు.వారి పెళ్లిళ్లలోని నిరాడంబరత సంస్కృతిని ప్రతిబిం బించే నృత్యం సొగసులు గురించి చెబుతూ ఆదిమ గిరిజనులు అంటే ఆదివాసీలే అని సూత్రీకరించారు,అంతటితో ఆగకుండా అడవి బిడ్డలను ఆత్మ గౌరవ ప్రతీకలు అని నిరూ పించారు.
ఇంతటి ప్రాధాన్యత గల ఈ ఆదివాసీలు నాటి నిజాం కాలం నుంచి నేటి ప్రజాస్వామ్య ప్రభు త్వాల దాకా ఎదుర్కొన్న బాధల గురించి వివరించారు. అంతేగాక ఆదరణ కోల్పోతున్న ఆదివాసి వైవిధ్యం గురించి కూడా చర్చించారు.ఆదివాసుల భూసంరక్షణ కోసం ప్రతిష్టా త్మకంగా ఏర్పాటు చేసిన 1/70 చట్టంకు సంబంధించిన పూర్వ చరిత్ర దాని నిర్మాణం అనంతర కాలంలో దాని అమలులో అధికా రులు,గిరిజనేతరులు చేస్తున్న కుతం త్రాల కారణంగా చట్టం వల్ల ఆదివా సులకు జరుగు తున్న నష్టం అరణ్య రోదనగా అభివర్ణి స్తూ అధికారులను ఆలోచింపజేశారు.అలాగే అటవీ హక్కుల చట్టం,పెసా,గిర్‌గ్లాని,నివేదిక లు తదితర అంశాల గురించి వివరించిన విషయాలవల్ల వ్యాస రచయిత పరిశీలన, ఆవేదన,కూలంకషంగా అర్థమవుతాయి. బహుళ ప్రజాదరణ పొందిన గిరిజన చట్టాల వివరణతో పాటు అంతగా ప్రాచుర్యం పొందని ‘1960చట్టం’వివరణతో అమాయక గిరిజనులు వడ్డీవ్యాపారుల బారినపడ కుండా ఎలా రక్షణ కలిగిస్తుందో దీనిలో వివరిస్తూ ఏజెన్సీలో రెడ్డి వ్యాపారుల అక్రమాలు గురిం చిన వివరణ తెలిపారు వ్యాసకర్త. అలాగే పోలవరం నిర్వాసితుల గోడు గురించి చెబుతూనే గిరిజనుల అభివృద్ధి కోసం విడు దల చేస్తున్న నిధులకు అవినీతి చెదలు ఎలా పడుతున్నాయో వివరిస్తూ స్వయం పాలన, రాజకీయ చైతన్యం,గిరిజనుల రాజ్యాంగ రక్షణలు,ఐదవ షెడ్యూల్‌,గురించిన వివరణతో పాటు ఆదివాసీల స్వయం పాలనకు‘‘పెసా చట్టం’’ఎలా ఉపకరిస్తుందో తగు వివరణ అందించారు. ఇంద్రవెల్లి సంఘటనను గోండులకు మాయని గాయంగా గుర్తుచేస్తూనే అడవి బిడ్డల హక్కుల గురించి వివరించారు. తెలంగాణ రాష్ట్రవృక్షంగా,విప్ప చెట్టును ప్రక టించాలనే డిమాండ్‌ గట్టిగానే వినిపించారు. ఇక అడవి బిడ్డల ఆధ్యాత్మిక విషయాలకు వస్తే,నాగోబా,వంటి కుల దేవతల గురించే గాక సమ్మక్క సారక్క గుండం రామక్క, జంగుబాయి,ముసలమ్మ,వంటి వీరవనితల ప్రస్తావన తీసుకువచ్చారు,కోయిల మాఘ పున్నమి గోవులు దండారి పాండవుల ఏడు బావుల జలపాతం గురించి వివరణ చేస్తూనే అసలు ఆదివాసీలది ఏమతం? అనే ప్రశ్నను వివరించిన వైనం ఉపయుక్తంగా ఉంది.
నేటి ఆధునిక గిరిజన సమాజంకు అందుతున్న విద్యా ఉద్యోగ ఆరోగ్యం గురించిన వ్యాసపరం పరలో రచయిత ఆవేదన అర్థమవుతుంది, ఏజెన్సీలో నిర్వహించబడుతున్న విద్యా విధా నం అంతరించిపోతున్న ఆదిమ భాషలో వాటిని కాపాడాల్సిన బాధ్యతలు గిరిజనులకు మాతృభాషలో విద్యాభ్యాసం అందించాల్సిన అవసరం ఆన్లైన్‌ విద్యద్వారా సమాచార వ్యవస్థకు అల్లంత దూరాన ఉండే ఆదివాసీ సమాజానికి జరుగుతున్న నష్టాలను సహేతు కంగా వ్యాస రచయిత అందించారు. రాజ్యాంగం ప్రకారం గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్లు పెరుగుతున్నప్పటికీ అది అసలైన ఆదివాసీల దరి చేరడం లేదనే విషయాన్ని కూడా సవివరమైన గణాంకాలతో వివరంగా అందించారు, ప్రభుత్వాలు,రాజకీయ పక్షాలు, ఆదివాసీల హక్కులకు రిజర్వేషన్లకు ఆటంకం కలిగించే శక్తులను గురించి రక్షణ కల్పిం చాల్సిన తక్షణ కర్తవ్యాన్ని గుమ్మడి తన వ్యాసాక్షరాల గుండా నిర్ధారించారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోనే గిరిజన జాతులపై జరిగిన జరుగుతున్న దాడులు సామూహిక హత్యల గురించి సభ్య సమాజానికి కూడా తెలియడం లేదని ఇలాంటి దాడులకు కారకులైన వారిపై చట్టపరమైన చర్యలు తక్షణం తీసుకోవాల్సిన అవసరాన్ని పాలకులకు హెచ్చరిక వంటి సందేశాన్ని ఇందులో ఉటంకించారు, వాస్తవానికి అతి ప్రాచీన కాలానికి చెందిన ఆదిమ జాతులైన ఆదివాసీలను ప్రామాణి కంగా చారిత్రకంగా గుర్తించలేదని కేవలం వారిలోని నిరక్షరాస్యత కారణంగా వారి ఉత్కృష్టమైన చరిత్ర సంస్కృతులు మరుగున పడిపోతున్నాయి, కానీ వారిదైనా చిత్రలిపి పడిగెలు మౌఖిక సాహిత్యాల ద్వారా వారి అమూల్యమైన చరిత్రను నిక్షిప్తం చేసుకున్నారనే పరిశోధనాత్మక అంశాలను ఇందులో పొందుపరిచారు రచయిత లక్ష్మీనారాయణ. ప్రధాన వ్యాసావళికి అనుబంధంగా అందిం చిన అనుబంధంలో కూడా చాలా విలువైన విషయాలు పొందుపరిచారు పుస్తక రచయిత ఆదివాసీల పోరాట విజయాలకు ప్రతీక అయి నా మేడారం సమ్మక్క సారక్క జాతర గురిం చిన చారిత్రిక విజయాలు జాతర పరాయి కరణ అవుతున్న తీరు. ఆదిలాబాద్‌ ప్రాంతా నికి చెందిన గోండులు ఆరాధ్య దైవంగా భావించే ‘‘జంగుబాయి’’ని వారు ఆరాధించే వైనం,వింత ఆచారాలు గురించిన సమాచారం మనం ఇందులో చదవవచ్చు. నేటి ఆధునిక ఆదివాసీ సమాజంలో ఆదివాసి యువత సాధించిన విజయాల స్ఫూర్తిగాథలు సైతం ఇందులో అందించడం ద్వారా నేటి గిరిజన యువత సాధించిన ప్రగతి ప్రపంచానికి తెలుస్తుంది ఇలా ప్రతి విషయం ప్రామా ణికంగా అక్షయకరించిన ఈ గిరిజన వ్యాసాలు భావితరం పరిశోధకులకే కాక గిరిజన సాహిత్య వికాసానికి ఎంతగానో ఉపకరిస్తాయి.ఎంతో విలువైన గిరిజన జాతి సమాచారం సేకరించి పుస్తక రూపంగా అక్షరబద్ధం చేసిన రచయిత అక్షర కృషి వెలకట్టలేనిది.
అనంత యానం (వ్యాస సంపుటి) రచయిత : గుమ్మడి లక్ష్మీనారాయణ పేజీలు : 226 వెల : రూ 300/- ప్రతులకు : రచయిత `9491318409 సమీక్షకుడు : డా:అమ్మిన శ్రీనివాసరాజు సెల్‌ : 7729883223.

సమ్మక్క సారక్కల చారిత్రిక వీరగాధ పోరుగద్దే మేడారం

ఒకప్పుడు మౌఖిక సాహిత్యంకే పరిమితమైన… మన ఆదివాసీ సాహిత్యం… అక్షరాస్యతలో వచ్చిన అభివృద్ధిలో భాగంగా .. వివిధ ప్రక్రియలలో పుస్తకాల రూపంలో… వస్తూ ప్రామాణికతకు చోటుచేసు కుం టుంది, ఈ గిరిజన సాహిత్యంలోని… పుస్తకాల వివరాలను ‘‘గవాక్షం’’ శీర్షికన… ‘‘థింసా పాఠకుల’’ కోసం ప్రతి నెల ఒక పుస్తకాన్ని పరిచయం చేస్తున్న పరిశోధక రచయిత డా. అమ్మిన శ్రీనివాసరాజు గారు ప్రముఖ రచయిత ‘‘జయధీర్‌ తిరుమల రావు’’ కలం నుంచి జాలువారిన ‘‘ వీరుల పోరు గద్దె మేడారం’’ అనే పుస్తకంపై సమీక్ష -డా. అమ్మిన శ్రీనివాసరాజు
ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసి జన జాతరగా చరిత్రలో నిలిచిన మేడారం జాతరకు కారకురాలైన గిరిజన వీరవనిత ‘‘సమ్మక్క’’కు సంబంధించిన సంపూర్ణ చరిత్ర గాని, దానికి ఆధారమైన శాసనాలు, ఇతర ఏ ఆధారాలు ప్రామాణికంగా ఇంతవరకు ఎక్కడా లభ్యం కాలేదు. మరి అంత పెద్ద సంఘటనకు సాక్ష్యం గిరిజనుల విశ్వాసం,వారి పూర్వీకుల నుంచి మౌఖిక రూపంలో అందిన పుక్కిట పురాణ గాథలే..! సమ్మక్క పుట్టుక,జీవనం,వీర మరణాలకు సంబంధించి వివిధ కథనాలు వినిపిస్తూ కొన్ని తేడాలు అనిపిస్తున్న. అన్ని కథనాలు కాకతీయ ప్రభువు ప్రతాపరుద్రుని కేంద్రంగా తీసుకుని నడుస్తు న్నాయి. అయితే కాకతీయుల చరిత్రకు సంబంధించిన ఏశాసనాలు గ్రంథాలలో మేడారం సమ్మక్క ప్రస్తావనగాని,జరిగిన పోరాటం గురించి గానీ,ఉఠంకించబడలేదు. అంత పెద్ద కాకతీయ రాజ్యంలో మేడారం ప్రస్తావన, ఆనాటి వారికి అత్యంత చిన్న విషయం అయి ఉండవచ్చు. ఇక గిరిజనులు నిరక్షరాస్యులు కావడం చరిత్రలను భద్రపరు చుకునే శక్తి లేకపోవడం వంటి కారణాలతో నేటి ఇంత పెద్ద జన జాతరకు ఆనాటి చరిత్రలో చిరు స్థానం కూడా దక్కలేదు. అర్థ శతాబ్ద కాలం క్రితం ఈ మేడారం సమ్మక్క జాతర కేవలం కొన్ని గిరిజన కుటుంబాలకే పరిమితమై స్థానిక గిరిజన జాతర పండుగ మాత్రమే. ఇటీవల ఈజన జాతర విశ్వవ్యాప్తం కావడంతో అందరి దృష్టి దీని మీద నిలిచింది, దానితో ఊహాత్మకమైన కథలు,రచనలు,పాటలు,సినిమాలు,రావడం మొదలయ్యాయి. ఏ విశ్వవిద్యాలయాలు గాని ఇంతవరకు ప్రామాణికమైన పరిశోధనలు అందించలేదు. ఆ లోటు తీర్చే సంకల్పంతోనే ప్రముఖ రచయిత, గిరిజన సాహితీవేత్త, జయధీర్‌ తిరుమలరావు ఎంతో శ్రమతో తన క్షేత్ర పర్యటనల సాయంగా పూర్వ ఖమ్మం జిల్లా మణుగూరు మండలంలోని తోగ్గూడెం గ్రామానికి చెందిన డోలి వారితో పడిగె సాయంతో సకిన రామచంద్రయ్య బృందంతో గానం చేయించిన ‘‘సమ్మక్క సారలమ్మల వీర గాధ’’ను పుస్తక రూపంలో ప్రచురించారు. తరాలతరబడి డోలి కళాకారుల ద్వారా పాటల రూపంలో ప్రదర్శించబడుతున్న ఈ మౌఖిక సాహిత్యంకు అక్షర రూపం కలిగించటం అభినందనీయం ఉపయోగకరం. 136 పేజీల ఈ ఉపయుక్త పుస్తకంలో విషయం పాటల రూపంలో ఉన్న, వాటి దిగువ అందించిన వచన సమాచారం,కొన్ని గిరిజన భాష మాటలకు పాద సూచికల రూపంలో అందించిన వివరణతో సంపూర్ణ సమాచారం తెలుస్తుంది. గిరిజనులు పరమ పవిత్రంగా భావించి,పూజించే,‘‘పడిగె’’ సాయంగా ఈ వీర గాధ వివరించారు.కోయ వారి చరిత్రకు శాసనాల వంటివి ఈ పడి గెలు, త్రికోణకారంలో గుడ్డలతో తయారు చేయబడే వీటి మీద వివిధ రంగులు ఆకారా ల్లో చిత్రించబడే గుర్తులు ద్వారా ఆయా చరిత్రలకు సంబంధించిన గోత్రాలు గోత్రపు పురుషుడు ఇంటిపేర్లు ప్రాంతాలు వాహనాలు పోరాటాలు మహిమలు అన్ని చిన్నచిన్న రేఖా చిత్రాల రూపంలో ఈ పడిగెల మీద ఉంటా యి. వాటి సాయంగా డోలి వారు ఆయా చరిత్రల గాథలను చర్మ వాయిద్యం ఆయన ‘‘డోలు’’ వాయిస్తూ గేయ కథా రూపంలో గానం చేస్తూ ఉంటారు. గిరిజనుల ఆశ్రిత కులం వారైనా ఈ డోలీలను గిరిజనుల చరిత్ర గురువులుగా,పూజారులు,అడ్డెలు,గా ఇందులో అభివర్ణించారు. అభిప్రాయాలు మొదలు పాద సూచికల వరకు 8 విభాగాలతో పాటు అనుబంధంగా ప్రధాన సంపాదకుని అను భవాలు, చిత్రాలతో ఈ పుస్తకాన్ని పొందు పరిచారు. ప్రతి విభాగంలో ఎంతో విలువైన అనుభవైఖ్యమైన సమాచారం అందించారు. ముఖ్యంగా సమ్మక్క వంశవృక్షం దీనిలో ప్రాధాన్యత సంతరించుకుంది నాలుగో గట్టు కోయరాజులైన సాంబశివరాజు-తూలుముత్తి దంపతుల ఐదుగురు సంతానంలో పెద్ద కుమార్తె సమ్మక్క.ఆమె భర్త పగిడిద్దరాజు వారికి సారలమ్మ అనే కూతురు,జంపన్న అనే కుమారుడు ఉన్నారు. ఇది పడిగె సహాయంతో డోలీలు చెప్పిన ప్రామాణికమైన సమ్మక్క వివరాలు, అలాగే పగిడిద్దరాజు వంశవృక్షం కూడా ఇందులో మనం చూడవచ్చును. పడమటి దేశానికి చెందిన ఎడవగట్టు పారేడు కోయరాజు వంశానికి చెందిన,బాలసంద్రుడు శివమందాకిని దంపతులకు ఐదుగురు సంతా నం,వారు పగిడిద్దరాజు,గోవిందరాజు, గడి కామరాజు,కొండాయి,అనే నలుగురు కొడు కులు లక్ష్మీదేవి, అనే ఏకైక కుమార్తె ఆమెకే ‘‘ముయ్యాల’’ అని ముద్దు పేరు.పగిడిద్దరాజు కు సమ్మక్క నాగులమ్మ అనే ఇద్దరు భార్యలు, ఇద్దరినీ పెళ్లి చేసుకోవడానికి తటస్టించిన పరిస్థితులతో పాటు పగిడిద్దరాజు తన పరివారంతో ఇంద్రావతి నది దాటి తన ప్రాంతానికి పడమటి దిక్కు కదిలి ఓరుగల్లు వచ్చి అటు నుంచి ‘‘ఓయిమూల’’ ప్రాంతం చేరిన తీరు ఈడోలీల గానంద్వారా వివరించ బడిరది,నేటి చల్వాయి,తాడ్వాయి, మేడారం, ప్రాంతాలను కలిపి ఆనాడు కోయరాజులు ‘‘ఓయిమూల’’ అని పిలిచేవారు. ఈ ప్రాంతం లో తేనె,గడ్డలు,ఆకులు,అలములు,ఇప్ప పూల తో పాటు చల్లని నీడ చెట్లు, తోగులు, తాగే నీరు, పుష్కలంగా దొరికేవట ప్రతాపరుద్రుని రాజ్యంలో గల ఆ ప్రాంతంలో పగిడిద్ద రాజు తన సామంతరాజ్యం ఏర్పాటు చేసుకోవడం, కాలానుగుణంగా వచ్చిన ప్రకృతి వైపరీత్యాల వల్ల కరువు కాటకాలతో అక్కడివారు కాకతీ య ప్రభువుకు రకం సకాలంలో చెల్లించలేక పోవడం జరుగుతుంది. కోయ రాజుల మూల వంశానికి చెందిన కాకతీయ ప్రభూ తమ వారు అనే కృతజ్ఞత కూడా లేకుండా పగిడిద్ద రాజు సామంతరాజ్యం మీద తన బలగాలతో యుద్ధం ప్రకటించటం ఆ యుద్ధంలో మొదట పగటిదరాజు పరివారం ఓటమి అంచులకు చేరడం విషయం తెలిసిన సమ్మక్క ఆదిపరా శక్తిగా కోయల కుటుంబంలో ఇష్టంగా జన్మించడంతో తమ జాతి సంరక్షణార్థం అపర కాళీమాతల యుద్ధరంగంలో దునికి ఆధునిక కాకతీయ సైనికుల ఆయుధాలను కూడా నిర్వీర్యం చేసి సైనికులను అందర్నీ మట్టు పెట్టింది, క్షతగాత్రుడైన భర్త పగిడిద్ద రాజు,ను అక్కడ నుంచి తీసుకుని వెళ్లి చిలకలూరిగుట్టకు చేరిపోయింది,మూడేళ్ల కోసారి సమ్మక్క పగిడిద్దరాజు కళ్యాణం జరుగుతుందని డోలీలు ఈపాటలో పాడు తారు. మేడారం ఒకనాటి వీరోచిత యుద్ధ క్షేత్రం, సమ్మక్క గాధ ఒక కోయ వీరనారి పోరాట కథ, కొద్దిపాటి కాల్పనికత ఉన్న, ఈ డోలీలు పటం సాయంతో చెప్పే ఈ వీరగాథ లో ఆదివాసీల చరిత్ర మూలాలు కనిపి స్తాయి.గతంలో సమ్మక్క చరిత్రకు సంబంధిం చిన ప్రచార ఉదంతాలకి ఈ ‘‘డోలిగానకథ’’ పాఠ్యం ఒక క్రమరీతిని కలిగిస్తుంది అనడంలో సందేహం లేదు.ఈ వీర గాధల బృంద గానంలో..‘‘ఓరేలా..రే రేలా..రే రేలయ్యో…’’ అనే కూతతో ప్రారంభమై ‘‘అయ్యారే… యమ్మాలే.’’ అనే పల్లవులు పునరావృతం అవు తుంటాయి. ఆదిపరాశక్తి అంశ అయిన సమ్మక్క మొదట అన్ని కులాలలో వెలవాలని తలచి చివరికి కోయవారి కులం లోనే వెలిచింది అని చెప్పడానికి..‘‘కోమటోరిళ్ళల్లో నాకు కోరిన కొబ్బర్లు ు అయ్యారే/ అది నాకు గాని కావాలా అయ్యారే../బాపనోళ్ళ ఇళ్లల్లో అది బందీన తల్లిలే-అయ్యాలే ..’’అంటూ డోలీ గానం సాగుతుంది. గిరిజన మౌఖిక భాషకే పరిమితం అయిన తూర్పు దేశం (బస్తరు), రొట్టదంటు (పెద్ద అడవి), మాయ మందు (ఇప్ప సారా) కాలికొమ్మలు (సన్నాయి వాద్యాలు), పిట్టె పూరోడి పట్నం.(తాడ్వాయి దగ్గరి అంకన్నగూడెం గ్రామం), వంటి పదాలకు అర్థాలు పాద సూచికల ద్వారా అం దించడం చదువరులకు సౌలభ్యంగా ఉంది. అనుబంధంలో ఈ పుస్తక సంపాదకులు ‘‘జయధీర్‌ తిరుమల రావు’’ గారి గిరిజన క్షేత్ర పర్యటనల అనుభవ వ్యాసాలు మరింత అదనపు సమాచారం కలిగి ఉన్నాయి. బైండ్ల కథలో కాకతీయ రాజుల ఉదంతం, కోయ వీర గాథలు తెలిపే పగిడెలు, పటాలు, ఆరు కోయగాథలు వెలుగు చూసే రుతువు, నలు గురు కోయరాజులు 8 పడిగ కథలు ఈ అనుబంధంలో చదువుకోవచ్చు, భావి పరిశో ధకులు కోయ వీర గాథలు అధ్యయ నంకు పరిశోధనలకు ఈపుస్తకంఓ ప్రామా ణిక పునాదిగా ఉపకరిస్తుంది.
వీరుల పోరుగద్దె ‘‘మేడారం’’ (కోయ డోలీల కథ),సంపాద కుడు: జయధీర్‌ తిరుమలరావు, పేజీలు:136, ధర:80/- రూ, ప్రతులకు: సాహితీ సర్కిల్‌, హైదరాబాద్‌ – సెల్‌: 99519 42242.

గిరిజన సంస్కృతి వాచకం…

ఒకప్పుడు మౌఖిక సాహిత్యంకే పరిమితమైన… మన ఆదివాసీ సాహిత్యం… అక్షరాస్యతలో వచ్చిన అభివృద్ధిలో భాగంగా .. వివిధ ప్రక్రియలలో పుస్తకాల రూపంలో… వస్తూ ప్రామాణికతకు చోటుచేసు కుం టుంది, ఈ గిరిజన సాహిత్యంలోని… పుస్తకాల వివరాలను ‘‘గవాక్షం’’ శీర్షికన… ‘‘థింసా పాఠకుల’’ కోసం ప్రతి నెల ఒక పుస్తకాన్ని పరిచయం చేస్తున్న పరిశోధక రచయిత డా. అమ్మిన శ్రీనివాసరాజు గారు ప్రముఖ రచయిత డా: పిరాట్ల శివరామకృష్ణ కలం నుంచి జాలువారిన ‘‘ గిరిజనులు సంస్కృతి పగ్రతికి సవాళు ’’ అనే పుస్తకంపై సమీక్షడా. అమ్మిన శ్రీనివాసరాజు
మన దేశ సంస్కృతి సారథి స్వామి వివేకానంద 150వ జయంతి సందర్భంగా వెలువరించబడ్డ ‘‘ఆంధ్రప్రదేశ్‌ లో గిరిజనులు సంస్కృతి ప్రగతికి సవాళ్లు….’’ అనే పుస్తకాన్ని ప్రముఖ గిరిజన పరిశోధకు రచయిత డా: పిరాట్ల శివరామకృష్ణ రాశారు. గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాల గురించి ఇప్పటి వరకు చాలా పుస్తకాలు విలువడ్డాయి కానీ వాటి అన్నిటికన్నా భిన్నమైనది సంక్షిప్తంగా సమగ్ర సమాచారాన్ని అందించింది ఈ పుస్తకం,70 పేజీలుగల ఈ రచన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లోని అన్ని గిరిజన ప్రాంతాలను స్పృశిస్తూ చారిత్రక, భౌగోళిక, సంస్కృతి, సాంప్రదాయాలను కూలంకషంగా అందిం చింది.
రచయిత శివరామకృష్ణ తెలుగు ప్రాంతా లలోని గిరిజన ఆవాసాలు విస్తృతంగా పర్యటించి ప్రత్యక్షంగా అక్కడి వారి స్థితిగతులు అర్థం చేసుకున్న అనుభవంతోనే ఈ పరిశోధనాత్మక రచన చేశారు, ప్రసిద్ధ ఒరియా రచయిత ‘‘గోపీనాథ మహంతి’’ వ్రాసిన అమృత సంతానం నవల చదివి గిరిజనులకు వారిదైన ఒక ప్రాపంచిక దృక్పథం ఉంటుందని దానిని తెలుసుకోకుండా మనం వారిని అర్థం చేసుకోలేము అనే విషయాన్ని అర్థం చేసుకున్న స్వానుభవంకూడా రచయిత ఈ రచనకు తోడు తీసుకున్నారు. గిడుగు రామ్మూర్తి, హైమన్‌ డార్ప్‌లతో పాటు యానాదుల పరిశోధకుడు వెన్నెల కంటి రాఘవయ్య, వంటి వారు సైతం ఆయా గిరిజనుల గురించిన పరిశోధన కృషి చేసేటప్పుడు వారి సమాచారాన్ని సేకరించటం కన్నా వారి ప్రపంచంలో సంచరించడం మీదే ఎక్కువ దృష్టి పెట్టారనే అంశం ఈ రచయిత స్పష్టం చేశారు, ఇది భావి పరిశోధకులు అందరికీ శిరోధార్యం అయిన విషయం.
‘‘గణరాజ్యాలు’’ మొదలు ‘‘గిరిజనులు రాజ్యాంగ హక్కులు అభివృద్ధిలో వాటాలను కోల్పోతున్నారా?’’ అనే శీర్షిక వరకు ముచ్చటగా మూడు ప్రధాన శీర్షికలు గల ఈ పుస్తకంలో గిరిజనులకు సంబంధించిన చారిత్రక, సాంస్కృతిక, వర్తమాన, సాంఘిక, సమాచారం గణాంకాలతో సైతం సమగ్రంగా అందించబడిరది. గణరాజ్యాల యందు నాటి చక్రవర్తులకు గిరిజనుల కు మధ్య ఎలాంటి సత్సంబంధాలు ఉండేవి, నల్లమల అడవుల్లో గిరిదుర్గాలు చెంచుల నాయకత్వంలో ఉన్న విషయం, కొండ రెడ్ల జాతి ఆవిర్భావం,గోండు జాతి గిరిజనులలోగల ఉపతెగల వివరాలు, మన్యం కొట్టాలు,బోయకొట్టాలు,పితూరీలు, ఏర్పాటుతో పాటు అవి చేసిన కృషి ఫలితాల గురించిన విశ్లేషణ ఇందులో చదవవచ్చు. అలాగే మార్గ, దేశి, గిరిజన సంప్రదాయాలు, సంచార గిరిజన తెగల గురించి చెబుతూ భారతదేశంలో ప్రధాన భాషలు పదుల సంఖ్యలో ఉంటే గిరిజనుల భాషలు వందల సంఖ్యలో ఉన్నాయన్న ఆసక్తికర విషయం రచయిత ఇందులో లేవనెత్తారు. మనకు సాధారణంగా తెలిసిన గిరిజనుల పండు గలతో పాటు, వివిధ ప్రాంతాల్లో స్థానికంగా చేసుకునే విలక్షణ పండుగల సమాచారం కూడా ఈ పుస్తకానికి అదనపు ఆకర్షణ. అరకులోయలోని ఆదివాసులు పాటించే కాలచక్రం చాలా విలువైన భౌగోళిక సమాచారం అందిస్తుంది, ఆ విషయాల గురించి రచయిత ఇందులో కూలం కషంగా వివరించారు. గిరిజనులు చేసుకునే ‘‘నంది పండుగ’’ మొదలు తెలుగు నెలల వారీగా చేసుకునే గిరిజనుల పండుగలు విశేషాలు తెలిస్తే అడవి బిడ్డలకు తెలుగు భాష పట్ల గల అభిమానం అర్థం అవుతుంది. కళింగ రాజ్యంలోని శ్రీముఖలింగం క్షేత్రంలో గల మధుకేశ్వర స్వామి అవతరణలో ఆరాజ్య సవర గిరిజన రాజు కుమార్తె, సవరరాజుల ప్రస్థావనతో ఆ ప్రాంతంలో గిరిజన రాజులస్థానం. అలాగే పూరీ జగన్నాథుడు సవర గిరిజనుల దేవుడుగా ఉన్న విషయం, కాకతీయుల సేనా ధిపతుల్లో 12 వేల విలుకాండ్ల దళానికి నాయకుడైన కోయరాజు ‘‘సీతాపతి రాజు’’ విషయంతో పాటు అతడు ‘‘శితాబ్‌ ఖాన్‌’’ గా మార్చబడ్డ వైనం ఇందులో చర్చించబడిరది.
ఇలా ఎన్నో ఆసక్తికర గిరిజన చారిత్రక సంఘటనలు ఈ పుస్తకంలో మనం చదవవచ్చు.
రెండవ విభాగం నిండా నిజాం, బ్రిటిష్‌ ,పాలకులతో గిరిజనులు చేసిన ప్రత్యక్ష పోరాటాలు వివరాలు వ్రాయబడ్డాయి.
నైజాంతో పోరాడి అమరుడైన కొమరం భీమ్‌ గురించి ఇందులో ప్రధానంగా చెప్పబడిరది, ఏడు నెలల పాటు జోడెడ్‌ ఘాట్‌ ప్రాంతంలో జరిగిన అభీకర పోరాటం వివరాలు కూడా ఇందులో పొందుపరిచారు. ఇక తూర్పు కనుమల్లో గిరిజనులు చేసిన స్థానిక తిరుగుబాట్లు, పితురీలతో పాటు 1920- 24 సంవత్సరాల మధ్య అల్లూరి సీతారా మరాజు నాయకత్వంలో జరిగిన గిరిజన పోరాటాలు తిరుగుబాటుల గురించి కూలంకషంగా వివరించ బడ్డాయి.ఈ పోరా టాల సమగ్ర అధ్య యనం ద్వారా తెలిసే విషయాలు, వివిధ ప్రాంతాలలోని గిరిజనులు అంతా సమీప రాజులు, జమీందారులతో సత్సం బంధాలతో స్నేహం చేస్తూ… వారి పాలనలో పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ సైనికుల వలే ముందుండి నడిచే వారిని. కొన్ని రాజ్యాలకు సామంత రాజులుగా కూడా వ్యవహరించే వారనే విషయాలు ఈ సందర్భంగా తేటతెలమవుతాయి. అదేవిధంగా స్వాతంత్ర పోరాటంలో కూడా తెలుగు ప్రాంతాలలోని గిరిజనుల పాత్ర అజ్ఞాతంగా ఉండేదనే విషయం అర్థమవుతుంది. స్వాతంత్ర అనంతరం కూడా గిరిజన సమాజంలో అలజడులు పోరాటాలు కొనసాగడానికి కారణాలను కూడా సామాజికవేత్తలు అధ్యయనం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది అనే విషయం రచయిత సూచించారు. స్వతంత్ర భారతదేశంలో పాలనాపరమైన రాజ్యాంగం అమలై… గిరిజనుల కోసం ప్రత్యేక చట్టాలు, నిధులు, కేటాయించిన, వాటి అమలులో చూపిస్తున్న అశ్రద్ధ కారణంగా కొన్ని గిరిజన తెగలు నేటికీ వెనుకబడి అన్ని విధాలా నష్టపో తున్నారు అసంతృప్తితో రగిలి పోతున్నారు అనే విషయం కూడా రచయిత రేఖామాత్రంగా పేర్కొన్నారు.మూడవ విభాగంలో ‘‘గిరిజనులు రాజ్యాంగ హక్కు లను అభివృద్ధిలో వాటాలను కోల్పో తున్నారా?’’ అంటూ తెలుగు ప్రాంతాలలో ఏర్పాటు చేసిన షెడ్యూలు ప్రాంతాల వివరాలు, ప్రాంతాల వారీగా జనాభా గణన,జిల్లాల వారీగా గిరిజన తెగల వ్యాప్తి, వారిలో గల విభిన్న సంస్కృ తులు. గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వాలు అమలు చేసిన పంచశీల విధానాలతో పాటు భారత రాజ్యాంగంలో ఆర్టికల్‌ 46 ప్రకారం గిరిజన అభివృద్ధికి తీసుకున్న ప్రత్యేక చర్యలు, అటవీ హక్కుల చట్టం 2006, పిసా చట్టం, వంటి ప్రధాన చట్టాల గురించిన సమాచారంతోపాటు గిరిజనులు హిందూజాతి వారే అనడానికి సహేతుక కారణాలు వివరిస్తూ గిరిజన అభివృద్ధిలో వనవాసి కళ్యాణ ఆశ్రమం కృషి తదితర విలువైన సమాచారం ఇందులో అందించారు. గిరిజనుల సమగ్ర సమాచారం ‘‘కొండ అద్దమందు’’ అన్న చందంగా ఆవిష్కరించబడ్డ ఈ పుస్తకం సమస్త పరిశోధకులకు గిరిజన ఆధ్యయనకర్తలకు చక్కని దారి దీపంలా పనిచేస్తుంది, అనడంలో నిండైన నిజం ఉంది.
పుస్తకం పేరు:- ‘‘ఆంధ్రప్రదేశ్‌ లో గిరిజనుల సంస్కృతి ప్రగతికి సవాళ్లు..’’
రచయిత: డా: పిరాట్ల శివరామకృష్ణ,. పేజీలు: 72, వెల: 20/- రూపాయలు.
ప్రతులకు: సాహిత్య నికేతన్‌, బర్కత్‌ పురం, హైదరాబాద్‌ – 27, ఫోన్‌: 040- 27563236.
సమీక్షకుడు :- డా: అమ్మిన శ్రీనివాసరాజు, సెల్‌: 7729883223.

1 2