పాలకుల విధానాలు ప్రకృతి శాపాలు

మార్చి నెలలో రాష్ట్రంలో ఎనిమిది జిల్లాల్లో భారీ గాలులు, వడగళ్ల వర్షాలు రైతులను నిట్టనిలువునా ముంచాయి. చేతికి వచ్చిన పంటలు కొద్ది నిమిషాల్లోనే నేలపాలయ్యాయి. కోట్ల రూపాయల రైతుల పెట్టుబడి మట్టిలో కలిసిపోయింది. దాంతో రైతు కుటుంబాల భవిష్యత్‌ అగమ్యగోచరంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, హర్యానా, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలు కూడా ఈ వడగళ్ల వర్షాలకు తీవ్రంగా నష్టపోయాయి. ప్రకృతి వైపరీత్యాల పేరుతో తరాల నాడు రూపొందించుకున్న నిబంధనలే నేటికీ అమలవుతున్నాయి. అసాధారణ పరిస్థితుల వల్ల రైతు అసాధారణంగా నష్టపోతే ప్రభుత్వాలు చేసే సహాయం కూడా అసాధారణంగా వుండాలనే కనీస విజ్ఞతను పాలకులు పాటించడంలేదు.
రాష్ట్రంలో వడగళ్ల వానల వల్ల 3 లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయినట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమిక అంచనాలు వేసి ప్రభుత్వానికి నివేదించారు. అనంతపురం జిల్లాలో కురిసిన భారీ వర్షాలు, వడగళ్ల వానల వల్ల అరటి, మామిడి, బత్తాయి, పుచ్చకాయ, బొప్పాయి, టమోటా, మిరప, మొక్కజొన్న, వరి పంటలు భారీగా నష్టపోయాయి. ఇందులో ఉద్యానవన పంటలు 4,843 ఎకరాలు, ఇతర పంటలు 7,525 ఎకరాల్లో నష్టపోయినట్లు జిల్లా అధికారులు ప్రాధమిక అంచనా వేశారు. వాస్తవ పరిస్థితి ఇంతకు రెండిరతలు వుంటుంది. శ్రీసత్య సాయి, కృష్ణా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో లక్షల ఎకరాల్లో పంటల నష్టం జరిగింది. పొరుగున వున్న తెలంగాణ రాష్ట్రంలో పంట నష్టం అంచనా వేసి, ఎకరాకు రూ. పది వేల నష్టపరిహారాన్ని ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. మనకు మాత్రం పరిహారం ఎంత ఇస్తారో ఎప్పుడు ఇస్తారో స్పష్టత ఇవ్వడంలేదు.
పంట నష్టం అంచనా – ద్వంద్వ ప్రమాణాలు
అనంతపురర జిల్లాలో 16 మండలాల్లోని 46 గ్రామాల్లో 4,843 ఎకరాల్లో ఉద్యానవన పంటలు నష్టపోయాయి. ఇందులో ఒక్క అరటి పంట 2,769.4 ఎకరాల్లో నష్టపోయినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ఒక ఎకరా అరటి సాగుకు కనీస పెట్టుబడి ఖర్చు రూ.లక్ష 30 వేలు అవుతుంది. ఈ లెక్కన ప్రస్తుత పంట పెట్టుబడి నష్టం రూ.36 కోట్లు. ప్రస్తుత ధర ప్రకారం దిగుబడి ఆదాయం కలిపితే సుమారు రూ.వంద కోట్లకు పైగా వుంటుంది. అయితే రూ. 6,655 కోట్లు మాత్రమే నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. పంటల పెట్టుబడి ఖర్చు ఆధారంగా ఇచ్చే బ్యాంకు రుణాలు, పంటల నష్టం ఆధారంగా ప్రభుత్వాలు లేదా ఇన్సూరెన్స్‌ కంపెనీలు చెల్లించే పరిహారాల విషయంలో ద్వంద్వ ప్రమాణాలను ప్రభుత్వాలు రూపొందించుకున్నాయి. ఉదా: అరటి పంట ఎకరా సాగుకు బ్యాంకులు ఇచ్చే రుణ సదుపాయం స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ఆధారంగా ఎకరాకు రూ.లక్ష 25 వేలు, పంట నష్టం అంచనా మాత్రం హెక్టారు (రెండున్నర ఎకరాల)కు రూ.25 వేలు. వరి ఎకరా సాగుకు రూ. 35 వేలు ఖర్చు అవుతుంటే, పంట పూర్తిగా నష్టపోతే రూ. 8,433గా అంచనా వేశారు. కోస్తా జిల్లాలో మిర్చి పంట సాగుకు ఎకరాకు రూ.2.50 లక్షల నుండి రూ.3 లక్షల వరకు ఖర్చు అవుతుంది. కాని ప్రభుత్వం రూపొందించుకున్న నిబంధనల ప్రకారం నామమాత్రపు పరిహారం అందేలా వుంది. చిత్తూరు, అన్నమయ్య జిల్లాలో భీకర గాలులతో మామిడి కాయలు పెద్ద ఎత్తున రాలిపోయాయి. నేల రాలిన మామిడి కాయల ఆధారంగా పంట నష్టం అంచనా వేయడానికి నిబంధనలు అంగీకరించవు. ఇలాగే మొక్కజొన్న తదితర పంటల నష్టానికి, పరిహారం అందించేందకు రూపొందించుకున్న నిబంధనలకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా వుంది. అనంతపురం జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు వేసిన అంచనాల విలువ మొత్తాన్ని ప్రభుత్వం అరటి రైతులకు చెల్లించిన రైతు నష్టంలో కేవలం ఆరు శాతం మాత్రమే అవుతుంది. నష్టంలో ఆరు శాతం మాత్రమే చెల్లించి రైతులను ఆదుకుంటామనే ప్రభుత్వాలు రైతు ప్రభుత్వాలు ఎలా అవుతాయి? ఉద్యానవనశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టం అంచనా వేశారు. ఈ క్రాప్‌ బుకింగ్‌ ఆధారంగా రైతుల పేర్లు నమోదు చేస్తున్నారు. ముందస్తు కౌలు చెల్లించి, పంట పెట్టుబడి పెట్టే వాస్తవ సాగుదార్లయిన కౌలు రైతులకు…ప్రభుత్వాలు చెల్లించే నష్టపరిహారం ఒక్క రూపాయి కూడా అందదు.
పంటల బీమా రైతులకా? కంపెనీలకా? రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని దేశ ప్రజలకు హామీ ఇచ్చి బిజెపి వారు అధికారంలోకి వచ్చారు. ప్రధానమంత్రి ఫసల్‌ బీమా లాంటి వాటి ద్వారా పంటల నష్టానికి పరిహారం చెల్లించడం, రైతులకు బ్యాంకుల ద్వారా వ్యవసాయ రుణాలు భారీగా ఇవ్వడం తమ విధానంగా ప్రకటించారు. బిజెపి నేతల మాటలకు చేతలకు ఎంత వ్యత్యాసం వుంటుందో అనేక విషయాల్లో రుజువవుతూనే వుంది. వ్యవసాయ రంగంలో మరింత స్పష్టంగా బట్టబయలవుతున్నది. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోతే…పంటల బీమా కోసం 2017-18 సంవత్సరంలో ప్రారంభించిన ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన (పి.ఎం.ఎఫ్‌.బి.వై) ద్వారా పరిహారం చెల్లిస్తామన్నారు. ఈ బీమా పథకం అమలు కోసం 13 ప్రయివేటు సంస్థలతో సహా 18 సాధారణ బీమా కంపెనీలను ప్రభుత్వం ఇందులో చేర్చుకున్నది. ఈ పథకం కింద ఖరీఫ్‌ పంటలకు ప్రీమియంలో 2 శాతం, రబీ పంటలకు 5 శాతం రైతులు చెల్లించాలి. మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చెల్లిస్తాయి. 2016-17 నుండి 2020-21 వరకు ప్రయివేటు బీమా కంపెనీలు ప్రీమియంగా రూ. 69,667 కోట్లు పొంది, రూ. 45,317 కోట్లు పరిహారంగా రైతులకు చెల్లించి, రూ. 24,350 కోట్ల రూపాయలు లాభపడ్డాయి. ఇందులో ఒక్క అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ అత్యధికంగా రూ. 4,731 కోట్లు లాభపడిరది.
వ్యవసాయ రుణాల విధానాలను పరిశీలిద్దాం. 2019-20లో రూ.9 లక్షల కోట్లు, 2020-21లో రూ.11 లక్షల కోట్లు, 2021-22లో రూ. 16 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలను ప్రకటించారు. ఆచరణలో గౌతమ్‌ అదానీ లాంటి ఐదు బడా కార్పొరేట్‌ కంపెనీలు నిర్మిస్తున్న కోల్డ్‌ స్టోరేజ్‌లు, మాల్స్‌, సోలార్‌, విండ్‌ మిల్లుల విద్యుత్‌ కంపెనీలకు ఇచ్చే రుణాలను కూడా వ్యవసాయ రుణాలుగా మార్చారు. ప్రతి బ్యాంకు తన వ్యాపార ధనంలో 40 శాతం వ్యవసాయ రుణాలు ఇవ్వాలని, అందులో 18 శాతం పంట రుణాలు వుండాలని 1965లో రూపొందించుకున్న రిజర్వుబ్యాంకు విధానాన్ని 1991 వరకు అమలు చేశారు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేద, మధ్య తరగతి ర్కెటతులకు అందాల్సిన వ్యవసాయ రుణాల్లోకి బడా కంపెనీలు జొరబడి దోచుకునేటట్లు విధానాలను మార్చారు.
కేంద్ర విధానాలపై నోరెత్తని రాష్ట్ర పాలకులు
రైతులకు తీవ్ర నష్టం కలిగించే కేంద్ర ప్రభుత్వ విధానాలను ఏ మాత్రం ప్రశ్నించక పోగా, వ్యవసాయ విద్యుత్‌ మీటర్ల ఏర్పాటు లాంటి విధానాలను అమలు చేసి రైతులపై భారాలు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడుతున్నది. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్‌ శక్తులకు అప్పగించే మూడు నల్ల చట్టాలను పార్లమెంట్‌లో బలపరచి, వీధుల్లో రైతు ఉద్యమాలను బలపరిచే ద్వంద్వ విధానాలను రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలు అనుసరించాయి.
పంట నష్టపోవడం అంటే రైతు పెట్టుబడి నష్టంతో పాటు…అప్పుల భారం, ప్రజలకు ఆహార సరుకుల కొరత, ధరల పెరుగుదల వంటి అనేక రూపాల్లో దీని ప్రభావం వుంటుంది. అందుకే రైతుకు పరిహారం అందించడం సామాజిక బాధ్యత. పంటల నష్టానికి న్యాయమైన పరిహారం కోసం పోరాడాలి. దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో జీవిస్తున్న 14.57 కోట్ల మంది రైతులు, 20 కోట్ల మంది వ్యవసాయ కూలీలను ఐదారు కార్పొరేట్‌ కంపెనీలకు బలిపెట్టే ప్రభుత్వ విధానాలను ఐక్యంగా ప్రతిఘటించడం ద్వారానే వ్యవసాయాన్ని కాపాడుకోగలం.
తెలంగాణలో గత 8 ఏండ్లలో 8 వేలకు పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం వెనుక ప్రకృతి వైపరీత్యాలు సృష్టించిన విధ్వంసం ఉంది. విపత్తులతో నష్టాలు ఎక్కడైనా సహజమే. కొన్ని సార్లు ఈ నష్టాలను అరికట్టడం రైతులకు, ప్రభుత్వాలకు కూడా సాధ్యం కాదు. అందుకే ఆయా దేశాల్లో ప్రభుత్వాలు రైతులను, ప్రజలను ఆదుకోవడానికి నష్టపరిహారం చెల్లిస్తాయి. లేదా బీమా పథకాలు అమలు చేస్తాయి. అమెరికా, యూరప్‌, చైనా, జపాన్‌ లాంటి దేశాల్లో కూడా ఇలాంటి పథకాలు ఉన్నాయి. రైతులు, ప్రజలు నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వాలు చేయాల్సిన కనీస పాలనా బాధ్యత ఇది.
మన దేశంలో జాతీయ స్థాయిలో 2005 జాతీయ విపత్తు చట్టం అమలులో ఉంది. జాతీయ ప్రకృతి వైపరీత్యాల పరిహార నిధి (ఎన్‌?డీఆర్‌ఎఫ్‌) కూడా కేంద్ర బడ్జెట్‌ లో భాగంగా ఉంది. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ నుంచి ఏటా ఎస్‌డీఆర్‌ఎఫ్‌ కు నిధులు అందుతాయి. వీటికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర బడ్జెట్‌ లో నిధులు కేటాయించుకొని, ప్రజలకు నష్టాలు వాటిల్లిన సందర్భాల్లో తక్షణ పరిహారం
(ఇనపుట్‌ సబ్సిడీ) అందించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఇన్‌ పుట్‌ సబ్సిడీగా నిర్ణయించింది తక్కువ మొత్తమే, అయినా కనీసం ఆ పద్ధతి అమలులో ఉంది. నష్ట పోయిన రైతులకు ఎకరానికి కనీసం రూ.10 వేలు పరిహారంగా అందించాలని 2013 లోనే ‘‘హుడా కమిషన్‌’’ సిఫారసు చేసినా , తెలంగాణలో 2015 లో వచ్చిన జీవో ప్రకారం ఎకరానికి కేవలం రూ.4 వేల పరిహారం మాత్రమే నిర్ణయించారు. ఇది కూడా పంట సగటు ఉత్పత్తిలో 33 శాతం మించి నష్టపోతే మాత్రమే అందుతుంది.
కోర్టు తీర్పు ఇచ్చిన అమలు చేయక..
పరిహారం విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ప్రశ్నిస్తూ.. రైతు స్వరాజ్య వేదిక కోర్టు తలుపులు తట్టింది. 2020 ఖరీఫ్‌ లో భారీ వర్షాలకు నష్టపోయిన రైతులకు పరిహారం అందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ 2020 సెప్టెంబర్‌ లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. వర్షాల వల్ల జరిగిన నష్టాలను వివరిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి 2020 అక్టోబర్‌ 15న కేంద్రానికి ఉత్తరం కూడా రాశారు. కేంద్ర బృందం వచ్చి పరిశీలించి వెళ్లింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ కూడా 2021 నాటికే నష్టం వివరాలతో ఫైనల్‌ రిపోర్ట్‌ కేంద్రానికి పంపింది. ఈ వ్యాజ్యంపై ఏడాది పాటు విచారణ జరిపిన రాష్ట్ర హైకోర్టు 2021 సెప్టెంబర్‌ 28 న రైతులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.3 నెలల్లో రైతులను గుర్తించి 2022 జనవరి 28 నాటికి పరిహారం అందించాలని, పంటల బీమా పథకాలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదు కాబట్టి, సన్న, చిన్న కారు రైతులకు బీమా పరిహారం కూడా చెల్లించాలని తీర్పు ఇచ్చింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ తీర్పును అమలు చేయకుండా, పచ్చి అబద్ధాలతో సుప్రీం కోర్టు అప్పీల్‌ కు వెళ్లింది. ప్రస్తుతం విచారణ జరుగుతున్నది.
ప్రభుత్వమే బీమా అమలు చేయాలె..
ప్రజాస్వామిక పరిపాలన అంటే, ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పరిపా లించడం. కనీసం కోర్టు ఆదేశాలను పాటించడం. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ సూత్రాలను పాటించడం లేదు. ఇప్పటికే రాష్ట్ర రైతులకు జరిగిన నష్టాలను అర్థం చేసుకుని 2023 ఖరీఫ్‌ నుంచి రాష్ట్రంలో పంటల బీమా పథకాలు అమలు చేయడానికి ప్రభుత్వం పూనుకోవాలి. అన్నిపంటలను, గ్రామం యూనిట్‌ గా బీమా పరిధిలోకి తీసుకు రావాలి. సన్న, చిన్నకారు రైతుల ప్రీమియం మొత్తాన్ని కానీ, లేదా ఆంధ్రప్రదేశ్‌ లాగ మొత్తం రైతుల ప్రీమియం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి. 2020 సంవత్సరానికి పంట నష్ట పరిహారం చెల్లింపు విషయంలో, సుప్రీంకోర్టులో అప్పీల్‌ ను ఉపసంహరించుకుని రాష్ట్ర హైకోర్టు తీర్పును అమలు చేయాలి. ఎప్పుడు ప్రకృతి వైపరీత్యం సంభవించినా, వెంటనే నష్టపోయిన వారి వివరాలు సేకరించి,పరిహారం అందించాలి. ఈ మేరకు రాష్ట్ర బడ్జెట్‌ లో కూడా నిధులను కేటాయించాలి.
పంటల బీమా లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ
జాతీయ స్థాయిలో అమలవుతున్న పంటల బీమా పథకాలకు కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రీమియం భారాన్ని భరించే విధానం ఉంది. బ్యాంకుల నుంచి పంట రుణాలు తీసుకున్న రైతులు ఆటోమాటిక్‌ గా పంటల బీమా పరిధిలోకి వచ్చే వాళ్లు. 2019 వరకు రైతులు కొద్దిపాటి ప్రీమియం చెల్లిస్తే, మిగిలిన ప్రీమియం మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం భరించేవి. పంట నష్టం జరిగినప్పుడు బీమా పరిధిలోకి వచ్చిన రైతులకు ఎంతో కొంత బీమా పరిహారం అందేది. కానీ 2020లో కేంద్రం బీమా మార్గదర్శకాల్లో మార్పులు చేసి, తన వాటా ప్రీమియం చెల్లిం పును 30 శాతానికి పరిమితం చేసుకుంది. గత మూడేండ్లుగా రాష్ట్రంలో భారీ వర్షాలతో రైతులు పంటలు నష్టపోతూనే ఉన్నారు. ప్రభుత్వం అత్యంత బాధ్యతా రహితంగా వ్యవ హరిస్తూ, కనీసం గ్రామాల వారీగా పంటలు నష్టపోయిన రైతుల వివరాలను కూడా సేకరిం చడం లేదు. నష్టపోయిన రైతుల వివరాలతో కేంద్రానికి నివేదికలు పంపి సాయం కూడా అడగడం లేదు.
వ్యాసకర్త : సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు.- (వి.రాంభూపాల్‌)