పేదల జీవితాలు ఇంతేనా..?

ఆత్మహత్యలన్నీ హత్యలే, కాకపోతే.. వీటిలో నిందితులెవరో అప్పటికప్పుడు తెలియదు, వెతికి పట్టడం అంత తేలిక కాదు. స్థూలంగా సమాజమే ముద్దాయి’ అంటాడో సామాజిక వేత్త! ఇదెంత పచ్చి నిజం! వ్యక్తులు, దంపతులు, కుటుంబాలు.. ఇలా లెక్కలేనంత మంది రోజూ ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఎవరికీ పట్టడం లేదు. ప్రభుత్వాలకు చీమ కుట్టినట్టు కూడా లేదు. చచ్చేంత దయనీయ పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న దీనుల్ని ఆదుకునే వ్యవస్థలే లేవు. ఉన్న వ్యవస్థల్ని కూడా పాలకులు విధ్వంసం చేస్తుంటే దాదాపు అన్ని వయసుల వారూ దిక్కులేని స్థితిలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఎందుకీ దురవస్థ? అని ఎవరూ ప్రశ్నించడం లేదు. దీని వెనుక బలమైన కారణాలేమై ఉంటాయి? ఓ శాస్త్రీయ పరిశీలన లేదు. లోతైన అధ్యయనమూ లేదు. సర్కార్లకు సమస్య పరిష్కరించే చిత్తశుద్ధి లేదు.
డెబ్బై అయిదు సంవత్సరాల స్వాతంత్య్రం తరువాత…మన దేశంలోని ఇతర ఏ రంగం కన్నా కూడా…వ్యవసాయ రంగం ఎక్కువ సంక్షోభంలో ఉంది. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో లెక్కల ప్రకారం ఈ పాతిక్ఱేళ్లలో (1995-2020) రైతులు, వ్యవసాయ కూలీలు నాలుగు లక్షల మందికిపైగా ఆత్మహత్యలు చేసుకున్నారు. వీరిలో గత ఎనిమిదేళ్లలో మోడీ పాలన లోనే ఒక లక్ష మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. దళితులు, ముస్లింలలో భూమిలేని కుటుం బాల సంఖ్య 60శాతం. ఆదివాసీలు సాధా రణంగా భూమి కలిగినవారై ఉంటారు. కానీ గత 30 ఏళ్లలో భూములు గుంజుకోవడం వల్ల భూమి లేని ఆదివాసీల సంఖ్య పది శాతం పెరిగింది. ఎన్‌ఎప ˜్‌హెచ్‌ఎస్‌ వివ రాల ప్రకారం దేశంలోని భూమిలో 20 శాతం భూమి 75 ఎకరాల పైబడి ఉన్న కుటుంబాల చేతిలోనే ఉంది. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం లెక్కల ప్రకారం చట్టంలో పేర్కొన్న దానికి విరుద్ధంగా 100 రోజుల బదులు వ్యవసాయ కార్మికులకు 2021-22 ఆర్థిక సంవత్సరంలో 49 రోజులే పని దొరికింది. జూన్‌ 2022లో గ్రామీణ ఉపాధి 80 లక్షల మందికి పోయిందని సీఎం ఐఈ లెక్క తేల్చింది. మొత్తం గ్రామీణ నిరు ద్యోగం రేటు ఎనిమిది శాతం పెరగటం ఆందోళనకరం. పిరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే వివరాల ప్రకారం 2018-19లో 21-59 ఏళ్ల వయసు వారిలో 10శాతం గ్రామీణ పురుషులు, 72 శాతం గ్రామీణ మహిళలు ఏ ఉపాధి లేకుండా ఉన్నారు. ఇది కోవిడ్‌ ముందు స్థితి, ఆతర్వాత పరిస్థితి ఇంకా దిగజారింది. ఆకలి వల్ల, పోషకాహార లేమి వల్ల లక్షల్లో చనిపోతున్న గిరిజన బిడ్డల సంగతి వర్ణనాతీతం. 2021లో ప్రపంచ ఆకలి సూచీలో మన దేశం 116 దేశాల్లోనూ 101వ స్థానానికి చేరింది. భారతదేశ వ్యవసాయ సంక్షోభానికి ఇవి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే. స్వాతంత్య్రానంతరం వరుస కాంగ్రెస్‌ ప్రభుత్వాలు అవలంభించిన వ్యవసాయ విధాన లక్ష్యం, అర్ధ ఫ్యూడల్‌ భూస్వాములను పెట్టుబడిదారీ భూస్వాములుగా మార్చి ధనిక రైతాంగాన్ని సృష్టించడం. ఇది రైతాంగంలో వర్గ విభజనను తీవ్రం చేసింది. 1950లో బి.సి.మహల్‌ నోబిస్‌ అంచనా ప్రకారం దేశంలో పున:పంపిణీకి 6 కోట్ల 30 లక్షల ఎకరాల భూమి అందుబాటులో ఉండాలి. కానీ, దీనిలో ఒక్క గుంట భూమి కూడా పేద రైతులకు పంచింది లేదు. దేశంలోని భూకేంద్రీకరణలో ఏ మార్పు లేకపోగా ఇటీవల కాలంలో మరింత పెరిగింది.
మొదటి దశలో వ్యవసాయ విస్తరణకు, విద్యుత్‌కు, శాస్త్ర సాంకేతిక రంగాలకు, ధాన్యం నిల్వ చేసుకునేందుకు ప్రభుత్వం పెట్టుబడులు ఇతోధికంగా ఉండేవి. కనీస మద్దతు ధర ద్వారా ఉత్పత్తిదారులకు ప్రభుత్వం సహకరించేది. కొన్ని పంటలను సేకరించడం ద్వారా కూడా ఈ సహకారం ఉండేది. ప్రజా పంపిణీ వ్యవస్థకు కూడా ప్రభుత్వ సబ్సిడీలు ఉండేవి. బ్యాంకుల జాతీయీకరణ తర్వాత రైతాంగానికి విస్తారంగా పరపతి సౌకర్యం కల్పించబడిరది. దేశీయ మార్కెట్‌ రక్షణకై వ్యవసాయ పనిముట్ల దిగుమతిపై అనేక ఆంక్షలు పెట్టబడ్డాయి. శాస్త్ర సాంకేతిక రంగా ల్లో అధిక పెట్టుబడి వల్ల మంచి దిగుబడి నిచ్చే వంగడాలు సృష్టించబడ్డాయి. ఇదంతా హరిత విప్లవానికి దారితీసింది. ఉత్పత్తి, ఉత్పాదకత మెరుగై ఆహార ధాన్యాల ఉత్పత్తిలో దేశం స్వయం సమృద్ధి సాధించింది. అయితే ఇది రెండు రకాల అసమానతలకు దారి తీసింది. మొదటిది ప్రాంతాల మధ్య, రెండోది రైతాం గంలో అసమానత. అయినప్పటికీ 1990 వరకు వ్యవసాయ రంగంలో కొంత పురోభివృద్ధి సాధ్యమైంది. 1991లో కాంగ్రెస్‌ ప్రారంభించిన నయా ఉదారవాద విధానాలు 2014లో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత ఉధృ తంగా కొనసాగుతున్నాయి. సామ్రాజ్యవాద వత్తిడితో ఆ విధానాలు అభివృద్ధి నిరోధకంగా మారాయి. ఈ దశలో ఆర్థిక లావాదేవీల నిర్వహణలో రాజ్యం తన పాత్ర ఉపసం హరించుకుంది. పూర్తి స్థాయిలో పెట్టుబడిదార్ల వత్తిడికి తలొగ్గింది. 1995లో హిస్సార్‌లో జరిగిన ఎఐకెఎస్‌ జాతీయ మహాసభ ఈ విధా నాలను విశ్లేషించి కింది హెచ్చరికలు చేసింది. కేంద్ర ప్రభుత్వం అనుసరించే ఈ విధానాలు రైతాంగంపై తీవ్ర దుష్ప్రభావాన్ని చూపిస్తాయి. ఇవి పేద, మధ్యతరగతి రైతాంగాన్ని మరింత నిరుపేదలుగా మారుస్తాయి. పట్టణ, గ్రామీణ నిరుద్యోగం ఎన్నడూ చూడనంతగా పెరిగి పోతున్నది. ఇతర ఎన్నో రైతు సంఘాలు ఈ వ్యవసాయ విధానాలను పొగడ్తలతో ముంచెత్తుంతుండగా ఎఐకెఎస్‌ నయా ఉదార వాద విధానాలను విశ్లేషించగలగడం ప్రత్యేకత. ఎఐకెఎస్‌ హిస్సార్‌ మహాసభ హెచ్చరికలు 30 ఏళ్ల తర్వాత ఏ విధంగా నిజమైనాయో ఇప్పుడు చూస్తున్నాం.
నూతన ఆర్థిక విధానాలు
భూ సంస్కరణలను తిరగదోడటం, భూ పరి మితి చట్టాలను నీరుగార్చటంతో పెద్ద పెద్ద భూఖండాలను భారతదేశపు బడా వ్యాపార వేత్తలకు, విదేశీ బహుళ జాతి కంపెనీలకు అమ్మటానికి లేక లీజుకివ్వటానికి అవకాశమేర్ప డిరది. దున్నేవాడికే భూమి అనే నినాదం స్థానంలో కార్పొరేట్లకే భూమి అనే నినాదం వచ్చింది. విత్తనాలు, ఎరువులు, నీటి పారుదల సౌకర్యాలు, విద్యుత్తు, ఇంకా ఇతర వ్యవసాయిక అవసరాల మీద ప్రభుత్వ సబ్సిడీలకు కోత పెట్టటంతో వ్యవసాయ సాధనాల మీద ఖర్చు విపరీతంగా పెరిగింది. ఆ ఫలితంగా ఉత్పత్తి ఖర్చులు భారీగా పెరిగాయి. వ్యవసాయ దిగుమతుల పరిమితి మీదవున్న ఆంక్షలు తొలగించటం, దిగుమతులపై పన్నులు తగ్గించటంతో సబ్సిడీ కలిగిన విదేశీ వ్యవసాయ సరుకులు వరదలాగా దేశంలోకి వచ్చిపడ్డాయి. దానితో దేశీయ వ్యవసాయ ఉత్పత్తుల ధరలు కుప్పకూలాయి. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల (ఎఫ్‌టీఏఎస్‌) వల్ల కలిగిన దుష్ప్రభావాలు సైతం ఇటువంటివే. వ్యవసాయం, ఇరిగేషన్‌, విద్యుత్తు, గ్రామీణాభివృద్ధి, సైన్స్‌ అండ్‌ టెక్నా లజీ, రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌, ఇంకా ఇతర మౌలిక సదుపాయాలమీద ప్రభుత్వం పెట్టే పెట్టుబడులలో భారీగా కోత పెట్టారు. ఆయువుపట్టు లాంటి విద్యుత్తు, నీటి పారుదల సౌకర్యాల ప్రయివేటీకరణతో ఈ రెండిరటికి పెట్టాల్సిన ఖర్చు బాగా పెరిగింది. అంతేగాక, నీటి మీద గుత్తాధిపత్యాలు ఏర్పడ్డాయి సంస్థా గత రుణాలలో అతి పెద్ద భాగం కార్పొరేట్లకు మళ్ళించే విధాన నిర్ణయం మూలంగా రైతులకు, వ్యవసాయ కార్మికులకు అందుబాటులో ఉన్న రుణాలలో భారీ కోత పడ్డది. దానితో రైతాం గం అధిక వడ్డీలు వసూలు చేసే ప్రయివేట్‌ వడ్డీ వ్యాపారుల మీద ఎక్కువగా ఆధారపడాల్సి వచ్చింది. ఆహార సబ్సిడీలలో విపరీతంగా కోత విధించి, గతంలో ఉన్న సార్వత్రిక ప్రజా పంపిణీకి బదులు లక్షిత ప్రజాపంపిణీ విధానాన్ని ప్రారంభించటంతో పేద ప్రజల ఆహార భద్రత ప్రమాదంలో పడ్డది. కనీస మద్దతు ధర యంత్రాంగంలో,పంటల సేకరణ వ్యవస్థలలో దేశీయ మార్కెట్టులో జోక్యం చేసు కునే చర్యలనుండి ప్రభుత్వం తప్పుకున్నది. ఎగుమతి ఆధారిత వ్యవసాయం వైపునకు, ఆహార పంటల స్థానంలో వాణిజ్య పంటలు వైపుకు సాగును మళ్ళించటానికి ఒక విధానప రమైన ఒత్తిడి జరుగుతున్నది. సాగు నిర్వహణ లో యాంత్రీకరణ పెరుగుతున్నది. దీనితో వ్యవసాయ కార్మికుల ఉపాధి, నిజ వేతనాలు తగ్గుముఖం పట్టాయి.- (దిలీప్‌ రెడ్డి)