హామీల ఉల్లంఘనలు సరికొత్త వాగ్దానాలు

గత ఎన్నికల సందర్భంగా రైతులకు, డ్వాక్రా మహిళలకు, చేనేత కార్మికులకు రుణ మాఫీ చేస్తానని, చంద్రబాబు నాయుడు వాగ్దానం చేశారు. ఇప్పుడు పసుపు కుంకుమల వల వేశారు. దాన్ని కూడా నమ్మరన్న అనుమానం వచ్చింది కాబోలు! మళ్లీ అధికారంలోకి వస్తే మరోసారి పసుపు కుంకుమ ఇస్తానని కొత్త వాగ్దానం ప్రకటించారు. జగన్‌ కూడా డ్వాక్రా రుణ మాఫీ అంటున్నారు.
రూ.16 వేల కోట్లు రుణమాఫీ చేశామంటూ అబద్ధాలు చెప్పుకుంటూ ఈ కాలమంతా ప్రచారం చేశారు. 2014 డిసెంబరు 31నాటికి డ్వాక్రా సభ్యులు రూ.13 వేల 844 కోట్లు బ్యాంకులకు బకాయి ఉన్నారు. రూ.2 వేల 174కోట్లు ఓవర్‌ డ్యూఅయ్యాయి. రూ.888 కోట్లు ఎన్‌పిఎ గా ప్రకటించబడ్డాయి. రుణాలు ప్రభుత్వం జమ చేసినట్లయితే మహిళలు వడ్డీల మీద వడ్డీలు కట్టాల్సిన దుస్థితి వచ్చేది కాదు. 2018లో సెప్టెంబరులో జరిగిన శాసనసభ సమావే శాల్లో డ్వాక్రా రుణ మాఫీ వాగ్దానం ప్రకారం ఎంత రుణమాఫీ చేశా రని ప్రశ్నించగా ఒక్క రూపాయి కూడా రుణమాఫీ చేయలేదన్న కఠోర వాస్తవం సంబంధిత శాఖామంత్రి ఇచ్చిన సమాధానంలో వెల్లడైంది. గత ఎన్నికలలో హామి ఇచ్చిన ప్రకారం రుణ మాఫీ చెయ్యలేదనేది కఠోర వాస్తవం. మద్య నిషేధ హామీతో అధికారంలోకి వచ్చిన ఎన్‌టిఆర్‌ స్థానంలో చంద్రబాబు నాయుడు అర్ధంతరంగా అధికారంలోకి వచ్చిన కాలంలోనూ అంతే. మద్య నిషేధ హామీకి తూట్లు పొడిచారు. కల్తీ మద్యం నిరోధం పేరిట మద్యం షాపులకు లైసెన్స్‌ ఇవ్వడం ప్రారంభించి, డ్వాక్రా పేరిట మహిళలకు వల వేశారు. 1000 రూపాయలు పొదుపు చేసుకొంటే రూ.1000 జమ చేస్తానని పెద్ద ఎత్తున స్వయం సహాయక గ్రూపులను ఏర్పాటు చేశారు. లక్షల మంది మహిళలను సమీకరించేందుకు డ్వాక్రాను ఒక సాధనంగా మార్చుకున్నారు.
నిరంకుశ పెత్తనం
మహిళలు, పిల్లల అభివృద్ధి కోసం ప్రవేశ పెట్టబడిరది డ్వాక్రాపథకం. గ్రూపు పొదుపు చేసుకున్న డబ్బులకు నాలుగు రెట్ల నుండి 10 రెట్ల వరకు అదనంగా బ్యాంకు రుణ సౌకర్యాన్ని కల్పిం చాలని రిజర్వుబ్యాంక్‌ ఆదేశించింది. అయితే ప్రారంభం నుంచే ఈ స్వయం సహాయక గ్రూపులు రాజకీయ ప్రయోజనాలకు అను గుణంగా తీర్చిదిద్దబడ్డాయి. ఎమ్‌ఎల్‌ఎలు, మంత్రులు, ముఖ్య మంత్రుల సభలు జయప్రదం చెయ్యడానికి వీరిని వాడుకోవడం మొదలుపెట్టారు. డిఆర్‌డిఎ ఉద్యోగులకు గ్రామ సేవికలకు అధికారా లను కట్టబెట్టారు. రుణం మంజూరు కావాలంటే సభలకు హాజరు కావలసిందేనని నమ్మబలికారు. గ్రూపుల తీర్మానాలను నామ మాత్రం చేసి అధికారుల ఇష్టారాజ్యంగా, అధికార పార్టీ ప్రయోజనాలకు అను గుణంగా గ్రూపులు నిర్వహించబడుతూ వచ్చాయి. మహిళలు, పిల్లల సమగ్ర అభివృద్ధికి ఉద్దేశించబడిన స్వయం సహాయక గ్రూపులు, పొదుపు రుణాల గ్రూపులుగా మార్చబడ్డాయి. మహిళల చొరవ, నిర్ణయాధికారం, చైతన్యవంతమైన కృషి, ఆర్థిక స్వావలంబన అణచి వేయబడ్డాయి. మహిళలు నాయకులుగా ఎదిగే క్రమాన్ని నీరు గార్చాయి.
గోరంత లబ్ధి, కొండంత భారం
స్వప్రయోజనాల సాధనే లక్ష్యంగా, ఆంధ్ర ప్రదేశ్‌లో అధికార పార్టీలు పొదుపు గ్రూపు లను ప్రోత్సహించాయి. ఫలితంగా గోరంత లబ్ధి, కొండంత భారంగా గ్రూపులు నడుస్తు న్నాయి. మహిళల శ్రమను కారు చౌకగా బ్యాంకులు, ప్రభుత్వం వినియోగించు కొంటున్నాయి. డ్వాక్రా మహిళలు పొదుపు చేసుకున్న వేలకోట్ల రూపాయలను వడ్డీ లేకుం డానే బ్యాంకులు ఉపయోగించు కుంటు న్నాయి. పొదుపు డబ్బులను బ్యాంకుల నుండి తీసుకోవడానికి ఆంక్షలు పెడుతున్నాయి. గ్రూపుల నిర్వహణ ఖర్చులు, గ్రామసేవికల వేతనాలు డ్వాక్రా మహిళలే చెల్లించుకుం టున్నారు. బలవంతపు డిపాజిట్లు, ఇన్సూ రెన్సులు కట్టించి వడ్డీ రేట్ల భారాన్ని మహిళల మీద మోపారు. వీటితో పాటు అధికార పార్టీ సభలకు బలవంతపు ప్రేక్షకులుగా మార్చ బడ్డారు. 2008లో సెస్‌ అంచనాల మెరకు 2004-5, 2010-11 మధ్య బ్యాంకుల నుండి డ్వాక్రా గ్రూపులకు రూ.1200 కోట్లు నుంచి 8,600 కోట్లు రుణాలు మంజూరు పెరిగింది. 2012నాటికి రాష్ట్రంలో12.5 లక్షల గ్రూపుల్లో1.36 కోట్ల మంది మహి ళలు ఉన్నారు. ఈ మొత్తం గ్రూపులకు వడ్డీల మొత్తం జమ చేయాల్సివస్తే రూ.1,400 కోట్లువడ్డీల కింద చెల్లించాల్సి వస్తుందని లెక్కించబడిరది. అంటే డ్వాక్రా గ్రూపులకు పెద్ద ఎత్తున రుణాలు మంజూరు చెయ్యడం ద్వారాప్రభుత్వం,బ్యాంకులు లబ్ధిపొందాయి.
పసుపు కుంకుమల మాయ
2014లో రుణ మాఫీ హామీ ద్వారా టిడిపి ఓట్లు వేయించుకుని అధికారాన్ని పొందింది. మహిళలు మాత్రం పెనాల్టీలు కట్టారు. ముక్కు పోగులు, చెవి కమ్మలు, అమ్ముకుని అప్పులు చెల్లించారు. అవి కూడా లేని వాళ్ళ గ్రూపులు రద్దయ్యాయి. అప్పటికి గ్రూపులు చెల్లించవలసిన మొత్తం రూ.2,514 కోట్లు మాత్రమే. ఈ మొత్తం కూడా చెల్లించనందున డ్వాక్రా గ్రూపులు రుణగ్రస్త గ్రూపులుగా మారి పోయాయి. అధిక వడ్డీలకు అప్పులు చేసి, లేక సొంతంగా అప్పులు చెల్లించగలిగిన వాళ్ళు చెల్లించగా, మిగిలిన వాళ్ళు బ్యాంకుల నుండి నోటీసులను అందుకున్నారు. ఇప్పుడు పసుపు కుంకుమ కింద ఇచ్చిన డబ్బులు కొన్ని చోట్ల పాత బకాయిలకు చెల్లవేశారు. పసుపు, కుంకుమ చెక్కుల పంపిణీ చేస్తూ తెలుగు దేశానికి ఓట్లు వేస్తామని, బాబు మళ్ళీ రావా లని ప్రమాణాలు చేయించుకున్నారు.
వడ్డీ లేని రుణాలు
2012లో డ్వాక్రా గ్రూపులకు వడ్డీ లేని రుణా లు ఇస్తామని జీవో జారీ చేసింది. ఆ మేరకు సంవత్సరానికి రెండున్నర వేలకోట్ల రుపా యలు వడ్డీ కింద మంజూరు చేయాలి. సకాలంలో వడ్డీలు చెల్లించినట్లయితే గ్రూపు లకు అదనపు వడ్డీ భారం పడదు. కాని ఆ ప్రకారం టిడిపి ప్రభుత్వం వడ్డీ చెల్లించ నందున, అదనపువడ్డీల భారం గ్రూపుల మీద పడుతుంది.
ఐక్యతతో అధిగమించాలి
టిడిపి ప్రభుత్వం ఇచ్చిన రుణ మాఫీ హామీతో సుమారుగా మూడున్నర లక్షల గ్రూపులు రుణాల ఊబిలో కురుకుపోయి రద్దయ్యాయి. ప్రభుత్వం చేసిన తొలి సంతకానికి విలువ ఇచ్చి కనీసం రెండున్నర వేల కోట్ల రూపా యలు జమ చేస్తే అన్ని గ్రూపులు సజీవంగా ఉండటమే కాక, వారి ఆర్థిక కార్యక్రమాలు పెరిగేందుకు దోహద పడేది. ఇప్పుడు ఎన్ని కల ముందు ఆర్భాటంగా ప్రకటించిన పసు పు, కుంకుమ ఆనాడే రుణ మాఫీకి జమ చేస్తే రాష్ట్రానికి, మహిళలకు, బ్యాంకులకు ఎంతో లబ్ధి చేకూరేది. ఎన్‌ఆర్‌ఎల్‌ఎమ్‌ (నేష నల్‌, రూరల్‌ లైవ్లో హడ్‌ మిషన్‌) పథకం కింద రూ.10 లక్షల వరకూ 7 శాతం వడ్డీకే లింకేజి లోన్‌ ఇవ్వగలిగే అవకాశం వుంది. కాని దానిని అమలు చేయడానికి ప్రభుత్వం నుంచి ప్రయత్నమే లేదు. నైపుణ్య శిక్షణ, ఉత్పత్తి యూనిట్లు, మార్కెటింగ్‌ సదుపా యాలు కాగితాలకే పరిమితమయ్యాయి. స్త్రీ నిధి రుణాల పై కూడా వడ్డీ జమ చేయాలి. ప్రభుత్వం ఈ రుణాలకు ముక్కు పిండి మరీ వడ్డీ వసూలు చేస్తోంది.
పసుపు కుంకుమలు, రుణ మాఫీ వాగ్దానాలు ఓట్ల కోసం వేసే వల మాత్రమే. స్వయం సహాయక గ్రూపులు స్వయం నిర్ణయాధి కారంతో నడవాలి. అందుకు ప్రభుత్వం సహా యం ఇవ్వాలి. నిర్వహణకోసం అయ్యే ఖర్చు లు, ఫెసిలిటేటర్లు (ఏనిమేటర్లు) జీతాల ఖర్చు లు ప్రభుత్వమే భరించాలి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ వడ్డీ రాయితీని ఏనెలకా నెల జమ చేయాలి. నైపుణ్య శిక్షణ,మార్కెటింగ్‌ సదు పాయాల కోసం బహుళ జాతి కంపెనీల మీద ఆధారపడడంగాక ప్రత్యామ్నాయ పద్ధ తులు రూపొందించాలి. సామాజిక చైతన్యం తో సమస్యల పరిష్కారంలో డ్వాక్రా మహిళలు భాగస్వాములైతే పాలక వర్గాల వంచనలు సాగవు. సాగబోవు.-డి.రమాదేవి