విశాఖలో ప్రాణాలు తీస్తున్న ఫార్మా కంపెనీలు

విశాఖ ఫార్మా పరిశ్రమలు ప్రజల పాలిట శాపంగామారుతున్నాయి. వరస ప్రమా దాలు జరగడం, కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసిపోవడం పరిపాటిగా మారింది. ఏటా లాభాల లెక్కలు వేసుకుంటున్న కంపెనీలు… ప్రాణాలు కోల్పోతున్న కార్మికుల సంఖ్య పెరిగి పోతున్నా సరే ఖాతరు చేయడం లేదు. యాజ మాన్యాలు భద్రతా ప్రమాణాలను తుంగలోకి తొక్కుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తు తున్నాయి. పరిశ్రమల్లో భద్రతా లోపాలు కార్మికుల ప్రాణాలను బలిగొంటున్నాయి. అనకాపల్లి జిల్లాలోని పరవాడ ఫార్మా, అచ్యుతాపురం ప్రత్యేక ఆర్ధిక మండలిలోని పలు పరిశ్రమల్లో తరచూ జరుగుతున్న ప్రమాదాలతో కార్మికలోకం వణికిపోతోంది. యాజమాన్యాల నిర్లక్ష్యంతో చోటు చేసుకుంటున్న అగ్ని ప్రమాదాలు,పేలుళ్లతో ఉద్యోగులతో పాటు పరిసర ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రమాదాలు జరిగి నప్పుడే అధికారులు హంగామా చేస్తున్నారు. తర్వాత పట్టించుకోవడం లేదు. పరవాడ ఫార్మాసిటీలోని లారస్‌ ల్యాబ్స్‌లో డిసెంబర్‌ 19న జరిగిన అగ్ని ప్రమా దంలో నలుగురు మరణించగా,ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈఘటనతో పారిశ్రామిక ప్రాంతమంతా ఉలిక్కిపడిరది. 2022 జనవరి నుంచి డిసెంబర్‌ ఏడాదిలోనే పది ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. సుమారు పదిమంది వరకు మృత్యువాత పడగా అనేక మంది గాయాలకు గురై దివ్యాంగులగా మారారు.-– గునపర్తి సైమన్‌
విశాఖ జిల్లాలో ఫార్మాకంపెనీల్లో తర చూ ప్రమాదాలు జరుగుతున్నాయి.కార్మికుల భద్ర త,రక్షణపై పరిశ్రమల యాజమాన్యాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. ప్రాణాధార మందులు తయారుచేసే ఫార్మా పరిశ్రమలు అక్కడ పనిచేసే ఉద్యోగుల, సిబ్బంది ప్రాణాలను తోడేసే మృత్యుకుహరాలుగా మారడం దారుణం. యాజమాన్యాల తప్పి దాలు,డెవలపర్‌గా ఉన్న సంస్థ నిర్లక్ష్యం, తనిఖీ లు నిర్వ హించి ఎప్పటికప్పుడు సమీక్షించాల్సిన పలు విభాగాల అధికార యంత్రాంగం వైఫ ల్యం…వెరసి విలువైన ప్రాణాలను బలిగొంటు న్నాయి. అనకా పల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీ లారస్‌ ల్యాబ్స్‌లో తాజా ప్రమాదం నలుగురిని బలిగొనడం,మరొ కరు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండటం బాధాకరం. ఇలాంటి ఘటనలు జరిగిన వెంటనే…మృతుల కుటుం బాలకు,క్షతగాత్రులకు నష్ట పరిహారం చెల్లిం చడం,గంభీర ఉపన్యాసాలు చెప్పి చేతులు దులు పుకోవడం ఆయా కంపెనీల యాజమాన్యాలకు, ఉన్నతాధికారులకు,పాలకులకు పరిపాటిగా మారిపోయింది.ఈఏడాదిలోనే ఈఫార్మా సిటీ లో పది ప్రమాదాలు జరిగాయంటేనే నిర్లక్ష్యం ఏ మేరకు మేటలు వేసిందో అర్థం చేసుకోవచ్చు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఎస్‌ఇజెడ్‌లో మూడు వేల ఎకరాల్లో ఉన్న ఫార్మా పరిశ్రమల్లో పరిస్థితి దయనీయంగా ఉంది. పెద్దపెద్ద కొలి మిలతో పనిచేసే పరిశ్రమలకు కూడా…సొం తంగా ఒక్క అగ్ని మాపక వాహనం కూడా లేదంటే భద్రతపై వాటి నిర్లక్ష్యాన్ని అర్థం చేసు కోవచ్చు. పరిశ్రమల్లో భారీ ప్రమాదాలను గుర్తు చేసుకుంటేనే మానవ ప్రాణాలపట్ల ఎంత నిర్ల క్ష్యంగా వ్యవహరిస్తున్నారో,పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో కళ్లకు కడుతుంది. రెండేళ్ల క్రితం ఎల్‌జి పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి విషవా యువులు లీకై పరిసర ప్రాంతాలకు చెందిన 12 మంది మరణించగా, వందలాదిమంది ఆసుపత్రి పాలైన ఘటనను తలచుకుంటేనే కలవరం కలుగు తుంది. పరవాడ ఫార్మాసిటీ లోనే అజిక బయో ఫోర్‌లో ఐదేళ్ల క్రితం నాటి ప్రమాదంలో ఐదుగు రు,సాయినార్‌ ఫార్మాలో గత ఏడాది మరో ఘటన లో ముగ్గురు బలయ్యారు. సీడ్స్‌ దుస్తుల పరిశ్రమలో విషవాయువులు లీకై 200మంది మహిళలు అస్వస్థతకు గురయ్యారు. ఇప్పటివరకూ పరవాడ ఫార్మాసిటీ లోని ఔషధ పరిశ్రమల్లో జరిగిన 70 ప్రమాదాల్లో49మంది ప్రాణాలు కోల్పోగా, 93 మంది క్షతగాత్రులయ్యారు.ఈ పరిశ్రమల్లో పని చేస్తున్న ఉద్యోగులతోపాటు పరిసర గ్రామాల ప్రజలు సైతం ఈ ప్రమాదాల పట్ల, లీకవుతున్న విషవాయువులు,వ్యర్థజలాలపట్ల ఆందోళన చెందు తున్నారు.ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది,ఉద్యోగులు సైతం విషవాయువులను పీల్చి అనేక జబ్బులకు గురవుతున్నారు. పరిశ్రమల్లో ఫ్యాక్టరీ ఇన్‌స్పెక్టర్‌, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు, ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌, బాయిలర్‌ ఇన్‌స్పెక్టర్‌ సంయుక్తంగా తనిఖీలు చేప ట్టాల్సి ఉంది.ఎప్పటికప్పుడు నివేదికలను రూపొం దించి, అందుకు అనుగుణంగా చర్యలు చేపట్ట్లాలి. ప్రమాదాలు జరిగినప్పుడు హడావిడి చేయడం మినహాయిస్తే… ప్రమాద కారణాలపై నివేదికలను విడుదల చేసిన పరిస్థితి కూడా లేదు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ పేరిట ప్రభుత్వ శాఖల నుండి జరగవలసిన తనిఖీలు దాదాపు నిలిపివేశారు. దాంతో కంపెనీల ఇష్టారాజ్యంగా ఉంది. ఫార్మా పరిశ్రమల్లో వినియోగించే హానికరమైన రసాయ నాలపై ఇక్కడ పనిచేస్తున్న సిబ్బందికి పూర్తి అవగా హన కల్పించడం, రక్షణ పరికరాలు సమకూర్చడం తదితర చర్యలన్నింటినీ పరిశ్రమలు గాలికొదిలే శాయి. పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థ రసాయనా లను శుద్ధిచేయడం,పర్యావరణ పరిరక్షణకు, వాతా వరణంలో విషవాయువుల మోతాదును తగ్గించ డానికి గ్రీన్‌ బెల్ట్‌ను ఏర్పాటు చేయడం, రహదారు లను నిర్మించడం…లాంటి చర్యలను డెవలపర్‌గా ఉన్న సంస్థ చేపట్టాలి. పరిశ్రమల నుంచి విడుదల వుతున్న వ్యర్థ రసాయనాలను కొంతమేర శుద్ధి చేయకుండానే సమీపంలోని చెరువుల్లోకి, సముద్రం లోకి విడిచిపెట్టడం వల్ల భూగర్భజలాలు విషతు ల్యమవుతున్నాయని,అర్ధరాత్రి సమయంలో విష వాయువులను విడిచిపెడుతున్నారని ఆరోపణ లొస్తున్నాయి. ఇప్పటికైనా…ఉద్యోగుల, సిబ్బంది ప్రాణాలను కాపాడటం…పరిసరప్రాంతాల వారికి సైతం కాలుష్యం నుంచి ఉపశమనం కలిగిం చేందుకు అవసరమైన అన్ని చర్యలను పరిశ్రమల యాజమాన్యాలు, సెజ్‌ డెవలపర్‌ సంస్థ చేపట్టాలి. చట్టబద్ధంగా, అన్ని ప్రమాణాలను పాటిస్తున్నారో లేదో ప్రభుత్వ అధికారులు తనిఖీ చేసి పర్యవేక్షిం చాలి. కార్మికుల ప్రాణాలకు,ప్రజల జీవనానికి అవసరమైన పర్యావరణాన్ని కాపాడడం ప్రభుత్వ బాధ్యత. అందుకు పటిష్ట చర్యలు చేపట్టాలి.
భద్రతా లోపాలు..కార్మికులే సమిధలు
పరిశ్రమల్లో భద్రతా లోపాలు కార్మి కుల ప్రాణాలను బలిగొంటున్నాయి. అనకాపల్లి జిల్లాలోని పరవాడ ఫార్మా,అచ్యుతాపురం ప్రత్యేక ఆర్ధిక మండలిలోని పలు పరిశ్రమల్లో తరచూ జరుగుతున్న ప్రమాదాలతో కార్మికలోకం వణికిపో తోంది.యాజమాన్యాల నిర్లక్ష్యంతో చోటు చేసుకుం టున్న అగ్ని ప్రమాదాలు,పేలుళ్లతో ఉద్యోగులతో పాటు పరిసర ప్రజలు భయాందోళనకు గురవుతు న్నారు. ప్రమాదాలు జరిగినప్పుడే అధికారులు హంగామా చేస్తున్నారు. తర్వాత పట్టించుకోవడం లేదు. పరవాడ ఫార్మాసిటీలోని లారస్‌ ల్యాబ్స్‌లో డిసెంబర్‌19నజరిగిన అగ్ని ప్రమాదంలో ఐదుగురు మరణించగా,ఒకరు తీవ్రంగా గాయ పడ్డారు. ఈఘటనతో పారిశ్రామిక ప్రాంతమంతా ఉలిక్కిపడిరది.గతంలో పరవాడ జవహర్‌లాల్‌ నెహ్రూ ఫార్మా సిటీలోనైనా,హెటిరో ఫార్మా పరిశ్ర మలోనైనా కార్మికుల భద్రతపై యాజమాన్యాలు తగిన శ్రద్ధ తీసుకోవడం లేదు.నక్కపల్లి హెటిరో ఫార్మా కంపెనీలో మొన్నజరిగిన ప్రమాదంలో ఓ కార్మి కుడు మృతి చెందారు. హెటిరో డ్రగ్స్‌ కంపెనీ డీఎం ఎస్‌వో ప్లాంట్‌లో ఇటీవల పేలుడు సంభవిం చింది.భారీగాశబ్ధం రావడంతో కార్మికు లు భయంతో పరుగుతు తీశారు.రియాక్టర్‌ పేలడం తోనే ప్రమాదం జరిగినట్టు కార్మికులు చెబుతు న్నారు.రియాక్టర్లు పేలకుండా ప్రెజర్‌ రిలీఫ్‌ వాల్వ్‌, రప్చర్‌ డిస్క్‌ నియంత్రిస్తాయి. ఈ రెండు సరిగా పనిచేయకపోవడంతోనే రియాక్టర్‌ పేలినట్టు పరి శ్రమలో సిబ్బంది చెబుతున్నారు.రియాక్టర్‌ పేలుడు తో విడుదలైన వాయువులు..కార్మికుల ప్రాణాలను బలిగొంటున్నాయి. సాధారణంగా ప్రమాదకర వాయువులు వెలువడే అవకాశమున్నచోట కార్మికు లకు రెస్పిరేటరీ మాస్క్‌లు ఇవ్వాలి. అయితే కార్మి కులకు రెస్పిరేటరీ మాస్కు లు హెటిరో యాజ మాన్యం ఇవ్వడం లేదనే ఆరోపణలు విన్పిస్తు న్నాయి. పదేళ్ల కాలంలో హెటిరో పరిశ్రమల్లో జరిగిన ప్రమాదాల్లో తొమ్మిది మంది కార్మికులు మృతిచెందారు. 2013లో ఐదుగురు, 2015, 2016,2020లో,2022ఫిబ్రవరి23న ఒక్కొ క్కరు చొప్పున ప్రమా దాల్లో ప్రాణాలు కోల్పోయారు. మరెందరో తీవ్ర గాయాలపాలయ్యారు. పరిశ్ర మలో అన్ని ప్రమా దాలు జరుగుతున్నా…కార్మికుల భద్రత, రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని కార్మిక నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫార్మా కంపెనీల ప్రమా దాలకు సంబంధించి, భద్రతా ప్రమాణాల నిర్వహణపై 2020 జులై16 న అప్పటి కలెక్టర్‌ వినరు చంద్‌ నాలుగు బృందా లను నియమించారు.ఆ మేరకు కార్మికులకు కార్మి కుల భద్రత, ఫైర్‌ సేఫ్టీ, ఎలక్ట్రికల్‌ సేఫ్టీ అంశాలతో పాటు నింబంధనల అమలుతీరుపై నాలుగు నివేది కను ఇచ్చింది. అయితే పరిశ్ర మల్లో లోపాలను సరి చేసే దిశగా మాత్రం ప్రయ త్నాలు చేయక పోవడంతో ప్రమాదాలు ఆగడం లేదు.హెటిరో ఫార్మాలో జరిగిన ప్రమాదంపై సమ గ్ర విచారణ జరపాలని కార్మిక సంఘాలు, రాజకీ య పార్టీలు డిమాండ్‌ చేస్తున్నాయి.ప్రమాదంలో మృతి చెందిన అల్లాడ సాయిరాం కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం,వారి కుటుంబంలో ఒకరిఉద్యోగం ఇచ్చి న్యాయం చేయాలనిపట్టు బడుతున్నాయి. క్షతగ్రా తులకు మెరుగైన వైద్యం అందించాలని పట్టుబడు తున్నాయి. సరైన భద్రతా చర్యలు చేపట్టకపోవడం తోనే ప్రమాదాల్లో కార్మి కులు మృత్యువాతపడుతు న్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు హడావుడి చేసే అధికారులు…ఆ తరువాత పట్టనట్టు వ్యవ హరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కాలుష్య నిబంధనలు,భద్రతా ప్రమాణాలు పాటించక పోయినా పట్టించు కోవ డం లేదని మండిపడుతు న్నారు. ఉన్నతాధికారు లు జోక్యం చేసుకొని హెటిరోలో ప్రమాదాలు పునరావృతం కాకుండా సమగ్ర విచారణ చేపట్టా లని కోరుతున్నారు. ఫార్మా కంపెనీల్లో వరస ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో అధి కారులు సమగ్ర విచారణ చేపడుతారా? లేక ఎప్పటిలాగే ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే హాడావడిచేసి ఊరుకుంటారా?అనేది వేచి చూడా ల్సిందే.
వెంటాడుతున్న ప్రమాదాలు
ా రెండేళ్ల క్రితం ఎల్జీ పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి స్టైరిన్‌ అనే విషవాయువు లీకయి 12మంది మృతిచెందారు. వీరంతా పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్నవారే.
ా గతేడాది నక్కపల్లిలోని హెటిరో మందుల పరిశ్రమలోని పీఎంఎస్‌వో సాల్వెంట్‌ తయారీ యూనిట్‌ వద్ద రియాక్టర్‌ పేలి ఒకరు చనిపోగా,నలుగురు తీవ్రంగా గాయాల పాలయ్యారు. ఈ పరిశ్రమలో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.
ా అచ్యుతాపురం సెజ్‌లోని కొన్ని ఫెర్రో పరి శ్రమల్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. గతంలో ఓ ఫెర్రో కంపెనీలో కొలిమి పేలి 13మందికి తీవ్ర గాయాలయ్యాయి.
ా రాంబిల్లి పరిథిలోని ఏషియన్‌ రంగుల పరిశ్ర మలో ప్రమాదం జరిగి ఒకరు మరణించారు.
ా గతేడాది సీడ్స్‌ దుస్తుల తయారీ పరిశ్రమలో వరుసగా రెండుసార్లు వాయువులు లీకై వందలాది మందిమంది మహిళా కార్మికులు అస్వస్థతకు గురయ్యారు.
నిత్యం భయం!
అచ్యుతాపురం సెజ్‌లోని సుమారు 9,2 97ఎకరాల్లో ఫార్మా కంపెనీలకు మూడువేల ఎకరాల వరకు కేటాయించారు. పరవాడ ఫార్మాతో పోల్చుకుంటే సెజ్‌లో భూమిధర తక్కువగా కేటా యించడంతో ఎక్కువ ఫార్మా కంపెనీలు ఏర్పాటవు తున్నాయి. పరవాడా ఫార్మాకంపెనీలతో పోల్చితే సెజ్‌ల్లో చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నా యి. ఫార్మాసిటీ చుట్టూ తక్కువ జనాభా గ్రామాలు ఉండగా సెజ్‌ని అనుకొని రాష్ట్రంలోని అతిపెద్ద మత్స్యకార గ్రామమైన పూడిమడక ఉంది.ఈ ఒక్క గ్రామంలోనే 20వేల జనాభా నివాసం ఉంటు న్నారు. పరిశ్రమల్లో తరచూ జరుగుతున్న అగ్నప్ర మాదాలు,రసాయనవ్యర్ధాల నిర్వహణలో లోపాలు, గ్యాస్‌ లీకేజీలు సమీప గ్రామస్థులను భయపెడు తున్నాయి.అచ్యుతాపురం సెజ్‌లో పెద్దపెద్ద కొలిమి లతో కూడిన ఫెర్రో పరిశ్రమలున్నాయి. వాటికి సొంతంగా ఒక్కఅగ్నిమాపక వాహనం కూడా లేకపోవడం గమనార్హం. సెజ్‌లో ఎటువంటి అగ్ని ప్రమాదం జరిగినా ఏపీఐఐసీ వాహనమే దిక్కువు తోంది. సెజ్‌లోని యూనిఫార్ట్స్‌ కంపెనీలో కూడా గతంలో అగ్ని ప్రమాదాలు జరిగాయి.
ఒక్క ఏడాదిలో పది ప్రమాదాలు
2022 జనవరి నుంచి ఇప్పటి వరకూ పరవాడ ఫార్మాసిటీలో 10ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. తాజాగా డిసెంబర్‌ 19న లారస్‌ ల్యాబ్స్‌ యూనిట్‌3లో జరిగిన అగ్ని ప్రమాదంలో నలుగురు మృతిచెందగా ఒకరు తీవ్రంగా గాయ పడ్డారు. ఫిబ్రవరి 7న అక్టోనస్‌ ఫార్మాలో రియాక్టర్‌ వద్ద ప్రమాదం జరిగింది.ఈనెల 17న ఎమ్మె న్నార్‌ ఫార్మాలో,ఏప్రిల్‌ 23న ఎస్‌ఎన్‌ఎఫ్‌ ఫార్మాలో,మే 7న ఎస్‌ఈజెడ్‌ అలివిర ఫార్మాసంస్థలో,మే 25న లారస్‌ ల్యాబ్స్‌ యూనిట్‌3లో,జూన్‌ 13న గ్లాండ్‌ ఫార్మాలో,జూలై 28నసాయిశ్రేయాష్‌ పార్మా కం పెనీలో,ఆగస్టు 22న ఆప్టిమస్‌ ఫార్మాసంస్థలో అగ్ని ప్రమాదాలతోపాటు గ్యాస్‌ లీకేజీలు జరిగా యి. సెప్టెంబరు 10న కోరి ఆర్గానిక్స్‌ రియాక్టర్‌ వద్ద ప్రమాదం జరిగిగోడలు కూలిపోయాయి. ఈ ప్రమా దాల్లో ఆస్తినష్టం తప్ప ఎవరికీ ఏమీ కాక పోవడం తో కంపెనీ యాజమాన్యాలు ఊపరి పీల్చు కున్నా యి. ఇప్పటికైనా కర్మాగారాల,అగ్నిమాపక శాఖ అధికారులు స్పందించి ఫార్మాసిటీలో భద్రతా ప్రమా ణాలు పక్కగా అమలయ్యేలా చర్యలు తీసు కోవాలని కార్మిక నాయకులు,ఉద్యోగులు కోరు తున్నారు.