మాతృభాషల రక్షణతోనే గిరిజన విద్యాభివృద్ధి

సంఖ్యతో సంబంధం లేకుండా పాఠశాలలను కొనసాగించటం, గిరిజన స్థానిక భాష, లిపిని రాజ్యాంగబద్ధంగా పరిరక్షించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించడం, వృత్తి విద్యా కోర్సులను రూపొందించి, వాటికి అనుగుణంగా ఉపాధి కల్పించడం, మాతృభాషా వాలంటీర్లను కొనసాగించటం, ఐఏపి, సబ్‌ప్లాన్‌ నిధులను చిత్తశుద్ధితో కొనసాగించటం పట్ల పాలకులు దృష్టి పెడితే గిరిజనుల ఆలోచన విద్య వైపు మళ్లుతుంది.
గిరిజన ప్రాంతాల్లో ఆదివాసీల జీవన విధానం ఉన్నత స్థితికి చేరాలంటే అక్షరాస్యత చాలా కీలకం. అటువంటి విద్యనందించడంలో పాలకుల వైఫల్యాలు కోకొల్లలు. గిరిజన పిల్లల చదువుల్లో ఆంధ్రప్రదేశ్‌ 48.8 శాతంతో 31వ స్థానం అంటే చివరి స్థానంలో వుంది. ఇప్పటికైనా మేలుకోకపోతే అక్షరాసత్యతా శాతం పడిపోతుంది. రాజ్యాంగంలో షెడ్యూల్‌ తెగలకు ప్రత్యేకమైన రక్షణలు, సదుపాయాలు కల్పించబడ్డాయి. ఆర్టికల్‌ 46 ప్రకారం విద్య, ఆర్థిక వృద్ధి చేపడుతూ వారిని అన్ని విధాలైన సామాజిక అన్యాయాల నుంచి, దోపిడీ నుంచి రక్షించాలి. 5వ షెడ్యూల్‌ ద్వారా గిరిజన ప్రాంతాల పరిపాలన గవర్నర్‌కు ప్రత్యేక బాధ్యత ఇచ్చింది. 275(1) ప్రకారం షెడ్యూల్‌ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక నోడల్‌ ప్యాకేజీలను కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని సూచించింది. రాజ్యాంగంలో పొందుపరచబడిన గిరిజన హక్కులను కాలరాసే విధానాలను పాలకులు అనుసరిస్తున్న నేపథ్యంలో భాష, తెగలు సమస్య, పేదరికం, నిరక్షరాస్యత, దోపిడీ, మౌలిక సౌకర్యాల లేమి వెంటాడుతున్నాయి. మాతృభాష (స్థానిక భాష) లోనే విద్యాబోధనకు ప్రాధాన్యతనిస్తే గిరిజన పిల్లలు విద్యకు చేరువ అవుతారని గిరిజన ప్రజానీకమే అనేక ప్రయత్నాలు చేసింది. చదువు కోసం తపన పడిన బడులు ఆ ప్రాంతాలలో అప్పటికి లేవు. కొద్దిపాటి చైతన్యంతో ‘మా బడులు’ వెలిసాయి. ‘అక్షర దేవుళ్ళు, అక్షర బ్రహ్మ’ వంటివి ఆవిష్కరించుకుని అక్షరాలకే పూజలు చేసేవారు. స్థానిక భాషల రక్షణ కోసం ఆ భాషలో బోధించేందుకు గిరిజనులు కృషి చేశారు. 1985 నుండి 1990 వరకు విద్య కోసం గిరిజనులు పడ్డ తాపత్రయం పరిశీలించ దగ్గదే. ఈ ప్రాంతాలలో గిరిజనులు విగ్రహాలను పూజించరు, లిపినే నమ్ముతారు. ఆ తెగల అవసరాలను గుర్తించి భాష, లిపి, సంస్కృతిని పరిశీలించాలి. తెలుగు రాష్ట్రాలలో 33 తెగలకు చెందిన గిరిజనులు వున్నారు. అక్షరాస్యత లో వెనుకబడి, విద్యకు దూరంగా ఉన్న ప్రాంతాలుగా గుర్తించి 2005లో స్థానిక భాషలో విద్యాబోధనకు విద్యాశాఖ ప్రయోగాలు మొదలుపెట్టింది. భాషా సమస్య ప్రధాన కారణంగా గుర్తించి లిపి గల భాషలు అన్నింటికీ పాఠ్య పుస్తకాలను ముద్రించారు. నిర్దేశించుకున్న కొన్ని లక్ష్యాల సాధన దిశగా గిరిజన విద్యార్థులలో విద్యపై ఆసక్తి పెంచి బడి మానేసే శాతాన్ని తగ్గించడం, గిరిజన భాష, సంస్కృతులను పరిరక్షించటం కోసం ఇంట్లో మాట్లాడే భాష, బడిలో బోధించే భాషతో తెగలను అనుసంధానం చేయాలి. దాంతో వారు విద్య పట్ల ఆకర్షితులౌతారని గిరిజన సాంస్కృతిక పరిశోధనా సంస్థ, ప్రాథమిక విద్యా పథకం సంయుక్తంగా 2006 నుంచి వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రత్యేక మాడ్యూల్స్‌, వాచకాలతో అమలు చేయడం మొదలు పెట్టింది. మంచి ఫలితాలను సాధించింది. ప్రస్తుత పాలకుల విధానాల వలన వాలంటీర్ల వ్యవస్థ నిర్వహించడంలో నిర్లక్ష్యం వహిస్తుంది. మన రాష్ట్రంలో 8 జిల్లాలలో 920 పాఠశాలలలో, స్థానిక లిపి గల భాషలను 811 మంది వాలంటీర్లు బోధిస్తునారు. ఆగస్టు నెలలో పాఠశాలలు తెరిచినా ఇంతవరకూ స్థానిక భాషలకు చెందిన వాలంటీర్ల నియామకం లేదు. కరోనాకు ముందు కూడా ఇటువంటి పరిస్థితి ఉన్న కారణంగా పిల్లలు పూర్తిగా బడులకు దూరం అయ్యారు. పిల్లలు లేరని, తక్కువ సంఖ్యలో ఉన్నారని ఈ లోపల వందల సంఖ్యలో బడులను మూసేస్తున్నారు. కోయ, కొండ, కోలామి, కుయి, ఆదివాసీ ఒరియా, సవర, గోండి భాషలకు లిపి ఉంది. ఇవి రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్నాయి. పెద్ద తెగగా ఉన్న జాతాపు భాషకు లిపి లేదు. లిపి లేకపోవడం కూడా వెనుకబాటుకు ఒక కారణం. లిపి ఉన్న భాషలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. స్వాతంత్య్రం రాకమునుపు పర్లాకిమిడి ప్రాంతానికి చెందిన గిడుగు వెంకట రామమూర్తి గిరిజన జాతుల విద్యాభివృద్ధి అభ్యుదయానికి, ఐక్యతకు సుమారు వంద సంవత్సరాల క్రితమే సవర సంస్కృతి, భాషలపై నిఘంటువును తయారు చేసి వర్ణమాల రూప కర్త అయ్యారు. అన్నిటికంటే ముఖ్యమైనది గిరిజన మాతృభాష బోధన తెలుగు లిపిలో జరుగుతున్నది. కాబట్టి తెలుగు భాష నేర్చు కోవడం సులభం అవుతుంది. విద్యార్థి ఆలోచనా సరళిని అభివృద్ధి చేస్తుంది. ఈనాటికీ 33 తెగలుగా గల ఆదివాసులు స్థానిక భాషలకు లిపిని సమకూర్చే బాధ్యత ప్రభు త్వాలదే. అంతేకాక జన గణన తెగల వారీగా చేపట్టకపోతే అంతరిస్తున్న ఆదిమ తెగలు గురించి తెలిసే అవకాశం లేదు. గిరిజనులు ఐటీడీఏ లక్ష్యాలను ఎలా నెరవే స్తారు? ఈ పరిణామాలన్నీ గిరిజనుల హక్కులు, ఉనికిని నిర్వచిస్తున్న రాజ్యాంగం లోని 5వ షెడ్యూల్‌ స్ఫూర్తిని నీరుగార్చేలా ఉన్నాయి. లిపి గల గిరిజన మాతృభాషలను బోధించే వాలంటీర్లను కొనసాగించడం లేదు. అన్ని ఐటీడీఏ లలో ఇదే పరిస్థితి ఉంది.3,4,5 తరగతుల విద్యార్థులను ఆశ్రమ పాఠశాలలకు తరలించడం వలన స్థానిక మాతృభాషతో తెలుగు నేర్చుకునే పరిస్థితులు లేవు. ఈ బోధన కేవలం ప్రాథమిక పాఠశాల లోనే జరుగుతుంది. ఆశ్రమ పాఠశాలలోనే ఈ భాషలను బోధించే వాలంటీర్లు ఉండరు. టీచర్ల నియామకాలు లేకపోవడంతో, ఆశ్రమ పాఠశాలలో వారి ఆలనా పాలనా చూసే ప్రత్యేక టీచర్లు లేరు. సమగ్ర సర్వే లేకపోవడం, ప్రత్యామ్నాయ పాఠశాలల రద్దు చేయటం, నేటికి గిరి శిఖరాలకు రవాణా,విద్యుత్తు, వైద్య, కమ్యూనికేషన్‌ సౌకర్యాలు లేకపోవడం, పాలకుల విధానాలతో మాతృభాష విద్యా బోధనపై దాడి మరింత వెనుకబాటుకు దారితీస్తున్నది. ప్రత్యామ్నాయాలు లేకపోలేదు. సంఖ్యతో సంబంధం లేకుండా పాఠశాలలను కొనసాగించటం, గిరిజన స్థానిక భాష, లిపిని రాజ్యాంగబద్ధంగా పరిరక్షించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించడం, వృత్తి విద్యా కోర్సులను రూపొందించి, వాటికి అనుగుణంగా ఉపాధి కల్పించడం, మాతృభాషా వాలంటీర్లను కొనసాగించటం, ఐఏపి, సబ్‌ప్లాన్‌ నిధులను చిత్తశుద్ధితో కొనసాగించటం పట్ల పాలకులు దృష్టి పెడితే గిరిజనుల ఆలోచన విద్య వైపు మళ్లుతుంది. ఆ ప్రాంతాలకు గల ప్రత్యేక పరిస్థితులను బట్టి ఎన్ని అవకాశాలు ఉంటే అన్నింటినీ అమలు చేసే బాధ్యత ప్రభుత్వానిది. కనుకనే భాష, సంస్కృతి, లిపి, విద్య వంటి అంశాల ప్రాధాన్యతను గుర్తించే ప్రతి ఒక్కరు రాజ్యాంగ పరమైన హక్కులకు భంగం కలగకుండా, భంగం కలిగించే విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలి. ఓకే భాష మాట్లాడే తెగలన్నీ తమ తమ ప్రాంతాలలో ఐక్యతను సాధించాయి. స్వాతంత్య్ర పోరాటంలో సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా పోరాడాయి. అన్నింటికి మూలమైన చారిత్రక అంశం భాష. అటువంటి గిరిజన మాతృభాషల పరిరక్షణకు రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలు అనివార్యం.
మౌళిక వసతులు కల్పించాలి
మాతృభాషతోపాటు గిరిజన విద్యాలయాల్లో మౌళిక వసతులు కల్పించాలి. నాడు నేడు కార్యక్రమంలో కొన్ని పాఠశాలలను మాత్రమే అభివృద్ధి చేశారు. మారుమూల లోతట్టు ప్రాంతాల్లో చాలా పాఠశాలలు అధ్వానంగా పడి ఉన్నాయి. వాటికి యుద్ద ప్రాతిపదన నిధులు మంజూరు చేయించి ఆధునీకరిం చాలి.ఉపాధ్యాయులు లేని పాఠశాల్లో ఉపాధ్యాయులను నియమించాలి. -కె.విజయ గౌరి