రాక్షసత్వాన్ని మించిన ఉన్మాదమిది

‘‘ అమ్మకడుపులో దాచాలంటే ఆడపిల్లకు కష్టంగా మారింది. ఇక పుట్టాక అడుగు వేస్తే ఆపద. గడియగడియకో గండం నిమిషానికోసారి తనని తాను చూసుకొని బతికున్నానని నిర్ధారించుకునే పరిస్థితులు దాపురించాయి. చదువుకుందామని కాలేజీకి వెళ్తే అక్కడ కామాంధుల చూపు వారిపైనే వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్తే ఒంట్లో ఉన్న రోగాన్ని చూడాల్సిన కొంతమంది డాక్టర్లు వారి ఒంటిని చూస్తున్న దాఖలాలు మనకు తెలిసిందే. కళాశాలల్లో కొంతమంది విద్యార్థుల వల్ల, ఉద్యోగం చేసే చోట కొంతమంది తోటి ఉద్యోగుల వల్ల ఏదో ఒకరకంగా లైంగిక వేధింపులకు, ఇతరత్రా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. మరికొందరు ప్రేమ పేరుతో వంచన చేస్తున్నారు. ఇటీవల తెలంగాణా రాష్ట్రం వరంగల్‌ హన్ముకొండ రాంగనర్‌లో చోటు చేసుకున్న దారుణం కారణంగా ఓ యువతి ఒక ఉన్మాది చేతికి గురైన విషయం సంచలనం సృష్టించిన విషయం విధేతమే. ఇలాంటి పరిస్థితుల్లో స్త్రీకి సమాజంలో రక్షణ ఎక్కడిది..? అందుకే వారి కోసం ప్రత్యేక చట్టాలు పుట్టాయి. లైంగిక దాడికి గురైన వ్యక్తి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడానికి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారా..? ఒక వేళ నిందితుడు ఏ బడాబాబు కొడుకైతే కొన్ని సందర్భాల్లో సులభంగా తప్పించుకుంటున్నారు.’’-(దామోదర సాయిబాబా)
చదువు సంధ్యలు పెరిగే కొద్దీ మనుషుల ప్రవర్తనలో మార్పులు రావాలి. సభ్యతా సంస్కారాలు పెరగాలి. సాంకేతికంగా అభివృద్ధి చెంది విజ్ఞానం ఆర్జించేకొద్దీ మంచి ఏదో, చెడు ఏదో గ్రహించే విచక్షణా జ్ఞానం పెరగాలి. దురదృష్టవశాత్తు అందుకు విరుద్ధంగా తిరోగమిస్తున్నామే మోననిపిస్తున్నది. జరిగిన, జరుగుతున్న సంఘ టనలు ఆవేదనే కాదు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా విద్యార్థినిలపై జరుగుతున్న దాడులు కొందరు ఉన్మాదులు చేస్తున్న విన్యాసాలు సభ్యసమాజం తలవంచుకునేలా ఉన్నాయి. ఫిబ్రవరి 27న తెలంగాణలోని వరంగల్‌ అర్బన్‌జిల్లా హన్మకొండలో జరిగిన సంఘటన మళ్లీ ఒక్కసారి ఉల్లికిపరిచింది. ఏమిటిది? ఈదారుణాలను నిరోధించలేరా? ఇది నిరాటంకంగా జరగాల్సిందేనా? తదితర ప్రశ్నలు జవాబులు లేకుండా మిగిలిపోతున్నాయి. హన్మకొండ రాంనగర్‌లో దారుణం చోటుచేసుకున్నది. తనప్రేమను నిరాకరించిందన్న కారణంగా ఒకఉన్మాది మానవత్వం మరిచి అందరు చూస్తుండగా పట్టపగలు నడిరోడ్డులో తోటి విద్యార్థినిపై పెట్రోలు పోసి నిప్పుఅంటించాడు. వాగ్దేవి కాలేజీలో డిగ్రీ ఫైనలియర్‌ చదువ్ఞతున్న రవళి అనే విద్యార్థిని బుధవారం కాలేజీకి వెళ్తున్న సమయంలో అదే కాలేజీలో, అదే తరగతి చదువ్ఞతున్న సాయిఅన్వేష్‌ అనే యువకుడు పెట్రోలు పోసి దాడికి తెగబడ్డాడు. దాదాపు అరవైశాతంపైగా కాలిన గాయాలతో రోడ్డుపై కొట్టుకుమిట్లాడుతున్న ఆమెను వరంగల్‌ ఎంజిఎమ్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ రవళి చికిత్స పొందుతూ మార్చి 4న మృతి చెందింది వరంగల్‌లో గతంలో కూడా ఇద్దరు యువతులపై ఆసిడ్‌ దాడి జరిగింది. అందులో ఒకయువతి మరణించగా మరో యువతి కోలుకోగలిగింది. తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ దేశవ్యాప్తంగా విద్యార్థినిలపై ఈఅఘాయిత్యాలు, దాడులు అంతకంతకు పెరిగిపోతుండటం ఆందోళన కలిగించే అంశం. చట్టాలు ఎన్ని చేసినా, ఎంతమంది అధికారులను నియమించినా ఈచట్టాలు కానీ, ఆ అధికారుల కానీ వీటిని నియంత్రించలేకపోతున్నారు.పైగా అంతకంతకు పెరిగిపోతున్నాయి.
ఢల్లీిలోనిర్భయ కేసు అనంతరం చెలరేగిన ఆందోళనలతో కేంద్ర పాలకులు పకడ్బందీ చట్టం తీసుకువచ్చారు. కానీ ఆ నిర్భయ చట్టం వచ్చిన తర్వాత కూడా ఇవి ఆగడం లేదు. అలాని పోలీసులు ఏమి చేయడం లేదని చెప్పడం లేదు. కేసులు పెడుతున్నారు. అరెస్టులు చేస్తు న్నారు. జైళ్లకు పంపిస్తున్నారు. కొన్నింటిలో శిక్షలు కూడా వేయించగలుగుతున్నారు. కానీ అధికశాతం కేసులు వీగిపోతున్నాయి. ఈ కామాంధులకు పోలీసులన్నా, చట్టాలన్నా భయభక్తులు సన్న గిల్లుతుండటమే ఇందుకు కారణమనేది కాదనలేని వాస్తవం. అసలు ఈ సంఘటలన్నీ చూస్తుంటే సమాజం ఎటువైపు పయనిస్తుందనే అనుమానం రాకతప్పదు. ఇవి మొదలు కాదు. చివర కూడా కాదు. కొన్ని కేసుల్లో పోలీసుల అసమర్థత, చేతకానితనాన్ని నేరస్తులు తెలివిగా వాడుకోగలుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆయేషా కేసు ఇప్పటికీ ఒక కొలిక్కి రాలేదు. హాస్టల్‌లోనే మానభంగం చేసి హత్యచేశారు. పోలీసుశాఖ సవాల్‌గా పరిగణించిన కేసులో పెద్దల హస్తం ఉందని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఏదిఏమైతేనేం పోలీసులు సమర్థవంతంగా దర్యాప్తు నిర్వర్తించలేక నేరం ఎవరు చేశారో రుజువ్ఞ చేయలేకపోయారు. పోలీసులు కేసు నమోదు చేసినా నిందితుడు నిర్దోషిగా న్యాయస్థానం ప్రకటించింది. అంతేకాదు దర్యాప్తు ఎంత డొల్లగా ఉందో న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
ఇప్పుడు ఈ కేసు కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించారు. సిబిఐ రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తుంటే రికార్డులే మాయమైపోతున్నాయి. ఇలా ఎందరో విద్యార్థినిలు బలైపోతున్నారు. కొందరు తీవ్ర గాయాలతో బయటపడి జీవనం సాగిస్తున్నారు. అంతకుముందు విజయవాడలో ఎంసిఎ విద్యార్థి శ్రీలక్ష్మీని అదే కాలేజీకి చెందిన మనోహర్‌ అనే విద్యార్థి తనను ప్రేమించలేదని దారుణంగా హత్యచేశాడు. అంతకుముందు గుంటూరులో ఇంటర్‌ చదువ్ఞతున్న మరొక విద్యార్థినిని ఒక మేకానిక్‌ విద్యార్థులందరూ చూస్తుండగా ఏకంగా తరగతి గదిలోనే నరికిచంపాడు. ఇలా ఒకటి కాదు,రెండు కాదు. ఎన్నో సంఘటనల్లో విద్యార్థినులు బలైపోతున్నారు. రక్తాన్ని పంచిపెంచిన బిడ్డ ఇలా అర్థరహితంగా ఉన్మాదానికి బలైతే ఆతల్లి గర్భశోకాన్ని తీర్చేది ఎవరు? ఏమిచ్చి ఓదార్చగలరు? ఈవిషసంస్కృతి పెరిగిపోతున్న దనేందుకు జరుగుతున్న సంఘటనలు అద్దంపడుతున్నాయి. మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయనే విషయం పోలీసు రికార్డులు కూడా వెల్లడి స్తున్నాయి. విద్యార్థినిలపై వేధింపులకు అంతేలే కుండాపోతున్నది. చాలా వరకు ఇవి పోలీసు రికార్డుల్లోకి ఎక్కే అవకాశం తక్కువ. సంఘ టనలు జరిగినప్పుడో, గాయపడినప్పుడో, ప్రాణాలు పోయినప్పుడో తప్ప పోలీసు దృష్టికి వెళ్లడం లేదు. ఏయువతీ తాను వేధిం పులకు గురి అవ్ఞతున్నానని పోలీసు స్టేషన్ల మెట్లెక్కి ఫిర్యాదు చేయడానికి సాహసించడం లేదు. పోలీసులు వేసే సవాలక్ష ప్రశ్నలకు జవాబు చెప్పడం అయ్యేపని కాదని ఒకవేళ అన్నీసమకూర్చిన వారు తీసుకునే చర్యలకు ఈ వేధింపులు ఆగిపోతాయని ఏఆడపిల్ల నమ్మే స్థితిలో లేదు. అలా నమ్మి పోలీసుల దృష్టికి తీసుకువచ్చిన కేసుల్లో కూడా ఏదో కౌన్సిలింగ్‌ పేరుతో కాలం గడిపి పంపుతున్నారే తప్ప నిర్దిష్టమైన చర్యలు తీసుకోలేక పోతున్నారు.మొన్న హైదరాబాద్‌ నడిబొడ్డులో జరిగిన సంఘటనలు ఇందుకు ఉదహరించవచ్చు. పాలకులు ఉక్కుపాదం మోపితే తప్ప ఈ దారుణాలు ఆగదు. ఇప్పటికైనా ప్రభుత్వాలు బాధిత కుటుంబాలకు తగు న్యాయం చేసి, భవిష్యత్తులో మహిళలు, యువతలపై ఇటువంటి అగత్యాలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవశ్యకత ఉంది.!