విద్యావంతుల విజ్ఞతనే సవాలు చేస్తారా?

‘ఈ శాసనమండలి ఎన్నికలు సెమీ ఫైనల్స్‌’… ఈ మాటలు అన్నది వైఎస్సార్‌సిపి అగ్రనేతల్లో ఒకరైన వై.వి.సుబ్బారెడ్డి.జగన్‌ కూడా తమ పార్టీ శ్రేణులను ఈ ఎన్నికలలో సర్వశక్తులూ ఒడ్డి పని చేయమని ఆదేశించారు. శాసన మండలిలో ప్రతీ రెండేళ్ళకూ మూడో వంతు స్థానాలు ఖాళీ అవుతూంటాయి. వాటిని భర్తీ చేసేందుకు ఎన్నికలు జరుగుతూంటాయి. ఈ ఎన్నికల్లో ఓటు చేసేవారు సాధారణ ఓటర్లు కారు. కొన్నింటికి కేవలం ఎమ్మెల్యేలే ఓటర్లు. కొన్నింటికి స్థానిక సంస్థల ప్రతినిధులు మాత్రమే ఓటర్లు. కొన్నింటికి ఉపాధ్యాయులే ఓటర్లు. మరికొన్నింటికి పట్టభద్రులు మాత్రమే ఓటర్లు. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో ఓటర్లుగా నమోదు చేయించుకున్న పట్టభద్రులు పది లక్షలమంది సుమారుగా ఉంటారు.ఈ విధం గా చాలా పరిమితమైన పరిధిలో ఓటర్ల అభి ప్రాయాలు వ్యక్తం అయ్యే ఎన్నికలు సెమీ ఫైనల్స్‌ ఎలా అవుతాయి? అదే ఏవో కొన్ని శాసనసభా స్థానాలకు ఉప ఎన్నికలు జరిగినా లేక లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగినా అక్కడ అన్ని తరగతులకూ చెందిన ప్రజానీకం అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఈ శాసన మండలి ఎన్ని కలలో ఆ విధంగా వ్యక్తం కాదు. అయినా వైసిపి నేతలు అతిగా హడావుడి చేస్తున్నారు. ఏమిటి కారణం? వీటిలో ఎమ్మెల్యే కోటా లోని సీట్లు ప్రస్తుతం శాసనమండలిలో ఉన్న బలా బలాలను బట్టి అన్నీ వైఎస్సార్‌సిపి కే దక్కు తాయి. స్థానిక సంస్థల కోటాలో భర్తీ కావలసిన స్థానాలూ ఆ పార్టీకే దక్కుతాయి. ఇక గవర్నర్‌ నామినేట్‌ చేసేవి ఎటూ పాలకపార్టీ సిఫార్సు ఆధారంగానే భర్తీ అవుతాయి గనుక అవీ అధికార పార్టీవే. ఇక మిగిలిపోయినవి రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాల స్థానాలు, మూడు పట్టభద్రుల నియోజకవర్గ స్థానాలు. వీటి విష యంలో వైసిపి ఈ మారు ఎందుకింత ఉలికి పడుతోంది? పట్టభద్రుల స్థానాల్లో కూడా రాజకీయ పార్టీలు పోటీ పడవచ్చు. దానికి ఎవరూ అభ్యంతరం చెప్పనవసరం లేదు. కాని అధికారంలో ఉన్న పార్టీ హుందాగా, ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తే ఓటర్లు గౌరవిస్తారు కాని ఇలా అన్ని విలువలనూ గాలికి వదిలి చౌకబారుతనంగా,అడ్డగోలుగా దిగజారిపోతే ఆ విద్యావంతులు,మేధావులు అయిన ఓటర్లు ఈసడిరచుకుంటారన్న కనీసమైన ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పోవడం చూస్తే కొంత జాలీ,కొంత ‘అది’కలుగుతోంది.
కనీస విద్యార్హతలు కూడా లేనివారిని ఓటర్లుగా చేర్చేశారు. అంటే అచ్చంగా విద్యావంతు లైనవారే ఓటర్లుగా ఉంటే తాము గెలవడం సాధ్యం కాదు అని అధికార పార్టీ ఎన్నికలకు ముందే ఒప్పేసుకుందన్నమాట! అబ్బే, అటు వంటిదేమీ కాదు అని వైసిపి చెప్పదలచుకుంటే అర్హత లేని ఓటర్ల పేర్లు తొలగించడంలో తామే ముందుండి వ్యవహరించి వుండాలి. ఎందుకు అలా చేయలేకపోయింది? కనీస స్థాయిలో కూడా నైతిక స్థైర్యం లేని దుస్థితిలో ఆ పార్టీ ఎందుకుంది? వలంటీర్ల వ్యవస్థ స్థాయిలో మొదలుపెట్టి అత్యున్నత స్థాయి అధికారుల వరకూ అందరి అధికారాలనూ ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారు? ఎంతో ప్రఖ్యాతి కల ఆంధ్రా యూనివర్సిటీకి ఉపకులపతి హోదాలో ఉండడం అంటే ఎంత ప్రతిష్టా త్మకమైన విషయం! అటువంటి స్థానంలోని వ్యక్తి తన అధికారాన్ని దుర్వినియోగం చేసి మరీ అధికారపార్టీ అభ్యర్ధికి ప్రచారం నిర్వహించా రంటే వైసిపి దిగజారుడు అధ:పాతాళానికి పోయిందని వేరే చెప్పాలా? అధికార పార్టీ తరఫున కులసంఘాల పేరుతో ప్రచారం జరిగిపోతోంది. డబ్బు విచ్చలవిడిగా వెదజల్లి, కానుకల పేరుతో ప్రలోభపెట్టి ఓటర్లను లొంగదీసుకోవాలన్న పథకాలు అమలులో పెడుతున్నారు. అంటే ఓటర్ల విద్యాస్థాయి పట్ల, వారి మేధో స్థాయి పట్ల పాలక పార్టీకి ఎంత గౌరవం ఉందో తెలిసిపోతూనే వుంది. 2007లో శాసనమండలి పునరుద్ధరణ జరిగింది. అందుకు వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి చొరవ చేశారు. అప్పుడు జరిగిన ఎన్నికలలో గాని, ఆ తర్వాత గాని ఉపాధ్యాయుల, పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికలలో అధికారికంగా కాంగ్రెస్‌ పార్టీ జోక్యం చేసుకోబోదని ఆయన స్పష్టంగా ప్రకటించారు. ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల పట్ల, సమా జంలోని విద్యావంతుల పట్ల, వారి అభిప్రా యాల పట్ల తనకెంతో గౌరవం ఉందని, తమ పార్టీని విమర్శించినా,వాటిని సలహాలుగానే స్వీకరిస్తానని ఆయన అన్నారు. ఆ కాలంలో ఎమ్మెల్సీలుగా పని చేసిన మాబోటివారు చెప్పిన సలహాలను అన్నింటినీ ఆయన అమలు చేశాడని చెప్పను. చాలా సలహాలను ఆయన అమలు చేయలేదు కూడా. కాని సలహాలను, సూచన లను, విమర్శలను వినే సహనాన్ని ఆయన ప్రదర్శించారు. ఆ రాజశేఖరరెడ్డి బొమ్మ పెట్టుకుని తిరుగుతూ, ఆయన పేరు చెప్పి ఓట్లు దండుకుంటున్న వైసిపికి, ఆ పార్టీ అధినేతకు మాత్రం ఆ అధినేతకున్న సహనంలో వెయ్యో వంతు కూడా లేదు.2019లో అధికారం చేపట్టాక ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో ముఖ్యమంత్రి నేరుగా ఎన్నిసార్లు సమావేశాలు జరిపారు? ఎన్నిసార్లు వారి అభిప్రాయాలను విన్నారు? ప్రభుత్వం ఆదర్శ యజమానిగా ఉం డాలంటారు. ఇదేనా ఆదర్శం?ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్టు జగన్‌ ప్రభు త్వంలోని ఉన్నతాధికారులు కూడా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల ప్రతినిధులను కలుసుకోడానికి గాని, వారి వినతి పత్రాలను స్వీకరించడానికి గాని సిద్ధంగా లేరు. జగన్‌ హయాంలో ఒక్కటంటే ఒక్క అఖిలపక్ష సమావేశం కూడా జరగలేదు. విద్యార్థి, యువజన,మహిళా,నిరుద్యోగ సంఘాల ప్రతి నిధులను ఒక్కసారి కూడా చర్చలకు పిలిచింది లేదు. రైతుల గురించి చాలా కష్టపడిపోతు న్నట్టు ప్రకటించుకునే ఈ ప్రభుత్వం రాష్ట్రంలోని రైతు సంఘాలతోగాని, రైతుకూలీ సంఘాలతో గాని, దళిత సంఘాలతోగాని ఎప్పుడైనా, ఎక్కడైనా ముఖాముఖి చర్చలు జరిపిందా? ఇది కూడా గత ప్రభుత్వం మాదిరి ముందస్తు అరెస్టుల ప్రభుత్వమే తప్ప ముందస్తు చర్చల ప్రభుత్వం ఎంతమాత్రమూ కాదన్న సంగతి అందరికీ తేటతెల్లం అయిపోయింది. అదానీలకు, అంబానీలకు రాష్ట్రంలోని పరిశ్రమ లను, భూములను కట్టబెట్టే పనిలో చాలా జోరుగా ఈ ప్రభుత్వం ముందుకు పోతోంది. అందుకే రాష్ట్రానికే తలమానికమైన విశాఖ ఉక్కు ను ప్రైవేటుపరం చేస్తానని మోడీ ప్రభుత్వం ప్రకటించినా,అసెంబ్లీలో ఒక తీర్మా నాన్ని చేయడం మినహా ఇక చేసిందేమీ లేదు.రాష్ట్ర ప్రజానీకపు మనోభావాలను ప్రతిబిం బించే విధంగా ఒక అఖిల పక్ష బృందాన్ని ఎందుకు ఢల్లీి తీసుకుపోలేక పోయారు? ఎందుకు అన్ని సందర్భాలలోనూ బిజెపికి అనుకూలంగా పార్లమెంటులో వైసిపి ఎంపీలు ఓటు చేస్తు న్నారు? విద్య, వైద్యం,విద్యుత్తు, ముని సిపల్‌ తదితర రంగాలలో మోడీ ప్రభుత్వం ఏం చెప్తే దానికల్లా తలాడిరచి అమలు చేస్తు న్నారు. ఇక ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న స్వయంప్రతిపత్తి ఏమిటి? ఇదిగో ఇటువంటి విషయాలను శాసనమండలిలోను, వెలుపల లేవనెత్తుతున్నారు గనుకనే పిడిఎఫ్‌ ఎమ్మెల్సీలంటే అధికార పార్టీకి అంత అక్కసు, గుండెల్లో అంత గుబులు. అందుకే కక్షగట్టి ఈ పిడిఎఫ్‌ అభ్యర్ధులు ఎలాగై నా గెలవకూడదన్న దుగ్ధతో అన్ని విలువలకూ తిలోదకాలిచ్చేశారు. అడ్డగోలు దోవలు తొక్కుతు న్నారు.వైసిపి,దాని అధినేత ఒక్క విషయం మరిచిపోయినట్టు ఉన్నా రు. ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, ప్రజా ఉద్యమాలు వచ్చిన తర్వాతనే మన దేశానికి స్వాతంత్య్రం వచ్చింది.ఆతర్వాత భారత రాజ్యాంగం వచ్చిం ది. ఆతర్వాతనే ఈ అసెంబ్లీ, పార్లమెంటు వచ్చాయి. ఎమర్జెన్సీ వంటి అత్యం త నిరంకుశ చర్యలనూ ఓడిరచనది ప్రజాఉద్య మాలే. చివరికి సైనిక పాలన పెట్టినా, దానిని కూల దోసి మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పా లంటే ప్రజా ఉద్యమాలే శరణ్యం. ప్రజాఉద్యమాలను, ప్రజా సంఘాలను అణగదొక్కజూసిన ప్రతీ నాయకుడూ కాలగర్భంలో కలిసి పోయాడు. కాని ప్రజా సంఘాలు, ప్రజా ఉద్యమాలు కొనసాగుతూనే వున్నాయి. అవి ప్రజ ల్లోంచి, ప్రజల కోసం పుట్టుకొచ్చినవి. అధికార దాహం లోంచి పుట్టినవి కావు. వాటి ప్రతినిధు లు శాసనమండలిలో సభ్యులుగా ఉండడం శాసన మండలికే గౌరవాన్ని ఇచ్చింది, ఇస్తుంది. డబ్బు పంచిపెట్టకుండా, కానుకలు పంచిపెట్ట కుండా, కులం,మతం వంటి అంశాల ప్రస్తా వనలు తేకుండా,ప్రచారార్భాటానికి పోకుండా ఓటర్ల విజ్ఞత మీద సంపూర్ణ గౌరవంతో తాము గెలిస్తే ఆ ఓటర్ల వాణిని శాసనమండలిలో బలంగా వినిపిస్తామని మాత్రమే హామీ ఇస్తూ ఓట్లిమ్మన మని అడగగలిగే నైతిక స్థైర్యం ఉన్నది కేవలం ఒక్క పిడిఎఫ్‌ అభ్యర్ధులకు మాత్రమే. గెలిచాక తాము ముందస్తుగా ప్రకటించిన విధానాలకు, విలువలకు పూర్తిగా కట్టుబడి నిస్వార్ధంగా, నిజాయితీగా పనిచేస్తూ మాట దక్కించుకోగలుగు తున్నదీ పిడిఎఫ్‌ అభ్యర్ధులు మాత్రమే. ప్రజాస్వా మ్య విలువలను, ప్రజా తంత్ర వ్యవస్థను బలం గా నిలుపు కోవాలంటే ఈ తరహా ప్రజాప్రతి నిధులే కావాలి అని ఓటర్లు భావించేలా వ్యవహరిస్తున్నదీ పిడిఎఫ్‌ అభ్యర్ధులు మాత్రమే. పిడిఎఫ్‌ అభ్యర్ధుల మీద కక్ష గట్టి వ్యవహరిం చడం అంటే అది ప్రజాస్వా మ్యానికి ద్రోహం చేయడమే. అటు వంటి ద్రోహానికి పాల్పడు తున్న వైసిపికి ఈ ‘సెమీ ఫైనల్స్‌’’లో గట్టిగా గుణపాఠం నేర్పడానికి మన రాష్ట్రంలోని విద్యావంతులకు, మేధావులకు వచ్చిన మంచి అవకాశం మార్చి 13న జరగ బోయే ఉపాధ్యా య,పట్టభద్రుల నియోజక వర్గాల ఎన్నికలు. ఈ అవకాశాన్ని సంపూర్ణంగా సద్వినియోగం చేసు కుందాం.! (వ్యాసకర్త : పిడిఎఫ్‌ మాజీ ఫ్లోర్‌ లీడర్‌ (ప్రజాశక్తి సౌజన్యంతో..)- (ఎం.వి.ఎస్‌.శర్మ)