పోలవరం ఎంత దూరం?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి వరంగా చెప్పుకునే పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది. పోలవారాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినా.. నిధుల విడుదలలో ఆలస్యం జరుగుతోంది. పరస్పర రాజకీయ ఆరోపణలు విషయాన్ని మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. సాగు, తాగునీటి,విద్యుత్‌ ఉత్పత్తి అవసరాలతోపాటు పారిశ్రామిక అవసరాలు తీర్చేలా ప్రాజెక్టును డిజైన్‌ చేసినా..అనుకోని విధంగా జరుగుతున్న ఆలస్యంతో..ఎప్పటికప్పుడు కథ మొదటికి వస్తోంది. పోలవరం ప్రాజెక్టు ఏపీకి వరం అనడంలో రెండోమాట లేదు.కానీ ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందనే ప్రశ్నకు మాత్రం సమాధానాలు మారుతున్నాయి. ఇప్పటికీ చాలాసార్లు గడువులు మారాయి.కానీ..ప్రాజెక్టు మాత్రం పూర్తికాలేదు. ప్రాజెక్టు పూర్తియితే తమకు నీళ్లెప్పుడొస్తాయా అని లక్షలాది మంది రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. –సైమన్‌ గునపర్తి
పోలవరం ఎత్తుపై గందరగోళం
ఆంధ్ర సీమకు జీవనాడిగా అభివర్ణించే పోలవరం జాతీయ ప్రాజెక్టుపై కేంద్ర బిజెపి ప్రభుత్వం పూటకోమాట చెబుతూ గందరగోళం సృష్టిస్తోంది. నిర్మాణ పనులు, నిర్వాసితుల సహాయ, పునరావాసం అడుగు ముందుకు పడని దయనీయ స్థితి ఉండగా, కేంద్రం చేస్తున్న గజిబిజితో ప్రాజెక్టు మనుగడే ప్రశ్నార్ధకంగా మారింది. గడచిన వారం రోజుల్లో పార్ల మెంట్‌లో కేంద్ర మంత్రుల ప్రకటనలు దోబూ చులాడగా, నిధుల విషయమై తాజాగా విత్త మంత్రిత్వశాఖ రాష్ట్ర సర్కారుకు పంపిన లేఖ మరింత అయోమయంలో పడేసింది. పూర్తి చేసిన పనులకుగాను రూ.828 కోట్లు విడుదల చేస్తూ, ఇంకా ఇవ్వాల్సింది రూ.1,249 కోట్లేనని బాంబు పేల్చింది. 2013-14 ధరల ప్రకారం రూ.20 వేల కోట్ల అంచనాకే కట్టుబడి ఉన్నట్లు మరోమారు స్పష్టం చేసింది. సవరించిన సవివర ప్రాజెక్టు రిపోర్టు (డిపిఆర్‌) మేరకు ఇంకా కనీసం రూ.30 వేల కోట్లు కావాలని రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థించగా ఆ ప్రస్తావన చేయ లేదు. అంతకుముందు పార్లమెంట్‌లో ఇద్దరు జలశక్తి మంత్రులు ప్రాజెక్టు ఎత్తుపై తలొక మాటా మాట్లాడారు. లోక్‌సభలో మంత్రి ప్రహ్లాద్‌సింగ్‌ జోషి సమాధానమిస్తూ తొలి దశలో ప్రాజెక్టు ఎత్తు 41.15 మీటర్లేనన్నారు. రాజ్యసభలో మరో మంత్రి బిశ్వేశ్వర్‌ తుడు జవాబు చెబుతూ గోదావరి ట్రిబ్యునల్‌ అవార్డు ప్రకారం ఎత్తు 45.72 మీటర్లుగా చెప్పు కొచ్చారు. కొత్త డిపిఆర్‌పై దాటవేశారు. విభజన చట్టం ద్వారా జాతీయ హోదా సంతరించుకున్న ప్రాజెక్టుపై కేంద్రం వ్యవహరి స్తున్న తీరు దాని బాధ్యతారాహిత్యాన్ని తెలుపుతుంది.
పోలవరాన్ని ఆది నుంచీ కేంద్రం వివాదాస్పదం చేస్తోంది. ఇరిగేషన్‌ కాంపొనెంట్‌నే భరిస్తాం నిర్వాసితుల విషయం తమకు సంబంధం లేదని భీష్మిస్తోంది. ప్రాజెక్టు అంటేనే నిర్వాసితులతో కలిపే ఉంటుంది. కేంద్రం ఈ అంతర్జాతీయ సహజ న్యాయ సూత్రాన్ని విస్మరించడం అమానవీయం. ప్రతిపాదిత ఎత్తులో ప్రాజెక్టును నిర్మిస్తే 1.06 లక్షల కుటుంబాలు నిర్వాసితులవుతున్నాయి. అత్యధికులు గిరిజనులే. కాంటూరు లెక్కల్లో శాస్త్రీయత లేదనడానికి మొన్న గోదావరికి వచ్చిన వరదలే ఉదాహరణ. అంచనాలను దాటి ఎక్కువ ప్రాంతాలు కొద్దిపాటి వరదలకే మునిగాయి. పునరావాస కాలనీలు సైతం మునిగాయి. కాంటూరు లెక్కలు తప్పుల తడకలని తేలిపోయింది. ప్రభుత్వ గణాంకాల బట్టి చూసినా ఇప్పటికి 22 శాతానికే పునరావాసం పూర్తయింది. అదీ అసం పూర్తిగానే. జాతి అభివృద్ధికి తమ సర్వస్వం ధారపోసిన లక్షలాది నిర్వాసితుల పునరావాసాన్ని గాలికొదిలేయడం హేయం. పోలవరానికి కేంద్రం కల్పిస్తున్న అడ్డంకులపై నిలదీసి పోరాడి నిధులు సాధించి సకాలంలో ప్రాజెక్టును పూర్తి చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అంటిముట్టనట్లుంటోంది. కేంద్రం వద్దకెళ్లి నిధులడుగుతున్నాం అని చెపుతు న్నారంతే. మొన్న అసెంబ్లీ సాక్షిగా చేసిన పనులకు రూ.2,600 కోట్లు కేంద్రం చెల్లించాలని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి వెల్లడిరచగా,కేంద్రం ఇచ్చింది రూ.828 కోట్లు మాత్రమే. కొత్త డిపిఆర్‌ ఆమోదానికి సమయం పడుతుంది కాబట్టి ఆలోపు అత్యవ సరంగా రూ.15 వేల కోట్లివ్వండని అడగ్గా, కొత్త డిపిఆర్‌ను బుట్టదాఖలు చేశామని కేంద్రం లేఖ పంపింది. అలాగే 2005 అనంతరం 18 ఏళ్లు నిండిన నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వడం సాధ్యం కాదంది. కేంద్రం రాష్ట్రానికి ఈ విధంగా అన్యాయం చేస్తున్నా గట్టిగా ఒత్తిడి ఎందుకు చేయరో తెలీదు. నిర్వాసితుల పునరా వాసంపై తొలిదశ, మలిదశ, అని వక్ర భాష్యా లు చెపుతున్న కేంద్రానికి రాష్ట్ర సర్కారు వంత పాడటం అభ్యంతరకరం. 2017-18 ధరలకనుగుణంగా రాష్ట్రం రూ.55 వేల కోట్లకు కొత్త డిపిఆర్‌ పంపగా సాంకేతిక సలహా మండలి ఆమోదించింది. రివైజ్డ్‌ కాస్ట్‌ కమిటీ రూ.47 వేల కోట్లకు కుదించింది. నిర్వాసితుల పునరావాసానికే రూ.30 వేల కోట్లు కావాలి. ఈ భాగాన్ని ఎగ్గొట్టేందుకు కేంద్రం పన్నాగం పన్నుతోంది. రాష్ట్రం గమ్మునుంది. నిర్వాసి తులందరికీ పునరావాసం కల్పించాకే ప్రాజెక్టులు పూర్తి చేయాలన్న అంతర్జాతీయ నిబంధనలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాటించి ప్రాజెక్టును పూర్తి చేయాలి. ఎన్నికల వాగ్దానం ప్రకారం రాష్ట్ర సర్కారు నిర్వాసి తులకు రూ.10 లక్షల ప్యాకేజీ ఇవ్వాలి. గోదావరి నదిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై కేంద్ర ప్రభుత్వం విభిన్నమైన ప్రకటనలు చేస్తూ గోదావరి నది పరీవాహకంగా ఉన్న తెలుగు రాష్ట్రాల ప్రజలను గందరగోళంలోకి నెట్టివేసింది. పోలవరం ప్రాజెక్టు ఎత్తు విషయమై లోక్‌ సభలో ఒక విధంగా, రాజ్యసభలో మరో విధంగా కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనల్లో ఏది నమ్మాలో, ఏది నిజమో అన్న సందేహాలు ఎపి, తెలంగాణ రాష్ట్ర ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. గోదావరి నదీ జలాల వివాద పరిష్కారాల ట్రి బ్యునల్‌ 1980లో ప్రకటించిన అవార్డు ప్రకారం పోలవరం ప్రాజెక్టు పూర్తి నీటినిలువ సామర్థం (ఎఫ్‌ఆర్‌ఎల్‌) ఎత్తు 45.72మీటర్లు అని కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్‌ రాజ్యసభలో లిఖిత పూర్వకంగా వెల్లడిరచారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు ఎంతో తెలపాలని రాజ్యసభ సభ్యుడు రవీంద్ర కుమార్‌ అడిగిన ప్ర శ్నకు మంత్రి లిఖితపూర్వకంగా బదులిచ్చారు. పోలవరం ఎత్తును తగ్గిస్తూన్నట్టుగా ఎపి ప్రభుత్వం నుంచి తమకు ప్రతిపాదన ఏదీ రాలేదని వెల్లడిరచారు. అంతకుముందు ఇదే సెషన్స్‌లో పోలవరం ఎత్తుపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీకి చెందిన ఎంపి సత్యవతి లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ బదులిస్తూ పోలవరం ప్రాజెక్టు మొదటి దశలో భాగంగా ప్రాజెక్టు ఎత్తు 41.15మీటర్లకే పరిమితం అని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం పోలవరం ఎత్తుపై ఉభయ సభల్లో కేంద్ర మంత్రుల చేత భిన్నమైన ప్రకటనలు చేయించడం గందరగోళ పరిస్థితు లకు దారితీస్తోంది.తెలంగాణ,ఆంధ్రప్రదేశ్‌, చత్తీస్‌గడ్‌,ఒడిశా రాష్ట్రాలతో ముడిపడి ఉన్న పోలవరం ప్రాజెక్టు సమస్యలో కేంద్రప్రభుత్వం చేసిన ఈ విధమైన ప్రకటనల్లో దేన్ని నమ్మాలో , ఏది నిజమో అన్న సందేహాలు పుటుకొస్తున్నా యంటున్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని చూస్తున్నారని,దీన్ని సహించేది లేదని ఇప్పటికే ఎపిలో ప్రజాసంఘాలు కేంద్రా నికి హెచ్చరికలు చేశా యి. పోలవరం ప్రాజెక్టు లో ప్రజా ప్రయోజనాలను కాపాడేందుకు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చాయి. ఈ నేప థ్యంలో ఇప్పడు కేంద్రం పోలవరం ఎత్తుపై మరింత స్పష్టత ఇచ్చేలా ప్రకటన జారీ చేయాలని గోదావరి నది పరివాహక నిర్వాసిత గ్రామాల ప్రజలు కోరుతున్నారు. పోలవరం తుది నివేదికపై సుప్రీంకు కేంద్రం లేఖ పోలవరం ముంపునకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సోమవారం సు ప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది. పిటిషన్ల విచారణపై వాయిదా కోరుతూ వినతిపత్రం సమర్పించింది. పోలవరం ప్రాజెక్టుముంపు సమస్యపై దాఖలైన పిటిషన్ల విచారణను వాయిదా వేయాలని కేంద్రం సుప్రీంకోర్టును కోరింది. పోలవరం ప్రాజెక్టువల్ల వరద ముంపు తలెత్తుతున్నందున ఈ సమస్యకు పరిష్కార మార్గాలు చూపాలని తెలంగాణ,చత్తిగఢ్‌,ఒడిశా రాష్టాల ప్రభుత్వాలు దాఖలు చేసిన పిటీషన్ల ్ల విచారణ నేపద్యంలో కేంద్రం సుప్రీంకోర్టుకు ఈ లేఖ రాసింది. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర జలశక్తి శాఖమంత్రి సమావేశం ఇంకా సంప్రదింపుల స్థాయిలోనే ఉందని, ఈ పరిస్థితుల దృష్టా మరో మూడు నెలల పాటు సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.
గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగానే ప్రయత్నాలు జరుగుతున్నాయని ,తుది నివేదిక అందించడానికి మరికొంత సమయం పడుతుందని కేంద్రం తెలిపింది. 2022 సెప్టెంబర్‌ 6న సుప్రీం ఇచ్చిన ఆదేశాల ప్రకారం గోదావరి నదీ పరివాహకంగా ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించి సమస్యలు పరిష్కరించుకునేందుకు కేంద్ర ప్రభుత్వమే కల్పించుకుని అందుకు తగిన చర్యలు తీసుకోవాల్సి ఉన్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇందుకు మరికొంత సమయం కావాలని లేఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును అభ్యర్థ్ధించింది.
ఇస్తామన్న పరిహారానికి దిక్కూమొక్కు లేదు
పోలవరం నిర్వాసితులకు ఇవ్వాల్సిన పరిహారం మాట మరిచారు. పెండిరగ్‌ల పరిష్కారం లేనేలేదు. ఇదిగో అదిగో అంటూ కాలయాపన చేశారు. పోలవరం ప్రాజెక్టు పరిధిలో 41.15 మీటర్ల కాంటూరు పరిధిలోనే ప్రస్తుతానికి ఊళ్లను ఖాళీ చేయించి నిర్వాసితులందరినీ కాలనీలకు తరలించాలని నిర్ణయించారు. ఈ మేరకు కుక్కునూరు, పోలవరం, వేలేరు పాడు మండలాల్లో నిర్వాసితుల కుటుం బాలను గుర్తించారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఇప్పటికే దాదాపు 13 చోట్ల పోలవరం నిర్వాసిత పునరా వాస కాలనీలకు శ్రీకారం చుట్టారు. జంగారెడ్డిగూడెం సమీపాన ఉన్న చల్లావారిగూడెంలో అత్యధికంగా ఆరు వేల కుటుంబాలకు సరిపడా 650 ఎకరాలను సేకరించి కాలనీకి శ్రీకారం చుట్టారు. జీలుగుమిల్లి, బుట్టాయిగూడెం, పోలవరం మండలాల్లోను ఇదే తరహాలో 2019 వరకు పునరావాస కాలనీలు కాస్తంత వేగంగానే సాగాయి. ఆ తదుపరి ఎక్కడికక్కడే నిలిచి పోయాయి. జీలుగుమిల్లి మండలం అంకన్నగూడెం,కామయ్యపాలెం,రాచన్న గూడెం, ఎర్రవరం,దర్పగూడెం,రౌతుగూడెం,ములగలం పల్లి, స్వర్ణవారిగూడెంలలో కాలనీల నిర్మాణాలు చేపట్టినా ఇప్పటికే ఐదు గ్రామాల్లో కాలనీలకు దిక్కుమొక్కు లేకుండా పోయింది. తమకు చెల్లించాల్సిన పరిహారం చేతికందనిదే తాము కాలనీలకు వెళ్ళబోమని నిర్వాసితులు భీష్మించారు. ఫలితంగా రాచన్నగూడెం,ఎర్ర వరం,దర్పగూడెం,రౌతుగూడెంలలో నిర్వాసిత కుటుంబం ఒక్కటంటే ఒక్కటి రాలేదు. పోలవరం మండలం ఎల్‌ఎన్‌డి పేటలో 400 గృహాలతో కాలనీ నిర్మించగా,అక్కడ నిర్వాసిత కుటుంబాలు అనేకం వచ్చి చేరాయి. అలాగే బుట్టాయిగూడెం మండలంలో ముప్పినవారి గూడెం,దొరమామిడి,రామన్నగూడెం, రెడ్డి గణపవరం వంటి గ్రామాల్లో దాదాపు 1500 నిర్వాసితగృహాలు నిర్మించాల్సి ఉండగా,వీటిలో పది శాతం కూడా ఇళ్ళు పూర్తికాలేదు. ఈ పరిస్థితులను అధిగమించేందుకు ముప్పుతిప్పలు పడినా ఫలితం దక్కలేదు. ఏకంగా వివిధ శాఖలకు లక్ష్యాలు విధించినా కాలనీలు మాత్రం పూర్తి చేయలేకపోయారు.దీంతో ఒకవైపు నిర్వాసిత కుటుం బాల్లో అసంతృప్తి గూడు కట్టుకునే ఉంది. పోలవరం నిర్వాసితుల్లో గిరిజన కుటుంబాలకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద 6లక్షల 86 వేలు,గిరిజనేతరులకైతే ఒక్కొ కుటుంబానికి 6లక్షల 36వేలు చెల్లించాల్సి ఉంది. వీటిలో చాలా కుటుంబాలకు పూర్తి పరిహారం అందించడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. నివేదికల పేరిట అధికారులు తాత్సారం చేస్తే ఆర్థిక వైఫల్యంతో ప్రభుత్వం మరో జాప్యం చేసింది.
మూడేళ్లయినా మాట నిలబెట్టుకోలేదు
తాము అధికారంలోకి వస్తే పోలవరం నిర్వాసిత కుటుంబాలన్నింటికీ పది లక్షలు చొప్పున పరిహారం అందిస్తామని ప్రకటించిన జగన్మోహన్‌ రెడ్డి ఇప్పటికి మూడేళ్లుగా అధికారం వెరగబెడుతున్నా మాటెందుకు నిలుపుకోలేదని పోలవరం నిర్వాసితులు నేరుగానే ప్రశ్నిస్తు న్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పరిధిలోకి వచ్చే గ్రామాలన్నింటిలోనూ ఒక్కొ కుటుంబానికి 2006 నుంచి ఇప్పటిదాకా వివిధ రూపాల్లో పరిహార ప్రకటన, అందచేత దిగుతూ వచ్చారు. 2019కు ముందే జగన్మో హన్‌ రెడ్డి అప్పటికే ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద గిరిజన, గిరిజనేతర కుటుంబాలన్నింటికీ పది లక్షలకు తగ్గకుండా పరిహారం అందచేసి తీరుతామని ఎన్నికల ప్రచార సభల్లో జగన్మోహన్‌ రెడ్డి పదేపదే హామీలు ఇచ్చారు. ఈ మేరకు ఆయా నిర్వాసిత కుటుంబాల నుంచి ఒత్తిడి పెరగడంతో గతేడాది జూన్‌ 30వ తేదీన జీవోఆర్‌టి-224 జారీ చేస్తూ ఒక్కొ కుటుంబానికి పది లక్షలు చొప్పున పరిహారం అందించేందుకు 550 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్టు పేర్కొన్నారు. దీంతో నిర్వాసిత కుటుంబాలు సంబరాల్లో మునిగి తేలాయి. కాని ఏడాది కావస్తున్నా జీవో 224 అమలుకే నోచుకోలేదు. ఇదిగో అదిగో అంటూ కాల యాపన చేశారు. కాని తాజాగా పోల వరం ప్రాజెక్టు పరిధిలో 41.15 కాంటూరు పరిధిలో ఉన్న గ్రామాలన్నిం టినీ పూర్తిగా ఖాళీ చేయిం చడమే కాకుండా ఏవైతే కుటుంబాలు నిర్వాసిత కాలనీలకు చేరుకుంటాయో ఆ కుటుంబాలకు మాత్రమే ఇప్పటికే ఇచ్చిన ఆర్‌ఆర్‌ ప్యాకేజీతో పాటు మిగతా మొత్తం కలిపి పది లక్షలు చెల్లిస్తామంటూ ఇప్పుడు కొత్త మెలిక పెట్టారు. దీనిపైనే నిర్వాసితుల్లో ఆగ్రహం, అసంతృప్తి పెల్లుబికుతోంది. ఎన్నికల ముందు చెప్పిందేమిటి, ఇప్పుడు చేసేదేమి టంటూ ఆగ్రహంతో ఊగిపోతున్నారు.ఇప్పటికే కుక్కునూరు,వేలేరుపాడు మండలాల్లో దాదాపు నిర్వాసిత కుటుంబాలన్నింటికీ ముందస్తు ప్యాకేజీ ప్రకారం వరుసగా 6 లక్షల86 వేలు,6లక్షల 36 వేలు చెల్లిస్తూ వచ్చారు. అంతేతప్ప మిగతా మొత్తాన్ని చెల్లించడానికి అధికారులు సుముఖత వ్యక్తం చేయకపోవడంతో తాము నిర్వాసిత కాలనీలకు వెళ్ళబోమని, తమకు చెల్లించాల్సిన మొత్తం చేతికందిన తరువాతే పిల్లాపాపలతో కాలనీలకు వెళ్తామని స్పష్టం చేస్తున్నారు. దీంతో కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కాలనీలు ఎక్కడికక్కడ బోసిపోయి కనిపిస్తు న్నాయి. దీనికితోడు మౌలిక వసతుల కల్పన లేమి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్‌ సౌకర్యం పూర్తిగా కల్పించకపోయినా కొన్నిచోట్ల మరుగుదొడ్ల నిర్మాణం సాగకపోయినా ఊరు నుంచి పదేపదే పొమ్మనడం ఏమిటంటూ నిలదీస్తున్నారు.
ఉన్న ఇల్లు సంగతేంటి
పరిహారం మాట అటుంచి తాము ఇప్పటికే నివాసం ఉంటున్న ఇళ్ళకు 2017లోనే నష్టపరి హారం అంచనా కట్టారు. ఒక్కొక్క ఇంటికి దాదాపు రెండు నుంచి పది లక్షల వరకు ఆపైబడి కూడా ఇంకా చెల్లించాల్సి ఉంది. కాని అదేమీ ఇప్పుడు మాట వరుసకైనా నోరెత్తకుండా వ్యవహరించడాన్ని నిర్వాసితులు తప్పుపడు తున్నారు. ఎన్నో ఏళ్ళుగా కాపురం చేసిన ఇళ్ళకు లెక్కకైతే కట్టారుకాని, పరిహారం ఎందుకు ఇవ్వరని ప్రశ్నిస్తున్నారు. అధికారులు మాత్రం కాపురాలు ఉంటున్న వారంతా అక్కడి నుంచి ఖాళీ చేస్తేనే తప్ప పరిహారం ఇవ్వడం సాధ్యంకాదని తెగేసి చెబుతున్నారు.కాలనీలకు వెళ్ళాలంటే ముందుగా పరిహారం చెల్లించాలని నిర్వాసితులు..లేదులేదు మీరు ఊరు నుంచి కాలనీలకు వెళ్తేనే పరి హారం ఇస్తామంటూ అధికారులు పట్టుపడుతున్నారు.
ఆర్థిక శాఖ అంగీకరిస్తేనే…
పోలవరం నిర్మాణం కోసం అంచనా వ్యయాన్ని రూ.47,725 కోట్లకు పెంచడానికి సాంకేతిక సలహా మండలి ఆమోదం లభించింది.అది జరిగి రెండేళ్లు పూర్తయింది. అయినాగానీ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ పేరుతో కొర్రీలు వేస్తున్నారు. పీపీఏ ఆమోదం తెలిపి కేంద్ర జలశక్తి శాఖకు నివేదించాలి. జలశక్తి శాఖ సిఫార్సుల మేరకు ఆర్థిక శాఖ నిధులు విడుదల చేస్తుంది.కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ దానికి ససేమీరా అనడంతో ఈ వ్యవహారం పెండిరగులో పడిరది. ప్రస్తుతం కేంద్రం నాబార్డు ద్వారా ఇస్తున్న నిధులతో పనులు సాగుతున్నాయి. కేవలం ఇరిగేషన్‌ కాంపోనెంట్‌కు మాత్రమే నిధులు ఇస్తామని కేంద్రం చెప్పడాన్ని ఏపీ ప్రభుత్వం తప్పుబడు తోంది. 2013 నాటి భూ సేకరణ చట్టం వల్ల పోలవరం ప్రాజెక్టు ఖర్చు గణనీయంగా పెరిగింది. 2014 తర్వాత పెరిగిన ప్రాజెక్టు వ్యయాన్ని ఇక్కడ పరిగణనలోకి తీసుకోలేదు. అంతే కాకుండా, అప్పటివరకూ ఇరిగేషన్‌ కాంపొనెంట్‌ రూపంలో చేసిన ఖర్చులనూ మినహాయించారు. దీనివల్ల పెరిగిన ప్రాజెక్టు అంచనాల భారమంతా రాష్ట్ర ప్రభుత్వం మీదే పడుతోంది.‘ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలో సెక్షన్‌-90లో పేర్కొన్న స్ఫూర్తికి ఇది పూర్తిగా విరుద్ధం. భూ సేకరణ, ఆర్‌ అండ్‌ ఆర్‌ రూపేణా సవరించిన అంచనాలకు కేంద్ర ప్రభుత్వ సంస్థలే ఆమోదం తెలిపిన నేపథ్యంలో, ఆ మేరకు నిధులు ఇచ్చేందుకు తిరస్కరించడం ప్రాజెక్టుకు తీవ్ర విఘాతం కలిగిస్తుంది’’ అంటూ ముఖ్యమంత్రి జగన్‌ కేంద్రానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ‘‘ఏ నీటి ప్రాజెక్టులోనైనా రెండు రకాల భాగాలు ఉంటాయి. ఒకటి ఇరిగేషన్‌ కాగా, రెండోది విద్యుత్‌ ఉత్పత్తి. తాగునీరు అనేది ఇరిగేషన్‌లోనే ఒక అంతర్భాగం. దేశంలో ఏ జాతీయ ప్రాజెక్టు నిర్మాణంలో నైనా ఇప్పటి వరకూ దీన్నే పాటిస్తున్నారు. కానీ పోలవరంలో దానికి భిన్నంగా కేవలం ఇరిగేషన్‌ కాంపోనెంట్‌ మాత్రమే అనడం సమజసం కాదు. ప్రాజెక్టు పూర్తి ఆలస్యం అయితే ఖర్చు విపరీతంగా పెరిగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అంచనాలు సవరించేలా ఆర్థిక శాఖకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నాను’’ అంటూ ఏపీ సీఎం నేరుగా ప్రధానికి విన్నవించారు.
‘ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు’
‘‘పోలవరం ప్రాజెక్టును జగన్‌ ప్రభుత్వం పూర్తి చేస్తుందనే నమ్మకం లేదు.రివర్స్‌ టెండరింగ్‌ అంటూ అన్నీ రివర్స్‌లో నడుపుతోంది. 2024లోగా ఈ ప్రభుత్వం పూర్తి చేయలేదు కాబట్టి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం అందుబాటులోకి వస్తుంది. ప్రాజెక్టు పూర్తి చేయకుండా డెడ్‌ స్టోరేజ్‌ నుంచి నీటిని లిఫ్ట్‌ చేయాలనే ప్రతిపాదనలు చేయడం సరికాదు. దానివల్ల గోదావరి జిల్లాలకు అన్యాయం జరుగుతుంది. అలాంటి ప్రతిపాదనను మేము వ్యతిరేకిస్తున్నాం. పోలవరం నిర్వాసితుల విషయంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది’’ అంటున్నారు మాజీ మంత్రి, టీడీపీ నేత పితాని సత్యన్నారాయణ. మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టు పనులను జగన్‌ ప్రభుత్వం ఒక్క శాతం కూడా ముందుకు తీసుకెళ్లలేకపోయిందని విమర్శించారు. ఏడాది క్రితం పోలవరం పనులను కవరేజ్‌ చేసిన సమయంతో పోలిస్తే, ప్రస్తుతం స్పిల్‌ వే అందుబాటులోకి రావడంతో పోలవరం స్పిల్‌ చానెల్‌ ద్వారానే గోదావరి ప్రవాహం సాగుతోంది. మొన్నటి వరదల సమయంలో 22 లక్షల క్యూసెక్కుల పైబడిన గోదావరి నీటిని ధవళేశ్వరం బ్యారేజ్‌ వైపు దిగువకు వదిలారు. దానికి అనుగుణంగా అప్రోచ్‌ చానెల్‌ సహా అన్నింటినీ ఈ కాలంలో సిద్ధం చేసినట్టు కనిపిస్తోంది.