ప్రజా సమస్యలు వదిలి పథకాలతో కాలక్షేపం

ప్రజలు సమస్యలతో సతమతం అవుతుంటే పరిష్కారం చేయకుండా జగన్‌ ప్రభుత్వం కొన్ని పథకాలపైనే దృష్టి పెడుతూ కాలయాపన చేస్తోంది. రైతులు, కార్మికులు, చేతివృత్తి దారులు, గిరిజనులు వారు ఎదుర్కొనే సమస్యలు పరిష్కారం అయితే, ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం పాకులాడవలసిన దుస్థితి ఉత్పన్నం కాదు. కాని రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సమస్యలు ప్రాధాన్యతా సమస్యలుగా అనిపించకపోవడం శోచనీయం. ఈ సమస్యలు పరిష్కారం అయితే రాష్ట్రాభివృద్ధి నిలకడగా సాగుతుంది. సంక్షేమ పథకాల పంగల కర్రల మీద ఎన్నాళ్లు నడుపుతారు? రాష్ట్రంలో రైతులు, చేతివృత్తిదారులు, కార్మికులు, ప్రాజెక్టు నిర్వాసితులు, గిరిజనులు ముఖ్యమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం వీటిపై తక్షణమే దృష్టి సారించి పరిష్కరిం చాల్సిన అవసరం ఉంది. కాని జగన్‌ ప్రభుత్వం ఈ సమస్యల్ని విస్మరిస్తూ రాజధాని సమస్యను ముందుకుతెచ్చింది. రాష్ట్ర పురోగమనం పట్టాలు తప్పే స్థితి తెచ్చింది. ఇంకో వైపు కేంద్రం, రాష్ట్రానికి చేసే అన్యాయం విషయంలో మెతకవైఖరి ప్రదర్శిస్తోంది.‘స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులను అమలు చేసి రైతులకు గిట్టుబాటు ధరలు ఇస్తానని, మంచి రోజులు తెస్తానని, 2022 కి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాన’ని నరేంద్రమోడీ ఎన్నికల్లో చెప్పారు. కానీ ఆయన స్వామినాథన్‌ సిఫార్సును ఎగ్గొట్టారు. స్వామినాథన్‌ సిఫార్సు ప్రకారం క్వింటాల్‌ ధాన్యానికి రూ.2418 ధర ప్రకటించాలి. కానీ సాధారణ రకానికి రూ.1815, నాణ్యమైన రకానికి రూ.1835 కనీస మద్దతు ధరను మోడీ ప్రకటించారు. ఇలా అన్ని పంటల ధరల నిర్ణయంలోనూ రైతులకు ప్రధాని తీవ్ర అన్యాయం చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు రాష్ట్ర ప్రభుత్వం కొంటుందని జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రకటించారు. 1710 ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచామని, 41లక్షల టన్నులు కొన్నామని ప్రకటిస్తున్నారు. కాని ఆచరణ తీరు వేరుగా ఉంది. ఎక్కడా ప్రభుత్వం ధాన్యం కొని రైతుకు నేరుగా డబ్బు చెల్లించడం లేదు. ప్రయివేటు వ్యాపారులే బ్రోకర్ల ద్వారా ధాన్యం కొని కొనుగోలు కేంద్రాల ద్వారా కొన్నట్లు బినామీ పేర్లతో రికార్డు చేస్తున్నారు. విజయనగరం జిల్లా కొమరాడ మండలం దళాయిపేటలో 82 కిలోల ధాన్యం రూ.1070లకు బ్రోకర్ల ద్వారా రైస్‌ మిల్లు కొన్నది. 82 నుండి 84 కిలోల వరకు గల బస్తా ధాన్యాన్ని జిల్లాలో ఎక్కడా రూ.1350ల కంటే ఎక్కువకు కొనడం లేదు. అంటే క్వింటాల్‌ రూ.1300 నుండి రూ.1600ల మధ్యలో కొంటున్నారు. ఈ విధంగా క్వింటాల్‌కు 500 నుండి 200 వరకు రైతు నష్టపోతున్నాడు. ఇందుకు కేంద్రంతో పాటు రాష్ట్రమూ బాధ్యత వహించాలి. జిల్లాల్లో పంట దిగుబడిని బట్టి రైతుకు నష్టం వుంటుంది. జిల్లా జిల్లాకు వ్యత్యాసం వుంది. జగన్‌ మోహన్‌ రెడ్డి రైతుకు గిట్టుబాటు ధర ఇస్తానని ప్రకటించారు. ధరల స్థిరీకరణ నిధి సమకూరుస్తున్నట్లు ప్రకటించారు. కాని నిజంగా అవసరం వచ్చిన సమయానికి మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరూ రైతుకు అండగా లేరు. మరో పంట పత్తికి కనీస మద్దతు ధర కూడా ఇవ్వడం లేదు. ఇక్కడా రైతు నష్టపోతున్నాడు. కందుల్లోనూ రైతుకు కనీస మద్దతు ధర ఇవ్వడం లేదు. చెరకు రైతులకు కనీస మద్దతు ధర టన్నుకు రూ.4,000 ఇవ్వాలి. కానీ ఇస్తున్నది రూ.2,700 మాత్రమే. సంవత్సరాల తరబడి బిల్లులు చెల్లించడం లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే రైతులు అన్ని విధాలా నష్టపోతున్నారు. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ సమస్యలు చర్చించిందీ లేదు. చర్యలూ లేవు. జ్యూట్‌, ఫెర్రో ఎల్లాయిస్‌, స్పిన్నింగ్‌, షుగర్‌ మిల్లులన్నీ మూతపడుతున్నాయి. వేలకు వేల కార్మికులు ఉపాధి లేక రోడ్డున పడుతున్నారు. ఈ పరిశ్ర మలు మూత పడడానికి కారణాలను తెలుసుకుని ఆ సమస్యలు పరిష్కరించడానికి బదులు ఎమ్మెల్యేలు, మంత్రులే దగ్గరుండి మరీ పరిశ్రమలను రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు అమ్మించేస్తున్నారు. చిట్టివలస జ్యూట్‌ మిల్లును మంత్రి అవంతి శ్రీనివాస్‌, బొబ్బిలి లక్ష్మీ శ్రీనివాసా జ్యూట్‌ మిల్లును బొబ్బిలి శాసన సభ్యులు సంబంగి చిన్నప్పల నాయుడు, లచ్చయ్యపేట ఎన్‌సిఎస్‌ షుగర్‌ ఫ్యాక్టరీ భూమిని పార్వతీపురం శాసనసభ్యులు అమ్మేసే బాధ్యత తీసుకున్నారు. ‘నన్ను గెలిపించండి, మిల్లులను తెరిపించి ఉపాధి గ్యారంటీ చేస్తాన’ని స్వయంగా జగన్‌ మోహన్‌ రెడ్డి పాదయాత్ర లోనూ, ఎన్నికల సభల్లోనూ చెప్పారు. అధికారంలోకి వచ్చాక అందుకు భిన్నంగా జరుగుతోంది. పోలవరం మొదలు వంశధార వరకు ప్రాజెక్టు నిర్వాసితుల భూముల ధరల్లో జరిగిన అన్యాయాన్ని సరిచేస్తానని అదనంగా రైతుకు నష్టపరిహారం ఇస్తానని జగన్‌ మోహన్‌ రెడ్డి ఎన్నికల్లో చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కుటుంబాలు 105 లక్షలని వారి పునరావాసానికి అయ్యే ఖర్చు రూ.33 వేల కోట్లని లెక్క వేసింది చంద్రబాబు ప్రభుత్వం. జాతీయ ప్రాజెక్టయినా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ‘పునరావాసం నా బాధ్యత కాద’ని చెప్పేసింది. ఇది అన్యాయమని నాడు చంద్రబాబు కాని, నేడు జగన్‌ కాని అనడం లేదు. నిర్వాసితులను మాత్రం ముంచేస్తున్నారు. వెలుగొండ, వంశధార, తోటపల్లి, తారక రామా నిర్వాసితులందరూ జగన్‌ ప్రభుత్వం ఏదో చేస్తుందని ఎదురు చూస్తున్నారు. నిర్వాసితుల ఇళ్ల నిర్మాణానికి, భృతికి అన్నింటిలో న్యాయం చేస్తామని చెప్పారు. ఇంత వరకు చేసిందేమీ లేదు. నిర్వాసితుల ఇళ్లకు గత చంద్రబాబు ప్రభుత్వం బిల్లులు కూడా ఇవ్వలేదు. ఆ ఇళ్ళు కూడా పిట్ట గూళ్ళ వలె ఉన్నాయి. నివాస యోగ్యంగా లేవు. విజయనగరం జిల్లా పాచిపెంట మండల కేంద్రం దగ్గర పెద్ద గెడ్డపై రాజశేఖరరెడ్డి ప్రభుత్వం రిజర్వాయర్‌ నిర్మించింది. అందులో ఆ గిరిజన గ్రామాలు ముంపుకు గురయ్యాయి. ఆ గ్రామాల్లో గిరిజనులంతా ఫారెస్టు భూముల్లో ఇళ్ళు కట్టుకుని, ఫారెస్టు భూములను సాగు చేసుకుని వందల సంవత్సరాలు బతికారు. ఫారెస్టు భూమి కనుక నష్టపరిహారం ఇవ్వలేదు. ఎర్రొడ్లు వలస పునరావాస కాలనీ కొండ పక్కనే నిర్మించారు. కొండను ఆనుకుని వున్న భూమిని సాగు చేసుకుని బతకమని ఆనాడు కలెక్టర్‌, జె.సి చెప్పి ఒప్పించారు. ఇప్పుడు ఇళ్ళ స్థలాల కోసం భూమిని తీసుకుంటామని మండల అధికారులు ఆ గ్రామం మీద దాడి చేస్తున్నారు. ఒకసారి నిర్వాసితులైన ఆ పేదలనే మళ్లీ రెండోసారి నిర్వాసితులను చేస్తున్నారు, ఇదేం న్యాయం?25 లక్షల మందికి రేపు ఉగాది నాటికి ఇంటి స్థలాలు పంపిణీ చేస్తామని ప్రకటనలు చేస్తున్నారు. అందుకు భూమి సేకరించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. పేదల భూమిని తీసుకుని ఇళ్ళ స్థలాల పంపిణీకి పూనుకున్నారు. డీపట్టా భూమి, పేదల సాగులో వున్న ప్రభుత్వ భూమి తీసుకుంటామని అధికారులు పేదలపై దాడి చేస్తున్నారు. ప్రభుత్వమే భూమి కొని పేదలకు పంచి ఇస్తామని ప్రకటనలు చేస్తూ పేదల స్వాధీనంలో ఉన్న భూమిని ఎలా తీసుకుంటారు? పేదలకు అన్యాయమే కదా? భూస్వాముల దగ్గర భూమి కొని ఇళ్ళ స్థలాలు ఇవ్వాలనే అభిప్రాయం ఎందుకు కలగలేదు. విశాఖ ఉడా పరిధిలో డీ-పట్టా భూమిని రాజధానిలో చంద్రబాబు ల్యాండ్‌ పూలింగ్‌ చేసిన విధంగానే భూమిని సేకరిస్తామనడం పేదలకు అన్యాయం చేయడమే కదా! రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం ‘పునాదులు వేయండి, ఇళ్ళు కట్టండి బిల్లులు ఇస్తామని అధికారుల తోనూ, వారి పార్టీ నాయకులతోనూ చెప్పి పేదలతో ఇళ్ళు కట్టించింది. జనంఆ మాటలు నమ్మి పునాదులు వేశారు. ఇళ్లు కట్టేశారు. తరువాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆ ఇళ్ళకు బిల్లులు ఇవ్వలేదు. ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వం పేదలను నిర్మించు కోమన్న ఇళ్ళకు, ఇప్పుడు జగన్‌ ప్రభుత్వం బిల్లులు ఇవ్వడం లేదు. ప్రతిపక్షం మీద కోపంతో ప్రజలను ఇక్కట్ల పాలు చేస్తున్నారు. ఫీజు రియింబర్స్‌మెంట్‌తో అనేక ప్రయివేటు కాలేజీలు నడుస్తున్నాయి. జూన్‌ నుండి నడుస్తున్న కాలేజీలకు డిసెంబర్‌ నెలలో ఫీజు రియింబర్సుమెంట్‌ ఇవ్వనని ప్రభుత్వం జి.వో జారీ చేయడంతో ఆ కాలేజీలన్నీ గందరోళంలో పడ్డాయి. ఆదివాసీలకు 2006 అటవీ చట్టం ప్రకారం పోడు పట్టాలు ఇవ్వాలి. గత ప్రభుత్వం ఇస్తామని మోసం చేసింది. జగన్‌ ఎన్నికల హామీ ఇచ్చారు. తరువాత ఆ ఊసే లేదు. భూమి సర్వేలు చేయడం లేదు. సర్వే చేసిన వారికి పట్టాలు ఇవ్వడం లేదు. 554 నాన్‌ షెడ్యూల్‌ గ్రామాలను 5వ షెడ్యూల్డు గ్రామాల్లో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేయాలని గిరిజన సలహా మండలి ప్రకటించింది. వాస్తవంగా 1250 గ్రామాలు షెడ్యూల్డ్‌ గ్రామాలుగా ప్రకటించాల్సి ఉండగా కేవలం 554 గ్రామాలకే పరిమితం చేయడం గిరిజనులకు అన్యాయం చేయడమేనని గిరిజన సంఘాలన్నీ ఆందోళన చేశాయి. బంద్‌ కూడా నిర్వహించాయి. రీ సర్వే చేస్తామని ఉప ముఖ్యమంత్రివర్యులు పుష్పశ్రీవాణి ప్రకటించి నెలలు గడుస్తున్నాయి. అన్ని లెక్కలూ ప్రభుత్వం వద్ద ఉన్నాయి. వారం రోజుల్లో చేయాల్సిన పనిని 4 నెలలైనా చేయలేదు. భూస్వాముల ఒత్తిడికి లొంగిపోయి వుండకపోతే ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నట్లు అని గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. చేనేత కార్మికులకు చేయూత పథకం ఇస్తామన్నారు. 80 శాతం చేనేత కార్మికులు మాష్టర్‌ వీవర్ల దగ్గర పని చేస్తున్నారు. ఆ కారణం చేత వారికి పథకం ఇవ్వ నిరాకరించారు. గొర్రెలు, మేకల పెంపకందార్లకు ఎన్‌.సి.డి.సి అప్పు ఇస్తామ న్నారు. ఒక్కరికీ ఇచ్చింది లేదు. హుదూద్‌ తుఫానులో నష్టపోయిన కల్లుగీత కార్మికుల నష్టపరిహారాన్ని, చంద్రబాబు ప్రభుత్వం కొంత మందికే ఇచ్చింది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో గీత వృత్తిదార్లకు ఇవ్వలేదు. ‘మా ప్రభుత్వం వస్తే ఇస్తామ’ని జగన్‌ మోహన్‌ రెడ్డి వాగ్దానం చేశారు. ఈ రోజు వరకు ఆ ఊసే లేదు. ఇలా ప్రజలు సమస్యలతో సతమతం అవుతుంటే పరిష్కారం చేయకుండా జగన్‌ ప్రభుత్వం కొన్ని పథకా లపైనే దృష్టి పెడుతూ కాలయాపన చేస్తోంది. రైతులు, కార్మికులు, చేతివృత్తి దారులు, గిరిజనులు వారు ఎదుర్కొనే సమస్యలు పరిష్కారం అయితే, ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం పాకులాడవలసిన దుస్థితి ఉత్పన్నం కాదు. కాని రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సమస్యలు ప్రాధాన్యతా సమస్యలుగా అనిపించకపోవడం శోచనీయం. ఈ సమస్యలు పరిష్కారం అయితే రాష్ట్రాభివృద్ధి నిలకడగా సాగుతుంది. సంక్షేమ పథకాల పంగల కర్రల మీద ఎన్నాళ్లు నడుపుతారు? ఇంకోవైపు కేంద్ర ప్రభుత్వం విభజన హామీలు అమలు జరపకపోయినా సుతిమెత్తని అభ్యర్థనలతో, వేడికోళ్లతో సరిపెడుతున్నారు. దేశమంతా పౌరసత్వ సమస్యపై ఆందోళన జరుగుతుంటే రాష్ట్ర ప్రజలలో కలుగుతున్న ఆందోళన పట్ల ఉదాసీనంగా ఉన్నారు. మోడీ ప్రభుత్వం ప్రజల పౌరసత్వాన్నే ప్రశ్నార్ధకం చేసినా ఆ మోడీ పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతునీయడం మరీ దారుణం. అనేక పార్టీలు, పార్లమెంటులో సిఎఎకు మద్దతునిచ్చినా ప్రజల నుండి ప్రతిఘటన రావడంతో నిర్ణయం మార్చుకున్నాయి. ఎన్‌.ఆర్‌.సి.ని వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించాయి. చివరికి బిజెపి కర్నాటక ముఖ్యమంత్రి కూడా ప్రజా ప్రతిఘటనకు జడిసి కర్నాటకలో అమలు జరపనని ప్రకటించారు. కానీ జగన్‌ నేటి వరకు వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించలేదు. పలు ఎన్నికల వాగ్ధానాల అమలులో వెనకబడుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో గాని, పాదయాత్ర సందర్భంలో గాని ప్రస్తావించని రాజధాని సమస్యను హఠాత్తుగా ముందుకు తెచ్చింది. అన్ని పక్షాలను, పార్టీలను సంప్రదించి కలుపుకుపోయే వైఖరి కాకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. గత ప్రభుత్వం అతి కేంద్రీకరణ పేరుతో ఇబ్బంది పెడితే ఈ ప్రభుత్వం అర్థం లేని విధానాన్ని చేపట్టి, దానికి వికేంద్రీకరణ పేరుపెట్టి జనాన్ని ఇబ్బందుల పాలు చేస్తోంది. మొత్తం మీద అటు కేంద్రంలో బిజెపి ఎన్నార్సీ పేరుతోనూ, ఇటు రాష్ట్రంలో వైసిపి మూడు రాజధానుల పేరుతోనూ అప్రధాన అంశాలను ముందుకు తెచ్చి ప్రజల మౌలిక సమస్యలను పరిష్కరించకుండా జనాన్ని పక్కదోవ పట్టిస్తున్నాయి.