విహార యాత్రలు.. పర్యావరణ విధ్వంసకాలు..!

ఇటీవల కాలంలో నిర్వహించిన రోదసి విహార యాత్రలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ప్రపంచ కుబేరులైన జెఫ్‌ బెజోస్‌, రిచర్డ్‌ బ్రాన్‌సన్‌ తాము రూపొందించిన స్ప్రేస్‌ క్రాఫ్ట్‌ ద్వారా రోదసి విహార పర్యటనకు వెళ్లివచ్చారు. మరో అపర కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ కూడా తన స్పేస్‌ ఎక్స్‌ సంస్థ ద్వారా రోదసి విహార యాత్ర నిర్వహించాడు. చూడడానికి సైంటిఫిక్‌ అద్భుతంగా కనిపిస్తున్నప్పటికీ రోదసి విహార యాత్రలు అనే కాన్సెప్ట్‌ పెరిగితే పర్యావరణానికి పెద్ద హాని జరగనుంది. ఇప్పటికే ప్రపంచంలో అత్యంత ధనవంతులుగా ఉన్న ఒక్క శాతం ప్రజలు పర్యావర ణానికి తీవ్ర హాని చేస్తున్నారు. ప్రపంచ జనాభాలో సగం మంది విడుదల చేసే కర్బన ఉద్గారాల కన్నా ఈ ఒక్క శాతం ధనవంతులు విడుదల చేసే కర్బన ఉద్గారా లు రెండిరతలు అధికంగా ఉన్నాయి. తాజా రోదసి విహార యాత్రలు కూడా అత్యంత ధనవంతులు మాత్రమే చేయగలరు. వీరి వినోదం, ఉల్లాసం కోసం జరపబోయే పర్యాటక యాత్రలు ప్రపంచ మానవాళికి ప్రళయంలా మారనున్నాయి.

ఇటీవల విడుదల చేసిన ప్రపంచ అసమానతల నివేదిక ప్రకారం రోదసిలో ఒక స్పేస్‌ క్రాఫ్ట్‌ 11 నిమిషాలు పాటు ప్రయాణించడానికి ఒక ప్రయాణీకుడికి 75 మెట్రిక్‌ టన్నుల కర్బన ఉద్గారాలను వదులుతుంది. వాస్తవానికి ఇది కూడా చాలా తక్కువగా వేసిన లెక్క. ఒక అంచనా ప్రకారం ఒక ప్రయాణీకుడికి దాదాపు 200 మెట్రిక్‌ టన్నుల నుండి వెయ్యి మెట్రిక్‌ టన్నుల వరకు కర్బన ఉద్గారాలు విడుదల అవుతాయి. అంటే అత్యంత ధనవంతుడు రోదసిలో తన విహార యాత్ర కోసం దాదాపు 200 మెట్రిక్‌ టన్నుల కార్బన్‌ను విడుదల చేసి భూ ఆవరణాన్ని విషతుల్యం చేస్తున్నాడు. అదే ప్రపంచ జనాభాలో వంద కోట్ల మంది జనాభా విడుదల చేసే కర్బన ఉద్గారాలు ఏడాదికి కేవలం ఒక కోటి మెట్రిక్‌ టన్నుల కన్నా తక్కువ గానే ఉంటున్నాయి. ఒక ధనవంతుడి రోదసి విహారయాత్ర ప్రపంచ జనాభా మొత్తం ఏడాది పాటు విడుదల చేసే కర్బన ఉద్గారాల కన్నా దాదాపు వంద రెట్లు ఎక్కువగాఉంటుంది. మొదటి రోదసి విహార యాత్రలను విజయ వంతంగా పూర్తి చేసిన పై ముగ్గురు అపర కుబేరులు దీన్నొక పర్యాటక వ్యాపారంగా మార్చే పనిలో ఉన్నారు. అందులో ఒక సంస్థ రోదసిలో ఒక హోటల్‌నే నిర్మించాలని ఆలోచి స్తున్నది. ఈ రోదసి హోటల్‌లో మూడు వందల మంది పర్యాటకులు, వంద మంది సిబ్బంది ఉంటారు. ఇక ఇటువంటి ప్రయోగాల ద్వారా పర్యావర ణానికి ఎంత నష్టం జరుగు తుందో ఊహకే అందని విషయంగా ఉంది. విలాసాల కోసం విషాన్ని కక్కుతున్నారు.ప్రపంచ జనాభాలో ఒక్క శాతం అత్యంత ధనవంతులు తమ విలాస వంతమైన జీవితంతో ప్రకృతితో చెలగాటమాడు తున్నారు. వీరు ఉన్నది ఒక్క శాతమే అయినా వీరి దర్జాతో కూడిన జీవన విధానం మొత్తం కర్బన ఉద్గారాల్లో 15 శాతం మేరకు కారణ మౌతున్నారు. గత 25ఏళ్ల కాలంలో వీరి ద్వారా విడుదలౌతున్న కర్బన ఉద్గారాలు 60 శాతం మేరకు పెరిగాయి. ప్రపంచ జనాభాలో అత్యంత ధనవంతులైన 10 శాతం జనాభా అయితే మొత్తం ఉద్గారాల్లో 52శాతం విడుదల చేస్తున్నారు. ఈ ధనవంతులు తమ ఖరీదైన, విలాసవంతమైన జీవితం ద్వారా పర్యావరణం లోకి విషాన్ని కక్కుతున్నారు. ఒక్కొక్కరికి నాలుగైదు కార్లు, బంగళాలు, ప్రయివేట్‌ హెలికాఫ్టర్లు, విమానాలు, క్రూయిజ్‌ షిప్‌లు.. ఇలా విలాసవంతమైన జీవితం వారికి సుఖాన్ని ఇస్తుందేమో కానీ భూమాతకు విషాన్ని పంచు తోంది. ధనవంతులు ఎక్కువగా కొనే ఎస్‌యువి కార్లు ప్రపంచం మొత్తంలో 2010లో 3.5 కోట్లు ఉండగా ప్రస్తుతం అవి 20 కోట్లకు పెరిగాయి. మామూలు కార్ల కన్నా ఎస్‌యువి కార్లు ఎక్కువ కార్బన్‌ను విడుదల చేస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా22 వేల ప్రయి వేట్‌ విమానాలు ఉన్నాయి. ఒక్క అమెరికా లోనే 12వేల విమానాలున్నాయి. వీటి ద్వారా వచ్చే కర్బన ఉద్గారాల కారణంగా ఒక్క శాతం అత్యంత ధనవంతులు 15శాతం మేర కాలుష్యానికి కారణమౌతున్నారు. ఒక పక్క తాగడానికి రక్షిత మంచి నీరు లేక ఎంతోమంది చనిపోతుంటే ఈ ధనవంతులు తమకున్న ప్రతి ఇంట్లోనూ ఒక స్విమ్మింగ్‌ పూల్‌ కట్టించుకొని నీటిని వృధా చేస్తున్నారు. ప్రపంచంలో ప్రతి ముగ్గురిలో ఒక్కరికి సురక్షిత మంచినీరు దొరకడం లేదు. కానీ మరోవైపు ఒక స్విమ్మింగ్‌ పూల్‌ నిర్వహణ ద్వారా 60 వేల గ్యాలన్ల (4 లీటర్లు ఒక గ్యాలన్‌) నీరు వృధా అవుతోంది. అదే ఒక సాధారణ కుటుంబం రోజుకు 152 లీటర్ల నీటిని మాత్రమే వాడుకుంటోంది. ధనవంతుల విలాసవంతమైన జీవితం పర్యావరణానికి తీవ్ర హాని కల్గిస్తోంది. అదే విధంగా భూమండలం పైన సాధారణ ప్రజానీకానికి మృత్యు ఘంటికలను మోగిస్తోంది. పర్యావరణ కాలుష్యం కూడా ఒక వర్గ సమస్యే వర్గ పోరాటం ద్వారా సమసమాజ స్థాపనకు పాటుపడే వామపక్ష శక్తులన్నీ పర్యావరణ కాలుష్యాన్ని కూడా ఒక వర్గ సమస్యగా చూడాలి. ఎందుకంటే పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం వల్ల నష్టపోతున్న వారిలో అత్యధికులు శ్రామికులు, కర్షకులు, కార్మికులే. అత్యంత ధనవంతుల ధన దాహం ఒకవైపు, విలాసవంతమైన జీవన విధానం మరోవైపు పర్యావరణాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. కర్బన ఉద్గారాల కారణంగా భూతాపం పెరగడం, సముద్ర మట్టాలు పెరగడం, ఉష్ణోగ్రతలు భరించలేని స్థాయికి రావడం, భూకంపాలు,సునామీలు రావడం వీటిన్నింటి వల్లా ఎక్కువ నష్టపోయింది శ్రామికులు, కార్మికులే. 2019 వేసవి కాలంలో వీచిన వడగాల్పుల కారణంగా బీహార్‌లో ఒక్క రోజులోనే 40మంది చనిపోయారు. వీరంతా కర్షకులు,కార్మికులే. రానున్న దశాబ్ద కాలంలో దక్షిణాసియా,ఆఫ్రికాలలో వాతావరణ మార్పుల వల్ల 17 కోట్ల మంది పిల్లలు ప్రమాదంలో పడనున్నారు. వీరంతా కార్మికులు, మధ్యతరగతి కుటుంబాల పిల్లలే. చాలాఏళ్ల తర్వాత 2019లో ఆకలి సూచి పెరిగింది. రానున్న ఏళ్లలో ఆహారోత్పత్తి 30 శాతం మేరకు పడిపోనుంది. ఆహారానికి 98 శాతం డిమాండ్‌ పెరగనుంది. 2050 నాటికి 50 శాతం మంది ప్రజలు మంచినీటి సమస్యను ఎదుర్కోనున్నారు. ఈ సమస్యలన్నింటికి మొదట ప్రభావితమయ్యేది కార్మిక, కర్షకులే. కాబట్టి ఇప్పటి నుండే మేల్కొనాలి.– గమిడి శ్రీనివాస్‌