నిధులు లేకుండా విద్యాప్రమాణాలెలా?

‘దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుంది’ అంటారు. విద్యా వ్యవస్థకు ఉన్నతవిద్య ఆకాశ హర్మ్యమైతే, పాఠశాల చదువు పునాది. ఈ రెండిరటికీ సమతూ కంగా నిధుల కేటాయింపు ఉంటేనే సుస్థిర అభివృద్ధి సాధ్యం. విద్యాసంస్థల నాణ్యతా ప్రమాణాలు పెంచుకో వడానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థికపర మైన ప్రోత్సాహం అవసరం. కానీ తెలంగాణ విద్యారంగ అభివృద్ధికి కేంద్ర బడ్జెట్‌లో ప్రతిసారీ నిరాశే ఎదురవుతున్నది. ఈసారైనా కేంద్రం తగిన నిధులను ఇవ్వాలి’

కంద్రం తరపున నూతన విశ్వవిద్యాలయాలకు నిధుల కేటాయింపు ఉండటం లేదు. నవోదయ, సైనిక విద్యాలయాల స్థాపన జరగటం లేదు. ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లో మౌలిక వసతుల లేమి, ఉపాధ్యాయుల కొరతతో నాణ్యమైన చదువు అందుబాటులో లేకుండా పోతున్నది. కేంద్ర ప్రభుత్వం 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నది. ఈ ఏడాది కరోనా మహమ్మారి వల్ల విద్యా రంగంలో తలెత్తిన పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం విద్యారంగంపై కేటాయింపులు పెంచాలి. 2019-20 కేంద్ర బడ్జెట్లో విద్యారంగానికి 94,854 కోట్లు ఇచ్చింది. 2020-21లో 99,311 కోట్లు కేటాయించి 93,224.65 కోట్లు మాత్రమే ఇచ్చింది. కరోనా వల్ల గాడి తప్పిన చదువులకు భారీగా నిధులు పెంపు ఉంటుందని ఆశించినా నిరాశే మిగిలింది. ‘ఆత్మ నిర్భర్‌’ పథకం చదువులకు జవసత్వాలు ఇవ్వలేదు. కొఠారి కమిషన్‌ నుంచి నూతన జాతీయ విద్యావిధానం-2020 వరకు ప్రతీ కమిటీ దేశ జీడీపీలో 6శాతం విద్యారంగానికి కేటాయిం చాలని ప్రతిపాదించాయి. అయినా అత్తెసరు నిధులతో విద్యారంగంపై నిర్లక్ష్యం వహిస్తు న్నారు. పాఠశాల, కళాశాల విద్యలో మౌలిక వసతుల కల్పన కోసం, యూనివర్సిటీల అభివృద్ధి కోసం, పరిశోధనల సాంకేతికతకు, ఆన్‌లైన్‌ విద్యకు, మధ్యాహ్న భోజనానికి, ఉపాధ్యాయ విద్యకు కేటాయింపులు భారీగా పెంచితే ప్రతి రాష్ట్రంలో విద్యావికాసం జరుగుతుంది.
దేశంలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన పిల్లలను గుర్తించటం, వారి కుటుంబాల సామాజిక-ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా ఉత్తమ రెసిడెన్షియల్‌ పాఠశాల వ్యవస్థతో మెరుగైన విద్యను వారికి అందించడం కోసం నవోదయ పాఠశాలను కేంద్రం స్థాపించింది. ‘జాతీయ విద్యా విధానం- 1986’ అమలులో భాగంగా నవోదయ పాఠశాలలు దేశంలో అన్ని జిల్లాల్లో ఏర్పడ్డాయి. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో ఉన్న పది జిల్లాలు 33 జిల్లాలుగా ఏర్పడ్డాయి. ప్రస్తుతం రంగారెడ్డి, కామారెడ్డి, ఆసిఫాబాద్‌, వరంగల్‌, నాగర్‌ కర్నూల్‌, నల్గొండ, సిద్దిపేట, ఖమ్మం, కరీంనగర్‌ జిల్లాల్లో మాత్రమే నవోదయ విద్యాలయాలున్నాయి. మిగిలిన పలు జిల్లాల్లో నవోదయ పాఠశాలలను ఏర్పాటు చేయాలి. కానీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు పంపినా కేంద్రం పట్టించుకోవడం లేదు. దేశవ్యాప్తంగా 661 నవోదయ విద్యాలయాల్లో 3,978 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నా యి. తెలంగాణలో 69 ఖాళీలున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత రెండు సైనిక పాఠశాలలను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. తెలంగాణలో ఒక్క సైనిక స్కూల్‌ కూడా లేదు. రాష్ట్రంలో సైనిక్‌ స్కూల్‌ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినా నిధులు కేటాయించలేదు. ఈ బడ్జెట్‌లో అయినా నవోదయ, సైనిక్‌ పాఠశాలల ఏర్పాటుకు,ఉపాధ్యాయుల నియామకానికి చర్యలు చేపట్టాలి. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. రు.7,289 కోట్ల నిధులతో మూడు దశల్లో పాఠశాలల్లోని పన్నెండు విభాగాలను పటిష్ఠపరిచేందుకు కృషి చేస్తున్నది. ప్రభుత్వ బడుల అభివృద్ధికి నడుం బిగించిన తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో అయినా నిధులు కేటాయించాలి. రాష్ట్రప్రభుత్వం హైదరా బాద్‌లోని కోఠి మహిళా కళాశాలను మహిళా యూనివర్సిటీగా మారుస్తున్నది. దీనికోసం మౌలిక వసతుల కల్పనకు రు.150 కోట్లు అవసరమని ఉస్మానియా అధికారులు ప్రతి పాదనలు సిద్ధం చేశారు. కేంద్ర బడ్జెట్‌లో దీనికి నిధుల కేటాయింపు జరిగితే మహిళా విద్యకు చేయూత లభిస్తుంది.రాష్ట్రంలో అన్ని విశ్వ విద్యాలయాల్లో అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉంది. దీనివల్ల విశ్వవిద్యాలయాలు ప్రత్యేక గుర్తింపునకు నోచుకోవటం లేదు. యూనివర్సిటీలకు తగినన్ని నిధులు కేటా యించినపుడే ప్రపంచ స్థాయి చదువులతో మన విద్యార్థులు పోటీ పడగలుగుతారు. విభజన చట్టంలోని హామీ మేరకు తెలంగాణలో గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పిన కేంద్రం ఆ దిశగా అడుగు వేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం భూపాలపల్లి జిల్లాలో స్థలాన్ని ఎంపిక చేసి కేంద్రానికి అప్పగించినా పట్టించు కోవటం లేదు. ఈ బడ్జెట్‌లోనైనా గిరిజన యూనివర్సిటీకి నిధుల కేటాయింపు జరగాలి. రాష్ట్ర ప్రభుత్వం ఫారెస్ట్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దానికి ఈసారి కేంద్ర బడ్జెట్లో నిధుల కేటాయింపు జరగాలి. కరీం నగర్‌ జిల్లాలో ట్రిపుల్‌ ఐటీ, హైదరా బాద్‌లో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌, ఐఐఎంలను నెలకొల్పాలి. – అంకం నరేష