బాలికను బతికిద్దాం

ఆడపిల్లలపై వివక్ష కొనసాగుతున్నది. బాలికల సంఖ్య తగ్గిపోతున్నది. స్త్రీ, పురుష నిష్పత్తిలో అంతరం పెరుగుతున్నది. గత నెలలో విడు దలైన బాలికల జననాల రేటును పరిశీలిస్తే విస్మయానికి గురి చేస్తుంది. కామారెడ్డి జిల్లాలో ఆడపిల్లల పుట్టుక తగ్గిపోతుండడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నది.
గోడలకే పరిమితమైన మోదీ నినాదం
జాతీయ స్థాయిలో ఆడ పిల్లల రక్షణ, సాధికారతతో పాటు జనన రేటు పెంచేందుకు బేటీ బచావో బేటీ పడావో పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చినప్పటికీ ఎక్కడా సత్ఫలితాలు రావడం లేదు. ప్రధాని నరేంద్ర మోదీ ఆర్భాటంగా పిలుపునిచ్చిన నినాదం కేవలం గోడలకే పరిమితమవుతున్నది. మారుతున్న సమాజంలో చాలా మంది తల్లిదండ్రుల్లో ఆలోచన ధోరణి మారుతు న్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం మాత్రం అందుకు తగిన ప్రోత్సాహాన్ని అందించడంలో విఫలమ వుతున్నది.తెలంగాణ రాష్ట్రంలో ఆడ బిడ్డలకు సీఎం కేసీఆర్‌ ఎంతో ప్రాధాన్యత నిస్తున్నారు. ఆడ బిడ్డలు పుట్టిన ఇంటికి ప్రోత్సా హాలు అందిస్తూ వివక్షను రూపుమాపుతున్నారు. అంతే కాకుండా విద్యావకాశాలను భారీగా కల్పిం చారు. ఇందుకోసం ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ప్రత్యేకంగా గురుకులాలను ఏర్పాటు చేసి ఉచితంగా విద్యను అందిస్తు న్నారు. తద్వారా తల్లిదండ్రులకు భారం అన్నది లేకుండా చేస్తున్నారు.పెండ్లీడుకు వచ్చిన ఆడ పిల్లల పెండ్లికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను (రూ.లక్షా 116) అందించి కొం డంత అండగా నిలుస్తున్నారు. మన రాష్ట్రంలో ఆడిపిల్లలకు రక్షణ అన్నది లభిస్తోంది.భారీ డాంబికాలు పలికే బీజేపీ మాత్రం నినాదాలతో ప్రజలను మాయమాట లతో పక్కదారి పట్టిస్తూ నిత్యం మోసంచేస్తోంది.
పురిట్లోనే వదిలించుకుంటున్నారు..
ఆడపిల్ల అని తెలిస్తే పురిట్లోనే వదిలించు కోవడం, బలవంతంగా అబార్షన్లు చేయించు కోవడమే ప్రధానంగా బాలికల జననాల రేటు పడిపోవడానికి కారణం.ఈ పరిస్థితి తండాలు, మారుమూల గ్రామాల్లో ఎక్కువగా ఉంటోంది. ఆడ పిల్లల జనన రేటు పడిపోవడానికి మరో కారణం ఉందన్న అభిప్రాయం ఉంది. అబా ర్షన్లు చేసే దవాఖానలు నిజామాబాద్‌, కామా రెడ్డి జిల్లాలో ఇంకా కొనసాగుతున్నాయని, తరచూ ఆరోపణలు వస్తున్నా వైద్యారోగ్య శాఖ తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. అధికారులు కఠిన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఆడ పిల్లల సంఖ్య మరింత దారుణంగా పడిపోయే ప్రమాదం ఉంది.స్కానింగ్‌ కేంద్రాల్లో పెద్ద ఎత్తున లింగ నిర్ధార ణ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. నిబంధ నలు పాటించని కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. దవాఖానల్లో కాన్పు జరిగి బిడ్డ పుడితే ఆ వివరాలు పురపాలిక, గ్రామ పంచాయతీ అధికారులకు అందించాలన్న నిబం ధన కొన్ని ప్రాంతాల్లో సరిగ్గా అమలుకావడం లేదు. దీంతో ఆడ శిశువుల విక్రయాలు, పుట్టిన తర్వాత హత మార్చడం లాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయన్న ఆరోపణలున్నాయి. ఎప్పుడైనా ముళ్ల పొదలు,బస్టాండ్‌, రైల్వే స్టేషన్‌లో ఆడ శిశువులను వదిలి వెళ్తే శిశు గృహకు తరలించి అధికారులు చేతులు దులుపు కొంటున్నారు. శిశువును ఎవరు వదిలి వెళ్లారు. ఎందుకు వదిలి వెళ్లారు. వారికి ఏదవాఖాన సిబ్బంది సహకారం అందించారు?అనే విష యాలపై సమగ్ర విచారణ చేపట్టకపోవడం లోటుపాట్లకు ఊతం ఇస్తోంది.
ఎగరనిద్దాం..ఎదగనిద్దాం..
ప్రపంచ జనాభాలో మూడోవంతు బాలికలే. బాలికల రక్షణ,ఎదుగుదల,ఆరోగ్యం,విద్య, సదు పాయాలన్నింటిలో అత్యంత శ్రద్ధ అవసరం. ఆరోగ్యంగా,సమాజం పట్ల అవగాహన, సమ దృష్టి పరిస్థితులలో ఎదిగినపుడే వారు నేటి సమాజానికి అవసరమైన పౌరులుగా రూపొం దుతారు. ప్రపంచవ్యాప్తంగా చిన్నారుల విషాద కర పరిస్థితులు ఆందోళన కలిగించేవిగా ఉన్నాయి. సమాజ అభివృద్ధికి విద్య చాలా కీలకమైనదని విదితమే. కొన్ని అంశాలలో గతంకంటె కొంత పురోభివృద్ధి ఉన్నప్పటికీ నేటి సమాజంలో సరికొత్త సమస్యలు, బాలారిష్టాలు కొనసాగుతున్నాయి. ప్రపంచీకరణ సంస్కర ణలు, నూతన ఆర్థిక విధానాల అమలు వలన బాలికా విద్య సజావుగా జరిగే పరిస్థితులు లేవని చెప్పవచ్చు. గడిచిన రెండేళ్లలో కోవిడ్‌ ప్రభావం ఒకవైపుఉండగా ఈరెండేళ్లలో విద్యారంగ సంస్కరణల పేరుతో క్లష్టరైజేషన్‌ పేరుతో పాఠశాలల మూత కారణంగా బాలికలు విద్యకు దూరం కానున్నారు. భారత్‌వంటి దేశంలో బేటీ బచావో బేటీ పఢావో లక్ష్యం పూర్తిగా నీరు కారుతుంది. బాలికా శిశువులకు రక్షణ కల్పించి వారికి చదువుకోవడానికి అవకాశాలు కల్పిస్తామని చెప్పే ఈ పథకం నూతన విద్యా విధానం-2020 అమలుతో నిర్వీర్యం కానుంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 12.9 కోట్ల మంది బాలికలు విద్యకు దూరంగా ఉన్నారని యునిసెఫ్‌ ప్రకటించింది. బాలికల విద్యకు అడ్డంకులను తొలగించే బాధ్యత ఆయా దేశాల ప్రభుత్వాలదేనని ఐక్యరాజ్యసమితి స్పష్టం చేసింది. మీ దేశాలలో అమ్మాయిలను వెనక్కి నెట్టివేసే అంశాలను గురించి మీ చర్యలను, నిబద్ధతను విస్తరించకుండా దేశ అభివృద్ధి సాధ్యం కాదని ఐరాస హెచ్చరించింది. బాలికలకు ఉచిత నిర్బంధ విద్య, విద్యాహక్కు చట్టాలు సంపూర్ణంగా అమలు చేయాలని అడిగే హక్కు బాలికలకు ఉంది. అందుకే చదువు కోసం వీరోచితంగా పోరాడిన మలాలా బాలికల ఆలోచన కావాలి. వివక్ష అనేక రూపాలలో కనిపిస్తుంది. 2030 నాటికి ప్రపంచంలో 15.8 శాతం బాలికలు పేదరికంలోకి చేరుకుంటారని ఐరాస దక్షిణాసియా ప్రాంతాల ప్రభుత్వాలకు ముందుగానే తెలియచేస్తున్నది. ప్రస్తుతం ప్రతి ఐదుగురిలో ఒకరు పేదరికంలో జీవిస్తున్నారు. కరోనా తరువాత పురుషుల కన్నా మహిళల ఉపాధి 19 శాతం అధికంగా ప్రమాదంలో పడిరదని యు.ఎన్‌ విమెన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ మాంబో అన్నారు. ఇదే బాలికా విద్యకు విఘాతం కానుంది. నీరు, పరిశుభ్రతలలో కూడా లింగ వివక్షత కొనసాగుతున్నది. సంక్షోభాలు, సంఘర్షణలు బాలికలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రతిరోజు 33,000 మంది బాలికలకు వివాహాలు జరుగుతున్నాయి. ఈ సమస్యను అధిగమించడానికి ప్రణాళికలు రూపొం దించుకోవాలని ఐరాస ఆయా దేశాల పాలకులను హెచ్చరిస్తున్నది. భారతదేశంలో పద్దెనిమిదేళ్లు రాకముందే వివాహం అవుతున్న ఆడపిల్లల శాతం జాతీయ స్థాయిలో 1.9 శాతంగా వుందని (కేరళలో బాల్య వివాహాలేవీ జరగలేదని)తాజాగా కేంద్ర హోంశాఖ సర్వేలో వెల్లడైంది. బాల్య వివాహ చట్టాలయితే ఉన్నా యి కాని వాటి అమలులో ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు. రక్షణ కల్పించాల్సిన పాలకులు నేరాలను అదుపు చేయలేక పోతు న్నారు.4.6కోట్ల మంది బాలికలు, మహిళలు మనదేశం నుండి అదృశ్యం అయ్యారని క్రైమ్‌ రికార్స్డు బ్యూరో స్పష్టం చేసింది.41లక్షలమంది బాలికలు 19రకాల హింసలకు బలైనారని యుఎన్‌ఎఫ్‌పిఎ నివేదిక తెలియచేస్తున్నది. శరీర భాగాలపై వ్యాఖ్యల నుండి కన్యత్వ పరీక్షల వరకు అన్నీ మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తాయి. ఈ మధ్యకాలంలో హత్రాస్‌ ఘటన,హిజాబ్‌ ఘటన,బెనారస్‌ యూనివర్సిటి ఘటనలు,ఇరాన్‌లో హిజాబ్‌పై జరుగుతున్న పోరాటాలు, ప్రశ్నిస్తే అణచి వేయడం వంటివి అమ్మాయిల ఆత్మగౌర వాన్ని,జీవితాలను ఏవిధంగా ఛిద్రం చేస్తున్నాయో తెలుపు తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు పదిమందిలో ఒకరు లేదా ఇద్దరు బాలకార్మికులు ప్రమాదకర పనులలో పనిచేస్తున్నారు. ఎక్కువ వేతనం లేని బాల కార్మికులుగా చేస్తున్నారు.5నుండి 14 సంవ త్సరాల మధ్యఉన్న బాలికలు ఎక్కువ సమయం శ్రమిస్తున్నారు. భారత దేశంలో నేటి పాలకుల పుణ్యమా అని బాల కార్మికులలో బాలికల సంఖ్య పెరగనుంది. నూతన విద్యా విధానంలో వృత్తి విద్యా కోర్సులను చిన్న తరగతులలో ప్రవేశ పెట్టడంతో ఉన్నత చదువులు చదువుకునే అవకాశం లేకుండా పోతున్నది. బాలికలను వెట్టిచాకిరీ నుండి విముక్తి చేయాలనే చట్టాలను విస్మరిస్తున్నాయి. మీకు చదువు అవసరం లేదు. పనిలోకి వెళ్లండి. డబ్బులు సంపాదించండి…అని చెప్పడమంటే ఆర్థిక సంస్కరణల అమలు ఎంత ప్రమాద కరంగా ఉందో అర్ధం అవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా అధిక దేశాలలో విద్యకు, వైద్యానికి, సంక్షేమానికి నిధులు పూర్తిగా తగ్గించడం. లాభాపేక్ష, వ్యాపారాలకు మాత్రమే ప్రోత్స హించడం. ప్రపంచీకరణ, సరళీకరణ విధా నాలు బాలికల సమస్యలకు, సంక్షోభాలకు కారణాలుగా ఉన్నాయి. అటువంటి విధానా లకు వ్యతిరేకంగా బాలికలు,మహిళలను చైతన్యవంతులను చేయాలి. బాలికలు, మహిళలవ్యతిరేక విధానాలపై ఉద్యమించాలి. చిన్నారుల సంక్షేమంలో మనదేశంలో కేరళ ప్రథమ స్థానంలో ఉంది.చిన్నారుల మనుగడ, పోషకాహారం,తాగునీరు,శానిటేషన్‌, విద్య,ఆరోగ్యం వంటి అంశాలలో 24 సూచికలతో నిర్వహించిన సర్వేలో కేరళ నెంబర్‌1గా ఉంది. ఈస్ఫూర్తితో ఇతర రాష్ట్రాలు, దేశాలు పని చెయ్యవచ్చు.కానీ అవి సామాజిక బాధ్యతను విస్మరిస్తున్నాయి.చివరికి ఆడపిల్లలు వాడుకునే శానిటరీ నాప్కిన్లను కూడా పూర్తి స్థాయిలో సరఫరా చేయలేక పోతున్నాయి. నాప్కిన్లపై జిఎస్టీలను వేయడంతో వారికి అవి మరింత భారం అవుతున్నాయి. సాధికారిత పొందిన బాలికలు సాధికారిత పొందిన మహిళలుగా ఎదుగుతారు. అందుకే వారిహక్కులు,విద్య,ఆరోగ్యం యొక్క సమా నత్వాన్ని డిమాండ్‌ చేయడానికి అవ సరమైన వేదికలను నిర్మించాలి. వారిని బల పరుస్తూ సమానత్వ సాధనకు ఉద్యమిద్దాం-వ్యాసకర్త : యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు- (కె.విజయగౌరి)