నిండైన సహచర్యంతో నేనూ సైతం

అర్థ శతాబ్ద కాలం పాటు అడవి బిడ్డలతో మమేకమై జీవించి వారి అభివృద్ధి లక్ష్యంగా పనిచేసిన అత్యున్నత అధికారి అనుభవాల నిధి ‘గిరిజనాభివృద్ధికి నేను సైతం’పుస్తకం రచయిత డాక్టర్‌ వి.ఎన్‌.వి.కె.శాస్త్రి రాసిన ఈ పుస్తకం బహుముఖ ప్రయోజనకారి అనడంలో అతిశ యం లేదు. బాహ్యంగా చూడటానికి ఒక అధికారి స్వీయ అనుభవాలు పొందుపరిచిన సాధారణ పుస్తకమే అన్నట్టు కనిపించిన, ఇందులోని ప్రతి విషయం భావి పరిశోధకులకు విలువైన సమాచార దిక్సూచి. అంతేకాక గిరిజనులు అభివృద్ధికి పాటుపడాలి అనుకునే వారికి మంచి మార్గదర్శి కూడా.. ప్రస్తుతం మనం చూస్తున్న పలు గిరిజన చట్టాల నేపథ్యం గురించి తెలుసుకోవాలి అంటే విధిగా నేను సైతం చదవాల్సిందే. ఎంతో విలువైన గిరిజన సమాచారం గల ఈ పుస్తకాన్ని గిరిజన పోరాట యోధుడు ‘కుంజా బొజ్జి’ గారికి అంకి తం ఇవ్వడంలో రచయిత శాస్త్రి గారి విశాల హృదయం ఎంతటిదో అర్థమవుతుంది.
స్థానిక గిరిజనులే ఉపాధ్యాయులు,గిరిజన గురుకుల పాఠశాలల నిర్వహణ కోసం ప్రత్యేక సొసైటీలు,జీవో నంబరు 3 కొట్టివేత పర్యవ సానాలు, మొదలైన ప్రధాన వ్యాసాల సమా హారంగా ప్రచురించబడిన ఈ ‘…నేను సైతం’ పుస్తకం చదువుతుంటే ఒక మేధావి స్వీయ చరిత్ర చదువుతున్న మధురానుభూతి కలుగుతుంది. ప్రారంభం అంతా డాక్టర్‌ శాస్త్రి గారు గిరిజన సంక్షేమానికి వచ్చిన తీరే ఆసక్తిగా సాగిపోయి పాఠకుల కళ్ళు అక్షరాల వెంట పరుగులు పెడతాయి.‘మానవ శాస్త్రం’ అనబడే ‘ఆంత్రోపాలజీ’ విద్యార్థి పరిశోధక విద్యార్థిగా గిరిజన సాంస్కృతిక పరిశోధన శిక్షణా సంస్థలో చేరి తనకు ఇష్టమైన రంగంలో కష్టం లేకుండా మునుముందుకు దూసుకుపోయి మూలాలనుంచి విషయ సేకరణ చేయడం ఈ రచనలో మనకు అడుగడుగునా ఆగుపిస్తుంది. శాస్త్రి గారు తన అర్థ శతాబ్ది ఉద్యోగ ప్రస్థానం లో తను చూసిన క్షేత్రస్థాయి విషయాలను క్రోడీకరిస్తూ ఇప్పటికే 9 పుస్తకాలు రాశారు, ప్రస్తుతం జరుగుతున్న గిరిజన అభివృద్ధికి ఎదురవుతున్న సవాళ్లు నేపథ్యంగా ‘…నేను సైతం’ వ్యాస సంపుటి రాయడం జరిగింది. 1968 70 సం: మధ్య కాలంలో ఆంథ్రో పాలజీ విభాగంలో రెండేళ్లపాటు పరిశోధక విద్యార్థిగా, అనంతరం1970-1971మధ్య పరిశోధన సహాయకుడిగా సేవలు అందించారు, అనంతరం 1971నుంచి 2005 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ గిరిజన సంక్షేమ శాఖలోని గిరిజన సంస్కృతి పరిశోధనా శిక్షణా సంస్థలో పని చేశారు. ఈ ఉద్యోగ ప్రస్థానంలోనే ఏటూరు నాగారం, ఉట్నూర్‌, శ్రీశైలంలో ఐటిడిఎల ప్రాజెక్ట్‌ అధికారిగా సేవలు అందించారు,అలా ఆయన ఆసక్తి, ఉద్యోగరీత్యా ఆదివాసులతో సహచర్యం చేసే భాగ్యం కలిగింది అలా సంగ్రహించిన అనుభవ సారంతో రాయడం వల్ల ఈ పుస్తకానికి మరింత ప్రామాణికత, ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రస్తుతం ఆధునిక కాలంలో పరిశోధన చేయాలి అంటే అంత కష్టం కాదు..కానీ 1968 ప్రాంతంలో పరిశోధన చేయాలంటే గొప్ప సాహసంతో కూడుకున్న పనే..!! అలాంటి సాహసాన్ని సునాయాసంగా చేసి డాక్టరేట్‌ సాధించారు శాస్త్రిగారు.వీరి అనుభవాలద్వారా వ్రాసిన ఈ వ్యాసం సంపుటి ద్వారా గిరిజనులు వారి జీవన విధానాల్లో అంచలంచెలుగా వచ్చిన మార్పులు కనిపిస్తాయి.
అడవి బిడ్డల జీవన సరళిలో వచ్చిన ఈ మార్పు కు ప్రధాన కారణం వారి చదువే అని స్పష్టం చేశారు రచయిత. నేను సైతం వ్యాస సంపుటిలో మొత్తం 11 వ్యాసాలు వేటికవే భిన్నమైన సమాచారం కలిగి ఉన్నాయి,గిరిజన సంక్షేమానికి ఎలాగ వచ్చాను మొదలు జీవో నెంబరు 3కొట్టివేత పర్యవ సానాలు, వరకు ఈ వ్యాసావళి కొనసాగింది.
1986 సంవత్సరంలో నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి ఆధ్వర్యంలో గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం స్థానిక గిరిజన యువతకు ఉపాధ్యాయ ఉద్యోగాలు ఏర్పాటు చేసిన వైనం దాని నేపథ్యం. 1986 87 సంవత్సరంలో పదవ తరగతి అర్హతతో గిరిజన యువతకు స్థానికత ఆధారంగా అందించిన ఉపాధ్యాయ ఉద్యోగాల ద్వారా గిరిజన యువతలో వచ్చిన సామాజిక,ఆర్థిక,మార్పులు పర్యవసానాలు డాక్టర్‌ శాస్త్రి అక్షర బద్దం చేసిన వైనం ఆసక్తిగా సాగుతుంది.
ఏ ఉద్యోగైన తన ఉద్యోగ ప్రస్థానంలో విజయం సాధించాలి అంటే ముందు సమైత విషయం మీద ఆసక్తి ఆపైన తన చదువుకు సంబంధించిన ఉద్యోగం అయినప్పుడు దానిని ఇష్టంతో విసెషష్క్ప్డతతో ప్రామాణిక బద్ధంగా పూర్తి చేయగలరు.అచ్చంగా శాస్త్రిగారి ఉద్యోగ ప్రస్థానం ఆ విధంగా సాగింది కనుక తన ఉద్యోగ జీవితంలో గిరిజనుల సమగ్ర అభివృద్ధి కోసం అనేక ప్రణాళికలు రచించి అమలు అయ్యేటట్టు కృషి చేయగలిగారు ఇది అన్ని రంగాల ప్రభుత్వ ఉద్యోగులకు ఆదర్శనీయం. భారత రాజ్యాంగంలో గిరిజ అభివృద్ధికి ఎన్నో ప్రత్యేక వ్యవస్థషసౌకర్యాలు కల్పించిన, అధికార వ్యవస్థలో మాత్రం అడుగడుగున వ్యతిరేకత కనిపిస్తుంది, అందుకు అధికార ఘనంలోనే వ్యతిరేకత తదితర విషయాలు గిరిజనులకు జరుగుతున్న నష్టం గురించి కూడా శాస్త్రి గారు ఇందులో నిర్మొహమాటంగా వివరించారు . చివరిగా ‘జీవో నెంబర్‌ 3 కొట్టివేత పర్యవసనాలు’ గురించి వివరిస్తూ అది రాక ముందు గల జీవో నెంబర్‌ 275 / 1986 ఉంది దీని ప్రకారం గిరిజన ప్రాంతాల్లో 100% ఉపాధ్యాయ పోస్టులు స్థానిక గిరిజనులకు రిజర్వ్‌ చేయబడ్డాయి దానిని ట్రిబ్యునల్‌ కొట్టివేసిన తర్వాత సుప్రీంకోర్టులో వేసిన వ్యాజ్యాన్ని వెనక్కి తీసుకుని దొడ్డి దారిన జీవో నెంబర్‌ 3/2000 జారీ చేసినట్టు సుప్రీంకోర్టు అభిప్రాయపడినట్లు తాను భావిస్తు న్నట్టు రచయిత అభిప్రాయం వ్యక్తం చేశారు, చిత్రంగా ఈ రెండు జీవోలు వెలువడే సమయంలో అప్పటి ప్రభుత్వ సెక్రటరీలకు డాక్టర్‌ శాస్త్రి సహాయకుడిగా ఉండటం ఒక విశేషం. ఇలాంటి ప్రామాణిక స్వాను భావిక విషయాలు ఎన్నో ఈ పుస్తకంలో మనకు అడుగడుగున అగుపిస్తాయి, అచ్చంగా గిరిజనుల సర్వతో ముఖాభివృద్ధికి కృషి చేసే స్వచ్ఛంద సంస్థలు, సంఘాలతో పాటు గిరిజన సామాజిక వర్గాలపై పరిశోధన చేసే వారికి ఈ ‘…నేను సైతం’ పుస్తకం ఒక దారి దీపం లాంటిది.
50 సంవత్సరాల పూర్వం నాటి గిరిజన గ్రామాలు, అప్పటి గిరిజనుల వెనుకబాటు తను, అందుకు ప్రభుత్వాలు చేసిన కృషి, అధికార గణం అలసత్వం, తదితర ఎన్నో విషయాలు నిర్మొహమాటంగా నిజమైన రచయిత దృష్టి కోణంతో ఈ పుస్తకం వ్రాశారు రచయిత ‘డాక్టర్‌ వట్టిపల్లి కృష్ణశాస్త్రి’. ఈ గిరిజన సమాచార దర్శని ప్రతి విద్యావేత్త విధిగా చదవదగ్గన్న పుస్తకం అనడంలో ఎలాంటి అతిశయం లేదు. –డా. అమ్మిన శ్రీనివాసరాజు (సెల్‌ : 7729883223)