నిర్వాసితుల నిర్వేదం

‘మా అందరికీ ప్యాకేజీ ఇచ్చిన తర్వాతే, ప్రాజెక్టు కడతామని అన్నారు. కానీ ఇప్పుడు మాకు ఏమీ ఇవ్వకుండానే ప్రాజెక్టు కట్టేస్తున్నారు. అంటే మమ్మల్ని మోసం చేస్తున్నట్టే కదా.మా ఊరికి 30 కిలోమీటర్ల అవతల జీలుగుమిల్లిలో కాలనీ కడతారంట. మాతరతరాలు అక్కడే బతకాలి. కానీ అక్కడికెళ్లి ఎలా బతకాలి. మొత్తం మాకివ్వాల్సింది ఇచ్చేస్తే మేమే వెళ్లిపోతాం’’ భూమికి భూమి ఇస్తామన్నారు. ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ పూర్తిగా రాలేదు. ఇక్కడ పొలాలు, చెట్టూ అన్నీ వదిలేసి వెళ్లి ఏం తినాలి.అని పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలానికి చెందిన భీంపల్లి వాసి ఎం.అబ్బులు ఆవేదన.
పేరుకే కాలనీ.. ఉన్నవన్నీ మొండి గోడలే

‘‘అధికారుల మాటలు నమ్మి ఇక్కడికి వచ్చాం. కానీ అక్కడ మంచినీరు, కరెంటు కనెక్షన్లు కూడా ఇవ్వలేదు. బాత్రూములు లేవు. కుళాయిలు ఇప్పుడు తవ్వుతున్నారు. గోదావరి ఒడ్డున ఉండలేక ఇక్కడికి వచ్చేశాం. ఈసారి వరద మూడు నాలుగు నెలలు ఉంటుందని అంటున్నారు. అందుకే పిల్లలతో అక్కడ ఉండలేక వచ్చేశాం. కానీ మాకు కరెంటు మీటర్లు వేసి, బాత్రూమ్‌ లు కట్టాలి . లేదంటే వరదలు, వర్షాల సమయంలో కష్టమే’’ అని పునరావాస కాలనీకి తరలివెళ్లిన కె.వెంకటలక్ష్మి రోదన.

‘‘అడవిలో ఉంటే ఏదోటి తిని బతికేస్తాం.అక్కడ ఎలా గడపాలి. మాకు జరుగుతున్న అన్యాయం చూస్తామన్న వాళ్లే లేరు. గోదావరి వచ్చేస్తోంది. అందుకే అడవుల్లో ఏవో ఇళ్లు కట్టుకుని చీకట్లోనే గడపాలి ఇక’’ అని చెదల పార్వతి నిర్వేదన
పోలవరంలో ముంపు శాపం…18,622 కుటుంబాలను ముంచేస్తున్నది ప్రవాహమా, ప్రభుత్వమా? చేసిన వెళ్లినవాళ్లను ఇంకా తిప్పుతున్నారు. అందుకే వరదొచ్చినా, వానొచ్చినా ఇక్కడే ఉంటాం. ఈసారి పెద్ద వరద వస్తుందని చెబుతున్నారు. అయినా మేం కదలం. ఇక్కడే కొండలపై ఇళ్లు కట్టుకుని ఉంటాం’’ గిరిజనులు అంటు న్నారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే మీదుగా గోదావరి నది ప్రవాహాన్ని మళ్లించారు.కాఫర్‌ డ్యామ్‌ పూర్తిగా మూసేశారు. దాంతో సాధారణ నీటి ప్రవాహానికే వరద తాకిడి మొదలైంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి వరద ముప్పు తప్పదని అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. దాంతో పోలవరం ముంపు గ్రామాల నుంచి ప్రజలను ఖాళీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ పునరావాస ప్యాకేజీ చెల్లించాలని ముంపు ప్రాంత వాసులు పట్టుపడుతున్నారు.దాంతో పోలవరం నీళ్లు గిరిజన ప్రాంత ఊళ్లను ముంచేస్తున్న తరుణంలో ఎలాంటి పరిణామాలుఉత్పన్నమవు తాయోనన్న ఆందో ళన పెరుగుతోంది.
పెరిగిన పరిహారపు ఖర్చు..
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం కావడంతో పునరావాసం చెల్లించాల్సిన బాధితుల సంఖ్య కూడా పెరిగింది. దానికి తోడు 2013 భూసేకరణ చట్టంలో మారిన నిబంధనలు అమలులోకి రావడంతో చెల్లించాల్సిన పరిహారం కూడా పెరిగింది.విపక్ష నేతగా ముంపు ప్రాంతంలో పర్యటిస్తూ జగన్‌ ఇచ్చిన హామీలు కూడా పునరావాసం కోసం వెచ్చించాల్సిన వ్యయం మరింత పెరగడానికి కారణమయ్యాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం వైఎస్సార్‌ హయంలో శంకుస్థాపన జరిగిన నాటికి 2005-06లో బాధితుల సంఖ్య 44,500 మంది అని ప్రకటించారు. వారికి పరిహారంగా రూ.8వేల కోట్లు అవసరమని అంచనా వేశారు. కానీ ఆ తర్వాత 2011-12 నాటి లెక్కల ప్రకారం పరిహారం కోసం అర్హుల సంఖ్య 80 వేలకు చేరింది. ఆ సమయంలో 18 ఏళ్లు నిండిన వారిని కూడా అర్హుల జాబితాలో లెక్కించడం, కొత్తగా వచ్చిన కుటుంబాలు కలుపుకొని నిర్వాసితుల సంఖ్య పెరిగిందని అధికారులు ప్రకటించారు. ఈ పదేళ్ల కాలంలో వారి సంఖ్య లక్ష దాటిందని చెబుతున్నారు. ప్రాజెక్టు కోసం 2005-06లో 95,700 ఎకరాలు భూసేకరణ చేయాలని లెక్కలు వేశారు. కానీ, 2017-18లో దానిని 1,55,465 ఎకరాలుగా సవరించారు. దాంతో తొలి అంచనాల కన్నా 55,335 ఎకరాలు అదనంగా సేకరించాల్సి వస్తోందని ప్రభుత్వం చెబుతోంది. పోలవరం ముంపు ప్రాంతంలో ఫీల్డ్‌ సర్వే చేయడం వల్ల భూసేకరణ పెరిగిం దని అధికారికంగా ప్రకటించారు. కానీ పోలవరం విలీన మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపిన తర్వాత ముంపు ప్రాంతం ఎక్కువగా లెక్కిస్తున్నారన్నది నిర్వాసితుల వాదన. నిర్వాసితుల సంఖ్య, సేకరించాల్సిన భూమి కూడా పెరగడంతో పునరావాసానికి వెచ్చించాల్సిన ఖర్చు పెరిగింది. దాంతో తాజాగా ప్రభుత్వం సవరించిన అంచనాల ప్రకారం సుమారు రూ.30 వేల కోట్లకు పైగా ఖర్చవుతుందని అంచనా.
నీళ్ల నడుమ నిర్వాసితులు-చోద్యం చూస్తున్నపాలకులు
ఉగాది నాటికే కాంటూరు 41.15 మేరకు నిర్వాసితులందరికీ ప్యాకేజీ చెల్లించి, కాలనీలకు తరలిస్తామని కూడా ప్రకటించారు. ఇప్పుడు కాఫర్‌ డ్యామ్‌ గ్యాప్‌ పూడ్చివేశారు కానీ నిర్వాసితులకు ప్యాకేజీ మాత్రం ఇవ్వలేదు. అంటే ఆర్‌ ఆండ్‌ ఆర్‌ అమలు చేయకుండా అది పూడ్చడానికి అనుమతించేది లేదని చెప్పిన పి.పి.ఎ మాట తప్పిందా..లేక రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా ప్యాకేజీ ఇవ్వకుండానే నిర్వాసితుల ఇళ్లను ముంచేసేందుకు పి.పి.ఎ అనుమతి తీసుకున్నారా లేదా అన్నది స్పష్టత ఇవ్వకుండా కప్పదాటు వైఖరి అవలంబి óస్తున్నారు. మాట తప్పిన కేంద్ర,రాష్ట్ర ప్రభు త్వాల తీరు మూలంగా మన్యం వాసులు బాధితులుగా మిగిలారు. పిల్లలు, వృద్ధులు, మహిళలు సహా అందరూ నానా ఇబ్బందులు పడుతున్నారు.
పునరావాస ప్యాకేజీ ఇస్తే ఖాళీ చేయాలని పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు అనుకుంటున్నారు. ప్యాకేజీ ఇవ్వకుండా ఖాళీ చేయకూడదని ఎ.పి హైకోర్టు కూడా ఆదేశిం చింది. ప్రభుత్వం మాత్రం ఆగష్టు నాటికే 48 గ్రామాలను ఖాళీ చేస్తామని చెబుతోంది. దానికి అవసరమైన నిధుల సంగతి తమకు సంబంధం లేదని కేంద్రం అంటోంది. మొత్తంగా పోలవరం ప్రాజెక్టు వ్యవహారం పెద్ద ప్రహస నంగా మారుతోంది. కేంద్ర ప్రభుత్వం చేతులు దులుపుకోవడానికి యత్నిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం దానిని నిలదీసి, నిధులు రాబట్టడంలో విఫలమవుతోంది. బాధితులు మాత్రం నిలువు నీళ్లలో, ఇప్పుడు వరదల సమయంలో చీకట్లో కాలం వెళ్లదీయాల్సి వస్తోంది. ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ సంగతి ఆ తర్వాత ప్రస్తుతం వరదల సమయంలో సహాయక చర్యలు చేపడదామనే ఆలోచన కూడా ప్రభుత్వాలకు రావడం లేదు.
వరద బాధితులతో ఆటలు…
దశాబ్దాలుగా పోలవరం ప్రాజెక్టు అనేక పార్టీలకు ఎన్నికల హామీగా ఉంటోంది. గత ప్రభుత్వం కూడా 2019 నాటికే ప్రాజెక్టు పూర్తి చేస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పింది. కానీ దానికి తగ్గట్టుగా పనులు చేయలేకపోయింది. రెండేళ్లు దాటిన వైసిపి ప్రభుత్వం కూడా 2021 నాటికే పోలవరం ప్రాజెక్టు నుంచి నీళ్లిస్తామని చెప్పింది. కానీ ఇప్పుడు దానిని మరో ఏడాదికి పొడిగించింది. స్పిల్‌ వే పూర్తయిన నేపథ్యంలో జూన్‌ నెల మొదటి వారంలోనే నదీ ప్రవాహాన్ని మళ్లించారు. అందుకోసం కాఫర్‌ డ్యామ్‌ పూర్తిగా మూసే శారు. ఎగువ కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణం జరగడంతోనే పోలవరం నిర్వాసిత గ్రామాలకు వరద బెడద ఏర్పడిరది. మూడేళ్లుగా కొద్దిపాటి వరదలకే ఊళ్లన్నీ జలమయమవుతున్నాయి. ఈ ఏడాది కాఫర్‌ డ్యామ్‌ మూసేశాక బ్యాక్‌ వాటర్‌ మూలంగా వంద గ్రామాలు జలదిగ్బంధంలో ఇరుక్కున్నాయి.
భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక స్థాయి దాటినా వరద చూడని గ్రామాలు కూడా ఇప్పుడు మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిలో నీటిమయమయ్యాయి. కాఫర్‌ డ్యామ్‌ కారణంగా ఇలాంటి ముప్పు ఉంటుందని ప్రభుత్వాలకు తెలిసినా స్పందించలేదు. వామపక్షాలు, ఇతర నేతలు వరద బాధలను, నిర్వాసితులను ఆదుకోవాల్సిన అవసరం గురించి మొత్తు కుంటున్నా పాలకులు మిన్నకున్నారు. గత ఏడాది వరదల్లో ఆహారం, కిరోసిన్‌ వంటివి కూడా అందించడానికి ఏర్పాట్లు చేయలేదు. అంతకుముందు 2019 వరదల సమయంలో ముఖ్యమంత్రి ప్రకటించిన వరద సహాయం 2020 వరదలు వెళ్లిన తర్వాత చెల్లించారంటే బాధితుల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధి స్పష్టమవుతోంది. ఈసారి కాఫర్‌ డ్యామ్‌ పూర్తిగా మూసేసిన తర్వాత వరద తాకిడి మరింత ఎక్కువ ఉంటుందని అధికారికంగానే వెల్లడిరచారు. అందుకు అనుగుణంగా సహాయక చర్యలు మాత్రం చేపట్టలేదు. ప్రస్తుతం వరదల్లో చిక్కుకున్న గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా ఇళ్ళు వదిలిపోయేలా చేసే పన్నాగంలో ఉన్నట్టు ఇట్టే అర్థమవుతోంది. ప్యాకేజీ చెల్లించి, నిర్వాసిత కాలనీలు సిద్ధం చేసి బాధితులందరినీ తరలించాల్సి ఉండగా దానికి భిన్నంగా ఏ దారి లేని నిర్వాసితులంతా ఊళ్లు వదిలిపోయేలా చేస్తున్నారు. చట్టాన్ని ప్రభుత్వమే యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ రాష్ట్ర ప్రజల అవసరాల కోసం సర్వం వదిలిపోతున్న వారి జీవితాలతో ఆడుకుంటున్నట్టు కనిపిస్తోంది. అందుకే ఈసారి వరదలను ఊహించిన నిర్వాసితులు కొండలపై తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నా అడ్డుకునే యత్నం చేశారు. వరదలు వస్తే తినడానికి అవసరమైన నిత్యావసర సరుకుల కోసం సంతకు వస్తే తిరిగి వెళ్లేందుకు పడవలను కూడా అనుమతించ కుండా అమానుషంగా ప్రవర్తించారు.
మాట తప్పిన ప్రభుత్వాలు
కాఫర్‌ డ్యామ్‌ సిద్ధం చేసిన నేపథ్యంలో దానిని పూర్తిగా మూసేయాలంటే ముందుగా పునరా వాసం చెల్లించాలని పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీ ఆదేశించింది. గత డిసెంబర్‌ నెలలో ప్రాజెక్ట్‌ ప్రాంతాన్ని సందర్శించిన డిజైన్‌ రివ్యూ కమిటీ కూడా ఇదే విషయం తేల్చిచెప్పింది. అప్పటి వరకూ కాఫర్‌ డ్యామ్‌ ఖాళీని పూడ్చేసేందుకు అనుమతించేది లేదని కూడా ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దానిని అంగీకరించింది. ఉగాది నాటికే కాంటూరు 41.15 మేరకు నిర్వాసితులందరికీ ప్యాకేజీ చెల్లించి, కాలనీలకు తరలిస్తామని కూడా ప్రకటించారు. ఇప్పుడు కాఫర్‌ డ్యామ్‌ గ్యాప్‌ పూడ్చివేశారు కానీ నిర్వాసితులకు ప్యాకేజీ మాత్రం ఇవ్వలేదు. అంటే ఆర్‌ ఆండ్‌ ఆర్‌ అమలు చేయకుండా అది పూడ్చడానికి అనుమతించేది లేదని చెప్పిన పి.పి.ఎ మాట తప్పిందా.. లేక రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా ప్యాకేజీ ఇవ్వకుండానే నిర్వాసితుల ఇళ్లను ముంచేసేందుకు పి.పి.ఎ అనుమతి తీసుకున్నారా లేదా అన్నది స్పష్టత ఇవ్వకుండా కప్పదాటు వైఖరి అవలంభిస్తున్నారు. మాట తప్పిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు మూలంగా మన్యం వాసులు బాధితులుగా మిగిలారు. పిల్లలు, వృద్ధులు, మహిళలు సహా అందరూ నానా ఇబ్బందులు పడుతున్నారు.
పోలవరం పూర్తి చేసే ఉద్దేశం ఉందా ?
దశాబ్దాలుగా సాగుతున్న పోలవరం ప్రాజెక్టుకి విభజన చట్టం ప్రకారం జాతీయ హోదా దక్కిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆశలు చిగురించాయి. గోదావరి నదీ జలాలను కృష్ణా డెల్టాకు తరలించి, అక్కడి నుంచి ఎగువన ప్రకాశం, గుంటూరు జిల్లాకు కూడా వినియోగించుకుంటామని, తద్వారా రాయల సీమలో నీటి కొరతను అధిగమిస్తామని ముఖ్య మంత్రులు భారీ ఆశలే కల్పించారు. కానీ చట్టం ప్రకారం జాతీయ హోదా అమలు చేయాల్సిన కేంద్రం ఇప్పుడు కొర్రీలు వేస్తోంది. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన 8 బడ్జెట్లలో పోలవరం నిర్మాణం కోసం వెచ్చించిన మొత్తం రూ.11,182 కోట్లు. ఇప్పటి వరకూ పునరావాసానికి రూ.6900 కోట్లు వెచ్చించగా ప్రాజెక్టు పూర్తి చేయడం కోసం మరో రూ.20వేల కోట్లు అవసరం అవుతాయి. టెక్నికల్‌ కమిటీ ఆమోదం పొందిన డి.పి.ఆర్‌ 2 ప్రకారమే 1.05లక్షల కుటుంబాలకు గానూ రూ.27వేల కోట్లు వెచ్చించాల్సి ఉంది. దాంతో పాటుగా కాలువల నిర్మాణం పూర్తి చేయడం, ఇప్పటికే 15ఏళ్ల క్రితం నిర్మించిన కాలువల్లో శిథిలమవుతున్న వాటిని సిద్ధం చేసేందుకు కనీసంగా మరో రూ. 5వేల కోట్లు కావాల్సి ఉం టుంది. ఇక ఎర్త్‌ కం రాక్‌ ఫిల్‌ డ్యామ్‌ డిజైన్లను మార్చడం వల్ల ఖర్చు పెరిగిందని కేంద్రమే పార్లమెంట్‌ లో చెప్పింది. దాని ప్రకారం రూ. 5535కోట్ల నుంచి రూ. 7192 కోట్లకు పెరిగింది. ఇక బహుళార్థక ప్రాజెక్టులో భాగంగా పవర్‌ హౌస్‌ అందు బాటులోకి తెచ్చేందుకు మరో ఐదారు వేల కోట్లు కావాలి. అంటే మొత్తంగా ఇప్పుడున్న స్థితిలో పోలవరం పూర్తి కావాలంటే కనీసం రూ. 35వేల కోట్లు ఖర్చు చేస్తే తప్ప అవకాశం లేదు. కానీ కేంద్రం మాత్రం 2014 నాటి అంచనాలకు మించి పైసా కూడా చెల్లించ బోనంటోంది. రాజ్యసభలో జలశక్తి మంత్రి ప్రకటన తాజా తార్కాణం. మరో 9వేల కోట్లు మాత్రమే ఇస్తామని చెబుతోంది. అదే సమ యంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులు రీయంబర్స్‌ చేయడంలోనూ కొర్రీలు వేస్తోంది. కేంద్రం నుంచి రూ. 2300కోట్లు రావాల్సి ఉందని జులై 19న సి.ఎం ప్రకటిస్తే, తాము ఇంకా ఇవ్వాల్సింది రూ.1900 కోట్ల లోపు మాత్రమేనని పార్లమెంటులో కేంద్రం స్పష్టం చేసింది. దాంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దోబూచులాట మూలంగా ప్రస్తుతం అన్యాయమవుతున్న నిర్వాసితులతో పాటుగా ప్రాజెక్టు మీద ఆశలు పెట్టుకున్న రైతాంగం కూడా చేరుతున్నట్టు కనిపిస్తోంది. విభజన చట్టంలో స్పష్టంగా ఉన్నప్పటికీ పోలవరం నిర్మాణం విషయంలో కేంద్రం కొర్రీలు వేస్తోంది. దానిని ప్రశ్నించి, రాష్ట్ర హక్కులను కాపాడడంలో వైసిపి నీళ్లునములుతోంది. కనీసం విపక్ష టిడిపి కూడా ప్రశ్నించ లేకపోవడంతో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగేలా ఉంది. పోలవరం తామే పూర్తి చేస్తున్నామని ఎ.పి లో బిజెపి నేతలు ప్రకటన లు గుప్పిస్తుంటే కేంద్రంలో అదే పార్టీ మంత్రు లు తాము ఎనిమిదేళ్ల క్రితం నాటి అంచనాలకు మించి పైసా కూడా ఇచ్చేది లేదని ఫ్లేటు ఫిరాయిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ కలిసి ప్రాజెక్టు భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తన్నాయి.
వరదలు పెరిగితే వాళ్లంతా ఏం కావాలి ?
సహజంగా జులై మధ్య నుంచి ఆగస్టు ఆఖరు వరకూ గోదావరికి ఉధృతంగా వరద తాకిడి ఉంటుంది. ఈసారి సీజన్‌ ప్రారంభంలోనే వరదల ప్రభావం కనిపిస్తోంది. ఇది రాబోయే నెల రోజుల పాటు మరింత తీవ్రంగా ఉండే ప్రమాదం ఉంది. అదే జరిగితే నిర్వాసితులు అనేక అవస్థలు పడాల్సి వస్తుంది. గతంలో గోదావరికి పెద్ద వరదలన్నీ ఆగస్టులోనే వచ్చాయి. కాబట్టి వచ్చే నెల పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అత్యంత కష్టకాలం. ఇప్పటికే అవకాశం ఉన్నవారంతా ఒడ్డుకు చేరారు. కానీ గిరిజనలకు మాత్రం కాలనీలు సిద్ధం చేయక, ప్యాకేజీ అందక వరదల్లోనే గడపాల్సిన దుస్థితి దాపురించింది. ఇప్పుడు వరదల్లో వారికి రవాణా సదుపాయాలు కూడా లేవు. నిత్యావసర సరుకులు కూడా అందుబాటులో ఉంచలేదు. గత ఏడాది ప్రభుత్వ నిర్లక్ష్యం మూలంగా ఏర్పడిన సమస్యలపై ముంపు బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. అప్పట్లో అధికారులు తప్పిదాన్ని అంగీకరించారు. ఈసారి కూడా గత ఏడాది అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్నట్టు లేదు. ఉద్దేశపూర్వ కంగానే ఇలా వ్యవహరిస్తున్నారు. ఆహార పదార్థాలు, కిరోసిన్‌ వంటివి అందుబాటులో ఉంచడం మీద శ్రద్ధ పెట్టలేదు. ఇప్పటికైనా యంత్రాంగం కదలాలి. డి.ఆర్‌ డిపోల ద్వారా నిర్వాసితులకు నిత్యావసరాలు పంపిణీ చేయాలి. పడవలు ఏర్పాటు చేసి రవాణా సదు పాయం కల్పించాలి. వరద సహాయక చర్యలు సమగ్రంగా చేపట్టాలి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో పునరావాస ప్యాకేజీ అమలుకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. దానికి భిన్నంగా సాగితే పోలవరం నిర్వాసితుల ఆగ్రహాన్ని ప్రభుత్వం చవిచూడాల్సి ఉంటుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం మొత్తం కేంద్రమే భరించాలి. చట్ట ప్రకారం జాతీయ హోదా ఉన్న ప్రాజెక్టుని నిర్మాణ వ్యయంపై పరిమితులు విధించడం మానుకోవాలి. కేంద్రం నుంచి నిధులు తీసుకురావడానికి ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో ప్రయత్నించాలి.-వెన్నెల / జిఎన్‌వి సతీష్‌