న్యాయ వ్యవస్థపై తెలుగు సంతకం

‘నాది సాధారణ వ్యవసాయ కుటుంబం. వైకుంఠపాళిలో నిచ్చెనలే కాదు,పాములూ ఉన్నట్లే నా ప్రగతి ప్రస్థానంలో కూడా పగబట్టిన పాములున్నాయి. వాటినుంచి తప్పించుకొని, లక్ష్యాన్ని అధిగమించాను. న్యాయవ్యవస్థలోని లోపాలు, వ్యవస్థలోని విషయాల గురించి మాట్లాడితే వ్యక్తిగా నా స్థాయి తగ్గడమే కాదు, న్యాయవ్యవస్థ కూడా పలచనవుతుంది. పదవిలో ఉండగా చేసే పనులు, వ్యక్తిగత నడవడికలే నిలిచి ఉండేవి. అందుకే నేనేమీ మాట్లాడను’ – సీజేఐ హోదాలో చివరిసారి హైదరాబాద్‌ వచ్చినప్పుడు ఈ వ్యాస రచయితతో జస్టిస్‌ ఎన్వీ రమణ అన్న మాటలివి’. ధర్మం,న్యాయ మే లక్ష్యంగా ఉద్యోగ జీవితాన్ని సాగించిన తెలుగు బిడ్డ జస్టిస్‌ ఎన్వీ రమణ. మధ్య తరగతి కుటుంబం నుంచి న్యాయవాదిగా ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నత శిఖరాన్ని అధిరోహించి చెరగని ముద్ర వేశారు. సంస్కరణలకు శ్రీకారం: సీజేఐగా పగ్గాలందుకున్న ఎన్వీ రమణ 2021 ఏప్రిల్‌ 24 నుంచి పదవీ విరమణ దాకా పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. సుప్రీం కోర్టుకు 11మంది,హైకోర్టులకు 250 మంది న్యాయమూర్తుల పేర్లను కేంద్రానికి సిఫార్సు చేశారు. వారిలో 224 మంది నియమితు లయ్యారు. 15 హైకోర్టులకు సీజేలను నియ మించారు. సీజేఐ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం మహిళా న్యాయమూర్తుల భర్తీకి పెద్దపీట వేసింది. సుప్రీంకోర్టు చరిత్రలో తొలిసారి 2027లో మహిళ ప్రధాన న్యాయ మూర్తిగా నియామకం అయ్యే పరిస్థితిని సృష్టించారు. ఇవన్నీ కొలీజియం లో ఒక సభ్యుడిగా చేశానని చెప్పుకోవడం ఆయన వినయానికి నిదర్శనం.
తెలంగాణకు అగ్రస్థానం
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఏర్పాటైనప్పుడు 24 మంది జడ్జీలుండేవారు.ఈ సంఖ్య 42కు పెరిగేందుకు కృషిచేశారు. రాష్ట్ర హైకోర్టుకు రికార్డు స్థాయిలో 24 మంది న్యాయమూర్తుల నియామకాలు జరిగేలా చేశారు. మరో జడ్జీని ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ చేశారు. ఇతర రాష్ట్రాల హైకోర్టుల్లో జరిగిన నియామ కాలతో పోలిస్తే తెలంగాణ హైకోర్టుకే అత్యధిక మందిని న్యాయమూర్తులుగా నియమించిన ఘన త జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియానికి దక్కుతుంది.
ఆన్‌లైన్‌ విచారణ
సీజేఐగా ఎన్వీ రమణ 16 నెలలు పనిచేస్తే అందులో సుప్రీంకోర్టు 55 రోజులే భౌతి కంగా కేసులను విచారించింది. కరోనా కారణంగా కేసుల విచారణ ఆన్‌లైన్లో చేసేందుకు సాంకేతికతను అభివృద్ధి చేశారు. ఆన్‌లైన్‌లో కేసుల విచారణ తెలంగాణలోనే మొదలైంది. సుప్రీంకోర్టు చరిత్రలో తొలిసారి కేసు విచారణను ప్రత్యక్ష ప్రసారం జరిగేలా చేసిన ఘనత జస్టిస్‌ ఎన్వీ రమణకు దక్కుతుంది.
మౌలిక వసతుల కోసం ఆరాటం కోర్టుల్లో మౌలిక వసతుల కల్పనకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఏపీ హైకోర్టు యాక్టింగ్‌ సీజేగా ఉన్నప్పుడు మొదలుపెట్టిన ఆ చర్యలు సీజేఐ అయ్యాక కొనసా గించారు. దేశ వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో మౌలిక వసతులు ఉండాలన్న ఆకాంక్షను కార్యరూపంలో పెట్టారు. జాతీయస్థాయిలో ‘నేషనల్‌ లా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సిస్టం’ పేరిట ఒక కార్పొరేషన్‌ ఏర్పాటుకు ప్రతిపాదన చేశారు. సీఎంల సదస్సులో చేసిన ఆ ప్రతిపాదన అమలు జరిగి ఉంటే కోర్టులు ప్రజలకు మరింత చేరువయ్యేవన్నారు. కోర్టులు ల్యాండ్‌మార్కుగా నిలవాలని జస్టిస్‌ రమణ చెప్తారు. అనేక రాష్ట్రా ల్లో కొత్త కోర్టు భవనాలను ప్రారంభించారు. ప్రజల ముంగిట్లోకి న్యాయం తెలంగాణలో కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో కోర్టులను జస్టిస్‌ ఎన్వీ రమణ ప్రారంభించారు. పది జిల్లా కోర్టుల సంఖ్యను ఏకంగా 32కు పెంచడాన్ని దేశ చరిత్రలో అరుదైన ఘట్టంగా అభివర్ణించారు. ఉద్యోగాల నియామాకాలకు సీఎం కేసీఆర్‌ సత్వరమే సంపూర్ణ సహకారం అందించారని కొనియాడారు.
హైదరాబాద్‌ సిగలో కలికితురాయి అంతర్జాతీయ స్థాయిలో మధ్యవర్తిత్వ, పరిష్కార కేంద్రం (ఐఏఎంసీ) ఏర్పాటు ప్రతిపాదనను స్వయంగా సీజేఐ హోదాలో సీఎం కేసీఆర్‌ ముందుంచారు. తక్షణమే సీఎం సాను కూలంగా స్పందించడం,ఆపై తాత్కాలిక భవ నంలో ఐఏఎంసీ ఏర్పాటు జరిగిపోయింది. గచ్చిబౌలిలోని ప్రభుత్వం స్థలంలో ఐఏఎంసీ భవన నిర్మాణానికి శంకుస్థాపన జరిగేందుకు దోహదపడ్డారు.
కీలక మలుపు న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేస్తున్నప్పుడు 1995లో ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ ట్రైబ్యునల్‌ సభ్యుడి పదవికి ఎంపికయ్యారు. కానీ ఆనాడు ఆయన ఆ పద విని స్వీకరించి ఉంటే భవిష్యత్‌ మరోలా ఉండే ది. కానీ న్యాయవాదిగానే ఉంటూనే అనేక కీలక పదవులు అలంకరిస్తూ దేశ అత్యున్నత న్యాయ శిఖరంపై ఆసీనులయ్యారని జస్టిస్‌ రమణ సన్నిహితులు చెప్తారు.
సీజేఐగా కీలక తీర్పులు బ్రిటిష్‌ కాలం నాటి రాజద్రోహ చట్టంపై సుమోటోగా స్పందించారు.124సెక్షన్‌ కింద నమోదు చేసిన పెండిరగ్‌ కేసులు,వాటిపై అప్పీళ్లు అన్నింటినీ నిలిపివేస్తూ చారిత్రక ఉత్త ర్వులు ఇచ్చారు. ఆసెక్షన్‌ను కేంద్రం తిరిగి సమీక్ష చేసేవరకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడంపై ఆచితూచి వ్యవహరించాలని ఆదేశించారు. పెగాసస్‌ వ్యవహారంలో సుప్రీంకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి ఆర్‌వీ రవీంద్రన్‌ సారథ్యంలో దర్యాప్తునకు ఆదేశించారు.యూపీలోని లఖింపూర్‌ ఖేరి ఘటనలో రైతులు మరణించడంపై అందిన లేఖను సుమోటోగా విచారణ చేపట్టారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్‌ మిశ్రా కొడుకు అశీష్‌ మిశ్రాపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తునకు ఆదేశించారు. కరోనా సమయంలో ఆక్సిజన్‌, వ్యాక్సినేషన్‌ ధరలు ఇష్టానుసారంగా ఉండటంపై సుమోటోగా స్పందించి ఇచ్చిన ఉత్తర్వుల ఫలితంగా కేంద్రం 18ఏండ్లు నిండినవారికి ఉచిత వ్యాక్సిన్‌ ఇస్తామని ప్రకటించింది. జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో అదనపు జిల్లా జడ్జి ఉత్తమ్‌ ఆనంద్‌ను పట్ట పగలు నడిరోడ్డుపై వాహనంతో ఢీకొట్టి హత్యచేసిన ఘటనపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించారు. ఈ కేసులో సుప్రీంకోర్టు స్పందించిన తీరు కారణంగా ఏడాదిలోపే హంతకులకు శిక్ష పడిరది. నిందితులకే కాదు, ఖైదీలకు కూడా హక్కులుంటాయని ఉత్తర్వు లిచ్చిన ఘనత జస్టిస్‌ ఎన్వీ రమణది. ఇదిలా ఉండగా.. సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ.. సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా విశేష సేవలు అందించారు. 13ఏళ్లపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తిగా రమణ పనిచేశారు. ఆ తరువాత ఢల్లీి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎదిగారు. 2021 ఏప్రిల్‌ 24 నుంచి సీజేఐగా ఎన్వీ రమణ కొనసాగు తున్నారు. కాగా, 49వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ యూయూ లలిత్‌ ప్రమాణ స్వీకారంచేశారు. రాష్ట్రపతి భవన్‌లో జస్టిస్‌ యూయూ లలిత్‌ చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేయించారు. ఇక, యూయూ లలిత్‌ రెండు నెలల 12 రోజుల పాటు సీజేఐగా పదవిలో కొనసాగనున్నారు.- (పెమ్మరాజు శ్రీనివాస్‌)