గిరిజనుల హక్కులకు పాతర

అడవి పుత్రుల ఆవాసం..ఏజెన్సీ ప్రాంతానికి ముప్పు పొంచిఉంది.అభివృద్ధి పేరుతో గిరిజనుల హక్కులను పాలకవర్గాలు పాతరేస్తున్నాయి.రాష్ట్రంలో ప్రకృతి వైభవానికి,జీవవైవిధ్యానికి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తున్న తూర్పు కనుమలపై కొన్ని సంవత్సరాలుగా కార్పొరేట్‌ శక్తులు కన్నేసి ఉన్నాయి. వాటిని కబ్జా చేయడానికి రకరకాలుగా ప్రయత్నిస్తున్నాయి. కేంద్రంలో నరేంద్రమోడీ ప్రభుత్వం నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం కార్పొరేట్ల డిమాండ్లు నెరవేర్చడానికి పెద్దపీట వేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అధికారంలో ఉన్నంత కాలం బిజెపి అడుగులకు మడుగొలిత్తిన వైసిపి ప్రభుత్వం ఇటువంటి విధానాలనే అమలు చేసింది.తాజాగా అధికారంలో ఉన్న టిడిపి కూటమిలో బిజెపి భాగస్వామి కావడంతో ఏజెన్సీ ప్రాంతానికి ఎసరు పెట్టడానికి సిద్ధమౌతోంది. కొద్ది రోజులక్రితం శాసనసభ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు గిరిజనుల హక్కుల పరిరక్షణే లక్ష్యంగా రూపొందించిన 1/70 చట్టం వల్ల అభివృద్ధి జరగడం లేదని, దానిని సవరించాలంటూ వ్యాఖ్యలు చేశారు.దీనిపైగిరిజనం ఆందోళనలు పరిగణనలోకి తీసుకున్న కూటమి ప్రభుత్వం వారి ఆవేదన చల్లార్చాడానికి గిరిజన చట్టాలు సవరణ లేదంటూ ప్రకటించారు.ఇంతలోనే ఐదోషెడ్యూల్‌ ప్రాంతానికి చెందిన పార్వతీపురం-మన్యం జిల్లాలోని సీతంపేట మండలం పానుకవలస గ్రామంలో 27.26ఎకరాల ప్రభుత్వ భూమిని ఎంఎంఎంఈ పార్క్‌ ఏర్పాటు కోసం ఆంధ్రప్రదేశ్‌ ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌(ఏపీఐఐసీ)కి ఉచితంగా బదిలీ చేసే ప్రతిపాదనను ఏపీ క్యాబినెట్‌ మార్చి 8న ఆమోదించింది. అలాగే అల్లూరి సీతారామరాజు చింతపల్లి మండలం ఎర్రవరంలోని జలపాతం వద్ద 1200 మెగావాట్ల ప్రాజెక్టుల షీర్డిసాయి ఎలక్ట్రికల్స్‌కు అప్పగించారు.ఎర్రవరంలో 736 ఎకరాలు,ఈప్రాజెక్టులు కోసం కావాలని లెక్కలు తేల్చారు.
ఈప్రాజెక్టులపై గిరిజనులు,గిరిజన సంఘాలు వ్యతిరేకిస్తున్నా ఎన్డీయే ప్రభుత్వ క్యాబేనేట్‌లో ఆమోదించడం శోచనీయం.ఒకపక్క గిరిజన చట్టాలను గౌరవిస్తున్నామంటూ ప్రకటిస్తూనేచాపకింద నీరులా వారి హక్కులకు కూటమీ ప్రభుత్వం పాతర వేస్తోంది.స్వర్ణాంధ్ర 2047విజన్‌ డాక్యుమెంట్‌లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన వివిధ పాలసీల్లోనూ ఏజెన్సీ ప్రాంతాల్లో వివిధ పరిశ్రమలను,టూరిజం ప్రాజెక్టులను ఏర్నాటు చేసే అంశాన్ని ప్రస్తావించిన సంగతి తెలిసిందే! పార్వతీపురం మన్యం జిల్లాలో పాచిపెంట మండలంలోని బొదురుగడ్డ నదిపై కురుకుర్తిలో 1200 మెగావాట్లు,కర్రివలసలో 1000మెగావాట్ల సామధ్యరం గల ప్రాజెక్ట్‌లను ఏర్పాటు చేసేందుకు అదానీ కంపెనీకి అప్పగించింది.
ఏజెన్సీప్రాంతం రాజ్యాంగంలోని 5వషెడ్యూల్‌ కిందకు వస్తుంది.అటవీ హక్కులచట్టం ప్రకారం అటవీ భూమి లేదా అటవీనివాసుల హక్కులను ప్రభావితంచేసే ప్రాజెక్టులపై సంబంధిత గ్రామసభల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని చట్టాలు చెబుతున్నాయి.అయితే,రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న పిఎస్‌పి ప్రాజెక్టుల గురించి అక్కడ నివసిస్తున్న గిరిజనులకు ఏమాత్రం సమాచారం ఉండటంలేదు.గత ప్రభుత్వ హయంలో ప్రతిపాదించిన ప్రాజెక్టులతో పాటు,తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్‌లో ఆమోదించిన నవయుగ ప్రాజెక్టు పరిస్థితి కూడా ఇంతే! తమకు ఏమాత్రం సమాచారం లేకుండా ప్రతిపాదనలు సిద్ధమౌతుండటం పట్ల ఈ ప్రాంతంలో ఆశ్చర్యం,ఆగ్రహం వ్యక్తమవుతోంది.గిరిజన ప్రాంతాల్లో ప్రైవేట్‌ సంస్థలకు అనుమతి లేదంటూ సమత కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.గిరిజన ప్రాంతాల్లో భూమిని సేకరించే ముందు తప్పనిసరిగా కొన్ని చట్టాలను పరిగణలోకి తీసుకోవాల్సిఉంది.
ఏజెన్సీ ల్యాండ్‌ ట్రాన్స్‌ఫర్‌ రెగ్యులేషన్‌యాక్ట్‌ (1/70),పంచాయతీరాజ్‌ ఎక్స్‌టెన్షన్‌ టు షెడ్యూల్డ్‌ ఏరియాస్‌ (పెసా)యాక్ట్‌,పర్యావరణ పరిరక్షణ చట్టం(1986),అటవీ (సంరక్షణ) చట్టం (1980),వన్యప్రాణ సంరక్షణ చట్టం (1972),జల (కాలుష్య నియంత్రణ,నిరోధక) చట్టం (1974),పర్యావరణ ప్రభావ అంచనా నోటిఫికేషన్‌ (2006),అటవీహక్కుల పరిరక్షణ చట్టం (2006),జాతీయ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ చట్టం (2010),వాయు (కాలుష్య నియంత్రణ,నిరోధక) చట్టం1981వంటి చట్టాలను ప్రభుత్వాలు తుంగలోకి తొక్కి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నాయి. ఇప్పటికైన గిరిజన మేథావులు,గిరిజన నాయకులు అప్రమత్తం కావాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది.! -రెబ్బాప్రగడ రవి ,ఎడిటర్ 

తెలుగు భాష తీయ్యనది

మనం ఒక వ్యక్తితో మన భాషలో మాట్లాడుతున్నప్పుడు ఆ సమా చారం కేవలం మెదడుకు మాత్రమే చేరుతుంది. అదే మన మాతృభాష, అతని మాతృభాష ఒకటే అయినప్పుడు ఆ సమాచారం హృదయానికి చేరుతుందంటారు నెల్సన్‌ మండేలా. ప్రతి ఒక్కరూ తమ జన్మభూమిని, సంస్కృతిని, మాతృభాషను గౌరవించాలి. నాగరిక జాతి మాతృభాషలోనే మాట్లాడుతుందని డబ్ల్యూ.బి.యేట్స్‌ అంటాడు. భాష మన భావాలను ఎదుటివారికి వ్యక్తపరిచే ఒక సాధనం. భూగ్రహంపై ఉన్న లక్షలాది జీవరాశుల్లో ఒక్క మానవుడికి మాత్రమే భావాలను రాత, కూత రూపంలో వ్యక్తపరిచే అవకాశం ఉంది. మన మనసులో ఏ భావాలు ఉంటాయో, ఏ అనుభవాలు ఉంటాయో వాటిని సమర్థవంతంగా భాష తెలుపుతుంది. మాట్లాడే అలవాటుతో కూడిన వ్యవస్థ భాష. బుద్ధి జీవులు తమ అనుభ వాలను భాష ద్వారానే వ్యక్తం చేస్తారు. మొదట చిన్న చిన్న శబ్దాల రూపంలో ప్రారంభమైన భాష, అమ్మ నోటి నుండి వెలువడే పదాలతో సుసంపన్నమ వుతుంది. అమ్మ మాటను శిశువు అనుకరిస్తాడు.. అనుభవిస్తాడు.. ఆనందిస్తాడు.. జత కలుపుతాడు.. కొనసాగిస్తాడు. అమ్మ మాటే మాతృభాషగా కొనసాగుతుంది. తెలుగు నేల మీద అమ్మ భాషకు క్రమంగా వెలుగులు తగ్గుతున్నాయి. మూలమైన ఈ భాషను చేతులారా మనమే మూలకు నెట్టేస్తున్నాం. తల్లిని ప్రేమించినట్టే..తల్లిని రక్షించుకున్నట్టే భాషను రక్షించు కోవాల్సిన బాధ్యత ఈ తరం మీద ఉంది.
భావ వ్యక్తీకరణకు,భావ గ్రహణానికి మాతృభాష కీలకమైనది. మనం వేరే భాష మాట్లాడే ప్రాంతంలో ఉన్నప్పుడు,మన భాషకు సంబంధించిన ఒక్కమాట వినబడినా ఉప్పొంగిపోతాం. మాతృభాషను మాట్లాడగలిగిన వ్యక్తి ప్రపంచంలోనే ఇతర ఏ భాషనైనా సులభంగా నేర్చుకుం టాడనడానికి చరిత్రలో అనేక ఉదాహరణలు ఉన్నాయి. మన బాధను,ఆనందాన్ని,కోపాన్ని,అనుభూతిని మాతృభాషలో వ్యక్తీకరించినంత శక్తివంతంగా ఇతర ఏ భాషలోనూ వ్యక్తీకరించలేము.ఇవాళ మాతృభాషను నిర్లక్ష్యం చేస్తున్న ఒక తరాన్ని మనమే తయారు చేసుకున్నాం. విద్య వ్యాపారం అయ్యాక, మనిషి సరుకు వెంటపడ్డాక, కేవలం డబ్బులు సంపాదిం చడమే విద్యగా మనం మార్చేశాం. ఇతర భాషలు నేర్చుకోవడం అవసరమే కానీ పరాయిభాషను నాలుక మీద ఎక్కించుకొని,మాతృభాషను పాదాల కిందకు తొక్కేయడం క్షమించరాని నేరం.
చదివితే ప్రయోజనాలు..
మాతృభాషలో విద్యాబోధన వల్ల గ్రహణ సామర్థ్యం పెరుగుతుంది.విద్యార్థుల్లో సృజనాత్మకత వికసి స్తుంది. మనుషులు నిజమైన భావ ప్రేరణ, ప్రగతి మాతృభాష వల్లే కలుగుతుంది.అసలు స్వభాషలో విద్య ఉంటే మనకు స్వరాజ్యం ఎప్పుడో వచ్చి ఉం డేదని గాంధీ అభిప్రాయపడ్డారు. మాతృభాషలో విద్య మనసును చురుగ్గా చేస్తుంది.భాష కేవలం వ్యక్తీకరణ కోసమే కాక,అది ఒక జాతి మొత్తానికి వారి ఉనికిని,వారి సంస్క ృతిని,సాంప్రదాయా లను, స్థానిక వాతావరణ పరిస్థితులను ఆ తర్వాత తరానికి అందించే వారధిగా ఉంటుంది. భాష ఒక జాతి అస్తిత్వం. పరాయి భాష కేవలం జీతం కోసమే. మాతృభాష జీవితాన్ని తెలుపుతుంది. మాతృభాషలో మన ఆలోచన అత్యంత వేగంగా ఉంటుంది. ఒక వ్యక్తి సంపూర్ణ మూర్తిమత్వ వికాసానికి మాతృభాష సోపానం వంటిది. మన మాతృభాషని అర్థం చేసుకుంటే అందులోని జాతీయాలు,పదబంధాలు,మెరుపులు,ఛలోక్తులు వాటి తాలూకు పరిమళం మనకు తెలుస్తాయి. పరాయి భాష ఎంత నేర్చుకున్నా అందులోని ప్రాణశక్తిని మనం పట్టుకోలేం.మాతృభాషలో విద్యను నేర్చుకున్న విద్యార్థులు కొత్త విషయాలను నేర్చుకోవడానికి తొందరగా అలవాటుపడతారు. ఏదైనా ఒక విషయం మీద మాట్లాడమని చెప్పిన ప్పుడు మాట్లాడగలరు, స్పందించగలరు.ఇతర భాషల్లో ఆ స్పందన ఉండదు. కేవలం బట్టీపట్టి మాత్రమే వాళ్ళు మాట్లాడగలరు. పసివారి మెదడుకు మాతృభాష సహజమైన పోషణ. పిల్లలు ఈ నేల మీద పుడతారు, ఈ నీళ్లు తాగుతారు. కానీ విదేశీ భాషను ఆ పసికందుల నెత్తిన రుద్దడం అంటే వారి మేధాశక్తిని, సృజనాత్మకతను హత్య చేయడమే అవుతుంది.
భాషకు ప్రాధాన్యత ఇవ్వాలి..
ఆంధ్రప్రదేశ్‌ తొలి భాషా ప్రయుక్తగా ఏర్పడిరది. కానీ ఇవాళ పరిస్థితులు ఆశాజనకంగా లేవు. ప్రభుత్వం జీవోలు తెలుగులో ఇవ్వాలనే ఒక ప్రకటన విడుదల చేసింది. జీవోలు తెలుగులో ఇచ్చినంతమాత్రాన భాషను పరిరక్షించినట్టు కాదు. పాలనా భాషగా,బోధనా భాషగా పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చకపోవడానికి పాలకుల ఓటు బ్యాంకు రాజకీయాలు కారణం. ఈనాటి బాల బాలికలలో,యువతరంలో తీవ్రమైన మానసిక ఉద్వేగాలకి కారణం వాళ్లు తమ భాషలోని మాధుర్యాన్ని, ఆ భాషకు సంబంధించిన సాహిత్యాన్ని పూర్తిస్థాయిలో తెలుసుకోలేని స్థితిలో ఉండటమే! మనది కాని సాహిత్యాన్ని వాళ్ళ నెత్తిన రుద్దుతున్నాం. పరభాషా వ్యామోహంతో అమ్మ భాషను నిర్లక్ష్యం చేయడం క్షమించరానిది. అమ్మ భాషను పరిరక్షించుకోవడం సామాజిక అవసరం. ‘దేశ క్షేమానికి భాషా క్షేమమే పునాది’ అని గిడుగు అప్పుడెప్పుడో ఉద్ఘాటించారు.‘పర భాష బోధన సోపానాలు లేని సౌధంలా ఉంటుంది’ అని ఠాగూర్‌ అంటారు.విద్య గ్రామీణుల అవసరాలు తీర్చేదిగా ఉండాలి.‘విద్యా బోధన మాతృభాషలో జరగాలి. కొల్లగొట్టుకునే సామ్రాజ్యవాదులకు సహాయకారిగా ఉండకూడదు!’ అని మహాత్ముడు పిలుపునిచ్చాడు.
నూతన విద్యా విధానంలో..
నూతన జాతీయ విద్యా విధానంలో కూడా ప్రాంతీయ భాషలకు పట్టం కట్టారు. ప్రాథమిక స్థాయిలో విద్యాబోధన మాతృభాషలో ఉండాలని చెప్పారు.అయినా సరే అట్లాంటి చట్టాల్ని, నివేదికలను ప్రభుత్వాలు పట్టించుకోవు. ఏదో ఒకసారి కోర్టులో తీర్పు తెలుగులో వెలువడితే చంకలు గుద్దుకుని ఆనందించిన వాళ్ళం మనమే. పిల్లలకు పునాది సరిగా లేకపోతే ఏభాష అయినా ఎలా వస్తుంది. సృజనాత్మకత మొలకెత్తాలంటే మాతృభాష మార్గం.శిక్షణల ద్వారా భాష రాదు. మనం కొన్నాళ్లుగా ఇంగ్లీష్‌ మీడియం పేరు మీద ఇస్తున్నది శిక్షణ.కానీ అది పిల్లలకు రక్షణ కాదు. అది విద్యావిధానం లక్షణం కాదు. మాతృభాషను ఎట్లా ఉత్సవం చేసుకోవాలో ఈజాతి ఇంకా తెలుసుకోలేదు. ‘మాతృభాష కంటిచూపు వంటిది. మిగతా భాషలు కళ్ళజోళ్లు వంటివి. కంటిచూపు లేకుండా కళ్ళజోళ్ళు ఎన్ని పెట్టుకున్నా ప్రయోజ నం ఉండదు’ అని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గతంలో చెప్పారు. తనకు మాతృ భాషలోనే విద్య నేర్పమని ఔరంగజేబు తన గురువుకు ఉత్తరం రాసిన సంగతి చరిత్రలో ఉంది.ఆనాటి విద్యావ్యవస్థపై ఔరంగజేబు చేసిన ఫిర్యాదు అది.
ఏ భాష నేర్వాలన్నా..
ప్రపంచవ్యాప్తంగా జరిపిన జరుగుతున్న పరిశోధనల ద్వారా విద్యార్థులు ఏ శాస్త్రమైనా ఏ ఇతర భాషలు నేర్చుకోవడానికైనా మాతృభాష మాధ్యమమే సరైనదని తేల్చారు. జపాన్‌, ఐర్లాండ్‌, ఫిన్లాండ్‌, చైనా లాంటి దేశాల్లో ఆ ఫలితాలను మనం చూస్తూనే ఉన్నాం. బహుళ భాషల సమాజాల మనుగడ నేడు వాస్తవంగా ఉన్నప్పటికీ మాతృభాష పరిరక్షణ తప్పనిసరి అవుతుందని యునెస్కో తెలుపుతుంది. ‘నేను నా మాతృభాష లోనే మాట్లాడుతాను. ఎందుకంటే నా ఉనికికి నా భాష కారణం. మా అభిమాన మాతృభాషనే మా బిడ్డలకు నేర్పుతాం. వారెవరో వారికి తెలియాలి!’ ఇలాంటి నినాదాలు యునెస్కో ఎప్పటినుంచో గుర్తుచేస్తూ ఉంది.
భాషను వ్యాపార వస్తువు చేయడం మన రాష్ట్రం లో మరీ మితిమీరినట్టుగా కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో సైతం కాన్వెంట్ల మోజు విపరీతంగా పెరిగింది. ప్రభుత్వాలు కూడా భాషను బ్యాలెట్‌ పేపర్‌గా చూడడం మొదలుపెట్టాయి. తల్లిదండ్రులు ఆంగ్ల మాధ్యమం పాఠశాలలో చేర్పించి, పిల్లవాడు చాలా త్వరగా ఇంగ్లీష్‌ నేర్చుకుంటున్నాడంటూ మురిసిపోతున్నారు. అందులో వారి తప్పేమీ లేదు. ఆంగ్లం కేవలం 26 అక్షరాలతో కూడిన భాష. తొలి 100 పదాలను సులభంగా నేర్చుకుంటారు. ’’మమ్మీ డాడీ’’ అని పిలుస్తూ తిరుగుతూంటే ఇంగ్లీష్‌ అంతా వచ్చేసిందనే భ్రమలో తల్లిదండ్రులు ఉండిపోతారు. తెలుగులో అచ్చులు, హల్లులు, గుణింతాలు, వాటి ఒత్తులు మొత్తంగా సుమారు 15 వందలకు పైగా అక్షరాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ మనం గుర్తించవలసిన విషయం ఒక్కసారి అక్షరాలను నేర్చుకుంటే ఏ వాక్యాలనైనా, ఏ కావ్యాలనైనా సులభంగా చదివేయొచ్చు. కానీ ఆంగ్ల భాష అలాకాదు.. జీవితాంతం ప్రతి పదానికీ కొత్తగా ఉచ్చారణ, రాసే విధానం నేర్చుకుంటూ పోవాల్సిందే.
పిల్లలు ఆంగ్ల మాధ్యమంలో చదువుతున్నప్పటికీ తెలుగు మాట్లాడుతున్నారు కాబట్టే తెలుగు బాగానే వస్తుందనే భ్రమలో మనం ఉండిపోయాం. తల్లిదండ్రులు రోజూ పిల్లలతో కొద్దిసేపు తెలుగు కథలను చెప్పడం వల్ల మన సంస్కృతి, సాంప్రదాయాలను, మన సాహిత్య ఇతిహాసాలు వంటివి పిల్లలకు సులభంగా చేరతాయి. పిల్లలు కథలను చదవడం ద్వారా వారి మీద వికాసం చాలా బాగుంటుంది. మాతృభాషలో కథలను చదువుతున్నప్పుడు అవి వారి మనసుల్లో దృశ్య రూపంలోకి సులభంగా మారుతూంటాయి. అవి అలా గుర్తుండిపోతాయి. అందువల్ల పిల్లల్లో సృజనాత్మకత మెరుగుపడుతుంది. కథలను టీవీలోనూ యూట్యూబ్‌ ఛానల్‌లోనూ చూస్తున్నప్పటి కంటే చదువుతూ ఉన్నప్పుడు పిల్లలే దృశ్యకరణ చేసుకోగలరు. ప్రజల ఆలోచన విధానంలో మార్పు రావాలి.
ప్రస్తుతానికి సురక్షితం..
ప్రస్తుతానికి తెలుగు భాష యునెస్కో లెక్కల ప్రకారం 65 సురక్షిత భాషలలో ఒకటిగా ఉంది. మన దేశంలో గానీ మన రాష్ట్రంలో గానీ ఆంగ్ల మాధ్యమంలో చదివే విద్యార్థులను పరిశీలిస్తే.. వారికి బోధించే ఉపాధ్యాయులు కేవలం పాఠాన్ని చెప్పడానికి సాంకేతిక పదాలు మాత్రమే ఆంగ్ల భాషలో ఉపయోగిసూ,్త మిగిలినదంతా మాతృ భాషలోనే చెప్తారు. బోధించే వారికి కూడా ఆ భాషలో సరైన భావ ప్రసారం ఉండదు. ఏది ఏమైనప్పటికీ కాస్తో కూస్తో సినిమా పరిశ్రమల వాళ్ళు మాతృభాషలో సినిమాలు తీసి సేవ చేస్తున్నట్టు కనిపిస్తోంది. వాళ్లు కూడా ఆంగ్ల మాధ్యమంలో సినిమాలు తీయడం మొదలుపెడితే మన భాష పరిస్థితి ఇక అంతే. కేవలం మాట్లాడే వాళ్ళు ఉంటే భాష బతికేస్తుంది అనే మాట తప్పు. ఆ భాషలో రచనలు రావాలి. వాటిని చదివే వాళ్ళు ఉండాలి. ఈ తరంలో సొంతంగా ఐదారు వాక్యాలు కూడా తెలుగులో సరిగా రాయలేని వాళ్ళు గణనీయమైన శాతంలో ఉన్నారు. ఇది చాలా ఆందోళనకరమైన విషయం. మాతృభాషలో విద్యాబోధన లేకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రులు తమ పిల్లల చదువు గురించి కనీసం తెలుసుకునే పరిస్థితి కూడా లేదు. దీన్ని మార్చా ల్సిన అవసరం ఉంది. మాతృభాషలో చదువుని ప్రారంభించిన విద్యార్థి ఒత్తిడిని సులభంగా అధిగమించగలడు. ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులు వారి వారి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోవడానికి, వారు రాజకీయ కిరీటాలు ధరించడానికి, వాళ్లు ప్రజలలోకి చొచ్చుక ుపోవడానికి చేసింది వారికి మాతృభాషలో ఉన్న పట్టు మాత్రమే అనే విషయాన్ని కూడా గుర్తించాలి.-(గొడవర్తి సూర్యనారాయణ)

2047నాటికి స్వర్ణాంధ్ర కలను సాకారం చేస్తాం

ఏపీ అసెంబ్లీలో గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రసంగం..!
‘‘ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు అనేక పథకాలు ప్రవేశపెట్టాం. అర్హులైన అందరికీ సొంతిల్లు ఉండాలనేది మా ఆకాంక్ష. ప్రతి కుటుంబానికి సురక్షిత తాగునీరు, విద్యుత్‌ ఉండాలి. యువతకు మెరుగైన శిక్షణ ఇవ్వాలనేది మా విధానం. పీ-4 విధానం ద్వారా మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్రంలో పేదరికం నిర్మూలిం చేందుకు కట్టుబడి ఉన్నాం. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు సరికొత్త విధానాలు తెచ్చాం. ఎన్టీఆర్‌ వైద్యసేవా ట్రస్ట్‌ ద్వారా పేదలకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నాం’’. – జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌, గవర్నర్‌
ఎన్నికల్లో ప్రజలు మా ప్రభుత్వానికి తిరుగు లేని మెజారిటీ ఇచ్చారని,ప్రజల కోరిక మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పాటైందని గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ అన్నారు.ఫిబ్రవరి 24న ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి.ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగించారు.
గత ఐదేళ్లలో రాష్ట్రం అనేక ఇబ్బందులకు గురైం దని,గత ప్రభుత్వ పాలనతో రాష్ట్రం ఎంతో నష్ట పోయిందని గవర్నర్‌ వ్యాఖ్యానించారు.సూపర్‌ సిక్స్‌ పథకాల ద్వారా ప్రజలకు మేలు చేస్తున్నా మన్న గవర్నర్‌, అధి కారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ను రద్దు చేశామని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్‌సీ దస్త్రంపై సంతకం చేశామని, అన్న క్యాంటీన్లు తెచ్చి పేదవాళ్ల ఆకలి తీరుస్తున్నామని తెలిపారు. తలసరి ఆదాయం పెరిగింది: కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రాన్ని గాడి లో పెడుతున్నా మన్న గవర్నర్‌,తమ ప్రభుత్వం వచ్చాక తలసరి ఆదాయం పెరిగిందని చెప్పారు. అవకా శాలిస్తే ప్రతి ఒక్కరూ మెరుగైన సేవలు అందిస్తారని అన్నారు. 2047 నాటికి స్వర్ణాంధ్ర కలను సాకారం చేస్తామని వెల్లడిరచారు. ప్రతినెలా 1వ తేదీనే ఇంటికి వెళ్లి పింఛన్లు అందిస్తున్నామని,పేద విద్యార్థులకు ఉప కారవేతనాలు అందిస్తు న్నామని అన్నారు.విద్య, వైద్యం,మౌలికవసతు లపై ప్రత్యేక దృష్టి సారించామన్న గవర్నర్‌, బీసీవర్గాలు సమాజానికి వెన్నెముక అని వారికోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు.స్థానిక సంస్థలు, నామినేటెడ్‌ పోస్టుల్లో బీసీల కు 34శాతం రిజర్వేషన్లు కేటాయించినట్లు గుర్తు చేశారు.
టూరిజంలో పెట్టుబడులు పెరిగాయి: ‘మన బడి – మన భవిష్యత్తు’ ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామని గవర్నర్‌ తెలిపారు. మెరిట్‌ ఆధారంగా 9వర్సిటీలకు వీసీలను నియమించామని, స్థానిక సంస్థల్లో పోటీకి ఇద్దరు పిల్లలే ఉండాలన్న నిబంధన ఎత్తివేశామని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం వచ్చాక పారిశ్రామికవేత్తలను ఆహ్వానించామని,ఐటీఐలు, పాలిటెక్నిక్‌ల్లో 200 స్కిల్‌ హబ్‌లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ఉండాలనేది సీఎంఆకాంక్ష అని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో టూరిజంలో పెట్టు బడులు పెరిగాయని గవర్నర్‌ నజీర్‌ అన్నారు. ఎంఎస్‌ ఎంఈలకు అండగా ఉన్నామని,అన్నివిధాలా ప్రోత్స హిస్తున్నామని చెప్పారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే దిశగా అనేక చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.
రాయలసీమలో కరవు అనేదే ఉండదు: తాగు,సాగు, పారిశ్రామిక అవసరాలకు నీరందించేలా కార్యక్రమా లు చేపట్టామని, 2027నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. పోలవరం-బనకచర్ల పూర్తయితే రాష్ట్ర రూపురేఖలు మారతాయని, రాయలసీమలో కరవు అనేదే ఉండదని ఆశాభావం వ్యక్తం చేశారు. గత ఐదేళ్ల పాలనతో రాష్ట్రం ఆర్థిక పతనం అంచుకు చేరిందన్న గవర్నర్‌, రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని 7శ్వేతపత్రాల ద్వారా ప్రజలకు తెలి పామని గుర్తుచేశారు. గత ఐదేళ్ల పాలనలో వనరుల మళ్లింపు, సహజవనరుల దోపిడీ జరిగిందని మండి పడ్డారు.గతఐదేళ్ల పాలనలో ఎక్సైజ్‌,ఇసుకలో లోప భూయిష్ట విధానాలు జరిగాయన్న గవర్నర్‌, ప్రభుత్వ పన్నులను సైతం దారి మళ్లించారని చెప్పారు. రూ.6.5లక్షలకోట్ల పెట్టుబడులు పెట్టారు: రూ.2, 488 కోట్ల ఆర్థికసంఘం గ్రాంట్‌తో స్థానిక పాలన బలోపేతం చేశామని గవర్నర్‌ నజీర్‌ తెలిపారు. పోలవరం,అమరావతి ప్రాజెక్టులను మళ్లీ పట్టాలెక్కిం చామని, విశాఖ ఉక్కు పరిరక్షణ, రైల్వే జోన్‌ ఏర్పాటు హామీలు నెరవేర్చామని గుర్తు చేశారు. సుస్థిర వృద్ధికి దోహదపడే 22కొత్త విధానాలద్వారా బలమైన పునాది వేశామన్న గవర్నర్‌,గూగుల్‌, ఆర్సెలర్‌ మిట్టల్‌, టాటా పవర్‌ కంపెనీలను ఆకర్షించినట్లు తెలిపారు. గ్రీన్‌కో గ్రూప్‌, బీపీసీఎల్‌, టీసీఎస్‌ కంపెనీలను ఆకర్షించా మని, ఇన్వెస్టర్లు ఇప్పటివరకు రూ.6.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు వెల్లడిరచారు. ఆయా పెట్టు బడుల ద్వారా 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు పెరిగాయని,రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ రూ.16లక్షల కోట్లకు విస్తరించిందని అన్నారు.
కందుకూరి వ్యాఖ్యలు ప్రస్తావించిన గవర్నర్‌: తలసరి ఆదాయం కూడా రూ.2.68 లక్షలకు పెరిగిందని, వ్యవసాయం, పరిశ్రమలు,సేవల రంగాలు వృద్ధి చెందాయని అన్నారు.ఈ సందర్భంగా సంఘ సంస్కర్త కందుకూరి వ్యాఖ్యలను గవర్నర్‌ ప్రస్తావించారు. ప్రతి వ్యక్తిలో ప్రతిభ ఉంటుందని, అవకాశమిస్తే బయటకు వస్తుందని చెప్పారు. తమ ప్రభుత్వం స్వర్ణాంధ్ర-2047 దిశగా వెళ్తోందని, సమాజ అభివృద్ధికి సంక్షేమం, అభివృద్ధి కలిసికట్టుగా వెళ్లాలని సూచిం చారు. అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉండాలనేదే తమ విధానమని స్పష్టంచేశారు. ఉమ్మడి రాష్ట్రంలోనే ఐటీ విప్లవానికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారని కొనియాడారు. అమెరికాలోని ప్రవాస తెలుగువాళ్ల తలసరి ఆదాయం ఎక్కువని తెలిపారు. ప్రస్తుతం ఏపీ మరో విప్లవానికి నాయకత్వం వహిస్తోందని, పరిపాలన,పరిశ్రమలు,ఆర్థిక వృద్ధిలో ఏఐను విని యోగిస్తున్నామని చెప్పారు.
‘‘స్వర్ణాంధ్ర-2047కు పది సూత్రాలతో విజన్‌ రూపొందించాం.పేదరిక నిర్మూలన, మానవ వనరుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాం. యువతకు నైపు ణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన,నీటి భద్రత, రైతు-అగ్రి టెక్‌,గ్లోబల్‌ బెస్ట్‌ లాజిస్టిక్స్‌,వ్యయ నియంత్రణ, విద్యుత్‌-ఇంధనం ప్రత్యేక దృష్టి పెట్టాం. ‘పీపుల్‌ ఫస్ట్‌’ విధానంతో స్వర్ణాంధ్ర సాధనకు సమగ్ర రోడ్‌మ్యాప్‌ రూపొందించాం.పేదలకు ఆహార భద్రత కోసం పీడీఎస్‌ను బలోపేతం చేశాం.ఎస్సీ,ఎస్టీ కుటుంబా లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అంది స్తున్నాం’’. -జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌, గవర్నర్‌
24 అంశాలపై చర్చ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కూట మి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్‌ ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది.రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించాక సభ వాయిదా పడనుంది. అనంతరం జరిగే శాసనసభ సలహా కమిటీ సమావేశంలో అసెంబ్లీ ఎన్నిరోజులు నడపాలన్నది నిర్ణయించను న్నారు. ఎన్నికల హమీల అమలుకు ప్రాధాన్యం ఇస్తూ ఈ నెల 28వ తేదీన 2025-26వార్షిక బడ్జెట్‌?ను ఉభయ సభల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. దాదాపు 3 వారాల పాటు బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
15% వృద్ధి సాధనే లక్ష్యంగా బడ్జెట్‌ రూపకల్పన: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఉదయం 10 గంటలకు గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. గత ఎనిమిది నెలల్లో ప్రభుత్వం సాధించిన ప్రగతి, అందిస్తున్న సంక్షేమం, 2047లక్ష్యాలు, ఆర్థిక ఇబ్బందులు తదితర అంశా లపై గవర్నర్‌ ప్రసంగం ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 28వ తేదీన 2025-26 ఆర్థిక సంవత్స రానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌?ను చట్టసభలకు సమర్పించనున్నారు. సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లుగా బడ్జెట్‌ రూపకల్పన చేసినట్లు సమాచారం. 15% వృద్ధి సాధనే లక్ష్యంగా బడ్జెట్‌ రూపకల్పనపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. కిందటి ఏడాది సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడంతో తొలుత ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను పాత ప్రభుత్వం సభకు సమ ర్పించింది.
రాష్ట్ర నావకు ఒక దిక్సూచిలా బడ్జెట్‌: ఆతర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు, అప్పులు ఇతరత్రా అంశాల కారణంగా మరో నాలుగు నెలల కాలానికి ఓట్‌ ఆన్‌ అకౌంట్‌?ను సమర్పించింది. రాష్ట్ర నావకు ఒక దిక్సూచిలా నిలిచి రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులను, అభివృద్ధిని గాడిన పెట్ట డంలో ఈ నెల 28న ప్రవేశపెట్టే పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్‌ ఎంతో కీలకం కానుంది. ఎన్డీయే ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు, మేనిఫెస్టోలో అంశాలకు ఈబడ్జెట్‌లో స్థానం కల్పించాల్సి ఉన్నందున, అందుకు తగ్గట్టుగా దీనిని రూపొందించినట్లు తెలుస్తోంది. హామీల అమలుకు తగ్గట్టుగా వనరుల సమీకరణ ఇక్కడ కీలకం కానుంది. బడ్జెట్‌ సమావేశాల సంద ర్భంగా ఈ అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించింది.
కేంద్ర పథకాలను వీలైనంతగా వినియోగించుకుని: ముఖ్యమంత్రి ఆర్ధికశాఖ అధికారులతోను, ఆర్ధిక మంత్రితోను బడ్జెట్‌ రూపకల్పనపై ఇప్పటికే పలు మార్లు సమావేశమయ్యారు. ఆ తర్వాత ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్‌ అన్ని ప్రభుత్వశాఖలకు సంబం ధించిన మంత్రులు, ఆయా శాఖల ముఖ్య కార్యదర్శు లు, కార్యదర్శులతో బడ్జెట్‌ ప్రతిపాదనలపై కూలం కషంగా చర్చించారు. ఆయా శాఖల్లో వారి ప్రాధాన్యా లపై చర్చించారు. రాష్ట్ర ఆర్థిక చిత్రం పరిమితులు ప్రకారం బడ్జెట్‌ రూపకల్పన చేసినట్లు సమాచారం. శాఖల వారీగా వారి ప్రాధాన్యాలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర ఆర్థిక చిత్రం పరిమితులు కూడా తెలుపుతూ ఎన్నికల హామీల ప్రకారం బడ్జెట్‌ రూప కల్పన,అందుకు తగ్గట్టుగా కేటాయింపులు ఉండ నున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రాయోజిత పథకాలను వీలైనంతగా వినియోగించుకుని కేంద్రం నుంచి నిధు లు రాబట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. విద్యా, వైద్య శాఖల ద్వారా కేంద్రం నుంచి అదనపు నిధులు లభించవచ్చని అంచనా వేస్తున్నారు.-గునపర్తి సైమన్‌

1 2